ఇలా ఎందరున్నారు ?- 17
అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని సమక్షమే ఆమెకు లోకమవుతుంది. అనంత్ తో సంకేత ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని. సంకేతను చూసేందుకు ఆమె ఇంటికి వస్తుంది అనంత్ తల్లి శరద్రుతి. అనంత్ తనతో తిరిగింది కేవలం కాలక్షేపానికే అని తెలిసిన సంకేత మనసు ముక్కలవుతుంది. అతన్ని నిలదీసేందుకు వెళ్ళిన సంకేత, ప్రస్తుతం అతను మరో అమ్మాయితో ఇదే ఆట మొదలు పెట్టాడని తెలుసుకుంటుంది. అనంత్ కు ఆక్సిడెంట్ అవుతుంది. ఇక చదవండి... )
పేపర్ అక్కడ పెట్టి, కన్నీళ్లను గట్టిగా తుడుచుకొని “బామ్మ! ఇప్పుడే వస్తా!” అంటూ ఎంత పిలుస్తున్నా ఆగకుండా అనంత్ వున్న హాస్పిటల్ కి వెళ్లింది సంకేత...
అది చాలా పేరున్న హాస్పిటల్...
అన్ని వసతులు వున్న స్పెషల్ రూములో వున్నాడు అనంత్. గది తలుపు మూసి వుంది. ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వడం లేదు. అతనికి బాగా రెస్ట్ కావాలి అన్నట్లు అతిముఖ్యమైన వాళ్ళనే లోపలకి వెళ్ళనిస్తున్నారు.
సంకేతను అక్కడ పట్టించుకునేవాళ్లే లేరు. గుండె చెరువై ఏడుస్తున్నా ‘ఆమె ఎవరు?’ అని లోపలకి వెళ్ళనిస్తారు? అప్పటికీ అడిగింది తను లోపలకి వెళ్తానని... అక్కడ ఎవరూ ఆమెను చూడటం లేదు... ఆ గది చుట్టే ఆరాటంగా తిరిగింది.
ఇక తిరగలేక కూర్చుంది.
ఆమె కూర్చున్న దగ్గరే అనంత్ వున్న గది కిటికీ వుంది. అది గమనించి వెంటనే అనంత్ ని చూడాలన్న ఆశతో కిటికీ వైవుకి తల తిప్పింది. కిటికీ మొత్తం మూసి వుండటంతో నిరాశపడింది... అయినా ఆశచావక కిటికీ తలుపును తెరవాలని వేలితో మెల్లిగా లాగింది.
కొద్దిగా కిటికీ తలుపు తెరుచుకోగానే ఆత్రంగా లోపలకి చూసింది. చాలావరకు బ్యాండేజ్ చేసి వుంది. అతని బెడ్ కి అడుగుదూరంలో నిలబడివున్న ప్రత్యూష చేతిని అనంత్ పట్టుకొని వదలటం లేదు. అది చూడగానే కిటికీ ఇవతల వున్న సంకేత బి.పి పెరిగింది. ఇన్ని రోజులు అనంత్ పెళ్ళి చేసుకుంటానన్నది ఈ అమ్మాయినా! అంత మెరుపేం కాదు. నార్మల్ అనుకుంది సంకేత మనసులో.
“వదులు అనంత్! నేను వెళ్లాలి...!” అంది ప్రత్యూష చిరాగ్గా. అనంత్ అలాగేపట్టుకొని ఆమెనే చూస్తున్నాడు.
“వూరికే రమ్మని ఫోన్ చేస్తున్నావని వచ్చాను. ఇది మా డాడీకి తెలిస్తే కోప్పడతారు. నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పినప్పుడే డాడీ నీ గురించి ఎంక్వయిరీ చేశారట. నువ్వు రహస్యంగా ప్రొఫెసర్లకి డబ్బులిచ్చి మార్కులు వేయించుకొనేవాడివట... నీకు చదువంటే ఇంట్రెస్ట్ లేదట... డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తావట... చూస్తూ చూస్తూ అలాంటి వాడికి ఎలా ఇవ్వాలమ్మా నిన్నూ?” అని అన్నాడు. అయినా నేను నిన్నే చేసుకుంటాను అని డాడీతో చెప్పాను. జీవితం అన్నాక రాజీపడడం వుండాలి కదా! డాడీ కూడా నా కోరిక కాదనలేక అప్పుడు ‘ఓ.కె.’ అన్నారు...
