(జ)వరాలి కధలు - 3
పాపం సుబ్బారావు
గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి (సోమసుధ)
" విహారి, శ్రీవల్లి పెళ్ళి చేసుకొన్నారట " మంచంపై మేను వాలుస్తూ చెప్పింది వరాలు. " ఏది? ఎదురింటి కొబ్బరి చెట్టూ , ప్రక్కింటి జామ చెట్లేనా? " చదివే పేపరు ప్రక్కన పడేస్తూ అడిగాను. " చెట్లసంగతి కాదు. నేను చెప్పేది. . ." " నేనడిగేది వాళ్ళ గురించే. . . ఆ చెట్లున్న లోగిలి వాళ్ళేనా అని? " " వాళ్ళ గురించేనండీ! వాళ్ళ గురించి నీచంగా మాట్లాడిన వాళ్ళంతా అక్షింతలేసి ఆశీర్వదించారట " " లోకం తీరే అంత " నిర్లిప్తంగా బదులిచ్చాను. " మీరెవరినైనా ప్రేమించారా? " అడిగిన వరాల్ని అదోలా చూశాను. " భయపడకండి. నేనేం అనుకోను. ఈ రోజుల్లో కాలేజీలో స్నేహితురాళ్ళు లేనివాళ్ళు చాలా తక్కువ. అందుకే అడిగాను" వరాలి మాటలకు గుండెలనిండా గాలి పీల్చుకొన్నాను. నా మనసంతా కాలేజీ రోజుల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో నా సరదా జీవితానికి ప్రేరణ ఏవర్మూర్తి ఎలియాస్ ఏ.వి.ఆర్. మూర్తి. " మాట్లాడరేంటండీ! గతాన్ని వింటే గంతులేస్తానని భయమా? భయపడకండి. నేను మిమ్మల్ని వదిలేసినా మావాళ్ళు నాకే పాఠం చెప్పి మిమ్మల్ని బ్రతిమాలి మీ యింట్లో వదిలేసి వెడతారు" " ఎవరో ఏదో అనుకొంటారని భయపడే రకాన్ని కాదు" పౌరుషంగా అని నా కధ మొదలెట్టాను.
****
కాలేజీలో జంటలను చూసి అసూయపడే వాణ్ణి. ఒకరోజు మూర్తిగాడి దగ్గర నా బాధ చెప్పుకొని దారి చూపించమన్నాను. " ముందు చొరవ నేర్చుకోవాలి. మంచి బట్టలేసుకొని, చిరునవ్వులు విసురుతూ, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ హిప్నటైజ్ చేయాలి " ఉచితసలహా పడేశాడు మూర్తి. వాడు చెప్పినట్లే చేస్తూంటే ఒకరోజు కేకలేశాడు. " ఏమిట్రా అది? హిప్నటైజ్ చేయమంటే మరీ దగ్గరకెళ్ళిపోయి భయపెట్టేస్తున్నావ్? వాళ్ళు పోలీస్ కంప్లయింట్ యిచ్చారంటే కటకటాలెనక్కి వెళ్ళిపోగలవ్ దూరంగా ఉండి, ఆ అమ్మాయికే తెలిసేలా సూటిగా కళ్ళల్లోకి చూసి నవ్వాలి. ముందు తిట్టుకొన్నా ఏదో రోజు వాళ్ళూ నవ్వుతారు. అలా జరక్కపోతే పళ్ళు రాలగొట్టు. నావి కాదు, కాలేజీలో రేగుచెట్టువి. అవి తింటూ వేరే ట్రిక్కు చెబుతా" అన్నాడు.
