‘తిమిర సంహారం’
నండూరి సుందరీ నాగమణి
రామకృష్ణా బీచ్ దగ్గర ఆటో దిగి పిట్ట గోడ దగ్గర నిలుచుని అటువైపు నా దృష్టి సారించాను. అక్కడే ఇసుకలో కూర్చుని తదేకంగా ఎదురుగా ఎగసిపడే అలలవైపు చూస్తున్నాడు నవీన్. అతని ముఖంలో ఎంతో విషాదం, నిస్సహాయత ప్రతిబింబిస్తున్నాయని నాకు తెలుసు... ఒక్క క్షణం... ఒక్క క్షణం అన్నీ మరచి పరుగున వెళ్లి అతడి గుండెల్లో తలదాచుకోవాలని అనిపించింది. కరుగుతున్న మనసును బుద్ధి కసిరి కొట్టగానే క్షణంలో బండరాయిలా మారిపోయింది... నా కనులలో మళ్ళీ అగ్ని జ్వాలలు చెలరేగాయి... వెనుతిరిగి, విస విసా నడుస్తూ ఆటో ఎక్కి అందులో కూలబడ్డాను.
ఆ రాత్రి నేను నిద్రపోలేదు... నా తలగడ కన్నీటితో తడుస్తూనే ఉంది.
***
“సమీరా... ఇటు రా...” బాస్ పిలవటంతో చేతిలోని లెటర్స్ ని టేబుల్ మీద ఉంచి, వాటిపై బరువు పెట్టి ఆయన దగ్గరికి వెళ్లాను.
ఆయన ముఖం గంభీరంగా ఉంది.
“ఎందుకు నవీన్ ని ఇగ్నోర్ చేస్తున్నావు? మీకిద్దరికీ భేదాభిప్రాయాలేమిటి?” దీర్ఘంగా నా ముఖంలోకి చూసాడు ప్రహ్లాదరావు.
నన్ను కానట్టు ముఖం పెట్టి, “ఫైల్స్ క్లియర్ అయ్యాయా సార్, సాంక్షన్ లెటర్స్ ఏమైనా టైప్ చేసివ్వాలా?” ఎంతో వినయంగా అడిగాను. ఆయన ఓ నిట్టూర్పు విడిచాడు.
ఎదురుగా కుర్చీ చూపిస్తూ కూర్చోమన్నట్టు సైగ చేసాడు. నేను కూర్చుని, అభావంగా కిటికీలోకి చూస్తూ ఉండిపోయాను.
“చూడు సమీరా, నవీన్ చాలా ఉత్తముడమ్మా... నిన్నెంత గాఢంగా ప్రేమించాడో నీకు తెలియదా, అతన్ని ఎందుకంత అకస్మాత్తుగా రిజెక్ట్ చేసావో నాకు అర్థం కావటం లేదు... మనసులనేవి గాజు కుప్పెల్లాంటివి తల్లీ... చిన్న అపార్థం చాలు వాటిల్లో బీటలు రావటానికి, అవి జీవాన్ని కోల్పోవటానికి... సర్వస్వం పోగొట్టుకున్న విరాగిలా అయిపోయాడమ్మా నవీన్. ఉద్యోగంలో కూడా సరిగ్గా మనసు పెట్టలేక, తప్పులు చేస్తున్నాడు. మొన్న నాలుగు రోజుల క్రితం కాష్ కౌంటర్ లో ఐదు వందల నోట్లు అనుకుని వెయ్యి నోట్లు ఒక సెక్షన్ ఇచ్చేసాడట. అదృష్టం కొద్దీ ఆ కష్టమరే తిరిగి ఇచ్చాడనుకో... మీరిద్దరూ చక్కగా పెళ్లి చేసుకొని ఒకింటి వాళ్ళు అవుతారంటే ఇదేమిటమ్మా ఇలా చేసావు? నీ అన్నలాంటి వాడిని, నాతో పంచుకోవటానికేమిటి? చెప్పు తల్లీ...” ఎంతో అనునయంగా అన్నాడు ప్రహ్లాద రావు.
