అమ్మకు ప్రేమతో! - అచ్చంగా తెలుగు

అమ్మకు ప్రేమతో!

Share This

అమ్మకు ప్రేమతో!

  సి.ఉమాదేవి


“నాన్నా,బిజీగా ఉన్నారా? ”మా అబ్బాయి ప్రశ్నతో అవును,లేదు అని చెప్పవచ్చుకాని కాని వాడికి కావలసిన సమాధానం మాత్రం అవుననే మాటేనని నాకు తెలుసు.
‘ ఏం సుత్తికొడతాడో ’అనుకుని లేదులే కాని అంటూ ఏమిటన్నట్టు చూసాను.
“ ఏంలేదూ.....ఊ ”దీర్ఘం పెంచాడు.
“ ఏదో అడగాలని ఏమీలేదంటావేం?దీర్ఘాలు తీయకుండా చెప్పు,నాకవతల పని ఉంది.”
“మీరు అంతే, ఏం పనిలేదు అంటూనే పనుందంటారు.”
నాకు నవ్వాగలేదు.
“అబ్బ సరేరా, మాటలు పెంచడంలో నువ్వు నా పోలికే.” అంటూ మా అబ్బాయి దగ్గరగా కుర్చీ లాక్కుని కూచున్నాను.
హమ్మయ్య నాన్న దొరికాడన్న ఆనందం వాడి కళ్లలో నిండుగా తొణికిసలాడుతోంది.
“ నాన్నా,నాదొక చిన్న కోరిక తీరుస్తారా?”
దేవుడి ముందు మోకరిల్లిన భక్తుడిలా మా వాడి కోరికల చిట్టాలో ఇది దేనికి సంబంధించిందోకాని జేబు మాత్రం కాస్త ఉలిక్కిపడ్డం వాస్తవమే.
వంటగదిలో పోపు వాసన వస్తోందంటే అమ్మ వంటిల్లు వదలి ఇప్పట్లో రాదనుకున్నాడేమో చూపును వంటింటి దాకా ప్రసరించినవాడు ధీమాగా సర్దుకున్నాడు.
‘మాటకు మాటే జవాబుగా వస్తుంది ’ ఎందుకులే అనుకుని వినడానికి సిద్ధమన్నట్లు ముందుకు వంగాను.
“ నాన్నా మనం  సెలవులలో ఎక్కడికి వెళ్లాలో చెప్తుంటావు కదా,మరి సెలవులు ప్రారంభమై నాలుగు రోజులైనా ఏమీ మాట్లాడటం లేదు.ఇప్పటికే మా స్నేహితులంతా తయారయిపోతున్నారు.”
“ఎక్కడికి? ” అనుకోకుండా అడిగేసాను.
“ ఎక్కడికేంటి నాన్నా ఎవరికి నచ్చిన చోటికి వారు.”
“ మరి నీకు నచ్చినచోటు.” కుతూహలంగా అడిగాను.
“ నాకంటే నాకని కాదు, అమ్మకు నచ్చిన చోటు.” వంటింట్లోకి తొంగి చూస్తూ అన్నాడు.
“ అమ్మకు నచ్చిన చోటా,ఏముంటుంది వంటిల్లే కదా.”నవ్వాను.
“జోక్ కాదు నాన్నా,నేను నిజంగా చెప్తున్నాను.ఈసారి మాత్రం అమ్మకు నచ్చిన చోటుకే వెళ్లాలి.”
నా మనసు కలవరానికి లోనవుతోంది.గతం తాలూకు జ్ఞాపకాలు కలతపరుస్తాయో లేక నాటి అనుభవాల అనుభూతులు పలకరిస్తాయో.ఇల్లాలి సున్నిత మనసు పలికే భాష్యమేమిటో!
ఆలోచనలో పడ్డనన్ను పట్టుకుని కుదిపాడు మా అబ్బాయి.
వంటింట్లోనుండి రెండు కప్పులనిండా టమాటొ సూప్ తీసుకుని వచ్చింది మా శ్రీమతి చందన.
“ ఏం చందనా, కొడుకుద్వారా కాగలకార్యం.....”.నా మాటలకు అడ్డం వచ్చింది సూప్ టీపాయ్ మీదపెట్తూ.
