ఆర్ద్రత
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
అభివృద్ధి బాటలో, డబ్బు యావలో నిరంతరం పరిగెడుతున్నమనిషి అనుభూతులు, అనుబంధాలు మాత్రమే కాకుండా ఒక ముఖ్యమైనది కోల్పోతున్నాడు. అదే ఆర్ద్రత. గుండెలోతుల్లో చెమ్మ లేకపోతే హృదయం పొడిబారిపోయి ఎడారిగా మారుతుంది. అది మనిషిని మానవయంత్రాన్ని చేసి, మానవసంబంధాలకి, ప్రకృతికీ వ్యతిరేకంగా పనిచేయిస్తుంది.
***
రాజారావ్!
చిన్నప్పట్నుంచి చాలా తెలివైనవాడు.
పుట్టింది పల్లెటూరిలో. పదోతరగతి వరకూ చదువుకుందీ అక్కడే!
ఇంట్లోవాళ్లు, బయటి వాళ్లు, మాస్టార్లు అందరూ అవకాశం దొరికినప్పుడల్లా అతని తెలివికి పట్టంగడుతూ, శాలువా కప్పుతుంటే తనలాంటి మేధావి ఇలాంటి పల్లెటూళ్లో, దేశంలో తప్పబుట్టానని అనిపించసాగింది.
అందుకే ఆకాశానికి నిచ్చెనలెయ్యాలనుకున్నాడు. దానికి చదువొక్కటే మార్గం అని తెలుసుకున్నాడు.
అందుకే రాత్రీ పగలు అదేపనిగా చదివాడు. స్వతహాగా తెలివైనవాడవడం వల్ల వచ్చిన ప్రతి అవకాశాన్నీ అంది పుచ్చుకున్నాడు.
పల్లెటూరు వదిలి పైచదువులకోసం పట్నం వెళ్లాడు. అదీ అంత సులువుగా కాదు. తనకంత స్థోమత లేదని తండ్రి కంట తడి పెడుతున్నా, ససేమిరా అని అలాంటి ఊళ్లో, ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టడం తన దౌర్భాగ్యమని అరుపులు కేకలతో తన నిరసన వ్యక్తం చేసి, తండ్రి చేత పొలమమ్మించి మరీ ఆ డబ్బుతో పట్నం చేరుకున్నడు. అక్కడి సుఖాలు అతడి మనోనేత్రం ముందు అనుక్షణం నర్తించసాగాయి. ‘మన బీద దేశంలోనే ఇంత కొత్తగా ఉంటే, అమెరికాలాంటి గొప్ప దేశాలు ఇంకెలా ఉంటాయో’ అనిపించింది. విదేశాలకు వెళ్లాలన్న తపన తపస్సుగా మారింది. అదే ధ్యాసగాను, శ్వాసగానూ అలవడింది.
తన కరీర్ ని తీర్చిదిద్దుకోడానికి చాలా కష్టపడ్డాడు.
కాలేజీ కాంపస్ ఇంటర్వ్యూలో టాప్ పొజిషన్ కి సెలెక్ట్ అయ్యాడు. విదేశాలకి వెళ్లే అవకాశం సొంతం చేసుకున్నాడు.
***
అసలు విదేశాలనుండీ మనదేశానికి రావద్దనుకున్నాడు. కాని విధి అనేది ఒకటుంది కదా! అక్కడి సంస్థ మనదేశంలో ఒక ప్రాజెక్ట్ ను నిర్మించడానికి పూనుకుని దానికి ఇంచార్జ్ గా రాజారావ్ ను పంపింది. అది గనక సక్సెస్ చేస్తే అతను అందలం ఎక్కినట్టే. డబ్బూ, పొజీషన్, ఇతరత్రా ఫెసిలిటీస్ ఒక్కటనేమిటి? సమస్తం సొంతమవుతుంది. అరుదైన అవకాశం.
