తల్లిప్రకృతి - అచ్చంగా తెలుగు

తల్లిప్రకృతి

పెయ్యేటి రంగారావు 



               ' స్వరయుక్తంగా చదవకపోతే సంధ్యావందనం చేసిన ఫలితం లభించదు కాళీ!'
          ' అలాగే నాన్నగారూ!  మీరు పలుకుతున్నట్లుగానే జాగ్రత్తగా పలుకుతూ నేర్చుకుంటాను.'
          ' సంధ్యావందనం పుస్తకాలలో కూడా కొన్ని అక్షరాలకు కింద, కొన్ని అక్షరాలకు పైన గీతలుంటాయి.  కింద గీతలున్న అక్షరాలని కింద స్థాయిలో పలకాలి.  పైన గీతలున్న అక్షరాలని పైస్థాయిలో పలకాలి.  కొన్ని అక్షరాలకి పైన రెండు గీతలుంటాయి.  వాటిని రాగయుక్తంగా పలకాలి.'
          ' అర్థమయింది నాన్నగారూ!.'
          కాళీవరప్రసాదశర్మ లక్ష్మీనరసింహశర్మగారి ఏకైక పుత్రుడు.  లక్ష్మీనరసింహశర్మగారు చాలా నిష్ఠాపరుడు. రోజూ తెల్లవారుజామునే లేచి సంధ్య వార్చుకుని, దేవతార్చన గావించుకుని అప్పుడు కాఫీ తాగుతాడు. తన కుమారుడైన కాళీని కూడా తన అడుగుజాడలలోనే నడిచేలా అతడికి శిక్షణ ఇచ్చుకుంటున్నాడు.  కాళీకి కూడా తన తండ్రిగారికున్న  భక్తి, మంచి అలవాట్లు బాగానే అబ్బాయి.
          శర్మగారికి మారుతున్న దేశకాల పరిస్థితులని చూస్తుంటే చాలా బాధ కలుగుతూ వుంటుంది.  తను రోజూ చెప్పుకునే సంకల్పంలో కలియుగే, ప్రథమపాదే అని చెప్పుకుంటూ వుంటాడు. అంటే ఇది కలియుగపు మొదటి పాదమేనన్న మాట.  ప్రథమపాదంలోనే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, పరిస్థితులు ఇంత అల్లకల్లోలంగా వుంటే ఇంక నాలుగవ పాదం వచ్చేసరికి ప్రపంచం ఏ పరిస్థితిలో వుంటుందో కదా అనిపిస్త్తూ వుంటుంది అతడికి.
          కాళీ చదువులో కూడా చాలా చురుకైన వాడు.  ఎప్పుడూ క్లాసుఫస్ట్ వస్తాడు.  అతడంటే టీచర్లందరికీ చాలా ఇష్టం.  కాళీకి చదువుతో పాటు ఆధ్యాత్మిక విషయాలమీద కూడా చాలా ఆసక్తి ఎక్కువ.  ఒక్కొక్కసారి అతడికి చాలా  విచిత్రమైన సందేహాలు వస్తూ వుంటాయి.  ఐనా సిగ్గుపడకుండా తన తండ్రినడిగి తీర్చుకుంటూవుంటాడు.  
          ' నాన్నగారూ!  మన పురాణాలన్నీ బూతులబుంగలుగా నాకు కనిపిస్తున్నాయండీ.'  అన్నాడు కాళీ ఒకరోజు తనతండ్రితో.
          శర్మగారు చిరునవ్వు నవ్వి అడిగారు, ' ఎందుచేత?
          శ్రీకృష్ణుడు అందరికీ మార్గదర్శకమైన గీతను బోధించాడు.  బాగుంది.  కాని కృష్ణుడి ప్రవర్తన ఎటువంటిది?  చిన్నప్పుడే, గోపికలు స్నానాలు చేస్తుంటే వారి చీరలు తీసి దాచేసి ఏడిపించాడు.  స్త్రీలను గౌరవంగా చూడాలని కదా హిందూమతం బోధిస్తున్నది?  స్త్రీలమీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయనే కదా, ఇప్పుడు అందరూ గగ్గోలు పెడుతున్నది?  మరి ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడంతడి వాడు స్త్రీలను అల్లా అల్లరి పెట్టడం ఎంతవరకు సమంజసం నాన్నగారూ?'
