వెన్నెల యానం – 12
(చివరి భాగం)
భావరాజు పద్మిని
( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... ఆమెను ఆరాధించడం మొదలుపెడతాడు. చంద్రికను తను రెండవసారి బస్సు లో చూసిన వైనం, ఆమెతో గతంలో తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటాడు శరత్. చంద్రికకు వాళ్ళ బావతో పెళ్లి కుదిరి, మరో నెల రోజుల్లో పెళ్లి ఉందనగా, చంద్రిక తల్లిదండ్రులు, అత్తయ్య కుటుంబం అంతా అనుకోకుండా కేదారనాథ్ వరదల్లో చనిపోతారు. చంద్రిక బావ కంపెనీ బాధ్యత ఆమె మీద పడుతుంది. కోట్లకు వారసురాలిగా ఒంటరిగా మిగిలిన చంద్రికకు ముగ్గురు యువకులు ప్రేమ ఉచ్చు బిగించాలని చూస్తూ ఉంటారు. ఈ లోపల అనుకోకుండా, పరిచయం అయ్యాడు శ్రీరాం. ఆక్సిడెంట్ అయ్యి, ఐ.సి.యు లో ఉన్న అతనికి ఎవరూ లేరు. అతనికి ఆసరాగా సాయి బాబా అనే అటెండర్ ను పెడుతుంది చంద్రిక. శరత్, చంద్రిక ఇద్దరూ పేరంటాలపల్లి దర్శించుకుని, ప్రయాణం కొనసాగిస్తారు. శ్రీరాం ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ జరిగే సమయానికి, ఒక మీటింగ్ కోసం మనోహర్ తో ఢిల్లీ వెళ్తుంది చంద్రిక. అక్కడ చంద్రికను బెదిరిస్తాడు మనోహర్. ఇక చదవండి...)
ఆఫీస్ లో అడుగుపెట్టిన యువకుడిని, అంతా ఆశ్చర్యంగా చూడసాగారు. స్పురద్రూపం, ఒక్కసారి చూస్తే, కళ్ళు తిప్పుకోలేని అందం, నీలిరంగు సూట్ వేసుకుని, లోపల తెల్ల చొక్కా, టైతో వచ్చాడు. రాచఠీవి ఉట్టిపడే నడకతో రిసెప్షన్ వద్దకు వెళ్ళాడు....
“ఐ వాంట్ టు మీట్ మై వైఫ్, ఎం.డి. చంద్రిక,” అంటూ అతను రిసెప్షన్ కు వెళ్లి అడగ్గానే అంతా బొమ్మల్లా కొయ్యబారి పోయారు. అప్పుడే, చంద్రిక రూంలోంచి బైటికి వస్తున్న మనోహర్, ఆ మాటలు విని, సూటిగా ఆ యువకుడి వద్దకు వెళ్లి,
“ మిష్టర్, ఎవర్నువ్వు ?మతుండే మాట్లాడుతున్నావా ? గత పది రోజులుగా మేడం, నేనూ కలిసే ఉన్నాము. ఢిల్లీ లో కాన్ఫరెన్స్, ఆ తర్వాత ఊరి చివర ఫార్మ్ హౌస్ లో మీటింగ్స్ అయ్యాయి. ఇక మేడంకు పెళ్లి ఎప్పుడయ్యింది ?” దబాయిస్తూ అన్నాడు.
“హాయ్ మిష్టర్ మనోహర్, ఐ యాం శ్రీ, శ్రీరాం. ఇదిగో, వారం క్రితం జరిగిన మా మ్యారేజ్ సర్టిఫికేట్, మాది ప్రాక్సీ మ్యారేజ్. అంటే, నీకు తెలీదు కదూ. వివాహం చేసుకోడానికి, ఇష్టపడ్డ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పెళ్ళికి రాలేని పరిస్థితి వస్తే, ఆన్లైన్ లో, లీగల్ అడ్వైజర్ సమక్షంలో పెళ్లి చేసుకునే వీలును చట్టం కల్పిస్తుంది. మాకు అలాగే పెళ్ళయ్యింది. గుండాయిజంలో కొత్త పద్ధతులు వచ్చినట్లే, పెళ్ళిళ్ళలోనూ వచ్చాయి,” కొంటెగా నవ్వుతూ మనోహర్ ను చూసి, కన్నుగీటి అన్నాడు శ్రీ.