రాజారావ్ మన మట్టిమీద కాలు పెట్టాడు. విదేశాలకు వెళ్లినప్పటి నుంచి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నాడు. అయితే అతను నిర్మించబోయే ప్రాజెక్ట్ ఆ ఊరికి ఆనుకుని ఉండే అడవిలో నెలకొల్పాలి. దగ్గరుండి కన్ స్ట్రక్షన్ చూసుకోవాలి. ఊరివాళ్ల సహకారం ఉంటే ఎటువంటి, సమస్యలూ, అడ్దంకులూ లేకుండా సవ్యంగా సాగుతుంది. రాజారావ్ తెలివైన వాడవడం వల్ల ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు తన ఊరిలో, తన వాళ్లతో, ఊరివాళ్లతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. అది నరక సదృశమే కానీ తప్పదు. రేపటి బంగారు భవిత కోసం ఆమాత్రం భరించాలి.
రోజురోజుకీ ప్రగతిబాటలో కొత్తందాలు సంతరించుకునే సిటీ లెక్కడ? ఈసురో మంటూ ఎదుగూ బొదుగూ లేకుండా ఉండే ఈ పల్లెటూళ్లెక్కడ?
తల్లీ తండ్రీ, చెట్టంత ఎదిగి సుఖభోగాలతో మిసమిస లాడుతున్న కొడుకుని చూసి పొంగిపోయారు. తమ ఇంట్లో పుట్టవలసిన వాడు కాదని చేతుల్తో దిష్టి తీసి మెటికలు విరిచారు. అప్పటిదాకా తమని నిర్లక్ష్యం చేశాడన్న విషయమూ మరచిపోయారు.
తమింట్లో ఒక గదిని అన్నివసతులతో రాజారావ్ కి కేటాయించారు. తమ ఊరివాడు అంత గొప్ప స్థాయికి ఎదిగి, తిరిగి తమ ఊరికి ఒక గొప్ప పనిమీద రావడం, ఊరి వాళ్లకి చాలా ఆనందం కలిగించింది. సమయం దొరికినప్పుడల్లా అతని దగ్గరకి వచ్చి చిన్నప్పుడు అతనితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ ముచ్చటించసాగారు. రాజారావ్ కి కావలసింది కూడా అదే! తన ఉన్నతికి వాళ్లే మెట్లని మనసులో మురిసిపోసాగాడు.
ఆ ప్రాజెక్ట్ గనక పూర్తయితే చెట్లతో, చెఱువులతోవుండే ఆ అడవి పూర్తిగా ఆకారం కోల్పోతుంది.
***
పొద్దుటే లేచి జాగింగ్ కి బయల్దేరాడు.
తన ప్రాజెక్ట్ వైపుగా పరిగెత్తాడు. అక్కడికి చేరాక అడవిలోకి చిన్నగా నడకసాగించాడు. చుట్టూ పచ్చదనం. ఎన్నో రకాల చెట్లు, పూలు, రకరకాల పక్షుల కిలకిలరవాలు.. తన చిన్నప్పుడు అక్కడికి వచ్చాడో లేదో కూడా తెలియలేదు. మొట్టమొదటిసారి వచ్చినట్టు ఇప్పుడు మాత్రం విస్ఫారిత నేత్రాలతో ఆ అడవి అందాన్ని చూడసాగాడు. పైగా మంచు కురిసిందేమో. ఆ అందం ద్విగుణీకృతమైంది. ఇలాంటి అనుభూతి ఇప్పటిదాకా ఎన్ని దేశాలు తిరిగినా కలగలేదు. తను జూలో చూసే ఉడతలు, జామపళ్లు తినే చిలకలు, బాతులు, కొంగలు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించేసరికి మనసు, తనువూ రిఫ్రెష్ అయిన అనుభూతి.
