కుశల దేశం - అచ్చంగా తెలుగు

కుశల దేశం

Share This
కుశల దేశం
-చెన్నూరి సుదర్శన్


కుఢ్య దేశం క్రమేణా ‘కుశల దేశం’ గా మారిపోయింది. అలా మారడానికి ఒక కథానిక ప్రచారంలోవుంది..
            పూర్వం కుఢ్య దేశాన్ని కృపవర్మ రాజు పాలించేవాడు. అతడి ధర్మ పాలనలో ఏలోపమూ లేదు. కాని ప్రజల్లో అశాంతి.. తరచూ తగాదాలు. దీనికి కారణ మేమిటో రాజుకు బోధ పడేది కాదు. వారి తగాదాలు రాజ సభకు నవ్వు తెప్పించేది. ఇంత చిన్న చిన్న సమస్యలను ప్రజలు తమ జీవన్మరణ సమస్యగా  చిత్రీకరించు కోవటాన్ని మాన్పించటం ఎలాగా అని రాజు పాలనా యంత్రాంగం తో తరచూ సమాలోచించే వాడు.
            పొరుగు దేశంమైన పోలవరంలో కూడా ఇదే పరిస్థితి.. ప్రజల దృష్టిని మరల్చాలని ఆ దేశ రాజైన కుముదుడు కుట్రలు, కుయుక్తులు పన్నాడు.. ఫలించ లేదు. అతడి కన్ను కుఢ్య దేశంపై పడింది.. యుద్ధ వాతావరణంలో ప్రజలు సద్దుమణుగుతారని మంత్రి గారి ఆలోచన. అతడి సలహా మేరకు సేనను సమాయత్త పర్చుకొని దొంగ చాటుగా కుఢ్య దేశం వైపు తరలి రాసాగాడు.
            ఈ విషయం కృపవర్మకు వేగుల ద్వారా తెలుసింది. వెంటనే దేశ రక్షణ కోసం మంత్రి, సేనాధిపతి తదితర ముఖ్యులను సమావేశ పరిచాడు. యుద్ధం ఒక విపత్కర పరిస్థితి. ప్రాణ నష్టం.. ధన నష్టం.. పైగా దేశం సుస్థిరతకు తీరని భంగం. అనుకోని  యీ అవాంతరానికి కృపవర్మ మనసు మదనపడ సాగింది. యుద్ధం ఆపడమే మన దేశానికి శ్రేయస్కరమని అంతా సలహాలు యివ్వసాగారు.. ‘కాని ఎలా..? .. ఎలా..?’ అంటూ ఆలోచనలో మునిగాడు కృపవర్మ.
            యింతలో కుశలుడు అనే బాలుడు సభ ముందుకు  వచ్చాడు. ఎంతో కట్టుదిట్టమైన రహస్య సమాలోచన ప్రాంగణం లోనికి ఒక సాధారణ పసివాడు రావడం.. ఒక్క సారిగా అంతా దిగ్భ్రాంతి చెందారు. అపాయం లేని ఒక చిన్నపిల్ల వాడు కదా.. అని సరి పెట్టుకున్నారు.
            “సభకు నమస్కారం.. మహారాజుకు జే..! జే..!! లు..” అన్నాడు కుశలుడు. అంత చిన్న పిల్ల వాడు గొప్ప సంస్కారంతో మాట్లాడుతూ ప్రణామం చేయడంతో  మరింత ఆశ్చర్యచకితులయ్యారు.
            “మహా రాజా!.. నేను మీ సమావేశానికి అంతరాయం కల్గిస్తున్నందుకు నన్ను మన్నించండి.. నాకు అనుమతిస్తే నేను మన సమస్యకు దారి చూపగలను” అంటూ వినయపూర్వకంగా వేడుకున్నాడు.
            సభ ఫక్కున నవ్వింది.. మహారాజు మోములో నీ వల్ల ఏమవుతుంది అనే నిర్లక్ష్యపు నవ్వు మొలిచింది.