“సార్ నాకు సీట్ లో చాలా పని ఉంది... వస్తాను...” ఆయన జవాబుకు ఎదురు చూడకుండా కాబిన్ తలుపు తెరచుకొని వెనక్కి వచ్చేసాను.
***
రెండేళ్ళ క్రితం ఇదే ఆఫీస్ లో ఇద్దరం ఒకటే సారి ఉద్యోగాల్లో జాయిన్ అయాము నవీన్, నేనూ... సంప్రదాయ కుటుంబం లో పుట్టి పెరిగిన నాకు ఉద్యోగం కేవలం కాలక్షేపమే... అందుకే ‘వద్దు, మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తామని అమ్మా నాన్నా అంటున్నా, కొన్ని రోజులు చేస్తానని ఒప్పించి, విశాఖపట్నం వచ్చి జాయిన్ అయాను. హాస్టల్లో ఉంటున్నాను.
ఆడుతూ పాడుతూ కాజువల్ గా చదువుతూ చేసిన డిగ్రీ నాది. ప్రతీ పరీక్షా ఫస్ట్ మార్కులతో పాసౌతూ, ఇంకా పై చదువులు చదవాలని ఉన్నా ఇంటి పరిస్థితులు సహకరించక, బాధ్యతల కోసం తప్పని సరై ఉద్యోగంలో చేరాడు నవీన్. ఫోటో గ్రాఫిక్ మెమరీ అతనిది. అంటే కాక అంతులేని జ్ఞాన పిపాస అతనికి... ప్రతీరోజూ వార్తాపత్రిక చదువుతాడు... కరెంట్ అఫైర్స్ కంఠో పాఠం అతనికి... పురాణాలు, జనరల్ నాలెడ్జ్ సంగతి చెప్పనక్కరలేదు. ఇద్దరు టెన్త్ చదివే అబ్బాయిలకి మాథ్స్, సైన్స్, తెలుగు కోచ్ చేసేవాడు. ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇతనొక్కడే మగ పిల్లవాడు. తల్లి దండ్రులు పల్లెటూరిలో ఉంటారు. వాళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టర్ గా చేస్తున్నారు. దిగువ మధ్యతరగతికే కాదు, ఈ సమాజం సృష్టించిన దిగువ తరగతికి చెందిన వాడు నవీన్ జన్మ దృష్ట్యా... మా నాన్నగారు పెద్ద ఉద్యోగం చేసి ఇటీవలే పదవీ విరమణ చేసారు. నా పైన ఉన్న ఇద్దరు అన్నలకూ, అక్కయ్యకూ పెళ్ళిళ్ళు అయిపోయాయి. సంఘంలో ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం మాది. మా ఇద్దరి మధ్య ఉన్న అంతరాలు మా స్నేహానికి ఏమాత్రం అడ్డు కాలేదు. నవీన్ నా ఉద్యోగ జీవితంలో ఎంతగానో సహాయకారిగా ఉండేవాడు. చాలా సార్లు నా లెటర్స్ అతనే టైపు చేసి ఇవ్వటం, నా పనిని పంచుకోవటం చేసేవాడు. ఎప్పుడూ హుషారుగా, నీట్ గా కడిగిన ముత్యంలా ఉండే అతనికి ఉన్నవి కేవలం మూడు జతల బట్టలు మాత్రమే... వాటినే జాగ్రత్తగా వాడుకునే వాడు నవీన్.
కాలం గడిచే కొద్దీ మా ఇద్దరి మధ్య దూరం తరగసాగింది, అనురాగం పెరగసాగింది... కాకపోతే ఇద్దరమూ బయటపడలేదు. ఓ సారి మాత్రం నేనే అతని దగ్గర ‘నవీన్, నువ్వు పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్?” అని అడిగాను కావాలని. నా వైపు అదోలా చూసి, “ఏమో... అసలు చేసుకుంటానో లేదో...” అన్నాడు నిర్వేదంగా...
“అదేమిటి?”