వెంటనే మనోహర్ వారం క్రితం ఏమి జరిగిందో గుర్తు చేసుకున్నాడు. వారం క్రితం మీటింగ్ లో ఉండగా, చంద్రిక తనకు తల నొప్పిగా ఉందని చెప్పి, ఒక పూటంతా మీటింగ్ ను తననే కొనసాగించమంది. “ఓహో, వీడేనన్న మాట, రోగిష్టి శ్రీ. ఇంతలోఎంత చేసాడు ?అయినా, లొంగినట్లే లొంగి, ఇంతకు తెగిస్తుందా ? దీని అంతు చూడాలి. ముందు వీడిని అర్జెంట్ గా లేపెయ్యాలి.” అంటూ అతని మనసులో ఆలోచనలు రేగాసాగాయి.
ఇంతలో నా రూమ్ బయటకు వచ్చిన నేను, ఒక్క ఉదుటన శ్రీరాం ను చేరి, గట్టిగా హత్తుకున్నాను. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత అతన్ని, ఇదే చూడడం. మా స్టాఫ్ అంతా, శుభాకాంక్షలు చెబుతున్నట్లు, ఒక్కసారిగా చప్పట్లు చరిచారు.
“డియర్ స్టాఫ్, ఇన్నాళ్ళూ ఈ కంపెనీ లాభాల బాటలో నడిచింది అంటే, అది నా ఒక్కదాని ఘనత కాదు. ఈ కంపనీలో అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరిదీ. అందుకే, ఈ శుభ సందర్భంలో, నాకు ఆత్మీయులైన మీతో రెండు విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. “ అంటూ మౌనం వహించింది చంద్రిక. ఆ పెద్ద హాల్ లో నలువైపులా నిశ్శబ్దం అలముకుంది. స్టాఫ్ అంతా చెవులు రిక్కించి వినసాగారు. నేను ఏనాడూ నా స్టాఫ్ ను పనివాళ్ళలాగా చూడలేదు. వాళ్ళ దృష్టిలో నేను ప్రేమాభిమానాలు పంచుతూ, అందరి భావనలను వింటూ, అనువైన వాటిని ఆమోదిస్తూ, పని చేసేందుకు సానుకూల వాతావరణం కల్పించిన నిజమైన లీడర్ ని.
“ నా విజయంలో మీకూ పాలు పంచుతున్నాను. ఇకపై మీ జీతాలను 50% పెంచుతున్నాను. “ అనగానే ఒక్కసారిగా ఆ హాల్ చప్పట్లతో, కేరింతలతో మారుమ్రోగిపోయింది. వాళ్ళను ఆగమన్నట్లుగా చెయ్యెత్తి సూచిస్తూ, శ్రీ చేతిలోని పత్రాలను తీసుకుని, వారికి చూపుతూ,
“అంతే కాదు, కంపెనీ ఆస్తుల్లో, నా ఆస్తుల్లో, అదనంగా ఉన్నవాటిని దేశంలోని, పలు చారిటబుల్ సంస్థల పేరిట రిజిస్టర్ చేసిన పత్రాలు ఇవి. ఇదేకాక, ఇకపై కంపెనీ లాభాల్లో మీకూ, నాకూ, జీతాలు మినహాయించి, మిగతాభాగం అంతా త్వరలోనే మేము నిర్మించనున్న ‘శ్రీచంద్ర కాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్’ కు చేరుతుంది. అందుకు సంబంధించిన పత్రాలు ఇవి.” నేను చెబుతుండగా, నాతో తండ్రిలా చనువుగా ఉండే రాఘవ గారు నావద్దకు వచ్చారు.
