ఇలా ఎందరున్నారు ?- 18
అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని సమక్షమే ఆమెకు లోకమవుతుంది. అనంత్ తో సంకేత ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని. సంకేతను చూసేందుకు ఆమె ఇంటికి వస్తుంది అనంత్ తల్లి శరద్రుతి. అనంత్ తనతో తిరిగింది కేవలం కాలక్షేపానికే అని తెలిసిన సంకేత మనసు ముక్కలవుతుంది. అతన్ని నిలదీసేందుకు వెళ్ళిన సంకేత, ప్రస్తుతం అతను మరో అమ్మాయితో ఇదే ఆట మొదలు పెట్టాడని తెలుసుకుంటుంది. అనంత్ కు ఆక్సిడెంట్ అవుతుంది. అతనికి సేవలు చేస్తుంటుంది సంకేత. ఇక చదవండి... )
హిందూని అలా చూడగానే సంకేత ముక్కెందుకు మూసుకోవటం? కడిగేశాగా ఎక్కువ చెయ్యడం అంటే ఇదే." అంటూపాన్ తీసికెళ్లి అనంత్ మంచం కింద పెట్టింది.
సంకేతను చూస్తుంటే ఈరోజుల్లో అమ్మాయిలు ఇలా కూడా వుంటారా? ఇంత సహనంగా! ఇంత త్యాగంగా! నమ్మలేకపోతోంది హిందూ ఇన్ని రోజులు ప్రేమంటే గప్ చుప్ బండి ముందు నిలబడి వేడివేడి పానీపూరి తిని-నడుచుకుంటూ రెండు కిలోమీటర్లు రాసుకుంటూ రెండు కిలోమీటర్లు, తిరగటమే అనుకుంది.
కానీ సంకేత అలాలేదు. తనీ గదిలోకి వచ్చిన క్షణం నుండీ తనకి కన్పించకుండా ఆమె తన కళ్లల్లో బావుల్ని తవ్వినట్లు వూరుతున్న కన్నీటిని తుడుచుకుంటూనే వుంది. ఈ బాధకి భాష లేదు పదాలు లేవు అలా అని దారి ఎలా వుందో చూసుకోకుండా నడుచుకోవటమేనా! చిన్నప్పుడైతే కిందపడినా లేపి ఓదార్చేవాళ్లు ఉంటారు. ఇప్పుడలా కాదుగా!
అందుకే సంకేత రెక్క పుచ్చుకుని పక్కకి లాక్కొచ్చింది హిందూ. ఎప్పుడూ చూడనంత కోపంగా సంకేతవైపు చూసి “ నీకిదేం పిచ్చే! వీడి దగ్గర ఇంకా ఏముందని...? ఏదో కాలేజి స్నేహితుడు కాబట్టి హాస్పిటలికి వచ్చి చూడాలి వెళ్ళాలికాని.... ఈ సపర్యలేంటి? అసహ్యంగా ..” అంది. ఊరి నుండి రాగానే అనంత్ మీద ప్రెండ్స్ చెప్పిన మాటల వల్లనో లేక గతంలో అతన సంకేతను వద్దని బాధపెట్టాడనో తెలియదు కాని, అతనంటే వున్న గౌరవం పూర్తిగా పోయింది హిందూకి...
సంకేత నొచ్చుకుంటూ “మనుషులకి గొరవం ఇచ్చి మాట్లాడటం రాదానే నీకు...? మరీ ఇంత దారుణంగా మాట్లాడతావెందుకు?” అంది.
హిందూ ఆశ్చర్యపోతూ “దారుణంగా మాట్లాడుతున్నానా! వీడు నిన్నెంత ఘోరంగా బాధపెట్టాడో అప్పుడే మర్చిపోయావా! ఆ బాధలోంచి నిన్ను బయటకి తీసుకురావటానికి నా తాతలు దిగొచ్చారు. అది నేను మరచిపోలేను. అయినా వీడి కేంటే మర్యాద ఇచ్చేది. ఇవ్వకుంటే లేచొచ్చి నన్ను కొడతాడంటావా? అంత సీన్ లేదక్కడ! అయినా తప్పంతా నాదే! నీకు వీడు తగిలించి బాధలోంచి నిన్ను తప్పించి, చదువుమీదకి మళ్ళించాలని, ఒక స్నేహితురాలిగా మీ వూరొచ్చి మీ అమ్మా, నాన్నలను ఒప్పించి నిన్నిక్కడికి తీసుకొచ్చాను. చూడు నన్ను నేను కొట్టుకోవాలి… అదే నిన్ను నేను తీసుకురాకుండా అక్కడే వుంచి వుంటే… మీ నాన్న నీకీపాటికి పెళ్ళి చేసి నీ జీవితాన్ని ఓ గాడిలో పడేసేవాడు. అదిప్పుడు నీకు లేకుండాపోయింది. మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరావు…! అయినా ఏముందే వీడి దగ్గర….?” అంది.