“సమీరా... నీ జీవితం వడ్డించిన వెండి పళ్ళెరం... నా జీవితం బాధ్యతల సమాహారం... నేను కోరుకున్న వ్యక్తిని ఎప్పటికీ చేరలేని దురదృష్టం నాది... ఆమె నా జీవితంలోకి అడుగు పెట్టనప్పుడు, నేను ఎవరినీ నా జీవితంలోకి ఆహ్వానించలేను...”
“ఓ, ఎవరో ఆ అదృష్ట వంతురాలు!” నాకు తెలియకుండానే నా స్వరంలో అసూయ ధ్వనిచింది.
“చెప్పాలనున్నా చెప్పలేను...” చటుక్కున అక్కడినుండి లేచి వెళ్ళిపోయాడు.
***
“ఏయ్ నవీన్, ఈరోజు సాయంత్రం సరదాగా బీచ్ కి వెళదాం వస్తావా?” ఆరాటంగా అడిగాను మరుసటి వారంలో ఓ రోజు.
చిన్నగా నవ్వాడు నవీన్...”సారీ సమీరా... నీకు తెలుసుగా నాకు ట్యూషన్లు ఉంటాయి...”
“అబ్బా ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం మునగదులే... ప్లీజ్... ఈరోజు నా పుట్టిన రోజు... నన్ను డిజప్పాయింట్ చేయకు...” నా గొంతు వణికింది.
నన్ను పరీక్షగా చూస్తున్న అతని కన్నుల్లో వేయి చందమామల కాంతి విరిసింది.
గులాబీ రంగు శిఫాన్ చీర అదే రంగు బ్లౌజ్, మెడలో ముత్యాల హారం, తలంటుకుని లూజ్ గా క్లిప్ పెట్టి వదిలి వేసిన జుత్తు, చెవులకు ఊగుతున్న ముత్యాల జుంకాలు... నేనెలా ఉంటానో నాకు తెలుసు, కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు అజంతా సుందరి అనే పేరు ఉండేది...
“చాలా బావున్నావు సమీ...” అతని పెదవులు పలికాయి పరవశంగా...
తదేకంగా తను నన్ను చూస్తుంటే సిగ్గు ముంచుకు వచ్చింది... ‘సమీ’ అని పిలుస్తుంటే ప్రపంచంలోకెల్లా తీయనైన పేరు నాదే అని అనిపించింది.
“మెనీ మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే...” చేయి కలుపుతూ అన్నాడు నవీన్. తొలి సారి నన్ను తాకటం... అప్రయత్నంగా నా చేయి అందించాను...నాలో ఏవో ప్రకంపనలు... కొన్ని క్షణాల తరువాత నా చేయి వదిలేసాడు నవీన్.
ఆ మధుర లాహిరి నుండి తేరుకుంటూ, “సాయంకాలం నీకు ట్రీట్ ఇస్తాను... నాకిక్కడ స్నేహితులు ఎవ్వరూ లేరు నీవు తప్ప... ఈ ఒక్కరోజే... నాకోసం... ప్లీజ్...” మళ్ళీ అడిగాను. కాదని అనలేదు అతను... నవ్వి తలూపి తన సీట్ లోకి వెళ్ళిపోయాడు.
***
ఆరోజు నా జీవితంలో ఎంతో మరపురాని రోజు... బీచ్ దగ్గరకు నా కోసం అతను చీర కొని తీసుకు వచ్చాడు. లేలేత నీలి రంగు చీర... “చూడు, ఇది కట్టుకుంటే సాగర కన్యలా ఉంటావు సమీ...” అన్నాడు పాకెట్ అందిస్తూ... బీచ్ ఒడ్డున ఉన్న ఓపెన్ రెస్టారెంట్ లో కూర్చుని సాగరాన్ని చూస్తూంటే నా మనసులో ఉవ్వెత్తున భావోద్వేగాలు! కట్లెట్ తింటున్న అతని చేతిని గట్టిగా పట్టుకుని, “నవీన్... ఐ లవ్ యు... మనం పెళ్లి చేసుకుందాం...” గట్టిగా చెప్పేసాను.
