ప్లాస్టికాసురుడు -కలిపుత్రుడు
మధురిమ
అసురులు ఎంత ఘోర తపస్సు చేసినా ఎన్ని వరాలు పొందినా మరణాన్ని జయించలేకపోతున్నారు, అసురజాతి ఇక అంతరించిపోతుందేమో అన్న భయం కలియుగ రారాజు అయిన కలిని పీడించసాగింది. ఎన్ని తిరకాసులు పెట్టి వరాలు అడిగినా ఆ మాయల మరాఠి, ఆ శ్రీహరి, ఏదో ఒక లొసుగు పెట్టి నా వాళ్లందరినీ పొట్టనబెట్టుకుంటున్నాడు". ఈసారికి ఆహరికి ఏలొసుగు కూడా దొరక్కుండా జాగ్రత్తగా పథకం వెయ్యాలి అనుకున్నాడు."అసలే ఈ కలియుగంలో భక్తుడికి భగవంతుడికన్నా ఆయన ఇచ్చే బహుమతులపైనే దృష్టెక్కువ ఏదో ఓ అవసరం ఉంటేనే తప్ప మనిషి ఆయన జోలికి పోడు. ఇక డబ్బుకంటే మనిషికి పెద్ద మత్తు ఇంకోటి లేనేలేదు. కాసులొస్తాయంటే కసాయివాడికన్నా కర్కోటకుడీ మనిషి. డబ్బుకోసం ఈ యుగంలో మనుషులు కూడా గడ్డి తింటారు.
" భలే! భలే! నా ఈ యుగంలో అందరూ దేవుడా దేవుడా అంటూ అరుస్తారు. ఎందుకంటే ఆ వెర్రిదేవుడు నాపేరు భక్తి తో చెప్పండిరా చాలు మీకు పుణ్యం ఇచ్చేస్తాను అన్నాడు. లొసుగుల రాయుడు భక్తితో చెప్పమన్నాడు. ఈ మనుషులకు భక్తెక్కడ? ఏదో మొక్కుబడికి పక్కవాడిని తొయ్యడానికీ "గోవిందా గోవిందా " అంటాడుకానీ...అయినా భక్తికి ఈ మనిషికి టైమెక్కడ?? భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది ఈయుగంలో భక్తి కాదు "అంబికా వారి అగరవత్తి” అంటూ ఓ వెర్రి నవ్వు నవ్వి "బతికినంత కాలమూ డబ్బుల వెనక, కుటుంబం వెనక లేక ఎవరో ఒకరి వెనక పడి పడి డబ్బు ని దోచి దాచి ఆకరికి పుట్టెడు రోగాలతో మంచానపడి, తిండికూడా తినలేని స్థితిలో ఉన్నా చచ్చేటప్పుడు కూడా తాపత్రయం వదులుకోలేక దాచిన దబ్బు ఏమవుతుందో అన్న మందులేని మనోవ్యాధి తో మూలుగుతూ చచ్చే ఈ మనిషికి భక్తా??" భక్తిలేని ఈ మనుషులవల్ల భగవంతుడికి ఈ యుగంలో బలమెక్కడిది? కృతయుగంలో అయినా, త్రేతాయుగంలో అయినా ద్వాపరయుగంలో అయినా ఆ మాయల హరికి బలం ఎవరు? "నువ్వే దిక్కన్న భక్తులు" వాళ్ళ సాయంతోనే కదా నా తాత ముత్తాతలను మట్టుబెట్టాడు."ప్రహ్లాదుని అచెంచల భక్తికే కదా మా హిరణ్యకశిపుడు బలయ్యాడు?". ఇక మా రావణుడు ఛీ వాడి బతుకు చెడ కోతుల భక్తి సాయంతో ఆ రాముడు మా లంక ని మా రావణున్ని బుగ్గి చేసాడు. ఈ కలియుగంలో మనుషులకి అంత భక్తెక్కడ?? వీరికి భక్తి కంటే “భక్తి టీవి చూడ్డం అనుకుంటున్నారు...లేదా ఓ యాగానికి పాపపు సంపాదనలోంచి ఓ పదివేలు చందా ఇవ్వడమో లేకపోతే ఓ 20,000 పెట్టి ఓ రుద్రాక్షమాలనో లేదా గ్రహపీడా నివారణ అంటూ ఓ లక్ష పెట్టి నవరత్నాల ఉంగరం పెట్టేసుకుంటే"దేవుడొచ్చి రక్షించెస్తాడు అన్న వెర్రి భ్రమ లో ఉంటారు వీరు. ఒకప్పుడు ఏ భక్తుల అండతో మా అసుర జాతిని అంతం చేసాడో ఈనాడు ఆ భక్తిలేని మనుషులతోనే ఆ శ్రీహరి పనిపడతా. ఇలాంటి సమయంలోనే నేనే ఈ సారి బ్రహ్మ కోసం తపస్సు చేస్తా అంటూ... ఓ వికటాట్టహాసం చేస్తూ..."ఒళ్ళంతా పుట్టలు మొలిచేవరకూ తపస్సు చేయడానికి బయలుదేరాడు.""ఓం నమో బ్రహ్మదేవాయనమః " అని మొదలు పెట్టగానే... సత్యలోకంలోంచి అది విన్న బ్రహ్మ గారు ఆశ్చర్యపోయారు.అసలే ఈ మనుషులను సృష్టించీ, సృష్టించీ అలిసి,విసిగి అంతా భక్తిగా కొన్ని యుగాలతరువాత తన కొసం తపస్సు చేస్తున్న కలిని చూసి ముచ్చటపడి పాపం ఏ పరీక్షలు ఇక పెట్టకూడదని నిర్ణయించుకుని వెంటనే ప్రత్యక్షం అయిపోయారు."భక్తా కలీ" నీ తపస్సుకి మెచ్చాను "ఏమి నీ కోరిక నాయనా?" అని అడగగానే...