అడివి శాంతిశ్రీ-రచన శ్రీ అడివి బాపిరాజు( 1895-1952)
పరిచయం : ఓలేటి శశికళ
చారిత్రక నవల లనగానే కోటలు, సార్వభౌములు, రాచరికాలు, అంతఃపురాలు, రాజకీయ కుతంత్రాలు నేపధ్యంలో ఒకింత గంభీరంగా సాగిపోతాయని చదవడానికి చిన్నమీమాంస .వాటికి భిన్నంగా ఆసాంతం ఉత్కంఠ భరితంగా, సౌందర్యపూరితంగా , కళాత్మకంగా, చారిత్రాత్మకంగా రూపొందించి , చరిత్ర, జీవితం కలిపి కలనేత చేసి, ఆద్యంతం రసభరితం చేయగల సాహితీ మేధావి శ్రీ అడివి బాపిరాజు గారు. అలా ప్రభావితురాలై, నేను పదే పదే చదివిన నవల “ అడివి శాంతిశ్రీ”. దీనికి ముందు అడివి బాపిరాజుగారి గురించి క్లుప్త పరిచయం. “ అతడు గీసిన గీత బొమ్మై, అతడు పలికిన మాట పాటై, అతని హృదయము లోన మొత్తన అర్ధవత్ కృతియై, అతడు చూసిన చూపు మెరుపై, అతడు తలచిన తలపు వెలుగై, అతని జీవిక లోని తియ్యని అమృత రస ధునియై………… ఇదీ విశ్వనాధ వారి పలుకులలో బాపిరాజు గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కధకుడు, గాయకుడు, చిత్రకారుడు, నాట్యకారుడు, కళాదర్శకుడు, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర సమర యోధుడు, బహు భాషా కోవిదుడు. ఆంధ్ర-తెలంగాణాలకు సాహిత్య వారధిగా నిలిచిన వాడు. ఎల్లలు లేని ప్రతిభావంతుడు. జీవితంలో కష్టసుఖాలను పడుగు పేకగా అనుభవించిన వాడు. భావ స్వేఛ్ఛాజీవి. దేశ,కాల, పరిస్థితుల చట్రంలో ఇమడని కవీంద్రుడు. ఆంధ్రా రవీంద్రనాధ్ టాగూర్ అనబడ్డ కళా ప్రపూర్ణు డాయన. చరిత్ర లోతుల్లోకి వెళ్ళి , ఆంధ్రుల చరిత్రకు అక్షర రూపమిచ్చిన రూప శిల్పిఆయన. అందుకే ఆయన “ చారిత్రక నవలా చక్రవర్తి “ అన దగ్గవారు. ఆయన చారిత్రక నవలల్లో 5 ఆణిముత్యాలు. హిమబిందు- ఆంధ్ర శాతవాహనుల ప్రధమ చరిత్ర అడివి శాంతిశ్రీ-శాతవాహనుల అంతిమ దశ, ఇక్ష్వాకుల కాలం అంశుమతి- చాళుక్యుల చరిత్ర గోన గన్నారెడ్డి- కాకతీయ వైభవం మధుర వాణి- తంజావూరు నాయక రాజుల జీవిత చిత్రం. వీటి ద్వారా తెలుగు వారి చారిత్రిక వైభవాన్ని, ఘనతను ఆవిష్కరింప చేసారు. చారిత్రిక నవలా రచనలో వీరి శైలి అద్భుతం. చరిత్రకు ప్రత్యక్షసాక్షిలా మన కళ్ళకు కట్టిపడేస్తారు. ఆంధ్ర శాతవాహన పాలకుల అవసాన దశని కధావస్తువుగా తీసుకుని, దానిలోరాజకీయం, యుద్ధతంత్రం, అన్ని తరగతుల ప్రజాజీవితం, అంతఃపుర రాణీవాసం, జానపద జీవన వైవిధ్యం, దేశభక్తి, బౌధ్ధమత స్వర్ణయుగం, హైందవ ధర్మ పునరుద్ధరణా యత్నం, సంఘ మర్యాదలు, రాచరిక ధోరణులు ………సమ్మిళితం చేసి, అంతర్వాహిలా సాగిపోయే శృంగార రస భరిత, అపూర్వ యవ్వన హృదయ ప్రేమ కావ్యంగా మలచడం ఆయనకే సాధ్యమయ్యింది. కధా నేపధ్యమంతా ఆంధ్ర, కళింగ, నైసర్గిక ప్రాంతం. శాతవాహన ఘన విశాల సామ్రాజ్యం. వారి రాజధాని కృష్ణా జల పునీత, సస్యశ్యమల క్షేత్ర పులకిత, మహైశ్వర్య భోగిత ధాన్యకటకం. విజయపురి, పూగీ దేశం, అమరావతి, నాగార్జున కొండ……మనకు పరిచయ స్ధలాలే. కధకు నాందిగా కృష్ణా తరంగిణీ ప్రశంస చేస్తారు కవి. “ఏనాటి కాంతవు! యుగయుగాల నుండి గంభీరంగా ప్రవహిస్తున్నావు నువ్వు. గంగా సింధు యమునాబ్రహ్మపుత్రలు నీకు కడగొట్టు చెల్లెళ్ళు. నీవూ, గోదావరి కవల పిల్లలు. నీవే జంబూనదివి. నీ ఇసుకలో బంగారు కణికలు, బంగారు రజను మిలమిల మెరసిపోయేది. ఈనాటికి నీ తీరాన స్వర్ణగిరి నిలిచి ఉంది. బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకొన్నవి. నీ గంభీరగర్భములో జగమెరుగని వజ్రాలు రత్నాలు నిదురిస్తున్నవి. నీది రతనాలబొజ్జ.
No comments:
Post a Comment