పిల్లలకి కావలసినది
ఓలేటి శశికళ
“ శామ్! నీ కీరోజు ఆఫ్ తీసుకోవడం అవుతుందా?. విక్కీ కి బాగా దగ్గు, రొంప. టెంపరేచర్ కూడా ఉంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి. అప్పుడే వారం నుంచీ పట్టుకుని ఒదలట్లేదు. ఈ రోజు నాకు క్లయింట్ కాల్ ఉంది. అర్ధరాత్రి అయిపోవచ్చు”,………చెప్పుకు పోతోంది “వైబ్”అనబడే విభవ.”శాం” అనబడే సందీప్ తో. చిర్రెత్తుకొచ్చింది సందీప్ కి.రాత్రి మూడయింది ఒచ్చేసరికి. మళ్ళీ నాలుగింటికి పోవాలి. పీడియాడ్రీషియన్ పొద్దున్న పదకొండు లోగా ఉంటాడు. చచ్చినట్టు లేచి తీసుకెళ్ళాలి,. ఈ మహారాణీ మాత్రం ఆర్డరేసి పోతుంది. ఏమన్నాగట్టిగా మాట్లాడామా, గంట స్పీచ్ ఇచ్చిఉద్యోగం మానేస్తానని బ్లాక్ మెయిల్. “ అమ్మో! ఇద్దరు సంపాదించక పోతే ఈ లక్జరీ ఫ్లాటు, కార్లు, వీకెండ్ పార్టీలు, ఇద్దరు పిల్లల ఇంటర్ నేషనల్ స్కూలు ఫీజులు……దెబ్బకి మత్తు ఒదిలిపోయింది. విభవకి చెప్పడం మాత్రమే తెలుసు. జవాబుతో పనిలేదు. డైనింగ్ టేబుల్ మీద పనుల చిట్టా పెట్టేసి అప్పటికే జారుకుంది చిన్నాడిని పట్టుకుని. గబగబా బాత్రూం లోకి దూరి, ఐదు నిమిషాల్లో తయారయి బయట కొచ్చాడు. పాపం విక్కీ సోఫాలో ముడుచుకుని పడుకుని దగ్గుతున్నాడు. దగ్గరకెళ్ళి చూసాడు . పెనంలా కాలిపోతోంది. వీడికి ఏమయినా పడదామని వంటింట్లోకి వెళ్ళాడు. తళతళ మెరిసిపోతూ స్టవ్వు,గట్టు. “ హు! ఏ రోజయినా వంట మొహం చూస్తే కదా ఈ పొయ్యి. ఫ్రిజ్ తెరిచాడు. పాల కేన్లో అడుక్కు ఉన్నాయి పాలు. అవే ఓ మగ్ లో పోసి, మైక్రో వేవ్లో వేడి చేసి, కాస్త బోర్నవిటా కలిపి ఇచ్చాడు. “ డాడీ! బాలేదు. పుల్లగా ఉంది.ఏక్.” “ వెధవ వేషాలెయ్యకుండా తాగు “ అని గదిమి బలవంతంగా పోసాడు. అంతే విక్కీ భళ్ళున వాంతి చేసుకున్నాడు. రక్షించి పనమ్మాయి రావడంతో శుభ్రం చెయ్యమని చెప్పి, పాల కేసి చూసాడు. బిళ్ళల్లా విరిగి పోయి,.ఉన్నాయి. సడన్గా గుర్తొచ్చింది. నెల క్రితం తెచ్చిన కేన్లు. పవర్ కట్లకి ఫ్రిట్జులు పనిచెయ్యవు. “ పాపం ఆడీ గాడు ఏం తాగేడో.” “ఛీ! ఏం జీవితం. మంచి తిండికి నోచుకోని జీవితమయిపోయింది.”