' లౌకికపరమైన దృష్టితో ఆలోచిస్తే నీ వాదన సమంజసంగానే తోస్తుంది.  కాని అలౌకికంగా యోచిస్తే అందులోని పరమార్థం బోధపడుతుంది.  ఇక్కడ కృష్ణుడికి, గోపికలకు మధ్య వున్నది స్త్రీ పురుష సంబంధం కాదు.  పరమాత్మకు, జీవాత్మకు వున్న అనుబంధం.  శ్రీకృష్ణపరమాత్మ గీతలో అహాన్ని విడిచిపెట్టమని పదేపదే ఉద్బోధించాడు.  అహం అంటే ఏమిటి?  నేను, నాది అనే మమకారం.  ఈ శరీరం నాది, ఈ భార్యాపిల్లలు నావాళ్ళు, నేను సంపాదించుకుంటున్న ఈ ఆస్తిపాస్తుల్లన్నీ కేవలం నావి.  ఈ సంపాదించుకునే ధనమంతా నేను, నా పిల్లలు సుఖభోగాలనుభవించడానికి. అనేటటువంటి ఈ తాపత్రయాల వలన మనిషి పరానికి దూరమవుతున్నాడు. తామరాకు మీద నీటిబిందువులా జీవించాలని  భగవంతుడు సెలవిచ్చాడు.  నువ్వు  చెప్పిన దాంట్లో కూడా అదే పరమార్థం వుంది.  గోపికలు అంటే జీవాత్మలు. వారు శరీరం మీద మమకారాన్ని వదులుకుని, ' అన్యథా శరణం నాస్తి, త్వమేవ  శరణం మమ.'  అని చేతులెత్తి   మ్రొక్కుతూ  కైవల్యాన్ని  పొందారు.'
' చాలా బాగా వివరించారు నాన్నగారూ.మీరు చెప్పింది సబబుగానే వుంది. ఐతే శ్రీకృష్ణుడు పరమాత్మ కనక మనం అలౌకికంగా ఆలోచించవచ్చు. కాని పరాశరుడు ఒక మామూలు మనిషి. తపస్సు చేసుకుంటున్న ముని. మరి ఆయన నదిని దాటుతూ,  పడవ నడపుతున్న  ఒక పల్లెవనితను కామించడం  ఎంతవరకు సమంజసం?'
          ' మంచిప్రశ్న వేసావు కాళీ.  ఐతే ఒక్కవిషయం.  పరాశరుడు అంతకు ముందు కాని, ఆ తర్వాత కాని స్త్రీలతో తిరిగిన దాఖలాలు లేవు కదూ?  దానికి కారణం ఏమిటింటే, పరాశరుడు గొప్పతపస్సంపన్నుడు.  త్రికాలజ్ఞాని.  గ్రహాలన్నీ సరైన రాశులలో వుండి, కొన్ని గ్రహాలు ఉచ్చదశలో వున్న ఘడియలలో జన్మించిన శిశువు లోకోత్తరుడవుతాడు.  ఆయన పడవలో వెళ్తున్న సమయం అత్యంత మహత్తరమైనది.  ఆ ఘడియలలో గర్భాన్ని దరించిన స్త్రీకి పుట్టే శిశువు లోకకళ్యాణకారకుడవుతాడు.  అందువలన పరాశరుడు సత్యవతికి ఆమె కన్యాత్వం చెడకుండా వరమిచ్చి ఆమెను గర్భవతిని చేసాడు.  వారికి జన్మించిన వేదవ్యాసుడి గురించి అందరకు తెలిసున్నదే కదా?'
          ' వాస్తవాలు తెలియక కొంతమంది మన పురాణాలను హేళన చేస్తున్నారు నాన్నగారూ.  మీ వివరణతో నా సందేహాలన్నీ తీరిపోయాయి. ఇలా అడిగినందుకు మాత్రం  నన్ను క్షమించండి.'
          శర్మగారు నవ్వి వూరుకున్నారు.