నెల్లాళ్ళ తరువాత - కాలేజీలో చాలామంది నన్ను చూసి నవ్వుతున్నారు. అది నా ప్రేమకు స్పందనంటావా?" హుషారుగా అడిగిన నన్ను వాడు ఎగాదిగా చూశాడు. " నేనేం చెప్పాను.? నీటుగా ముస్తాబవమన్నానా? ఏది ? కాలేజీలో జేరి కూడా పోలీసోళ్ళా నిక్కర్లేస్తే నవ్వరా?" వాడి ప్రశ్నల జాబితాకి తలతిరిగినట్లయింది. " అదికాదురా! క్రిందటేడు హైస్కూల్లో ఉన్నప్పుడు కుట్టించిన బట్టలివి. వేస్టయిపోవా? " "స్టీలుగిన్నెలకిచ్చేయి. వేస్టు కావు. చూడు. అమ్మాయిలు అల్లాటప్పాగాళ్ళకి పడరు. సంఘంలో నలుగురి దృష్టిని ఆకర్షించేవాడిని,అంతో యింతో ఆస్తిపాస్తులు ఉన్నవాణ్ణి నల్గురూ గొప్పగా చెప్పుకొనేవాళ్ళని ప్రేమిస్తారు. బూడిద రాసుకొనే శివుణ్ణి ఆరాధించే పార్వతీదేవుల కన్నా, సిరిగల శ్రీలక్ష్ములు పాలసంద్రంపై పట్టువస్త్రాలతో పవళించే విష్ణువునే యిష్టపడతారు. మనకు అందమైన భార్య ఉందని నలుగురూ అసూయపడాలని మనం కోరుకున్నట్లే, యీ సంఘంలో ఒక హోదాలో బ్రతకాలని వాళ్ళనుకోవటంలో తప్పులేదుగా! " మూర్తిగాడి భగవద్గీతకి బుర్ర తిరిగి నేరోకట్ కుట్టించుకొన్నాను.
కొన్నాళ్ళ తరువాత - " నువ్వు చాలా లేటు గురూ! అందుకే నీ అదృష్టం యిలా అఘోరించింది " మూర్తిగాడి మాటలకు కంగారుపడ్డాను. " ఏమైందిరా? " " నిన్నరాత్రే బెల్ బాటం అన్న ఫాషను మార్కెట్లో దిగిందట " వాడి మాటలకు నా గుండె జారిపోయింది. అయినా అమ్మాయి ప్రేమకు తప్పదుగా! ప్రతీ ఆరు నెలలకు మారుతున్న ఫాషనుతో పాటు కట్టుకొనే బట్టలను మారుస్తున్నాను. "బట్టలు సైజు చేయించటానికి డబ్బులు ఖర్చవటమే తప్ప ఏ సైజు అమ్మాయీ నాకు పడదేరా? " చిరా్గ్గా అడిగానొకరోజు. నా ప్రశ్నకు పగలబడి నవ్వాడు వాడు. " చాలామంది ఆశపడ్డారు. నీ ప్రక్కనుండి గమనించానుగా! చూసి పళ్ళికిలించటమే తప్ప ఏ అమ్మాయితోనైనా మనసు విప్పి మాట్లాడావా? నీనుంచి స్పందనలేక నువ్వొక బుద్ధావతారమని నిర్ధారించుకొని వాళ్ళు జారిపోయారు. స్త్రీకి అంతగా భద్రత లేని మన సంఘంలో ఏ ఆడపిల్లా సిగ్గువిడచి తన ప్రేమను బయటపెట్టదు. మనమే ముందు బయటపడాలి" " అయితే నన్ను ప్రేమించావా లేదా అని నేనే నిలదీయాలా?" "ఏడిశావ్! చొరవగా ఆమె దగ్గరకెళ్ళి మంచీచెడ్డా మాట్లాడావనుకో ! మా వాళ్ళని కలవండని చిన్న హింటిస్తుంది. అది చాలదా ఆ అమ్మాయి ప్రేమించిందనటానికి " " ముందేమన్నావ్? దూరం నుంచి నవ్వితే చాలు పడిపోతారన్నావ్? యిప్పుడిలా. . .