సంకేత హిందూ వైపు వీలైనంత ప్రశాంతంగా చూసి…” అతని దగ్గర ఏదో వుందని… దాన్ని ఆటను నాకే ఇస్తాడని ఈ పని చేశాననుకుంటున్నావా? లేక ఈ పనులు చేసి అతన్ని లొంగదీసుకుంటే అతను నన్ను పెళ్ళి చేసుకుంటాడన్న ఆశతో చేస్తున్నాననుకుంటున్నావా? అసలుఅతను నన్ను పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనే నాకు లేదు. అతనను బ్రతుకుతాడో లేదో కూడా తెలియదు ...ఇలా ఎందుకు చెబుతున్నానంటే నేను చేసిన ఈ పనిలో స్వార్ధం లేదని నువ్వు తెలుసుకోవాలని…”అంది.
సంకేతమాటలు అనంత్ ని భయబ్రాంతుడిని చేశాయి. ఊపిరి బిగబట్టి వింటున్నాడు.
హిందూ జాలిగా సంకేతనే చూస్తూ “తెలుసుకున్నాను సంకేత! కాని ఇలాంటిబాధ్యతలు వాళ్ల పెద్దవాళ్ళకి వుండాలి. నువ్వేమైనా అతనిఅమ్మవా? అమ్మమ్మవా? అక్కవా? లేక భార్యవా? కనీసం అయావా? ఎందుకు చేస్తున్నావు ఈ పని? ఇన్ని రోజులు అతని వ్యామోహంలో పడి నువ్వు చేసిన పనే చాలా తప్పు దాని ఫలితంగా డిటేయిండ్ అయ్యావు. ఏదైనా ఒక పని చేస్తున్నపుడు ‘దీని వల్ల నాకేంటి? అన్న ఆలోచన రాదానే నీకు…?” అంది
సంకేతకి అసహానంగా ఉంది. ఇలాంటి మాటలకి ఇది సమయం కాదన్నట్లు బరువుగా నిట్టూర్చి పక్కనే వున్న బెంచి మీద కూర్చుంది. హిందూ కూడా సంకేత పక్కనే కూర్చుంది.
"కనీసం అతని దగ్గర ఇప్పటికీ నువ్వేం ఆశిస్తున్నావో అదైనా చెప్పవే! డబ్బా." అంది హిందూ –
సంకేత దెబ్బతిన్నట్లు చూసి "అంటే నేనీ పని డబ్బుకోసమేచేశాననుకుంటున్నావా? కాల్ చేస్తే దేవరాయుడు అంకుల్ వాళ్లు హాస్పటల్ రావటం ఆలస్యమవుతుందని చెప్పారు. అప్పటికే అతను పడుతున్న ఇబ్బంది, బాధ చూడలేక చేశాను. అదే మన ఇంట్లో మనిషి అయితే మనం పోగొటుకుంటామా? ఏది చేసినా డబ్బు కోసమే అని ఎందుకనుకోవాలి? మానవ సంబంధాలేమీ వుండవా? నిస్సహాయంగా వున్న మనిషిపట్ల ఆమాత్రం దయ వుండదా? అన్నిటికీ డబ్బేనా? అసలెందుకొస్తుందే ఇలాంటి ఆలోచన నీకు? అదేం అంటే వ్యామోహం అంటావ్ వ్యామోహం తప్ప అనుభూతి వుండదా?" అంది సంకేత.
అదే అనుభూతి, అదే దయ అతనికి నీపట్ల ఎందుకు లేదు. వుంటే నిన్ను వద్దనుకుంటాడా?" అన్దీ హిందూ.
సంకేత మాట్లాడలేదు.
”మరి అతనిపట్ల నీకున్న దయ అతను పెళ్లాడాలనుకున్న ప్రత్యూష లేదేం? వాళ్ళ అమ్మకి నాన్నకి లేదేం?" అంది హిందూ.