            కాని కుశలుడు  ధైర్యం చెడలేదు.
            “కావాలంటే నాతో బాటుగా మన సైన్యాన్ని తీసుకొని నావెంట రండి. కదనరంగాన్ని ఎలా స్నేహసేతువుగా మారుస్తానో చూద్దురు గాని” అంటూ గంభీర వచనాలు పలికాడు.
            కుశలుని  మాటలు కృపవర్మను కట్టి పడచేసాయి. వాతావరణమంతా కుశలునికి అనుకూలంగా మారిపోయింది.
            అది గమనించిన కుశలుడు తన మనసులోని మాటను బయట పెట్టాడు.
            “మహారాజా..! అయితే ఒక షరతు. మీరు గాని మీ మనుషులు గాని  వన్యమృగాలను వేటాడ వద్దు. పాపం అవి  ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతుకుతున్నాయి. జన బలం పెరుగుతున్నది. వనం, జలం తరిగి పోతున్నది. ‘పర్యావరణ పరిరక్షణ’ అనే మాట పరిహాసం కాబోతున్నది. వనంలో వాటి మానాన అవి బతుకుతుంటే మీరు వాటిని  వధించడం న్యాయమా?.. ” అంటూ ప్రశ్నింకాడు. కుశలుని ప్రశ్నలతో కృపవర్మ  కుదేలై పోయాడు. కుశలుని ప్రతీ మాటను సమర్థించాడు. అన్ని షరతులను ఒప్పుకున్నాడు.
            తన సైన్యాన్ని  తీసుకొని కుశలుని వెంట బయలు దేరడానికి ముహూర్తం నిర్ణయించబడింది.
***
            ఇరు దేశాల సేనలు ఎదురెదురుగా పోరుకు సన్నద్ధమై నిలిచి వున్నాయి. కుశలుడు కృపవర్మ రథంపై నిలిచి తన చేతిలోని రుమాలును గుండ్రంగా కాసేపు విసిరాడు. ఆతరువాత పరుగెత్తుకుంటూ వెళ్ళి కుముదుని రథంపై అలాగే విసిరాడు..
క్షణాల్లో భీభత్స వాతావరణమంతా అనిర్వచనీయమైన సుగంధ సుమాల పరిమళాలతో నిండి పోయింది. స్నేహ తరంగాలు తేలి ఆడాయి..
            కుముదుడు వచ్చి ఆప్యాయంగా కృపవర్మను ఆలింగనం చేసుకున్నాడు. సేనాధిపతులు యిరువురు స్నేహబంధీలై పోయారు. సైనికులు ఒకరికొకరు ఆత్మీయులైపోయారు.
            “మన మధ్య శతృత్వం ఊహించలేక పోతున్నాను.. నేను చాలా తప్పిదం చేసాను. నన్ను మన్నించండి మహారాజా” అంటూ కృపవర్మ చేతులు కలిపాడు కుముదుడు.
            “ఎంత మాట.. నేనూ తొందర పడ్డాను.. మనలో మనకు క్షమాపణ అనే మాట రాకూడదు కుముద రాజా..” అంటూ కృపవర్మ సాంత్వన వచనాలు పలికాడు.
            “ఈ పూట మా ఆథిధ్యాన్ని స్వీకరించండి’’ అని సాదరంగా తన రాజ్యానికి ఆహ్వానించాడు కృపవర్మ. కుముదుడు కాదనలేక పోయాడు.
             ‘కుశలుడు ఆ రోజు కూడా చేతి రుమాలుతో లోనికి రావడం.. అతడు రాగానే ప్రాంగణమంతా అపూర్వమైన  పరిమళాలతో నిండిపోవడం.. అతడి మాటలు శిరసావహించడం.. ’ జ్ఞప్తికి తెచ్చుకుంటూ చేతి రుమాలులో ఏదో మహత్తు వుంది.. అని మనసులోకి రాగానే కుశలుని  కోసం గాలింపు చర్యలకై ఆదేశించాడు కృపవర్మ.