“అమ్మా, ముందుగా మీరు పెళ్లి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. కాని, ఉన్నట్లుండి, ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు ఎందుకు తీసుకున్నట్లు ? చెప్తారా ?”
“చెప్తాను బాబాయ్, అవసరానికి మించిన డబ్బు అనర్ధాలకు దారి తీస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే నివాస్, మనోహర్, కిరణ్, అంతా మంచివారే, సహృదయులే. మొదట్లో నాకు వెన్ను-దన్నుగా నిలిచినవారే. కాని, లాభాల బాట పట్టి, కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్న ఈ డబ్బు వాళ్ళని మార్చేసింది. ఈ డబ్బుకు వారసురాలైన నన్ను, తద్వారా ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని, వీళ్ళ ముగ్గురూ ఎత్తుకు పైఎత్తులు వేసేలా చేసింది. చివరకు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడనంత కర్కశంగా వీళ్ళను తయారుచేసింది. మనిషిలోని మనిషిని, డబ్బు చంపేసింది బాబాయ్...” ఆవేదనతో ఉద్వేగంగా అంది చంద్రిక.
నెమ్మదిగా నా వద్దకు వచ్చి, నా చేతిని పట్టుకుని, నొక్కి వదిలాడు శ్రీ.
“ఎంతో విలాసంగా పుట్టిపెరిగి, కదిలితే అడుగులకు మడుగులు వత్తే, సేవకులు ఉండి, వైభవంగా బ్రతికిన నావాళ్ళు ఏమయ్యారు ? ఏం తీసుకెళ్లగలిగారు ? ఈ డబ్బు వారికి బ్రతుకును ఇవ్వగాలిగిందా ?ఎవరైనా ఈలోకంలోకి ఉత్త చేతులతోనే వస్తారు, ఉత్త చేతులతోనే వెళ్తారు. ఈ సంగతి మరచి, తాము శాశ్వతంగా బ్రతుకుతామన్న భ్రమలో ఇన్ని అనర్ధాలకు ఒడిగడతారు. అందుకే, ఇంతమందికి ప్రాణసంకటంగా పరిణమించిన ఈ డబ్బును, అందరికీ పంచెయ్యలని తీర్మానించుకున్నాను.” ధృడంగా పలుకుతూ సూటిగా మనోహర్ కళ్ళలోకి చూస్తూ, ఆగాను నేను. అతను సిగ్గుతో తల వంచుకున్నాడు.
“ఈ మనోహర్ తనను పెళ్లి చేసుకోకపోతే, నన్ను చంపుతానని బెదిరించాడు. అంతే కాదు, నివాస్ ను, కిరణ్ ను రౌడీలతో కొట్టించాడు. కాని, ఎంతటి గొప్ప నేరస్తుడైనా ఎక్కడో అక్కడ తప్పు చేస్తాడు. అలాగే, కిరణ్ ATM వద్ద డబ్బులు తీసుకునేందుకు వెళ్ళినప్పుడు, ఇతని మనుషులు అతన్ని కొట్టారు. అదంతా ఆ ATM వద్ద ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది. దాని ఆధారంగా పోలీసులు, ఆ గుండాలను అరెస్ట్ చేసి, విచారిస్తే, వారు నేరాన్ని అంగీకరించారు. అంతేకాదు, నన్ను పెళ్లి చేసుకుని, ఓ నెల నాళ్లలో చంపేసి, తనే ఈ కంపెనీ కి అధినేత కావాలని, ఈ మనోహర్ ప్రణాళిక, అది కూడా నాలుగు మెత్తగా తంతే, ఆ రౌడీలే చెప్పారట ! అంతేకాదు, ఢిల్లీ లో మేమున్న ఫైవ్ స్టార్ హోటల్ లో, ఆగష్టు 15 దగ్గర పడనున్న తరుణంలో, భద్రతా కారణాల వల్ల, అనేక కెమెరాలు అమర్చారు. ఆరోజు రెస్టారెంట్ లో ఇతను నన్ను బెదిరించిన సంఘటన కూడా రికార్డు అయ్యింది. హోటల్ వారి సహకారంతో ఇవన్నీ మేము పోలీస్ లకు సమర్పించాము. “ అంటూ, మనోహర్ వైపు తిరిగి, అప్పుడే లోనికి వస్తున్న పోలీస్ లను చూపుతూ,
“మిష్టర్ మనోహర్, మీకోసం పోలీస్ లు ఎదురు చూస్తున్నారు. ఇక మీరు తప్పించుకోలేరు, ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిం.” అన్నాను. అతను తలొంచుకుని, వాళ్ళతో వెళ్ళిపోయాడు.