కానీ ఇప్పుడు ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా బెట్టింగ్ కోసం యాక్సిడెంట్ చేశావు. నీతో పోటీ పడిన వాళ్ళు కూడా ఇదే హాస్పిటల్ లో వున్నారు. నీకంటూ ఒక లక్ష్యం లేదు కెరీర్ పట్ల బాధ్యత లేదు. ప్రస్తుతం నీ ఒంట్లో ఏ పార్టు ఎలా వుందో కూడా తెలియదు... ఇలాంటి నీకోసం నేనిలా హాస్పిటల్ కి వచ్చానని తెలిస్తే మా డాడీకి నచ్చదు” అంది.
‘మీ డాడీ గురించి వదిలేయ్ ప్రత్యూష! నీ గురించి చెప్పు! ఈ పరిస్థితిలో నీకు నా దగ్గర వుండాలని లేదా?’
“లేదు అనంత్! నేనిప్పుడు ట్రైనింగ్ లో వున్నాను. నాకు ట్రైనింగ్ ముఖ్యం...”
“మరి నేను?”
“నీకేం? నీకు జాబ్ లేకపోయినా మీ నాన్న దగ్గరవున్న డబ్బుతో ఎప్పటిలాగే ఎంజాయ్ చేసుకుంటూ గడిపేస్తావు. నీకు సోమరిగా వుండటం అలవాటేగా! నీకంటూ ఏదో ఒకటి ఉండాలన్న పట్టింపులేం లేవుగా! మరి ‘నేను’ అన్న ఆలోచన కొత్తగా ఎందుకొస్తుందిప్పుడు నీకు? నీకోసం నువ్వేం చేశావని? యాక్సిడెంట్ చేసుకోవడమేగా!”
మాట్లాడే ఓపిక లేనివాడిలా చూస్తూ “కాబోయే భార్యవు. ఇలాగేనా మాట్లాడేది?” అన్నాడు.
ఆ మాట తనకి అసహ్యంగా అన్పించి గట్టిగా కళ్ళు మూసుకొని ముఖాన్ని పక్కకి తిప్పుకుంది.
“సరే! నీ ట్రైనింగ్ పూర్తయ్యాక మనం పెళ్ళి చేసుకుందామా?” అన్నాడు.
అతన్ని ముఖం నుండి కాళ్ల వరకు చూస్తూ...
“ నిన్ను పెళ్ళి చేసుకొని నేనేం చెయ్యాలి? ఈ యాక్సిడెంట్ వల్ల అతి ముఖ్యమైన ట్రైనింగ్ పీరియడ్ ని పోగొట్టు కున్నావు. నీకున్న పర్సంటేజ్ కి ఇప్పట్లో ఏ ఉద్యోగం రాదు. బయట సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి ఎంత పోటీ వుందో అందరికీ తెలుసు... అందుకే డాడి నాకు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని చూశాడు. అదికూడా నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసాకే చూశాడు. అతను చేస్తున్న కంపెని చాలా మంచిది.వాళ్ల డాడీకి మీ డాడీకన్నా ఎక్కువ డబ్బు వుంది. అతను నీకన్నా బావుంటాడు...
ఇందులో మా డాడీ తప్పేమీ లేదు. ఏ ఆడపిల్ల తండ్రికైనా కూతురి భవిష్యత్తు ముఖ్యం.. అయినా నువ్వు ఎప్పటికి కోలుకుంటావో తెలియదు కదా!” అంది చేతిలోంచి తన చేయిని బలవంతంగా లాక్కుంటూ...
అయినా ఆమె చేతిని వదలకుండా “ నీకు నన్ను కాదని అతన్ని చేసుకోవాలని వుందా? మీ డాడీ మాటని కాదని నాకోసం నువ్వేమీ చేయలేవా?” అన్నాడు. అతని గొంతులో ఆర్ధింపు వుంది.
