పేరయ్య పెళ్ళికొడుకాయనే....(కామెడీ కధ)
టేకుమళ్ళ వెంకటప్పయ్య
"ఒరేయ్ పేరిగా... రేపటి పెళ్ళిచూపులైనా సక్రమంగా అఘోరించి ఏడవరా నాయనా... సెంచెరీ కొట్టేట్టున్నావ్ పెళ్ళి చూపుల్తో... నీ తిండి పిచ్చి తో భయపడిపోతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. కాకినాడ సంబంధం కాజాలతో పోగొట్టావ్. కడప సంబంధం గారెలకు చెల్లు. హైదరబాదు సంబంధం సమోసాలతో హరీ మంది. ఇలా ఎంత మందిని చూస్తావు రా.. ఎనభై సంబంధాలు ఎగిరిపొయ్యాయి. శాస్త్రిగారికి నీరసమొచ్చి మంచాన పడ్డాడు. ఆడపిల్లల తల్లిదండ్రులు నీ తిండిగోల చెప్పి ఆయన్ను బండ బూతులు తిడుతూ ఉంటే....నావల్ల కాదు బాబోయ్.. అని బావురుమంటున్నాడు. ఏదో ఒక సంబంధం ఖాయం చేసుకోవాలి కదా..నీకా ముప్ఫై దాటింది. మీ తాత గారు ఈ వయసుకు నలుగురికి తండ్రయ్యారు నీ పెళ్ళైపోతే నేను నిశ్చింతగా కన్ను మూస్తాను" అన్న బామ్మ మాటలకు కోపంగా చూస్తూ..."బామ్మా నా పేరు పరంధాం! చిన్నప్పుడెప్పుడో ఆ పేరు పెట్టావని ఆ పేరే అస్తమానం పిలవడం ఎందుకు? మా ఆఫీసు వాళ్ళు వింటే ఎంత నామర్దా నాకు? నాకు అందమైన అమ్మాయి తో బాటుగా.. ఉద్యోగం ఉండాలి. జీతం బాగా రావాలి.కట్నం ఇవ్వాలి అంటే టైము పట్టదా చెప్పు?" అని చిన్నబుచ్చుకోగానే.."ఒరే గిలక్కాయ్! లేక లేక పుట్టావని ఆ పేరెట్టాం నీకు అందుకే నాకు ఆ పేరంటేనే యిష్టంరా పేరిగా.... అదిసరే గానీ రేపు గుంటూరు పెళ్ళిచూపుల్లోనైనా తిండి ధ్యాస తగ్గించు. ఎగబడి తింటే సంబంధం అవదు. కాస్తా స్టైల్ ఏడువ్" అని వార్నింగ్ ఇచ్చిoది బామ్మ గత అనుభవాలను తలుచుకుంటూ. "వాళ్ళేమి పెట్టినా తినను గాక తినను సరేనా!" అనగానే.. "మానాయనే.. మా తండ్రే.." అని బామ్మ అంటూ ఉండగా ప్రకాశం రానే వచ్చాడు. "ఆపు ఇంక చాలు గానీ... ప్రతిసారి వాడు ఇలా చెప్పడమూ నువ్వేమో మా నాయనే... అనడం చూస్తూనే వున్నాం గదా.." అని వెక్కిరించాడు.
* * *
బస్సు దిగ్గానే ఆటో ఎక్కుతూ ఉండగా.. మధ్యవర్తి శాస్త్రిగారు..." బాబూ...కాసేపు తమరు జిహ్వా చాపల్యం కట్టుకున్నారంటే పెళ్ళి శుభంగా జరిగిపోతుంది" అనగానే బుద్ధిమంతుడిలా తలూపాడు పేరయ్య. "అదీ చూద్దాం" అన్నట్టు చూస్తూ ఆటో ఎక్కాడు ప్రకాశం.