నెమ్మదిగా కళ్ళు తెరిచిన కలి "ఇదేమిటి స్వామి ఇంత తొందరగా వచ్చావు? నా వంటి మీద పుట్టకాదు కదా లైఫ్బాయ్ సబ్బుతో స్నానం చేసినంత శుభ్రంగా ఉంది. ఓ మట్టి రేణూవైనా రాలేదు, నా ఒంట్లోంచి ఓ కాకరపువ్వొత్తొచి అది అలా ఇంద్రుని దగ్గరకు వెళ్ళి అప్సరసల డాన్స్లు చూస్తూ టైంపాస్ చేసే అతనిని భయపెట్టాలి, ఆయన ఆ డాన్సర్లను వీసా పాస్ పోర్ట్ లేకుండా హడావిడిగా ఇక్కడికి పంపాలి... ఇంత తంతు బాకీ ఉండగా అప్పుడే నువ్వు వచ్చేసావు ఏమిటి స్వామి అని వాపోయాడు. " అంత ఘోర తపస్సు చేసే టైము ఇప్పుడెవరి దగ్గరుంది నాయనా "త్వరగా రాకపోతే నువ్వు కూడా మానేసి వెళిపోతావేమోన్న భయంతో వచ్చేసాను నాయనా "అనగానే. నువ్వు ఇంత మంచివాడివి కనుకనే మా తాత ముత్తాతలందరూ నీకోసం తపస్సు చేసారు. నువ్వు నేను ఏమడిగినా ఇస్తావు అని నాకు తెలుసు స్వామీ కాని ఎప్పటిలా ఆ శ్రీహరి తో కుమ్మక్కై రాలేదు కదా. ఏదో ఓ ఫిట్టింగ్ పెట్టి నువ్వు వరం ఇచ్చినా ఆ హరి మాట చెల్లకుండా చేస్తున్నాడు. అందుకే ఆలోచించకుండా వరాలిస్తావన్న చెడ్డపేరు నీకు, గుళ్ళు గోపురాలు ఆ శ్రీహరికి. ఇంత మంచి వాడివే నీకు ఒక్క గుడైనా ఉందా చెప్పు? ఏదో ఒకటి నీకు...వీధి వీధికి ఓ గుడి ఆ హరికి. ఇదేం న్యాయం?? అని బ్రహ్మగారికి మన కలిపురుషుడు బటర్ రాయడం మొదలెట్టగానే...బ్రహ్మ గారు"కలి ఎక్కడుంటే అక్కడ కలహం అంటే ఇదే కాబోలు ..లేకపోతే విరించి కి ఆ హరికి కూడా విభేదాలు సృష్టించగలుగుతున్నాడే అనుకొని.. నా సంగతికేంలే నాయనా నీకు ఏం కావాలో చెప్పు చాలు అన్నారు." స్వామీ నాకు ఓకొడుకు కావాలి. వాడు "గాలివలన కానీ,నీటి వలన కానీ,మట్టిలో కానీ,మట్టిపైన కానీ,ఇంటిలోకానీ,ఇంటిపైకానీ,ఇం టి చుట్టూ,ఆఖరికి గడపముందు,బయట,గడప మీద కానీ(ఈ లొసుగేగా మా హిరణ్యకసిపునికి పెట్టావు...),పొద్దున్న కానీ,సాయంత్రం కానీ,సంధ్యా సమయంలో కానీ,రాత్రికానీ,24గంటలలో ఎప్పుడూ,చైత్ర ,వైశాఖ మొదలగు పన్నెండు మాసాలలో ఏ మాసంలోనూ, ఆదివారం, సోమవారం మొదలుకుని వారంలో ఏరోజునూ,ప్రభవ విభవ మొదలగు అరవై సంవత్సరాలలోనూ ,అతళ,వితల సుతల మహాతల ,పాతాళ మొదలైన 14 లోకాలలోను,యక్ష ,కిన్నెర,కింపురుష,గంధర్వాది సురలచేతగానీ,ఇంద్రాది అష్టదిక్పాలకులవలనగానీ,ఏదేవుడి గుడిలోపలా,గుడిబయటా,ధ్వజస్థంబం దగ్గరా కానీ, వజ్రాయుధం మొదలుకుని ఆఖరికి మనిషి వాడే చిన్న సూదితోకానీ,గీజరు,హీటరు,వాషింగ్ మెషిన్,ఇస్తీపెట్టి వంటి మనిషి కనుకున్న విద్యుత్ ఉపకరణాలతో గానీ లేసర్,పెట్రోల్,గ్యాస్,,కిరోసి న్ మొదలగు వాటిచేతగానీ, ఆఖరికి మనిషి ఒంట్లో కానీ ,బయట గానీ,మనిషియొక్క నవరస స్వభావాలైన ఆనందం,కోపం వంటి వాటితోగానీ,చివరికి మీ త్రిమూర్తులవల్ల కూడా "మరణం" లేకుండా వరం ప్రసాదించు బ్రహ్మదేవా అని గుక్కతిప్పుకోకుండా ఈ లిస్టు పూర్తి చెయ్యగానే....బ్రహ్మ గారు కాస్త కంగారు పడినా తనని తాను కాస్త తమాయించుకుని నువ్వు ఎంత జాగ్రత్త పడి ఎన్ని తిరకాసులు పెట్టినా నీ కుమారుడి అంతం ఏదో ఒకనాడు తప్పదని మనసులో అనుకొని "చూడు నాయనా ఏయుగంలో అయినా భగవంతుడు నిజ భక్తునికే దాసుడు.ఇప్పుడు కూడా నువ్వు మనస్పూర్తిగా భక్తితో నన్ను పిలిచావు కాబట్టే నేను వచ్చి నీకు ఈ వరం ఇవ్వ గలుగుతున్నాను అంటూ "తధాస్తు" నువ్వు పైన చెప్పిన లిస్ట్లో పేర్కొన్న వేటివల్ల నీ కుమారుడికి మరణం సంభవించదు. అని అభయహస్తం చూపించేసేరికి టైడ్ అడ్వటైజ్మెంట్లొ అవాక్కైనట్లు ఓమెరుపు మెరిసి బ్రహ్మ గారు మాయమైపోయారు." ఇక కలి సంతోషానికి అవధలే లేవు."అహహ ఆ హరి మోసం చెయ్యగలిగే ప్రతీ విషయాన్ని పసిగట్టి వరం పొందా..ఇంక నా కొడుకు అమరుడు,అజేయుడు.వాడు ఆచంద్రతారార్కం ఉండి అల్లకల్లోలం సృష్టించి మాయమైన మా అసురజాతి వైభవాన్ని మరలా తీస్కువస్తాడు అంటూ ఓ కుమారుడిని వరప్రభావం వల్ల సృష్టించి వాడికి ప్లాస్టికాసురుడు అని పేరు పెట్టాడు."వాడిని చూసి వికటాట్టహాసం చేస్తూ భళా కుమారా భళా..నీ తండ్రి విజయానికి మొదటిమెట్టు ఎక్కించావురా..ఇక నీవు ప్లేట్లు, గ్లాసులు,చెంచాలు,గిన్నెలు బాటిళ్ళు,డబ్బాలు మొదలగు వాటినుంచీ,కార్లు,ఫోన్లు,కుర్చీ లు,టేబుళ్ళ వరకు ఇలా ఎన్నో రూపాంతరాలు చెందుతూ...నువ్వు లేకపోతే మనిషికి రోజు గడవకుండా చెయ్యలిరా..నీ రూపాంతరాలలో ముఖ్యమైనది కవర్ రా...మనిషి ప్లాస్టిక్ కవర్ లేకపోతే చచ్చిపోయేలా ఈకవర్లు ఎంత వాడినా వాడికి విసుగురాకూడదు సరికదా వాడేసి పారేసిన ఆ కవర్ల చెత్త భూమిని చుట్టగలిగే లా పేరుకుపోవాలి....అప్పుడు నిన్ను వదులుకోలేక,ఉండలేక మనిషి చిత్రవధ అనుభవించాలి....విజయోస్తు కుమారా వెళ్ళు నీ పని మొదలు పెట్టు అంటూ వాడిని పుడమిపైకి దండయాత్ర కి పంపాడు. ఇక అప్పటినుండీ వాడి విజృంభణ మొదలైంది. హయిగా పొద్దుటే ఓ వేప పుల్లతో సుబ్బరంగా పళ్ళు తోముకుని స్వచ్చమైన ఆరోగ్యంతో ఉండే మనిషి టూత్ బ్రష్ అంటూ తయారయ్యాడు. పెరట్లో పాడావులూ, గేదెలు పోయి. వీధి గుమ్మంలో తెల్లటి పేడ వేసారా అన్నట్టుగా పాలప్యాకెట్ట్ రేడీ అయ్యింది. హాయిగా ఇత్తడిదాంట్లోనో, రాగి దాంట్లోనో, కంచు చెంబు తో స్నానం చేసే చోట...ప్లాస్టిక్ బకెట్టు, మగ్గు ప్రత్యక్షం అయ్యాయి. పొయ్యి లోని బూడిద ని కొబ్బరిపీచుని కలిపి అంట్లుతోముకునే అప్పమ్మ ప్లాస్టిక్ స్క్రాచి బ్రైట్ తో 100 నిమ్మకాయల శక్తితో చేతులకు మంట మండించే విం జెల్ తో తయారయ్యింది. నిన్న రాత్రి భోజనం చేసిన ప్లాస్టిక్ పళ్ళేలు కడగడానికి. నీళ్ళు తాగే బాటిళ్ళ నుండీ, నూని డబ్బా వరకు, పోపులపెట్టె నుండీ పౌడర్ డబ్బా వరకూ,ఇంకా ఎదిగి ఫ్రిజ్జులు,కార్లు,కంప్యూటర్లు, ఫోన్లు ఇలా ఆ ప్లాస్టికాసురుడు త్రివిక్రముడిలా ఎదిగిపోతున్నాడు. నూలు బట్టలు పోయి నైలాన్ బట్టలు వచ్చాయి..ఇది కూడా ప్లాస్టిక్ లాంటిదే పట్టు బట్టకన్నా పాలిస్టర్ బట్ట చవకని అందరూ దాని వెంట పడ్డారు.అలా..అన్ని రంగాలలో అన్ని అంగాలలో చొచ్చుకుని అవసరమైతే చీల్చుకుని త్రివిక్రముడిలా ఎదిగి ఎదిగి..ఓకాలు నేల పై,ఓకాలు జీవరాసులపై ఓకాలు ప్రకృతి పతనం పై.ఓకాలు మనిషి జీవితం పై వేసి నాలుగు కాళ్ళున్న వీడు అష్టదిక్కులిని ఆవహించి,భయంకరమైన ఆందోళనని,అలజడినీ సృష్టిస్తున్నా..మనిషి మాత్రం వ్యసనానికి బానిస అయిన వాడిలా తప్పనితెలిసినా వాడడం మానలేక,వదలలేక ముప్పతిప్పలు పడుతున్నాడు.వీడులేకుండా మనిషికి ఒక్క క్షణం గడవట్లేదు. పర్యవసానంగా భూమంతా ప్లాస్టిక్ చెత్తతో నిండసాగింది. జీవనదులలో, మహాసముద్రాలలో, దేవాలయాల్లో ఉద్యానవనాల్లో ఎక్కడచూసినా ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ళు ఇవే కనిపించ సాగాయి. ఇలా అవ్వడం వలన భూమిపై మట్టిలో సారం నశిస్తోంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకడం తగ్గి పోయింది, ఎన్ని వర్షాలు పడినా తాగడానికి మంచి నీరు దొరకడం కూడా కష్టం అయిపోయింది. కొన్నాళ్ళకి వర్షాలు తగ్గిపోయాయి... భూమాత తాపం పెరిగిపోయి విలవిలాడింది. సముద్రంలో జంతుజాలం ఈప్లాస్టిక్ అణువులతో పరమాణువులతో నిండిపోవడం వల్ల అలాంటి చేపలు అవీ తినే మనుషులు అనారోగ్యం పాలు అవ్వడం, ప్లాస్టిక్ ప్లేట్లలో, కవర్లలో ఆహారం తినే మనుషులు… కాన్సర్ వ్యాధితో బాధపడి చనిపోవడం కూడా మొదలైంది. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు ప్లాస్టిక్ ని కడుపు నిండా తిని చనిపోతున్నాయి. ఇలా చని పోవడం ఇవన్నీ జరగడం వల్ల భూమాత ఈ అరాచకాన్ని తట్టుకో లేక పోయింది. ప్రకృతి వినాశనాన్ని చూసి తట్టుకోలేక ఆ హరి దగ్గరకు వెళ్ళి "నారాయణా… శరణూ, శరణు… గ్రహాలు తొమ్మిది ఉన్నా నాపైనే జీవరాసులకి జీవనం ఉండేటట్లుగా అన్ని ఏర్పాట్లూ చేసి నన్ను తరింపచేసావు. ప్రశాంతంగా సాగిపోతున్న ఈ సృష్టికి ప్రళయం వచ్చిందా అన్నట్లుగా ఈ ప్లాస్టికాసురుడి విజృంభణ తట్టుకోలేకున్నాను. " పురుషోత్తమా బ్రహ్మవరప్రసాదంతో కలి సృష్టించిన ఈ ప్లాస్టికాసురుడి ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి కాని తగ్గడంలేదు. దశావతారాలు ఎత్తి దుష్టులని సంహరించిన నీవు వాడిని ఎప్పుడు సంహరిస్తావు నాధా. అనివేడుకోగా "ధరిత్రీ విధాత ఇచ్చిన వరాలకి తిరుగులేదు. అవి ఏమైనా ఎలక్షన్ల ముందు భూలోకంలో రాజకీయ నాయకుల వాగ్దానాలు అనుకున్నావా. సాక్షాత్తు సృష్టికర్త వరాలు. వాడిని అంతమొందించడం దాదాపు అసంభవం అన్నాడు." అప్పుడు ధరణీ దేవి ఆశ్చర్యపడి ఆ.."శ్రీమన్నారాయణా నువ్వేనా ఈ మాటలంటున్నది??" ఆది అనంతము అయిన నువ్వే ఇలా అంటే ఎలా స్వామి నీ వల్ల కాని పనేముంది అని మొరపెట్టుకుంటున్న భూదేవితో "ఒకప్పుడు రాక్షసులను సంహరించడానికి నాకు ఈ మానవుల భక్తి భావనలే ఆయుధాలు...భక్తి విహీనులై, ఈ కలి మాయా ప్రభావంచేత భక్తిభావనకన్నా సిరి సంపదలే శాశ్వతం అనుకునే ఈ నేటిమానవుల వల్ల నాకు బలం ఎక్కడిది??వాడి విజృంభణని ఎవ్వరూ ఆపలేరు...పూర్తిగా అంతమూ చెయ్యలేరు. కానీ అని ఆగాడు శ్రీహరి " ఏమిటి స్వామి ఆగావు? ఏదో ఉపాయం ఉండే ఉండి ఉంటుంది. సెలవియ్యి నారయణా అని పదే పదే వేడుకో సాగింది. అప్పుడు నారాయణుడు చిద్విలాసంగా ఆ కలి తన కుమారుడైన ప్లాస్టికాసురుడికి మరణం లేకుండా బ్రహ్మ ని వరాలు అడిగినప్పుడూ అన్ని చెప్పడుగానీ ఒక్క విషయం మర్చిపోయాడు అదే "మానవత్వం". వాడిని అంతమొందించడానికి మిగిలిన ఒకే ఒక అస్త్రం. మానవత్వం ద్వారా వాడి ప్రభావన్ని తగ్గించుతూ నెమ్మదిగా నెమ్మదిగా వాడి ప్రభావాన్ని మనిషి జీవితం నుండీ తగ్గిస్తే వాడికి ఉనికికి తావులేక వాడే అంతమైపోతాడు. కాని మానవత్వం అన్నది ఏఒక్క మనిషికో సంబందించినది కాదు యావత్ మానవ జాతి అంతా కలిసి ఈ బృహత్ కార్యాన్ని నిర్వహించాలి. ఈ పనిలో కేవలం నేను దిశా నిర్దేశం చేసే నిమిత్త మాత్రుడను. ఆ దిశ గా పయనించి వారి దశ ని మానవులే మార్చుకోగలగాలి...లేకపోతే వినాశనం తప్పదు. అన్నాడు పుడమిపై నివసించే ప్రతీ ప్రాంతంలో ప్రతీ మనిషి ఈ పనికి పూనుకోవాలి. ఇదే యావత్ మానవ జాతి ఈ కలియుగంలో చేయవలిసిన మహాయజ్ఞం. సృష్టిలో ప్రతీ ప్రాణికి స్వేచ్చగా జీవించగలిగే హక్కు ఉందని గ్రహించి మానవత్వపు విలులవలతో మెలిగి. ఎవరెలా పోతే నాకేంటిలే అన్న భావన వీడి రేపటికోసం ఆలోచించడం మొదలుపెట్టి "ఈ ప్లాస్టిక్ లేని నిన్న కూడా నా మనుగడ సాగిందే అది ఎలా అని అలోచించుకుంటూ అంచెలంచెలుగా వీడి వాడకాన్ని తగ్గించి వాడిని నిర్వీర్యం చెయ్యాలి."అట్టహాసంగా ఆర్భాటంగా ఒకేసారి మొత్తం ప్లాస్టిక్ వినియోగం ఆపేయలేము. ఎందుకంటే ఈ అసురాధముడు మానవుల జీవితంలో అంత పెనవేసుకుపోయాడు. అత్యవసరమైనవి నెమ్మది నెమ్మదిగా అఖర్లేనివి తక్షణమే వదిలెస్తే వీడి వినియోగం తగ్గి తగ్గి వాడి బలం నశించి వాడు కృంగి వాడి విజృంభణ తగ్గుతుంది. కృసించిన వాడు నామరూపాల్లేకుండా పోయే రోజు తప్పకుండా వస్తుంది.కాని దానికోసం మనుషులంతా కలిసి ఓ వంద సంవత్సరాలు కష్టపడాలి.మనుషులంతా ఒకటై,మానవత్వం అనే ఆయుధంతో పోరాడి వాడిని అంతమొందించాలి.అప్పుడే నీకు విముక్తి.అంతవరకూ నీకు వీడినుండి ఈ ఆగడాలు తప్పవు అనిముగించాడు.భూదేవి నారాయణుడికి నమస్కరించి అంతమే లేదని విర్రవీగే వీడిని అంతమొందించే తరుణోపాయం ఉందికదా నారాయణా.