మనోబలమే మహాబలం - అచ్చంగా తెలుగు

మనోబలమే మహాబలం

Share This

మనోబలమే మహాబలం

బి.వి.సత్యనాగేష్

         
ఒక వ్యక్తిలోని మానసికబలం ఒక శక్తిగా మారి వ్యవస్థనే స్థాపిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. మహాత్మా గాంధి తన మనోబలంతో ఒక సిద్ధాంతానికి కట్టుబడి స్వాతంత్యం కోసం ఒక రకమైన వ్యవస్థను స్థాపించేడు. బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించేడు. అయితే,పుట్టుకతో అందరూ మామూలు మనుషులే కాని వారిలో ఉద్వేగంతో కలిగిన ఆలోచన పునశ్చరణ అవడం వలన వారిలో ఒక రగిలే మానసిక ముద్ర ఏర్పడి మనసులో ప్రళయం సృష్టించింది. మనిషి శవాన్ని చూసిన తర్వాత సిద్దార్ధుడు అనే గౌతమ బుద్ధుడు ఆలోచనా తీరులో మార్పు వచ్చింది. బ్రిటీష్ వారి దురహంకారంతో విసుగు చెందిన తర్వాత మాహాత్మాగాంది ఆలోచనా తీరులో మార్పు వచ్చింది. పదే పదే ఉద్వేగంతో ఆలోచించడం వలన ఒక రగిలే కోరిక (BURNING DISIRE) గా మారింది. అటువంటి వ్యక్తులలో వారనుకున్నది సాధించే వరకూ మనసులో కోరిక రగులుతూనే వుంటుంది. కోరిక మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు. మంచి, చెడు అనేది వారి నమ్మకాల పుట్టను బట్టి వుంటుంది. తాలిబన్ వ్యవస్థను బిన్ లాడెన్ మనోబలంతో స్థాపించేడు. తాలిబన్ల దృష్టిలో అది మంచిది. అమెరికన్ల దృష్టిలో అది చెడ్డది. ఇక్కడ మనం చర్చించుకునే అంశం – మనసులో పునశ్చరణ వలన కలిగే రగిలే కోరిక, దాని ప్రభావం. రగిలే కోరిక వుండే మిలిటెంట్లలో మనోబలం మహా దృఢంగా వుంటుంది. అందుకే ఆత్మాహుతికి కూడా తయారుగా వుంటారు. మంచి, చెడు అనే విశ్లేషణ గురించి కాకుండా మనోబలం ఎలా దృఢంగా మారుతుందనే విషయాన్ని చూద్దాం.
          సమాజంలో వ్యవస్థను ప్రబావితం చేసినవారు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. అంబేడ్కర్ ,మదర్ థెరిస్సా,నెల్సేన్ మండేలా, హానిమాన్ (హోమియోపతి) లాంటి వారు ఎంతోమందిని ఎన్నో రకాలుగా ప్రభావితులను చేసి క్రొత్త వ్యవస్థలను కూడా స్థాపించేరు. వీరు ఈ విధంగా చేయడానికి కారణం – వారి ఆలోచనా తీరు బలపడి ఒక శక్తిగా మారడం మాత్రమే. ప్రతీక్షణంలోనూ వారికి అదే ఆలోచన వుంటుంది. ఏం చేసినా వారి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. లక్ష్యాన్ని సాధించాలనే ఆలోచన తపనగా, రగిలే కోరికగా మారుతుంది. ఆ తపన వ్యవస్థను మారుస్తుంది. నిరంతరం అదే ఆలోచనతో కూడిన పనుల్ని చేస్తూ వారిని వారు అభినందించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యడం వల్లనే వారు సాధించగలుగుతారు.
          బిందెడు నీళ్ళను మరిగించడానికి ఎన్ని వందల అగ్గిపుల్లలతో ప్రయత్నించినా అది సాధ్యం కాదు. నీళ్ళు మరగాలంటే శక్తివంతమైన రగిలే మంట కావాలి. గగనంలోకి బాణంలా దూసుకెళ్ళే రాకెట్ కు కూడా మంటను పుట్టిస్తేనే అది భూమి నుంచి పైకి లేచి సెగలు కక్కుతూ పైపైకి దూసుకుపోతుంది. వ్యవస్థలను స్థాపించేవారు, లక్ష్యాలను సాధించేవారికి కూడా తపన ఆ స్థాయిలో వుంటేనే వారి మనోబలం మహాబలంగా మారుతుంది.
          మంచి ర్యాంకులు సంపాదించుకోవాలనే విద్యార్ధులు, పోటీ పరీక్షలు రాసే అభ్యర్ధులు, అనుకున్నది సాధించేవరకు నిరంతర కృషి చేసేవారు ఈ కోవకు చెందినవారే. వీరందరిలోనూ ఒక పటిష్టమైన, నిర్దిష్టమైన ఆశయంతో కూడిన మనోవైఖరి వుంటుంది. IMPOSSIBLE ను  I’M POSSIBLE గా మార్చి చూపిస్తారు.
          మనోబలం పెరగాలంటే మన సామర్ధ్యాలను, బలహీనతలను ముందుగా గుర్తించాలి. మన సామర్ధ్యాలను పెంచుకుంటూ, బలహీనతలను దూరం చేసుకుంటూ, ఎక్కడ అవకాశముంటే అక్కడ అవకాశాలను చేజిక్కించుకుంటూ, సమస్యలను, భయాలను ఎదుర్కొంటూ సమర్ధవంతంగా కృషి చెయ్యాలి. దీనినే SWOT ఎనాలిసిస్ అంటారు. మైండ్ మేనేజ్ మెంట్ లో ఇది ఒక భాగం.
నిర్దిష్టమైన వైఖరితో అనుకున్నది సాధించటం ఒక అలవాటుగా మార్చుకోవాలి. సిగెరెట్ అలవాటున్న వారికి సిగిరేట్ ఎంత తరచుగా గుర్తుకొస్తుందో, మన లక్ష్యం మనకు అంత తరచుగా గుర్తుకు రావాలి. అంతే కాకుండా... సిగెరెట్ కాల్చేవారు సిగెరెట్ దొరకకపోతే ఎంత ఆత్రుతగా వెతుకుటారో అంత ఆత్రుతతో మన లక్ష్యం మనకు తరచుగా గుర్తుకురావాలి. సిగెరెట్ కు బానిస అయినట్లు లక్ష్యానికి బానిసగా అవడానికి ప్రతీ క్షణం లక్ష్యం గురించి ఆలోచించి ఆచరణలో పెట్టాలి.
          ఈ విధమైన వైఖరి వుంటేనే మనోబలం మహాబలంగా మారుతుంది. లేదంటే సగటునే మిగిలిపోతుంది. ఆలోచన మారితే వైఖరి మారుతుంది. వైఖరి మారితే మార్పు సహజం. వ్యవస్థలో మార్పును తీసుకొచ్చిన మహావ్యక్తుల్లో వున్న ఏకైక రహస్యం- వారి మనోబలం. అందుకే మనోబలాన్ని వైఖరి ద్వారా బలపరచి మహాబలంగా మార్చుకోడానికి ప్రయత్నం చేస్తే సాధించడం మన వంతు అవుతుంది. ఆలస్యమెందుకు? పదండి ముందుకు.

No comments:

Post a Comment

Pages