“ ఏమిటి కథ, ఇద్దరు ఏదో గూడుపుఠాణీ చేస్తున్నట్లున్నారు,ఇంతకీ నా పేరు వాడుకోవడం అభ్యంతరం అధ్యక్షా! ” అంది కొడుకు వంక అనుమానంగా చూస్తూ.
“ అమ్మా మీరు అరకులోనున్నప్పుడు తాతయ్యా టమాటాలు కూడా  పండించేవారటకదా?”టమాటా సూప్ రుచి చూస్తూ అడిగాడు.
చందన ముఖంలో వెలుగు మెరుపులా వచ్చి అంతలోనే మాయమయిపోయింది.
“ ఏమ్మా?”మా వాడు చెప్పమన్నట్లు చూసాడు.
“ అవును బాబు,ఒక్క టమాటోలేనా,బఠానీలు,కాకర,బీర,బీన్స్,క్యారెట్,ముల్లంగి,క్యాబేజి,కాలీఫ్లవర్......”
“ అమ్మా రైతు బజార్ లోని కూరగాయల పట్టిక చదువుతున్నావా?”అంటూ మా వాడు నన్ను చూసి కన్ను గీటాడు.
అంటే దానర్థం వాడు అడిగిన కోరికతీరే దిశగా పావులు కదపమని. నిజమే నేటి బాల్యం కోల్పోతున్న అద్భుత క్షణాలు ప్రకృతి ఆరాధన.
వాళ్ల అమ్మనెలాగైనా అరకు తీసుకెళ్లాలనుకున్న వాడి ఆలోచన చెట్టును బలంగా పట్టుకున్న వేరులా బిగుసుకుంటోంది. నిజమే,అమ్మ,నాన్నల స్మృతులతో విలవిలలాడుతుందనుకుని అరకు ప్రయాణం మనసుకైనా దరిచేరకుండా విభిన్న ప్రాంతాలకు వెళ్లేవాళ్లం అంతేకాని అరకు మాత్రం వెళ్లేవాళ్లం కాదు.
“ ఈసారి అరకు వెళ్దాం చందనా,రైల్లోనా,బస్సులోనా అన్నది నీ ఇష్టం.” క్లుప్తంగా నేననుకున్నది ఠకీమని చెప్పి సమాధానం కోసం చూస్తున్నాను.
“ ప్లీజ్ అమ్మా,ఒక్కసారి నాకు కూడా అరకులోయ చూడాలని ఆశగా ఉంది.తాతయ్య,అమ్మమ్మ తిరిగిన చోటులో నన్నూ ఒకసారి నడవనీమ్మా.”
ఈ మాట బాగా పని చేసిందేమో,మా ఆవిడ కళ్లల్లో జ్ఞాపకాల కన్నీరు కమ్ముకుంటున్నా సరేనన్నట్లుగా తల ఊపింది.
ఎలా వెళ్లాలన్నది మొదటి ప్రశ్న.
“ వెళ్లేటపుడు  బస్సులో,వచ్చేటపుడు రైల్లో సరేనా? ” పొదువుకున్న జ్ఞాపకాలను అన్నింటా వెతుక్కుంటూ పోవాలని చందన ఆశపడుతున్నట్టుంది.వెళ్దామంటే సరేననడమే గొప్పవరం.వెంటనే అంగీకారంగా తలలు జోరుగా ఊపేశాము తండ్రికొడుకులిద్దరము.
ఆ పైన  టికెట్లు బుక్ చేసుకోవడం, బట్టలు సర్దుకోవడం.వెళ్తున్నది ఫిబ్రవరి మాసమైనా చలి ఉండేఉంటుందనుకుని కావాల్సిన శాలువాలు,స్వెటర్లు వగైరా వీటితో రెండు రెండు సూట్ కేసులు నిండిపోయాయి.
ప్రయాణం రోజు రానే వచ్చింది.  చక్కని ప్రాంతానికి వెళ్తున్నామనే ఆనందం నాలో,తాతయ్య,అమ్మమ్మలతో, అమ్మ తన అందమైన బాల్యం గడిపిన చోటు చూడబోతున్నానే ఆనందం మా వాడి చేతలలో,మాటలలో! జ్ఞాపకాల జ్ఞాపికను రుద్ది మరీ పదును పెట్టుకుంటోంది చందన.తల్లి కొడుకుల మాటలలో పది మాటలకు తొమ్మిది మాటలు అరకులోయ గురించే.
