మబ్బుల విత్తులు - అచ్చంగా తెలుగు

మబ్బుల విత్తులు

Share This

మబ్బుల విత్తులు 

పూర్ణిమ సుధ 


రామనాథం గారి ఇంటికి దారేది ? అని ఎవరైనా అడిగుతారేమో అని ఈ యాభై ఏళ్ళుగా చూస్తూనే ఉన్నా... అదేమీ సినిమా టైటిల్ కాదు, రామనాథం గారు, మా ఎదురింట్లో ఉంటారు... పేరు పాత తరంగా అనిపించినా, ఆధునిక భావాలు, ఆధునిక సాంకేతిక పరిఙానం మెండుగా ఉన్న వ్యక్తి. సొంత ఇల్లు - డాబాలా డాబుగా ఉండకపోయినా, ప్రశాంతంగా ఉంటుంది. పెంకుటిల్లు, లక్షమ్మగారు ఆయనకి అన్నిటా తగ్గ ఇల్లాలు. ఈ మాట అన్నప్పుడు ఆవిడ మొహంలోని సిగ్గు, ఆయన పెదాలని దాచే మీసకట్టు ఒలికించే కించిత్ గర్వం చూట్టానికైనా, పదే పదే అనాలనిపించేది.
నాకిప్పుడు నలభై ఎనిమిదేళ్ళు. నా 18 వ ఏట రామనాథం గారు కరణంగా వచ్చారు ఈ ఊరికి. అప్పట్నించీ, ఇప్పటిదాకా, ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల పది ఊళ్ళల్లో, అందరికీ ఆయనతో పని బడుతుంది, కానీ ఎవ్వరూ అడ్రెస్ అడిగిన పాపాన పోలేదు. మాదీ సొంతిల్లే, కాకపోతే డాబా ఇల్లు. ముందర పెద్ద వసారా, అక్కడ దబ్బ, మామిడి, జామ, మునగ ఇలా రకరకాల చెట్లు పెంచింది మా బామ్మ. మా అమ్మ, కొట్టేయించమని ఒకటే నస పెట్టేసేది. ఇంట్లో పిల్లలకి సమ్మర్ క్రాఫ్ కాస్త ఆలస్యమయినా ఆవిడకి ఫర్లేదు కానీ కొమ్మలు కాస్త పెరిగితే చాలు, అంటకత్తెర వేయించేసేది.
మా బామ్మ ఉండబట్టలేక, "పచ్చని చెట్టుని ఎందుకే అలా తెగనరికిస్తావ్ ?" అని కసురుకునేది.
"మీకేంటత్తయ్యా..! దబ్బ పండు పొక్కింపు, దబ్బ ఊరగాయ, మునగాకు పప్పు, సాంబారు అని బానే ఆస్వాదిస్తారు. ఆ ఆకులు చిమ్మీ చిమ్మీ నా జబ్బ పడిపోతోంది, ఆ మునగాకుకి ఉన్న గొంగళిపురుగులు చూస్తేనే నాకు జలదరింపు అని తన పని తను చేయించేసేది. ఆవిడ పోయాక, అనేవారు కూడా లేరు... ఇంక ఆపేదెవరు ? అన్ని చెట్లూ షోలే లో సంజీవ్ కుమార్ లా పాపం భుజాలు తెగనరకబడి, దీనంగా చూస్తాయి. మేమనే కాదు, మాలా ఆ ఊళ్ళో దాదాపు అందరిదీ ఇదే తంతు.
