నా పిలుపే – ప్రకృతి పిలుపు - అచ్చంగా తెలుగు

నా పిలుపే – ప్రకృతి పిలుపు

Share This

నా పిలుపే – ప్రకృతి పిలుపు

పోడూరి శ్రీనివాసరావు 


ఎవరన్నారు? ప్రకృతీ-నేనూ
వేరు వేరని!
నేను ప్రకృతిలో భాగమే కదా!
సృష్టి నుంచీ ప్రకృతితో
నేను మమేకమై ఉన్నాను.
ఆ సంగతి అందరికీ విదితమే.
కానీ!
మరిప్పుడు,ఎందుకు
ప్రకృతినీ-నన్నూ
వేరు చేసి చూస్తున్నారు?
ప్రకృతి భీభత్సంతో
సునామీ తుఫాను
సృష్టించినపుడు
భయంతో వణికిపోయాను.
హూద్ హూద్ తుఫాను
ప్రకంపనలతో నాతనువు
చిగురుటాకులా కంపించింది.
ఏపాటి చిన్న కలవరమైనా
నాలో ప్రభావాన్ని చూపుతోంది.
కానీ!
నాలో మరో మనిషున్నాడు.
ఎప్పటికప్పుడు నాలో
ఆనందాన్ని హరించేస్తున్నాడు.
నేను బాధపడుతుంటే
పైశాచిక ఆనందాన్నిఅనుభవిస్తున్నాడు.
పచ్చగా, ఏపుగా
పెరిగిన చెట్లను
తెగనరికీ,సొమ్ము చేసుకుంటున్నాడు.
వాతావరణ సమతుల్యం
లోపించడంతో కలిగిన
ఉపద్రవాలను తనకు
అనువుగా మలుచుకొంటున్నాడు.
ఎన్ని విధాల వీలవుతుందో
అన్నిరకాల కల్తీలు చేసి
తన ఆరోగ్యంతో
తనే ఆటలాడుకుంటున్నాడు.
విజ్ఞానశాస్త్రం ఒపోసనపట్టిన
మానవుడు ప్రకృతిపై
ఆధిపత్యం చెలాయించాలని
అర్రులు చాస్తున్నాడు
కానీ! తనకు తెలియందొకటే!
తనే ప్రకృతినని!
తనే తన విధ్వంసానికి
శ్రీకారం చుట్టుకుంటున్నాడనీ!
గోతులు తీసుకుంటున్నాడనీ!!
చెట్లెందుకు నరుకుతున్నావంటే?
కరంటు తీగలకు, కేబుల్ వైర్లకు
అడ్డంటాడు....
పదిచెట్లు నరికితే..
వంద మొక్కలను
పెంపకానికి ఇస్తున్నాను కదా!
అంటాడు.
కానీ, ఈ మొక్కలు ఎన్నాళ్ళకు
పెరిగి వృక్షాలవుతాయి.
మానవుని అవసరాలు తీరుస్తాయి.
అన్యాయంపై న్యాయం గెలుపులా...
చెడును అణగదొక్కిన మంచిలా...
నాలో మరో మనిషిని అంతంచేసి
ఆ దుర్మార్గపు ఆలోచనలను
సమాధి చేసి...
ప్రకృతిని బ్రతికించాలి...
కనువిందు చేసే ఆ అందాలు
విశ్వమంతా వెల్లివిరియాలి.
ప్రతిఒక్కరూ
ప్రకృతిని మమేకభావంతో చూడాలి
ప్రకృతి వేరు-తాము వేరు
అన్న ఆలోచనలకు
తిలోదకాలివ్వాలి.
మనిషిలో లేని సుగుణం
ప్రకృతిలో ఉంది...
చిన్న తీగైనా, ప్రక్కన
కనబడ్డ చెట్టుని
ఆలంబనగా, ఆత్మీయంగా
కౌగిలించుకుంటుంది.
ఆప్యాయంగా పెనవేసుకుంటుంది.
మరి మనిషో?
ఎదుటి మనిషి నచ్చకపోతే
మారణాయుధాలతో
ఎదురుదాడి చేస్తాడు.
ఏసిడ్ దాడి చేస్తాడు
వికృతరూపం కలిగిస్తాడు
తనమాటకు లొంగకపోతే ...
ఆస్థి అయితే కబ్జా చేస్తాడు
ఆడడైతే అత్యాచారం చేస్తాడు
ఆపైన ‘హత్యాచారం’ చేస్తాడు.
ప్రకృతి నుంచి ప్రేమించే
గుణం నేర్చుకోలేని మానవుడు-
ప్రకృతి పధ్ధతి నచ్చని మానవుడు-
ప్రకృతిని నాశనం చేస్తాడు
తానే ‘సుప్రీమ్’ అనుకుంటాడు-
కానీ!
తానూ ప్రకృతిలో భాగమేనన్న
నిజాన్ని విస్మరిస్తాడు.
కులాలపేరుతో, మతాలపేరుతొ
విద్వేషాలు సృష్టిస్తాడు
మారణహోమం తలపెడతాడు.
నిన్ను నువ్వు తెలుసుకున్ననాడు,
నువ్వే ప్రకృతి అన్న సత్యం గ్రహించిననాడు,
శాంతి సామరస్యాలకై పాటు పడతావు
అలోకికానందం, ఆత్మానందం
అనుభవించగలుగుతావు.
నీలోని మరోమనిషిని
సమాధి చెయ్యి
స్వార్ధానికి చింతబరికెతో
పాఠం చెప్పు
ప్రేమానురాగాలు ప్రసరింపజేయి.
ప్రపంచశాంతికై పునాదులు వేయి
నీ పిలుపే... ప్రకృతిపిలుపని
నలుగురూ అంగీకరించేలా,
గర్వపడేలా ప్రవర్తించు
ప్రకృతే పులకించి, ఆహ్లాదం పంచిననాడు
ఈ భూమే స్వర్గమౌతుంది.
భూమాత పులకరిస్తుంది
ప్రకృతి పరవశించిపోతుంది.

No comments:

Post a Comment

Pages