నాకు నచ్చిన కథ--'భార్యతో అబద్ధాలు ఆడరాదు!'
శ్రీ మునిమాణిక్యం నరసింహరావు గారు.
టీవీయస్ .శాస్త్రి
నవరసాలలో హాస్యానికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా వివరించనవసరం లేదనుకుంటాను.హాస్యం పండించటంలో 'కవిత్రయం'అయిన మునిమాణిక్యం వారు,ముళ్ళపూడి వెంకటరమణ గారు ,జంధ్యాల గారు--చిరస్మరణీయులు.వారిలో ప్రధములు శ్రీ మునిమాణిక్యం వారు. వారు వ్రాసిన కథలనే,మళ్ళీ మీకు కొన్ని చెబుతాను(Retelling). భావం దెబ్బతినకుండా, కొద్దిగా కుదించి చెబుతాను. వీటిని వారు భాగాలుగా వ్రాశారు,కొన్నిటికి ప్రత్యేకించి పేర్లేమీ పెట్టలేదు .అయితే ప్రస్తుతపు కథకు(సంఘటన /సన్నివేశం) పతాకముగా'భార్యతో అబద్ధాలు ఆడరాదు!'అనే పేరుతొ మీకు చెబుతాను.ఒక నాలుగేళ్ల పిల్లవాడు సగటున రోజుకు ఎన్నిసార్లు నవ్వుతాడో తెలుసా!మూడు వందల సార్లు.అదే!వయసొచ్చిన ఒక వ్యక్తి సగటున పది సార్లు నవ్వుతాడేమో!మన ఆరోగ్యానికి అత్యుత్తమ మందు(ఆ మందు కాదు!) నవ్వే! మనం ఆనందంగా ఉంటాము కాబట్టి నవ్వం,మనం నవ్వుతాము కాబట్టి ఆనందంగా ఉంటాం! నవ్వటం నాలుగు విధాల చేటో కాదో తెలియదు గాని,నలభై విధాల గ్రేట్ అని మాత్రం నా గట్టి నమ్మకం. ఇంక కథలోకి వెళ్ళుదాము.
***************************
నీవు ఆలస్యంగా ఇటికి వచ్చినప్పుడు,ఎందుకు ఆలస్యం అయిందో నిజం చెప్పు మీ ఆవిడతో.లేనిపోని కట్టు కథలు అల్లి చెబితే,నీవే దెబ్బతింటావు.ఈ రోజు స్నేహితులతో cards ఆడుతూ కూర్చున్నాను,లేకపోతే మేమందరమూ కృష్ణా నది వైపుకు షికారుకు వెళ్ళాము,అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పు.ఎందుకు నేను ఇలాగా'నిజం చెప్పు బాబూ' అని కోరుతున్ననో తెలుసా?
అబద్ధం ఆడటం మహాపాపమని ఋషులు చెప్పారనీ కాదు,'సత్యం వద' అని వేదంలో ఉన్నదనీ కాదు! అబద్ధాలాడితే నీవే చిక్కుల్లో పడతావని, నీ మీద జాలితో చెబుతున్నాను. ఇటువంటి విషయాల్లో,నాలాంటి అనుభవజ్ఞులే కళ్ళు తేలేసి చతికలపడ్డ రోజులున్నాయి.కృష్ణ ఒడ్డుకు షికారుకు వెళ్లానని చెబితే,'ఇంటి సంగతి చూసుకోరుటండీ!' అని ఆవిడ సాధిస్తుందని, నీవు ఏదో కట్టు కథ అల్లి అబద్ధం ఆడుతావు.అదే ఈ అబద్ధాల జన్మ రహస్యం! ఆ చెప్పే అబద్ధం ఆమెకు ఇష్టంగా ఉంటుందని,ఆమె అది విని సంతోషిస్తుందని,బాగా ఆలోచించి చివరకు'గుంటూరు నుండి మీ అన్నయ్యతో పాటుగా బ్యాంకులోనే పనిచేస్తున్నారని నీవు అంటావే , ఆయన కనపడితే మాట్లాడుతూ కూర్చున్నాను'అని అబద్ధం ఆడేస్తావు.ఈ కల్పన బాగానే ఉందనీ,ఆమె సంతోషిస్తుందని ఊహిస్తావు.కానీ,అటుపైన ఆవిడ వేసే ప్రశ్నలను నీవు తట్టుకోగలవా?'మా అన్నయ్య ఇంకా బ్రాడీపేటలోనే ఉన్నాడా? Transfer కావచ్చని చెప్పాడు,ఆ సంగతి ఏమైంది? Promotion వస్తుందని చెప్పాడు,వచ్చిందా? --ఇలా ప్రశ్నల మీద మీద ప్రశ్నలు వేసి నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.ఆ ప్రశ్నలకు,సమాధానం చెప్పటంలో ఎక్కడో ఒకచోట పప్పులో కాలేస్తావు. ఒకప్పుడు,ఆ విషయాలన్నీ తెలిసే ఆవిడ అడుగుతుంది.గుంటూరుకే చెందిన మీ ఇంటి పక్కనున్న మీ ఆవిడ స్నేహితురాలైన రత్తమ్మఎప్పుడో చెప్పేసింది మీ ఆవిడతో'వదినా!ఈ మధ్య గుంటూరు వెళ్లి వచ్చాను,మీ అన్నయ్య వాళ్ళు అరండల్ పేటలో ఉంటున్నారు!'అని.ఆ సంగతి నీకెట్లా తెలుస్తుంది? కాబట్టి,అబద్ధాలు ఆడితే లాభం లేదు.కృష్ణ ఒడ్డున నీవు పచార్లు చేస్తూ సిగరెట్లు కూడా తాగుతున్నవని ఆవిడకు ఎవరో చెప్పి కూడా ఉంటారు.నీవు చెప్పిన అబద్ధాలు అన్నీ విన్నతర్వాత,ఆవిడ'ఎందుకండీ!అబద్ధాలు!ఎవరైనా వింటే నవ్విపోరూ?'అని ఒక బాంబు పేలుస్తుంది.అప్పుడు నీవు ఏమి చేయాలో తెలుసా?తెల్ల ముఖము వెయ్యనూ వద్దూ,నేను చెప్పేదంతా నిజమేనని దబాయించవద్దు! నిజం ఒప్పుకో! ఇలాగా చెప్పు-'నా భార్యతో నా ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ఆడుతాను,
ఇతరులు నవ్వవలసిన పని ఏముంది? నా భార్యవంటి మంచి ఇల్లాలుమరెక్కడవుంది?
