విహారి- అకస్మాత్తుగా నేల రాలిన ఓ నక్షత్రం
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
విహారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. వయసుతో పాటూ సినిమాల్లోకి వెళ్లాలన్న పిచ్చీ ముదిరిపోసాగింది. ముగ్గురన్నదమ్ముల్లో విహారే అందంగా, హాండ్ సమ్ గా ఉంటాడు. పైగా జిమ్ కెళ్లి బాడీని జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నాడు. చదువుకునేటప్పుడు జిమ్నాస్టిక్స్ లో తనదైన ప్రతిభ చూపి ఇంటి అల్మరాలన్నీ కప్పులతో నింపేశాడు. అందువల్ల సినిమాల్లోకి వెళ్లడానికి కావలసిన అర్హతలన్నీ తనకున్నాయనీ ఇహ అదృష్టం తలుపు కొట్టడమే తరువాయన్నది అతని నమ్మకం. కానీ అదంత సులువా? స్టూడియోలకి ఎలాంటి గేట్లు ఎంత ఎత్తులో ఉంటాయో తెలిసింది తప్ప లోపలికెళ్లే మార్గం కనిపించలేదు, ప్రముఖులు కన్పిస్తే చూసి మురిపోవడానికి తప్ప మరే రకంగానూ అతనికి ఉపయోగపడలేదు.
అలా విశ్వప్రయత్నాలు చేస్తూ, ఊళ్లో జరుగుతున్న షూటింగ్ ని గుంపులో గోవిందంలా ఆసక్తిగా చూస్తున్న విహారి ఒక ప్రముఖ దర్శకుడి కంట్లో పడ్డాడు. ‘కుర్రాడు అందంగానే ఉన్నాడు. హీరో పక్కన నుంచో పెడదాం’ అనుకుని విహారిని పిలిచి మాట్లాడాడు. దానితో అంబారీనెక్కి ఆకాశంలో విహరించాడు విహారి. సినిమా విడుదలైంది. సినిమాలో జస్ట్ హీరో పక్కన మాటా పలుకూ లేకుండా నుంచున్నాడు. అయితేనేం..ప్రతి షోకీ వెళ్లి తనని తను ఎన్ని సార్లు చూసుకున్నాడో. ఆ సినిమా తర్వాత గ్యాప్..
ఆ తర్వాత మరో డైరెక్టరు ఫ్యామిలీ డ్రామాతో ఓ సినిమా తీస్తూ అతన్ని సెకండ్ హీరోగా పెట్టుకున్నాడు. ఫర్వాలేదు ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. అయినా గ్యాప్..గ్యాప్..సినిమాల్లో అవకాశం అనేది అందలమే..అదెక్కడం అంత సులువు కాదని తెలిసొచ్చింది అతనికి.
తనకున్న బాడీతో, జిమ్నస్టిక్స్ టెక్నిక్స్ తో ప్రముఖ హీరోలకి ఫైటింగ్ సీన్స్ లో ట్రైనింగ్ ఇస్తూ కాలం గడపసాగాడు.
అలా కొంతకాలం గడిచాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం వచ్చింది విహారికి. తనదైన బాణీలో విజృంభించేశాడు. మొట్టమొదటిసారి పోస్టర్లో ఓ మూల చిన్న ఫోటో. థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు చప్పట్లు. విహారిని మనసులో పెట్టేసుకున్నారు. ఇహ అక్కడినుంచీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన పంథాలో ముందుకెళుతూ అభిమానుల అభినందనల వెల్లువలో తడిసి ముద్దవుతున్నాడు. సినిమా ఆర్టిస్ట్ అయితే తనని అర్థం చేసుకుంటుందని, ఆలంబనగా నిలుస్తుందని అప్పటిదాకా పొట్ట పోసుకోవడంకోసం ఐటమ్ సాంగ్స్ కి పరిమితమైన బెల్లీశాంతిని పెళ్లి చేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండీ హీరో అయ్యాడు. తన అభిరుచికి తగ్గట్టు మంచి సందేశాత్మక మాస్ చిత్రాల్లో నటిస్తూ పాత్రలకి వంద శాతం న్యాయం చెయ్యసాగాడు. గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విహారి హీరో. సినీజగత్తులో ఓ నక్షత్రం. అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. స్నేహితులని, బంధువులనీ ఎవ్వర్నీ మరచిపోలేదు. సినీప్రపంచపు ఆభిజాత్యాన్ని తలకెక్కించుకోలేదు. మొదటి రోజు నుంచీ ఈరోజు వరకూ తలచుకుంటే అతనికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడు? ఇహ సినిమాల్లో తను మంచి మంచి పాత్రలేసి జనాన్ని మెప్పించాలి. సినీ చరిత్రలో తనదో బంగారు పుట కావాలి. మరింత కష్టపడాలి. కష్టపడాలి.
అర్ధరాత్రి హఠాత్తుగా కడుపులో నొప్పి. మెల్లగా లేచి కూర్చున్నాడు.
బెల్లీశాంతికి విహారి అంటే ప్రాణం. తెగిన గాలిపటంలాంటి తన జీవితానికి మార్గ నిర్దేశం చేసిన మహానుభావుడు విహారి. "ఏవైంది?" అంది ఆందోళనగా.
"ఏవీలేదు..కడుపు అప్ సెట్ అయింది..నువ్వు పడుకో"అన్నాడు.