……ఆలోచిస్తూ టేబిల్ మీద నోట్ తీసాడు. “ “పని పిల్లతో పని చేయించు. రత్నదీప్ కెళ్ళి మొత్తం ప్రోవిజన్, గ్రోసరీ, పాంట్రీ తే. విక్కీని డాక్టరుకు చూపించి మందులు వెయ్యి. వాటర్ కేన్లు తీసుకోమని వాచ్మేన్ కి చెప్పు. పాలు లేవు. నువ్వు గ్రీన్ టీ తాగేయి. దారిలో విక్కీకి బ్రేక్ ఫాస్టు కొను డామినోస్ లో. ఒచ్చేప్పుడు కర్రీ పాయింట్లో రెండు పూటలకీ కూరలు, పప్పు, సాంబారు పేకట్లు తెచ్చేయి. లక్ష్మిని కుకర్ పెట్టేయమను,”……ఇంకా ఉన్నాయి. చదివే ఓపిక లేక జేబులో కుక్కుకుని, బెడ్రూం తాళం వేసి, పనిపిల్లకి పనిచేసుకుని వెళ్ళిపోమని చెప్పీ విక్కీని తీసుకుని బయట పడ్డాడు. దారిలో రెస్టారెంట్లో ఇడ్లీ తినిపించి, తను కూడా దోశ తిని, కాఫీ తాగి , క్లినిక్ చేరుకున్నాడు. అక్కడ.అప్పటికే చాంతాడంత క్యూ. అందరూ వాచీలు చూసుకుంటూ అసహనంగా. నిజమే అందరికీ బాధ్యతలే. పిల్లలు తినేసి, ఆడేసుకుని పెరిగి పోతే సమస్య లేదు. ఇదిగో ఇలా రోగాలు తెచ్చుకుంటేనే కష్టం అందరికీ. మొత్తానికి వీళ్ళ ఒంతు ఒచ్చింది. డాక్టరు ముందు టెస్టులన్నాడు. సందీప్ సమయం వెచ్చించలేము. ముందు మందులు రాసేయమన్నాడు. ఒకింత కోపంగా బరబరా మందులు గీకేసి, వైరల్ అని తేల్చీ, నానా గడ్డీ పెట్టచ్చని భరోసా ఇచ్చి, ఐదొందలు ఫీసు, వెయ్యి రాపాయల మందులు కొనిపించి పంపాడు. వాడికి కారు లోనే మందులేసి, పడుకోమని చెప్పి, ఏ. సీ వేసి సామాన్లు కొనడానికి దిగాడు. ఒస్తూ కర్రీ పాయింట్లో నూనెలో తేలుతున్న వంకాయల కూర, ఆకు పచ్చ రంగేసి ఒరుగుల్లా వేయించిన ఆకాకర వేపుడు, ముక్కలు లేని సాంబారు, ఒక పాలకూర పప్పు కొనుక్కుని ఇంటి కొచ్చిపడ్డాడు. పాలకేనులు, పళ్ళరసం సీసాలు, రకరకాల సీరియల్ డబ్బాలు, బ్రెడ్లు, జాములు, సాసులు, నూడిల్సు, బిస్కట్లు.……అన్నీ ఫ్రిజ్లో సద్దేసరికి ఒంటి గంట. గబగబా పొట్లాలు ఇప్పేసరికి గుప్పున వాసన. పప్పూ, సాంబారు ఏ ముందు రోజు చేసారో , పాచి పోయాయి. వంకాయ కూర నూనె మయం. విక్కీకి ఒక ముద్ద పెట్టగానే దగ్గు తెర కమ్మేసింది. వెంటనే పెరుగు కప్పు తెరిచి పెరుగన్నం పెట్టి , తను ఏదో కెలికి లేచి పోయి, ఒక అరటి పండు తిని పడుకున్నాడు. ఏమి తిళ్ళు ఇవి?.ఒక్కటి తాజా కాదు. పోలిష్ చేసిన బియ్యం, రెడీమేడ్ రోటీలు, ప్రిసర్వేటివ్ లు కలిపిన పళ్ళరసాలు, బయట శుభ్రం లేని కూరలు, ఎరువుల కూరగాయలు, హైబ్రిడ్ పళ్ళు, వాటికి వాడే రసాయనాలు, ప్లాస్టిక్ సీసాల్లో కొనుక్కునే నీరు……ఇంక పిల్లలకి ఆరోగ్యం ఎలా ఒస్తుంది? తన చిన్నప్పుడు అమ్మ పెట్టిన సహజ మైన రుచుల్లో, బలవర్ధకమయిన ఆహారం తినబట్టే కదా తను ఈనాటికీ జిర్రున చీది ఎరుగడు. మరేంటి విక్కీ, ఆది , ఒకడి తరవాత ఒకడు ఎప్పుడూ ఏదో కంప్లయింటే. ఎందుకో అమ్మ గుర్తొచ్చి ఏడుపొచ్చింది. భార్యనేమీ అనలేక పోతున్నాడు. ఆమె శక్తి అంతే. రెండు పడవల ప్రయాణం చెయ్యలేదు. ఏమన్నాఅంటే హాస్టల్ అంటుంది. చిన్నపిల్లలు. హాస్టళ్ళలో పడేయడానికి కనలేదు కదా.