          శర్మగారి భార్య పేరు కృష్ణవేణి.  ఆమెను శర్మగారు ఆప్యాయంగా ' కృష్ణా!' అని పిలుచుకుంటూ వుంటారు.  ఆవిడ మెట్రిక్యులేషను వరకూ చదువుకుంది.  చిన్నప్పుడే రామాయణం, భారతం, భాగవతం లాంటి ఉద్గ్రంథాలన్నీ చదివేసింది.  అంతేకాదు, ఆవిడకు సాహిత్యమంటే అమితమైన ఇష్టం.  అందువల్ల అడవి బాపిరాజుగారు, విశ్వనాథ సత్యనారాయణగారు,  చిలకమర్తి  లక్ష్మీనరసింహంగారు లాంటి మహానుభావులు, మాదిరెడ్డి సులోచనారాణిగారు, వాసిరెడ్డి సీతాదేవిగారు లాంటి మంచి రచయిత్రులు, రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు, మధురాంతకం రాజారాం గారు, బీనాదేవిగారు, చలంగారు వంటి గొప్ప రచయతలు వ్రాసిన పుస్తకాలన్నీ చిన్నతనంలోనే చదివేసింది.  ఐతే ఆవిడకు ప్రాపంచిక విషయాలేవీ పట్టవు.  ఎంతసేపూ భర్తకి, కొడుక్కి ఆప్యాయంగా అన్నీ వండి పెట్టడం, వారికి పూజ సమయానికి కావలసినవన్నీ అమర్చడం, తీరికసమయాలలో భగవద్గీత, రామాయణం, భాగవతం చదువుకోవడం, వీటితోనే ఆమెకు కాలక్షేపం అయిపోతూ వుంటుంది.  వాళ్ళకి దేనికీ లోటు లేకపోయినా, ఇంట్లో మాత్రం టి.వి.లేదు.  పాతకాలపు రేడియోలో భక్తిరంజని, వార్తలు, ఏవన్నా నాటకాలు, సంగీత కార్యక్రమాలు పెట్టుకుని కాలక్షేపం చేస్తూవుంటారు.  ఇక కాళీ అయితే రేడియో దగ్గరకే వెళ్ళడు.  ఎంతసేపూ చదువు మీదే ధ్యాస.
          ఒకసారి కాళీ తండ్రిని అడిగాడు.  ' నాన్నగారూ!  నాకెప్పటినుంచో ఒక ధర్మసందేహం.'
          'ఏమిటి నాయనా అది?'  
          ' మనం సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రీమాతను ఉపాసిస్తాం కదా?  కాని సూర్యనారాయణుడికి అర్ఘ్యం ఇవ్వడం దేనికి?  అసలు సంధ్యావందనం అంటే సూర్యుడిని ఉపాసించడమా, లేక గాయత్రీమాతను ఉపాసించడమా?  అసలు గాయత్రీమాత ఎవరు?   
          ' నువ్వు చిన్నప్పుడు చదువుకున్న శ్లోకం ఏమిటి?  నీవె తల్లివి, తండ్రివి, నీవే గురుడవు, నీవే సఖుడవు అంటూ కృష్ణుడిని స్తుతించావు కదా?  కృష్ణుడు స్త్రీయా, పురుషుడా?  కృష్ణుడిని మనం తల్లిగా భావించాలా, తండ్రిగా భావించాలా?  అసలు భగవంతుడికి రూపం వుందా?'
          'అర్థమైంది నాన్నగారూ.'
          ' అంతే కాదు, మనం సూర్యుడిని ఉపాసిస్తాం.  గంగ, యమున,కావేరి, కృష్ణ మొదలైన పుణ్యనదులకి నమస్కరిస్తాం.  పుష్కరస్నానాలు చేస్తాం.  రావిచెట్టుకి, మర్రిచెట్టుకి, వేపచెట్టుకి కూడ నమస్కరిస్తాం.  ఆవుని పూజిస్తాం. అగ్నిదేవుడిని పూజిస్తాం.  హోమాలు చేస్తాం.  పెళ్ళిలో కూడా హోమం లేకుండా ఏ కార్యక్రమం చెయ్యం.  భూమాతకి నమస్కరిస్తాం.  వాయుదేవుడిని ఆరాధిస్తాం.  సంధ్యావందనం చెప్పుకునేటప్పుడు ఓం నమ: ప్రాచ్యై, దక్షిణాయై,ప్రతీచ్యై, ఉదీచ్యై, ఊర్ధ్వాయై, ధరాయై, అంతరాయై దిశే యాశ్చదేవతా ఏతస్యాం ప్రతివసంతేతాభ్యశ్చ నమ: అని అన్ని దిక్కులకి నమస్కరిస్తాం.  ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయచ, గురు, శుక్ర, శనిభ్యశ్చ, రాహవే కేతవే నమ: అని నవగ్రహాలని అర్చిస్తాం.  మనం ప్రకృతిని ఆరాధిస్తాం.  ఎందుకో తెలుసా?  గాలి లేకపోతే అసలు మనిషి బ్రతకలేడు, చెట్లు బ్రతకవు.  పైర్లు ఎదగవు.  ఇక నీరు ప్రాణికి జీవాధారం.  పొలాలకు నీరు లేకపోతే మనకు తిండే లేదు.  మొక్కలు ఎదగడానికి, పైర్లు పెరగడానికి భూమి వుండి తీరాలి కదా?  ఇక అగ్ని అవసరం ఎంత వుందో వేరే చెప్పాలా?  అలాగే ఈ సమస్త భూమండలానికి వెలుగును పంచుతున్న మహానుభావుడు సూర్యుడు.  ఇలా ప్రకృతిలోని ప్రతి అంశము మనకు దైవసమానమే.  అసలు శ్రీకృష్ణపరమాత్మ గీతలో ఏమన్నాడు?
