వెన్నెల యానం – 11 - అచ్చంగా తెలుగు

వెన్నెల యానం – 11

Share This

వెన్నెల యానం – 11

భావరాజు పద్మిని



( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... ఆమెను ఆరాధించడం మొదలుపెడతాడు. చంద్రికను తను రెండవసారి బస్సు లో చూసిన వైనం, ఆమెతో గతంలో తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటాడు శరత్. చంద్రికకు వాళ్ళ బావతో పెళ్లి కుదిరి, మరో నెల రోజుల్లో పెళ్లి ఉందనగా, చంద్రిక తల్లిదండ్రులు, అత్తయ్య కుటుంబం అంతా అనుకోకుండా కేదారనాథ్ వరదల్లో చనిపోతారు. చంద్రిక బావ కంపెనీ బాధ్యత ఆమె మీద పడుతుంది. కోట్లకు వారసురాలిగా ఒంటరిగా మిగిలిన చంద్రికకు ముగ్గురు యువకులు ప్రేమ ఉచ్చు బిగించాలని చూస్తూ ఉంటారు. ఈ లోపల అనుకోకుండా, పరిచయం అయ్యాడు శ్రీరాం. ఆక్సిడెంట్ అయ్యి, ఐ.సి.యు లో ఉన్న అతనికి ఎవరూ లేరు. అతనికి ఆసరాగా  సాయి బాబా అనే అటెండర్ ను పెడుతుంది చంద్రిక. శరత్, చంద్రిక ఇద్దరూ పేరంటాలపల్లి దర్శించుకుని, ప్రయాణం కొనసాగిస్తారు. శ్రీరాం ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ జరిగే సమయానికి, ఒక మీటింగ్ కోసం మనోహర్ తో ఢిల్లీ వెళ్తుంది చంద్రిక. ఇక చదవండి...)
ఢిల్లీ లో విలాసవంతమైన ఒక ఫైవ్ స్టార్ హోటల్ అది. పైన అలంకరించే శాండ్లియార్ నుంచి నేలపై పరచిన కార్పెట్ ల వరకూ ఆ హోటల్ స్థాయిని తెలియచేస్తున్నాయి. ప్లాస్టిక్ నవ్వులు పులుముకున్న హోటల్ స్టాఫ్, అడుగడుగునా స్వాగతాలు పలుకుతున్నారు. ఆ హోటల్ ఐదవ అంతస్తులో ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉంది. నాలుగవ అంతస్తులో పెద్ద రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది, దాని ప్రక్కనే జిం. ఇక మూడవ అంతస్తులో, ప్రపంచంలో ఉన్న అన్నిరకాల వంటకాలూ కలగలిపి, నోరూరించేలా అనేక టేబుల్స్ పై అలంకరించి, ఉంచారు. ఎక్కడ నుంచో వచ్చిన విదేశీయులు అనుకుంటా, బ్రెడ్, డో నట్స్ తిని, వెంటనే కాలరీలు పెరిగాయని, పై అంతస్తులో ఉన్న జిం కు వెళ్లి వ్యాయామం చెయ్యాలని, మాట్లాడుకోసాగారు. వాళ్ళనే గమనిస్తున్న చంద్రిక, తనలో తానే నవ్వుకుంటూ, భోజనం చెయ్యసాగింది. ఆమె ఎదురుగా ఉన్న మనోహర్, ఇలా అన్నాడు.
“మేడం, సాయంత్రానికి ఫారన్ డెలిగేట్స్ ఇక్కడికి చేరుకుంటారు. ఈ లోగా మీతో చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. కళ్ళు తిప్పుకోలేని అందం, ఆ అందాన్ని మించిన వ్యక్తిత్వం, అన్నింటినీ మించి, బోలెడంత ఆస్తితో ఒంటరిగా బ్రతుకుతున్న మిమ్మల్ని చుస్తే, నాకు ఎంతో జాలి, ప్రేమ. మగతోడు లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతారు చెప్పండి ? మీ అవసరాలు, పని వేళలు, మీటింగ్స్, వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసిన నాకంటే, మీకు మంచి జోడీ దొరుకుతుందా ? నన్ను పెళ్లి చేసుకోండి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఏమంటారు ?”
నాకు అతని మాట తీరుకు చిర్రెత్తుకు వచ్చింది. నేను అతని మాటలకు జవాబు ఇవ్వబోయేలోగా, ఆమె మొబైల్ మ్రోగింది. వెంటనే తీసి, “చెప్పండి, సాయి బాబా గారు...” అన్నాను. ఆయన చెప్పిన విషయాలు విని, ఒక్క క్షణం షాక్ అయ్యి, అలా మౌనంగా ఉండిపోయాను.