మరుసటి రోజు నుంచి పేపర్ వర్క్ ప్రారంభించాడు. అంతేకాదు అన్నిరకాల క్లియరెన్స్ లు గవర్న మెంట్ నుండి వచ్చినా, చుట్టు పక్కలనున్న జనాలతో ఒక్కోసారి చాలా ఇబ్బంది వస్తుంది. దాన్ని అధిగమించాలంటే ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఎంతమందికి ఉపాధి లభిస్తుందో, జనజీవన విధానంలో ఎంత పురోగతి వస్తుందో మెల్ల మెల్లగా వాళ్ల మనసుల్లోకి మత్తుమందులా ఎక్కించాలి. ‘తన అదృష్టం కొద్దీ ఈ ప్రాజెక్ట్ తన ఊరి పక్కనే ఉంది. అందుచేత కాగల కార్యం వీళ్ల సహాయంతో తేలిగ్గా ముగించవచ్చు’ అనుకుని వాళ్లతో ఆ ప్రాజెక్ట్ విషయాలు కొద్ది కొద్దిగా పంచుకోవడం మొదలెట్టాడు.
ఒకనాడు మధ్యాహ్నం మూడుగంటలకి చిన్న నాగయ్యకి కడుపులో నొప్పి వచ్చి గిలగిల్లాడిపోసాగాడు.
అందరూ వాడిచుట్టూ ఆందోళనగా మూగారు.
వాళ్లతో సాన్నిహిత్యం కోసం తపిస్తున్న రాజారావ్ తన జీప్ బయటకి తీశాడు వాడిని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి.
అంతలో వచ్చాడు ఆ ఊరి వైద్యుడు జానకయ్య. చిన్న నాగయ్యని ఆపాదమస్తకం ఒకమారు చూసి, తన సంచిలోంచి కొన్ని మూలికలని తీసి నూరి అది వాడి చేత తినిపించాడు. పదంటే పదే నిముషాల్లో వాడు తేరుకున్నాడు.
‘అదే వాడిని ఆసుపత్రికి తీసుకెళ్లుంటే అడ్మిట్ చేసుకుని రకరకాల పరీక్షలు చేసి నానా హంగామా చేసేవాళ్లు’ రాజారావ్ మనసులో అనుకున్నాడు.
ఊరి వైద్యం ఇంత గొప్పగా ఉంటుందా? మొట్టమొదటిసారి అతని మనసులో ఒక ప్రశ్న. అదే ప్రశ్న అడిగాడు జానకయ్యని.
"బాబూ, మందులు, మందుల తయారీ సూత్రాలూ మాకూ తెలియకపోవచ్చు. కానీ ఏ రోగాన్ని ఎలా పసిగట్టాలి, ఏ రోగి శరిరానికి ఎలాంటి మందు వెయ్యాలీ అన్నది మా తాత ముత్తాతల కాలం నుండి మాకు అబ్బిన కళ. ఇది నాటు వైద్యం అని తీసిపారేస్తారు. ఒకరిద్దరు రోగం ముదిరి, పరిస్థితి విషమించి చనిపోతే ఇది గుడ్డి వైద్యం అయిపోతుందా? మీ వైద్యాలయాల్లో ఎన్నో సదుపాయాలు, ఎంతో మంది మనుషులూ ఉంటారు. అయినా, మీ ఆసుపత్రుల్లో ఎంతమంది చనిపోవడం లేదు. ఎక్కడైనా రోగికీ, వైద్యుడికీ మానసిక అనుబంధం ఉండాలి. అప్పుడే రోగికి ధైర్యం వస్తుంది. బతుకుతానన్న నమ్మకం కలుగుతుంది. పూటకో వైద్యుడు మారే మీ ఆసుపత్రులలో ఆ సంబంధం ఎక్కడుంటుంది? నేను చెప్పింది సావధానంగా ఆలోచించండి. మన ఉరికి దగ్గరున్న అడవిలో అనేక రకాల మూలికలు, ఆకులు, బెరళ్లూ ఉన్నాయి. అవన్నీ ఒక్కోవ్యాధికీ ఎంత అద్భుతంగా పనిచేస్తాయో తెలుసా? బహుశా మీ ఆసుపత్రుల్లో కూడా అంత మంచి వైద్యం దొరకదేమో? మా తాత ముత్తాతలు మాకు వాళ్ల అనుభవం ఉగ్గుపాలతో రంగరించారు. కానీ మమ్మల్ని నమ్మరు. ఎందుకంటే మాకు చదువులు లేవు, పట్టాలు లేవు. వంశపారంపర్యంగా సంక్రమించిన కళ ఉంది. అయినా ప్రభుత్వం మీ వైద్య విధానాన్ని ప్రోత్సహించినట్టుగా మమ్మల్నీ ప్రోత్సహిస్తే..ఎలాంటి వ్యాధులనైనా తగ్గించగలం."అన్నాడు దృఢంగా.