'. అప్పుడు ఆవిడ నీవు చెప్పిన అబద్ధాలన్నీ క్షమించి,నీవు అన్నావే--ఆ ఒక్క మాట--నా భార్యవంటి మంచిఇల్లాలు మరెక్కడవుంది! --అనే ఒక్క బాణంతో నవ్వి సంతోషించవచ్చు.అసలు మొదటనే నిజం చెపితే ఏ చిక్కులూ రావు.ఒక విషయం గుర్తుంచుకో! మీ ఆవిడ నీవనుకున్నంత అమాయకురాలు కాదు.నీవు ఎక్కడికి వెళ్ళుతుందీ ,ఎవరితో తిరుగుందీ అన్నీ వేయి కళ్ళతో కనిపెట్టి ఉంటుందని జ్ఞాపకం పెట్టుకో!
*******************
కానీ,సంసారం రసమయం చేసుకోవాలంటే ఆప్పుడప్పుడూ చిన్నచిన్న అబద్ధాలు కూడా అవసరమేమోనని,నాకనిపిస్తుంది! చూడండీ! పై కథలో ఆవిడకి అన్నీ తెలిసి కూడా, కావాలనే భర్త చేత ఎలా అబద్ధాలు ఆడించిందో!ఇప్పటికైనా,ఒప్పుకోండి,మీ కన్నా మీ ఆవిడే తెలివి కలదని.అందుచేత భార్యతో అబద్ధాలు ఆడకండి. మరోసారి,మీరు నిజం చెప్పినా నమ్మదావిడ,పైగాఎత్తిపొడుపుగా,'మీరు ఎప్పుడు నిజం చెప్పారు గనుక!'--- అని జీవితమంతా సాధిస్తుంది.అందులో,ఆడవారికి అనుమానాలు ఎక్కువ.పాపం ఒక అమాయకపు భర్త పగలల్లా ఆఫీసులో గొడ్డుచాకిరి చేసి,సిటీబస్సు పట్టుకొని అతికష్టం మీద ఇంటికి చేరుకున్నాడు.అతని చొక్కా మీద ఒక పొడగాటి వెంట్రుకను చూసి,భార్య ఇలా అందట, 'ఇప్పుడు ,అర్ధమైంది,మీరు రోజూ ఎందుకు ఆలస్యంగా వస్తున్నారో! ఇంతకూ ఆవిడ ఎవరు?' అని. అప్పటినుండి,ఆ అమాయక భర్త,ఇంటికివచ్చేముందు,చొక్కాని బాగా దులుపుకొని వచ్చేవాడు.అప్పుడు కూడా ,ఆమె 'అర్ధమైంది,వెంట్రుకలు లేని వారితో కూడా మొదలు పెట్టారన్నమాట!' అని అందట.పాపం ఆ అమాయకపు భర్త ఎప్పుడో పొరపాటున ఒక అబద్ధం చెప్పి ఉంటాడు.అతని కష్టాలన్నీ ఆ ఒక్క అబద్ధం వల్లే!ఇన్ని సమస్యలు వస్తాయనే,మునిమాణిక్యం వారు 'భార్యతో అబద్ధాలు ఆడరాదు' అని చెప్పి ఉంటారు!'ఇటువంటి విషయాల్లో,నాలాంటి అనుభవజ్ఞులే కళ్ళు తేలేసి చతికలపడ్డ రోజులున్నాయి.' అని వారే స్వయంగా చెబితే,ఇక అల్పులం మనమెంత? సంసారాన్ని ఎంత రసమయం చేసుకోవచ్చోఈ కథలో శ్రీ మునిమాణిక్యం వారు హాస్యంగా చెప్పారు.
*****
No comments:
Post a Comment