“ఏంటి మేడం ? అనుకోకుండా, ఆక్సిడెంట్ అయ్యి మీ బావ ఫ్రెండ్ కిరణ్, అకౌంట్స్ డిపార్టుమెంటు నివాస్ హాస్పిటల్ లో చేరారని చెప్పారా, మీ సాయిబాబా గారు?” మొహం మీద ఒక విషపు నవ్వు మెరుస్తూ ఉండగా అడిగాడు మనోహర్.
“ఇది మీకు...” అర్ధోక్తిలో చూస్తూ ఉండిపోయాను.
“చూడు, చంద్రికా ! నన్ను తక్కువ అంచనా వెయ్యకు. రాయలసీమ ఫ్యాక్షన్ బాక్గ్రౌండ్ ఉంది నాకు. నీకోసం కిరణ్, నివాస్ ప్రయత్నిస్తూ ఉన్నారని, నాకూ తెలుసు. మర్యాదగా చెప్తే వినలేదు. అందుకే, చావుదెబ్బ కొట్టి, వాళ్ళ అడ్డు తొలగించాను. వాళ్ళు ఇకపై నీవంక కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించరు. ఇక నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఒక్కటే గతి. నేను నీ ‘దీనజనోద్ధారణ’ కు, సేవలకు అడ్డు రాను. అలాగే, నువ్వు నీ ఇష్టమొచ్చిన వాళ్ళతో తిరగచ్చు. అన్నట్టు, ఈ మధ్య ఎవరో ఆక్సిడెంట్ అయిన వాడి కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నావట ? అయినా నాకెందుకు – ఒక మాట చెప్పనా, పెళ్ళైనా,  నీ జీవితం నీది, నా జీవితం, విలాసాలు, తిరుగుళ్ళు నావి. నీ ఆస్థి మాత్రం మన ఇద్దరిదీ ! బాగా ఆలోచించుకుని, “ఒంటరి ఆడదానివి” జాగ్రత్తగా నిర్ణయం తీసుకో !” ఆమె కళ్ళలోకి సూటిగా, క్రూరంగా చూస్తూ, ఒంటరి ఆడదానివి – అన్న పదాన్ని నొక్కి పలుకుతూ అన్నాడు మనోహర్.
“వాట్ ద హెల్ ? ఏంటి ఈ ఏకవచన ప్రయోగాలు. పోలీస్ లకు ఇదంతా చెప్పానంటే, ఐదు నిముషాల్లో ఊచలు లెక్కపెడతావ్ ? అంత చేతకాని దాన్ని అనుకుంటున్నావా ? ఇష్టమొచ్చినట్టు వాగుతున్నావ్ ? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.” , అంతా తమనే చూస్తే బాగోదని, మామూలు స్వరంతోనే గంభీరంగా పలికాను నేను.
“చూడు పాపా ! ఆవేశపడకు. నన్ను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. నేను చిటికేస్తే, నిన్ను క్షణాల్లో ఇక్కడినుంచి మాయం చేసి, పీక మీద కత్తి పెట్టి మరీ, నీ మెళ్ళో తాళి కట్టించే ఏర్పాట్లు జరిగిపోతాయి. అసలే అనుకోకుండా అంతా చచ్చి, కూలబడ్డావు. తొందరపడి, ఉన్నవాళ్ళను కూడా ఎందుకు పోగొట్టుకుంటావు ? నాకు తొందర ఏమీ లేదు. మనం తిరిగి వెళ్ళేదాకా, బాగా ఆలోచించి, నిర్ణయం తీసుకుని చెప్పమ్మా, వస్తా !” అంటూ వికృతమైన చూపులతో, చంద్రిక ఒళ్ళంతా తడుముతూ చూసి, వెళ్ళిపోయాడు మనోహర్.
ఒక్క క్షణం స్థాణువయ్యాను. అనుకోని ఈ సంఘటన నన్ను కుదిపేసింది.
“మేడం, షల్ ఐ సర్వ్ యు సంథింగ్ ?” వెయిటర్ వచ్చి పిలవడంతో తేరుకుని, నెమ్మదిగా నా రూమ్ కు వెళ్లాను.
కాసేపు రిలాక్స్ అయ్యి, హోటల్ నెంబర్ నుంచి, సాయి బాబా గారికి ఫోన్ చేసి, శ్రీరాం కు ఇవ్వమని, అతనితో మాట్లాడాను. అతనితో సుమారు ఒక గంట మాట్లాడాకా, అతను చెప్పిన ఉపాయం విన్నాకా, మబ్బులు వీడినట్లుగా నా మనసు తేలికపడింది. సాయంత్రానికి రిలాక్స్ అయ్యి, కాన్ఫరెన్స్ హాల్ కు వెళ్లాను. వ్యక్తిగత ఒత్తిడులు నా వృత్తిలో చూపకూడదన్నది, నాకు అనుభవం నేర్పిన పాఠం. అందుకే చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ, మనోహర్ వంక చూసాను. అతను అంతకంటే మామూలుగా నటిస్తున్నాడు. నెమ్మదిగా మీటింగ్ మొదలయ్యింది.
(సశేషం )

No comments:

Post a Comment

Pages