* * *
ఆటో దిగుతుండగానే రండి రండి అంటూ సకల మర్యాదలతో లోనకు తీసుకెళ్ళారు. లోపల ఇటు కూర్చున్నారో లేదో పులిబొంగరాల (పునుగులవంటివి) కమ్మటి వాసనా..జిలేబీల వాసనా.. ముకుపుటాలకు తగలగానే.. బాహ్య స్మృతి మర్చిపోయి అవి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూపులు చూడ సాగాడు పేరయ్య యధావిధిగా. ప్రకాశం, భార్య, బామ్మ, శాస్త్రి గారు దేవుడిని తల్చుకుంటూ క్షణాలు లెక్కెడుతూ కూర్చున్నారు.
"మొదట అమ్మాయిని చూస్తారా తిఫిన్లు తింటారా?" అని అమ్మాయి తండ్రి అడగ్గానే పేరయ్య "చూడ్డానికే గా వచ్చింది ఎలాగూ చూడక తప్పదు.. మొదటా ఆ పులిబంగరాలు ఓ డజను ఇలా పట్రండి ఓ పట్టుపడతా" అనగానే అవాక్కయ్యారు ఆయింట్లో వాళ్ళు. ఇవాళ టిఫిన్ ఏమిచేసారో నాకే తెలీదు ఈనకెట్టా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు అమ్మాయి బాబాయి. "హ్హహహ మీ అబ్బాయి జోకులు బాగా యేస్తున్నాడే" అని అన్నా లోపల పెద్ద తిండిపోతులా వున్నాడే అనుకున్నారు. మొహమాట పడుతూనే.. ఓ పదిహేను పులిబంగరాలు లాగించాక.. అమ్మా.. ఆ తంతు కూడా కానీమవ్వమని చెప్పు ఇంటికెళదాం" అన్నాడు పేరయ్య.
అందరూ మొహాలు చూసుకున్నారు. అమ్మాయి వచ్చి కూర్చోగానే..ఏదో మొహమాటానికి ఓ రెండు నిముషాలు ఉండి "అమ్మా ఇక వెళ్దామా" అన్నాడు పేరయ్య. "అబ్బాయ్! అమ్మాయి తో ఏమయినా మాట్లాడాలా" అని శాస్త్రి గారు అడిగేసరికి సరే అన్నాడు. ఇద్దరూ ఏకాంత ప్రదేశం లోకి వచ్చాక.. పేరయ్య మొదలెట్టాడు.. సొరకాయలో పాలు వేసి వండడం వచ్చా! ఆగాకరకాయ వండడం వచ్చా.. ఏ ఏ వంటలు వచ్చు? పిండి వంటలు ఏమి వచ్చు లాంటివే అన్నీ.. అంతా అయ్యాక నేను ఒకటి అడగాలి అంది అమ్మాయి.. ఆ(... ఏంటో అన్నాడు పెరయ్య వెటకారంగా. "ఇదిగో బిల్లు.. మొత్తం రెండువేల మూడు వందలు అయింది కట్టి వెళ్ళండి" అనే సరికి గుడ్లు వెళ్ళబెట్టి.. "బిల్లేమిటి తల్లీ? అన్నాడు. "తమరు మీ వాళ్ళూ మింగినవీ.. మాకు అయిన మిగతా ఖర్చులూ" అంది. "సారీ! మీరు మాకు ఈ విషయం చెప్పలేదు. మేము అలా అయితే వచ్చే వాళ్ళమే కాదు నేను ఇప్పటికి ఎనభైకి పైగా పెళ్ళి చూపులకు వెళ్ళాను ఎక్కడా ఇలా అడగలేదు" అనగానే.. నివ్వెరపోతూ... "మై గాడ్" అంది ఆ అమ్మాయి. “మర్యాదగా బిల్లు కడతారా.. లేక గదిలో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి మావాళ్ళతో దేహశుద్ధి చేయించి.. మీడియా వాళ్ళతో చెప్పు దెబ్బలు తినిపించమంటారా” అనగానే.. పేరయ్య వణికిపోతూ “అమ్మా! తల్లీ బుద్ధి గడ్డి తిని వచ్చాను. ఇదిగో ఈ వుంగరం ఉంచండి. అంత డబ్బు నా దగ్గర లేదు” అని ఉంగరం ఇచ్చాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. "అమ్మా అన్ని విషయాలూ ఇంటికివెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం లేవండి" అన్నాడు స్పీడుగా. ఆటో ఎక్కినా గుండె కొట్టుకునే స్పీడు తగ్గలేదు పేరయ్యకు.