“ఎవర్ని కాదని చెయ్యడానికైనా నీ దగ్గర ఏముంది అనంత్? నీ తండ్రి సంపాదన తప్ప నీకంటూ ఏమి లేదు కదా! ఏ అమ్మాయి అయినా తన కన్నా అన్ని విధాల ఉన్నతంగా వున్న అబ్బాయినే కావాలనుకుంటుంది. అయినా పైకి కన్పించని అవకరాలు వున్న వాడితో జీవితాన్ని నెట్టుకురావడానికి నేను ఎవరికీ పనికిరాని దానినా? నా కంటూ ఓ కెరియర్ వుంది. మంచి ఉద్యోగం ఉంది. అందం ఉంది. నన్ను ఎవరైనా పెళ్ళి చేసుకుంటారు. నీతో ఎందుకు రాజీ పడాలి?” అంది.
అతనేం మాట్లాడలేదు. ఆమె చేయిని మెల్లగా వదిలేశాడు.
ప్రత్యూష ఆ గదిలోంచి వెళ్ళిపోయింది.
బయట కూర్చుని కిటికీలోంచి లోపలకి చూస్తున్న సంకేత ఆ మాటలన్నీ విని నెమ్మదిగా కిటికీ మూసింది... షాక్ లోంచి బయట పడలేకపోతుంది. ఆమె ప్రయత్నం లేకుండానే కళ్లలో నీళ్ళు వూరుతుంటే తుడుచుకుంటూ అక్కడే కూర్చుంది.
అనంత్ లోగడ ఇచ్చిన పార్టీలలో మునిగితేలిన ఫ్రెండ్స్ అంతా వచ్చి అనంత్ ని చూసి ఓపని అయిపోయిందన్నట్లు వెళ్ళిపోతున్నారు.
శివాని, పల్లవి, శ్రావ్య – అనంత్ దగ్గరికి వెళ్ళి పలకరించి వెళ్ళిపోయారు. వాళ్ళని చూడగానే వాళ్ళతో కలసి లోపలకి వెళ్లాలని గబుక్కున లేచి డోర్ దగ్గరికి వెళ్లింది సంకేత.
ఈ లోపలే వాళ్ళు లోపలికి వెళ్లడం బయటకు రావడం కూడా అయిపొయింది.. వాళ్ళు సంకేతను చూడలేదు. .. వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళేదో సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నట్లుంది. ఫోన్లో టికెట్స్ బుక్ చేయించుకునే తొందరలో ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడుకుంటూ లిఫ్ట్ లోపలకి వెళ్ళిపోయారు.
ఎవరు కూడా ఒకేసారి ముగ్గురు, నలుగురు కలసి వస్తున్నారు అనంత్ ని చూడటానికి హాస్పిటల్ గేటు దగ్గర వున్న దేవరాయుడి దగ్గర నుండి రెకమెండేషన్ తెచ్చుకుంటున్నారు. ‘జస్ట్ పలకరించకుండా చూసిపోతాం’ అని వార్డ్ బాయ్ తో చెబుతున్నారు.అతను లోపలికి వెళ్లనిస్తున్నాడు...
సంకేత వెళ్ళబోతే మాత్రం నువ్వాగు. తర్వాత పంపిస్తాను అని కసురుకున్తున్నాడు. అందుకే దూరంగా వెళ్ళి కూర్చుంది.
దేవరాయుడు దూరం నుండే సంకేతను గమనించాడు... అనంత్ ని చూడడం కోసం ఎందఱో ఫ్రెండ్స్ వస్తున్నారు. వెళ్తున్నారు. ఒక్కరి కళ్ళు కూడా తడవటం లేదు. సంకేత కళ్ళు తడవటమే కాదు. ఆమె భుజాలు కూడా వేదనతో సడలిపోయి కన్పిస్తున్నాయి. అప్పుడప్పుడు వార్డ్ బాయ్ దగ్గరకి వెళ్ళి అడిగి, అతను కాదనగానే వెళ్ళి బెంచీపై కూర్చుంటుంది.
ఈ అమ్మాయి ఎవరు? ఈమెను తను చూడటం రెండవసారి.... ఒకసారి ఆపార్ట్మెంట్ దగ్గరికి అనంత్ కోసం వచ్చింది...