నేనెంత గట్టిగా చెప్పానో అంత గట్టిగా నవ్వేసాడు, నవీన్... “డోంట్ బీ సిల్లీ యార్... మనకి పెళ్ళేమిటి?”
“నవీ... ఏమంటున్నావు? నువ్వు నన్ను ప్రేమించటం లేదా?”
“ప్రేమ? ఉహు, అదేమీ లేదు...” అన్నాడు తేలికగా...
“నిజం చెప్పు... నన్ను చూడగానే నీ కళ్ళల్లోకి వచ్చే మెరుపు నిజం కాదా? నేను ఏ పని చెప్పినా వెంటనే మరో మాట మాట్లాడక చేసేసే నీ పనులు నిజం కావా? నేను పని చేసుకుంటుంటే దొంగతనం గా నన్ను గుచ్చే నీ చూపులు నిజం కావా? ఎందుకలా ఆత్మవంచన చేసుకుంటావు నవీ? ఎవరినో ప్రేమించానని అన్నావు... ఆ అదృష్టవంతురాలు నేనేనని నాకు తరువాతే తోచింది... ప్రేమించాక ఈ దాపరికాలు ఎందుకూ?”
“సమీ... అదిగో ఆ రోజా పువ్వును చూడగానే ఎంతో ఇష్టం కలుగుతుంది... ఇదిగో ఈ సముద్రాన్ని చూస్తుంటే ఇది నాదే అన్న ప్రియభావన కలుగుతుంది... ఇదీ ప్రేమే... అలా అని ఇష్టమైన వాటినన్నింటినీ స్వంతం చేసుకోగలమా? నువ్వే చెప్పు...”
“ఇష్టమైనదే వచ్చి స్వంతమవుతానంటే సంకోచిస్తావెందుకు?”
“పిచ్చి సమీ... దేవతను ఇంట్లోకి పిలవాలన్నా దానికో అర్హత కావాలి కదా...”
“దేవుడికి అర్హతే కాదు, హక్కూ ఉంటుంది... అయినా దేవుడు ఎక్కడ ఉంటే ఆ దేవతకు అదే ఇల్లు...”
“సమీ... నువ్వు పసిపిల్లలాంటి దానవు... నీకు తెలియదు... ప్రతీ ప్రేమకు పెళ్ళే ముగింపు కానక్కరలేదు...”
“అవును... పెళ్లి ముగింపు ఎలా అవుతుంది, నవజీవనానికి నాంది అవుతుంది కాని...?”
“అర్థం లేకుండా మాట్లాడకు సమీ... మన మధ్యనున్న అంతరాలు...”
“నిన్ను చేరుకునేందుకు అవి నాకు ఏనాడూ అంతరాయం కావు, కాలేవు... నవీ... ప్లీజ్...నన్ను కాదనకు...” కన్నీళ్ళతో అతని రెండు చేతులూ గట్టిగా పట్టుకొని అడిగాను.
గుండె గొంతుకలోకి వచ్చిన భావన కలిగిందేమో కంట్లో చిప్పిల్లిన కన్నీటిని అదిమి పట్టి నా కళ్ళు తుడిచాడు...
“కాదని అనలేను... అవుననీ అనలేకపోతున్నాను...” డగ్గుత్తికతో పలికాడు.
“కాదని అనకపోతే చాలు, అవునని ఇప్పుడే అనక్కరలేదు...ఐ లవ్ యు... ఐ విల్ వెయిట్ ఫర్ యు!”
బదులుగా నా చేయి చిన్నగా నొక్కి వదిలాడు నవీన్.
***
నవీన్ ఎప్పుడు అవునన్నాడో, ఎప్పుడు నాకు చేరువయ్యాడో తెలియదు... ఇద్దరం నీలి మేఘాలలో తేలిపోవటం మాత్రం నాకు గుర్తుంది... ఊహల పల్లకీలో ఊరేగటం మాత్రం నాకు తెలిసింది... ఎప్పుడెప్పుడు అతని చేయి పట్టుకోవాలాని ఉవ్విళ్ళూరుతున్న సమయంలో అతని చెల్లెలి పెళ్లి అయే వరకూ ఆగమని నన్నడగటం కొద్దిగా నిరాశ పరచినా, అదీ సబబే అనిపించింది. కానీ ఈలోగా నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ముమ్మరం చేసారు... పీజీ చేస్తున్నానని, అదయ్యే వరకూ ఆగాలని సాకులు చెబుతూ ఎలాగో వాయిదా వేస్తున్నాను.