               కాని కుశలుని జాడ కానరాలేదు. ఆ వనదేవత ధూత కాబోలు అనుకున్నారు రాజ భటులు.
***
            ఆమరునాడు రాజు యుద్ధ ప్రమాదం తప్పినందుకు అభినందన సభ.. ముఖ్య అతిధి అయిన కుముద రాజుకు వీడ్కోలు సమావేశం ఏర్పాడు చేసాడు కృపవర్మ.
            సభలో కృపవర్మ కుశలునడు  చేసిన సాయం గురించి వివరిస్తూ వుండగా కుశలుడు సభలో ప్రవేశించాడు...
            అతడిని చూడగానే రాజు ఆహ్వాన పూరిత కరతాళ ధ్వనులు చేసేడు. సభ సాంతం మర్యాద పూర్వకంగా లేచి నిలబడింది. తమ దేశాన్ని గొప్ప ఉపద్రవం నుండి కాపాడినందుకు కుశలునికి  జేజేలు పలికారు.
            కుశలుని కుముద రాజుకు పరిచయం చేసేడు మహామంత్రివర్యులు. నేటి ఆహ్లాద పూర్వక వతావరణానికి కారణమైన కుశలుని ప్రత్యేకంగా సన్మాన ఏర్పాట్లకై ఆదేశించాడు కృపవర్మ. రాజు తనపట్ల చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుకుంటూనే సున్నితంగా తిరస్కరించాడు  కుశలుడు.
            “మహారాజులు ఇరువురికి నా హృదయ పూర్వక నమస్సులు..” అంటూ నమస్కరించాడు.
             కుశలుని వినయవిధేయతలకు అంతా ముగ్ధులయ్యారు. రాజులిరువురు తమ ఆశీర్వాదాలు తెలిపారు.. సభనుద్ధేశించి ఏదో చెప్పాలనే కుశలుని మాటలకై  సభ నిశ్శబ్దమయ్యింది.
            “నేటి స్నేహపూర్వక వాతావరణానికి నా గొప్పదనమేమీ లేదు. మహత్యమంతా ఈ చేతి రుమాలులో వుంది..” అని కుశలుడు చెబుతుంటే కృపవర్మ తనఊహ సరియైనదే  అని మనసులో అనుకోసాగాడు. సభ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యింది.
            “అయితే ఇది కేవలం తాత్కాలికం..” అనగానే సభలో కాస్తా కల కలం..
            “ఇది వాస్తవం.. దీనిని నాకు ఒక మహాను భావుడు  ప్రసాదించాడు’’ అంటూ అసలు విషయం వివరించసాగాడు.
“ఒక రోజు నేను మా ఇంట్లో వారిపై  అలిగి అడవికి పారిపోయాను..
 ఒక మునిపుంగవుడు చెట్టు నీడలో విశ్రమించి వున్నాడు. అతడి తల క్రింద ఏదో ఒక పేటిక వుంది. అందులో నుండి మానసోల్లాసమైన పరిమళాలు వస్తున్నాయి. అంతటి అనుభూతి నేను ఎప్పుడూ పొందలేదు. నా కోపతాపాలు అన్నీ మర్చి పోయాను. అతడి కాళ్లకు ప్రణామం చేసాను..
విష సర్పాలు, వాటి బద్ధ శతృవులైన ముంగిసలు సైతం కలిసి మెలిసి నాట్యం చేయ సాగాయి. నాకు ఆశ్చర్యమేసింది. ఆ పేటికలోని పరిమళరహస్యం ప్రభావమేమో అనుకుంటూ.. వారి కాళ్ళు పట్టసాగాను. కాసేపటికి మునిపుంగవునికి  మెలకువ వచ్చింది.