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ||
నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును గాంచును. ఆత్మదర్శియైన అట్టివాడు దేవదేవుడైన నన్నే నిక్కముగా సర్వత్రా గాంచును.  
          మనం తెల్లవారి లేస్తే ఐనదానికి, కానిదానికి లక్షసార్లు థాంక్సు, సారీలు చెప్పుకుంటూ వెళ్తాం కదా?  అటువంటిది మనకి జీవనాధారమైన ప్రకృతికి, సూర్య చంద్రులకు, పంచభూతాలకు మనం కృతజ్ఞతలు చెప్పడంలో  తప్పేమన్నా వుందా?  వాటిని ఆరాధించడంలో అనౌచిత్యముందా?  చెప్పరా కాళీ.'
          కాళీ ఆలోచిస్తూ వుండిపోయాడు.   
          రోజులు గడుస్తున్నాయి.  కాళీ ఒక్కొక్క క్లాసే దాటుకుంటూ ఇంజనీర్ అయ్యాడు.  అతడి చదువు పూర్తికాగానే అతడికి మంచి విదేశీకంపెనీలో చాలా ఎక్కువ జీతం మీద ఉద్యోగం వచ్చింది.  తలిదండ్రులు చాలా ఆనందించారు.  తమ పూజలు ఫలించాయని పొంగిపోయారు.  వారి కుటుంబానికున్న పేరు ప్రఖ్యాతులవల్ల, అతడి ఉద్యోగాన్ని చూసి కాళీకి అనేక పెళ్ళిసంబంధాలు రాసాగాయి.  అనేకమంది లక్షలు, లక్షలు కట్నం ఇస్తామని సంప్రదించసాగారు.  ఐతే, శర్మగారికి ధనాశ లేదు.  మంచికుటుంబంలోంచి రూపసి, విద్యావతి, గుణవంతురాలు ఐన కావేరి అన్న అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నారు.  కావేరి కూడా బి.టెక్. చేసింది.  ఆమె కూడా మంచి ఉద్యోగంలో వుంది.  
          కోడలు ఇంటికొచ్చిన వేళావిశేషం, కాళీకి ప్రమోషను వచ్చి, మరింత ఎక్కువ జీతం మీద అతడి కంపెనీ వారు అతడిని అమెరికా పంపుతామన్నారు.  అందరూ చాలా సంతోషించారు.  
          ఐతే కాళీ తలిదండ్రులని వదిలి వెళ్ళడానికి బెంగపడుతూంటే శర్మగారు అన్నారు, ' నాయనా!   నేటి రోజుల్లో ఇవన్నీ సహజం.  ఇదివరకు ఉన్నవూరు దాటి వెళ్ళాలంటే ఇబ్బంది పడేవారు.  కాని ఇప్పుడు ప్రపంచమంతా ఒకటయిపో్యింది.  పైగా ఇదివరకు కాశికి వెళ్ళినవాడు, కాటికి వెళ్ళినవాడు ఒకటే అనేవారు.  దానికి కారణం ప్రయాణాలు అంత ప్రమాదకరంగా వుండేవి.  ఇప్పుడు ఇవాళ ఇక్కడ బయలుదేరితే, రేపటికల్లా అమెరికాలో వుంటున్నాం.  అంతేకాదు.  ప్రపంచంలోని ఏమూల నుంచయినా, మరే మూలకయినా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చును.  శాస్త్రం ఇంత అభివృధ్ధి చెందిన ఈ రోజుల్లో ఎందుకురా, మాగురించి అంత బెంగపడతావు?  చక్కగా ఇద్దరూ అమెరికా వెళ్ళి ప్రయోజకులనిపించుకోండి.'
