మేలే నీ నేరుపులు మెలత - అచ్చంగా తెలుగు

మేలే నీ నేరుపులు మెలత

Share This

అన్నమయ్య  శృంగార ( భక్తి) మాధురి

   మేలే నీ నేరుపులు మెలత

డా. తాడేపల్లి పతంజలి


అన్నమయ్య  ఒక చెలికత్తెగా మారి  అలమేలుమంగమ్మతో ముచ్చట్లాడుతున్నాడు.

పల్లవి:   మేలే నీనేరుపులు మెలఁత
            చాలుకొన్నసరసాలు చవులాయను

 1:     సూటి దప్పవు గదవే చూపులు నీవి
            పాటించి నేఁడాతనిపై నిండెను
            వాటమాయఁ గదవే నీవలపులు
            కూటము లాతనివద్దఁ గుప్పలాయను

 2:     నాములాయగదవే నీ నవ్వులు
            కామించి యాతని మోహము కళ లెక్కెను
            వాములువడెఁ గదవే వట్టి మాటలూ
            కోమలపు వీనుల కొటారులఁ జేరెనూ

 3:     కమ్ముకొనెఁ గదవే కౌగిలి నిది
            పమ్మి శ్రీ వేంకటేశ్వరుఁ బాయ వెన్నఁడూ
            చిమ్మిరేఁగెఁ గదవే చెమట లెల్లా
            కుమ్మరింపు వేడుకల గుఱుతులాయనూ (రేకు:0430-2   సం: 12-176)

ముఖ్య పదాల అర్థాలు

నాములాయ=అధికమయ్యెను ;   కళ లెక్కెను= కళలతో అతిశయించెను;వాములువడెఁ = గడ్డి మోపులను ఒక్కచోట చేర్చిన   కుప్ప వాము;    కొటారుల= రాశులు; ధాన్యపుకొట్టులు ;కమ్ముకొనెను=ఆవరించెను, చుట్టు ముట్టెను;పమ్మి =విజృంభించి;   పాయవు=  విడవవు; చిమ్మిరేఁగె=మిక్కిలి విజృంభించు; కుమ్మరింపు =మల్లబంధ విశేషాలు.
తాత్పర్య విశేషాలు
ఓ అలమేలు మంగమ్మా ! ఎన్ని నేర్పులు మా అయ్య దగ్గర చూపించావో కాని, అన్ని లాభాలే !నీ సరసాలు- వరుసలు కట్టి  ఒకదాని వెనుక ఒకటిగా  మా అయ్యకి రుచి పుట్టిస్తున్నాయి.(సమక్షంలోనూ, జ్ఞాపకాల్లోనూ   కూడా)

01.ఏం చూస్తావు తల్లీ ! నీ చూపులు అసలు గురి తప్పవు. నేడు మా అయ్యపై ఆదరంతో నిండిపోయాయి? (ఎక్కడో          నీకు    తెలియదా తల్లీ ! హృదయంలో). నువ్వు మా వేంకటేశునిపై చూపించే ప్రేమలు నీకు అనుకూలమయ్యాయి( నువ్వు   ప్రేమ    చూపిస్తే  మాఅయ్య ఏనాడు నీకు అననుకూలత చూపించడు.నీ ప్రేమ అంత గొప్పదని భావము) మీ ఇద్దరి కలయికలు ఒకటారెండా !   ఎన్నెన్నో ! రాశులు!రాశులు !

02.ఓ అలమేలు మంగమ్మా ! ఏమి ఉత్సాహంతో ఉన్నావో కాని – నీనవ్వులు ఎక్కువై పోయాయి. నిన్ను ఇష్టపడిన  మా ఆయ్య మోహములు కళలుగా మారాయి. ఆ మోహాల కళలు  నీ విషయంలో ఎన్ని నేర్పులు ప్రదర్శించాయో నీకే ఎరుక.
మీ మధ్య ఉండే కల్తీలేని మాటలు  కుప్పలు తెప్పలు. మెత్తని మీ చెవుల ధాన్యపు కొట్టులలొ అవి చేరి పోయాయి.( గడ్డి మోపులను  ఒక్కచోట చేర్చిన          కుప్ప ల్లాగా మీ చెవులయ్యాయని భావం)

03.ఇదుగో !అలమేలు మంగమ్మా ! మా అయ్య వేంకటేశుని కౌగిలిలో చుట్టు ముట్టావు.అతిశయించి మావేంకటేశ్వరుని        ఏనాడు విడవవు.మీ ఇద్దరూ మల్లబంధ విశేషాలు అనేకము ప్రదర్శిస్తుండగా – మీ సంతోషాలకు గుర్తులుగా అనేక  చెమట బిందువులు మీ శరీరాలలో నిండి పోయాయి.
  ఆంతర్యము
జనాలు ఏమి మాట్లాడుకొంటారో వాటినే అన్నమయ్య తన కీర్తనల్లో వాడతాడు
“ఏమే ! “ అనే ఆత్మీయతా పిలుపు ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో బంధుత్వాల మధ్య వాడబడుతోంది.అదే- అన్నమయ్య “ కదవే !”అని వాడాడు.” “అలా  జరిగింది కదా ! అవును కదే !”అను రెండు పదాలు కలిసి “కదవే!” అయింది. గ్రామీణ ప్రాంతాలలోని పలుకుబడులు -వాములు, కుప్పలు పోలికలయ్యాయి.
“వట్టి “ అనే పదానికి  ఏమియులేని, నిష్ప్రయోజనమైన, కల్తీలేని   అని అర్థాలు ఉన్నాయి. ఈ కీర్తనలో కల్తీలేని ఆనుఅ ర్థము   వట్టి అను పదానికి స్వీకరించబడినది.( ఆధారము ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు ఆం.ప్ర.సా.అ. 1979   )
చూపులు కుప్పలయ్యాయి. నవ్వులు రాశులయ్యాయి. సంతోషాలు మాత్రం గుర్తులయ్యాయి . అన్నమయ్య కీర్తనలు కూడా అలాంటివే. గుర్తుపెట్టుకొనదగినవి.
స్వస్తి.
++++

No comments:

Post a Comment

Pages