శ్రీరామ కర్ణామృతం - అచ్చంగా తెలుగు

శ్రీరామ కర్ణామృతం

Share This

శ్రీరామ కర్ణామృతం

                                     డా.బల్లూరి ఉమాదేవి.


31.శ్లో: వైదేహీ రమణం విభీహణ విభుం విష్ణుస్వరూపం హరిం
విశ్వోత్పత్తి విపత్తి పోషణకరంవిద్యాధరై రర్చితం
వైరిధ్వంసకరంవిరించి జనకంవిశ్వాత్మకం వ్యాపకం
వ్యాసాంగీరస నారదాది వినుతం వందామహే రాఘవం.
తెలుగు అనువాద పద్యము:-
చ:జనకసుతాధి నాథురిపుజైత్రు సురార్చితు సర్వలోకసం
జనన వినాశపోషణు బ్రశస్త చరిత్రువిభీషణా ననున్
సనక సనందనాద్యఖిల సన్ముని సన్నుతు విష్ణురూపునిన్
వనరుహ సూతి తండ్రి రఘువర్యు హరిన్ శరణంబు వేడెదన్.
భావము:-సీతకుపతి,విభీషణునేలినవాడు,విష్ణురూపుడు,పాపసంహారకుడు, సృష్టిస్థితి కారకుడు,విద్యాధరులచే నమస్కరింపౘడినవాడు, శత్రుసంహారము చేయువాడు, బ్రహ్మకు తండ్రియైన వాడు,ప్రపంచస్వరూపుడు,అంతటా వ్యాపించి యున్నవాడు.,వ్యాసుడు,అంగీరసుడు,నారదుడు మొదలగు మునులచే స్తోత్రము చేయబడుచున్న వాడైన రామునకు నమస్కరించుచున్నాను.
వ్యా:-శ్రీరాముని గరిమను విశదీకరించుచున్నారు.
32.శ్లో:వైదేహస్యపురే వివాహ సమయే కల్యాణ వేద్యంతరే
సామోదే విమలేందు రత్నఖచితే పీఠే వసంతౌ శుభే
శృణ్వంతౌ నిగమాంత తత్త్వ విదుషా మాశీర్గిరస్సాదరం
పాయస్తాం సువధూ వరౌ రఘుపతిః శ్రీజానకీ చానిశమ్
తెలుగు అనువాద పద్యము:
చ: పరిణయవేళ మైథిల నృపాల గృహాంతర రత్నవేదికన్
సురుచిర వేదవిద్విబుధ సూక్తులు వించు సమంచితంబుగా
బరగు వధూవరత్వమున భాసిలి భూవర సేవ్యులైన యా
ధరణిసుతారఘూద్వహులుదారమతిన్ మము బ్రోతు రెప్పుడున్.
భావము:మిథిలానగరమందు సీతారాముల వివాహవేళ మంగళ వేదికయందు మంచిదైన,నిర్మలములైన,చంద్రకాంత మణిఖచితమైన శుభమైన పీఠమందుకూర్చొన్నట్జియు..వేదార్థములనుతెలుసుకొన్న పండితుల ఆశీర్వచనములను వినుచున్న సీతారాములు మమ్ము రక్షించు గాక.
వ్యా:సితారాముల కల్యాణ శోభ వివరించబడింది.
33.శ్లో: అసిత కమల భాసాభాసయంతం ద్రిలోకీం
దశరథ కులదీపందైవతాంభోజ భానుమ్
దినకర కులబాలం దివ్యకోదండ పాణీమ్
కనకఖచిత రత్నాలంకృతం రామ మీళే.
తెలుగు అనువాద పద్యము:
మ:ఘన నీలాంబుద కాంతి దేహుభువనైక భ్రాజితున్ దేవతా
వనజాతాంబుజమిత్రు భానుకుల భాస్వత్కీర్తిసాంద్రున్ శరా
సన బాణోజ్జ్వల హస్తు రత్న విలసత్సౌవర్ణ సద్భూషణున్
మునిసంస్తుత్య చరిత్రు దాశరథి రామున్ గొల్తు నెల్లప్పుడున్.
భావము:నల్లకలువలవంటి కాంతి చేత ముల్లోకములను ప్రకాశింప చేయువాడును దశరథుని వంశమును ప్రకాశింప చేయువాడును దేవతలను పద్మములకు సూర్యుని వంటి వాడును సూర్యవంశబాలుడును మంచి విల్లును ధరించిన వాడును బంగారమునందు కూర్చిన రత్నాలంకారములు కలవాడును అగు రాముని స్తుతించుచున్నాను.
వ్యా:శ్రీరామచంద్రుని కవి అత్యంత సుందరముగా వివరించుచున్నాడు.
34:శ్లో:సుస్నిగ్ధం  నీలకేశం స్ఫుటమధురముఖం సుందర భ్రూ లలాటం