          కాళీ ఇంకే మాట్లాడలేకపోయాడు.  కావేరిని తీసుకుని అమెరికా వెళిపోయాడు.  అక్కడ అతడికి అన్నీ సదుపాయంగానే వున్నాయి.  చక్కని వసతి దొరికింది.  తన భార్యకు కూడా వెళ్ళిన నెలరోజుల్లోనే మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది.  ఇద్దరూ చెరో కార్లోను ఆఫీసులకి వెళ్ళి వస్తూంటారు.  ఇక అమెరికా అన్న మాటే కాని, అక్కడ దొరకని వస్తువంటూ లేదు.  కావల్సినన్ని ఇండియన్‌ రెస్టారెంట్లు వున్నాయి.  ఇండియన్‌ షాపులున్నాయి.  ఆ షాపుల్లో చంద్రికా సబ్బునించి, అన్ని వస్తువులు చక్కగా దొరుకుతాయి.
          వెళ్ళిన మొదట్లో రోజుకొకసారి కాళి, కావేరి తమ తలిదండ్రులతోను, అత్తమామలతోను స్కైప్ లో మాట్లాడుతూ వుండేవారు.  తరవాత్తరవాత  వారానికొక సారి మాట్లాడుతున్నారు.  ఆ తరవాత అదీ తగ్గిపోయింది.    
          చూస్తూ, చూస్తూండగా రెండేళ్ళు గడిచిపోయాయి.
                    శర్మగారు కొడుకు గురించి ఆందోళన పడసాగారు.  అక్కడి వాతావరణం కాళీలో ఏమైనా మార్పులు తీసుకువచ్చిందా?  అతడికి ఏవైనా కొత్త అలవాట్లు వచ్చాయా?   ఏదీ తెలియటల్లేదు.  కాని కాళీ ఫోన్లు చెయ్యడం పూర్తిగా తగ్గించివేసాడు.  
                   ఇక్కడ కృష్ణవేణి ఆరోగ్యం రోజురోజుకి క్షీణించసాగింది.  డాక్టర్లు పరీక్షించి ఏ జబ్బూ లేదని బలానికి మందులు రాసిచ్చారు.  కాని ఆమె  ఆరోగ్యం మాత్రం బాగుపడటల్లేదు.  శర్మగారు ఆమె గురించి కూడా ఆందోళన పడసాగారు.  ఆమె పరిస్థితి చూసి, ఇంక భరించలేక ఒకరోజు శర్మగారు తన కొడుక్కి ఫోన్‌ చేసారు.  ఆ సమయంలో కొడుకు అందుబాటులో లేడు.  కోడలు అయిన కావేరి ఫోను తీసింది.
          ' అమ్మా, కావేరీ!  ఎలా వున్నారు మీరిద్దరూ?'
          ' బాగున్నాం మామయ్యా.  మీరెలా వున్నారు?'
          ' ఏమిటోనమ్మా.  మీ అత్తయ్య ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు.  డాక్టర్లనడిగితే జబ్బేం లేదు పొమ్మంటున్నారు. మీకు ఫోన్‌ చేసి చెబుతానంటే మీ అత్తయ్య ససేమిరా వద్దంది.  చెబుతే మీరిద్దరూ కంగారు పడి ఇక్కడికి పరిగెత్తుకు వచ్చేస్తారంది.  దానివల్ల మీ కెరీర్లు పాడవుతాయంది.  కాని మీ అత్తయ్య రోజురోజుకి చిక్కిపోతోందమ్మా.   ఏంచెయ్యాలో అస్సలు పాలుపోవటల్లేదు.  అందుకనే ఇంక ఉండబట్టలేక మీకు ఫోను చేస్తున్నానమ్మా.'
