(జ)వరాలి కధలు - 1 - అచ్చంగా తెలుగు

(జ)వరాలి కధలు - 1

Share This

(జ)వరాలి కధలు - 1

రచన : గొర్తి  వేంకట సోమనాధ శాస్త్రి (సోమసుధ)  


తొలి స్వరం (సస్పెన్స్)
సస్పెన్స్ .. . . .ప్రతివారిని ఆకర్షించే విచిత్ర అనుభూతి. అసలు మనిషి జీవితమే పెద్ద సస్పెన్స్. పుట్టేది ఆడా, మగా అన్నది తల్లి మదిలో మెదిలే తొమ్మిది నెలల సస్పెన్స్.(అఫ్ కోర్స్ ! ప్రస్తుత వైద్య శాస్త్రంలో వచ్చిన అభివృద్ధి వలన తెలుసుకొనే అవకాశం ఉన్నా మన దేశంలో ఆడపిల్లలను పిండదశలోనే తొలగిస్తుండటం వలన భారతప్రభుత్వం ఆ వైద్యప్రక్రియపై నిషేధం విధించటం వలన ఆ సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది ) ఇక పుట్టిన బిడ్డ ఎలాంటివాడవుతాడోనని తల్లిదండ్రుల మదిలో మెదిలే మరో సస్పెన్స్. అందుకే అన్నప్రాశనరోజు దేవుడి ముందు పుస్తకం, చాకు లాంటి వస్తువులుంచి పట్టుకోమని బిడ్డను వదులుతారు. ఆ బిడ్డ పట్టుకొనేది పుస్తకం అయితే విద్యావేత్త, పెన్నయితే కవి, చాకు అయితే శూరుడు అవుతాడని చెబుతుంటారు. శూరుడా, కోతలరాయుడా అంటే సరిగా చెప్పలేను. జీవితంలో అన్నిటికన్న గొప్ప సస్పెన్స్ క్షణాలు ప్రతివారికి తొలిరాత్రి ఎదురవుతాయి. జీవితభాగస్వామి తత్వమేమిటో తెలీదు. సర్దుకుపోయే తత్వమో, తిరుగుబాటు తత్వమో తెలీదు. జీవిత భాగస్వామి రూపాన్ని చూసి యిష్టపడతాం. ఆపై నలుగురు పెద్దలు నిర్ణయించి పెళ్ళి చేసి కలిసి బ్రతకండని గదిలోకి తోసేస్తారు. ఆ తర్వాత. . . .కలిసి కష్టసుఖాలు పంచుకొని బ్రతుకుతున్నా యిరువురూ తమ గతానికి చెందిన విషయాలు బయటపడకుండా కొంతకాలం జాగ్రత్తపడుతూనే ఉంటారు. అవి బయటపడితే తమ ఆనందమయ జీవితంలో కల్లోలం చెలరేగి అంతకాలం వారి మధ్య చిగురువేసిన అనురాగం స్థానంలో అనుమానం మొలకెత్తి తమ భావి జీవితం ' దినదినగండం . . .నూరేళ్ళ ఆయుష్షు అయిపోతుందేమోనన్న భయం, సస్పెన్స్. . .
ఎంతకాలం ఆ సస్పెన్స్ కొనసాగించాలో తెలీదు. ముఖ్యంగా ఒకరి మనస్తత్వం ఒకరు పూర్తిగా అర్ధం చేసుకొనేవరకూ, లేదా ఒకరి బలహీనతలు ఒకరు పూర్తిగా తెలుసుకొనేవరకూ యీ సస్పెన్స్ ను కొనసాగించక తప్పదు.
అది మాతొలిరాత్రి. పాలగ్లాసుతో ఆమెను గదిలోనికి తోసి బయట తలుపులు గడియపెట్టేశారు బంధువులు. ఆమె తలుపు వద్ద నిలబడి కాలిగోటితో నేలపై గీస్తోంది. పెళ్ళిచూపుల్లో కొద్దిక్షణాలు చూసిన ముఖమే అయినా, ఆమె అంతగా పరిచయం, చనువు లేని వ్యక్తి కావటాన అర్ధం లేని భయంతో మంచంపై కూర్చున్న నాకు చెమట్లు పడుతున్నాయి. ఎంత సినిమాల్లో తొలిరాత్రులు చూసినా , అవి అనుభవమున్న రచయితలు, డైరెక్టర్లు కూర్చుని రూపొందించిన సన్నివేశాలు కనుక ఆ నటులు చాలా హుషారుగా అభినయించేస్తారు. కానీ అదే నటీనటులు తమ నిజజీవితాల్లో తొలిరాత్రులకు అంత హుషారుగా తమ జీవిత భాగస్వాముల ముందు అభినయిస్తారా - అంటే అనుమానమే! నటన నటనే! జీవితంలో నటించటం కుదరదు కదా! అలా నటిస్తే సాటి మనిషికి ద్రోహం చేసినట్లే! తను గుమ్మం దగ్గర. . . నేను మంచం దగ్గర . . .