నాలుగు రోజులు గడిచాయి. "ఒరే పేరిగా నిన్న సంబంధం వాళ్ళేమిటిరా మాట వరసకు గూడా ఏమయిందని అడగలేదు. లోపల ఏమి మాట్లాడావు రా? చెప్పు?" అని నిలదీసారు. పేరయ్య అసలు విషయం చెప్పకుండా "ఆ పిల్ల నాకు నచ్చలేదు అంతే!" అన్నాడు ముక్తసరిగా.
* * *
ఆఫీసులో సుబ్బారావు "ఏమిటోయ్! మొన్న గుంటూర్ లో పెళ్ళి సంబంధం చూసావటగా నచ్చలేదా?" అన్నాడు. "నచ్చలేదులే వదిలెయ్యండి ఆ విషయం అన్నడు చిరాకుగా. “మరి మన పక్క సెక్షన్ లో వనజాక్షి మన కులమూ తెగా నూ... బారెడు జడ. కొంచెం నలుపు, పళ్ళు కొంచెం ఎత్తు అంతే గదా. చివరగా అమ్మాయి కొంచెం లావు నీకు తెలుసుగదా..అంతే.. పెళ్ళయ్యాక లావైతే మనమేమి చెయ్యగలం చెప్పు? వయసు కొంచెం ఎక్కువే అనుకో..ఫర్వాలేదు లేవోయ్! ఆ అయినా నీవు మాత్రం బాలా కుమారుడివా? నీకు ముప్పై దాటలేదా అంచేత.. నువ్వు వూ( అను నేను కుదరేస్తా గవర్నమెంటు ఉద్యోగం..జీతం బాగానే వస్తుంది” అన్నాడు. "అదికాదు సుబ్బారావ్. పెళ్ళి అయితే బోలెడు ఖర్చులు కదా.. అందుకనీ.. కట్నం సంగతి కూడా బాగా ఉంటే గానీ మావాళ్ళు ఒప్పుకోరు అన్నాడు. "బాబూ పరంధామం.. అమ్మాయి తండ్రి ఆర్టీసీ లో కండక్టరు గా ఉన్నాడు.. బాగానే వెనకేశాడని విన్నా.. ఒక్కతే అమ్మాయి. తమ్ముడు ఇంకా చిన్న వాడేనట! టెంత్ క్లాస్ చదువుతున్నాడు. నువ్వు వూ(.. అను అని టెంప్ట్ చేశాడు. పరంధాం ఓకే... అనేసరికి వెంటనే పక్క సెక్షనుకు వెళ్ళాడు సుబ్బారావ్.