లేచి చిరునవ్వు నవ్వాడు. నామనసులోని అనుమానాన్ని అర్థం చేసుకు న్నాడు..
ఎంతటి కౄరులైనా, క్రూర మృగాలైన ఔషధ మొక్కలతో చేసిన యీ అత్తరు పరిమళానికి దాసోహమవుతారని.. తన వద్ద వున్న  అత్తరు మహిమను వివరించాడు. అత్తరు సీసా మూత తీసి ఒక చుక్క తన చేతి రుమాలుపై వేసి  గాలిలో విసిరాడు. ఆ సువాసనలకు మన అరణ్యం పులకించి పోయింది. వసంత రుతువు ఆరంభమైనట్లు చెట్లు చిగురించాయి.. పుష్పించాయి. నేను వింతగా చూడసాగాను. తన చేతి రుమాలును, అత్తరు సీసాను నాకిచ్చాడు.  అయితే ఇది శాశ్వతం కాదని.. కాని ఇలాంటి వాతావరణాన్ని సృష్టించు కోవటం మానవుని చేతిలోనే.. చేతల్లోనే  వుందని దానిని గ్రహించకుండా మానవులు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని.. వాటి నుండి విముక్తి పొందే మార్గాన్ని.. నా కర్తవ్యభారాన్ని ప్రభోదించాడు.  తగిన సమయం అసన్నమైనదనదని నాకు మన
సభా ముఖ ద్వారాలు చూపించాడు.
 ఆ చేతి రుమాలుపై ఒక అత్తరు చుక్క వేసి గాలిలో విసిరాను కనుకనే వాతావరణంలో మార్పులు వచ్చి మనమంతా యిలా ఆత్మీయంగా మాట్లాడుకోగల్గుతున్నాం...
అయితే యిది శాశ్వతం కాదని ముందే మనవి చేసాను. ఇలాంటి వాతావరణాన్ని మనం నిర్మించుకోవాలి. లేదంటే  మన రెండు దేశాల ప్రజల అశాంతి ఇలాగే కొనసాగుతుంది. మళ్ళీ యుద్ధ వాతావరణం రాక తప్పదు. కనుక నేను ఈ సభాముఖంగా వేడుకునేదేమంటే ఆ మునిపుంగవుని  ఆదేశానుసారం మనం ముందుగా రెండు దేశాల మధ్య వున్న మురికి కాలువను శుభ్ర పర్చుకుందాం. మన వనాన్ని వన్య మృగాలను.. పరిసరాలను పరిరక్షించు కుందాం.. పూలమొక్కలు చెట్లు నాటుదాం.. అత్తరులాంటి సువాసనలు మన రెండు దేశాల మధ్య శాశ్వతంగా విరాజిల్లినప్పుడే మానవ మనుగడకు శాంతి లభిస్తుంది.. అంతా మన చేతుల్లోనే వుంది.. మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం..’’ అంటూ కుశలుడు సభకు మరొక్క సారి నమస్కరించాడు.
సభ యావత్తు నిలబడి కుశలునికి మద్దతు పలికింది. ‘బాల వాక్కు బ్రహ్మ వాక్కు’ అని శ్లాఘించారు...
కృపవర్మ, కుముద రాజులకు విషయం సాంతం అవగాహన అయ్యింది. తమ పరిపాలనలో అసలు లోపాన్ని  గుర్తించారు.
సభ యావత్తు ప్రతిజ్ఞ చేసింది..
కుఢ్య దేశంలో శాంతి సౌఖ్యాలు నేలకొన్నాయి.. కుశలుడు చేసిన సహాయం కుఢ్య దేశమే కాకుండా నలుమూలలా ప్రాకి పోయింది. అందరి నోటా కుశలుని  చాకచక్యం గురించి మాట్లాడుకోవటం.. కాలక్రమేణా కుఢ్య దేశం కాస్తా  ‘కుశలదేశం’ గా మారిపోయింది.
***

No comments:

Post a Comment

Pages