“ అన్నీ కథల్లా ఇప్పుడే చెప్పేస్తే ఎలా చందనా?అక్కడ అన్ని విశేషాలు దగ్గరుండి చూపించి మరీ చెప్పుదువుకాని ” అని నేనంటే,
 “ చెప్పనీ నాన్నా మరీ ఏమీ తెలుసుకోకుండా ఎలా వెళ్తాం?”అన్నాడు.
నిజమే ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా అక్కడి చరిత్ర,భౌగోళిక పరిస్థితులు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించే వెళ్లేవాళ్లం.నేను వారి కబుర్లలో శ్రోతనయ్యాను.
చందన తండ్రి గురించి చెప్పినపుడల్లా ఆ విషయం ఏదో ఒక చెట్టుతోనే ముడిపడేది.
హైద్రాబాద్ నుండి విశాఖపట్నం చేరి ఆ రోజుకు ఓ హోటల్ లో విశ్రాంతి తీసుకుని సాయంత్రం రామక్రిష్ణా బీచ్ కు వెళ్లాం.అలలు తాకిన పాదాలను ఆప్యాయంగా చూసుకుంటూ నడుస్తున్నాడు మా వాడు.
కొడుకు చెయ్యిని ఆప్యాయంగా పొదువుకుని అరకు నామ స్మరణ చేస్తోంది చందన.
మితిమీరిన ఆ ఉత్సాహాన్ని చూస్తుంటే ఆ నాడు చిన్నప్పుడు చందన ఇలాగే మాటల పరుగులు పెట్టేదేమో అని నవ్వుకున్నాను.
“ ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు?”
“ రేపటి ప్రయాణంలో నీ తకథిమి ఎలా ఉంటుందోనని..”.
“ సరేలెండి,మరి మన ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే ఎలా!” బుంగమూతి పెట్టి నవ్వింది.
చేతులు చాచి పిలుస్తున్న ప్రకృతిమాత ఒడిలో తులతూగడానికి  ఉదయాన్నేఅందరం రెట్టించిన ఉత్సాహంతో గబగబా తయారయాం.
బస్టాండ్ లో మాలాగే అరకు చూడాలన్న ఆనందంతో వేచి ఉన్న ప్రయాణీకులను చూస్తే సంబరమనిపించింది.
అందరం బస్సెక్కాం.అందరి చేతిలో  కాలక్షేపం బఠానీలు.దానికి జతగా చందన చెపుతున్నఅరకు వర్ణనలు.
“ అమ్మా మనం ఎంత దూరం వెళ్లాక ఘాట్ రోడ్ మొదలవుతుంది?”
“ఎక్కడ బాబు, మనం బయలు దేరి పది నిమిషాలు కాలేదు.దాదాపు గంటన్నర పైగా వెళ్లాలి.సముద్రమట్టానికి ఎంతో ఎత్తునున్న అరకులోయ చేరాలంటే  కొండను తొలిచి వేసిన ఘాట్ రోడ్ ఎక్కాల్సిందే.ఆ నాడు కేవలం బస్సులే. ఒకటి టపాల్ బస్సు,మరొకటి రాందాస్ ట్రాన్స్ పోర్టు బస్సు.దాదాపు గంట పైగా ప్రయాణిస్తేగాని అరకు అందాలను ఆస్వాదించలేము.” మా వాడిలో ఘాట్ రోడ్ ఎక్కాలన్న తొందర!
బస్సు అలుపెరగక పరుగులు తీస్తూనే ఉంది.
“ చుట్టు  ఉన్న చిన్న చిన్న ఇండ్లు నేడు భవనాలయాయి.చెట్లున్నా అప్పటిలా వన విహారంలా లేదు.”
అంటున్న చందన ముఖంలో దిగులు తొంగి చూసింది. అయితే ఘాట్ రోడ్ లోకి బస్సు ప్రవేశిందో లేదో వసివాడని పచ్చని ఆకుల విభిన్న పరిమళాలు కలగలిసి అందరిని అబ్బుర పరుస్తున్నాయి.
మనకు తెలియకుండానే మనకు ప్రకృతి చికిత్స జరిగిపోతోంది.
