మనోధైర్యమే గెలుపు - అచ్చంగా తెలుగు

మనోధైర్యమే గెలుపు

Share This

మనోధైర్యమే  గెలుపు

ఆండ్ర లలిత 


జనవరి 19 2012 గురువారము తన జీవితము లో ఒక కొత్త మలుపు మరియు  భగవంతుడు  పునర్జన్మకు దారి చూపించిన రోజు. సీత మనసు ఖాళి దొరుకితే గతం లోకి వెళ్లి పోతుంది ఆ రోజు తప్పకుండా. బాధతో మటుకు కాదు,  ఏదో ఈ సమాజానికి చెయ్యాలనే తపనతో!!  ఆ రోజు పొద్దున్నే అందరిని సాగనంపాక  వార్తాపత్రిక  తిరగేస్తూ గతము లోకి జారుకుంది. మరి! ఆ రోజు కూడా, అందరు వెళ్లాక, చీర పైట సవరించు కొంటుంటే చెయ్యజారి  సీతకి  రొమ్ము దగ్గర  తగిలేటప్పడికి గడ్డలా అనిపించింది. మరొకసారి తడిమి తడిమి చూసుకుంది. ఇన్ని రోజులు నుంచి గమనించలేదు.  గమనించే సమయము కూడా ఎక్కడుంటుంది గృహిణులకి. ఎంతసేపు అందరిని ఆనందముగా , ఆహ్లాద పరచటములో సమయమై పోతుంది. అందరికి  కేటాయించే  సమయములో ఒక్క శాతము తనకి కేటాయించుకుని ఉంటే ఎంత బావుంటుందో! అని అనుకుంది తనలో తాను. కాన్సర్ అనే అనుమానము మదిని కదిల్చేసింది.  కన్నీళ్ళు  ప్రవహించసాగాయి. తన  ఆందోళన పంచుకునేందుకు ఆ భగవంతుడు తప్ప ఎవరు లేరు అని అనుకుని ఒక్క నమస్కారము చేసింది. పోని  వేడుకుందామంటే  నోటికి ఏ నామము రావటము లేదు. కాళ్లూ వణుకుతున్నాయి. కంగారు, భయము ఆవహించాయి . చెమట్లు పడుతున్నాయి. తనని తను సమర్థించుకుని  భగవంతుడి మీద భారము వేసి, ఒక్క నమస్కారము చేసింది.   అయ్యో ! అప్పుడే నా! సమయము అయిపోయిందా!  అయ్యో నా  భావనలు పంచుకోనే లేదు. కానీ! సరే! అంతా మిథ్య! అయినా ఈ ఆకస్మిత పిలుపేమిటీ అని భగవంతుడిని ప్రశ్నించింది.. “ఈ  తత్కాల్ రిజర్వేషన్ చేయించుకుని   రావాలంటావ్?  వైకుంఠానికి! అంత కంగారేమిటో  నీకు!” ఒక్క నిమిషము కుర్చీలో  చతికిలపడింది.   విధి ఆడే నాటకము ఏమిటో అర్థము కాలేదు. అంత వరుకు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న తన జీవితము లో ఈ కొత్త మలుపు ఏమిటో  సినిమా కాదు కదా, అనుకుంది. “పొరపాటుని  సినిమా డైరెక్టర్ వకాల్తా పుచ్చుకున్నావా? అని ప్రశ్నించింది ఆ పరమాత్ముని.” బంధాలు తెంచుకోవటము అంత సుళువు కాదు అనుకుంటూ సంప్రదింపులలో దిగింది భగవంతుడితో... “ఇంకా ఓ ఒడ్డున చేర్చలేదు..నా పిల్లాడిని. ఇప్పుడే రమ్మంటావేమిటి ?  