“స్టాఫ్, ఇకపై ఈ కంపెనీ, ఈ డబ్బు, మనందరిదీ. ఒకవిధంగా ఈ రోజు నుంచీ నేనూ ఈ కంపనీలో ఉద్యోగినే. అంతా కలిసిమెలిసి, మన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటూ, ఆర్తులను ఆదుకుందాం.” అన్నాను నేను. చప్పట్ల సందడి మార్మ్రుగుతుండగా నేను, శ్రీ బయటకు నడిచాము. ఇదీ కధ...
అంటూ శరత్ వంక చూసింది చంద్రిక.
“ఇంతకీ అమ్మడూ, ఇంతవరకూ జరిగిన ప్రేమకధను ఈ వెన్నెల యానంలో ఎవరివైపు నుంచి వారు చెబుతూ, ముచ్చటించుకోవాలి మన ఒప్పందం ప్రకారం ,అన్నీ చెప్పావు కాని, ఆ రోజున శ్రీ చెప్పిన ఉపాయం ఏమిటో చెప్పలేదు. అలా ఘబుక్కున శ్రీరాం ను ఎలా పెళ్లి చేసుకున్నావు ? ఏవిటోనమ్మా, ఈ కాలంలో పిల్లలు... మాకాలంలో ఐతేనా ?” అమ్మలక్క లాగా సాగదీస్తూ అన్నాడు శరత్.
“చెప్తాను, ఇన్నీ చెప్పి ఆ ఒక్క సంగతీ ఒదిలేస్తానా, నా ప్రియమైన శ్రీవారూ...” అంటూ శరత్ బుగ్గలు లాగి,
దిగేందుకు సిద్ధంగా సామాన్లు సర్దుతూ, ఇలా చెప్పింది చంద్రిక.
ఆ రోజు మనసు నిండా ఆవేదన నిండి ఉండగా శ్రీ తో మాట్లాడాను. “శ్రీ ! ఆ దైవం నా జీవితంలో పెళ్లి అన్న అంకంతో ఒకసారి ఆటలాడుకున్నారు. తట్టుకున్నాను, నిలబడ్డాను, కంపెనీ ని లాభాల బాట పట్టించాను. ఇప్పుడు, నా కష్టార్జితమైన ఈ డబ్బే నాకు ప్రాణసంకటంగా పరిణమించింది. శ్రీ, నువ్వే చెప్పు.నేనూ ఆడపిల్లనేగా. నాకూ ఒక మనసుంది. అంతో ఇంతో బానే ఉంటాను కదా. ఒకవేళ నాచేతిలో ఒక్క చిల్లిగవ్వ కూడా లేకపోతే, నావ్యక్తిత్వాన్ని, నా మనసును , అంతెందుకు నన్ను నన్నుగా ఇష్టపడి, పెళ్లి చేసుకునేందుకు, ఈ లోకంలో ఒక్క మగాడు కూడా సిద్ధపడడా? అటువంటి మగాడు ఒక్కడైనా ఉన్నాడా, చెప్పు శ్రీరాం.”