“ఎవరమ్మా నువ్వు?” అన్నాడు సంకేత దగ్గరికి వెళ్ళి దేవరాయుడు. అతన్ని చూడగానే లేచి నిలబడి “ సర్ నేను అనంత్ ని చూడాలి. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి?” అంది. ప్రాధేయపడుతున్నదానిలా... ఆమెకు ఆ క్షణంలో దేవరాయుడి గురించి అనంత్ చెప్పిన విషయాలేవి గుర్తురాలేదు. అనంత్ తప్ప ఇంకేం కన్పించడంలేదుకూడా... ఒకప్పుడు ఆమె స్మృతి పథం లో దేవరాయుడికి మంచి స్థానం లేదు. ఇప్పుడు దేవుడులా అన్పిస్తున్నాడు.
దేవరాయుడు అనంత్ వున్న గదివైపు నడుస్తూ “ వెళ్ళనిస్తా! మాట్లాడకుండా రావాలి మరి...!” అన్నాడు.
“సరే! సర్ “ అంటూ ఆయన వేట నడిచింది సంకేత దేవరాయుడు రూము బయటే నిలబడిపోయాడు. సంకేత లోపలికి వెళ్లింది.
వస్తున్నది ఎవరా అని, ప్రత్యూష మనసు మార్చుకొని వస్తుందేమో అన్న ఆశతో ఆత్రుతగా తలుపు వైపు చూశాడు అనంత్. సంకేతని చూసి ముఖం చిట్లించాడు. సంకేత మాత్రం సుడిగాలి కన్నా వేగంగా అతని బెడ్ దగ్గరికి వెళ్ళి విలపిస్తున్న హృదయంలో బెండేజ్ ని తగలకుండా మెల్లగా అతని ఒళ్లంతా తడిమింది.
సంకేత అతన్నే చూస్త్హూ, నోటికి చున్నీ అడ్డం పెట్టుకొని ఏడుస్తుంది శబ్దం బయటికి రాకుండా, అనంత్ కి ఆమె అలా ఏడవడం చిరాగ్గా వుంది. అతనికి వార్డ్ బాయ్ మీదా కోపం వస్తోంది. వచ్చిన వాళ్ళని త్వరాగా బయటికి పంపకుండా ఉన్నాడని, గట్టిగా కేకెయ్యలేకపోతున్నాడు.
ఆ సమయంలోనే దేవరాయుడు డాక్టర్ గారితో మాట్లాడుకుంటూ లోపలికి వచ్చాడు...
డాక్టర్అనంత్ ను టెస్ట్ చేసి, “అర్జెంట్ గా ఈ మందులు వాడాలి. వెంటనే తెప్పించి వాడండి! మీరొకసారి నా గదికి రండి! మీతో మాట్లాడాలి” అన్నాడు. దేవరాయుడు డాక్టర్ గారి వెంట వెళ్తూ సంకేతాను తనతో రమ్మన్నట్లు సైగ చేశాడు. ఆమె అతనివెంట వెళ్లింది.
అనంత్ అది చూసి ‘హమ్మయ్య! ఈ ఏడుపేదో త్వరగానే వదిలిపోతోంది. లేకుంటే దీన్నెవారు భరిస్తారు? ఈ పేదవాళ్ళు ఇంతే అన్నిటికి ఏడుపే... కలలు కనడం రాదు.. వాటిని సాధించుకోవడం అంతకన్నరాదు.
అదే తను చూడు... క్షణంలో ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయిని సెలక్ట్ చేసుకున్నాడు. లైఫ్ ని డిజైన్ చేసుకున్నాడు. కాకుంటే ఈ యాక్సిడెంట్ వల్ల కాస్త డిస్టర్బ్ అయింది అంతే! అయినా అదెంతసేపు తను త్వరగానే కోలుకుంటాడు. ప్రత్యూష తనకోసం ఎప్పటికైనా వస్తుంది మనసులో అనుకుంటుండగా...
సంకేత మందులు తెసుకొని పరిగెత్తుతున్నట్లే లోపలికి వచ్చింది. అనంత్ ని పలకరించకుండా ఒక టాబ్లెట్ తీసుకొని అనంత్ నోట్లో వేసి నీళ్ళు తాపింది. స్టూల్ జరుపుకొని ప్రక్కన కూర్చుంది.