పావుగంట సేపు పలకరింపైన లేకుండా అలాగే ఉండిపోయాం. బహుశా యిద్దరి మదిలోనూ ఒకటే ప్రశ్నలమాలిక ఉండొచ్చు. ముందుగా ఎవరు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? మన బలహీనతలు జీవిత భాగస్వామి ముందు బయట పడకుండా ఉండాలంటే ఎలా ప్రవర్తించాలి? నేను వెళ్ళి తనను తాకి యిక్కడకు తీసుకు రావాలా? అలా చేస్తే తను చులకన అయిపోతాడేమో! నాలో అహం అలా కుదరదంటోంది. పోనీ వచ్చి కూర్చోమంటే ఆమె వస్తుందేమో! అదే మంచిది. మొదటిరోజే ఆమె కాళ్ళ దగ్గరకెళ్ళటం అంత మంచిది కాదు. సరే! ఆమె పిలవగానే వస్తుంది. ఆ తరువాత. . . స్వతస్సిద్ధంగా ఆడవారు సిగ్గుపడుతూ కూర్చోవటమే తప్ప మొదటగా పలకరించరని ఎక్కడో చదివాను. అంటే నేనే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి?
"ఎవరేమిట్రా నాన్నా? తొలిరాత్రి మనమే మాట్లాడాలి. ఆ తరువాత జీవితాంతం మనకి మాట్లాడే అవకాశం వాళ్ళివ్వరు. మా ఆవిణ్ణి చూడు. తొలిరాత్రి నా బీరాలన్నీ శ్రద్ధగా వింది. పడిపోయిందనుకున్నా. ఇప్పుడు నేనేం మాట్లాడినా " మీకేం తెలీదు. ఊర్కోండి " అని నా నోరు మూసేస్తుంది. అందుకే తొలిరాత్రి మనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీ మాటకారితనానికి ఆమె పడిపోతే మరీ మంచిది. మరి జన్మలో నోరెత్తకుండా పడుంటుంది " మిత్రుడు సలహాల్రావు సలహా గుర్తొచ్చింది.
కానీ ఏం మాట్లాడాలి?
" లవ్ కి స్పెల్లింగడుగు. టి.వి.సీరియల్ గురించో, చదివిన నవలల గురించో అడుగు. కవినంటావుగా! నీ పాండితీప్రకర్షనంతా ఏ కరువు లేకుండా ఏకరువు పెట్టేయి. కట్టుకున్న ఖర్మానికి, అదీ తొలిరాత్రి, తనకిష్టం లేకపోయినా విని తీరాల్సిందే! కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో! నిన్ను మాట్లాడమన్నానని కాలేజిలో నువ్వు వెలగబెట్టిన విషయాలేమన్నా ఉంటే హుషారులో బయటపెట్టకు. ఫస్ట్ ఇంప్రెషన్ యీజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. నీ ప్రేమగాధలేమన్నా తొలిరాత్రే బయటపెట్టావంటే మరి జీవితంలో నిన్నామె నమ్మదు. బజార్లో కూరలమ్మాయితో మాట్లాడటం చూసినా బంతాడేస్తుంది. అందుకని విషయాలడిగి తెలుసుకోవటమే తప్ప నీ విషయాలు వివరించి చెప్పకు." థాంక్స్ రా సలహాల్రావ్!
" పెళ్ళికి తెల్లవారుఝామున ముహూర్తం పెట్టి నిన్న రాత్రంతా నిద్రలేకుండా చేశారు. ఈరోజు పగలంతా రకరకాల పూజలపేరుతో పస్తులుంచి తిండి లేకుండా చేశారు. అలా ఎంతసేపు నిలబడతారు.? నీరసంతో కాళ్ళు లాగొచ్చు. ఇలా వచ్చి కూర్చోండి "
నా మాటలకు ఆమె తలెత్తి చూసింది. మెల్లిగా వచ్చి మంచం అంచున కూర్చుంది. గదిలో ఫాను హోరు తప్ప మరో అలికిడి లేదు.
