కొల్లేరు యాత్ర
ఆండ్ర లలిత
ఆ రోజు పౌర్ణమి. గది అంతా చంద్రుడి కాంతి తో నిండి పోయింది. అసలే ప్రకృతి అంటే చాలా ఇష్టమేమో! కిటికీ లోంచి చూస్తూ ఆనందముతో పదేళ్ళ ఆదిత్య వెలిగిపోతూ “నాన్న తొందరగా రా!” అని పిలిచాడు ఆదిత్య పడుకుని. ఆదిత్య పిలవడము, అలోక్ రాకపోవటమా! నిమిషములో హాజరై “ఏమిటి ఆదిత్య” అని అడిగాడు అలోక్. “నాన్న చూడు దా కూర్చో, చూడు చంద్రుడు గుడ్రంగా కనబడుతున్నాడు. ఆ చంద్రుడి లోని క్రేటర్స కూడా ఎంత బాగా కనబడుతున్నాయో. మనము అందుకో వచ్చేమో అనిపిస్తోంది కదా. నాన్న నువ్వు అప్పుడెప్పుడో కధలో చెప్పినట్టు శ్రీరాముడుకి ఆకాశములో చందమామ అలాగే కనబడివుంటుంది ... కదా నాన్న! అందుకే చందమామ కావాలీ ...ఊ...ఊ...అని ఏడుస్తుంటే వాళ్లమ్మ అద్దంలో చూపించింది అన్నావు కదా. రాముడికి చిన్న పిల్లాడు లాగ ఉన్నప్పుడు నాలాగే అందుకుందామని అనుకుని ఉండి ఉంటాడు. తరువాత రాముడికి నాలాగే అర్థమైనది అనుకుంటా, అలా అనిపిస్తుంది కాని, చంద్రుడు లక్షలాది మైళ్ల దూరములో ఉన్నాడని కదా నాన్నా. ఏమంటావు? “అవును, అలాగే అయ్యి ఉంటుంది. You are right” అన్నాడు అలోక్ ఆదిత్య కళ్లలోకి చూస్తూ! “నక్షత్రాలు కూడా అలాగే కనబడ్డాయి ఈ కిటికీలోంచి చూస్తుంటే!” అన్నాడు ఆదిత్య. “ఎప్పుడు?”అన్నాడు అలోక్! “మొన్న అమావాస్యనాడు ఆకాశము స్పష్టముగా ఉన్నప్పుడు నక్షత్రాలు మిణుకు మిణుకు మెరిసిపోతూ, చాలా చక్కగా కనబడ్డాయి” అన్నాడు ఆదిత్య పుత్రరత్నము జ్ఞానాన్ని ఆనందిస్తూ “అప్పుడప్పుడు నక్షత్రాలే కాదు, గ్రహాలు కూడా కనబడుతూ ఉంటాయి” అన్నాడు అలోక్. “ఒకొక్క సారి అసలు ఈ కిటికీ లోంచి మబ్బులందుకునేలా ఉంటాయి కదా నాన్నా. అందుకే నాకు నా గది అంటే ఇష్టము”అన్నాడు ఆదిత్య. “ఎందుకు ఉండవు మరి మనము ఉండేది 36 వ అంతస్తు కదా. ఆదిత్య నీ గదిలో దీపము తీసినా ఎంత వెలుతురో కదూ, చాలా బాగుంది కదూ!” అన్నాడు అలోక్. ఇంతలో ఆదిత్య వాళ్ల అమ్మ విమల అక్కడికి వచ్చి, “ ఏమిటి ఇంకా పడుకోలే! పొద్దునే బడికి వెళ్లద్దూ! పడుకోరా బాబు” అంది. “అమ్మా రెండు నిమిషాలు”అన్నాడు ఆదిత్య ముసి ముసి నవ్వులతో. “నాన్నా చూడు. నాన్నా ఒక్కసారి కిటికి లోంచి చూడు! చంద్రుడు మబ్బులు దోబూచులు ఆడుతున్నాయి కదూ! అప్పుడప్పుడు నాన్నా! విను మరీ! మార్స్ మరియు వీనస్ కూడా కనబడతాయి కదూ.” అన్నాడు ఆదిత్య. “అవును ఒకొక్క సారి బృహస్పతి కూడా కనబడతాడు”అన్నాడు అలోక్. కిటికీకి అవతల వెంపు కిటికి అంత వెడల్పు సిమెంటు తొట్టెలు వున్నాయి. ఆ తొట్టెలలో మరువము ఒక పక్క కిటికీలో, మరో పక్క చిన్నచిన్న చిట్టి చేమంతులు. చల్ల గాలి వీచినప్పుడు అలా మొక్కలు ఒరిగి చక్కటి వాటి స్పర్శతో కూడిన సువాసనలతో గది అంతా నిండుతోంది. ఆ చల్ల గాలి జోల పాడుతోంది. “అబ్బా ఎంత మంచి గాలో! సరే పడుకో! శుభ రాత్రి ” అన్నాడు అలోక్. “ఊహూ... కళ్లు నలుపుకుంటూ, ఆవలిస్తూ...