... తన జీవితంలో మళ్ళీ కలవకూడదనుకున్న సంకేత తన బెడ్ పక్కనే అలా తైలవర్ణ చిత్రంలో కన్పించే కన్నీటి బొమ్మలా కూర్చోవడం ఇబ్బందిగా ఉంది అనంత్ కి కానీ... తను కళ్ళు తెరిచి తెలివిలోకి వచ్చాక స్నేహితులు తప్ప తన తల్లిదండ్రులు కన్పించడం లేదు వాళ్ళేమయ్యారు? అదే పజిల్లా పీడిస్తోంది.
స్నానాలు చెయ్యటానికి ఇంటికేమైనా వెళ్ళారా?
అతనికి వెంటనే ప్రత్యూషతో మాట్లాడాలని ఉంది. ఏదోలాగా నచ్చ చెప్పుకోవాలని ఉంది. కాని ఎక్కువ మాట్లాడకూడదు అని డాక్టర్లు సెల్ ఫోన్ వుంచొద్దు అన్నారు.
అతనికి సంకేత ద్వారా ప్రత్యూషని ఇక్కడికి రప్పించుకోవాలని ఉంది.. కాని సంకేత ఏది చేసినా చేయకపోయినా ఈ పని మాత్రం చెయ్యదు. ఆమె వ్యక్తిత్వం తనకు తెలుసు, వాడి వంకా లేనట్లు నిటారుగా నిలబడి ఉంటుంది. అతంత ఈజీగా వంగదు అనుకున్నాడు.
సంకేత ఉన్నా ఒంటరిగా అన్పిస్తుంది. నర్స్ వచ్చి బి.పి. చెక్ చేసి వెళ్లింది. అతను ఎవరితో మాట్లాడాలి అన్నా దవడ ఎముక నొప్పివల్ల వెంటనే మాట్లాడలేకపోతున్నాడు.
దేవరాయుడు హడావిడిగా లోపలికి వచ్చి...
“ అనంత్ మీ అక్కయ్య సరిత వచ్చిందట నిను చూసిపోవాలని... నేను వెంటనే ఇంటికి వెళ్లాలి. లేకుంటే దాని పిల్లలు ఇల్లంతా గందరగోళం చేస్తారు. గోడకున్న టి.వి. పీకి కిందపడేస్తారు. రిమోతే కాలికిందేసి తొక్కేస్తారు. నా కిప్పటికే బి.పి. పెరిగిపోతుంది. నేను దగ్గరుంటే కాస్త కుదురుగా వుంటారు...” అన్నాడు.
అనంత్ కి ఆయన మాటలు అలవాటే! ఆయన ఎంత గొప్పగా సంపాదించారో అంత పొదుపు, జాగ్రత్త కూడా, కూతురు అంటే ఎంత ప్రేమ ఉన్నా తన ఇంట్లో వున్న వస్తువుల మీద కూడా అంతకన్నా ఎక్కువ జాగ్రత్త ఉంటుంది.
దేవరాయుడి వైపు చూసి “ ఈ అమ్మాయిని యిక్కడి నుండి పంపించేయ్యి పెదనాన్న!” అని పైకి అనకపోయినా అదే భావాన్ని వ్యక్తం చేశాడు అనంత్. దేవరాయుడికి అర్ధం అయ్యింది.
రెండు భుజాలపై చున్నీని పద్దతిగా వేసుకొని ఒద్దికగా కూర్చుని దిగాలుగా అనంత్ నే చూస్తున్న సంకేతవైపు చాల ప్రశాంతంగా చూసి... “నువ్వు కొంచెం బయటికి వెళ్ళు సంకేత! తర్వాత పిలుస్తాను” అన్నాడు.
ఈ సంకేత ఎవరు? అనంత్ ని చూసి ఎందుకు బాధ పడుతుంది? వీళ్ళిద్దరి మధ్యన వుండేది ఎలాంటి స్నేహం?
ఎందఱో స్నేహితులు వచ్చారు చూసి వెళ్ళారు. కాని సంకేతలా ఎవరూ ఇంతలా కన్నీళ్లు పెట్టుకోలేదు....ఇంతకూ ముందు తను మందులు కొనిచ్చినప్పుడు కూడా సంకేత సొంత మనషి కన్నా ఎక్కువగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనంత్ తో ఉంది టాబ్లెట్స్ వేసింది. కాని ‘ కాబోయే భార్య ‘ అని చెప్పుకున్న ప్రత్యూష మాత్రం ఒక్క క్షణం హాస్పిటల్ లో ఉన్న సమయం వృథా అన్నట్లుగా వెళ్ళిపోయింది.
