వన శోభ
చెరుకు రామమోహనరావు
సుందరకందరంబులను సొంపును నింపు రహింప కేకికా
బృంద మమంద నాదముననెల్గిడ నల్గడ బూచి కాచియా
నందముకందళింపగ ఘనంబులు భూమిరుహంబు లొప్పగా
డెందము నందన మ్మిదని డిందుపడెన్ వన శోభ గాంచుచున్
పాట
సాకి: శుకపిక సుమధుర రవపు మేళమున
ఝరి తరగల గలగలల గానమున
కోమల కిసలయ శోభల నలరే
వసంత మయమౌ ఈ నందనమున
పల్లవి: ఎద నిండిన భావముతో మది నిండిన రాగములో
పదిలముగా పాట జేసి పరవశించి పాడనా
పురి విప్పిన నెమలినై తనువు మరచి యాడనా||ఎద నిండిన||
చరణము1: చిరుగాలికి చిగురుటాకు సిగ్గు తోడ తల వంచగ
గిలిగింతలుకలిగించెను తుంటరి తెమ్మెర చివురుకు
పులకరించె పల్లవము పరవశించె నా హృదయము||ఎద నిండిన||
చరణము 2 : గున్న మావి కొమ్మ మీద గూటి చెంత చిలుక భామ
అలుక లోన కులుకు దోపి గోరువంక కై వెదకెను
చూసి చూసి నా కన్నుల నీరు వంక యై కదలెను ||ఎద నిండిన||
No comments:
Post a Comment