అమ్మ ఒడి - అచ్చంగా తెలుగు

అమ్మ ఒడి

Share This

అమ్మ ఒడి

డా . నీరజ అమరవాది .


కమలాకర్ కి జీవితం ఈ మధ్య వెళ్లే ఆసుపత్రి వచ్చే ఆసుపత్రిగా గడిచిపోతోంది . రెండేళ్ల క్రితం కమలాకర్ తల్లి కాలం చేసింది . ఆ తరువాత పెద్దతనంలో తండ్రి శేషయ్య ఒక్కడే గ్రామంలో ఎందుకని , కొడుకుగా తండ్రిని చూసుకోవటం బాధ్యతగా భావించి తనతో పాటు హైదరాబాదు కు తెచ్చుకున్నాడు . అలా రావటం శేషయ్యకి ఏ మాత్రం ఇష్టం లేదు . ఉన్న మూడెకరాల పొలం అంటే శేషయ్యకు ప్రాణం . సొంత వ్యవసాయం తో ఆ పొలం పై వచ్చిన ఆదాయం తోనే , ఇల్లుగడిచింది . కమలాకర్ కి కావలసిన చదువు చెప్పించాడు . మంచి ఉద్యోగం వచ్చింది . కమలాకరానికి ఇప్పుడు పొలం పని అంటే చాకిరి ఎక్కువ , ఆదాయం తక్కువ అనిపించింది . తండ్రికి ఇష్టం లేకపోయినా పొలాన్ని ఎవరికో కౌలు కిచ్చి పట్నం తీసుకు వచ్చాడు .
శేషయ్యని కోడలు వనజ ఏ లోపం లేకుండా చూసుకుంటోంది . శేషయ్యకి ఏ రకమైన ఇబ్బంది లేదు . కాని ఒకరోజు ఉన్నటుండి కళ్లు తిరిగి పడిపోయాడు . డాక్టర్ కి చూపిస్తే హై బి.పి అని చెప్పారు . మరి కొన్ని రోజులకి షుగరు కూడా వచ్చింది . శేషయ్య ఆందోళన పడతాడని , కమలాకర్ వాళ్ల నాన్నతో “ డెభ్భై ఏళ్లు వస్తే ఈ రోజుల్లో బి.పి , షుగరు సర్వసామాన్యం “ అంటూ సర్ధి చెప్పాడు . ఆ తరువాత కొన్ని రోజులకి కడుపులో నొప్పి అంటే ఆసుపత్రికి తీసుకెళ్తే పొట్టలో గాస్ వల్ల నొప్పి వచ్చిందని మందులు రాసి ఇచ్చారు . అలా శేషయ్య గారికి నెలకో కొత్త రకం ఇబ్బంది రావటం , హడావిడిగా ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణాలు , రకరకాల స్కానింగ్ లతో మంచి నీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు అవుతున్నా, ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు . ఒకపక్క కమలాకర్ కి తండ్రిని గ్రామం నుండి తీసుకొచ్చి తప్పుచేశానా ! అని ఆలోచించాల్సి వస్తోంది . మరోపక్క బంధువులు , స్నేహితులు , చుట్టుపక్కల వాళ్లంతా , ఈ రోజుల్లో వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు కమలాకర్ ‘ ఆదర్శనీయం ‘ అంటూ పొగుడుతుంటే అవుననాలో , కాదనాలో అర్థం కావడం లేదు . కొత్తగా ఈ మధ్య కమలాకర్ కి వాళ్ల నాన్నతో మాట్లాడుతుంటే ఎవరో అపరిచుతుడితో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతోంది . భార్య వనజతో ఈ మాటే అంటే , అవును... అప్పుడప్పుడు, మామగారిలో కొద్దిగా మతిమరపు అదే ‘ అల్జీమర్స్ ‘ లక్షణాలు కనిపిస్తున్నాయండీ ! మీరు గమనించారో లేదో అంటూ మరో బాంబు పేల్చింది .
