ప్రకృతిలో స్వరం
మధురిమ
ఈ సంచిక ప్రకృతిమాత ప్రత్యేక సంచిక కాబట్టి ప్రకృతిలో సంగీతం ఎలా మమేకమై ఉందో వివరించి చెప్పడం, ప్రకృతిలో సుస్వరాలు ఎలా ఒదిగి ఉన్నాయో,దాగున్నాయో .....మరి వాటిని ఎలా వినాలో చెప్పడమే ఈ వ్యాసముయొక్క ముఖ్య ఉద్దేశ్యం. సంగీతం అంటే కేవలం కొన్ని స్వరాల సమ్మేళణం అనుకుంటే పొరపాటు.ఎందుకంటే మనం పాడే పాటే కాదు పలికే ప్రతీ శబ్దం కూడా ఓ స్వరమే.అసలు స్వరం ఎక్కడమొదలయింది అని అలోచిస్తే...అసలు మనిషి కన్నా మొదట పుట్టింది స్వరమే.మానవుడి కన్నా ముందు ఉద్భవించిన మొదటి స్వరం "ఓంకారం".దాన్నే ప్రణవ నాదం అనికూడా అంటాము.ఈ ప్రణవ నాదము నుండే ఈ జగత్తు మొదలైందనీ...సృష్టి అంతటికీ ఈ ప్రణవ నాదమే మూలాధారమనీ ఎన్నో ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. నారయణోపనిషత్త్ ఏం చెప్తొందంటే "ఓం అనే మంత్రమే బ్రహ్మం..ఈ మంత్రం ఉచ్ఛరించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ బ్రహ్మంలో అయిక్యం అవ్వడం". మాండూక్య ఉపనిషత్త్ ఏం చెప్తోందంటే "ఈ జగత్తులో ఉన్నది ఒకేఒక స్వరం అదే ఓం.అదే భూత,భవిష్యత్,వర్తమాన కాలాలకు ప్రతీక.ఈ ప్రపంచం అంతా కేవలం ఓం అన్న మాటలోనే ఉన్నది" అని చెప్తోంది. ఈ ఉపమిషత్త్ లో ప్రణవాన్ని కాలము,రూపము,ఆది,అనంతము తానే అయి ఉన్న పరమాత్మ యొక్క ప్రతిధ్వనిగా వివరించబడినది.అందుకే పరమాత్మను చేరడానికి ధ్యానం ఓ సోపానమైతే ఆ ధ్యానం చేసేటప్పుడు ప్రనవణ మంత్రాన్నే ఉచ్ఛరిస్తాము. ప్రణవం నుంచే షడ్యోజ్యాత,వామదేవ,అఘోర,తత్పురు
ష,ఈశాన మొదలైన పరమే శ్వరుడి యొక్క పంచముఖాలు ఆవిర్భవించాయని కూడా మన ఉపనిషత్తులు వ్యాఖ్యానిస్తున్నాయి. కొన్ని ఉపనిషత్తులు ప్రణవాన్నే జీవాత్మగా కూడా వివరిస్తున్నాయి.అంటే జీవుడిలో ఉన్న ఆత్మ ఒక స్వరం.ఈ ప్రకృతి , పురుషోత్తముడైన పరమాత్మ సృష్టి అయితే...ఆ ప్రకృతిలో సర్వం...స్వరమయం... ఈ ప్రణవనాదమే ప్రకృతీ మాత తొలి స్వరం. ప్రకృతీ మాత అయిన పార్వతి ఆ పరమేస్వరుడితో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకం అన్నారు మాటల ఊట కీ.శే వేటూరి సుందరరామ మూర్తి గారు.అంటే సప్తస్వరాలు ప్రకృతిలో ఉండే సహజ ధ్వనుల ద్వారా ఏర్పడినవే.వివరంగా పరిశీలిస్తే.. సప్తస్వరముల పేరు స్వరమును పోలి ఉన్న జంతువు యొక్క ధ్వని స-షడ్జమం
నెమలి రి-రిషభం
ఎద్దు గ-గాంధారం