* * *
పెళ్ళి చూపులకు ముందు వనజ పార్కులో ప్రైవేటుగా మాట్లాడాలనే సరికి మొదట అవాక్కయినా సరేనని ఒప్పుకున్నాడు పరంధాం ఉరఫ్ పేరయ్య. నేను సూటిగా మొదలెడతాను అని చెప్పసాగింది వనజ. " మీ పెళ్ళి చూపుల తంతు అంతా నాకు తెలుసు. అలా జరగడానికి వీలు లేదు. ఉద్యోగం చేస్తున్నందువల్ల ఉదయం ఒకరు.. సాయంత్రం ఒకరు వంట చేయాలని నా మొదటి కండిషన్. నా జీతం తాక కుండా సంసారం నడపాలి. అన్నిపన్లూ ఇద్దరూ కలిసే చెయ్యాలి. మా తమ్ముడికి మంచి ఉద్యోగం వచ్చే వరకూ నేను మా కుటుంబానికి అండగా ఉన్నా మీరు ఏమీ అనకూడదు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాము" ముగించింది. "కట్నం ఏమైనా ఇస్తారా? ఆహా.. అబ్బే నాకోసం కాదు మావాళ్ళ కోసం" అన్నాడు ఇకిలిస్తూ. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనగానే.. పేరయ్య ఆశగా "కనీసం 10 లక్షలైనా" అనగానే "సర్లెండి. వచ్చే వారం మీరు మీ వాళ్ళూ మా ఇంటికి రండి ముందే చెప్తున్నా ఫార్మాలిటీస్ ఏమీ ఉండవ్" అంది. "సరే" అని పేరయ్య ఇవన్నీ ఇంట్లో చెప్పకుండా పెళ్ళి చూపులకి సిద్ధం చేసాడు. తండ్రికి కట్నం 10 లక్షలకు తగ్గొద్దని వార్నింగ్ ఇస్తూ..ఇంకా లాంఛనాలు అవీ ఇవీ ఓ నాల్గు లక్షలకు పెద్ద లిస్టు తయారు చేసి ఇచ్చాడు. జుట్టుకి రంగు వేసుకుని జీతానికి జీతం. కట్నానికి కట్నం.. తనకు ఇష్టమైన బారెడు జడా.. అనుకుంటూ... ఈల వేసుకుంటూ.ఆదివారం కోసం ఎదురు చూపులు చూడ సాగాడు. ఈ సంబంధం అయినా ఖాయం ఐతే చాలని బామ్మా, అమ్మా, నాన్న మొక్కుకున్నారు.
* * *
ఆదివారం రానే వచ్చింది. అరువు బూట్లు, గిల్టు చైనూ ఉంగరాలతో టిప్ టాప్ గా తయారయ్యాడు పేరయ్య. అందరూ వెళ్ళగానే మర్యాదలు బాగానే చేసారు. లోపల "అమ్మాయ్! పళ్ళకు క్లిప్పులు తీసేసెయ్ వాళ్ళొచ్చేసారు రెడీ అవు" అని సలహా ఇచ్చింది వాళ్ళ అమ్మ. అమ్మా ఈ సవరం ఎక్కడ వూడి పడిపోతుందేమో నా బట్టతల ఎక్కడ బయటబడుతుందో అని భయంగా ఉందే అనగానే..."ఓసి పిచ్చి పిల్లా దీనికే అంత గాభరానా! సవరం వూడకుండా గట్టిగా ఓ డజను పిన్నులు వేసుకో నేను మీ నాన్నను చేసుకున్నప్పుడు ఇలానే మేనేజ్ చేసా.. అంది పళ్ళికిలిస్తూ..
* * *
ఉత్త టీ తో సరిపెడుతూ.. అమ్మాయి తండ్రి “కతికితే అతకదంటారన్నాయ్యా అందుకే ఇలా అన్నమాట" అన్నాడు. “ సర్లెండి బావగారూ.. అమ్మాయి లక్ష్మీ దేవిలా ఉంది చాలు. అసలు మావాడు పెళ్ళి చూపుల్లో ఏమీ తినడు” అనగానే..సుబ్బారావు తో సహా అందరూ ఉలిక్కిపడ్డారు. పేరయ్య పెళ్ళిచూపులు జిల్లాలోనే సంచలనం. ఇంక తెలియని వాళ్ళు పిచ్చి వాళ్ళ కిందే లెక్క. వనజ దగ్గర టీ కప్పు అందుకుంటూ ఆమె చేతికి ఉన్న తన ఉంగరం (గత పెళ్ళి చూపుల్లో నువ్వులూ నీళ్ళూ వదులుకున్నది) చూసి ఖంగు తిన్నాడు.