దీర్ఘాక్షం చారు నాసాపుటమమల మణిశ్రేణికా దంత పంఙ్క్తిమ్
బింబోష్ఠం కంబుకంఠం కఠినతర మహోరస్క మాజానుబాహుం
ముష్టిగ్రాహ్యావలగ్నం పృథుజఘన ముదారోరుజంఘాంఘ్రి మీళే.
తెలుగు అనువాద పద్యము:
ఉ:చారు విశాలనేత్రు విలసన్మధురానను నీలకేశుశృ
గార లలాటు దీర్ఘకరుఁగంబుగళున్ రమణీయ నాసికున్
గ్రూర భుజాంతరున్ సరసకుందరదున్ దనుమధ్య సుందరున్
సారస సైకతాంఘ్రి విలసజ్జఘనున్ రఘురాముఁగొల్చెదన్.
భావము:నల్లనైన కురులతో,చక్కని మోముతో, ఆందమైన కనుబొమలు,నుదురుతో,గొప్పనేత్రములుకల్గిన,చక్కని ముక్కు కల్గినట్టియు, మంచిరత్నములవంటి దంతపంక్తి కల్గినట్టియు,దొండపండు వంటి పెదవి కలిగినట్టియు, శంఖము వంటి మెడ కలిగినట్టియు,కఠినమైన గొప్ప రొమ్ము కలిగినట్టియు,మోకాళ్ళవరకు చేతులు కలిగినట్టియు,మోకాళ్ళవరకు చేతులు కల్గినట్టియు పిడికిలి చే పట్టదగిన నడుము కలిగినట్టియు,గొప్ప పిరుదులు కలిగినట్టియు గొప్ప పిక్కలు ,పాదముల కల్గిన శ్రీరామచంద్రుని స్తుతించుచున్నాను.
వ్యా:శ్రీరామచంద్రుని దివ్యరూపము కన్నులకు కట్టినట్లు వర్ణింపబడినది.
35.శ్లో:వందామహేమహేశాన చండ కోదండఖండనమ్
జానకీహృదయానంద చందనం రఘునందనమ్.
తెలుగు అనువాద పద్యము:
చ:జలనిధివేషటితా.ిల రసాభృదహీంద్ర భూషణాధికో
జ్ట్వల హరచాపఖండన విశాల భుజాబలశాలికిన్ దయా
జలధికి భూమిజా హృదయ సారస హేళికి శీలికిన్ మహా
బలతనయార్చితాంఘ్రి నవపద్మునకున్ శరణంబొనర్చెదన్.
భావము:శివధనుస్సును విరచినట్టి వాడు,సీతామాత మనస్సును సంతోషింప చేయుటకు చందనవృక్షమైనట్టి శ్రీరామునకు నమస్కరించుచున్నాను.
వ్యా:శ్రీరాముని చందనవృక్షముతో పోల్చి కవి నమస్కరిస్తున్నాడు.
36.శ్లో: జానాతి రామ తవ నామరుచిం మహేశో
జానాతి గౌతమసతీ చరణ ప్రభావమ్
జానాతి దోర్బల పరాక్రమ  మీశచాపో
జానాత్యమోఘ పటుబాణగతిం పయోధిః.
తెలుగు అనువాద పద్యము:
ఉ:తారక నామ మంత్ర రుచి దక్షసుతా రమణుండెఱుంగు;నీ
పావన పాద పంకజ ప్రభావ మహల్య యెుఱుంగు
మిక్కిలిన్
దేవర దోర్బలంబు శివదేవుని చాప మెఱుంగు;నీదు మే
ధావిభవంబు గల్గుశరధాటి సముద్రుడెఱుంగు రాఘవా.
భావము:ఓ రామచంద్రా నీ నామము యెక్క రుచి శివునకు తెలుసు.నీపాదామర్థ్యము గురించి అహల్యకు తెలుసు.నీ భుజపరాక్రమము శివధనువుకు తెలుసు. నీ బాణప్రయోగము సముద్రుడెరుగును.
వ్యా:శ్రీరాముని గొప్పదనమెవరెవరికి తెలుసో కవి అతి చక్కగా వివరిస్తున్నాడు.
37. శ్లో :దివ్యస్యందన మధ్యగం రణరణచ్చాపాన్వితం భీషణం
కాలాగ్ని ప్రతిమాన బాణకలితం ఘోరాస్త్ర తూణీ ద్వయమ్
సుగ్రీవాంగద రావణానుజమరత్పుత్రాది సంసేవితం
రామం రాక్షసవీరకోటి హరణం రక్తాంబుజాక్షం భజే.
తెలుగు అనువాద పద్యము:
శా:సారస్యందనమధ్యగున్ రణరణ చ్చాపాన్వితున్
రాఘవున్
ఘోరాగ్ని  ప్రతిమాన బాణకలితున్  గ్రూరాస్త్ర తూణీద్వయున్
సూరాత్మోద్భవ రావణానుజ మరుత్సూన్వాది సేవితున్
వీరున్ రక్తసరోజ నేత్రుహతవిద్వేషున్ బ్రశంసించెదన్.