…… నిట్టూర్చాడు. రాత్రి పిల్లలిద్దరికి సీరియల్, మిల్కు పెట్టి, వర్కు చేయించి పడుకో పెట్టాడు. తను ఇంటి నుంచే పనిచేస్తానని చెప్పడంతో పనిలో పడి ఎప్పుడికో నిద్రపోయాడు. తెల్లారి మెలుకువొచ్చి , పిల్లల గదిలోకి వెళ్ళాడు. విక్కీని కావలించుకుని పడుకునుంది విభవ. పాపం ఎప్పుడొచ్చిందో ఏమో. మరనాడు శనివారం కావడంతో ఇంటిల్లిపాదీ పదకొండింటికి లేచారు. ఎలాగూ లంచ్ కి హోటల్ కి వెళ్ళిపోయి, అక్కడో మూడు,నాలుగు వేలు తగలెట్టుకు రావాలి కనుక పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ ఉండదు. కాఫీకప్పు పట్టుకుని పక్కకొచ్చి కూర్చుంది విభవ.” ఏదో టెండరుంది” అనుకున్నాడు సందీప్. “ శామ్”! నేను వచ్చే వారం స్వీడన్ వెళ్ళాలి. ఆరు నెలల ప్రాజెక్ట్. క్లయంట్ ఖచ్చితంగా చెప్పాడు టీం అక్కడకు రావాలని. టీం లీడ్ గా నాకు తప్పదు. ఏం చెయ్యాలో తెలీడం లేదు. నీకు ఒచ్చే నెల యూ.ఎస్ అసైన్మెంటు ఉంది. పిల్లలు ఎక్కడ ఉంటారు?. అప్పటికీ మా అమ్మనడిగా. అవ్వదని చెప్పేసింది. అయినా అన్నయ్య పిల్లలు రాక్షసులు. వీళ్ళను బతక నివ్వరు.క్రితం సారి పాపం అత్తయ్యగారు చూసుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళ స్కూళ్ళు. ఏం చేద్దాం?”…………… “ఏం చేస్తాం? తప్పదా నీకు? హాస్టల్ ఒద్దు. బెంగ పెట్టుకుంటారు.”……విభవను తను ఆపలేడు. ఒక పెద్ద స్థాయిలో ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తుంటే , అక్కడ మగవాళ్ళలాగే పనిచేసి తీరాలి. కానీ పిల్లలు……?.విభవ మెల్లగా నసుగుతూ అంది” పోనీ మీ సుశీలక్క?”. “సుశీలక్క వాళ్ళు, ఇల్లు అద్దె కిచ్చి ఫారం హౌస్ లో ఉంటున్నారుగా”.అన్నాడు సందీప్. “అందుకే చెప్తున్నా. పిల్లల స్కూల్ అక్కడికి దగ్గర. పైగా మన పాత డ్రైవరు ఇల్లు అక్కడే. పిల్లలిని దింపి, తేవడానికి పెడదాం. అడిగి చూద్దాం. ఆమెకి పిల్లలంటే పిచ్చి కూడా.””ఓ మై గాడ్! అప్పుడే ఎన్ని ఆలోచనలు చేసేసింది?.ఆ చురుకు తనమే ఆమెను అంత పెద్ద కంపెనీలో అనతి కాలంలో అందలమెక్కించింది. “ ఎలా అడుగుతాం వైబ్?.ఒక్కసారి కూడా తనని మనం పిలవ లేదు. పైగా తను మా పెద్దమ్మ కూతురు. బావగారేమనుకుంటారో?”