ఈ మాట నాచెవులలో అమృతం పోసినట్లుగా ఉంది.స్వామి ఈ ప్లాస్టికాసురిడి పై మానవత్వపు పోరాటం చెయ్యడానికి నీ సంతానమైన ఈ మనుషులకు నువ్వే ఆ సదాలోచనను , సద్బుద్ధిని ప్రసాదించవయ్యా... అని వేడుకుని ఇలా చెప్ప సాగింది "ఓర్పుకి మారు రూపం అయిన నేను ఆరోజు కోసం ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాను." అని వెళ్ళిపోయింది. ప్లాస్టికాసురిడిని ఎదిరించడానికి వాడితో పోరాడాలంటే మానవత్వం కావాలి. అది భూమి మీద లేదు కాబట్టి ఆ శ్రీహరి నిరుపేదలైన అజ్ఞాతధనాలైన మానవత్వపు విలువలను కలిగి ఉన్న ఒక సాధారణ దంపతులైన శివయ్య, పార్వతమ్మలనే దంపతులకు జన్మించాడు. ఆ దంపతులు లేక లేక తమకు కలిగిన సంతానానికి శుబోధుడు అని పేరు పెట్టుకుని అల్లరు ముద్దుగా పెంచుకోసాగారు. ఇదంతాచూస్తున్న మన కలి "వెర్రి హరి, ఆయుధాలతోనే చావని వాడిని మానవత్వంతో చంపుతాడా అది వీడి తరమా ??చూద్దాం అసలు వీడేంచేస్తాడో చూద్దాం అని మాయలో పడిపోయాడు. చిన్న వయస్సు నుండీ శుబోధుడు తనపేరుకి తగినట్లుగా తన తోటివారికి, తల్లితండ్రులకు అందరికీ మంచి మంచి విషయాలు చెప్తూ ఉండేవాడు. అతని ప్రవర్తన కూడా అందరికీ చాల విచిత్రం గా ఉండేది. అరిటాకులోనే అన్నంతినే వాడు, నూలు వస్త్రాలనే ధరించేవాడు. తనతొటిపిల్లలందరూ ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే తను చెక్కబొమ్మలు స్వయంగా చేసుకుని ఆడుకునేవాడు. పెరిగి పెద్దవాడై యుక్తవయస్కుడయాడు. ఓసారి వాళ్ళమ్మ కూరలు తెమ్మని బజారుకి పంపింది.శుబోధుడు కూరలు కొంటూ ఉండగా ఒకావిడ కూరలు కొని సంచి లేక "సంచి మర్చిపోయా ఓ ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఇవ్వు బాబూ..."అంది..దానికి వాడు...ఓ అలాగే అమ్మ అంటూ ఒక్కో కూరా ఒక్కో కవరులో పెట్టి ఇచ్చాడు.ఆవిడ వెళ్ళ బోతూ ఉండగా శుబోధుడు "అమ్మా ఒక సంచిని కూడా తెచ్చుకుంటే ఇన్ని కవర్లు వాడకర్లేదు కదా " ప్లాస్టిక్ విషంతో సమానం దాన్ని వాడడం తగ్గించాలమ్మా అన్నాడు.దానికి ఆమె "నేనొకర్దాన్ని తగ్గిస్తే ఏమీ ప్రయోజనం ఉండదు బాబూ... అందరూ మానినప్పుడు చూద్దాంలే అంది"..అందరూ ఇలా అనుకోబట్టే ఇవాళ ప్రపంచం అంతా ప్లాస్టిక్ తో నిండిపోయింది అని ఇంకా ఎదో చెప్పబోగా "నీ పనేదో నువ్వు చూసుకోవయ్యా ,ఇలా మానండీ మానండీ అంటూ ఎంతమందికి చెప్తావు ?నువ్వు చెప్పినా వినే స్థితిలో ఎవ్వరూలేరు అనుకుంటూ రుసరుసలాడుతూ వెళిపోయింది. ఈలోగా మన కలిపురుషుడు అవహేళన చెయ్యడం ప్రారంబించాడు, శుబోధా చూసావా నీ మాట ఎవ్వరూ వినరు...అంటు వికటాట్టహాసం చేయ్యసాగాడు. ఎన్నిచోట్ల ఎంతమందికి ఎంత మంచిగా చెప్పినా ఇదే పరిస్థితి ఇక లాభం లేదనుకున్నాడు. శుబోధుడు అలోచించాడు ఎంతమందికి చెప్పాలి? ఎలా చెప్పాలి అని అలోచించాసాగాడు. హరి అన్న మాట స్మరిస్తెనే కలి బాధలనుండి విముక్తి కలుగుతుంది కదా ఆ మాటనే ఆయుధం గా వాడతా అని తను ఏంచెయ్యాలో నిర్ణయించుకున్నాడు. ఇక ఆరోజునుండీ పాఠశాలలో, కాలేజీలలో విధ్యార్ధులకి, ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులకి, రైళ్లలో బస్సులలో, పార్కులలో ఎక్కడబడితే అక్కడ తనదైన రీతిలో ఇలా ప్రసంగించేవాడు. సాక్షాత్తు భగవ్దాంశతో పుట్టిన శుబోధుడి మాటలు అయస్కాంతాలలా ప్రజలని ఆకర్షించేవి. కొందరు పర్యావరణ పరిరక్షకులనే సత్పురుషులు, ప్రసార మాధ్యమాలు అన్ని శుబోధుడికి అండగా నిలిచాయి. శుబోధుడి పేరు ఊరూరా వాడవాడా కాదు దేశ దేశాలు దాటి ఖండాంతరాలవరకూ వెళ్ళిపోసాగింది. శుభసంకల్పానికి దైవాశీర్వచనం తోడయ్యి... శుబోధుడి నాయకత్వంలో వీరందరూ కలిసి ఒక సేనలా తయారయ్యి యావత్ ప్రపంచానికి ఈవిధంగా తమ వాదన వినిపించారు. ప్రకృతిని తల్లిగా ఈ జగత్తుకి అందించాడు పురుషోత్తముడైన నారాయణుడు.