కథ చెప్పు నాన్నా! నువ్వు చెప్తూ ఉండు నేను పడుకుంటాను. దా నా పక్కన పడుకో.దుప్పటి ఇద్దరికి కప్పే సేయ్” అన్నాడు ఆదిత్య. నాన్నని గట్టిగా పట్టుకుని పడుకున్నాడు. “ఒకసారి నాన్న మొహము తనకేసి తిప్పుకుని... చెప్పు మరీ” అన్నాడు ఆదిత్య. “దేని గురించి” అన్నాడు అలోక్. ముద్దులు ఒలకబోస్తూ “ఊ... దేని గురించీ ! ఆగు చెప్తా! నీరు!” అన్నాడు ఆదిత్య. “అయితే ఒక మంచి నీటి సరస్సు గురించి చెప్తాను. మరి కళ్లు మూసుకుని పడుకో. మరి వింటూ పడుకో” అన్నాడు అలోక్. “నాన్నా ఒక నిమిషము ...నాకు కథ కాదు, నిజమైన సరస్సు గురించి చెప్పవూ” అన్నాడు ఆదిత్య. “ఉష్....పడుకో మరి” అన్నాడు అలోక్ జోకొట్టుతూ! “కొల్లేరు సరస్సు అనే మంచి నీటి సరస్సు. చాలా పెద్దది. ఆ సరస్సు ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్దమయిన మంచి నీటి సరస్సు. అది ఏలూరుకి బహుశ 20కిలోమీటర్లు ఉండచ్చు. లక్షకు పైగా ఎకరాలు వ్యాపంచి ఉన్న ఈ సరస్సు అరుదైన పక్షి జాతులకీ ప్రకృతి అందాలకి నెలవు. నీకు తెలుసా సైబీరియా ఇంకా ఎక్కడ ఎక్కడనుంచో ఎగురుకుంటూ అలుపు సొలుపు లేకుండా ఎంతో దూరము ప్రయాణించి ఇక్కడికి పక్షుల వలస వస్తాయి. మరి ఆ రకరకాల జాతుల పక్షుల పేర్లు వరజ, పురజాము, మరియు నులుగు పిట్టలు . ఈ సరస్సు గోదావరి,కృష్ణ నదుల డెల్టా మధ్య సహజ సిద్దముగా లోతైన ప్రాంతములో ఏర్పడ్డ మంచి నీటి సరస్సు. మరి ఈ సరస్సులో ఎన్నో లంకలు కూడా ఉన్నాయి. ఈ సరస్సులో చిన్న చిన్న కాలువలు కూడా కలుస్తాయి” అన్నాడు అలోక్. మరి నాన్నా! అని కళ్ళు నలుపుకుంటూ “ మరి ఏ కాలువలు కలుస్తాయి చెప్పూ” అని అడిగాడు ఆదిత్య. “ఇదిగో అక్కడికే వస్తున్నా నువ్వు పడుకో మరి” అని బుజ్జగించాడు అలోక్. “నాన్నా మంచి నీళ్లు, దాహము...” అన్నాడు ఆదిత్య. మరి లేచి వెళ్ళి జగ్గులోంచి మంచి నీళ్లు గ్లాస్ లోకి వొంపి జాగ్రత్తగా గ్లాస్ బయట ఒకసారి గ్లాస్ తుడిచి తడి లేకుండా పిల్లాడికి అందించాడు అలోక్. పాపం ఆదిత్యకి చాలా దాహము వేసింది...గడ గడా తాగేస్తూ అడిగాడు “మరి మనము ఆ సరస్సులో నీళ్లు తాగచ్చా!” “అక్కడికే వస్తున్నాను నువ్వు పడుకో” అని అలోక్ జోకొట్టాడు. వెచ్చగా ఉంటే పడుకుంటాడని దుప్పటి సరిగ్గా కప్పాడు అలోక్. “ఆ సరస్సులో తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు, గుండేరులు నుండేకాక డెల్టా ప్రాంతము నుంచి వచ్చే అనేక కాలువలు కొల్లేరు సరస్సులో కలుస్తాయి. కొల్లేరు సరస్సు లో ఎక్కువయిన నీరు అలా ప్రవహించి ఉప్పుటేరుద్వారా బంగాళాఖాతములో కలుస్తుంది. మంచి చిత్తడి ప్రదేశం కూడా! ఆ సరస్సులో పౌర్ణమి రాత్రి లాంఛ్లో ప్రాయాణిస్తుంటే కనులవిందులా ఉంటుంది. చంద్రుడి కాంతి నీటి మీద పడి ముత్యపు వర్షము అన్ని జీవరాసుల