ఈ సలహా ముందే ఎందుకేడవలేదు?" గట్టిగా అరిచాను. " కనిపించిన ప్రతీ అమ్మాయినీ చూసి పళ్ళికిలించేస్తూంటే ఏ అమ్మాయిని నువ్వు ప్రేమించావని సలహా యివ్వాలి? అసలు నీలో ఉన్నది ప్రేమ కాదు. ఆకర్షింపజేసుకోవాలనే తాపత్రయం. అంతేకాదు. కధల్లో మాదిరి పొరపాట్లు చేసే మనస్తత్వం కాదు నీది. అధవా చేసినా, ఆ అమ్మాయి తాలూకువాళ్ళు వచ్చి ' యివి చేతులు కాదు బాబూ ' అని చేతులట్టుకొంటే మర్నాడే చేతులకు చెప్పులు తొడిగి తలక్రిందులుగా నడిచే రకానివి. చూడు గురూ! కార్లున్న అమ్మాయిని ప్రేమించావనుకో! ఆ కారు కోసమే ప్రేమించావని జీవితాంతం సతాయిస్తుంది. అదే కలతలలో ఉన్న అమ్మాయిని కావాలనుకొన్నావనుకో! నీకు మనసే కాదు, తన ప్రాణాలివ్వటానికి కూడా సిద్ధపడుతుంది " అని ఆయాసపడుతూ ఆగాడు. " తను ఆత్మహత్య చేసుకొంటే నన్ను మూసేస్తారుగా! " కంగారుపడ్డాను. " కుళ్ళు జోకులేయకు. ప్రాణాలిస్తుందంటే గన్నేరుపప్పు తింటుందని కాదు, అంత విపరీతంగా నిన్ను అభిమానిస్తుందని" రాలగొట్టిన రేగుపళ్ళు తింటూ చెప్పాడతను. " మీకు ఏమి కావాలో, మాకు అర్ధం కాలేదే. .పిచ్చివాళ్ళయిపోయామే. . . .చికుబుకు చికుబుకు రైలే. . .!" దూరం నుంచి వినిపించే పాటకు మూర్తి నవ్వాడు. " ఎందుకు నవ్వుతావ్? " కోపంగా అడిగాను. " పాట విన్నావుగా! వాళ్ళకిష్టం వచ్చినట్లు ఆడలేను గనుకనే నేను ప్రేమ జోలికి పోలేదు. నువ్వు నాలాంటోడివే గనుక నాలాగే చేయి" ఉచిత సలహా పడేశాడు. " దుర్మార్గుడా! నీసలహా విని బట్టలకోసం డబ్బులు తగలేశా కదరా!" కోపంగా అన్నాను. " అమ్మాయి ప్రేమించకపోతే బట్టలేసుకోవా ఏంటి? చివరగా నేను చెప్పేదేంటంటే. . . బుద్ధిగా చదువు పూర్తి కానీ! చదువు అవగానే పెళ్ళి చేస్కో! అప్పుడా అమ్మాయి చచ్చినట్లు నిన్నే ప్రేమిస్తుంది" " చాల్లే బోడి సలహా" అని వాడితో కొన్నాళ్ళు మాట్లాడటం మానేశాను. @ @ @ @ " అప్పుడది బోడిసలహా అనిపించినా , నా జీవితంలోకి నువ్వొచ్చాక వాడు నిజమే చెప్పాడనిపించింది. ఎలా ఉంది నా ప్రేమకధ?" అన్నాను. " అబ్బే! నా ప్రేమకధముందు మీది మరీ చప్పగా ఉంది " వరాలి మాటలకు నా గుండె ఝల్లుమంది. ఏంటీ? తనకీ ఒక ప్రేమకధ ఉందా? అదెలాంటి కధ అవుతుందో? మొదటిరాత్రి బావ చెప్పాడంటూ పాలగ్లాసు బాంబు పేల్చింది. ఇప్పుడేం చెబుతుందో! " నా గుండె గుబగుబలాడింది. నా కంగారు గమనించకుండానే తాను గతంలోకి జారుకొంది. వరాలు కాలేజీలో చదివే రోజుల్లో సుబ్బారావు అనేవాడు యీమె వెంట మాత్రమే పడేవాట్ట. కొన్నాళ్ళు అతని అవస్థ గమనించి వరాలు చొరవగా అతనిని పలకరించింది.