”... వాళ్లు దుర్మార్గులు,స్వార్థపరులు... జంతువులు కూడా ఒక జంతుపు బాధపడుతుంటే పక్కనుంటాయి. పక్షులు కూడా అంతే! వీళు మానవులై కూడా ఆపని చెయ్యటంలేదు. హాస్పిటల్లో మనిషిని ఉంచి రెస్ట్ పేరుతో కొందరు, మానసిక ఒత్తిడి లేకుండా యోగా చేసుకుంటూ కొందరు... చూస్తుంటే ఎవరికీ వాళ్ళు తప్పించుకుంటున్నట్లే అన్పిస్తుంది. లేకుంటే ఒక్క ముసలమ్మనైనా అనంత్ కి తోడుంచరా?” అంది.
ఇప్పుడు ముసలివాళ్లు ఎక్కడున్నారు సంకేతా! వాళ్లు కూడా మానవసంబందాలకి నీళ్లోదిలి వృద్దాశ్రమాల్లో వుంటున్నారు...” అంది హిందూ.
సంకేత లోలోన ఉడికిపోతుంది.
హిందూ సంకేతవైపు చూసి “అసలు రహస్యం తెలియాలి... నువ్వు తట్టుకునేలాలేవు. ఈ అనంత్ ని వాళ్ల వాళ్లు ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పనా! అతని ప్రవర్తన నచ్చక...”
సంకేత ఆశ్చర్యపోయి “ అదేంటి! అనంత్ గురించి నా కన్నా నీకే ఎక్కువగా తెలిసినట్లు మాట్లాడుతున్నావే. నువ్వు చెప్పేది నిజమా?అంది."ఏం చెయ్యను చెప్ప! నువ్వతన్ని ప్రేమిస్తున్నావని తెలిసి అతని గురించి వివరాలను సేకరించాను. అతను చిన్నప్పటినుండి పెద్దవాళ్ల మాట వినేవాడు కాదట. స్కూల్కెళ్లమని కారుల్లో పంపిస్తే బ్యాగుని కారులో పెట్టి ఊరంతా తిరిగేవాడట. స్నేహితులు లేకుండా క్షణంకూడా వుండేవాడు కాదట. వాళ్ల నాన్నగారు తన హోదా ఎక్కడ దెబ్బతింటుందోనని స్కూల్ టీచర్లకి డబ్బులిచ్చి అనంత్ కి మార్కులు వేయించేవాడట.
అయినా ఒక్కోసారి టీచర్లు డబ్బులకి లొంగకపోతే చదివిన క్లాసేమళ్ళీ చదవాల్సి వచ్చేదట… వాళ్ల తమ్ముడు నిశ్చల్ మాత్రం చదువులో టాపరట... అన్నకన్నా రెండు, మూడు క్లాసులు ముందుండేవాడట...
నీకు తెలుసుకదా ఐఐటీల్లో సీటు రావటం ఎంతకష్టమో! అసలు ఇండియన్ ఐఐటీస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కి పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్అంత టఫ్ మరొకటి ప్రపంచంలోనే లేదట.... ఈ విషయంవరల్డ్ గ్రేట్ యూనివర్సిటీస్ అన్నీ ఒప్పకున్నాయి.... అదీగాక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక, వరల్డ్ టాప్ యూనివర్సిటీలో డైరెక్ట్ గారీసెర్చ్ లో చేరిపోవచ్చు.... అందుకే....
కోట్లు డొనేషన్ ఇచ్చినా ఐఐ టీ సీట్ తెచ్చుకోలేం. అలాంటి ఐఐటి సీట్ ను నిశ్చల్ సంపాయించుకున్నాడు. ఇప్పడు అత్యంత పేరున్న కంపెనీ లో జాబ్ చేస్తున్నాడు. ఏ తల్లిదండ్రికైనా అలాంటి కొడుకు కావాలనిపిస్తుంది. వాళ్ల మీదనే గౌరవం వుంటుంది.వాళ్లపట్ల చూపించే ఉత్సాహం, కుతూహలం అనంత్ లాంటి వాళ్లపట్ల వుంటుందా?
చదవాలనుకునే వయసులో ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టటం, బెట్టింగ్ లలో యాక్సిడెంట్లు చేసుకోవటం ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు చెప్పు! పైగా నిన్ను ప్రేమించి, కోతకాలం నీతో తిరిగి ఇప్పుడు ప్రత్యూషను చేసుకోవాలనుకోవటం శరదృతి ఆంటీకి నచ్చలేదట. కొడుకుతో గొడవ కూడా పడిందట...
