సప్త బదరీ క్షేత్రాలు
కర్రా నాగలక్ష్మి
మానవ జీవితంలో ఒకసారేనా చెయ్యతగ్గ యాత్రలు యేవిటంటే పంచబదరీలు ,పంచకేదారాలు , పంచ ప్రయాగలు , పంచధారలు , పంచశిలలు , పంచపురములు అని మన పురాణాలలో చెప్పబడింది . ఉత్తరా ఖండ్ రాజ్యంలో వున్న సప్త బదరీ క్షేత్రాలు దర్శనీయ పుణ్య క్షేత్రాలుగా ఆది శంకరులచే గుర్తింప బడ్డాయి .వాటి గురించి తెలుసుకుందాం . గతంలో బదరీనాధ్ గా పిలువ బడే విశాల బదరీ గురించి మీకు పరిచయం చేసేను . యిప్పుడు మిగతా ఆరు బదరీ ల గురించి తెలియ జేస్తాను . నేను రాసే ప్రతీ యాత్రా విషయాలు స్వయంగా చూసిన అనుభూతిని మీతో పంచుకుంటున్నాను . నంద ప్రయాగ నుంచి విశాల బదరి వరకు వున్న ప్రదేశాన్ని బదరీక్షేత్రం గా సంభోదిస్తారు . పూర్వం ఈ ప్రదేశం బదరికవనంగా వుండేదట . ఈ క్షేత్రంలో వున్న యేడు విష్ణు మందిరాలనూ సప్త బదరీలు అని వ్యవహరిస్తారు . ఈ సప్త బదరీలలోనూ ఆది శంకరులు పూజాది కార్య క్రమాలు నిర్వర్తించేరని ఆధారాలు వున్నాయి . మొదటగా సప్త బదరీ క్షేత్రాల పేర్లు తెలుసుకుందాం . 1) ఆది బదరి , 2) నరసింహ బదరి కాని ధ్యాన బదరి , 3) వృద్ద బదరి , 4) యోగ ధ్యాన బదరి , 5 ) విశాల బదరి , 6) అర్ధ బదరి , 7) భవిష్య బదరి
1) ఆది బదరి
పిండారి గంగ అలకనందలో కలిసే సంగమాన్ని కర్ణప్రయాగ అంటారు . కర్ణప్రయాగ నుంచి రాణీఖేత్ వెళ్లేదారిలో సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో , చమోలీ జిల్లా లోని చాంద్ పూర్ కోట నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వుంది ఆదిబదరి . కర్ణప్రయాగదగ్గర రాణీఖేత్ వెళ్లే రోడ్డుమీద ' ఛులకోట ' కి దగ్గరగా రోడ్డు మీదకే ఈ మందిర ప్రాంగణం వుంటుంది . ఈ ప్రాంగణం లో మొత్తం చిన్నా పెద్దా మందిరాలు పదహారు వున్నాయి . చాలా చక్కగా కొత్తగా కనిపించే ఈ మందిరాలు గుప్తుల కాలం నాటివి అంటే ఆశ్చర్యం కలుగక మానదు . అంటే సుమారు ఐదవ శతాబ్దానికి చెందినవి . ఇందులో విష్ణుమూర్తి , లక్ష్మీదేవి , సూర్యుడు , కుబేరుని మందిరాలు ముఖ్యం గా చెప్పుకో తగ్గవి . ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం శంఖం , చక్రం , గద , పద్మం ధరించి వుంటుంది . ఈ మందిరాలు సుమారు 46 అడుగుల నుంచి 98 అడుగుల యెత్తు వరకు వున్నాయి . ఇక్కడి పూజారుల కధనం ప్రకారం విష్ణుమూర్తి సత్యకాలం నుంచి కలియుగ ప్రవేశం వరకు యిక్కడ నివసించి , కలియుగ ప్రవేశంతో బదరీనాధ్ కి వెళ్లి పోయెనట . అందుకు ఈ ప్రదేశాన్ని ఆది బదరి అని అంటారు . శంకరాచార్యులు బదరీనాధ్ ను వెతుకుతూ వెళ్లినప్పుడు ఈ ప్రదేశం లో పూజలు నిర్వహించి తనతో వచ్చిన శిష్యులను పూజారులుగా నియమించేరట . ఇప్పటికీ యిక్కడ కర్నాటక బ్రాహ్మణులు పురోహితులుగా వుంటున్నారు . కలియుగాంతం తరువాత భవిష్య బదరి బదరీనాధ్ అయినపుడు ఆది బదరి యోగధ్యానబదరి గా పిలువబడుతుందని అంటారు .