ఎంత పెద్ద సమస్యైనా ఎదురు కుంటాను... ఇక్కడే ఉండి అని అంది. నువ్వు కాస్త ఈదించు అని వేడుకుంది.,” గబ గబా పిల్లాడికి బడి నుంచి వచ్చేటప్పటికి  ఆకలి  వేస్తుందని మినపరొట్టె  వేసి బల్ల మీద  పెట్టి, తయారై తాళము వేసుకుని పక్కింటిలో  తాళము చెవులు ఇచ్చి,హడావిడిగా నడుస్తూ, ఆటో అని పిలిచింది.  పిల్లాడి మీద బాగా బెంగ వచ్చింది. ఆ దేవుడి మీద కోపం. ఆటోలో  కూర్చొని  డైగ్నస్టిక్   సెంటర్కి వెళ్తూ రాజ్ తో మాట్లాడింది.  విషయమంతా చెప్పి, తొందరగా కచేరి నుంచి అక్కడికి  తిన్నగా వచ్చేయమంది. అక్కడ  ఒక  పరీక్ష తరువాత మరో పరీక్ష దాని తరువాత  సాయంత్రంకల్లా కాన్సర్ అని చాలా మటుకు  నిర్థారణ చేసారు. ఇద్దరికి కంటి నీరు తప్ప ఏమి  తోచలేదు. ఒక్క సారి ఆ దేవుడి పిలుపుకి  అయ్యో  ఈ జీవన ప్రయాణము  అప్పుడే ముగిసేనా  అని అనిపించింది ఇద్దరికి!  ఇంకా  గమ్యమూ  చేరలేదు, బంధాలు తెంచుకోలేదు. విధి ఆడే నాటకములో తోలు బొమ్మలము అనిపించింది. “మంచి  శస్త్ర చికిత్స తీసుకుందాము. మంచి ఆసుపత్రి లో. ఎంత ఖర్చు అయినా  పర్వాలేదు.  నీ ప్రాణము ముందు  ఏదీ ముఖ్యము కాదు.  వైద్యుడు  ఏమి  చెప్తే అది చేద్దాము.  మనకున్న  అనుమానాలన్నీ అడుగుదాము”  అని అంటూ రాజ్ సీతని దగ్గర తీసుకుని సముదాయించాడు. ఇంటికి  రాగానే  తలుపు తీస్తూ రోహిత్  “ఎక్కడికి  వెళ్ళారు!  ఇంత సేపా ! ఆకలేస్తోందమ్మా. డాక్టర్ ఏమి అన్నారు ” అని  అడిగాడు రోహిత్ ఆతృతగా. పిల్లాడితో ఏంచెప్పాలో తెలియక తడబడుతూ “కాన్సర్  అన్నారు” అన్నాడు రాజ్. రోహిత్ ఒక్కసారి ఆశ్చర్యపోయి అమ్మకేసి దిగాలు చూసాడు. రాజ్ ఏంచెయ్యాలో తోచక రోహిత్ ఏ విథంగాను దిగులు పడకూడదు అనుకుంటూ,        “ కంగారు పడ అక్కర్లేదు. మంచి  ట్రీట్‌మెంట్  ఇప్పిద్దాము. అంతా తొందరగానే బాగయిపోతుంది.  ఇప్పుడు నువ్వు  పిజ్జా ఆర్డర్  ఇచ్చేయి.  అందరము  తినేసి పడు కుందాము. రేపు మళ్ళీ  ఓన్కోలిజిస్ట్  దగ్గరికి వెళ్ళాలి.  అమ్మని  చూసుకోవాలి కాబట్టి  నీ అంతట నువ్వు చదువుకోవాలి  ఇంట్లో  ఎంత హడావిడి ఉన్నా. బంగారు తండ్రివి.” అన్నాడు రాజ్. అలాగే అని ఆర్డర్ చేసాడు రోహిత్. ముగ్గురూ ఒకరిని ఒకరు ఓదార్చాలనే తపనలో ఏంమాట్లాడాలో తెలియక తడబడుతూ, తొందరగా ఈ పరిస్తితి నుంచి ధైర్యంగా బయటపడాలి అన్న నిర్ణయానికి వచ్చారు. అరగంట ఇట్టే గడిచి పోయింది. బెల్ మ్రోగింది.  