* * *
పెళ్ళి మండపంలో అడుగు పెట్టారు అంతా. పెళ్ళి చాలా సింపుల్ గా చిన్న గుడిలో చేస్తూ.. కట్నం ఎక్కువగదా కొంచెం సర్దుకోండి అన్నారు ఆడ పెళ్ళివాళ్ళు. పెళ్ళికి ముందు ఒక లక్ష కట్నం ఇచ్చారు. మంగళ సూత్రం కట్టే లోపు మిగతా 9 లక్షలూ తీసుకోమని పేరయ్య గోల. ఇక ఉండబట్టలేక పేరయ్య నాన్న అడగ్గా "మంగళ సూత్ర ధారణ సమయం లో ఇవ్వడం మా ఆనవాయితీ బావగారూ" అని సూట్ కేసు చూపించాడు. సూత్ర ధారణ జరుగుతున్నంతసేపూ పేరయ్య చూపులు ఆ సూట్ కేసు వేపే ఉన్నాయి. ఆ తర్వాత దండలు మార్చుకుంటున్న సమయం లో పెళ్ళికుమార్తె విగ్గు జారి నేల మీద పడటం తో బట్ట తల ప్రదర్శితమై అందరూ నవ్వ సాగారు పెద్దగా. పేరయ్య విగ్గు గొడవ పట్టించుకోకుండా "సూట్ కేసు ఇవ్వండి మామ గారూ" అనగానే..ఇచ్చాడు మామగారు. ఓ వైపు తలంబ్రాలు పోస్తూనే పేరయ్య పెట్టె తెరిచి చూస్తే... అందులో పెళ్ళి కార్డులు మాత్రమే ఉన్నాయి. పైన ఉన్న్న ఒక కార్డు వెనుక ఇలా రాసి ఉంది "కట్నం బాకీ 9 లక్షలు" అని. "ఇదేంటి ఈ మోసం" అనగానే పెళ్ళి కూతురు తండ్రి "మోసం ఏముంది బాబూ..నేను ఆర్.టీ.సీ కండక్టరును. ఎవరికైనా బాకీ ఉంటే ఇలాగే రాసిస్తా టికెట్ వెనకాల... ఇచ్చాక కొట్టేస్తా.. ఇచ్చేదాకా నీ దగ్గరే భద్రంగా ఉంచుకో అని సలహా కూడా ఇచ్చేసి చెక్కేసాడు అక్కడనుండి. దెబ్బకు తలతిరిగి మూర్చ పోయాడు పేరయ్య.
* * *
పెళ్ళయ్యాక కొద్దిరోజులకు టెన్షన్ భరించలేక పేరయ్య ఓ రోజు.."వనం..అంతా బాగానే ఉంది గానీ నా వుంగరం నీదగ్గర ఎలా ఉందో చెప్పవా అనగానే..వనజ నవ్వుతూ.. "ఆ పెళ్ళి చూపుల అమ్మాయి నా ఫ్రెండే! నాకు మొత్తం చెప్పింది. ఆ అమ్మయికి రెండువేల మూడొందలూ నేనే ఇచ్చి తీసుకున్నా" అనగానే పిచ్చి మొహం పెట్టి పేరయ్య “ఎందుకలాగా?” అనగానే వనజ కిలా కిలా నవ్వుతూ.."ఓరి నా పిచ్చి మొగడా! ఉంగరం మూడు వేలవుతుంది. మరి నాకు కూడా పెళ్ళి చూపుల ఖర్చులు గిట్టుబాటు అవాలిగదా! " అంది. ఆ సమాధానానికి బేతాళుడు మళ్ళీ చెట్టెక్కాడు అన్నట్టుగా మాళ్ళీ మూర్చ పోయాడు పేరయ్య. ఇప్పటికీ కట్నం బాకీ రాసిచ్చిన పెళ్ళి పత్రిక ల్యామినేషన్ చేయించి మరీ పట్టుకుని మావగారి దగ్గరకు వెళ్తూ.. వస్తూనే... ఉన్నాడు రెగ్యులర్ గా. ఏమైనా జమపడిందో లేదో.. ఎవరికీ తెలీదు.
-0o0-
No comments:
Post a Comment