          కావేరి అంది, ' కదా!  సేమ్‌ టు సేమ్‌.  మీ అబ్బాయి పరిస్థితి కూడా ఇక్కడ అలాగే వుంది మామయ్యా.  నా బలవంతం మీద డాక్టరుకి చూపించుకున్నారు.  ఆయన పరిస్థితి గురించి కూడా ఇక్కడి డాక్టర్లు అత్తయ్యగారి గురించి అక్కడి డాక్టర్లు చెప్పినట్లే చెప్పారు.  మీకు ఫోన్‌ చెయ్యాలని ఎన్నిసార్లో అనుకున్నాను.  కాని మీ అబ్బాయిగారు చెయ్యద్దని నాకు ఆంక్షలు పెట్టారు.  మీతో చెబుతే మీరు గాబరా పడతారు, అందుకని మీతో ఏమీ చెప్పద్దని అన్నారు మామయ్యా.'
          శర్మగారు చాలా ఆందోళన పడ్డారు.  ' ఏమిటమ్మా, నువ్వంటున్నది?  మరి వాడి ఆరోగ్యం అలా వుంటే మాకు చెప్పద్దా?  వాడు వద్దంటే మాత్రం నువ్వు మానేస్తావా?'
          కావేరి నిస్పృహగా అంది, ' మరి మీరు కూడా అత్తయ్య వద్దన్నారని మాకు ఫోన్‌ చెయ్యలేదు కదా మామయ్యా.'
          శర్మగారు మౌనంగా ఫోను పెట్టేసారు.
          సుదీర్ఘంగా ఆలోచించి, కాగితం, కలం తీసుకుని కొడుక్కి ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టారు.  ఎందుకంటే ఫోనులో మాట్లాడినా తన మనసులో వున్న భావాలనన్నిటినీ విపులంగా విశదీకరించడం సాధ్యపడదు.  పైగా తను చెప్పదలుచుకున్నదానిని మధ్యలో తన కొడుకు ఖండించవచ్చును.  అప్పుడు సమస్య పరిష్కారం కాకపోవచ్చును.
          ' నాయనా కాళీ, మీ ఇద్దర్నీ చిరాయురస్తని దీవించి మీ నాన్న వ్రాయునది.  మీరిద్దరూ కులాసాగా వున్నారని తలుస్తాను.  మీ నుంచి ఏదైనా శుభవార్త వస్తుందేమోనని నేను, మీ అమ్మ ఈ రెండేళ్ళుగా ఎంతో ఎదురు చూస్తున్నాము.  కాని మీరసలు ఫోన్లు చెయ్యడమే మానేసారు.  ఈ మధ్యని నేను మీ ఇద్దరి జాతకాలు మన పురోహితులవారైన పరమేశ్వరశాస్త్రిగారికి చూపించాను.  ఆయన చాలా దీర్ఘంగా స్టడీ చేసి, ఒక విషయం చెప్పారు.  మీ ఇద్దరికీ సర్పదోషం వున్నదట.  అందుకని మిమ్మల్నిద్దర్నీ శ్రీకాళహస్తి తీసుకువెళ్ళి అక్కడ పూజలు చేయిస్తే ఆ దోషం తొలగిపోయి మీకు సంతానం కలుగుతుందని నమ్మకంగా చెప్పారు.  ఆయన మాటల మీద నాకు గురి కుదిరింది.
          అంతేకాదు.  మరొక ముఖ్యమైన విషయం కూడా వుంది.  మీ అమ్మ ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు.  రోజురోజుకీ చిక్కిపోతోంది.  డాక్టర్లకి చూపించాను.  ఆమెకు ఏ వ్యాధీ లేదని అంటున్నారు.  ఒకవేళ మీ గురించి బెంగపెట్టుకుందేమో అని అడిగాను.  ఏం లేదు, పొమ్మంటుంది. నాకేమీ పాలుపోవటల్లేదు.  మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మనందరం ఆలోచించుకుని ఆమెని మంచి డాక్టరుకి చూపిద్దాము.'   నీవెప్పుడు వచ్చేదీ తెలియజేయి.'
                                                ఇట్లు,
                                             మీ నాన్న.
          ఆ ఉత్తరం పోస్ట్ చేసాక శర్మగారికి కాస్త ఊరట లభించింది.  ఇంక ఆ పైన దైవనిర్ణయం ఎలావుంటే అలా జరుగుతుంది అని అనుకున్నారు.
