హిమగిరి శతకము - త్యాగి - అచ్చంగా తెలుగు

హిమగిరి శతకము - త్యాగి

Share This

హిమగిరి శతకము - త్యాగి

పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 

ఉపోద్ఘాతం:
ఈమాసం అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక ప్రకృతి పై ప్రత్యేకసంచికగా వస్తున్న విషయం తెలిసినదే. ఈసందర్భంగా పద్మినిగారు ఏదైనా ప్రకృతికి సంబంధించిన శతకాన్ని పరిచయం చేస్తే బాగుంటుందని సూచించారు. ఇదిగో ఒకమంచి శతకాన్ని వెదికిపట్టుకొని మీ ముందు ఉంచుతున్నాను. శతకం పేరు "హిమగిరి శతకము". ప్రకృతి అందాలను వీక్షించాలంటే మనదేశానికే తలమానికమైన హిమగిరుల కంటే మంచి ప్రదేశం ఏముంటుంది? "హిమగిరి సొగసులు, మురిపించును మనసులు" అన్న కవివాక్కు అక్షరాల సత్యమే కదా. ఎందరెందరో మహాకవులు హిమాలయాల ప్రకృతిసౌందర్యాలను వారి కావ్యాలలో ఎన్నెన్నో తీరుల వర్ణించి మురిసిపోయారు. ఉదాహణనకు అల్లసానివారి "మనుచరిత్ర" చాలనుకుంట. పెద్దనామాత్యుడు ప్రవరాఖ్యునోట పలికించిన ఆ అద్భుతసౌందర్య వర్ణనలు తెలుగు సాహిత్యాభిమానులకు సుపరిచితాలు. అటువంటి మహోన్నత హిమగిరి శిఖరాలపై అద్భుతాలను, ప్రకృతిని, ప్రజలను వర్ణిస్తు చెప్పినదే ఈశతకము.
కవిపరిచయం:
హిమగిరి శతక రచయిత త్యాగి. ఈ కవి తనగురించి ఎక్కడ చెప్పుకోక పోవటంవలన వివరాలు తెలియరాలేదు. వీరు అసలు నామధేయంకానీ, జీవితకాలాది విషయాలు కానీ తెలియరాలేదు. ఈశతకాన్ని తనగురువైన జ్ఞానానందులవారికి సమర్పితంగా రచించారు. 1938 సం. లో ప్రచురితమైన ఈ శతకాం శ్రీ వడ్డాది సుబ్బరాయకవి చే సరిచూపబడి ప్రచురించటంవలన బహుశా ఈ కవి ఇదేకాలం వారుకానీ అంతకు కొంత ముందు కాలంవాడు కానీ కావచ్చును.
ఈ కవి రచించిన ఇతర రచనలు 1. కథాకావ్యము (గద్యము), 2. కథాకావ్యము (పద్యము), 3. సచ్చిదానందము (నవల), చిద్విలాసము (నాటకము), 6. గంగాపంచకము. ఇవేకాక శ్రీజ్ఞానానందస్వామివారి కృతులయిన 1. దార్శనీకమహాప్రవచనము (గద్యము), 2. నిర్వాణము-జ్ఞానానంద సువర్ణమాల (పద్యములు), 3. పూర్ణసూత్రములు అనే గ్రంధాలను కూడా ఆంధ్రీకరించినట్లు తెలుస్తున్నది.
శతక పరిచయం:
"హిమగిరిస్థలిమాహాత్మ్య మెన్నఁదరమె" అనే మకుటంతో రచింపబడిన ఈశతకంలో 116 పద్యాలు అన్ని వృత్తాలలో ఉన్నాయి. కవి చెప్పినవిధం గా
మానిత చంపకమాలికాలంకృత, యుత్పలమాలికాయుతశుభాంగి
మత్తేభశార్ధూలమహితవృత్తోపేత, కమ్రరుచుప్రదకందసహిత
సీసవినిర్మలచిత్రిత నిజరూప శృంగారగీతికా స్థిరయశస్క
"ఆటవెలదీ" నామకాంధ్రప్సరో ంగనా నృత్తకౌశల్యసంప్రీతచిత్త
చారుపదయుక్త, సార్ధకాక్షరసమేత| యైన భోదిగుహాకృతి, యస్మదీయ|
యలరుగంగోత్తరాప్రశంసాభ్యుపేత హిమగిరిస్థలిమాహాత్మ్య మెన్నఁదరమె
ఈ శతకం ప్రధానంగా 8 భాగాలుగా విభజించబడినది