" పాలు. . . " ఆమె చేతిలో గ్లాసును వణుకుతున్న చేత్తో అందుకొన్నాను. పాలు కొద్దిగా తాగి ఆమె వైపు చూశాను. చీరకొంగుని నలిపేస్తూ తలొంచి కూర్చుందామె. ఆమె కూడా నాలాగే ఒత్తిడిలో ఉందని గ్రహించాను. ఆ ఒత్తిడి తగ్గించటానికి నేనే ఏదో చేయాలి.
" మీరు పాలల్లో ఉప్పేస్తారా? " నా ప్రశ్నకు త్రుళ్ళిపడిందామె.
" అమ్మ. . .పంచదారే వేసిందే! " బదులిస్తున్న ఆమె మోములో అమాయికత్వం.
" అర్ధమైంది. మీరు గుమ్మం దగ్గర నిలబడ్డప్పుడు, భయంతో ముఖానికి పట్టిన చెమట పాలల్లో పడినట్లుంది అందుకే పాలు ఉప్పగా ఉన్నాయి."
" గమనించలేదు. సారీ! " అంటున్న ఆమెకు చేతిలోని గ్లాసునందించాను.
" పాలు పూర్తిగా తాగలేదు " గ్లాసులోకి చూసి చెప్పింది.
"తొలిరాత్రి పాలు పంచుకోవాలంటారు కద! అవి మీ కోసం. తాగండి " అన్నాను.
" ఒక్కమాట. . . " చెప్పమన్నట్లు చూశాను.
" మీరు నన్ను ' మీరు ' అనకూడదు "
అదీ నిజమే! పసికుర్రాడి దగ్గరనుంచి ' మీరు ' అనకపోతే ఒంటికాలిపై లేచే యీ రోజుల్లో, ఒక్క భార్య మాత్రమే ' ఏమే, ఒసే , యిదిగో ' అని పిలిచినా నోరెత్తదు.
" ఏమని పిలవను? " అడిగాను. నాలుగు మాటలు కలిపేసరికి ఆమెకు కొంచెం ధైర్యం వచ్చినట్లుంది..
" మా నాయనమ్మ పద్మావతిని మా తాతయ్య ' పద్దూ ' అని పిలుస్తాడు. ఆవిడేనాడూ ' అలా పిలవొద్దూ ' అనలేదంట. మా బాబాయి పిన్ని నీరజను ' నీరూ ' అని పిలుస్తాడు. కానీ మా పిన్ని ఆయన్ని ' మావారు ' అని చెబుతుందే తప్ప వేరుగా చెప్పదు. అంచేత మీ యిష్టం. నా పేరు వీర వేంకట . . . " చెబుతున్న ఆమె మాటలను మధ్యలోనే కట్ చేశాను.
" సరి సరి! శుభలేఖలో చూశాను. ఆ పేరు నాకు నచ్చలేదు. తెలుగులో ' యువతి ' అన్న పదానికి జవరాలు అని పర్యాయపదముంది. ' జ ' ని నా జేబులో దాచేసి ' వరాలూ ' అని పిలుస్తాను. సరేనా? "
నా మాటలకు మౌనంగా తలూపిందామె. ఆమె అంగీకారానికి నాలో మాటలు వెల్లువలా బయటకొచ్చాయి.
" గూడ్! ఈరోజునుంచి నువ్వే నా స్వరం, ఆ దేవుడిచ్చిన వరం, నా మదిలో కలవరం, యికపై నా కల. . . వరం " రెచ్చిపోతున్న నన్ను చూస్తూ తన నాడి పట్టుకొని చూసుకొంది.
" ఏమైంది? " అడిగాను.
" జ్వరం " ఆమె బదులుకు నా పైత్యం దిగిపోయింది. ' అమాయకురాలేం కాదు. . జాగ్రత్త! " అంటూ మనసు హెచ్చరించింది.
"పగలంతా సరిగా తిండిలేక వేడి చేసి ఉంటుంది. అంతేకానీ జ్వరం కాదది.
పాలు త్రాగు. సర్దుకొంటుంది " అని ఆమె చేతిలోని పాలగ్లాసు విషయం గుర్తు చేశాను.
" అదిసరే! ఈ పాలు నా దగ్గరకెందుకు తెచ్చావో తెలుసా? " పాలు తాగుతున్న ఆమె కంగారు పడింది.
" మీరు తాగుతారని మావాళ్ళిస్తే తెచ్చాను "