పండక్కని ఇంటికి వెళ్ళిన నాకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. దాని ఫలితంగానే నవీన్ ని అతని బంధువర్గం లోని వారిని విపరీతంగా ద్వేషించటం మొదలు పెట్టాను... నాకు నవీన్ నవ్వు ముఖం బదులుగా దాని చాటున ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపివేసే క్రౌర్యం కనబడుతోంది... అందుకే అతనిని పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ కాలం గడిపివేస్తున్నాను... నిజానికిప్పుడు నేను బ్రతికున్న శవాన్ని... ఆ సత్యం ఎవరికి అర్థం అవుతుంది? ఈ మానస క్షోభ మొదలైన క్షణం నుంచీ అతను నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తేదాన్ని కాదు. ఎన్ని మెసేజ్ లు పెట్టినా జవాబిచ్చేదాన్ని కాదు... ప్రతీక్షణం నాకు దూరమైన మా పెద్దమ్మ కూతురు సుగుణే కళ్ళముందు కదులుతుంటే, నవీన్ పట్ల నాకున్న కోపం మరిన్ని రెట్లు ఎక్కువయ్యేది.
ఈలోగా నవీన్ కి వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ ఫర్ అయింది... అప్పటికే పిచ్చివాలకం పడిపోయిన నవీన్ అన్యమనస్కంగా ఉంటూ విధి నిర్వహణలో అన్నీ తప్పులే చేస్తున్నాడు...చేయనీ... ఉద్యోగం కోల్పోయి అడుక్కు తిననీ... కసిగా శపించింది నా మనసు... ఎంతగా ఆరాటపడ్డానో అతన్ని చేరుకోవటం కోసం...హూ! అర్హత లేని మనుషులు!!
***
“రామ్మా... చాలా రోజులైంది నిన్ను చూసి...” ఆదరంగా ఆహ్వానించింది ప్రహ్లాదరావు గారి భార్య వాసవి. ఈరోజు తానేదో నోము నోచుకున్నానని రమ్మని కబురు పెట్టటంతో ఆఫీసునుండి త్వరగా బయలుదేరి రూమ్ కి వెళ్లి తయారై వచ్చాను.
“కూర్చుని మీ అన్నయ్యతో కబుర్లు చెబుతూ ఉండు, సంధ్య దీపం పెట్టుకుని వచ్చేస్తాను...” చెప్పేసి, లోపలి వెళ్ళిపోయింది. లోపల ఇంకా ఇరుగుపొరుగు ఆడవారు ఉన్నట్టున్నారు., అంతా సందడిగా ఉంది...
“ఏమ్మా సమీరా...ఇంటికి వెళ్లి వచ్చావా?” అన్నాడు ప్రహ్లాదరావు. “అవునండి...”
“నీతో కొద్దిగా మాట్లాడాలమ్మా...”
“నవీన్ గురించి అయితే నేను ఏమీ మాట్లాడలేను...” కొద్దిగా కటువుగా అన్నాను.
“చూడమ్మా, ఒక రిలేషన్ షిప్ లో - అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు... ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవటం చాలా తప్పమ్మా... ఏం జరిగిందో, నీ మనసులో ఏముందో తెలియదు... నువ్వెందుకు ఆ నిర్ణయం తీసుకున్నావో అతనికీ చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? ప్రేమిస్తున్నప్పుడు ఒకరికొకరు ఎలా చెప్పుకున్నారో, అలాగే విడిపోయేటప్పుడు కూడా చెప్పుకోవటం విధాయకం...”
“ఏమిటండీ అతనికి చెప్పేది? అనవసరం... గొంతులు కోసే కుటుంబం వాళ్ళది...” సుగుణ గుర్తు రాగానే నా గొంతు జీరబోయింది.