ప్రకృతి యావత్ సృష్టికే మాత.తల్లికి ఇవ్వడమే కానీ తీసుకోవడమే తెలియదు.ఎర్రటి తన నెత్తురుని తెల్లటి పాలగా మార్చి పిల్లలను పోషించి పెంచుతుంది.అంతకన్నా ముందు మొట్టమొదట మనం తలదాచుకున్నది తల్లి గర్భంలోనే కదా...ఆమె గర్భసంచిలోనే కాదా మన ప్రాణాన్ని పెట్టాడు ఆ విరించి.ఇలా తల్లిలాగానే మన ప్రకృతిమాత కి కూడా మనందరికీ ఇవ్వడమే తెలుసు...మనం ఈ పుడమి పై పడినప్పడినుంచీ మన అన్ని అవసరాలకూ అన్నీ సమకూర్చి చివరికి మనం ఈ మట్టిలో కలిసాక మనలిని తనలోనే ఎప్పటికీ దాచుకునే ఆ ప్రకృతి మాతకి ఏమిచ్చి మనం ఋణం తీర్చుకోగలం. కానీ ఆతల్లికి ఏదైనా తిరిగిచ్చిన సందర్భం కాని కనీసం ఆమె ఋణం తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నం ఏదైనా చరిత్రలో ఉందా...ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తుందా? లేవు రావు సరికదా ఆమె తనువుని చీల్చి ఆమెని చిత్రవధచేస్తూ ఈ సృష్టిలో స్వార్ధానికి మారుపేరు ఎవరంటే"మనిషే" అని నొక్కివక్కాణించేలా మసలుతున్నాము. మనిషి జన్మించాక తన మనుగడ కొనసాగడానికి కావలిసిన ఆహారాన్ని, నివాసాన్ని, ఆఖరికి మానసంరక్షణకి బట్టని కూడా మనకి ఇచ్చేది ఈ ప్రకృతి మాతే. ఇలా మన మాన ప్రాణాలను కాపాడేది ఆ తల్లే.... పసిపాపడిగా మనిషి ఊయలలో ఓలలాడడానికి ఊయలయ్యింది తన తనువుని చీల్చుకుని ఓతరువు...మన ఆహరమైన పళ్ళు, కూరలు, ధాన్యాలు, దినుసులు. ఇవన్నీ ప్రకృతిలో పుట్టినవి కావా. వధువువరుల మెడలో పూలదండ లైనా...చివరికి మనిషి అంతిమయాత్రలో అతనిపై పడిన చిన్న పూరేకైనా ఇవన్నీ ఎలావచ్చాయి?? "ఆ సుమబాలలు సూదుల శిలువలెక్కి సంతోషపెడుతున్నాయి...చివరకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాయి..." ఓమనిషీ నీకుందటయ్యా అంతటి ఔదార్యం?? నీ లాలికి ఊయలై, నీ పెళ్ళికి పీట అయ్యి, నీ సుఖానికి మంచమై, నువ్వు కూర్చోవడానికి కుర్చీ అయ్యి, చివరకి నిన్ను మొయ్యడానికి పాడెగా ఇలా ఎన్నో అవతారాలెత్తిన ఓ తరువు ప్రకృతిమాత ముద్దుబిడ్డయ్యా. కానీ నీ మితిమీరిన అవసరాలకు, నీ విలాసాలకు...నీ సుఖసంతోషాలకు ఆ తరువుని పొట్టనబెట్టుకుని, ఈ ప్రకృతితల్లికి ఆ జన్మాంతం గర్భశోకం కలిగించడానికేనా జరిగింది నీ సృష్టి??? అసలు పూర్వం మనిషి జీవితం ప్రకృతితో ముడివేసుకుని, ప్రకృతితో పెనవేసుకుని ప్రకృతిలో మొదలై ప్రకృతిలో ఐక్యం అయిపోయేటట్టుగా ఉండేది. మనిషితోపాటే మనిషికి అవసరమైన అన్ని వస్తువులుమట్టిలో కలిసిపొయే విధంగా ఉండేవి...ఇలా ఉండడంవల్ల మనిషి జీవితంలోనే కాదు ప్రకృతిలో కూడా సమతుల్యత ఉండేది. ఆ సమతుల్యత నేడు దెబ్బతింది. ఎంతదెబ్బ తిందంటే కొన్నాళ్లకో కొన్నేళ్ళకో మనిషి ఉనికే ఇక ఉండదూనే అంత దెబ్బతింది. ఇంత అరాచకం జరగడానికి పెద్ద కారణం "ప్లాస్టిక్" అనే మహమ్మారి..."ఇది కలికంటే బలమైనది..., ఉలికంటే పదునైనది, మలినంకన్నా మలినమైనది."చంటి పాపాయి పాలుతాగే సీసానుండీ, ఆడుకునే బొమ్మదాకా, అంతెందుకు ఆ పాలు రావడానికి ముందో ప్లాస్టిక్ కవరు ప్యాకెట్టు గా రూపాంతరం చెందితేనే కదా వస్తొంది ఇలా మనిషి ప్రతీ అవసరము ప్లాస్టిక్ తో ముడిపడిపోయింది... ఎన్నో ఆవిష్కరణలు జరిగినా ఈ ప్లాస్టిక్ మాత్రమే ఇంత విధ్వంసం ఎందుకు సృస్టించుతోందంటే .."ఈ సృష్టి లో పుట్టిన ప్రతీది చివరకు చచ్చిపోవాలి అది ప్రాణి అయినాసరే వస్తువయినా సరే..." వస్తువు చచ్చిపోవడం ఏంటి అనుకుంటే.. వస్తువు ఏదో రూపాంతరం చెంది అయినా మట్టిలో కలవాలి. ఇలా చావులేనిది ఏదైనా విధ్వంసదాయకమే... "మరణం లేనిది ఏదైనా సరే మానవత్వపు మనుగడనే కృంగదీస్తుంది."