మీద కురిపిస్తుంది. అలాగే సూర్యోదయము వేళ నవరత్నాల జల్లులు జల్లుతుందట. ఈ దృశ్యాలు ముగ్ధమోహరంగా ఉంటాయి. ” అని అలోక్ ముగించే లోపలే కళ్లు మూసుకునే, నాన్నా అక్కడికి “ఈ వచ్చే శెలవులలో వెళ్దాము” అని అన్నాడు ఆదిత్య. “తప్పకుండా” అన్నాడు అలోక్ ఆవలిస్తూ! “తాజా నీళ్లతో బాగుండేది. కాని ఇప్పుడు కాలుష్యము అయిపోయింది. అందుకే అందమైన పెలికన్స్ ఎక్కువ రావటము లేదు. ఇక్కడ వాతావరణము సరి పోవటము లేదు. గుర్రపు డెక్క బాగా పెరిగి పోయింది. అదీ కాకుండా పక్కన ఉన్న పొలాలలో జల్లిన క్రిమి కీటకాలను నివారించే ఔషధాలు సరస్సులోకి వచ్చేస్తున్నాయి. ఇంకొక ప్రక్కఉన్న జల వ్యవసాయము చేసేవారు వాడే మందులు మరియు పెంపకముకు వాడే తిండి పదార్థముల శేషము ఆ సరస్సు లో కలుస్తున్నాయి. ఉల్లాస యాత్రలకు వచ్చే యాత్రికులు, చుట్టు ప్రక్కవాళ్ళు వాటర్ బాటిల్స్, పెప్సీ కోలా డబ్బాలు ,చిప్ ప్యాకెట్లనూ, చాక్లెట్ చుట్టిన కాగితాలు, పాలిథిన్ సంచులు పడేసి కాలుష్యము చేస్తున్నారు. ప్రక్కనే ఉన్న చెత్త డబ్బాని వాడనే వాడరు. ఇలా చేస్తే కొల్లేరు సరస్సు కొంప కెల్లేరు అవుతుంది ” అన్నాడు అలోక్. “అలా చేయటము తప్పు కదా” అన్నాడు ఆదిత్య కళ్ళు నలుపుకుంటూ. “Very good! ప్రకృతి అన్ని జీవరాశుల సంపద. దాన్ని ఆనందిద్దాము . అంతవరుకే! పాడుచేసే హక్కు మనకి లేదు ఆదిత్యా! పకృతి ఉమ్మడి ఆస్తి దానిని కాపాడుతూ పర్యావరణ సమతుల్యత కాపాడే బాధ్యత అందరిది. ఏమంటావు ఆదిత్యా! మంచి నీళ్ళు ఇలా వృదా చేస్తే నీటి కొరత వస్తుంది కదా ఆదిత్య! నీకు ఇంకొకటి తెలుసా, భవిష్యత్తులో దేశాల మద్య వచ్చే యుద్దాలు నీటి కోసము వస్తాయట. అందుకే మనము నీరు జాగ్రత్తగా వాడుకోవాలి.”అన్నాడు అలోక్ , ఆదిత్య మాటలకి ఆనందిస్తూ,తనకి తెలిసింది బోధించాలనే ఆతృతతో! “ఇంక శుభరాత్రి. ఇవాళటి కి చాలు..పడుకో!” అన్నాడు అలోక్. “శుభరాత్రి” చెప్పి నిద్దట్లోకి జారుకున్నాడు ఆదిత్య. ఆదిత్య కొల్లేరు సరస్సు గురించి ఆలోచిస్తూ అదే విషయంతో కల కనసాగాడు. మరి ఆ కలలో ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్నతో కొల్లేరు సరస్సు ఒడ్డున కూర్చొని సరస్సు నీటి చలనాలు చూస్తూ ఆనందిస్తున్నాడు. ఇంతలో తన కాళ్ల కి ఏదో తగులుతోంది. ఏమిటా అని తన చిన్ని చేతులతో నీళ్ళలోకి చేతులు పెట్టి జాగ్రత్తగా చిన్న చేపను నీళ్ళతో పాటు తన దోసిట్లో తీసుకునేటప్పటికి ఆ చేప పిల్ల ఆదిత్యతో ఇలాంది “ఆదిత్యా నన్ను చూడు... నాకూ మా స్నేహితులకీ ప్రాణ వాయువు కరువై నది. ఉక్కిరి బిక్కిరి అవుతున్నాము. ఏదో ఒకటి చేయ్యవూ! మంచి పిల్లాడివి కదూ!” ఆదిత్యా, ఆ చేప పిల్లా చాలా సేపు మాట్లాడుకున్నారు... ఇంతలో తెల్లవారి, పావురాలు ఆదిత్యని నిద్ర లేపాయి. **** ఆదిత్య గబ గబా బడికి తయారై పోయి టిఫిన్ తింటూ ధీర్గాలోచనలో పడ్డాడు. ఇది గమనించి “ఏమిటి ఆలోచిస్తున్నావు ఆదిత్యా!” అన్నాడు అలోక్. “ఏమి లేదు! నిన్న కలలో మనము కొల్లేరు సరస్సు దగ్గరకు వెళ్లామట. అప్పుడు ఒక చేప పిల్ల నా దగ్గరకు వచ్చి, తన కష్టాలు చెప్పుకుంది. ఏదో ఒకటి చెయ్యాలి నాన్నా ! వాటిని సంతోషముగా చూడద్దూ!”