మేక మ-మద్యమం కొంగ ప-పంచమం కోయిల ద-దైవతం గుఱ్ఱము ని-నిషాదము ఏనుగు వ్యావహారిక భాషలో కూడా షడ్జమాన్ని,పంచమాన్ని అంటే స,ప లను ప్రకృతి స్వరాలు అంటారు.జంతువుల కూతలలోంచి స్వరాలు ఉద్భవించాయన్న ఈ నిదర్శనం చాలదా …ప్రకృతి సుస్వర నిలయం అని చెప్పడానికి. మనసుతో వింటే అలలు కదిలినా ,ఆకులురాలినా పాటలాగే వినిపిస్తుంది.ప్రకృతిని ఎంత దగ్గరనుండీ పరిశీలిస్తే అంత ఎక్కువ సంగీతం వినిపిస్తుంది అన్నది వాస్తవం.దట్టమైన అడవులలో...ఆ చెట్ల గుబురులలోంచీ వినిపించే ఆ పక్షుల కిలకిలా రావాలు...తాళం వేసినట్టుగా లయబద్ధంగా పడ్డ తొలకరి చినుకులు..ఇవన్నీ ప్రకృతి మాత శృతిలయలే.. తుమ్మెద ఘాంకారంలో లేదా ఓ బృందగానం?? మలయసమీరాలలో లేదా మలయమారుత రాగం...అసలు శాస్త్రీయ సంగీతం బాగా లోతుగా అభ్యసిస్తే ఆ సంగీతం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉందో తేటతెల్లం అవుతుంది..ఉదాహరణ కి సంగీతంలో వాడే చాలా రాగాలపేర్లకు ప్రకృతికి దగ్గరగా సంబంధం ఉన్న పేర్లే ఉంటాయి.ఉదా: చక్రవాకం అంటే ఓ పక్షిపేరు.అంటే చక్రవాకం రాగం పాడితే ఆ పక్షి కిలకిలా రావం లా ఉంటుందని అర్ధం.అలాగే హంసధ్వని,హంసానంది,హంసానాదం,కో
కిలప్రియ,ధేనుక(అంటే ఆవుదూడ),మలయమారుతం,ఉదయరవిచంద్రి
క,వరుణప్రియ, వసంత, వనస్పతి, విశ్
వంభరి,భూపాలం,అమృతవర్షిణి ఇలా ఎన్నో,ఎన్నెన్నో...
రాగం అంటే అర్ధం రంగు,స్వభావం అని...ప్రకృతి కి కూడా చాలా స్వభావాలు ఉన్నాయి మరి.కొన్ని సార్లు శాంతంగా ఆహ్లాదంగా,రమణీయంగా శ్రావణ సమీరాలు వీచితే.. అప్పుడు భూపాల రాగం విన్నట్టే... కొన్నిసార్లు ఉగ్రతాండవం చేస్తూ గంభీరంగా ఉంటే భైరవి రాగం విన్నట్టుగానూ ఉంటుంది మరి... రాగం అంటే స్వర సమ్మేళనం అయితే ఈ స్వరాల అమరిక, ఆ ప్రకృతి నడకనూ తద్వారా స్వభావాన్ని తెలియచేస్తాయన్నమాట. కేవలం గాత్రమే కాక వాయిద్యాల విషయం పరిశీలించినా.. సంగీతం, పరమాత్ముడికి ఆయన సృష్టి అయిన ప్రకృతికి ఎంత దగ్గరగా ఉందో అర్ధం అవుతుంది. సంగీత కచేరీలలో ఉపయోగించు వీణా వాయిద్యం చదువుల రాణి వాణి హస్త భూషణం.ఇక,త్రిపురాసుర సంహారం అయిన పిదప మహాశివుడు ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఆ నాట్యమునకు ఓ హంగుగా బ్రహ్మ మృదంగము సృష్టించెననీ,ఆ సమయమున గణేసుడు మొట్టమొదటగా మృదంగం వాయించెననీ ప్రతీతి.నందికేస్వరుడు ఈ వాయిద్యము వాయించుటలో ఘనుడని ప్రతీతి. తన వేణు గానంతో ఆ గోపికలందరినీ భక్తిలో సమ్మోహ పరచిన ఆ శ్రీకృష్ణుని వేణువు కూడా అంతే. భారతదేశంలో సంగీత కచేరీలలో ఉపయోగించే వాయిద్యాలన్నీ ప్రకృతిలో పుట్టినవే...భారతదేశ సంగీత శాస్త్రంలో ఉపయోగించే వాయిద్యాలన్నీ స్వరమాధుర్యానికే(మెలొడి)కే ప్రాధాన్యం ఇచ్చేవి.అందుకే వాటి నిర్మాణం కూడా ఆ విధంగానే ప్రకృతిలోని సహజధ్వనులకు దగ్గరగానే జరిగినది. ఉదాహరణకి సుషిర లేదా గాలి ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేసే వాయిద్యాలైన సన్నాయి,నాగస్వరం మొదలైనవి గాలి ఊదడం వల్ల ధ్వనిని జనింపచేస్తున్నాయి.