రోహిత్  పిజ్జా వచ్చింది అని  గట్టిగా అరిచాడు. అమ్మా ,నాన్నా రండి  వేడివేడిగా తిందాము   అని పేపర్ ప్లేట్లలో పెట్టి ఇద్దరికీ  ఇచ్చి  రోహిత్  కూడా తీసుకున్నాడు. సీత  రోహిత్ ని చూసి  రాజ్  తో  మెల్లిగా  “ ఏవండీ  , ఇంతవరకు  మన చాటునున్న బిడ్డ   ఎంత  బాగా  సమర్థించుకుని వస్తున్నాడు. ఆ భగవంతుడు మన పిల్లాడిని  చల్లగా  కాపాడాలి” అంటూ మొహం దాచుకుంది. కళ్ళు చెమర్చాయి. రాజ్  సీత చెయ్యి సున్నితముగా  వ్రాస్తూ “అంతా  బాగుంటుంది. నువ్వు  నీ కళ్ళతో అన్నీ చూస్తావు. ఇది ఒక చిన్న మలుపు. రోడ్ బాగాలేదు అంతే. మన జీవిత ప్రయాణములో ,ఈ గతుకుల రోడ్ తట్టుకుంటే, అదుగో ఆ ఎదురుగా ఉన్నది మంచి రోడ్. హాయిగా  సుఖముగా మన గమ్యము చేరుకోవచ్చు” అని చిరునవ్వుతో మాట్లాడాడు. అందరూ తిని పడుకున్నారు కాని సీత రాజ్‌కి నిద్ర రాలేదు. ఎలాగైతేనేం  ఒక్క కునుకు పట్టింది. ప్రోద్దున్నే  రోహిత్ ని బడి కి పంపి  ఆసుపత్రి కి వెళ్ళారు .  అది చాలా పెద్ద  పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రి.  అక్కడ  అన్ని  తెలుసుకుని  వైద్యము  మొదలు పెట్టారు. ఇలా కాలచక్రము గిరగిర  తిరిగి  చికిత్స మొదలైనది ఆసుపత్రిలో.  శస్త్ర చికిత్స అయ్యాక ఖీమో  మొదలైనది. డాక్టర్లు నర్సులు  వార్డ్ బాయ్స్ అందరూ చక్కగా మాట్లాడు తున్నారు.  డాక్టర్ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్  చెప్పి  ఇవ్వన్నీ  చిన్నచిన్నవి, దాటుకుని ఇలా!  వచ్చేయచ్చని  చెప్పారు. డాక్టర్ మాటలకి  దైర్యము తెచ్చుకుని  తన పిల్లాడు  , రాజ్ కోసముఏదైనా  చెయ్యాలని ముందడుగు వేసింది. కాళ్ళు లాగటము, జుట్టూడి పోవటము,  అన్నహితవు లేక పోవటము , కోపము, చిరాకు, ఆందోళన, నాకే ఎందకు రావాలి అన్న బాధ, ఇలా ఎన్నెనో. అవన్నీ రాజ్ చూపే,   ప్రేమ, ఆదరణ మరియు కుటుంబ మద్దత్తుతో ఎదుర్కుంది. మరి ఇలా 4 సంవత్సరాలు గడిచి పోయాయి.  డాక్టర్ చెప్పినట్టు అంతా అనుసరిస్తూ ఉంటుంది. వైద్యో నారాయణో హరి అనట్టు  ఈ రోజు తను బట్ట కట్టిందంటే   వైద్యరంగంలో పురోగతుల మూలంగా ఆని అనుకుంటుంది. ఈ ఫ్లాష్బేక్ ముగిసేలోపల  రాజ్  రోహిత్  ఇంటికి రావటము కూడా అయిపోయింది. “సీతా ఏమి ఆలోచిస్తున్నావు? “అన్నాడు రాజ్.  “ఆ.. ఏమి  లేదండి”అంది సీత. “మీరు మీ చెయ్య అందీయటము మూలంగా ఈ రోజు మీముందు  ఇలా నిలబడ్డాను”  అంది రాజ్ తొ. “ఓ ఇవాళ జనవరి 19, ఆ! చూచావా నీ మాటల ధోరణితో ఎలాచెప్పానో!” అన్నాడు రాజ్. “ఎంత మనోధైర్యమున్న నా శరీరము నాకు సహకరించేది కాదు.  