మరుసటిరోజు డాక్టర్ని కలసి తనకి తరచూ నొప్పి వస్తోందని చెప్పాడు. డాక్టర్ అన్నీ పరీక్షలూ చేసి అతనికి లివర్ ప్రాబ్లెం ఉందని..అదీ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పాడు.
అతనికి జీవితం అందకార బంధురంగా అనిపించసాగింది. ఎంతకష్టపడి ఇక్కడికి వచ్చాడు? తనని తను ప్రూవ్ చేసుకోవాలనుకునే సమయానికి..విధి ఇలా చేసిందేమిటి?
బయటకొచ్చాడు. అభిమానులు చేతులూపుతున్నారు. లోపల ఎంత బాధున్నా బయటకి కనిపించనీయకూడదు. వాళ్ల దృష్టిలో హీరోలంటే అందంగా, ఆరోగ్యంగా, ఏ సమస్యలూ లేని జీవితం గడిపే దైవ సమానులు. దాన్ని అలాగే వాళ్ల మనసులో కొనసగించాలి. విహారి నవ్వుతూ చేతులూపాడు.
విహారీ నటించిన ఒక చిత్రం రిలీజయింది. అతను అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్. కానీ హీరోతో సమానమైన పేరొచ్చింది.
దాంతో అతనికి హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
నిజానికి అది జాక్ పాట్ లాంటిది. దాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. కాని తన అనారోగ్యకారణాలరిత్యా సున్నితంగా తిరస్కరించాడు.
కానీ, ఆ నిర్మాతకి ఎలాగైనా విహారీని బాలివుడ్ కి పరిచయం చేయాలని కోరిక. అందుకే "విహారి భాయ్..హిందీ సినిమా అవకాశం నువ్వెందుకొద్దంటున్నావో నాకు తెలియదు. దయచేసి ఈ ఒక్కసారీ ‘ఊ’ అను, నిన్ను మా ప్రేక్షకులకి చూపించాలని నా కోరిక" అన్నాడు.
నటుడికి పంచప్రాణాలూ నటనే! మనసు అనారోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా అటే మొగ్గింది.
ముంబయికి ప్రయాణ మవుతున్న విహారి దగ్గరకి వచ్చింది బెల్లీశాంతి. "మీ ఆరోగ్యం బాలేదు..రెస్టు తీసుకోవచ్చుకదా..ఇప్పుడు ముంబయి ఎందుకు?" అంది బాధగా.
"నాకేమైందిప్పుడు..అలా వెళ్లి ఇలా వచ్చేస్తాను. నటుడిని అవడానికి నేనెంతో కష్టపడ్డాను. అహర్నీశలూ కలగన్నాను. ఇక్కడిదాకా వచ్చాను. ఇప్పుడు వచ్చింది ప్రమోషన్. ఎవరైనా కాలదన్నుకుంటారా? చెప్పు."అన్నాడు అనునయంగా.
"సరే..మీరు క్షేమంగా ఉండడమే నాకు కావలసింది. ఆరోగ్యం జాగ్రత్త. ఏమాత్రం నలత అనిపించినా ఇక్కడికి వచ్చేయండీ, లేదా నాకు తెలియజేస్తే నేను వెంఠనే వచ్చేస్తాను. అసలు ఇక్కడ పనులేవీ లేకపోతే నేనూ వచ్చేదాన్ని మీతో.."అంది కళ్లనీళ్లతో.
"పిచ్చీ..నాకేం కాదు. నువ్వు బెంబేలు పడకు" అన్నాడు అనునయంగా.
ఫ్లైట్ ఎక్కి ముంబయి వెళ్లి..పో..యా..డు.
షూటింగ్ జరుగుతుండగా వచ్చింది మాయదారి నొప్పి. తట్టుకోలేకపోయాడు. దగ్గర్లో ఉన్న హాస్పిటల్కి వెళ్లాడు. అంతే..ఆపై అందరికీ కబురెల్లింది. విహారి ఇహలేడని.
బెల్లీశాంతి గుండెకోత అంతా ఇంతా కాదు. తన గుండెల్లో కొలువైన దేవుడు, అవతారం చాలించాడు. పిల్లలిద్దరూ లేకపోతే సతీసహగమనం చేసేసేదే! విహారీ అంటే అంత ప్రాణం ఆమెకు.
అభిమానులందరు షాకయ్యారు. బ్రహ్మాండమైన ఫిసిక్ తో తెరపై హీరోల్ని సైతం పిపీలికాల్లా కనిపింపజేసే తమ నిజమైన హీరో కనిపించని లోకాలకి వెళ్లిపోయాడా? నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు.
తెరపై హీరోగా నటిస్తూ, నిజజీవితంలో సమాజానికి సేవ చేస్తూ హీరోగా అందరి మనసుల్లో స్థానం సంపాదిస్తే, ఎక్కడ తన ఉనికిని కోల్పోతానో అన్న భయం ఆ దేవుడికి. దేవుడు నిర్దయుడు. ఏదో సాధిద్దామన్న తపనతో అనుక్షణం శ్రమిస్తూ, కృషిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి సరిగ్గా తను అనుకున్నది సాధించాలనుకునే సమయానికి కళ్లుకుట్టి తీసుకుపోతాడు. అందుకే పోయినోళ్లు అందరూ మంచోళ్లు..ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపి గురుతులు అంటారు. బెల్లీశాంతి, ఇద్దరు పిల్లలే విహారి తీపి గురుతులుగా మిగిలారు.
*****
No comments:
Post a Comment