కమలాకర్ తనలో తానే తండ్రి ఆరోగ్యం గూర్చి మధనపడుతుంటే , అది గమనించిన దగ్గర స్నేహితుడు ఒకరు “నాకు తెలిసిన ప్రకృతివైద్యశాల ఉందని , అందులో ముఖ్యంగా పెద్దవారికి మంచి వైద్యం అందిస్తున్నారని , అక్కడి డాక్టర్లు దేశవిదేశాలలో కూడా గొప్ప పేరు గలవారని “ చెప్పాడు . వెంటనే అపాయింట్ మెంట్ తీసుకొని , కమలాకర్ ఆ ఆసుపత్రికి వెళ్లి ముందుగా తన తండ్రి ఆరోగ్యంలో ఈ రెండుమూడేళ్లలో వచ్చిన మార్పులను తెలియజేశాడు . వాళ్లు పేషంట్ ని తీసుకు రండి . ఆయనను మామూలు మనిషిని చేసే బాధ్యత మాది అని చెప్పారు . శేషయ్యని తీసుకొని వెళ్లాడు . అంతకు ముందు చేసిన అన్ని రకాల పరీక్షల రిపోర్టులు చూసి , ఒక మూడు నెలలు రోగిని తమ ఆసుపత్రిలో ఉంచాలని చెప్పారు . దానికి ఖర్చు ఎంతవుతుందో ! అని కమలాకర్ ఆలోచించేలోపే ….. డాక్టరు గారు ‘ ఫీజు మీకు అందుబాటులోనే ఉంటుంది . ఆ ఫీజు కూడా ఇప్పుడే అవసరం లేదు . మీరు మా మీద నమ్మకంతో పేషంట్ ని ఇక్కడ వదిలేసి వెళ్లండి . కావాలంటే వారానికోరోజు చూడడానికి రావచ్చు’ అని చెప్పారు . ఆ విధంగా శేషయ్యని ప్రకృతి వైద్యశాలలో వదిలి కమలాకర్ ఇంటికి వచ్చాడు .
ఇంటికి వచ్చిన కమలాకర్ కి మనసు మనసులో లేదు . ఊహ తెలిసినప్పటి నుండి పనిపాటలతో , పదిమందికి తలలో నాలుకలా తిరిగే తండ్రే తెలుసు . తండ్రికి విశ్రాంతి నిచ్చి , ప్రశాంతంగా చూద్దామనుకుంటే మనశ్శాంతే కరువైందని బాధ పడ్డాడు . వారం రోజులు గిర్రున తిరిగిపోయాయి . శేషయ్యని చూడడానికి కమలాకర్ ఆసుపత్రికి వెళ్లాడు . ఆయన ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించాడు . డాక్టర్ల ఆదేశాల ప్రకారం కమలాకర్ మామూలుగా పలకరించి వచ్చేశాడు . మరో వారం గడిచిపోయింది . ఈసారి శేషయ్య ఆనందంగా అటూ ఇటూ తిరుగుతూ కమలాకర్ కి కనిపించాడు . కమలాకర్ దూరం నుండే చూసి వచ్చేశాడు . చకచకా మూడునెలలు గడిచిపోయాయి . కమలాకర్ తండ్రిని ఇంటికి తెచ్చుకోవడానికి ఉబలాటపడుతున్నాడు . ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లని కలిసి , తండ్రి ఆరోగ్యం గురించి అడిగాడు . డాక్టరుగారు మీ తండ్రి అనారోగ్యానికి కారణం మీరే అనిచెప్పారు . కమలాకర్ అర్థంకానట్లు చూశాడు . డాక్టరు గారు నవ్వుతూ , చేప నీటిలో ఉంటేనే చలాకీగా ఉంటుంది . నీటిలో ఉన్నా , జలుబూ , దగ్గూలాంటి జబ్బులూ దాని దరి చేరవు . పైగా ఆ జలచరాల వల్లే నీరు స్వచ్ఛంగా ఉంటుంది . అలాగే మీ నాన్నగారి లాంటి వ్యవసాయదారులు దేశానికి వెన్నెముకలు . మీరు ఆయనకి విశ్రాంతినివ్వాలని పట్నం తీసుకువచ్చారు . కాని ఆయన మనసు అక్కడే ఉంది . ఇన్నాళ్లు దంపుడు బియ్యం , జొన్న అన్నం , రాగిసంకటి తిన్న మీ నాన్న గారికి మీరు ప్రేమ గా పెట్టే పాలిష్ బియ్యంతో వండిన అన్నం అరగటం లేదు . వ్యవసాయదారులకు పొలం పనులే వ్యాయామం . ఇక్కడికి రావడంతో శారీరిక శ్రమ తగ్గిపోయింది . మనిషికి బంధువులు , స్నేహితులు ఆక్సిజన్ లాంటివారు . ఆయన పల్లెలో పదిమందితో కష్టసుఖాలు పంచుకుంటూ , చేదోడువాదోడు గా బతికారు . మీరు ఇక్కడ అపార్టమెంటులో ఒక రకంగా పంజంరంలాంటి ఇంట్లో బంధిస్తే ఆయన మనసు , మాట మూగబోయింది . వాటన్నిటి పర్యవసానమే ఈ ఆరోగ్యసమస్యలు అని చెప్పారు .