2) a ) ధ్యాన బదరి
హృషీకేశ్ నుంచి జోషిమఠ్ వెళ్ళే దారిలో జోషిమఠ్ కి దగ్గరగా వున్న ' హేలంగ్ ' గ్రామం దగ్గర రోడ్డు పైన చిన్న బోర్డుమీద కపాలేశ్వర్ కి యిక్కడ నుంచి వెళ్లాలి అని రాసి వుంటుంది . అక్కడనుంచి కిందకి దిగితే 'ఉర్గాం' లోయ లో అలకనంద వొడ్డున వుంది ఈ మందిరం . పాండవుల సంతతికి చెందిన పురంజయ రాజు పుతృడైన ఊర్వాఋషి తపస్సు చేసుకొని విష్ణుమూర్తి ని ప్రసన్నుని చేసుకున్న ప్రదేశమట . ఈ కోవెలలో నల్లరాతి తో చెక్కిన నాలుగు చేతుల విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడొచ్చు . ఇక్కడి పూజారులు కూడా శంకరాచార్యులతో వచ్చిన వారి సంతతి వారే , ఆదిశంకరులచే పంచ కేదారాలలో ఒకటిగా గుర్తింబడ్డ కపాలేశ్వర శివ మందిరాన్ని కూడా దర్శించుకోవచ్చు .
2) b ) నరసింహబదరి
జోషిమఠ్ వూరిలో టాక్సీ స్టాండు దగ్గర నుంచి ఒక ఫర్లాంగు దూరం మెట్లమీదుగా కిందకి వెళితే నరసింహమందిరం చేరుకోవచ్చు . స్థానికులని యెవ్వరిని అడిగినా దారి చెప్తారు . ఈ మందిరం అలకనంద వొడ్డున వున్న చాలా పురాతనమైన మందిరం . 25 సెంటీమీటర్లున్న ఈ విష్ణుమూర్తి విగ్రహం తామరపుష్పం లో కూర్చున్నట్లుగా వుంటుంది . ఆది శంకరులు బదరీనాధ్ వెళుతూ వాతావరణం అనుకూలముగా లేక పోవుట వలన యిక్కడ బస చేసి ఈ విగ్రహాన్ని బదరీనాధునిగా సేవించుకున్నారట . కోవెల వెనుకవైపున పై అంతస్తులో నివాసం చేసుకొని వుండేవారట .ఇవాళటికి కూడా వారు వుపయోగించిన గదిని సంరక్షించి వుంచడం చాలా గొప్ప విషయం . ఇక్కడ కూడా శంకరాచార్యులు నియమించిన కర్నాటకకు చెందిన పురోహితుల సంతతి వారే పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు . ఈ కోవెలలోని విగ్రహం కుడి చెయ్యి విరిగి కింద పడిపోతుందో అప్పుడు కలియుగాంతం అవుతుంది అప్పుడు మహాప్రళయం సంభవించి నరనారాయణ పర్వతాలు విరిగి పడిపోయి విశాలబదరీ భూస్థాపితం అయిపోయిందిట . అప్పుడు భవిష్యబదరిలో విష్ణుమూర్తి బదరీనాధునిగా పూజలందుకుంటాడని భక్తుల నమ్మకం .
3) వృద్ద బదరి
3) వృద్ద బదరి
జోషిమఠ్ కి సుమారు యేడు కిలోమీటర్ల దూరంలో వున్న ఆణిమఠ్ అనే గ్రామం లో వృద్ద బదరీ మందిరం వుంది . ఈ మందిరం చాలా చిన్నది . ఈ మందిరంలో వృద్దుని విగ్రహం వుంది . పూజారిని కారణం అడుగగా విష్ణుమూర్తిని ప్రసన్నుని చేసుకొనేందుకు తపస్సు చేసుకుంటున్న నారదునకు భగవానుడు వృద్దుని రూపంలో దర్శనమిచ్చేడుట . అందుకని యిక్కడ విష్ణుమూర్తిని వృద్దునిగా పూజిస్తారు . విశాలబదరీ లోని విగ్రహాలని దేవతల శిల్పి విశ్వకర్మ యీ ప్రదేశంలోనే చెక్కినట్లు కూడా చెప్పేరు . ఈ కోవెలలోని పూజాది కార్యక్రమాలు శంకరాచార్యులతో వచ్చిన కర్నాటక బ్రాహ్మణుల సంతతికి చెందిన వారే నిర్వహిస్తున్నారు .