“ ఉన్నాడు, చంద్రికా... ఇప్పుడు కాదు, సుమారు ఏడెనిమిది ఏళ్ళ క్రితమే, నీమీదే ప్రాణాలు పెట్టుకుని, నువ్వు చేజారిపోయావని దిగులుపడి, జీవితంలో స్థిరపడ్డాడు అతను. మరొక అమ్మాయిని ప్రేమించి, గుండెకీ, తనువుకీ గాయమై ప్రాణాలు కోల్పోయే స్థితిలో అతను ఉన్నప్పుడు, దివినుంచి, దిగివచ్చిన దేవతలా మళ్ళీ నువ్వతని జీవితంలోకి వచ్చి, చెయ్యి పట్టుకుని, కొత్త ఊపిరి పోసావు. ఆ క్షణం నుంచీ క్షణక్షణం నీకోసం తపస్సు చేస్తూ, నీ పిలుపు కోసం, చూపు కోసం, నవ్వు కోసం, తపిస్తున్నాడు. నువ్వు కట్టుబట్టలతో వచ్చినా సరే, తన ప్రేమ దేవతైన నిన్ను, కళ్ళల్లో పెట్టుకుని, జీవితాంతం తోడునీడగా కనిపెట్టుకుని ఉండాలని తపించే ఒక పిచ్చివాడు ఉన్నాడు. ఇప్పటికైనా ఈ దాసుడిని కరుణిస్తావా?” గొంతులో ఉద్వేగం తోణికిసలాడుతూ ఉండగా అన్నాడు శ్రీ.
“శ్రీరాం... నువ్వు చెప్పేది...”
“శ్రీరాం కాదు చంద్రా... శ్రీరాం శరత్... నీ శరత్ ని. నీతో కాలేజీలో చదువుకున్న శరత్ ని. నువ్వు ధైర్యమనే ఊపిరి పోసి, కొత్త జీవితం అందించిన శరత్ ని. చెప్పు చంద్రికా, నువ్వు ఒప్పుకుంటే, నీ ఆస్తులన్నీ దానం చేసి, నిన్ను పెళ్లి చేసుకోడానికి, నిన్ను నిన్నుగా ప్రేమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను నేను కాపాడుకుంటాను. నాప్రేమ నిజమైనది చంద్రా. అందుకే, మన జీవితాలు ఎన్ని మలుపులు తిరిగినా, మళ్ళీ మనం ఒకచోటికి చేరుకోగాలిగాము. మరి నన్ను పెళ్ళిచేసుకుంటావా ? ఆలోచించుకుని చెప్పు... నువ్వు సరేనంటే, మిగతా కధ నేను నడిపిస్తాను.”
మనం ప్రేమించేవారి కంటే, మనల్ని ప్రేమించేవారు దొరకటం అదృష్టం అంటారు. ఆ అదృష్టమే ఎదురైనప్పుడు కాలదన్నుకోవడం సరికాదని అనుకున్నాను. శ్రీరాంకు నా అంగీకారం తెలిపాను. అలా నా కధ ఈ గోదారమ్మలా మలుపులు తిరిగీ, తిరిగీ ఈ శరత్ తో వెన్నెల యానం దాకా వచ్చింది, శ్రీరాం శరత్ గారు. తట్టా బుట్టా సర్దడం అయింది, ఇక వెళ్దామా?” అంటూ రేవుకి పడవ కట్టబోతున్న శరత్ ను బయల్దేరదీసింది చంద్రిక. పడవను అక్కడికి వచ్చిన తమవారికి అప్పగించి, సామాన్లు కార్ లో సర్దుకుని, భద్రాద్రి రామయ్య దీవెనలను అందుకుని, వెన్నెల దారాలతో కొత్త జీవితాన్ని అల్లుకునేందుకు సాగిపోయింది ఆ జంట.
*****
No comments:
Post a Comment