అసహాయత   కోపము తెప్పించేది.  నన్ను  అర్థము చేసుకుని,   నేనున్నాను అని ధైర్యము ఇచ్చి,  మీ  ప్రేమ  ఆత్మీయతలతో   నన్ను మాములు  మనిషిని చేసారు.   ఇలా కష్ట సమయములో  దంపతులు  ఒకరినొకరు  దూషించుకోకుండా  అన్యోన్యంగా ఉంటే ఏదన్నా ఎదుర్కోవచ్చు.  ఎంత పెద్ద కాన్సరన్నా అవచ్చు . రోగికి మందులతోపాటు మనోధైర్యం చాలా ముఖ్యం అని తెలుసుకుని, అలా నన్ను చూసుకున్నారు కాబట్టి  కాన్సర్   నా  జీవితము లోంచి  భయపడి పారి పోయింది. ఏమంటారు?”  అంది సీత. “అవును మళ్లీ చస్తేరాదు.  నీ దగ్గరకు వస్తే నేను  ఊరుకుంటానా! అన్నాడు రాజ్. చక్కగా  నవ్వు కున్నారు. “రొమ్ము కాన్సర్ గురించి అందరిలో అవగాహన తెప్పించాలి. మన వంతు  ప్రయత్నము మనము చెయ్యాలి కదా” అన్నాడు రాజ్. అన్నట్టు పొద్దున్నే మన పక్కింటి పద్మ వచ్చి, కాన్సర్ అవగాహన శిబిరం వచ్చే 26వ తారీకు  ఏ.బి.సి ఆసుపత్రి లో నిర్వహిస్తున్నాము దానికి ఓ! నాలుగు వాక్యాలు కాన్సర్ అవగాహన గురించి వ్రాసి, కరపత్రము కోసము ఇయ్యమంటే  ఇలా ఇచ్చాను, అంటూ తను వ్రాసిన కాగితము చూపించింది సీత. “నువ్వే టూకీగా చెప్పు”  అన్నాడు రాజ్. “మనోనిగ్రహము, మనోస్థైర్యము, దృడనిశ్చయము, సకుటుంబీకుల  ప్రేమాదరణ,  దైవానుగ్రహంతో నేను ఈ రోజు మీ ముందు  ఉన్నాను.  ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన మరియు సాంకేతిక  పురోగతితో   వైద్యరంగము చాలా అభివృద్ది చెందింది. ప్రారంభదశలో కాన్సర్ గుర్తించి చికిత్స  పొంది సుఖముగా ఉండండి. చాలా మటుకు కాన్సర్లు  నయం  చేసి  జీవిత కాలము దీర్ఖాష్యు పొందవచ్చు. ఇప్పుడు రొమ్ము కాన్సర్  పది మందిలో ఒక్కరికి అన్నా వస్తోంది. దానికి  చాలా  కారణములు  ఉండచ్చు.కొన్ని కారణములు మనము సరి దిద్దుకోవచ్చు. ఆహార అలవాట్లు, ఒత్తిళ్లు, శారీరక వ్యాయామము, అలా ఎన్నో. అసలు,  మన మనసు మరియు శరీరము సంకేతాలు పంపుతూనే ఉంటాయి. సమయానుకూలంగా. అవి అర్థము చేసుకోవాలంతే. దానికి మన బిజీలైఫ్ ప్రక్క నుంచి ,కాస్త సమయము మనకి కేటాయించాలి. మరి మీరందరు చేస్తున్నారా! ఒక్క సారి ఆలోచించండి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని అనుకునేకన్నా, ముందడుగు మీరు వేస్తే,  వాళ్ళు తప్పకుండా  మీకు చెయ్యి అందిస్తారు. నాకు  సరైన అవగాహన లేక గురైయ్యాను. పద్మ గారు పెట్టే శిబిరంకు కదిలి రండి. అవగాహన పెంచుకోండి. ఏదైనా గురైయ్యాక తప్పకుండా  లేచి నుంచోవాలి, నుంచుంటాము. కాని ఒక్కసారి ఆలోచించండి.