ఒకప్పుడు అనంత్ తండ్రి తన కొడుక్కి ఉన్నత లక్ష్యాలు లేకపోయినా పర్వాలేదు కాని తను సంపాదించింది కాపాడితే చాలనుకునేవాడట... ఇప్పుడెందుకో ఆయనకి కూడా అనంత్ పట్ల విరక్తి పుట్టిందట...” అంటూ ఆగింది.
కర్టెన్ పక్కనే బెడ్ మీద వున్న అనంత్ కళ్ళు మూసుకుని హిందూ మాటల్ని వింటున్నాడు. అతనేంటో అతనికే తెలియని ఓ స్థితిలోకి వెళ్లి అతన్నిఅతను చూసుకుంటున్నాడు. కనుకొలుకులోంచి కొన్ని కన్నీటి చుక్కలు బాధగా జారాయి.
హిందూ మాట్లాడుతూనే ఉంది.
సంకేతకి హిందూ మాటలు రుచించటం లేదు. పైగా ఇలాంటి మాటలకు ఇది సమయం కాదన్నట్లు చిరాకును అనుచుకుంటోంది. ‘హిందూ ఇక ఆపవే నీ మాటలు’ అని ఇంకా ఏం జరిగిందో చెప్పు అని ఆసక్తిగా చూడడం కాని చెయ్యకుండా అనంత్ కి వెయ్యాల్సిన మందులు గుర్తొచ్చి సడన్ గా లేచి అనంత్ బెడ్ దగ్గరికి వెళ్లింది.
రెండు టాబ్లెట్లు అనంత్ చేత మింగించి నీళ్లు తాగించింది.
అతని చేతికి కట్టివున్న ట్యూబ్ లోంచి సెలైన్ ఒక్కోబొట్టు ఎక్కుతుంటే దాన్ని స్పీడుగా ఎక్కేలా చేసింది అంతలో డాక్టర్ గారు రావటంతో పేషంటు తాలూకు మనిషిలా ఆయన్నే చూస్తూ, ఆయన చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నది, వింటున్నంతసేపు ఆందోళనగా అనంత్ నీ చూస్తోంది. పక్కనే నిలబడి ఇవన్నీ చూస్తున్న హిందూకి తల తిరిగిపోతుంది... తనెంతో కష్టపడి దీన్ని చదువుమీదకి మళ్లిస్తే ఇది మళ్ళీ అనంత్ వైపుకే వెళ్తుంది ఏమిటి?... డాక్టర్ గారు వెళ్ళిపోగానే “ నీ వాలకం చూస్తుంటే ఇక్కడే సేతిలయ్యేలా వున్నావు... నీ కిదేం పిచ్చే! వీడు నీకేదో చేశాడు. బెడ్ మీద వుంది కూడా నిను మాయ చేస్తున్నాడు. ఒక స్టూడెంట్ కి టైమెంత ముఖ్యమైనదో తెలియకపోవడం నీ ఖర్మ... నీ అంత తెలితక్కువది ఇండియా లోనే లేదు...” అంది హిందూ విసుగ్గా...
సంకేత మాట్లాడక పోవటంతో “ నేను మీ అమ్మా, నాన్నలకి ఏమి సమాధానం చెప్పుకోవాలి? ఇలా చేస్తావని తెలిస్తే మీ వూరి నుండి తీసుకొచ్చే దాన్నే కాదు. ఇప్పుడు సడన్ గా అంకుల్, ఆంటీ వస్తే నేను నా తల తీసికెళ్లి ట్రైన్ కింద పెట్టుకోవాల్సిందేగా!”
హిందూ తన కోసం ఎంత బాధపడు సంకేతకి తెలుస్తోది. అయినా తను అంత తెలివి తక్కువపని ఏం చేస్తోంది. ప్రాణాపాయ స్థితిలో వున్న మనిషికి సేవ చెయ్యటమేనా?
... కన్న కొడుకు చదువుకోకుండా తిరుగుతున్నాడని తెల్సి కూడా డబ్బులిచ్చి కార్లను,-బైక్లను కొనిచ్చే తల్లిదండ్రులకన్నా తనుతెలివితక్కువదా? చావుతో పోరాడుతున్న తన సొంత అన్నయ్యను బాధ్యతగాచూసుకోకుండా తన డ్యూటీని తను సిన్సియర్చేసుకుంటున్నఐఐటి చదివిన తమ్ముడు నిశ్చల్ కన్నా తెలివితక్కువదా? అసలు తెలివంటే ఏంటీ? చావు బ్రతుకుల్లో వున్న మనిషిని తప్పించుకుని తిరగరగదమా?