1. ప్రశంస (1 నుండి 12 పద్యాలవరకు) 2. ప్రకృతి (13 నుండి 50 పద్యాలవరకు) 3. ప్రజలు (51 నుండి 70 పద్యాల వరకు) 4. నైతికము (71 నుండి 79 పద్యాల వరకు), 5. స్వీయము (80 నుండి 89 పద్యాలవరకు) 6. ఋషులు (90 నుండి 95 పద్యాలవరకు) 7. యాత్రికులు (96 నుండి 106 పద్యాలవరకు) 8. వీడ్కోలు (107 నుండి 114 పద్యాలవరకు).
ఈ ప్రధానభాగాలు మరల చిన్ని భాగాలుగా వర్ణనకు అనుగుణంగా విభజించారు. ఉదాహరనకు ప్రకృతి అనే విభాగంలో, కొండలు, కొండవాగు, నీటిమాధుర్యము, ఎత్తైన కొండలనుండి దృశ్యము, కొండపొలములు, తెల్లకొండలు నల్లకొండలు, నల్లకొండపై తెల్లమబ్బు, సూర్యుడు, సాయంసంధ్య, మబ్బులు, గాలి, మంచు, చలి, జంతువులు గా విభజించి ఒక్కొక్క విషయం పై ఒకటి నుంచి 5 పద్యాలదాకా చెప్పటం జరిగింది.
కొన్ని పద్యాలను చూద్దాము.
(కొండలు)
కొండలా యివికావు క్రూరశార్ధూలాదివన్యమృగంబులవసతు లరయ
వసతులు కావివి, వనవాసిధన్యాత్మకృషిఫలధాన్యసుక్షేత్రచయము
క్షేత్రముల్ గావివి, శ్రీమించుమహిమకాంతిఁ గొమరొప్పుపెనువెండికుప్ప లన్ని
వెండికుప్పలు కావు, వితతభాస్కరకర ధగధగాయితభూరిధామము లివి
ధామముల్ గావు మణులచేఁ దనరునిధులు| నిధులు కావివి ఋషివరనియమవాటు!
లౌర! పర్వతసౌభాగ్య మద్భుతంబు! హిమగిరి మాహాత్మ్య మెన్నఁదరమె|
ఎత్తైనశిఖరంబు నెక్కి చూచెదమన్న యదిమించి మఱియొక్క టచటఁ దోఁచు
దాని నారోహించి తనివిఁ జెందెదమన్న నట నభ్రమంటినయదొకఁడుండు
నభ్రమంటినయది యబ్బిన దనుకొన్న దానిపైమబ్బునుఁ దాఁకు నొకటి
దానియగ్రం బెక్కి తరియించితి మటన్న నాపైనిచుక్కల నంటు నొకటి
యిట్లు పోవంగ పోవంగ నెంతదవ్వొ| పోవుటయెగాని యంతముఁ బోల్పఁదగదు
శిఖరముల యెత్తు నెవ్వరుఁ జెప్పలేరు| హిమగిరి మాహాత్మ్య మెన్నఁదరమె|
నల్లకొండపై తెల్లని మబ్బును వర్ణించిన ఈ పద్యం చూడండి. ఇది కవి కల్పనాచాతుర్యానికి ఒక ఉదాహరణ.
గిరివిహారముఁగోరి యరగిన విష్ణువు సరస కేతెంచినశర్వుఁడనఁగ
బాలకృష్ణునితోడఁ బనివడి క్రీడింపఁ బ్రేమవచ్చిన బలరాముఁ డనఁగ
అనుఁగుచుట్తం బగునట్టి దిక్కరి జూడఁ దరలినయైరావతం బనంగ
నీగ్రోలబలము నత్యుగ్రతనాక్రమింపగ వచ్చు హూణులబలమనంగ
నల్లగొడుగును గప్పిన తెల్లగొడుగు| నాఁగ నల్లనిదూరస్థమైనశిఖరి!
నాక్రమించెను వచ్చి శ్వేతాభ్రమొకటి! హిమగిరిస్థలిమాహాత్మ్య మెన్నఁదరమె
సాయంసంధ్య వర్ణన మనోహరం. చిత్తగించండి
నిగనిగల్ పచరించు జిగిగల్గు తెల్లనిదగు నుత్తరియంబు మిగుల రంగు మించి
బంగారుజలతారు రంగారుమేల్పట్టు శృంగారవస్త్రంబు రంగుమీరి
కాషాయువర్ణయుగ్వేషార్ష వసనసంభూషితనవనవోన్మేష మంది
మాంజిష్ఠవర్ణాతిరంజితశాటీసుసంజాతకాంతులనున్ జయించి
కాళరాత్రిశిరోరుహపాళిమిగిలి! సంజకాంతుల నంతంత రంజితమయి
తోఁచి మేఘంబు సమ్మోదమాచరించు హిమగిరిస్థలిమాహాత్మ్య మెన్నఁదరమె
మరి అచ్చటి మబ్బులు ఎలా ఉన్నాయో చూడండి
ఆకాశవిపణిలో నమ్మఁ బ్రోవులువోయుమౌక్తికంబుల నీలమణులయట్లు