“ అదిగో అటు చూడు అవన్నీ కరివేపాకు చెట్లే, ఇటు చూడు, సీతా ఫలాలే కాదు రామా ఫలాలు కనువిందు చేస్తున్నాయి కదా! ఆ.. ఇక్కడ అనంతగిరి ఘాట్ సెక్షన్ మొదలవుతుంది.” పూర్వజన్మ గుర్తుకొచ్చినట్లు మా చందనలో సంతోష తరంగాలు.మా అబ్బాయిని మనసులోనే దీవించుకున్నాను. తల్లి కోరికను కనిపెట్టినట్లు  ఈ ప్రయాణం కోరుకున్నాడేమో. అమ్మ,నాన్నలు నిజంగానే జ్ఞాపకాల వరాలమూటను అందించినట్టున్నారు.చందన మాటలు ఆసక్తిని రేపుతున్నాయి. చందన చెప్తుంటే నేను,మా అబ్బాయే కాదు బస్సులోని ప్రయాణికులు శ్రోతలే.    “మారు మూలలో ఎక్కడో కొండలలోనున్న అరకులోయ పరిధిలో నాన్నకు బదిలీ అనగానే అమ్మతోపాటు నేను భయపడ్డాను. అయితే సామానుతీసుకుని బయలుదేరాక ఉరకలేసిన ఉత్సాహంతో చేసిన ఆ ప్రయాణం నన్ను ఆ చిన్న వయసులోనే తెలియరాని ఆనందానికి గురి చేసింది.చక్కని ఇల్లు,చుట్టూ విశాలమైన స్థలం.అంతే ! నాన్న మరి తనకున్న వృక్షప్రేమకు పాదులు తీసాడు.నేను నా చిట్టి చేతులతో మట్టిని చెట్లకుదుళ్లలో వేస్తుంటే నాన్న సంబరంగా చూసి,మనిషి,చెట్టు పరస్పరం సహకరించుకుంటేనే ప్రకృతి పరవశించేది, ఒక మొక్కనాటితే మనకు పదింతలుగా సాయం చేస్తుంది అని చెప్పేవారు.చెట్టుకొట్టడం కాదు,చెట్టు పెట్టడంలోని పరమార్థమే పరమావధిగా బ్రతికిన తల్లిదండ్రులు పిల్లలకు ప్రకృతిని ఆరాధించడం చిన్నప్పుడే నేర్పాలి.చెట్టుకు ప్రాణమిస్తే ప్రకృతి మాత పులకిస్తుంది.”చందనలో జలపాత ఒరవడి!
చల్లని గాలి సుగంధ పరిమళాన్ని బస్సునిండా పరుస్తోంది.అలసిన కన్నులకు శీతల పవనాలు జోల పాడుతున్నాయి.
“చలిగా ఉందినాన్నా” అంటూ నా దగ్గరగా జరిగాడు మావాడు. పైనించి సూట్ కేస్ దించి వాడికి స్వెటరు,క్యాప్ అందించాను. ‘మరినీకు’అన్నట్లు చందనవైపు చూసాను.
“ వద్దు నాకు చల్లగా ఉన్నందుకేనేమో ఆ నాటి స్మృతులు వెచ్చగా గుర్తుకు వస్తున్నాయి.” నవ్వింది చందన.
బస్సు మెలికలు తిరుగుతోంది.నిజానికి మెలికలు తిరుగుతున్నది రోడ్డే!కొందరు భయంగా కళ్లు మూసుకున్నారు.మరికొందరు నిమ్మకాయ వాసన చూస్తున్నారు.బస్సులోనుండి చూస్తే లోయలు కనబడుతున్నాయి.డ్రైవర్ ఏమాత్రం అజాగ్రత్తగా నడిపినా అగాథపుటంచులు చూస్తాం.
“ మదర్ నేచర్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ నాన్నా. అమ్మ చేసుకున్న పుణ్యం ప్రకృతి కూడా అమ్మకు మరో తల్లయింది.” మావాడిలో కవితావేశం!
చల్లని గాలి చుట్టముట్టి శాలువాలనందుకోమంటోంది. పక్షుల కువకువలు మనం చూడని ప్రపంచాన్ని చూడవచ్చినందుకు స్వాగతగీతమాలపిస్తున్నట్లుంది.ఎవరో పాట అందుకున్నారు. ‘ ఆకులో ఆకునై  పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నునులేతరెమ్మనై  ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా....అది దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు రచించిన పాట.చందనకు మరీమరీ ఇష్టమైన పాట.చందన కళ్లు మూసుకుని మైమరచిపోతోంది.ప్రకృతిలో మమేకమవడమంటే అదేనేమో!