ఆ తెలివిని బంధాలు, అనుబంధాల కోసం వుపయోగించుకోకుండా కేవలం కెరియర్ కోసం ఉపయోగించు కుంటేనే అది తెలివిగా రాణిస్తుందా? బాధల్లో ఉపయోగపడని అలాంటి కెరియర్ని చూసి ఎవరు మురిసిపోవాలి? సంకేతకి నిశ్చలంటే కోపంగా వుంది.
ఆలోచిస్తున్న సంకేత భుజం తట్టి “మాట్లాడవేం సంకేతా! ఏ మాత్రం నీకు పనికిరాని ఒక మనిషి కోసం నువ్వు చేస్తున్న ఈ త్యాగం నీ భవిష్యత్తుని ఎంత ద్వంసం చేస్తుందో తెలుసా? దీని విలువ నీకిప్పుడే అర్ధం కాదు. కాలం నీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వినప్పుడు ‘నేను చేసిన తప్పు ఇదా’ అని అర్ధమవుతుంది. అప్పుడు నీ చేతిలో ఏమీ ఉండదు... ఏదో స్నేహితురాలిని చెబితే వింటావని వచ్చాను. నీ వాలకం చూస్తుంటే నువ్వు నా మాట వినేలా లేవు. నీ జీవితం నీ ఇష్టం . బై...” అంటూ వెళ్ళిపోయింది హిందు.
సంకేత మాత్రం అనంత్ దగ్గరే ఉండిపోయింది.
హిందూ వెళ్ళిపోయాక కూడా ఆమె మాటలు అనంత్ చెంపలపై చట్ ,చట్ మనిపించినట్లయి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. గాయాల బాధకన్నా ఈ మాటల బాదే అతన్ని ఎక్కువగా హింసిస్తోంది.
శ్రీహర్ష ట్రైనింగ్ పూర్తి చేసుకొని, జాబ్లో జాయిన్ అయ్యాడు. అదే సిటీలో మంచి కంపెనీలో జాబ్ రావటం కాంచనమాల ఆనందానికిశివరామకృష్ణ సంతోషానికి అవదుల్లేకుండా అయింది.
సాఫ్ట్ వేర్ జాబ్ కాబట్టి డబ్బుకి కొదవలేదు.
శ్రీహర్ష బ్యాచ్ అమ్మాయిలకి కూడా శ్రీహర్ష చేస్తున్న కంపెనీలోనే జాబ్ వచ్చింది. అతన్ని తన తల్లి పెళ్లి చేసుకోమని తొందరపెడుతోంది.ఆశ్చర్యం ఏమిటంటే తనతోపాటే జాబ్ వచ్చిన తన బ్యాచ్ అమ్మాయిల తల్లులు మాత్రం వాళ్లకి పెళ్లిళ్లు చెయ్యాలని తొందరపడటంలేదు.
ఇప్పడేగా జాబ్లో చేరింది కొద్దిరోజులైనా తమ కూతుళ్లు ఎంజాయ్ చెయ్యకుండా అప్పుడే పెళ్లేంటి? అంటున్నారు. వాళ్లు...అదీకాక జాబ్ ద్వారా వచ్చిన డబ్బుతో లేటెస్ట్ నగలు, డ్రస్లు కొనుకొని, సాఫ్ట్ఫుడ్ తింటూ, బ్యాంక్ బాలెన్స్ పెంచుకుంటూ ఇదీ జీవితమంటే అని అనుకోవద్దా అన్నదే వాళ్ల అభిప్రాయం.
కాంచనమాల దానికి అతీతంగావుంది. శ్రీహర్ష తల్లిపోరు పడలేకపోతున్నాడు.
స్మిత, నిత్య, సౌమ్య ఇంకా తనకి తెలిసిన అమ్మాయిల్లో ఎవర్ని చేసుకోవాలన్నా ఏదో సంశయం. వాళ్లను చేసుకుంటే తన లైఫ్ ఎలా వుంటుందోనన్న భయం. తన కళ్లముందే శివాని, సంకేత, పల్లవి ఎలా ఉంటున్నారో చూస్తున్నాడు. అలా అని ఆణిముత్యాల్లాంటి అమ్మాయిలు లేరని కాదు. తను కూడా తనకి అందుబాటులో ఉండే వాళ్లను చూసుకోవాలి.