అనడానికి ఈ ప్లాస్టికే ఉదాహరణ. మనం వాడే ఒక చిన్న ప్లాస్టిక్ చెంచా పూర్తిగా మట్టిలో కలవడానికి 500 సంవత్సరాలు పడుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. అంచనా మాత్రమే కొన్ని ప్రత్యేక ప్లాస్టిక్లైతే 1000 సంవత్సరాలైనా"జీవ అధోకరణం" (బయోడిగ్రేడేషన్) జరుగకుండా అలాగే భూమిలో చక్కగా ఉంటాయిట. అంటే రోజూ మనం చూసే ఈ ప్లాస్టిక్ కవర్లు, సీసాలూ, వగైరా అన్నీ 2516లో కూడా ఉంటాయన్నమాట...కొన్ని 2116 వరకు ఉండే అంత ఘనచరిత్రులన్నమాట. 1950వ సంవత్సరం నుండీ ఇప్పటివరకు 1 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ విస్మరించబడింది. ఇది ఎక్కడికీ పోకుండా ఇంతింతై వటుడింతయి అన్నట్టు రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది. ఒక్క భారతదేశంలోనే ప్రతీ నదీతీరంలోనే రోజుకి 300టన్నుల్ల ప్లాస్టిక్ వచ్చి చేరుతొంది అని శాస్త్రజ్ఞులు ఘోషిస్తున్నారు. కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏనది తీరాన్ని చూసినా, చివరికి అయిదు మహాసముద్రాలలో కూడా ఇదే పరిస్థితి. ఇలా చేరుతున్న ప్లాస్టిక్ చెత్త వలన నదులలో, మహాసముద్రాలలో నివసిస్తున్న జలరాసులకి ప్రాణులకు, నీటిలో పెరిగే వివిధ రకాల నాచులకు కూడా ముప్పువాటిల్లుతున్నది. ఓ సముద్రంలో పడేసిన ఓ వాటర్ బాటిల్ ఎన్ని చిన్నముక్కలవుతోందంటే. ప్రపంచంలో ప్రతీ సముద్రతీరానికీ అదిచేరుకో గలుగుతోంది. యావత్ ప్రపంచంలో సగటున ఓ నిముషానికి 1 మిలియన్ అంటే పది లక్షల ప్లాస్టిక్ కవర్లు వాడబడుతూ వచ్చాయి. ఒక సంవత్సరానికి ప్రపంచం అంతటా కలిపి 500 బిలియన్ల ప్లాస్టిక్ కవర్లు వాడతారని అంచనా వేస్తున్నారు. సముద్రాల్లో, నదులలో తేలుతున్న చెత్తలో తొంభై శాతం ప్లాస్టిక్ దే అవుతోంది మరి. ఈ ప్లాస్టిక్ కారణంగా ప్రతీయేటా ఒక లక్ష సముద్రపు పక్షుల జాతులు, ఓ లక్ష సముద్ర క్షీరదాలు చనిపోతున్నాయి. ఇప్పటికి మనిషి పడేసిన ఈచెత్త భూమిని నాలుగు సార్లు చుట్టగలదు. సముద్రాలలో ఉండే చాలా జంతు జాతుల శరీరాల లోపలగానీ, పైన గానీ ఈ ప్లాస్టిక్ అలా వ్యాపించి ఉండడం శాస్త్రజ్ఞులను ఇంకా ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతవరకూ సృష్టించబడిన ప్లాస్టిక్ అంతా ఏదో ఒక రూపంలో భూమి పైన మిగిలే ఉంది. ఈ మాటలు ప్రజలిని ఆలోజింపచేసాయి. తాము ఎంత తప్పుచేస్తున్నామో అందరికీ అర్ధం అయ్యింది. మార్పు మొదలయ్యింది. అది మామూలు మార్పు కాదు, మనుషులు మానవత్వపు బాటలో నడవడంలో మొదలు పెట్టేరు. ఈ మాటలద్వారా ఏ ఒక్క దేశమో కాదు యావత్ ప్రపంచం మానవత్వపు బాట పట్టింది. మళ్ళీ వేపపుల్లతో దంతధావనం, కంచు చెంబుతో స్నానం, పెరట్లో పాడావు దగ్గర ఇత్తడి చెంబులో పాలు, అరిటాకులో భోజనం, డిస్పోసబుల్ బ్యాగ్ ని పక్కన పెట్టేసిన మనుషులు ఎవరి సంచి వారు చేతబుచ్చుకుని కూరలు, సరుకులు తెచ్చుకోవడం మొదలెట్టారు. మట్టి కప్పులలొ కాఫీ, టీలు విక్రయించబడేవి. అఫీసులలో రోజుకో ప్లాస్టిక్ కప్పు విసిరే జనం బుద్ధిగా ఎవరి గాజు కప్పు వారు కడుకుని మరీ అదే వాడుకుంటున్నారు. "బాన్ థ బాగ్ "అన్న నినాదంతో అన్నిచోటల నుంచీ ప్లాస్టిక్ కవర్ మాయం అవ్వడం మొదలైంది. శుభ కార్యాలలో ప్లాస్టిక్ ఆకులుపోయి పచ్చని అరిటాకులలో వేడి వేడి రుచి కరమైన భోజనం వడ్డించబడేది. ప్లాస్టిక్ స్పూన్లతో పిల్లలికి తినిపించడం మానేసి తల్లులు గోరుముద్దలు పెట్టడం మొదలెట్టారు. ఫోన్ల వాడకం తగ్గించారు. ఈ మార్పు చాలు వాడి విజృంభణను ఆపడానికి వాడి ఆగడాలు అణచడానికి. నెమ్మది నెమ్మదిగా పేరుకొంటున్న ప్లాస్టిక్ చెత్త తగ్గు ముఖం పట్టసాగింది, ఇంకొన్నేళ్ళు ఇలా కష్టపడి అందరూ సమిష్టి కృషి చేస్తే వాడు పూర్తిగా అంతం అయిపోతాడన్న ఆశ ప్రకృతి మాత లో చిగురించింది. వెంటనే కృతజ్ఞతలతో ఆ నారాయణుడికి ధన్యవాదాలర్పించుకుంది. పచ్చని ప్రకృతి తో, సహజ వనరులతో, పచ్చని పొలాలతో, ప్రకృతిమాత పులకింతలతో పుడమంతా పచ్చటి తివాసీ వేసినట్టుగా...