అన్నాడు ఆదిత్య ఆతృతగా! “తప్పకుండా!”అంటూ ఇలా తన ఆలోచనలు ఆదిత్యతో పంచుకున్నారు అలోక్. “పంచభూతాలు మన జీవనాధారాలు. వృధా చేయకూడదు.జలము చాలా ముఖ్యము. ఒకొక్క చుక్కా, అమూల్యము. ప్రపంచంలో 97 శాతం సముద్రపు నీరు. మిగతా 3 శాతంలో ఒక శాతం మాత్రమే మనకి భూమి పైన వుంది. అందులో చాలా తక్కువ మనకి దొరుకుతోంది. మన అలవాటుల వల్ల కాలుష్యము పెరుగుతోంది. ప్రకృతిని పాడు చేస్తే ,పక్షులు చేపలు అలాంటివి అన్నీ మన లాగే ఇబ్బందులకు గురి అవుతాయి కదూ! అసలు మన జల సంపద మరియు వన సంపదా ఒకదాని మీద మరొకటి ఆధార పడతాయి. చూడు! చెట్లు నరకటముతో ప్రకృతి యొక్క సంతులనము దెబ్బతింటోంది. దానితో విపరీత పరిణామాలకి పకృతి గురి అవుతోంది. వరదలు వస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కి గురి అవుతున్నా ము. మన పర్యావరణము దేవుడిచ్చిన వరం. పాడుచేయకూడదు. ఒక్కసారి ఆలోచించు! మన ఉరకలు పరుగులు జీవితాల నుంచి తన వడిలోకి రమ్మని పిలుస్తుంది.శెలవులు లో! మనని అలరింపజేసి సేద తీరుస్తుంది.ఏ వయస్సుకి తగ్గినట్టు ఆ వయస్సు వాళ్లని ఆనందింప చేస్తుంది. మననే కాదు సర్వ జీవరాశులను తన గుండెలలో దాచుకుంటుంది. ఎన్నో అవాంతరాల నుంచి కాపాడు తుంది. అలా ఎవరు చేస్తారు. అమ్మ తప్పా. ప్రకృతి మన అమ్మలాంటిది. అందుకే ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించి కాపాడాలి మనము. వనములు కాపాడాలి.” ఇంక చాలా చెప్పుకున్నాము బడి సమయము అవుతోంది అంటు అలోక్ ముగించాడు. ఆదిత్య బడికి బయలుదేరి అమ్మానాన్నకి టాటా చెప్తూ వెనకకు తిరిగి అందుకేనేమౌ బామ్మ “ఉదకం నారాయణ స్వరూపం” అంటూ వుంటుంది కదా!, అని వెళ్ళిపోయాడు. లోపలికి వస్తూ విమలతో “పిల్లలకి మంచి విషయాలు చెప్తూ మంచి చోట్లకి తీసుకు వెళ్ళాలి. నేటి బాలలు రేపటి పౌరులు కదా విమల! అభివృధ్ధి పర్యావరణ పరిరక్షణల మధ్య సమతులనము చాల కష్టమైనది కాని, దాన్ని సాధించడం చాల అవసరము. అది చాల ఆలోచనతో ముందు ధృష్టితో చేయవలసినది. సమాజంలో అన్ని పక్షాలు కలిసి సహకరించవలసిన అవసరం ఎంతైనా వుంది. అన్ని పక్షాలు అంటే పర్యావరణ శాస్త్రవేత్తలు, సాంఘిక శాస్త్రవేత్తలు, అభివృధ్ధి అధికారులు, స్తానిక రైతులు, రాష్ట్ర మరియు దేశ ప్రతినిధులు, పారిశ్రామివేత్తలు, ప్రజాప్రతినిధులు అలా సంబంధిన ప్రతీ శాఖ వారు. అతి సర్వత్ర వర్జయేత్ అని మరచిపోకూడదు. చాల కష్టమైనది సంతులనం కాని చేయవలసినది” అని మిగతా కార్యక్రమాలలో పడ్డారు.
***
No comments:
Post a Comment