“నీకెలా తెలుసు?” మౌనంగా ఉండిపోయాను.
“చెప్పమ్మా... ఏ ఆధారంతో అలా అభియోగం వేస్తున్నావు?”
“అభియోగం కాదండి, మా అక్క సుగుణను అతని అన్నయ్య వర్ధన్ ప్రేమించి, చేయిచ్చాడు... ఆ పిచ్చిది అతన్ని నమ్మి, మనసుతో పాటు శరీరాన్ని కూడా ఇచ్చి గర్భవతి అయింది... వాడు దీన్ని వంచించి, మరెవరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి తరఫు వాళ్లు అతన్ని నరికేశారు... ఇప్పుడు సుగుణ పిచ్చిదై పోయింది...” రెండు చేతులలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చాను...
“చెప్పండి, అలాంటి నరరూప రాక్షసుల కుటుంబంలోకి నన్ను ఎలా వెళ్ళమని అంటారు?”
ఎంతో జాలిగా చూసాడు నా వైపు ప్రహ్లాదరావు... “విన్నవీ, ఒక్కో సారి కన్నవి కూడా నిజం కావమ్మా... నీకు వినిపించిన కథ ఒక కట్టుకథ... వర్ధన్ ని చంపించింది సుగుణ మేనమామే... ఈ కథ సుగుణ నమ్మేలా అల్లింది ఆమె తండ్రే...”
“నో... నేను నమ్మను...”
“అవునమ్మా, నీవు నమ్మవు... ఎందుకంటే మీ పెదనాన్న ఎంతో సాత్వికంగా కనిపిస్తాడు... గ్రామ పెద్దగా అతను చేసే అరాచకాలు బయటికి రావు... రానివ్వరు... పెద్దింటి మనుషులు మీరు... చిన్నింటికి మీరు కోడళ్ళుగా వెళతానని అన్నా మీ వాళ్ళ అభిజాత్యాలు ఎలా ఒప్పుకుంటాయి? అందుకే మీతో అవునని చెప్పి, ఆ మనుషుల్ని హతమార్చేసి, ఆ నేరం బయటపడకుండా, తాము చెడ్డవాళ్ళు కాకుండా, ఆ చనిపోయిన మనిషినే శీలం లేని వాడిని కూడా చేసారు... ఆ కథే ఆ మతిమాలిన పిల్లతో పాటు నువ్వూ నమ్ముతున్నావు... అందుకని నవీన్ లాంటివాడిని, మూర్తీభవించిన ప్రేమమూర్తిని ద్వేషించి, వదులుకోవటానికి సిద్ధపడ్డావు. హు... అమాయకుడిని ప్రేమ జాలంలోకి లాగిందీ నువ్వే, అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టి అతడిని మెంటల్ చేస్తున్నదీ నీవే... నీ చర్యల వలన ఎవరికి నష్టం కలిగినా నీకేమ్మా...?”
“మీరు చెప్పిన కథ నేను నమ్మలేను ప్రహ్లాద్ సార్...మీ శిష్యుడు నవీన్ మీకు చెప్పమని అన్నాడేమో... సారీ అని చెప్పండి...మా నాన్నగారు చెప్పిన మాటలమీద నాకు చాలా నమ్మకముంది... సుగుణను, ఆమె బాధనూ కళ్ళారా చూసాను నేను...”