నదులలో నీళ్ళు ఆకాశపు నీడతో, సముద్రాలలో జలరాసులు ఆనందంగా ఈతకొడుతూ భగవంతుడు ఎలా సృష్టించాడో సరిగ్గా అలాగే ఉంది. మనుషుల వాడకం తగ్గేసేరికి ప్లాస్టికాసురిడి ప్రభావం నెమ్మది నెమ్మదిగా నశించి పోసాగింది. కలి గిల గిల లాడాడు... ఆర్తనాదాలు చేసాడు. ఆ హరి అసాధ్యుడనుకునాడు. కళ్లముందే తన కుమారుడు రోజురోజుకీ అమావాస్య చంద్రుడిలా క్షీణించిపోతూ ఉంటే ఏమి చెయ్యలేకపోయాడు. మనుషుల మానవత్వమనే ఆయుధం ఎంత బలమైనదో తెలుసుకున్నాడు. మనిషి మానవత్వం పెంపొందించుకున్న రోజు ఆ మనిషి ముం దు ఎంతటి అసురుడైనా నిర్వీర్యుడే అని గ్రహించాడు. తన కుమారుడిలాగే త్వరలో తన పతనమూ తప్పదని తెలుసుకున్నాడు. సరిగ్గా 50 సంవత్సరాల తరువాత... శుబోధుడికి ప్రపంచాన్ని పతనం నుండీ కాపాడిన శుబోధుడికి అన్నీ సన్మానాలే సత్కారాలే...భారత ప్రభుత్వం అయితే మరో మహాత్ముడని బిరుదు కూడా ఇచ్చి సత్కరించింది. అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది. సహచరులెంతో సంతోషంగా ఆ వార్త శుబోధుడికి వినిపించారు. నోబెల్ బహుమతి ప్రధానం జరిగింది. ప్రపంచాన్ని ఇలా మార్చిన శుభోధుడు భారతీయుడైనందుకు ప్రతీ భారతీయుడు పులకించిపోతున్నాడు. అందరూ ఆశ్చర్యం గా శుబొధుడు ఏంచెప్తాడా అని ప్రత్యక్షం గా చూస్తున్న వాళ్ళు, టీవీలను చూస్తున్న వాళ్ళూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. శుబోధుడు ఇలా ప్రారంభించాడు. “ప్రకృతి పురుషుల సంయోగమే ఈ ప్రపంచం, అందులో మనం. మనం మానవత్వంతో నైతిక విలువలతో మన తల్లి ఋణం తీర్చుకోవడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. వీలైనంతవరకూ ఆ ప్లాస్టిక్ విషానికి దూరంగా ఉందాం. పర్యావరణ పరిరక్షణలో మనవంతు బాధ్యతని నిర్వర్తిద్దాం. ఈ ప్లాస్టిక్ చేసే విధ్వంసాలని తెలియబరుస్తూ వాడిని అంతమొందించే శక్తి భగవంతుడి కూడా లేదు అనుకున్నాము కానీ మనిషి యొక్క మానవత్వానికి, స్వచ్చమైన జీవన విధానానికి ఉంది అని తెలియచెప్పడానికి చేసిన ప్రయత్నం వలనే ఈనాడు మనం ప్రపంచాన్ని పతనం నుండీ కాపాడుకో గలిగాము. ఈ బహుమతి నాఒక్కడిదీ కాదు యావత్ ప్రపంచంలో ప్లాస్టిక్ వాడని ప్రతి ఒక్కరిదీ ఈ బహుమతి. ప్లాస్టిక్ లేనప్పుడు కూడా మనిషి జీవితం కొనసాగింది కదా కానీ ఆధునిక జీవితంలో మనిషి అవసరాలు. జీవన విధానం కూడా చాలా మారిపోయింది...పూర్తిగా ఒకేసారి ప్లాస్టిక్ ని మన జీవితంలో నుండి బయటకు పంపలేని పరిస్థితి నేడు నెలకొంది మరి. కాని మనిషి దాని వాడకాన్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించగలుగుతూ దాన్నికి ఎంత దూరంగా ఉంటే తన తల్లైన ప్రకృతికి అంత దగ్గరగా ఉండి ఆ ప్రకృతి తల్లి ఋణం తీర్చుకోగలుగుతాడు అని ముగించాడు” ఆ కరతాళ ధ్వనులు ప్రపంచం అంతా ఎలా మారుమోగాయంటే వంద కలి రాక్షసులు ఒకటైనా ఇక ప్రకృతి మాతని ఎవ్వరూ ఏమి చేయలేరని శుబోధుడికి అనిపించింది. మనిషి జన్మ ఎత్తాడుకాబట్టి కొన్నాళ్ళకి శుబోధుడు మట్టిలో కలిసిపోయాడు...కానీ అతని శుబోధనలు అనే వేదవాక్కులతో యావత్ ప్రపంచం సుపథంలో పయనిస్తూనే ఉంది.
*****
No comments:
Post a Comment