రాజారావ్ కు మొట్టమొదటిసారి అడవి మీద గౌరవం కలిగింది.
ఇంటికొచ్చినా ఆ వైద్యుడి ఆలోచనలు వెంటాడాయి. అన్నం తినేటప్పుడు తండ్రితో "నాన్నా, మన ఊరికి పక్కనున్న అడవి గురించి నాలుగు మాటలు చెప్పవూ.."అన్నాడు.
"ఆ అడవి గురించి ఎంత చెప్పినా తక్కువే. అది మనపాలిట కల్పవృక్షం. మన అవసరాలు తీర్చే తల్లిరా! ఒక్క మనకే కాదు సమస్త జంతుజాలానికి, క్రిమి కీటకాదులకీ ఆశ్రయమిస్తుంది. అడవిలో చెంచులూ, కోయలూ ఉంటారు. ఆ ప్రాణులతో వాళ్లది సహజీవనం. ఎవరు ఎవరికీ హాని చేసుకోరు. అది చాలదురా..ప్రకృతి గొప్పదనం చాటడానికి. వాళ్లు కుంకుళ్లు, రేగిపళ్లు, వెలక్కాయలు, ఒడుపుగా సేకరించిన తేనే తెచ్చి మాకు అమ్ముతారు. షాంపూలతో స్నానం చేసి అవేవో పిజ్జాల్లాంటివాటితో కడుపునింపుకునే వాళ్లకి వాటి విలువేం తెలుస్తుంది? ఇవన్నీ నాకెలా తెలుసనుకుంటున్నావా? మొన్నోసారి మన మండల ఆఫీసర్ పనుందని తనతో నన్ను పట్నం తీసుకెళ్లాడు. పట్నం అంటే అభివృద్ధి అంటారు కదా అని సరదాగా ఆయనతో వెళ్లి మొత్తం కలయ తిరిగాను. ఏవుందిరా అక్కడ? మంచినీళ్లు కూడా ఇచ్చేదిక్కు లేదు. పళ్లు, కూరగాయలు కొనుక్కోవాలి. మట్టి కనిపించని రోడ్లేశారు కానీ మోటారు బండ్లనుండీ వెలువడే పొగ మాటేమిటి? పైగా దొరికేవన్నీ కల్తీట! అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం మళ్లీ డాక్టర్లకి డబ్బు పెట్టడం. ఇంతేగా!
మేము చూడు ఎంత వయసొచ్చినా ఎలా చలాకీగా ఉంటామో, మీలో కుర్రకారు కూడా ఇలా ఉండరు. ఊరు ఊరంతా ఒక కుటుంబంలా ఉంటుంది. పండగలు, శుభకార్యాలకి అందరం ఒక్కటై జరుపుకుంటాం. మరి మీరు ఒంటికాయ సొంటికొమ్ములే కదా! పక్కవాడి పొడ గిట్టదు. పెద్దవాళ్లని అనాధ శరణాలయాల్లో, పిల్లల్ని హాస్టళ్లలో ఉంచి ఏకాకుల్లా బతికేస్తుంటారు. అదా జీవితం? మేమిలా ఉండడానికి ప్రకృతితో మమేకమైన జీవితవిధానమే కారణం. ఎప్పుడైతే మనిషి ప్రకృతి నుంచి తనని తను వేరు చేసుకుంటాడో వాడి గతి అధోగతే!