4) యోగధ్యానబదరి
4) యోగధ్యానబదరి
జోషిమఠ్ నుంచి బదరీ వెళ్లేదారిలో పాండుకేశ్వరు అనే వూరులో వున్న మందిర సముదాయాన్ని యోగధ్యానబదరి అంటారు . రోడ్డు కి పక్కనే వున్న సిమెంటు చెయ్యబడ్డ నడకదారిన దిగువకు రెండు ఫర్లాంగులు నడిచి యీ ప్రదేశం చేరుకోవచ్చు . చిన్నచిన్న మందిరాలు వున్నాయి . బదరీనాధ్ కోవెల మూసివేసినపుడు ఉత్సవ విగ్రహాలని ఈ మందిరాలలో వుంచి నిత్య పూజారులు నిర్వహిస్తారు . బదరీనాధ్ యాత్ర చేసేవారు ముందుగా ఈ మందిరాలను దర్శించుకోవాలట . ముని శాపానికి గురియైన పాండురాజు , కుంతి , మాద్రి లతో యీ ప్రదేశంలో తపస్సుచేసుకుంటూ కాలం గడిపేడట . ఈ ప్రదేశం లోనే పాండవులు పుట్టేరట . పాండురాజు కంచు తో చేసిన నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించుకున్నాడుట . కాని యిప్పుడు అలాంటి విగ్రహం యేదీలేదు . పాండురాజు యీ ప్రదేశంలోనే మరణించెనట . మహాభారత యుధ్దానంతరము పాండవులు మనుమడైన పరీక్షిత్తునకు పట్టాభిషేకము చేసి పాండుకేశ్వరులో కొంతకాలం ధ్యాన సాధన చేసుకొని హిమాలయాలకి తరలిపోయేరట . ఇక్కడ దొరికిన రాగిరేకుల ఆధారంగా ప్రస్తుత ఉత్తరా ఖండ్ పూర్వపు పాంచాలదేశమని , యిక్కడకి దగ్గరగా వున్న సూర్యకుండం దగ్గరే కుంతికి సూర్యుని వల్ల కర్ణుడు జన్మంచిన ప్రదేశమని తెలుస్తోంది .
5) విశాలబదిరి ( బదరీనాధ్ ధాం )
ఆది శంకరులు పురాణాలలో వర్ణింపబడ్డ బదరీనాధ్ ని వెతుకుతూ వచ్చి అలకనంద వొడ్డున వున్న నారదకుండం లో దొరికిన విగ్రహాలను ప్రతిష్టాపనచేసి పూజలు నిర్వహించి , నిత్య పూజలకొరకై తన కూడా వచ్చిన శిష్యులను నియమించి కేదార్ నాథ్ వైపుగా సాగిపోయేరుట . ఈ కోవెలను గురించి , చుట్టుపక్కల గల దర్శనీయ స్థలాలను గురించి యింతకంటె ముందు వివరంగా రాయడంతో యిక్కడ క్లుప్తంగా వివరిస్తున్నాను . మహాభారత యుధ్దానంతరము అవతారం చాలించి వైకుంఠం చేరిన విష్ణుమూర్తి విచలిత మనష్కుడై వుండగా ఋషులు , మునుల సలహానుసారం ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ వుండగా , విష్ణుమూర్తి ని వెతుకుతూ వచ్చిన లక్ష్మీదేవి బదరిక వృక్షం గా మారి విష్ణు మూర్తిని మంచుబారి నుంచి కాపాడిందట . అందుకే యిక్కడ విష్ణుమూర్తి బదరీనాధుడిగా పిలువ బడుతూ పూజింపబడుతున్నాడు . ఇక్కడ చనిపోయిన వారికి చేసే పిండప్రదానం వల్ల వారి ఆత్మలు ముక్తి పొందుతాయని భక్తుల విశ్వాసం .
6 ) అర్ధ బదరి
జోషిమఠ్ నుంచి తపోవన్ కి వెళ్ళే దారిలో వున్న చిన్న గ్రామంలో వున్న విష్ణుమందిరాన్ని అర్ధబదరి అని అంటారు . ఈ విగ్రహం చాలా చిన్నది అవడంకూడా దీనిని అర్ధబదరి అనడానికి ఒక కారణం అవొచ్చు . పంచ బదరీలలో నరసింహబదరి , అర్ధబదరీలను చేర్చలేదు . బదరీ క్షేత్రంలో వున్న విష్ణు మందిరాలు అన్నింటిని బదరీలుగానే వ్యవహరించాలనేది కొందరివాదన . ఏది యేమైనా విగ్రహం యెంతదయినా మనసులో భక్తి ముఖ్యం .