                    వారంరోజులు గడిచాయి.  శర్మగారు హాల్లో కూర్చుని విష్ణుసహస్రనామ స్తోత్రపఠనం చేసుకుంటున్నారు.  బైటనుంచి పోస్ట్ అన్న కేక విని ఆత్రంగా వెళ్ళారు.  పోస్ట్‌మేన్‌ ఇచ్చిన ఉత్తరం చూసి ఆశ్చర్యం కలిగింది.  అది తన కొడుకునించి వచ్చిన ఉత్తరం.  అంటే ఇంచుమించు తను ఇక్కడ ఉత్తరం వ్రాస్తున్న ఘడియలలోనే, తన కుమారుడు కూడా అక్కడ తనకు ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టాడన్న మాట!  అతడి ఉత్తరం తనకి అందిన ఈ సమయంలోనే అతడికి కూడా తన ఉత్తరం చేరుతుందేమో!  సంభ్రమంగా ఉత్తరం తెరిచి చదవసాగాడు.
          ' నాన్నగారూ!  నమస్కారం.  నన్ను క్షమించండి.  నేను కావేరితో కలిసి శాశ్వతంగా భారతదేశానికి తిరిగి వచ్చేస్తున్నాను.  ఈ విషయంలో మీ సలహా అడగకుండా నా అంతట నేనే నిర్ణయం తీసుకున్నానని నామీద కోపగించుకోకండి.
          నాన్నగారూ!  నేను మీయొక్క, అమ్మయొక్క పెంపకంలో పెరిగిన బిడ్డని.  మీరు నేర్పిన అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలను వంటబట్టించుకున్న హిందువుని.  నేను ఇక్కడ ఇమడలేను.  నీరు వదిలి ఒడ్డున గిలగిల కొట్టుకుంటున్న చేపపిల్లలా వుంది ఇక్కడి నా పరిస్థితి.
          నాన్నగారూ!  ఇక్కడ  కూడా నదులు వున్నాయి.  గాలి వుంది.  ఆకాశం వుంది. భూమి వుంది.  అగ్ని వుంది.  కాని ఇక్కడ పుణ్యనదులు లేవు నాన్నగారూ!  ఇక్కడి నదులలో పుణ్యస్నానాలు ఆచరించడం వుండదు.  ఇక్కడి నదులకు పుష్కరాలు వుండవు.  స్నానం చేసేటప్పుడు ఇక్కడి ఆడువారు గంగమ్మకి పసుపు,కుంకాలు సమర్పించరు.  ఇక్కడి నదులు కేవలం నీటికి ఆకరాలు మాత్రమే.  'గంగేచ, యమునేచ, గోదావరి, సింధు, కావేరి....జలేస్మిన్‌ సన్నిధిం కురు ' అనుకుంటూ ఇక్కడ ఎవరూ స్నానాలు చెయ్యరు. 
          ఇక్కడ కూడా రోజూ ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు నాన్నగారూ!  కాని ఇక్కడి సూర్యుడు జనం చేత సూర్యనమస్కారాలు అందుకోడు.  అర్ఘ్యాలు అందుకోడు.  
          ఇక్కడ కూడా గాలి వుంది.  కాని నాన్నగారూ, ప్రాణాయామం చేస్తూ, సూర్యనాడి, చంద్రనాడి అనుకుంటూ, ఇడ, పింగళ, సుషుమ్న అని భావించుకుంటూ వాయుదేవుడికి మహత్తుని ఎవరూ కల్పించరు.
          ఇక్కడ కూడా అగ్ని వుంది నాన్నగారూ!  కాని హోమాలు వుండవు.  బార్బిక్యూలుంటాయి.  అగ్నిదేవుడికి ఘృతం, హవిస్సు అర్పించడాలు వుండవు.
          ఇక్కడ కూడా నేల వుంది నాన్నగారూ! కాని భూమాత లేదు.