మనుషులకి ఇప్పుడు తెలివొచ్చి అడవుల పెంపకం, అభయారణ్యాల ఏర్పాటు చేస్తున్నారు. పాలిథీన్ బ్యాగులని నిషేదిస్తున్నారు. నిజంగా చెప్పు ఇవన్నీ చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే కదా! నష్టం జరిగిపోయాక కళ్లు తెరుచుకుని ఏం లాభం. సరే.. సరే..నువ్వు కడుపునిండా భోజనం చెయ్యి. అరగదన్న భయం అక్కర్లేదు. ఇక్కడి గాలి, నీరూ అన్నీ అవే చూసుకుంటాయి." అన్నాడు.
‘తండ్రి ఎంత చక్కగా చెప్పాడు. ఈయన్నా తను పామరుడు అనుకున్నది. తను ఇంత చదువు చదువుకుని విదేశాలు తిరిగి ఉఫయోగం ఏమిటి? వీళ్లు ప్రకృతి ఒడిలో మనిషి బతకడానికి కావాల్సిన పాఠాలు నేర్చుకున్నారు.’ రాజారావ్ ఆలోచనల్లో క్రమంగా మార్పు చోటు చేసుకుంటోంది.
మరుసటి రోజు " నాన్నా, ఇవాళ నీతో నేనూ పొలానికి వస్తాను."అన్నాడు.
"అలాగే"అన్నాడు.
పొలంలో తండ్రి మందులు చల్లుతుంటే తండ్రి పక్కగా నడుస్తూ "నాన్నా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుశా? అన్నాడు.
"తెలుసు, ఆ అడవిని పెళ్లగించేసి..అక్కడేదో కడ్తారట..నువ్వు అందుకే వచ్చుంటావు"
రాజారావ్ ఆశ్చర్యపోయాడు.
"మరి అది తెలిసి..మీరు ఇంత నిదానంగా.."
"ఏంచేయమంటావు? మనం ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వ నిర్ణయం. కాదని గొడవలు చేస్తే కాల్పులు, రక్తపాతాలు, ప్రాణాలు కోల్పోవడం అందుకే మా నిర్లిప్తత"
మొదటిసారి రాజారావ్ కళ్లలో చెమ్మ.
"కూర్చున్న కొమ్మని నరుక్కోవడం అభివృద్ధి ఎన్నటికీ కాదు. ఇప్పటికే ప్రకృతి సమతుల్యత కాపాడే అనేక జంతు, పక్షి, వృక్షజాతులు నశించాయి. ఆయా భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు సహజ సిద్ధంగా ఏర్పడిన అడవుల్ని మన స్వార్థం కోసం నాశనం చేసి, తర్వాత తాపీగా తప్పుతెలుసుకుని కృత్రిమంగా అడవుల్నిఏర్పాటు చేసుకున్నా, నశించిపోయిన జీవజాలాన్ని తిరిగి తెచ్చుకోలేం. మట్టి కనిపించకుండా రోడ్లేసుకుని శుభ్రంగా ఉన్నామనుకుంటే ఎట్లా?, మట్టిలేకపోతే మొక్కలేదు, వ్యవసాయం లేదు, తిండి ఉండదు. ఇది అందరూ తెలుసుకోవాలి."అన్నాడు.
పల్లెటూళ్లో ఉండే తండ్రి జ్ఞానం ముందు తనదెంత? దేశాలు తిరగడం కాదు కావలసింది మనిషికి. అనుభవం.
