నరజంతువు
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
ఆవేదన ఎందుకు?
జనారణ్య జీవనంలో
జంతువుల సారూప్యతనొందుతున్నాము కదా!
మాటలతో చేతలతో వెంటాడి వేటాడి
గాయపరచే చిరుతలు లేరా మనలో?
జిత్తులమారి నయగారాలు పోతూ
కొంపలు కొల్లేరుచేసే నక్కలు లేరా మనలో?
ఐశ్వర్యంతో బలిసిన ఏనుగులు
కన్ను మిన్ను కానక కాటేసే మిన్నాగులు ఉన్నారా? లేరా?
క్షణానికో రంగుమార్చే ఊసర వెల్లులు
బలంగా పట్టుపట్టే ఉడుంలూ ఉన్నాయంటారా లేదా?
రాక్షస బల్లులు..జంతుజాతిలో అంతరించిపోయాయేమోగాని
మనలో మాత్రం అడుగడుగునా ద్యోతకమవుతున్నాయి
శాఖాహారి కోతినుండి పుట్టి
మాంసాహారి అయి ప్రాణాలు తోడేస్తున్నాడు
విచక్షణ కోల్పోయి వివేకం కొరవడి
మృగానందాన్నందుతున్నాడు!
మీకు సాక్ష్యం కావాలా?
అమ్మాయిల మీద అఘాయిత్యాలు
భ్రూణహత్యలు
తీవ్రవాద ఘాతుకాలు
ఇవి చాలవటండి మచ్చుకి!
***
No comments:
Post a Comment