7) భవిష్యబదరి
కైలాస మానససరోవరానికి వెళ్లే పౌరాణిక నడకదారిలో ' ధౌళి గంగ ' వడ్డునుంచి వెళ్లి తపోవన్ దాటేక సుబాని అనే దగ్గరనుంచి దట్టమైన అడవులగుండా 3కిలోమీటర్లు ప్రయాణించి భవిష్య బదరీని దర్శించుకొనేవారు . కాని యిప్పుడు మోటారు దారి వచ్చిన తరువాత జోషిమఠ్ నుంచి తపోవన్ వెళ్లేదారిలో జోషిమఠ్ కి సుమారు 19 కిలోమీటర్ల దూరం ప్రయాణించేక సల్ధర్ దగ్గర నుంచి సుమారు 6 కిలోమీటర్లు యెగుడూ దిగుడు గా వుండే దారిన కాలినడకన వెళ్లాలి . మేము వెళ్లినపుడు ముందురోజు జోషిమఠ్ లో రాత్రి బస చేసుకొని , స్థానికులనుంచి భవిష్య బదరీ గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం . మరునాడు తొందరగా మా టీ టిఫిను కానిచ్చుకొని ( బియ్యం , రెడీ టు ఈట్ పేకట్స్ , మేగీ , టీ సరంజామా , ఎలట్రికల్ రైసు కుక్కర్ ఉత్తర భారత యాత్రలకు వెళ్లేటప్పుడు మాతో తీసుకు వెళతాం ) యెనిమిదింటికి బయలుదేరేం . కొండదారి కాబట్టి 19 కిలోమీటర్లు గంట గంటన్నర పడుతుందని మా అంచనా . మందుగా మేము సేకరించిన సమాచారం ప్రకారం సుమారు 15 కిలోమీటర్ల తరువాత రోడ్డుపక్కగా వేడినీటి బావి వుంటుందని , అక్కడి మట్టికి చర్మరోగాలను పోగొట్టే శక్తి వుందని విన్నాం . అక్కడ మన్ను చాలా లూజుగా వుంటుంది కాబట్టి జాగ్రత్త గా బావి దగ్గరకు వెళ్లమని సలహా యిచ్చేరు . వారు చెప్పినట్లుగా వేడినీటి బావిలోంచి వస్తున్న ఆవిరులు అంతదూరంలో నుంచే కనిపించే సాగేయి . దగ్గరకు వచ్చిన తరువాత నీటి వేడి యెంతో తెలిసింది . వేడి నీటి బావికి చిన్న గుట్టమీద వుంది . నాలుగైదు మీటర్ల దగ్గరకు వచ్చేసరికి ఆ వేడికి ఒంట్లోంచి ఆవిరులు రాసాగేయి . ఆ నీళ్లు కుతకుత మని శబ్దం చేస్తూ వుడుకుతున్నాయి . ఆ నీళ్లల్లోంచి మెత్తని పసుపు వర్ణంలో వున్న మన్ను బయటకు వస్తోంది . ఆ మన్ను మాతో తెచ్చుకున్న డబ్బాలలో నింపుకున్నాం . అక్కడ నుంచి మరో మూడు కిలోమీటర్లు వెళ్లగా రెండు గుర్రాలను తీసుకు వెళుతున్నతను యెదురు పడ్డాడు . మా వారు కారు ఆపి భవిష్య బదరీకి రానూ పోనూ బేరమాడారు . అక్కడ నుంచి గుర్రాలపై మా ప్రయాణం మొదలయింది . రాళ్లమీంచి , సెలయేళ్ళు లోంచి సాగిన మాప్రయాణం దారిలో రెండు గ్రామాలను దాటి భవిష్య బదరి చేరింది . అంతవరకు యెగుడూ దిగుడూ కొండలమీద సాగిన ప్రయాణం కొన్ని వేల యెకరాల విస్తీర్ణం కలిగిన పచ్చిక మైదానంతో ముగిసింది . కనుచూపు మేరవరకు పచ్చటి తివాసి పరచినట్లున్న నేల తలెత్తి చూసినా చిగురు కనిపించని పెద్దపెద్ద మానులు . ఎదురుగా పొలిథిన్ కవరుతో వేసిన చిన్న టెంటు , టెంటు లోంచి