 “ మదర్ నేచర్ అంటే ఏమిటమ్మా?”ఓ చిన్నారి పాప ఆసక్తిగా ప్రశ్నించింది.అడిగింది వాళ్లమ్మనయినా దానికీ చందనే సమాధానం చెప్పింది.
“ అమ్మలూ,మదర్ నేచర్ అంటే మరెవరోకాదమ్మా మనందరికీ అమ్మే. అంటే  ప్రకృతి మాతేనమ్మా!” అమ్మ కొంగు చాటునుండి సిగ్గుపడుతూ తల ఊపుతోంది ఆ చిన్నారి.
 ‘ తల్లి ప్రకృతిని మనం కాపాడేబదులు వికృతమైన పనులతో ఎంత కలుషితంచేయాలో అంతా చేస్తున్నాము.ఇంత చక్కని వరాన్ని కాలుష్యం కోరలతో చీల్చివేస్తున్నాం.’నిస్పృహగా అనుకున్నాను.
కొండలపై పచ్చని  శాలువా పరచినట్లున్నదృశ్యం కళ్లపై  చలువదనాన్నిచిలుకరిస్తోంది.
గమ్యం చేరగానే బస్సు ఆగింది.సామానుతో పాటు చందన తన జ్ఞాపకాల బుట్టను దించింది.ఎవరికివారు ఏర్పాటు చేసుకున్న గెస్ట్ హౌస్ లదిశగా కదిలాం.గాలివాటుకు తలలూపుతున్న పసుపుపచ్చని వలిసెల పూలు రమ్మని,రారా రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి.మా చేతులలోని సామాను అందుకుంటున్న గిరిపుత్రులను చందన పరిశీలనగా చూస్తోంది.
“ కాలం తెచ్చిన మార్పులో వేషభాషలు మారాయండీ.” నెమ్మదిగా అంటోంది.
“ ఈ రోజు థింసా నృత్యం ఆడుతున్నారా?”ఆసక్తిగా అడిగాను. “ఉంది సార్ చూస్తారుగా,”అని నవ్వాడు.లయ తప్పని థింసా పల్లె పడచులు ప్రకృతిలో మమేకమై ఆడే గిరిజన నృత్యం.
సాయంత్రం చల్లబడేలోపు పద్మాపురం ఉద్యానవనం చేరుకున్నాం.
“ ఇక్కడే....ఇక్కడే...”చందన గట్టిగా అరుస్తోంది.కొందరు ఆమె వైపు ఆశ్చర్యంగా చూసారు.
“ఇక్కడే బాబు మా బాల్యంలోని ఫోటోలన్నీ తీసుకున్నది.”నలుపు తెలుపు ఫోటోలను  రంగులలో చూస్తున్నట్టు సంబరపడిపోతోంది చందన.
“ వివిధ వర్ణాల గులాబీలు ఎన్నో!అప్పుడూ అంతే నాన్న పెట్టిన గులాబీతోటలో చెట్టుకు వందపూలు తక్కవకాకుండా విరగపూసేవి.”
గులాబీపూల జ్ఞాపకంతోపాటు అమ్మనాన్నలు లేని లోటు ముల్లులా కసుక్కుమందేమో చందన కాసేపు మౌనంగా పూలవంకే చూస్తూ నిలుచుంది.ఇక నిలబడలేక అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ పై కూర్చుండిపోయింది.
“అమ్మా” ఆతృతగా అమ్మదగ్గరకు పరిగెత్తాడు మా బాబు.
“ ఏం ఫరవాలేదు బాబు,దుఃఖంకన్నా ఆనందాన్ని తట్టుకోవడంకూడా కష్టంగానే ఉంది.ఈ వన దేవతను నా జన్మలో మళ్లీ చూడగలనో లేదో అనుకున్నా.తాము ప్రకృతిలో కలిసేవరకు ప్రకృతినే ప్రేమించి ప్రతి చెట్టు పుట్టుకకు తామే కర్తలన్నట్లు ఇంటి చుట్టు పూలతోట,పండ్లతోటలను పెంచిపోషించిన వృక్షప్రేమికులు.వారు నడయాడిన చోటు నాకు స్వర్గంకన్నామిన్న. ” తల్లి మాటలు వింటున్న వాడి కళ్లను తడి తడుముతోంది.