          మీకు గుర్తుందా నాన్నగారూ!  చిన్నప్పుడు మీరు నాకు తల్లిప్రకృతి గురించి చాలా చక్కగా వివరించారు.  మనం అన్నింటిలోను, అందరిలోను పరమాత్మను దర్శించుకుంటామని చాలా చక్కగా వివరించారు.  కాని ఇక్కడ నాకు ఈ పంచభూతాలలో మన విష్ణువు, మన శివుడు, మన పార్వతి, మన గంగా, యమున, కావేరిలు, మన సాక్షీభూతుడైన, మాతలి నడుపుతూండగా, ఏడుగుర్రాలనెక్కి పయనించే సూర్యభగవానుడు, మన ఋషుల నుంచి హవిర్భాగాన్ని అందుకునే అగ్నిదేవుడు, వాయుదేవుడు వీళ్ళెవరూ నాకు కనపడటల్లేదు నాన్నగారు.  నా దృష్టి సంకుచితమై పోయిందని మీరు భావించవచ్చు.  కాని నాకు నా గంగమ్మ, నా కావేరి (మరి నా భార్య పేరు కూడా అదే కదా నాన్నగారూ?), నా కృష్ణవేణి తల్లి (మరి అమ్మ పేరు కూడా అదే కదా నాన్నగారూ?), నా భారతదేశపు గగనాన ఉదయించే శ్రీసూర్యనారాయణుడు వీళ్ళందరూ కావాలి.  నేను వారందర్నీ వదిలి ఇక్కడికి వలస వచ్చి చాలా అశాంతితో జీవిస్తున్నాను.  త్యాగయ్యలా నేను ఏరోజు భుక్తి ఆరోజు సంపాదించుకుంటాను.  అంతకు మించి నాకు లక్షలు లక్షలు వద్దు.  ఆ డబ్బు కల్పించే వ్యామోహమూ నాకు వద్దు.  బిస్మిల్లాఖాన్‌గార్ని ఎవరో అమెరికా వచ్చి అక్కడ స్థిరపడిపోమని అడిగితే, వారు ' తప్పకుండా వస్తాను నాయనా!  కాని నాతోపాటు ఈ గంగమ్మ తల్లిని కూడా నువ్వు అమెరికా తీసుకువెళ్ళగలవా?  నేను రోజూ గంగాస్నానం చేస్తూవుంటాను నాయనా.  అది నా అలవాటు.' అన్నారట.  అలాగు నాకు నా పుణ్యనదులన్నీ కావాలి నాన్నగారూ.
          నాకు ఉరుకులు, పరుగులతో కూడిన ఈ వ్యస్తజీవితం, ఈ సంపాదనకోసం వెంపర్లాట, ఇవేవీ వద్దు నాన్నగారూ.  నాకు అమ్మ సన్నిధి, మీ సన్నిధి కావాలి.  పొద్దున్న ప్రశాంతంగా దేవతార్చన చేసుకోగలగాలి.  సాత్వికమైన భోజనం చాలు.  నాకు ఇహభోగాలకి దూరంగా, పరానికి దగ్గరగా వుండాలని వుంది.
          అందుకే నాన్నగారూ, మిమ్మల్ని అడగకుండా, మీ అనుమతి తీసుకోకుండా నేను భారతదేశానికి తిరిగి వచ్చేస్తున్నాను.  నన్ను క్షమించి ప్రేమతో మీ అక్కున చేర్చుకుంటారు కదూ?
                                         ఇట్లు,
                                     మీ కుమారుడు, కాళీవరప్రసాద శర్మ.'
          ఉత్తరం చదవడం ముగించిన శర్మగారు హర్షాతిరేకంతో పరుగు పరుగున లోపలికి వెళ్ళి, ప్రేమగా కృష్ణవేణిని కవుగిలిలో బిగించి అన్నారు, ' కృష్ణా, మన వంశాంకురం, మన పుత్రరత్నం, మన కాళీ అమెరికా వదిలి ఇక్కడికి వచ్చేస్తున్నాడే. ఇంక అబ్బాయి, కోడలు ఇక్కడే వుంటారట.'
          ఈ మాటలు చెబుతున్నప్పుడు శర్మగారి కళ్ళనించి రెండు కన్నీటిబొట్లు కృష్ణవేణి చీరమీద పడి ఇంకిపోయాయి.  ఆ మాటలు వింటున్న కృష్ణవేణి కన్నుల నించి రెండు కన్నీటిబొట్లు రాలి శర్మగారి పాదాలను తాకాయి.
          అవి ఆనందోద్వేగంలో వారి కళ్ళనుంచి రాలిన ఆనందాశృవులని వేరే చెప్పాలా?
  -----------------------

No comments:

Post a Comment

Pages