మొలుస్తోన్న రాజధాని – అమరావతి
పోడూరి శ్రీనివాసరావు
అవి పుక్కిటి పురాణాలు కావని,
నిప్పులాంటి నిజాలని,
భూగర్భ శోధకులు నిరూపిస్తున్నారు.
సముద్రంలో దాగున్న ద్వారకను
వెలికి తీసినట్లే-
నేటి అమరావతిని
బౌద్ధరామాల సందడి మధ్య
ఆంధ్ర రాజధానిగా
సన్నిద్ధం చేస్తున్నారు.
పురాణాల్లో ఇంద్రుడి రాజధాని-అమరావతి
వర్తమానంలో చంద్రుడి రాజధాని-అమరావతి
ఆ అమరావతి నిర్మాణానికి ఇంద్రుడు
దేవశిల్పి మయుడి సహాయం
తీసుకున్నాడో-లేదో గాని....
ఈ అమరావతి నిర్మాణానికి
దేశ,విదేశీయులంతా
తమవంతు సహకారం అందించారు.
యావత్ భారతదేశీయులంతా
‘మట్టి-నీరు’ పథకం క్రింద
పవిత్రనదీ జలాలనూ-
నలువైపుల నుంచీ మట్టినీ-
సేకరించి ఈ అమరావతి
నిర్మాణానికి సహకరిస్తే....
విదేశీ సాంకేతికత
ఆపన్న హస్తాన్నందించింది.
రెండు చిగురుటాకుల
సౌందర్యంతో, ఈ విశ్వాన్ని
తొలిచూపులు చూస్తున్నచిన్ని మొక్కలా....
అనేక హంగులతో
అలరారబోతున్న
విశ్వనగర ఆవిర్భావానికి
జగమంతా ఎదురు చూస్తోంది.
ఈ అమరావతి రాజధానైతే ............
ఎన్నో పరిశ్రమలు -
ఎన్నో ఆవిష్కరణలు -
ఎన్నో కార్యాలయాలు -
ఎన్నో ఉద్యోగాలు -
అందమైన భవనాలు -
విశాలమైన రహదారులు -
సుందరనందనోద్యానవనాలు -
ఒకటేమిటి?
ఆంధ్రరాష్ట్ర స్వరూపమే మారిపోతుంది.
విదేశీ సంకేతికతతో
నిర్మిత భవనాలూ,రహదారులు,
కట్టడాలు,నీటిపారుదలసౌకర్యాలు,
సుందర హర్మ్యాలు,
అంబరాన్ని చుంబించే సౌధాలు
పరిశ్రమల స్థాపనలు.......
భవిష్యత్ ను ఊహించుకుంటే
ఒడలు పులకరిస్తుంది.
సింగపూర్ ప్రధాని, జపాన్
అమాత్యులు, మలేషియా మంత్రులు,
భారతప్రధాని, ఇతర రాష్ట్రాల
ముఖ్యమంత్రుల ఆగమనంతో....
ఆశీస్సులతో- కనులు తెరుస్తున్న
చిట్టి పాపాయి....సుందర అమరావతి.
భవిష్యత్తు భారత్ దే....
అవకాశాలన్నీ అమరావతికే....
స్వర్గపురి అమరావతిలో ఉండే,
హంగులన్నీ....భోగాలన్నీ....
భూలోక అమరావతికి
దించుదాం!
నాకమెక్కడ లేదు? .....సురలోకమెక్కడలేదు?.....
అవనిలో....ఆంధ్రరాష్ట్ర పటంలో.....
అమరావతిలోనే ఉందని
చాటుదాం!!
మొలుస్తున్న అమరావతిని
మహావృక్షంలా ....
వటవృక్షంలా.....
భోధివృక్షంలా ....
పెంచుదాం!!!
No comments:
Post a Comment