అదిగో కరెక్ట్ గా అప్పుడే ఎదురింట్లోకి రామనాథంగారొచ్చారు. ఆయన వచ్చిన పది రోజులకే, ఆ పెంకుటింటి చుట్టూ బెండ, వంగ, బీర, పొట్ల నార్లు, అరటి, మామిడి, దబ్బ, జామ చెట్లు, చంద్రకాంతం, పారిజాతం, మల్లె, గులాబీ, కనకాంబరం, మరువం మొక్కలు, ఆగ్నేయం మూల, ఆయనకి చాలా ఇష్టమని తెలీకుండా సర్ప్రైజ్ చేద్దామని ఆవిడ ఇసుకలో దాచిన మామిడల్లం, ఎప్పుడో గుర్తు లేక వదిలేసిన ఒక కొమ్మ చిగురు, ఈశాన్యంలో ఒక ఊట బావి - కొబ్బరి నీళ్ళంత తియ్యగా, స్వఛ్ఛంగా, అచ్చం వాళ్ళ మనసుల్లా ఎంతో రుచిగా ఉండేవి నీళ్ళు... ఇలా ఇల్లంత ప్రకృతి కాంత సింగారించుకున్న వనంలా ఉంటుంది. వారి మంచితనం, సౌమ్యత వల్ల ఆ ఇంటికి ప్రశాంతత వచ్చిందో, లేక ఆ ప్రశాంత ప్రకృతి వల్ల ఇద్దరూ ఆదిదంపతుల్లా అనిపిస్తారో తేల్చడం, చెట్టు ముందా విత్తుముందా అంత క్లిష్టమైనది. ఇక వారింటికి చుట్టాలొస్తే, కనీసం పది రోజులు లేనిదే ఆ మహాసాధ్వి వదిలేది కాదు. ఎండాకాలం సెలవుల్లో వాళ్ళ చెల్లెలి మనవరాలు ఆడుకోడానికి వస్తే, నేనూ ఆ నెలంతా వాళ్ళింట్లోనే భోజనం... అంత రుచికరమైన భోజనం ఎవరు మాత్రం వదులుతారు ? ఇద్దరి దినచర్యా పొద్దున్నే మొక్కల్ని పలకరించడంతో మొదలవుతుంది. బ్రష్ చేసుకోగానే ఫిల్టర్ కాపీ గ్లాసుతో ఇద్దరూ వసారాలో తిరుగుతూ, పేరుపేరునా పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, పరికిస్తూ, కబుర్లు చెపుతూ, అలా తిరిగేవాళ్ళు. నిన్న మొగ్గగా ఉండి, నేడు పూస్తుందనుకున్న మందారం విచ్చుకోకపోతే, ఏమ్మా ? ఇంకా విచ్చుకోలేదు ? సూర్యనారాయణుడు కూడా వచ్చాడు, ఇంకా బధ్ధకం పోలేదా ? అంటూ నవ్వుతారు. పెరట్లోని వంకాయని కాల్చి పచ్చడి చేసినా, పచ్చిమిరప కారం చేసినా, ఆ వీధంతా ఘుమఘుమలే... వాళ్ళింట్లో ఏ వంటయినా, కూరలు వసారాలోవే... ఓసారి నేను వాళ్ళని అడిగాను, మీ చెల్లి పిల్లలొస్తున్నారు గానీ ఇప్పటిదాకా, మీ పిల్లలు రాలేదేమని... చిరునవ్వు చెదరకుండా, ఆయన ఆవిడ మేము రోజూ పొద్దునా సాయంత్రం మాట్లాడేది వాళ్ళతోటేగా అనేసరికి విస్తుపోవడం నా వంతయింది. ఆ తరవాత తెలిసింది, భగవంతుడు వాళ్ళ పాపని మూడో యేటే తన దగ్గరకి పిలిపించుకున్నాడని, ఆ తర్వాత సంతానం వద్దనుకున్నారని... ఎందుకంటే ఆ కడుపు తీపి ఇద్దర్నీ చాలా బాధపెట్టింది. ఇలా ఉండగా, వాళ్ళ వసారా మరింత శోభిల్లడానికన్నట్టు, రెండు గోవుల్ని కూడా తీసుకొచ్చారు. అవొచ్చాక, ఇద్దరికీ అస్సలు సమయం సరిపోవట్లేదు, వాటితో ఎక్కడలేని ఊసులు, ప్రేమలు... అలా ఒక నవ వసంతం వాళ్ళింటికొచ్చినట్టుండేది. నాకో పాప పుట్టింది. అది మా ఇంట్లోకన్నా వాళ్ళింట్లోనే ఎక్కువగా ఉండేది. ఆవిడ చేసే తాయిలాలూ, జంతికలూ - అసలు ఒకటనేమిటి ? కల్మషం లేని మనసుతో, అమృతహస్తంతో ఏది చేసినా అది అమృత తుల్యమేగా ? ఆఖరికి వాళ్ళింట్లో ఊసుపోక పెరిగిన గరిక కూడా ఆవిడ అమృతహస్తం వల్ల, గరిక పచ్చడయేది. పిన్ని గారూ, ఈ పచ్చడి చాలా బావుంది ఇంకొంచెం వెయ్యరా ! అంటే, అది గడ్డి కన్నా...! పాలిచ్చే పశువులకి గడ్డి పెట్టండన్నారుగా, మీ పిన్ని ఆ ప్రయత్నంలో ఉన్నట్టుంది అంటూ నవ్వేసారాయన.
అన్నట్టూ, నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. పెళ్ళి చేసుకుని అమ్మాయి, ఉద్యోగం వల్ల అబ్బాయి ఇద్దరూ స్టేట్స్ లో స్థిరపడ్డారు. మేమిద్దరం లంకంత ఈ ఇంట్లో, అలా కాలం వెళ్ళదిస్తున్నాం. ఇంతలో అనుకోకుండా ఊరుకి కరవొచ్చింది. వర్షాలు లేవు, పంటలు లేవు, తాగడానికి నీరే గగనంగా మారింది. బోరేసిన వాళ్ళు వేసిన చోట వెయ్యకుండా, ఒకళ్ళని మించి ఒకళ్ళు అడుగులు పెంచుకుంటూ పోయేసరికి, భూగర్భ జలాలు, ఎవరెక్కువ లోతు తవ్వితే ఆ చుట్టుపక్కల నీళ్ళన్నీ ఆ గ్రూవ్ లోకి లాక్కోవడంతో మిగతా వారి బోర్లన్నీ నిండుకున్నాయి. అంతా రామనాథంగారింటికి బిందెలేసుకొచ్చేవారు. అడిగిన వారికి లేదనే అలవాటు లేని జంట, అందరికీ నీరిచ్చేవాళ్ళు. చివరికి, తిండి గింజలు కొనే స్థోమత లేనివారికి, తనకున్నదాంట్లోనే పదిమందికి పెట్టే అలవాటున్న ఆయన, వారు తినేదే పట్టెడు పెట్టమనేవారు. రాను రాను మరీ గడ్డుకాలమొచ్చింది. వారి ఊట బావి కూడా ఎక్కువ ఊరలేదు. కానీ ఊరంతట్లోకి కాస్త నయం. ధాతుకరువంటే ఏంటో అప్పుడు నాకు తెలిసొచ్చింది. ఎక్కడివాళ్ళక్కడికి వలస వెళ్ళిపోయాక మిగిలిన పాతిక కుటుంబాల చిన్న ఊరు, ఇప్పుడు నిర్జీవంగా తయారయింది. మా అబ్బాయి అమెరికా నించీ ఫోన్ చేసినప్పుడల్లా, మీరూ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చుగా అని పోరు పెట్టేవాడు. కానీ ఎందుకో మనస్కరించలేదు.
ఈ లోగా, రామనాథంగారికి క్లౌడ్ సీడింగ్ గురించి తెలిసింది. స్వతహాగా టెక్నాలజీ గురించి మంచి అవగాహన ఉన్న ఆయన, ఈ విషయం గురించి మరింత సమాచారాన్ని సేకరించి, ఈ ఆదివారమే ఆ ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఉన్న పాతి"క కుటుంబాలూ, "ఆ(... ఇవన్నీ అయ్యే పనులేనా ? అయినా కృత్రిమంగా మబ్బులు సృష్టించడమేంటి ? విడ్డూరం కాకపోతే ? అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. ఆయన ఒక్క మాటన్నారు.  