నాటినుంచి వారి ప్రేమ దినదినప్రవర్ధమానమైంది. అతనికి నలుగురు చెల్లెళ్ళున్నారు. వాళ్ళపై సుబ్బారావుకున్న అభిమానం, చిలిపితనం, వాళ్ళ జీవితాలపై అతనికున్న ఆశలు అన్నీ వరాలికి ఏకరువు పెట్టేవాడు. స్వార్ధం నిండిన యీ లోకంలో స్వంతచెల్లెళ్ళ భవిష్యత్తును ఆలోచించే అన్నయ్యలు కూడా ఉంటారా? అనిపించిందామెకు. ఆరునెలల తరువాత అతను చెప్పిన మాటకు వరాలు ఉలిక్కిపడింది. " నిన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు" అందామె. " నేను చూశాను. నువ్వు నన్ను ప్రేమించాల్సిందే! " గదమాయించాడు.సు్బ్బారావు . " ప్రేమించటం కాదు. ఒక చెల్లిగా ఆరాధించాను. నాకు అన్నయ్య లేడు. మనం కలిసినప్పుడల్లా నీ చెల్లెళ్ళ జీవితంపై నీకున్న ఆశలు, ఆశయాలు చెబుతూంటే , నా మనసులో " అన్న " అన్న భావమే స్థిరపడిపోయింది. ఇప్పుడు నా మనసు మార్చుకోవటం కష్టం" అందామె. " నా వాలకం చూస్తే అన్నగానే తప్ప మరోలా కనిపించదా?" అరిచినట్లుగా అడిగాడు. "ఏం? రేపట్నుంచి వేషం మారుస్తావా?" పరిహసించింది. దాంతో సుబ్బారావు పేట్రేగిపోయి నోటికొచ్చినట్లు తిట్టాడు. " అందరితో మాట్లాడినట్లు నాతో మాట్లాడానంటే నేనూరుకోను. నువ్వు నన్ను ప్రేమించాల్సిందే! " గద్దించాడు. " అధికారంతో, అహంకారంతో ప్రేమను పొందలేవు " వచ్చిన కోపాన్ని అణచుకొంటూ చెప్పిందామె. " నీ మనసు గోడ " గట్టిగా అరిచాడతను. " నా మనసే కాదు. ప్రతీ స్త్రీ హృదయమూ గోడే! ఎలాంటి భీభత్సవాతావరణంలోనైనా యీ గోడ స్థిరంగా ఉంటేనే, మీ యింటి కప్పులు కూలిపోకుండా నిలబడతాయి. అంతేకాదు , మా మనసు గోడనుంచి వచ్చే రెస్పాన్స్ మీరు బంతి విసిరే వేగాన్ని బట్టి మారుతుంది. మీరు బంతి విసరిన కోణంలోనే వెనక్కి వస్తుంది. మనం కలిసినప్పుడల్లా నువ్వు నీ చెల్లెళ్ళ విషయాలే చెప్పావ్! అందుకే నా మనసు ఆ భావన వైపే మళ్ళింది. అలాగాక నువ్వు నా మంచిచెడ్డల గురించి, మన భవిష్యత్తు గురించి మాట్లాడి ఉంటే నా భావన మరోలా ఉండేది. ఆ టెక్నిక్ తోటే మగాళ్ళు ఆడపిల్లలను పడేస్తూంటారు. నా అదృష్టం కొద్దీ నీకా టెక్నిక్ తెలీదు గనుక నేను బ్రతికిపోయాను. లేకుంటే ప్రేమనే ఉచ్చులో పడి జీవితాంతం నీ అహంకారానికి తలొంచి బానిసలా బ్రతకాల్సొచ్చేది. ఈ రోజు నుంచి మనిద్దరికీ రాం రాం " అని వెళ్ళిపోయింది. సుబ్బారావు తిట్లకు మనసు గాయపడ్డ వరాలు వారం