గమ్యం
కృష్ణ మణి
నాదే కులమని అడిగాడో మిత్రుడు
నాదే కులమైతే నీకేంటి
ఏ మతమైతే ఎవరికేంటి
ఎవరెటు పొతే నాకేంటని అరిచాను !
మానవత్వం కుప్పకూలుతుందనే ఆలోచన వెంటాడుతుంది
తోయబడ్డాను అగ్నిఖిలల సుడిగుండంలోకి
ఏడవడమే మిగిలింది
ఎందుకేడవాలో అర్ధం కావట్లేదు ఈ కసాయిల వనంలో !
నీవు పలానా వాడివైతే కచ్చితంగా చాందసుడివని
పలానా కులమైతే కుసంస్కారివనంటున్నారే
ఈ భూమి మీద పుట్టేటప్పుడు
మా అమ్మను అడగాలా
తనదే కులమని
మా నాన్నను అడగాలా
తనదే మతమని
నీ మూర్ఖత్వం అదే ప్రశ్నిస్తే
చచ్చే ముందే రాసిపెడతాను
ఇదే కులంలో
ఇదే మతంలో
మళ్ళీ పుడతానని !
నా అభిప్రాయం నీకు భారమైతే
ఏముంది
కలసినప్పుడు తల తిప్పుకుంటావు
లేదా అసహ్యించుకుంటావు
ఏమవుతుంది
నీది గోదారని మురిసిపోతావు
నాది అడ్డదారని నవ్వుకుంటావు !
ఏ దారి ఎటన్నా పోనీ
చివర ఒక గమ్యం ఉంటుంది
అది సముద్రమో లేక మురుక్కాలువో
చేరిన తర్వాత తెలుస్తుంది నీకు నాకు !
***
No comments:
Post a Comment