తనకీ కొన్ని స్వంత అభిప్రాయాల ఉన్నాయి. పెళ్లంటే ఎవరికి వాళ్లు సంపాదించుకుంటూ ఈగోలతో ఉండటం కాదు... మనసులు ఒకరికి ఒకరు పాదాక్రాంతం చేసుకోవాలి. ఒకరిలోకి ఒకరు నదిలా ప్రవహించాలి. అంతేకాని దేన్నీ లోపలికి తీసుకోకుండా, దేన్నీ ఆఘ్రాణించకుండా దేనికీ పరవశులు కాకుండా మనసుని ఎండిన మొద్దులా మార్చుకొని కేవలం డబ్బుకోసమే బ్రతకటమంటే తనవల్ల కాదు. అందుకే ఒకరిద్దరు అమ్మాయిల్ని ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఆ ఇంటర్వ్యూ లో ముందుగా
"మీరు పెళ్ళిచేసుకున్నాక నాతో సమానంగా నా తల్లిదండ్రుల్ని కూడా చూసుకుంటారా!" అని అడిగాడు శ్రీహర్ష. వాళ్ళు ఏమాత్రం తడబడకుండా సమానంగా కాదుకదా! వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. నిన్ను పెళ్లి చేసుకుంటున్నాము కాబట్టి మాకు నువ్వు ముఖ్యం! వాళ్లతోమాకేం పని?” అన్నారు" సూటిగా.
అలాంటి వాళ్ళని చేసుకుంటే తన తల్లి వెంటనే కృంగిపోతుంది.లోలోన నిరాశకి లోనై తను వూహించని స్థితిలోకి వెళ్తుంది. తెలిసి తెలిసి తనే తన తల్లికి అంత శిక్ష వెయ్యటం ఏం న్యాయం? భర్త తప్పఆ ఇంట్లో ఎవరూ ఉండకూడదని రూల్ పెట్టటం కోడళ్లకైనా ధర్మమా?
ఇప్పటి అమ్మాయిల్లో కొందరు మరీ దారుణంగా వున్నారట.తన భర్త తనముందే తనతల్లిని కామెంట్స్ చేస్తూ చిన్న చూపు చూస్తేనే దగ్గరికి రానిస్తున్నారట.... తల్లిని తిడుతూ, కొడుతూ ఉంటేనే ఇతను నిజంగా నా భర్త ! నా గ్రిప్ లోంచి బయటకి పోకుండావింటున్నాడు. అన్న భద్రత ఫీలింగ్ని కలిగివుంటున్నారట... అబ్బాయిలు కొందరు భర్త స్థానంలోకి పోగానే తల్లితో అవసరం తీరినట్లు ప్రవర్తిస్తున్నారట... తల్లిదేముంది ఎలా చూసినా వుంటుంది. ఏం అన్నా పడుతుంది అన్నట్లు నిర్లక్ష్యం చేస్తున్నారట. చదివిన చదువుల్ని సైతం మరచిపోతున్నారట.
ఒక కొడుకులో ఇంత మార్పు రావటానికి కోడలే కారణం అని తెలియక కొడుకుల్ని నిందించే తల్లులు కూడా ఉన్నారట... ఇంకా దార్నం ఏమిటంటే! ఒకవైపు పుట్టింటిని పొగుడుతూనే అదే పుట్టింట్లో పదిరోజులు వుండిరావాలంటే తన పాకెట్ మనీ కోసం భర్తచేత ముందుగానే తన అకౌంట్ లో డబ్బులు వేయించుకుంటున్నారట... ఇదీ ఈనాటి కొంతమంది కోడళ్ళ జీవనశైలి.
ఇలాంటి కోడలు వస్తే తన తల్లి తట్టుకోగలడా? కొందరు కోడల్లయితే అత్తింట్లో కాలు పెట్టగానే తమ విధులను, బాధ్యతలను ఎలా తప్పించుకోవాలి అన్న ట్రైనింగ్ ని పెళ్ళికి ముందే తీసుకుంటున్నారట.
అందుకే తన పెళ్లి విషయంలో తనో నిర్ణయానికి రావాలి అనుకున్నాడు. వచ్చాడు. దాని గురించే రాత్రంతా దీర్ఘంగా ఆలోచించాడు.
తెల్లవారే వెళ్లి నానమ్మ దగ్గర కూర్చుని తను ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పాడు.
ముందు నిర్ధాంతపోయింది వరమ్మ...