రోజులు కాలేజీ మానేసింది. ఈ వారం రోజుల్లో సుబ్బారావు తనకోసం ఆరునెలలుగా పడ్డ పాట్లన్నీ నెమరువేసుకొని మనసు మార్చుకోవాలనుకొంది. ఆ నిర్ణయంతో కాలేజీలో కడుగుపెట్టిన ఆమె సుబ్బారావు తనపై ప్రచారం చేసిన కధలన్నీ వింది. బరితెగించి తనపై పచ్చి బూతులు ప్రచారం చేసిన అతనిపై కాలేజీలో కంప్లయింటు యిద్దామనుకొంది. కానీ అతని భవిష్యత్తు పాడు చేస్తే అతనిపై ఆధారపడ్డ సుబ్బారావు నలుగురి చెల్లెళ్ళ జీవితాలు రోడ్డున పడొచ్చు. అందుకే తను కాలేజీ మానేసి , ప్రయివేటుగా తన డిగ్రీ పూర్తి చేసుకొంది. ఆ వారం రోజులు సుబ్బారావు ఓపిక పట్టి ఉంటే జీవితాంతం వరాలు అతని అహంకారానికి బానిసగా బ్రతకాల్సి వచ్చేది. అతని తొందరపాటువల్ల , యీనాడు ఆ కధను నెమరువేసుకొని హాయిగా నవ్వుకొంటోంది. తన కధ చెప్పేసి వరాలు హాయిగా నిద్రపోయింది. కధ విన్న నాకు మాత్రం అంపరమెత్తిపోతోంది. సుబ్బారావుతో ఆరు నెలల పరిచయంలో యీ కాలం అమ్మాయిల్లా ఆమె చిన్న తప్పు కూడా చేయకుండా ఉందా? చిన్నతనం నుంచి మగాడు వెలగబెట్టిన రాచలీలలన్నీ వీరోచితకార్యాలుగా పదిమందికీ గొప్పగా చెప్పుకొన్నా అతనికేమీ కాదు. కానీ ఆడపిల్ల తన చిన్నతనంలో ఒక మగాడిపై మానసికంగా యిష్టపడితే, అదేదో పెద్ద ఘోరం జరిగినట్లు గొడవ చేస్తారు. మనసులో రేగిన తీరని శంకతో రగిలిపోతూ గదిలో పచార్లు చేస్తున్నాను. " ఏమిటలా ఉన్నారు? కవిత్వమేమన్నా తన్నుకొస్తోందా? " నిద్ర లేచిన వరాలు నిద్రపోని నన్ను చూసి అడిగింది. " అబ్బే! ఏమీ లేదు " ముఖాన్ని అరచేతులతో రుద్దుకొంటూ బదులిచ్చాను. బల్లపై జగ్గులోని నీళ్ళు తాగి వరాలు తిరిగి మంచమెక్కింది. " సుబ్బారావుని అన్నయ్యగానే భావించావా? " అప్రయత్నంగానే అడిగేశాను. దిండుపై తలవాల్చబోయిన ఆమె చివాలున తలెత్తింది. బయట మేఘగర్జన వినిపించింది. " అంటే నా ఉద్దేశం . . ." నా మాటలు పూర్తి కాకుండానే ఆమె మంచంపై దిండును నేలపైకి విసరికొట్టింది. వేగంగా దిండు వద్దకెళ్ళి కూలబడింది. బయట కుంభవృష్టి మొదలైంది. అటు తిరిగి పడుకొని భుజాలెగరేస్తున్న ఆమె పరిస్థితి గ్రహించాను. దాపరికం లేకుండా తన ప్రేమకధను చెప్పిన ఆమె మనసు గాయపరిచాను. " మాయలేడని తెలిసినా, భార్య జీవితంలో ఆశపడి అడిగినదొక్కటే కోరిక అని .