భావము:శ్రేష్టమైన రథమధ్యమును పొందినట్టియు,ధ్వని చేయుచున్న ధనుస్సుతో కూడినట్టియు,ప్రళయాగ్నితో కూడినట్టియు,భయంకర బాణములుగల అంబులపొదుల జోడు కలిగినట్టియు, సుగ్రీవుడు, అంగదుడు ,విభీషణుడు, ఆంజనేయుడు, మొదలగువారిచే సేవింపబడునట్టియు, బహు రాక్షస సంహారము చేయునట్టియు,ఎఱ్ఱతామరల వంటి నేత్రములు కలిగినరాముని సేవించుచున్నాను.
వ్యా:సుగ్రీవాదులచే సేవింప బడుతున్న శ్రీరాముని కవి చక్కగా వివరించుచున్నాడు.
38.శ్లో:బ్రహ్మాద్యమర సిద్ధ.జన్మ భువనం యన్నాభి పంకేరుహం
శ్రీ నిర్వాణనికేతనం యదుదరం లోకైక శయ్యాగృహం
యద్వక్షః కమలా విలాస భవనం యన్నామ మంద్రం సతామ్
వాసాగార మఖండమంగళనిధిః పాయాత్ నౌ రాఘవః.
తెలుగు అనువాద పద్యము:
ఉ:ఎవ్వని నాభిపద్మము రహిన్ విధిముఖ్యుల జన్మకారణం
బెవ్వని వక్ష మిందిరకు నింపగునట్టి విలాసమందిరం
బెవ్వడు ముక్తికిన్ సదన మెవ్వఁడశేషజగద్విధాయకుం
డెవ్వనినామమెంతురు మునీశ్వరులా  రఘురాముఁ గొల్చెదన్.
భావము: ఎవని నాభిపద్మము బ్రహ్మాది దేవతలకు జన్మదేశమో,లక్ష్మీదేవికి సుఖగృహమైన  యెవ్వని గర్భములోకమునకు పడకటిల్లో,(లోకములన్నీ స్వామి గర్భములో నుండునను భావము)యెవని రొమ్ము లక్ష్మికి ఆట యిల్లో,యెవని నామము సత్పురుషులకు నివాసగృహమో అట్టి సర్వశుభాకారుడైన రాముడు మమ్ము రక్షించు గాక.
వ్యా:సర్వాంతర్యామి ని చక్కగా వర్ణిస్తున్నారు.
39.శ్లో: శృంగారం క్షితి నందినీ విహారణే వీరం ధనుర్భంజనే
కారుణ్యం బలిభోజనేద్భుత రససింధౌ గిరిస్థాపనే
హాస్యం శూర్పణఖా ముఖే భయవహే బీభత్స మన్యాముఖే
రౌద్రం రావణ మర్ధనే మునిజనే శాంతం వపుఃపాతు నః.
తెలుగు అనువాద పద్యము:
మ:ధరణీ పుత్రి మునీంద్ర శంకర ధనుర్దైత్యారి లంకా  పురీ
శ్వర వైరోచన రావణానుజులకున్ సాధార ప్రౌఢిచే
వర శృంగారము శాంత వీరభయ భీభ
త్సాద్భుతోగ్రంబులున్
గరుణా హస్య రసంబు లుప్పతిలు రాడ్గాత్రంబుభావించెదన్.
భావము:సీతాదేవితో విహరించు నపుడు శృంగార రసమును,కాకాసురుని విషయమందు దయయు,సముద్లములో పర్వతము లుంచునపుడు అద్భుత రసమును ,శూర్పణకనుచూచు నపుడుఆస్య రసమును ఇతరస్త్రీల మోమున బీభత్సము రావణ సంహారమునందు రౌద్రరసమును,మునీశ్వరులందు శాంతరసమును స్ఫురింప చేయు శ్రీ రాముని స్వరూపము మమ్ము రక్షించు గాక.
వ్యాఖ్యానము:నవరసాలు ఇందులో చక్కగా పోషించబడినవి.
40.మాతో రామో మత్పితా రామచంద్రో
భ్రాతా రామో
మత్సఖా రాఘవేశః
సర్వస్వంమే రామచంద్రోదయాళుః
నాన్యందైవం నైవ జానే న జానే.
తెలుగు అనువాద పద్యము:
రాముడు తండ్రి మజ్జనని రాముడె భ్రాతయు రామచంద్రుడే
రాముడె మిత్రుడున్ గురుడురాముడెసర్వధనంబు
రాముడే
రాముడు సత్కృపాకరుడు రామునితో సరి
యన్య దైవమున్
వేమరు లేదు లేదనుచు వేడ్క భజించెద నిష్టసిద్ధికిన్.
ఉ:భావము-:తల్లి తండ్రి సోదరుడు,స్నేహితుడు,అన్న అంతా రాముడే వేరు దైవమును ఎరుగను.
వ్యా:అంతా రామమయం అనే విషయం చక్కగావివరించబడింది.
  సశేషం.

No comments:

Post a Comment

Pages