ఆ తర్వాత అతని నిర్ణయంలోని తప్పొప్పల్ని వివరించింది. దీనివల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువగా వుందని తేల్చి చెప్పింది. ఆ తరువాత.....
తల్లిని, తండ్రిని ఓచోట కూర్చోబెట్టి తన పెళ్లి విషయం చర్చించాడు శ్రీహర్ష...
కొడుకు అభిప్రాయం, నిర్ణయం విని ఆకాశం మీదపడ్డట్టు వుక్కిరిబిక్కిరి అయింది కాంచనమాల.
శివరామకృష్ణ నిరామయంగా చూస్తునాడు.
వెంటనే విరుచుకుపడ్డ ఉప్పెనలా భర్తను ఎడాపెడా వాయించింది కాంచనమాల...
“నీకు తెలియకుండానే నీ కొడుకు ఇంత ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాడా?” అంది.
“నాకేం తెలుసు! నేనొక్కడిని దొరికాను నీకు! నీ కొడుకు తీసుకున్న నిర్ణయం నీకు ముందే తెలుసనీ నేను అనుకుంటున్నాను. కాకపోతే నిన్ను ప్రశ్నించకుండా మౌనంగా వున్నాను అంతే!” అని ప్రశాంతంగా అన్నాడు.
“మీరింత ప్రశాంతంగా మాట్లడుతున్నారూ అంటే ఇది మీకునచ్చినట్లేగా!” ఆమెకు అదో పెద్ద షాక్!
“నాక్కాదు. శ్రీహర్షకి నచ్చింది. వాడేమైనా చిన్నపిల్లాడా? మనం ఇంతగా ఘర్షించకోవటానికి? తనకి ఏది బాగుంటుందో ఆమాత్రం ఎంపిక చేసుకోలేదా?” అన్నాడు శివరామకృష్ణ.
ఒక్కక్షణం దెయ్యం పట్టినట్లు పిచ్చి చూపులు చూసి, ఆ తర్వాత... ‘ఎంపికలు, పరిశోధనలు కాదిక్కడ కావలసింది పెళ్లి ఘనంగా జరగాలి... నిశ్చితార్ధం కన్నుల పడుగాలా వుండాలి... రాకపోకలు కట్నకానుకలు, నగలు, చీరలు, బంధువులు,స్నేహితులు,తలంబ్రాలు, పోసుకోటానికి కళ్యాణ మతపాలు, పెళ్ళివారు తినటానికి రెస్టారెంట్లు ... ఇవన్నీ ఎక్కదోస్తాయి నేలిమను చేసుకుంటే...?” అంది. ఆమె ఎంత నెమ్మదిగా మాట్లాడాలన్నా ఆగ్రహం ఆగటం లేదు.
శ్రీహర్ష, శివరామకృష్ణ మౌనంగా వున్నారు. వాళ్ళ మౌనం ఆమెను పరపరకోస్తోంది.
ఉక్రోషంగా "దానికేమైనా తల్లా, తండ్రా! అన్నా, తమ్ముడా! అక్కా,చెల్లా ఎవరున్నారని.... ఎవరైనా వింటే నవ్వుటారు. అయినా దాన్ని చేసుకోవలసిన ఖర్మ నీకేంటి? వేరే అమ్మాఇలే లేరా? పెళ్ళికోసం అమ్మాయిని సెలెక్ట్ చేసుకోటానికి సిస్టమ్ లో కూడా కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి కదా! అయినా నువు ఏకాలంలో వుండి ఆలోచిస్తున్నావు శ్రీహర్ష?” అంది.
“కాలాన్ని బట్టి కొన్ని ఆలోచనలు మాత్రమే మారతాయి మమ్మీ! అన్నీ మారావు... నువ్వన్నావు చూడు ఎవరున్నారు నీలిమకు అని... ఇన్నాళ్లు ఎవరున్నారు తనకి?...గౌరవంగా, తెలివిగా, తన పని తను చేసుకుంటూ బ్రతకటం లేదా? ఇన్ని రోజులు అవసరంలేని వాళ్ళంతా ఇప్పుడెందుకు కావలసివచ్చారు? అయినా పెళ్ళంటే ఖరీదైన రెస్టారెంట్లు, కట్నకానుకలు, పట్టుచీరలు, నగలు అని నేను అనుకోవటం లేదు. నేను ఆఫీసునుండి అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు నాకంటూ ఓ మనిషి కావాలి... నాకోసం తన ఓన్ టైంను మనస్పూర్తిగా వినియోగించగలిగే మనిషికావాలి.... ఒక్కమాటలో చెప్పాలంటే పూర్ణిమ అత్తయ్యలా ఉండగలగాలి... నీలిమ నాకు తగిన మనిషి అని అనుకుంటున్నాను...” అన్నాడు.