అన్నీ విన్న కమలాకర్ దీనికి పరిష్కారమేమిటని అడిగాడు . దానికి డాక్టరు గారు “ నేను కొంచం సేపు డాక్టరుగా కాక మామూలు మనిషిగా మాట్లాడాలనుకొంటున్నాను అంటూ ఇలా మొదలు పెట్టారు . రైతన్నలే దేశానికి అన్నదాతలు . చాలా మంది రైతు బిడ్డలు వ్యవసాయాన్ని కాదని, రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు . దానికి వారి కారణాలు వారికున్నాయి . వ్యవసాయం పై ఆసక్తి ఉన్న మీ నాన్నగారి లాంటి వారిని , చదువుకున్న మీలాంటి వారు పట్టణలకి తీసుకువస్తే , పల్లెలు కూడా రోగగ్రస్థమవుతాయి . పల్లెలలో వ్యవసాయం చేసేవారు లేక , వ్యవసాయభూములలో వ్యాపారసముదాయాలు వెలుస్తున్నాయి . పదిమంది ఆకలిని తీర్చే అన్నదాతలు కనుమరుగైతే , పిడికెడు బియ్యం కోసం పరాయిదేశాలకు సలాం చేస్తూ , వారి లాభాలకు మనదేశాన్ని తాకట్టు పెట్టి , వాళ్ల కు బానిసలుగా బతకాల్సి వస్తుంది . ఒక రకంగా స్వతంత్రభారతంలో ఆధునిక వెట్టి చాకిరి అనవచ్చు .
డాక్టర్లు వ్యాధులు రాకుండా చేయలేరు . రోగులకు వైద్య సహాయాన్ని మాత్రమే అందించగలరు . అదే రైతన్నలు అన్నపూర్ణలాగా దేశ ప్రజల ఆకలిని తీర్చటమేకాక, పచ్చని పంటల తో , పైరగాలులతో , మంచి ఆరోగ్యానికి ఇతోధికంగా సాయపడతారు . సకాలంలో వర్షాలు పడేట్లు చేసి దాహార్తిని తీరుస్తారు . వారు ప్రకృతి మాత ప్రియపుత్రులు . దేశ ప్రజల ఆనందం ,ఆరోగ్యం, ఐశ్వర్యం అంతా పల్లెలలో , అక్కడి అమ్మలాంటి చల్లని ప్రకృతి ఒడిలో నిక్షిప్తమై ఉంటుంది . అలాంటి పల్లెకారుల జీవితాలను మీ లాగా చదువుకొన్న , నాగరికులే వ్యాధులపాలు చేస్తూ , ప్రకృతి మాతకి గర్భశోకాన్ని మిగులుస్తున్నారు అంటే తాను కూర్చొన్న కొమ్మని తానే నరుక్కున్నట్లు అంటూ “ తన ప్రసంగాన్ని ముగించాడు .
అంతా విన్న కమలాకర్ కి తండ్రిని పట్నం తీసుకొచ్చి , తండ్రి అనారోగ్యానికి కారణం కావడమేకాక , పరోక్షంగా రాబోయే తరానికి ఆకలి మంటలు మిగులుస్తున్నానేమో అన్న ఆలోచనలో పడ్డాడు . తండ్రిని తిరిగి పల్లెకి తీసికెళ్తూ , తోటివారికి పల్లెల గొప్పదనాన్ని చెప్పి , ఎంత చదువుకున్నా ఇంటికొకరు వ్యవసాయాన్ని వృత్తి గా స్వీకరించి , పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చాడు . ఆ విధంగా తల్లి రుణాన్ని కొంత వరకైనా తీర్చుకోవచ్చని సందేశాన్ని అందించాడు . సొంత గూటికి చేరిన శేషయ్య ‘ అమ్మ ఒడిని ‘ చేరిన పిల్లాడిలా సంబరపడ్డాడు .
**************

No comments:

Post a Comment

Pages