" అది సరేలే! తొలిరాత్రి యీ పాలగ్లాసు కధని పెట్టటంలో మన హిందూ సంప్రదాయంలో ఒక పెద్ద సత్యం దాగి ఉంది. ఈ పాలు యిన్నాళ్ళూ నువ్వు పుట్టింట్లో పంచుకొన్న ముద్దుమురిపాలన్న మాట! వాటిని హృదయమనే గ్లాసులో నింపి నాకు యిచ్చావ్! దాన్ని నేను తీసుకోవటం ద్వారా యికపై యీ ముద్దుమురిపాలను యిద్దరం సమానంగా పంచుకొందామని నేను ఒప్పుకొన్నట్లన్నమాట! " పాలగ్లాసుపై క్లాసు తీసుకొని గర్వంగా భుజాలెగరేశాను. అమ్మయ్య! నా ప్రతిభను తన ముందు పరిచేశాను. రేపటినుంచి నా తెలివితేటలకు మురిసిపోయి తను నా అడుగులకు మడుగులొత్తేస్తుంది.
" మరి మా బావ మరోలా చెప్పాడే? " సణిగినట్లన్న ఆమె మాటలకు నా గుండె జారిపోయింది.
బావ చెప్పాడా? అదీ మొదటిరాత్రి పాలగ్లాసు విషయం. . . .అంటే తను . . . .అనుమానంతో నానరాల్లో టెన్షను పెరిగి పోయింది. ఎవరీ బావ? తొలిరాత్రి పాలగ్లాసు విషయం యీమెకెందుకు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు?
" నీతోనే చెప్పాడా? " ఉద్రేకాన్ని అణుచుకొంటూ ఆడిగాను.
" మా అక్కతో చెప్పాడు " అమ్మయ్య! తేలిగ్గా ఊపిరి పీల్చుకొన్నాను.
" ఏం చెప్పాడు? "
" ఈ పాలు ఆడపిల్ల తండ్రి కష్టార్జితంలో పాలంట. ఆడపిల్ల యిలా పాలు తెచ్చి యివ్వటం ద్వారా ఈ రోజునుంచి జీవితాంతం పుట్టింటినుంచి తండ్రి సొమ్ము యిలాగే తెచ్చిస్తానని ఆమె ప్రపోజ్ చేస్తుంటే, ఆ పాలగ్లాసు తీసుకోవటం ద్వారా అతను తన యిష్టాన్ని ఆమెకు తెలుపుతున్నాడంట "
ఆమె మాటలకు నా బుర్ర తిరిగిపోయింది. ఆమె అమాయికంగా తన బావ విషయాన్నే చెబుతోందా? లేక తను కూడా తన పాండితీప్రకర్షను బావ వంకతో ప్రదర్శిస్తోందా? కధలు చెప్పటం నీకే కాదోయి. నాకూ తెలుసు అని పరిహసించినట్లుగా నాకనిపించింది.
" మా అమ్మాయి కొంచెం ఫాస్టు బాబూ! నువ్వేం అనుకోకు " అప్పగింతలవేళ మామగారి మాటల్లో సస్పెన్స్ అప్పుడే విడింది. బావ పేరుతో తొలిస్వరం వినిపించిన యీమె ముందు ముందు ఏమి కధలు వినిపించబోతుందో అన్న సస్పెన్స్ నాలో తొలిరాత్రే నెలకొంది.
. " ఆడది పెళ్ళిలో తలొంచుకొందని పేట్రేగిపోకు. అలా తల వంచుకొన్న ఆడపిల్ల వయసు పెరిగేకొద్దీ సంతానమనే సైన్యాన్ని సమకూర్చుకొని గర్వంగా తలెత్తి నీకు పోటీగా నిలబడుతుంది. పెళ్ళిలో అహంకారంతో తలెత్తి గర్వంగా కూర్చున్న మగాడు వయసు ఉడిగేకొద్దీ అన్ని విషయాలకూ భార్యపై ఆధారపడి తలదించుకొనే స్థాయికి చేరతాడు. ఇది ప్రతి జీవితంలో జరిగేదే! " పెళ్ళి కుదిరిందని మురిసిపోతున్న నాకు గీతాబోధలా చెప్పిన ఏవర్మూర్తి ఎలియాస్ ఏ.వి ఆర్. మూర్తి మాటలు నా చెవిలో ఒక్కసారి గింగురుమన్నాయి.
(కానీ ఒక్కటి. జీవితంలో ఏ చిన్న పొరపాటు చేసినా మన సమాజంలో స్త్రీ ఏకాకి అయిపోతుంది. అందుకే ప్రతి స్త్రీకి ఆ మాత్రం చాకచక్యం, పరిజ్ఞానం అవసరమని గుర్తించి, యీ సంఘంలో (జ)వరాలికి తనకంటూ ఒక స్థానం కల్పించాలని ఆక్షణంలోనే నిర్ణయించుకొన్నాను) * * *

No comments:

Post a Comment

Pages