మరేం చేద్దాం ? చేష్టలుడిగి చూస్తూ ఊరుకుందామా ? మనమే కాదు, దేశం - ఆ మాటకొస్తే ప్రపంచమంతా ఇదే పరిస్థితి. కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. అంతెందుకు ? ఆకులు చిమ్మలేమని, అడ్డంగా ఉన్నాయి అని ఎన్ని చెట్లని కొట్టేయట్లేదు ? వృక్షోరక్షతి రక్షిత: అన్నది మాటల్లో తప్ప చేతల్లో లేదు. మళ్ళీ దీనికి గ్రీన్ పీస్ అని సంస్థలు... వాళ్ళు మన డబ్బుల్తో పచ్చదనం పెంచుతామని డొనేషన్ అడిగుతారు, ఏం ? మనం ఆ పాటి మొక్క పెంచలేమా ? అందులో మొక్కకయ్యే ఖర్చు తక్కువ, ఆ ఆఫీస్ సెటప్ కి అయ్యే ఖర్చెక్కువ. అసలు మొక్కలు నాటితేనే వృక్షాలవుతాయి. ఇవాళో చిన్న మొక్క నాటి, రేపేమో ఓ పెద్ద చెట్టు, రోడ్డు కి అడ్డుగా ఉందని కొట్టేస్తే, ఇంక ఏం ప్రయోజనం ? పైగా రియల్టర్లు, ఇప్పుడు కాకుల్లా చిన్న పల్లెటూళ్ళ మీద కూడా పడ్డారు. పచ్చదనం తగ్గిందంటే, మన పురోగతి తగ్గినట్టే అని తెలిసినా ఎటువంటి చర్యలూ తీసుకోవట్లేదు అని వాపోయే బదులు, మన నించీ అడుగు ఎందుకు పడదు ? అసలిలా కృత్రిమంగా, మబ్బుల విత్తుల్ని నాటడం మనకి సిగ్గు చేటు. కానీ తప్పట్లేదు. అందుకే నేనీ నిర్ణయం తీసుకున్నాను" అని మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. ఆయన్ని అంత పరుషంగా మాట్లాడ్డం, ఇన్నేళ్ళల్లో,  మొదటిసారి చూసాను.
ఆ ఆదివారం, సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, లిక్విడ్ ప్రొపేన్, డ్రై ఐస్ లాంటి వాటితో, కృత్రిమ మబ్బుల్ని సృష్టించి, కాస్త నేల పులకరించేలా చేసారు రామనాథం గారు, ఎన్నో ఏళ్ళ తరువాత మళ్ళీ మొహాల్లో కాస్త సంతోషం వికసించింది. ప్రకృతిని కాపాడుకోవడం ఎంత అవసరమో అందరికీ బాగా తెలిసొచ్చింది.  అప్పట్నించీ ఉన్న పాతికిళ్ళవాళ్ళూ, యుధ్ధప్రాతిపదికన మొక్కలు నాటడం ప్రారంభించారు, ఇప్పటికి పదేళ్ళయింది... ఇప్పుడన్నీ మా ఊరుకి వచ్చే అతిథులకి స్వాగతం పలుకుతూ, తలలూపుతున్నాయి... మా ఊరి పేరు కూడా మార్చి, రామనాథపురంగా మార్చారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రకృతివనం అవార్డ్ ని మా ఊరు అందుకుందంటే, అది కేవలం రామనాథంగారి వల్లే... ఆ ఆదిదంపతులు మాత్రం ఎప్పటిలాగే తమ పిల్లలతో కబుర్లు చెబుతూనే ఉన్నారు.
***

No comments:

Post a Comment

Pages