తీర్చటానికెళ్ళాడు రాముడు. ఆ తరువాత సీతని రావణుడెత్తుకెళ్ళాడని తెలిసి బాధపడుతూ పర్ణశాలలో కూర్చోలేదే! తనకున్న ఒకేఒక్క తోడు లక్ష్మణుణ్ణి వెంటపెట్టుకొని సీతాన్వేషణకు వెళ్ళాడు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని కొండను ఢీకొన్నాడు. తనకోసం అంత ప్రయాస పడిన భర్త ఆ కాలపు ఆచారం ప్రకారం అగ్నిపరీక్షను అడిగితే సంతోషంగా ఒప్పుకొంది సీత. రాముడు మాయలేడికోసం పరుగు తీసినా, సీత అగ్నిపరీక్షకు సిద్ధపడ్డా అది భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగానికి పరాకాష్ట మాత్రమే! రాముడు అగ్నిపరీక్ష పెట్టింది తనకోసం కాదు, లోకం కోసం. సీతకి ఏమీ కాదని ఆయనకు తెలుసు. అందులో మీరు గమనించని విషయమొకటుంది. ఒక ఏడాది దూరంగా ఉన్నవారు కనుక భావిలో ఏ ధర్మసంకటం రాకుండా సుగ్రీవాదుల ఎదురుగా అగ్నిసాక్షిగా సీతారాములు మరొకసారి పెళ్ళి చేసుకొన్నారు." హృదయంలో మూర్తిగాడు ఉరుములా ఉరిమాడు. నా తెలివితక్కువకు తిట్టుకొంటూ వరాల్ని సముదాయించటానికి పూనుకొన్నాను. చివరికి అలిసిపోయి ఆమె ప్రక్కనే చల్లటి గచ్చుపై వాలిపోయాను. కొద్దిసేపటికి గచ్చులో చల్లదనం వల్ల శరీరంలో వణుకు మొదలైంది. "గచ్చు మీద పడుకొన్నారేంటి? రేప్పొద్దున్న మీకు రోగం వస్తే నేను చావాలి. వెళ్ళి మంచంపై పడుకోండి" వరాలి చిరాకులోనే చిన్న అభిమానం తొంగిచూసింది. నేను కదల్లేదు. " మొండి. చెబితే వినరుగా! " అంటూ వరాలు లేచి మంచంపై దుప్పటి తెచ్చి నాపై కప్పింది. తిరిగి వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకొన్నాను. గాయపడ్డ మనసుకి నవనీతం లాంటి సాంత్వనం. మబ్బులు తొలగి లోకం పైకి మెల్లిగా వెన్నెల జారింది. " ఇప్పుడు చెప్పండి . నా మనసు గోడేనంటారా? " నా చెదరిన ముంగురులను సవరిస్తూ అడిగిందామె. " ఖచ్చితంగా గోడే! నా మనసేమో పేడ. బలంగా చరవగానే పిడకలా యీ గోడకి అతుక్కుపోయింది." అన్నాను. " ఛీ ! ఏంటా వెధవ ఉపమానాలు? సినిమాపాటలువ్రాసేవాళ్ళలా కంపరమెత్తించేశారు బాబూ! " అంటూ నన్ను విడిపించుకొని, కన్నీళ్ళతో తడిసిన దిండుతో మంచమెక్కింది. " రవ్వంత పసుపు, కాసంత కుంకుమకు మగవారిని నమ్మటం, మనిషి చేయటం, మనసు నిదుర లేపటం , మమత నింపటం , యిదే పనా మీకు ? యిందుకే పుడతారా? " అన్న గీతం గుర్తుకొచ్చి వరాలు వైపు చూశాను.తన నిర్మలమైన మోములో అనిర్వచనీయమైన మమకారాన్ని నింపుకొన్న యీ రత్నాన్ని, ఆవేశంతో చేజార్చుకొన్న సుబ్బారావుపై జాలి వేసింది. " ప్చ్. . .పాపం సుబ్బారావ్!" అని జాలి పడుతూ వరాలి ప్రక్కనే మంచంపై వాలాను.
@ @ @ @ @
No comments:
Post a Comment