దీన్ని బట్టి చూస్తే డబ్బువల్ల సౌకర్యాలు వస్తాయి కాని మానవస్పర్శ రాదనీ, కన్నీళ్లు రావని తెలిసిపోతుంది. సంకేత ముఖం చూస్తుంటే సంకేతది స్నేహం కాదు. ప్రేమ కాదు. అంతకన్నా అతీతమైనది అనిపిస్తోంది. ఈ రోజుల్లో ఇలా బాధపడేవారు ఎవరున్నారు.
....మరి అనంత్ సంకేతని ఎందుకు వద్దంటున్నాడు? కానీ ప్రస్తుత పరిస్థితులు అర్ధమయ్యేలా చెప్పాలని.... “అనంత్ నేను ఇంటి కెళ్ళి అక్కయ్యను, పిల్లలను తీసుకొస్తాను. మళ్ళీ తను వెంటనే వెళ్ళిపోవాలట.. ఇక్కడేమో నర్సులు కాస్త బిజీగా ఉన్నారు వల్ల ఆపరేషన్ షెడ్యూల్స్ తో వాళ్ళని కదిలించే వీలు లేదు. నీ ఫ్రెండ్స్ అంతా వచ్చి వెళ్ళే వాళ్ళే కాని ఎవరూ ఉండేటట్టు లేరు. నేను ఇంటికెళ్లి వచ్చేలోపల నీకేమైనా అవసరం రావొచ్చు. సెలైన్ ఎక్కుతుంది కదా! అది చూసుకుంటూ ఇక్కడో మనిషి ఉండాలి. నేను వచ్చేంతవరకు సంకేతను వుండనీయ్! తర్వాత వెళ్తుంది...” అన్నాడు.
అంతా విని, బలవంతంగా నోరు విప్పి..” మా అమ్మా నాన్న ఎక్కడున్నారు పెదనాన్నా! కనిపించరేం?” అన్నాడు.
“ వాళ్ళు లేరు అనంత్! మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళలేదు. మీ తమ్ముడే వచ్చి తీసుకెళ్ళాడు”...
షాకింగ్ గా చూస్తూ ఎందుకు?” అన్నాడు అనంత్ లోస్వరంతో
“ఎందుకంటే వాళ్ళకి నువ్వంటే ప్రాణం! నిన్నీ స్థితిలో చూసి తట్టుకోలేక నీకు యాక్సిడెంట్ జరిగిన రోజే వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు నువ్వు ఐ.సి.యు. లో ఉన్నావు. వాళ్లను ఇక్కడ వుంచోద్దని డాక్టర్స్ మీ తమ్ముడికి సలహా ఇచ్చారు.మీ పెద్దమ్ము నిన్నటివరకు నీతోనే వున్నది. మోకాల్ల నొప్పి ఎక్కువకావడంతో ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటుంది....ఇప్పుడు నాతో వస్తుందిలే!” అన్నాడు. ఆయన చెప్పిన దానిలో కొంత నిజం, కొంత అపద్దం వుంది. అంతా నిజమే అని నమ్మాడు అనంత్. ఎంత నమ్మినా తన పరిస్థితిని జీర్ణించుకోలేక పోతున్నాడు.
నిస్సహాయంగా నిట్టూర్చి “సరే! పెద్దనాన్నా! నువ్వెళ్ళి పెద్దమ్మను తీసుకురా!” అన్నాడు. పెద్దమ్మ వస్తే త్వరగా సంకేతను పంపించెయ్యాలని అనంత్ ఉద్దేశం...
దేవరాయుడి బయటకెల్లగానే సంకేత లోపలకి వచ్చింది.
*****
అనంత్ నర్స్ కోసమేమో డోర్ వైపు చూస్తున్నాడు. నర్స్ కాని, డాక్టర్ కాని ఎవరూ లోపలికి రావటంలేదు. కనీసం ఒక్క వర్కర్ కూడా రావటం లేదు.
గదంతా నిశ్శబ్దంగా ఉంది.