వేణువు మొదలైన సుషిరవాయిద్యాలు చేతివేళ్ళు ఆనుకొనుటకు రంద్రములుండి ,నోటితో వక్ర రంద్రముల ద్వారా గాలిని ఊదడం వల్ల ధ్వనిని జనింపచేస్తున్నాయి.మరి ఈ ప్రక్రియలు ప్రకృతి సహజమైనవే కదా...ప్రాచీన కాలము నుండీ ఈ వేణువు అనేక రూపములతోనూ,నామములతోనూ వ్యవహరించబడుతూ ,వెదురు తో చెయ్యబడ్దదే.వేణువుని వెదురుతోనే ఎందుకు తయారుచేస్తారంటే వెదురుకే ప్రతిధ్వనిని (ఆంగ్లంలో రెసొనెన్స్) ఇచ్చే స్వభావం ఉంది. ఇక చర్మవాయిద్యాల విషయానికొస్తే కాలన్ని సూచించే అంటే లయప్రధానమైన మృదంగం,తబల,డోలు,కంజీర ఇవన్నీ ప్రకృతి మాత పిల్లలైన జంతువుల చర్మంతో చేసినవే. మృదంగ నిర్మాణాన్ని,ధ్వని విశిష్టతని పరిశీలిస్తే… మృదంగము అనగా మృత్+అంగం అంటే మట్టితో చెయ్యబడే అవయవమని అర్ధము.పూర్వం ఈ వాయిద్యం మట్టితో చెయ్యబడేదనీ,కాలక్రమములో మానవుని మేధో వికాసము పెరిగి ధ్వని మాధుర్యమునకు గాంభీర్యతకును ఈ వాయిద్యము కఱ్ఱతో ప్రస్తుతము తయారుచేస్తున్నారు. మృదంగము పనస లేక వేగిస కఱ్ఱతో , అవి దొరకనిచో అప్పుడప్పుడు తాటి లేక రేల కఱ్ఱతో తయారుచేస్తారు.కర్రలోపలి భాగమంతయూ డొలిచి రెండు చివరలను జంతు చర్మములతో చేసిన మూతలతో చర్మపుతాళ్ళ సహాయంతో బిగిస్తారు.కుడి మూత ఆవుదూడ చర్మంతోనూ,మేకదూడ చర్మంతోనూ బిగిస్తారు.ఎడమ మూత ను గేది చర్మంతోనూ,మేక చర్మంతోనూ బిగిస్తారు. ఇదేవిధంగా శృతి వాయిద్యంలో అత్యంత ప్రధానం అయిన తంబూరా ను కూడా పనసకఱ్ఱతోనే తయారు చేస్తారు.ఇక భారతీయ సంగీతంలో తనకంటూ ఓ విశిష్ట స్థానం సంపాదించుకున్న ఈ వీణ వేద కాలమునుండీ పుట్టిన దై రామాయణ,భారత కుమారసంభవం మొదలగు గ్రంధములలో పేర్కొనబడినది. వాయిద్యము ల్లనిటిలోనూ ప్రప్రధమముగా సృష్టించినది కనుక వీణ ను వాయిద్యములకు మాతగా వ్యవహరిస్తారు.అమ్మలనుగన్న ఆ అమ్మ చేతిలో ఉండే వీణ గురించి యజ్ఞవల్కుడు ఒక శ్లోకంలో ఇలా చెప్పాడు “వీణ వాదన తత్వజ్ఞ - శృతి జాతి విశారదః తాళజ్ఞశ్చ ప్రయాసేనా-మోక్షమార్గం నియశ్చతి” అనగా ప్రసిద్ధుడైన వైణికుడు తాలజ్ఞానము,శృతిజ్ఞానము కలిగినవాడై,ఇంకేప్రయత్నము లేకుండానే మోక్షమును పొందుటాడట. ధ్వనిమాధుర్యంలో అత్యంత ప్రధానమైన దక్షిణ భారతదేశ వీణలకు బొబ్బిలి, నూజివీడు,తంజావూరు మొదలైన ప్రదేశాలు చాల ప్రసీద్ధమైనవి.బొబ్బిలిలో,నూజి