అసలు రాకుండా చూసుకోగల మేమో!  సర్వేజనా సుఖినో భవంతు. మీ సీత(Cancer survivor and promoter of cancer awareness program). “ “చాలా బావుంది సీత అని చప్పట్ల వర్షము కురిపించాడు రాజ్. “భయము సమస్యకి సమాధానము కాదు. ఎదుర్కుని  పరిష్కరించు కోవటము లోనే ఉంది, అసలైన కిటుకు. ఆనందముగా అన్యోన్యంగా ఉంటే  ఎంతటి సమస్యలైన ఎదుర్కోగలము సీత!” అని రాజ్ అన్న మాటలకి, సీత ఇలా నవ్వుతూ సమాధానము ఇచ్చింది “మనలాంటి కుటుంబాలలో మనము భయపడము! సమస్యలు భయముతో వణికి పోతాయి.” “ఇంక గతం గుర్తు చేసుకుని బాధ పడేకన్నామనము కాన్సర్  మీద  విజయము ఎలా  సాధించాము అన్న విషయము చర్చించుకుని, ఓ పది మందిని ఊబిలో నుంచి లాగటానికి ప్రయత్నిద్దాము సీత! వాళ్ళు తృప్తితో మనసారా  ఓ నవ్వు నవ్వితే, మనకి కలిగే ఆనందము చాలా బావుంటుంది కదా సీతా!”   అన్నాడు రాజ్. “కాన్సర్ మాట  అంటేనే వొళ్ళు జలదరిస్తుంది. జీవితము అంతమా ! అనిపిస్తుంది. బంధాలు తెంచు కోవటము అంత సులువు కాదు.కాని కొన్ని కొన్ని సార్లు ఎదురీదాలి. మనకి వైద్యులు చెప్పినట్టు మనము ఉన్న అంతస్థులో మంట రగులుకుంటే దూకితే కొన్ని దెబ్బలతో నన్నా బయట పడే అవకాశము ఉంటుంది. అక్కడే ఉంటే బూడిదౌతాము. వైద్యులు అన్నట్టు “choice is ours”. ముందడుగు వేసేటప్పుడు కుటుంబ సహకారము చాలా ముఖ్యము. జీవితము చాలా చిన్నది. అందరి చెయ్యి వేసి   నావను  కాపాడాలి. కాన్సర్ తో పోరాడండి, మళ్ళీ రాకుండా కాపాడుకోండి. ఆఖరి నిమిషము వరుకు పోరాడండి అని ధైర్యము చెప్పుదాము. కాన్సర్ అలసి పోయి పారిపోవాలి కాని  మీరు కాదు! కాన్సర్ పీడితుల్లారా నేను మీతో ఉన్నాను. ఆందోళన చెందద్దూ అని చప్పుతానండి” రేపు ఆసుపత్రి లో cancer patients workshop లో అంది సీత. “అవును కదా! మంచి ఆలోచన సీతా”అన్నాడు రాజ్. “రేపు నేను అనుభవముతో అందరికి  చెప్తాను” అంది సీత. “ప్రతీ క్షణము ,  మధురంగా అందముగా  తీర్చి దిద్దుకుని ,ఆనందముగా అనుభవించాలని. జీవితము ఒక నీటి బుడగ లాంటిది. ఆనందముగా గడపండి. కోప తాపాలుకి తావులేదు. మానవ జన్మ భగవంతుడు మనకిచ్చన  బహుమతి  ఈ చూడ ముచ్చటైన సృషిలో అని కూడా చెప్పు. ఏమంటావు  సీత!”అన్నాడు రాజ్ చిరునవ్వుతో.

No comments:

Post a Comment

Pages