అన్నిటిని ఫోటోలు ,వీడియోలలో బంధింస్తూ  తల్లి, కొడుకుల ఆప్యాయతానురాగాలను  కూడా ఫోటోలలో పదిలంగా పట్టుకున్నాను.
అక్కడ లోపలకు వెళ్లాక కాఫీ తెప్పించుకున్నాము.
“ కాఫీ కలియుగామృతం అనేవారు మీ తాతయ్య.” ఆనాటి కమ్మని ఫిల్టర్ కాఫీ గుర్తుకు తెచ్చుకుని మరీ కమ్మగా చెప్తోంది. నిజంగానే కాఫీ పనిచేసినట్లుంది.చందనలో మళ్లీ పుంజుకున్న ఉత్సాహం.
“ఆ రోజుల్లో కాఫీగింజలు పొడికావాలంటే అమాల్ దస్తా అనే ఇనుపరోలు,రోకలి కావాల్సిందే.ఆ ఎముకలు కొరికే చలికి కాఫీయే సరియైన ఔషధం.” చల్లని గాలుల నడుమ  చందన చెప్పింది నిజమేననిపించింది.
మరుసటిరోజు బొర్రాగుహలు మా మనసులను లాగేసుకున్నాయి. ప్రకృతిగానే ఏర్పడిన ఈ గుహలలో అక్కడ నీటిబిందువులే రూపాంతరం చెంది కనువిందుచేసే వివిధాకృతులలో ఆకర్షిస్తాయి.దగ్గరలోనే ఉన్న కటికి జలపాతం జలదరింపచేసే జలపాతాలు మనపై చిలకరించే పలకరింపుల తుంపర్లు  ఆహ్లాదాన్ని మరింత పెంచాయి. అక్కడి మ్యూజియంలో భద్రపరచబడిన గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించే వస్తు సముదాయాన్ని ఆసక్తిగా చూస్తున్నారు పిల్లలందరు.అందులో మావాడు ఉన్నాడు.ఆ తరువాత చందన బాల్యాన్ని ఊయలలూపిన ఇంటిని చూసి మావాడు,నేను కూడా ఉద్విగ్నతకు లోనయ్యాము. పచ్చదనం పాదుకుపోయిన ఇల్లది.ఆ ఇంటిలో వారందించిన ఆపిల్ పండ్లు అందుకుని బయలుదేరాము. వెనుతిరిగి చూస్తూ నడుస్తున్నచందన మనస్సుకు సాంత్వనగా భుజంపై చెయ్యి వేసి నడిపించాను.చందన మనసులోని ప్రకంపనలు నా చేతికి తెలుస్తున్నాయి.
అరకును వదలి వెళ్లే సమయం దగ్గరపడేకొద్దీ చందన కన్నుల్లో తెలియని ద్వైదీభావమేదో పొటమరిస్తోంది.స్టేషను చేరుకునేందుకు బయలుదేరాం. కాఫీ గింజలు,ఈతపండ్లు,శీకాయ,కొండచీపుర్లు అన్నీఆప్యాయంగా సర్దుకున్నాం.
“ చేతిలో ఏముంది పట్టుకునే ఉన్నావు,సంచిలో పెట్టకూడదూ” అనగానే పిడికిలిని ఆప్యాయంగా ముద్దుపెట్టుకుంది.విప్పి చూపిన పిడికిలిలో నేలతల్లిని తాకి తెచ్చుకున్నమట్టి పరిమళం గుప్పుమంది. చందన చేతి స్పర్శకు ప్రకృతిమాత కూడా పులకించే ఉంటుంది.
“చందనా,మీ అమ్మ,నాన్నలకే కాదు ఈ ప్రయాణం మనందరికి అమ్మయిన ప్రకృతి మాతకు కూడా అంకితమే.” అంటూ మావాడిని చూసాను.
“అరకు చూపించినందుకు థ్యాంక్యూ నాన్నా!”అంటూ మా ఇద్దరిని  తీగలా అల్లుకున్నాడు మా బాబు.

No comments:

Post a Comment

Pages