“అమ్మా, నిన్ను నమ్మించేందుకు ఈ కథ నేను చెప్పలేదు తల్లీ... నీకు తెలియటానికి చెప్పాను... నిన్ను కన్నవాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మగలిగావు... చూసావా, ప్రేమించిన మనిషి కోసం వాళ్ళని వదిలేయటానికి సైతం సిద్ధపడిన నీవు వాళ్ళ ఉచ్చు గ్రహించలేక పోయావు... నీవు ప్రేమించిన, నిన్ను ప్రేమించిన వ్యక్తి పైననే విరక్తి కలిగేలా చాలా బలమైన మాటలు చెప్పారు మీ నాన్నగారు. సంతోషం... ఇలా జారిపోయే, జావగారిపోయే అమ్మాయి నా శిష్యుడి భార్య కావటం కన్నా కాకపోవటమే మేలమ్మా... నవీన్ ఎప్పుడూ నన్ను నీతో ఈ విషయాలు చెప్పమని అనలేదు... నేను సేకరించిన సమాచారమే నీకు చెప్పాను... అంతే... వర్ధన్ హత్యకేసు ఇక్కడే ఫల్గుణ్ అనే లాయర్ టేక్ అప్ చేసాడు... నీకు ఆసక్తి ఉంటే ఓ సారి వెళ్లి తెలుసుకో...సరేనమ్మా, పద, మీ వదిన దగ్గర తాంబూలం తీసుకో...” మృదువుగా చెప్పాడు, ప్రహ్లాదరావు...
నాకు మనసంతా మొద్దుబారిపోయింది... ఏదీ తెలియని స్థితిలో పసుపు, కుంకుమ, తాంబూలం తీసుకొని ఆ దంపతులిద్దరికీ నమస్కరించి, బయటపడ్డాను.
***
ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాకు స్లో పాయిజన్ లాగా నవీన్ మీద ద్వేషాన్ని ఎక్కించారన్న విషయం మెల్లగా నా మస్తిష్కానికి ఎక్కుతోంది. నేను నవీన్ పట్ల వైముఖ్యాన్ని పెంచుకోవటం మా వాళ్లకి ఆనందం కలిగిస్తోన్న సంగతి మొన్న ఇంటికి వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది.
“నువ్వు వెంటనే పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు... అలగా జాతి వాళ్ళను నమ్మి సుగుణ ఏమైందో చూసావుగా?” అన్న నాన్నగారి మాటల వెనుకనున్న మెత్తని పన్నాగం మనసులోకి ఇంకుతోంది. సుగుణతో ఏకాంతంగా మాట్లాడాలని ప్రయత్నిస్తే ‘అది పిచ్చి దాన్లా ఉంది,ల దాన్ని కలవద్దంటూ’ పెద్ద నాన్న నన్ను తరిమివేసినంత పని చేసారు. ఎందుకని? సుగుణ ద్వారా ఏదైనా నిజం బయటకు వస్తుందనా? కావచ్చు. నేను బయటకు వచ్చేస్తుంటే, కిటికీ లోంచి సుగుణక్క చూసిన చూపులు, ఆ చూపుల్లో వేడికోలు నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి... తలవిదిలించి మొబైల్ చేతిలోకి తీసుకున్నాను.
ఒక నంబర్ డయల్ చేసి, “ఫల్గుణ్ గారి ఆఫీసుకు వచ్చేయ్, అక్కడ కలుద్దాం...” అని చెప్పి కట్ చేసాను. మబ్బులు విడిపోయి నిర్మలమైన ఆకాశంలా నా మనసు ఇప్పుడు తేటగా ఉంది. నేను ఫోన్ చేసింది నవీన్ కని వేరేగా చెప్పనక్కరలేదు కదా!
***
(సమాప్తం)
హామీపత్రం
హైదరాబాద్,
09.01.2016
‘అచ్చంగా తెలుగు’ పత్రిక సంపాదకులకు,
నమస్సులు. నేను పంపిస్తున్న ఈ కథ ‘తిమిర సంహారం’ పూర్తిగా నా స్వంతమని, దేనికిని అనువాదం, అనుసరణ, కాపీ కాదని, ఇది ఎక్కడా ప్రచురణ / ప్రసారం కాలేదని, ఇది మరే పత్రిక యందూ పరిశీలనలో కూడా లేదని హామీ ఇచ్చుచున్నాను.
ఇట్లు
[ నండూరి సుందరీ నాగమణి ]
నా చిరునామా:
Mrs NS Nagamani
Dy Manager, Andhra Bank,
Sultan Bazar Branch, Koti,
Hyderabad-500095.
mobile: 9849989201
mail id: nandoorinagamani@gmail.com
No comments:
Post a Comment