లోపలకి వెళితే కొండలోంచి ( భూమిలోంచి కాదు ) బయటకి వస్తూ అస్పష్ట మైన ఆకృతి . అస్పష్టమైన ఆకారం ముఖము , కిరీటం , రెండు చేతులు పైకి , రెండు చేతులు కిందకి వున్నట్టుగా వున్న విగ్రహం . కళ్ళూ ముక్కూ యేర్పడలేదు యింకా . చాలా ప్రశాంతంగా వుంది అక్కడ . యెదురుగా చిన్న పర్ణశాల , అందులో ఓ బాబా వుంటున్నారు . ఆయన ప్రతీ సంవత్సరం మంచు కరుగగానే వచ్చి మంచు పడడం తోనే వెళ్లి పోతారుట . అతని దగ్గర రెండు అంగవస్త్రాలు , ఓ కంబళి తప్ప మరేమీ లేవు . అతను పది సంవత్సరాలుగా యీ ప్రదేశానికి వచ్చి తపస్సు చేసుకుంటూ కుంటున్నారుట . శంకరాచార్యుల వారిచే నియమింప బడ్డ పూజారి సంతతి వారు రెండు కిలో మీటర్ల దూరం లో వున్న వూరి నుంచి వచ్చి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు వుంటారు . అక్కడనుంచి రావాలని లేకపోయినా బాబా గారి హెచ్చరికతో ( చీకటి పడితే పులులు తిరుగుతాయట ) వెనుకకి మరలి వచ్చేం . పాతాళ భువనేశ్వర్ గుహలలో నిరంతరంగా నీళ్లు పడటం వల్ల కొన్ని ఆకృతులు యేర్పడి దేవతగా మూర్తులు కనిపించడం చూసేం . నీటి ధార ఆగి పోగానే ఆకృతి యేర్పడడం ఆగి పోవడం తెలుసు కాని యిక్కడ నీరు పడుతున్న ఆనవాళ్లు లేవు అయినా ఆకృతి యేర్పడడం నా చిన్న తలకాయకి అర్ధం కాలేదు . నాకు అది ఒక అద్భుతంగా కనిపించింది . ఈ విగ్రహం పూర్తిగా ఆకృతి సంతరించుకున్నాక కలియుగాంతం జరిగి నరనారాయణపర్వతాలు విరిగి విశాల బదరీ కోవెల నేల మట్టం అయిపోయినపుడు యీ విగ్రహం బదరీనాధునిగా పూజలందుకుంటుందట . ఈ యాత్రలు చేసుకోడానికి మే , అక్టోబరు నెలలు బాగుంటాయి . యాత్ర చెయ్యాలనే వుత్సాహం వున్నవాళ్లు టూరు ఆపరేటర్ల ద్వారా కాకుండా స్వంతంగా కారు మాట్లాడుకొని రోజుకి యింత అని వెళితే మనకి కావలసిన క్షేత్రాలు చూసుకో వచ్చు . హరి ద్వార్ , ఋషకేశ్ , బదరీనాధ్ లలో బస చేయడానికి ' అగ్రవాల్ ట్రస్ట్ ' వారి సత్రవులు నీటుగా వుండి , అందరికీ అందుబాటులో వున్నాయి . భోజనం , టీ , టిఫిను యాత్రీకులకు ఉచితంగా అందజేస్తున్నారు . మామూలు రూము అయితే ఉచితంగా యిస్తారు , అదే AC రూము అయితే 500₹ తీసుకుంటారు . ప్రతీ రూముకి అటాచ్డ్ బాత్రూములు వున్నాయి . ఇన్ని యాత్రలు హొటల్సులో వుండి చేసుకున్న తరువాత యీ సంవత్సరం బదరీ యాత్ర చేసుకొని తిరిగి వచ్చేక హరిద్వార్ లో యీ ' అగ్రవాల్ ట్రస్ట్ ' గురించి తెలిసింది . ఈ వివరం యెవరికైనా ఉపయోగ పడుతుందని యిక్కడ రాస్తున్నాను . మిగతా వివరాలకి గూగులమ్మ సహాయం వుండనేవుంది . మరెందుకూ ఆలస్యం యాత్రకి బయలుదేరండి .
****
No comments:
Post a Comment