అతని చూపుల్ని బట్టి, ముఖ కవలికల్ని బట్టి అతనికో మనిషి అర్జెంట్ గా అవసరమని అర్ధమైంది సంకేతకి. అతను అన్నివిధాల నిస్సహాయుడు... లోగడ ఎలా వున్న అనంత్ ఎలా అయ్యాడు...!!!
దిగ్బ్రాందిలోంచి బయటకు రాలేకపోతోంది సంకేత.
...అనంత్ సెల్ ఫోన్ సంకేతకి ఇచ్చి ఏదైనా అవసరం అయితే కాల్ చేయమని చెప్పి వెళ్ళాడు.
దేవరాయుడికి కాల్ చేసింది సంకేత.
“మీరు వెంటనే రండి అంకుల్! అనంత్ నాకేం చెప్పట్లేదు కాని అతనికేదో అవసరంగా ఉంది మాటిమాటికి ఎవరైనా వస్తారేమో అని డోర్ వైపు చూస్తున్నాడు” అంది.
“పిల్లలు టి.వి ముందు నుండి కదలడం లేదు సంకేతా! సరిత రెడీ అవుతుంది. ఎంత త్వరగా రావాలన్నా ఓ గంట పడుతుంది ఈ లోపల ఎవరూ రాకుంటే ఆ బెడ్ పక్కనే పాన్ వుంటుంది. అనంత్ కి ఆ అవసరం తప్ప ఇప్పుడు ఇంకేం వుండదు ప్లీజ్!” అన్నాడు.
సంకేతకు అర్ధమై కాల్ కట్ చేసింది.
టక్కున బెడ్ కింద ఉన్న పాన్ చేతిలోకి తీసుకుంది. అతను సంకేతను చూడకుండా తల తిప్పుకున్నాడు. పనిపూర్తి కాగానే పాన్ ను తీసికెళ్లి టాయిలెట్ లో పోసి శుభ్రం చేసింది. అంతా క్షణంలో జరిగిపోయింది.
... ఈ లోపల పర్మిషన్ తీసుకొని గదిలోకి వచ్చి...”హాయ్! అనంత్! హౌ ఆర్ యు?” అంది హిందూ క్యాజువల్ గా. అతన్ని ఎవరు పరామర్శించడానికి వచ్చినా వాళ్ళలో ఇదే స్టయిల్ కనిపిస్తుంది. దేనిలో అయినా అతనికి ఇచ్చే స్టయిల్ అతనికి ఇవ్వాలని కాబోలు.
అతను మాట్లాడలేదు.కళ్ళెత్తి చూడలేదు. హిందూ నిట్టూర్చి “ఇతను మనలోకం లో వున్నట్లు లేదు. సంకేత ఏది?” అని పైకే అంటూ అక్కడో వుంటే వెళ్ళి దాన్ని తొలగించి లోపలికి తొంగి చూసింది.
టాయిలెట్ దగ్గర నుండి పాన్ పట్టుకొని వస్తున్న సంకేతాన్ చూసి నివ్వెరపోయి నిలబడింది హిందూ. ఇవాళ సంకేతను హాస్పిటల్ దగ్గర చూశాము అని ఫ్రెండ్స్ చెబుతుంటే ఏదో అందరిలా వెళ్ళి వుంటుందిలే అనుకుంది కాని, ఇలాంటి పాత్రలో జీవిస్తుందనుకోలేదు. అసలు దీన్ని ఏమనాలి?
వెంటనే ముక్కు మూసుకొని “ఏం పనే ఇది? నీ కసలు బుద్ధి ఉందా? చదివే వదిలేసి ఇక్కడ కొచ్చి ఈ పని చెయ్యడానికి సిగ్గులేదూ?” అంది నెత్తిమీద కొడుతున్నట్లే కోపంగా చూస్తూ... హిందూ రెండు రోజుల నుండి ఊర్లో లేదు. రాగానే ఈ యాక్సిడెంట్ వార్త విని షాక్ తిన్నది. సంకేత ఉసురే అనంత్ కి కొట్టుకుందని కూడా అనుకుంది... ఆ సంకేతనేనా తనిప్పుడు చూస్తున్నది?
(సశేషం )
No comments:
Post a Comment