వీడులో వీణలను పనసకఱ్ఱతోనూ,మైసూరులో బ్లాక్ వుడ్డ్ తోనూ తయారుచేస్తారు. వీణ నిల్చొనుటకు ఆధారముగా యుండుటయేకాక,ధ్వనియొక్క గాంభీర్యమును కూడా అధికమును చేయుటకు సహాయపడు తుంబ ను (అనగా వీణకు ఎడమవైపు ఉండే గుండ్రటి భాగము) ఆనపకాయలేక గుమ్మడికాయను డొలిచి తాయారుచేస్తారు. ఇదే విధంగా ముత్తుస్వామి దీక్షితులవారి కనిష్ట సోదరులైన బాలస్వామి దీక్షితులవారి సాధనా ఫలితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పరిచయం అయ్యి ,పాశ్చాత్యులు కనిపెట్టిన వయొలిన్ కూడా "సికమూర్,పైన్,ఎబొనీ" కఱ్ఱలతో తయారుచేస్తారు" మానవ గాత్ర ధర్మములను అనుసరించి కర్ణాటక సంగీతంలో గల వివిధ గమకములను చక్కగా ప్రదర్శింపగల మంగళకరమైన నాదస్వరము,లేక నాగస్వరము కూడా చందనపు కఱ్ఱ కి లోహపు కంఠాన్ని,గంటను అమర్చగా రూపు దిద్దుకున్నదే. సంగీతం ప్రకృతిలో పుట్టింది,సంగీతం పాడాలంటే ప్రకృతే ప్రేరణ అయ్యింది,ఓ వాయిద్యం వాయించాలన్నా ప్రకృతి మాత ఇచ్చిన వస్తువులతోనే తయ్యరుచేయబడుతొంది. ప్రకృతిలో స్వరం ఉంది అనడానికి కోకిలమ్మ పాటే పరాకాష్ట.కోకిలమ్మ కి శృతి సుద్ధంగా పాడడం ఎవరునేర్పారు? ప్రకృతిలో పుట్టింది కనుక అనుసరిస్తొంది అంతే...ఆమెను ఎవరైనా అనుకరిస్తే వారిని "గాన కోకిలా" అని అందుకే అంటున్నామేమో?? భాష,సంగీతం రెండిటినీ మనిషి ప్రకృతినుంచే నేర్చుకున్నాడు.భాష భావాన్ని వ్యక్తపరచడానికైతే సంగీత భావుకతను వ్యక్తపరుస్తుంది. ప్రకృతిలో ఉండే సంగీతం వినాలనుకుంటే మనం ప్రకృతితో మమేకం కావాలి.బాహ్యప్రపంచాన్ని చూసే ఈ కళ్ళతో,చెవులతోకాక..అంతరాత్మతో విన్నప్పుడే ఆ ధ్వనులను వినగలం భక్తి ప్రతిధ్వనులతో భగవంతుని చేరుకోగలం కూడా... మన అంతరాత్మలో ఆ పరమేశ్వరుడు ఉంటాడుకాబట్టే ప్రతినిత్యం తన ఢమరుకంతో గణగణ స్వరాన్ని మోగిస్తూనే ఉంటాడు.దాన్నే వైద్యశాస్త్రం "లబ్ డబ్" అంది.ఆ ఢమరుకనాదాన్ని వినడానికి ఏపరికరమూ అఖర్లేదు..ఆ పరమాత్మకి మన మనసుని అర్పణం చేస్తే అంతర్లీనంగా మోగుతున్న ఆ అంతర్వాణి అదే వినిపిస్తుంది. ఏనాడైతే ఆ పరమాత్మ ఈ జీవుడినుండీ వెళ్ళిపోతాడో ఇక అప్పటి నుంచీ ఈ శరీరంలో స్వరం సూన్యం అయిపోతుంది అందుకే అప్పుడు నాడి కొట్టుకోదు,హృదయాంతరాలూ మూగబోతాయి. మనిషి మనో దేవాలయం లో దైవం ఉండీ, తన జీవన నడవడికలో నిర్దిష్టమైన లయకు ప్రకృతిలో సంగీతం తోడైతే కాదా అతని సుఖజీవితం శృతిలయల సంగమం???.. ఏనాడైతే మనిషి ఒత్తిడి అనే గందరగోళం నుండీ బయటకి వచ్చి అలోచిస్తాడో తన దృష్టిని ప్రకృతిపైనే కేంద్రీకరించి పరధ్యానము నుండీ బయటపడతాడో మనిషి యొక్క ఉనికి ఈ లౌకిక పరిధులు దాటి విస్తరిస్తుందో ఆ రోజు ప్రకృతిలో ఉండే ప్రతీ స్వరాన్నీ వినగలుగుతాడు, రసానుభూతి పొంది తాదాప్యం చెంది తన్మయం పొందిన హృదయంతో ఆ పురుషోత్తముడిని చేరుకోగలుగుతాడు.
No comments:
Post a Comment