"మనిషి బతకడానికి ఏం కావాలి? స్వచ్ఛమైన తిండి, నీరు, కట్టుకోవడానికి బట్ట ఇంతేగా? మరి అప్రతిహతంగా ఊరుతున్న కోర్కెలు వాటిని తీర్చుకునేందుకు జీవనమాధుర్యం కోల్పోవడం అవసరమా? నువ్వు పుట్టినప్పటినుండీ నేను ఇక్కడే ఇలాగే ఉన్నాను. ఆనందంగా లేనా? రెక్కలొచ్చిన పక్షి ఎక్కడెక్కడ ఎంత తిరిగినా మళ్లీ చెటుమీదకి రావలసిందే. కానీ మనిషి స్వార్థజీవి. వెళ్లిపోవడమే తప్ప మళ్లీ రాడు. అది సరికాదు"అన్నాడు భారంగా నిట్టూరుస్తూ.
నిజమే! ఓజోన్ కి పడిన చిల్లు పెద్దదవుతోందని, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, ఋతువులు వాటి అస్తిత్వాన్ని కోల్పోతున్నాయని ప్రంపంచ వ్యాప్తంగా సదస్సులు పెట్టి ఘోషిస్తుంటారు. కేవలం మానవాళి మనుగడ ప్రమాదకరంగా మారిందనే బాధ. కాని వాతావరనంలోని మార్పులవల్ల, కలుషితం వల్ల చెట్లకి, జంతువులకి, పక్షులకీ ఎంత క్షోభో ఆలోచించం. మనమైతే ముక్కుకి, మూతికి మాస్క్ లు కట్టుకుంటాం, పరిశుభ్రమైన ఆహారాన్నీ, నీటినీ తీసుకుంటాం..మరి పాపం ఇతర జీవరాశులు? వాటి గురించి అసలు ఆలోచించరేం.
ఎక్కడో బయటి దేశంలోని సంస్థ అన్ని దేశాల్లో వేళ్లూనుకోవాలని..ఆయా దేశ వనరులని ఛిన్నాభిన్నం చేసేస్తే..ఇంక మనిషి మనుగడ ఎలా సాధ్యమవుతుంది? ప్రకృతిని పరిరక్షించాలన్నదాన్ని ఒక నినాదంగా కాగితాలకి పరిమితం చేస్తే రాబోయే తరాలకు భవిష్యత్తు ఏది? ఇప్పటికే జంతువులని జూల్లో చూస్తున్న మనం ఇహ ముందు, మట్టిని, నీటిని, గాలినీ కూడా అలాగే చూడాలేమో? లేదు అలా జరకకూడదు. అభివృద్ధి ముసుగులో మనిషి ఆలోచనలు వెర్రితలలు వేయకూడదు. రేపటి తరానికి స్వచ్ఛమైన ఈ భూతలాన్ని పరిరక్షించి కానుకగా ఇవ్వాలి.
"నాన్నా..నేను రేపే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. మన అడవి తల్లిని కాపాడుకుందాం."
"నాకు తెలుసు రాజా, నీ గుండెల్లో ఇంకా తడి ఉంది. ఈ నేల మీద అడుగెట్టి, ఇక్కడి నీళ్లు తాగి, గాలి పీల్చిన వాళ్లు దీనికి ద్రోహం చేయలేరు. నీలో మార్పు వస్తుందని నాకు తెలుసు. నువ్వు గాక ఎవరు వచ్చినా ఈ నేలకు అన్యాయం జరిగేది. అందుకే భగవంతుడు నువ్వు మమ్మల్ని మర్చిపోయినా నిన్ను ఇక్కడికే పంపించాడు."అన్నాడు నవ్వుతూ.
"నిజమే నాన్నా! ఎండమావుల్ని చూసి పరిగెత్తి పరిగెత్తీ అలసిపోయాను ఈ ఊరి ఒడే నన్ను కన్న తల్లిలా సేదదీర్చాలి"అన్నాడు.
***
No comments:
Post a Comment