నవపుండరీకముల్ నల్లగ్ల్వలు వియన్నదిలోన గుంపులై యొదవినట్లు
హంసముల్ కోయిల లంబరవీధిలో నైకమత్యంబున నాడునట్లు
పండువెన్నెలలును బాదపచ్ఛాయలు గగనభూమిని జూడఁగలిగినట్లు
ధవళనీలాంబరములు దివిజవనిత! లారవేసినయట్టులు నభ్రవీధి!
సితము లసితము లగు మేఘతతులు దోఁచు !!హిమగిరి!!
మంచు ఎలాగ ఉంది అంటే:
పార్వతిపెండ్లిసంభారంబులకుఁ దెచ్చి యారఁగాబోయు బియ్యంపు పిండి
పిండివంతకుగాని పేర్మిని గిరిరాజు పంచి తెచ్చినమంచిపంచదార
శ్రీపార్వతీశివుల్ చేరికూర్చుంతకై పఱచిన తెల్లనిపట్టుపఱపు
మంగళాశీర్వాదమహితసేవ యొనర్పఁ బుణ్యాంగనల్ గూర్చు పూలవాన
శర్వుఁ డొనరించునట్టహాసంబు సకల! సురలబువ్వంపుబంతికై సుధ, యనంగ!
నంతటను బేరుకొనియుండు నమలహిమము !!హిమగిరి!!
సందర్భానుసారంగా ఈ కవి హింది, ఇంగ్లీషు మొదలైన భాషలను తన పద్యాలలో వాడుకున్నారు. మణిప్రవాళ పద్దతిలోని ఈ పద్యం చూడండి!
ఆణె జాణె లగా పాణి కకబిటి యాదిపదములు గూడిన ప్రాకృతంబు
కుశల మంగళ కృపా కో న్వధవామొదల్ శబ్దముల్ గల్గిన సంస్కృతంబు
ఆయియే మహిరాజ్ఞి హై భలీకా మను నీగభీరోక్తుల హిందిభాష
అక్సరు బద్మాషు అల్లా ఖుదా యనునుగ్రవాక్యంబుల నురుదుపలుకు
లనెడు నాలుగుభాష లవ్యక్తరీతి! మేళనంబంది సంఖ్యకు మించినట్టి!
కొందభాషలు పెక్కులు గూర్చు వింత !!హిమగిరి!!
హిమగిరి సొగసులను దర్శించిన ఈకవి మనోభావాలను వ్యక్త పరచిన తీరు చూడండి
కంటిని పార్వతీకాంతులనిలయమ్ము నంచితోత్తుంగమౌ మంచుకొండ
కంటిని హరజటాక్రమజూటవిహార గంభీరసలిల గంగాభవాని
కంటిని పరమర్షిగణముఖ్యసంవాసకీర్తి వాసితమైనగిరిగుహాళి
కంటిని మంజులాకారమరుద్ధూతవితతశాఖాయుతవృక్షచయము
కంటి వివిధంబు లగుజంతుకాండములను! కంటి రాగవిహీనుల ఘనుల మునులఁ
గంటి గురువర్య ధన్యత మంటి నేఁడు !!హిమగిరి!!
ఈశతకంలోని కొన్ని పద్యాలలో ప్రాచీనకవుల పోకడల అనుకరణ మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు  శ్రీనాథకవి కాశీఖండములోని పద్యాన్నిపోలిన ఈ క్రిందిపద్యం చూదండి.
కొండలారా! గొప్ప యండ నె బాయుదున్ బోవలె సెలవిండు పోయివత్తు
వనములారా! మిమ్ము వదలుటే కష్టమౌ పోవలె సెలవిండు పోయివత్తు
గంగాంబ! నే నిన్ను గాంచుట యెప్పుడొ పోవలె సెలవిమ్ము పోయివత్తు
శ్రీకాంత! నీకర్చసేయంగ నెపు డౌనొ పోవలె సెలవిమ్ము పోయివత్తు
ఓయిగాడ్పులు! మబ్బు! లోహోయితరులు! నోయిపధములు! సెలవిడుఁ డూరి కేగ!
నంచు వీడ్కొను యాత్రికుఁ డచటు వాసి !!హిమగిరి!!
ఒకమాటలో చెప్పాలంటె మహోన్నతమైన హిమాలయ సౌందర్యానికి ముగ్ధుడైన కవి హృదయంలో పుట్టిన భావజాల ప్రవాహమే ఈ శతకము. ఆ ప్రకృతి సౌందర్యాని ఆస్వాదించి తన పద్యాలతో  అలంకరించి మనకందచేసిన ఈ కవి ధన్యుడు. మనంకూడా ఈ శతకం చదివి హిమలయ సందర్శన భాగ్యాన్ని పొందిన పుణ్యాన్ని పొందుదాము. మీరు చదవండి. ఇతరులచే చదివించండి.

No comments:

Post a Comment

Pages