వెంటనే ఆవేశంగా పనిమనిషి నీకు తగిన మనిషా? అంది. ఆమె మళ్ళీ షాక్ లోకి వెళ్లింది.
“ఏ ద్రవం అయిన మనం పోసే సీసా ఆకారాన్ని బట్టి కన్పిస్తుంది మమ్మీ. మనిషి కూడా అంతే! వుండే స్థానాన్ని బట్టి విలువలు మారతాయి. ఇప్పుడు నువ్వనుకుంటున్న పనిమనిషి నీలిమ నా భార్య అయ్యాక కూడా పనిమనిషి ఎలా అవుతుంది…? ఇచ్చే స్థానాన్ని బట్టి, కదా ఏదైనా! అలా అని నేను చేస్తున్న పని చాలా మందికి నచ్చకపోవచ్చు. వాళ్ల కోసం నాకు నచ్చిన దాన్ని నేను వాడులుకోలేనుగా...!” అన్నాడు శ్రీహర్ష. ఆమె బిట్తోర్చి “చూడు శ్రీహర్ష!నీలిమను కాకుండా నువ్వు ఇంకెవరిని చేసుకున్నా నీకు అత్త, మామలు, బావమరుదులు, వదిన,మరదళ్ళు వుంటారు. వాళ్లు నీ వెన్నంటే వుంటారు. ఎపతికైనా అలాంటి అండ అవసరం. అదే మనిషికి సగం బలం. సమాజపరంగా కూడా గౌరవం.” అందినచ్చచెబుతూ.
"నా ఫ్రెండ్ ఈమధ్యనే పెళ్లిచేసుకున్నాడు. వాడికి నువ్వన్న వాళ్లందరు వున్నారు. వాడి రాతను ఇప్పడు వాడి బావమరుదులు అత్తమామలు రాస్తున్నారు. తల్లిదండ్రులకి దూరమయ్యాడు. అక్కచెల్లెళ్లకి దూరయ్యాడు. వాళ్లు ఏడుస్తున్నా వాడికేంపట్టదిప్పడు. అదేమ్రా అంటే ‘ఇంట్లో వున్న ఆ కొద్దిసేపయినా నరకం లేకుండా వుండాలంటే మా వాళ్లకి దూరంగా వుండటమే బెటర్రా! ఎందుకంటే వాళ్లు నాకోసం వచ్చిన ప్రతిసారి గాయపడే పోతుంటారు.... ఏ పండగ వచ్చినా నా భార్య నన్ను తన పుట్టింటికే తీసుకెళ్తుంది. నా తల్లీ, దండ్రీ నాకోసం ఎదురుచూసి, చూసి చివరకు ఇకరాడని ఆశవదులుకుంటూరు.
ఒకసారి నా కళ్లముందే నా భార్యనా చెల్లెల్ని ఇంట్లోకి పిలవకుండా బాల్కానీలోకి తెచ్చి టిఫిన్ పెట్టి తన చెల్లెళ్లకి ఇంట్లో డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి పెట్టింది! అది వెళ్తూ,వెళ్తూ నా ముఖంలోకి చూసి "ఒరేఅన్నయ్య! మనిషికి తిండిఎంత ముఖ్యమో ఆత్మగౌరవం కూడా అంతే ముఖ్యంరా! అదే నీ కూతుర్ని అయితే ఇలా బయట కూర్చోబెట్టి తిన్దిపెదతావా?” అన్నదిరా! దాని మాటలు నన్ను గుచ్చినచోట గుచ్చకుండా గుచ్చాయి. అప్పటినుండి అది రావడం మానేసింది. ఏం చెయ్యను చెప్పు? నా జీవితం నాకు తెలియకుండానే వాళ్ల చేతిలోకి పోయింది” అన్నాడు. వాడు మా కంపెనీలోనే నెంబర్ వన్ ... ఇంట్లో మాత్రం ఏ నెంబర్లేని జీరో... అలాంటి పాత్రలో ఇమిడిపోయి నేను నటించలేను. అంత నీచమైన మానవసంబంధాలు నాకు అవసరం లేదు అన్నాడు శ్రీహర్ష.
No comments:
Post a Comment