.……” కమాన్ శాం! మనకంత చాయిస్ లేదు. రేపు వెళ్ళి కలుద్దాం. అడుగుదాం. కాదంటే ఇంక హాస్టలే,. ఈ కంట్రీలో కనక ఇన్ని సూకరాలు పిల్లలికి. యూ.ఎస్ లో చూడు. ఒక్కోళ్ళు నలుగురైదుగుర్ని కని పెంచుతారు. పిల్లలే బతుకు తెరువు నేర్చుకుంటారు.”……సరే ఇంక విభవ దట్సాల్ అందంటే అదే ఫైనల్. కాంటాక్టుల్లో బావగారి నంబరు డయల్ చేసి, రేపు సరదాగా ఒద్దామనుకుంటున్నామని చెప్పా. అక్క ఫోనందుకుని , భోజనానికి రావాలని మరీ మరీ చెప్పింది. అక్క చేతి వంట తలుచుకోగానే జఠర రసం ఊరింది..మామూలుగా హోటల్కిబఫే లంచ్ కి వెళ్ళి, గడ్డి తిని ఇంటికొచ్చారు.అదే నాన్ రోటీ, నూడిల్స్, పన్నీర్ కూరలు, ఫ్రైడ్ రైసు.విసుకొచ్చేసింది. ఆ మర్నాడు ఆదివారం అయినా, అలవాటుకు భిన్నంగా ఏడు గంటలకే లేచి, అందరూ తయారయ్యి, కారులో బయలు దేరారు. సుశీల భర్త శ్రీధర్ ముఫ్ఫై ఏళ్ళక్రితమే చాలా ముందుచూపుతో హైదరాబాదు శివార్లలో ఐదెకరాల భూమి కొన్నాడు. ఆ చుట్టు పక్కల ఇంజినీరింగ్ కాలేజేలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు ఒచ్చి భూముల ధరలు పెరిగినా అమ్మకుండా, దాన్ని చక్కటి ఫాం హౌజ్ గా మార్చి, రిటయిర్ అవ్వగానే అక్కడకి మారిపోయి, ప్రశాంత జీవనం గడుపుతున్నారు. వారిద్దరి పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. సుశీల సందీప్ పెద్దమ్మ కూతురు. కానీ సొంత అక్క కన్నా ఎక్కువగా ఆదరిస్తుంది. విభవకెందుకో సుశీల నచ్చదు. ఖచ్చితంగా మాట్లాడుతుందని. వీళ్ళు అక్కడికి వెళ్ళే దారంతా పచ్చటి పండ్ల తోటలు, అరటి తోటలు, పరుచుకుని కనుల పండువగా ఉంది. దారిలో పిల్లలు జాంపళ్ళు కొనమని మారాం చేస్తుంటే, ట్రాష్ అని తిట్టి, రియల్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చింది. పిల్లలు వెగటుగా మొహం పెట్టి బయట విసిరేసారు. చల్లగాలి మొహానికి కొడుతుంటే, సందీప్ ఏ.సీ ఆపేసాడు. డస్ట్ లోపలికొస్తుందని కసిరి విండోలు ఎత్తేసింది. మొత్తానికి ఒక గంటన్నర ప్రయాణం తరవాత సుశీల వాళ్ళ ఫాం హౌస్ చేరారు. ఎంత అందంగా తీర్చిదిద్దారో. బాట కిరు వైపులా పహారా వీరుల్లా కొబ్బరి చెట్లు, వాటి అంచులంట బంతి, చేమంతి, గులాబీ, గన్నేరు పూల మొక్కలు విరగ పూసేసి ఉన్నాయి. అటూ, ఇటూ పొట్టిగా, చెట్టంతా కాపుతో జామి, బొబ్బాస, బత్తాయి, మామిడి, సీతాఫలం, ఇంకా ఏవేవో చెట్లు సుశిక్షితులయిన సైనికుల్లా గొప్పులతో, గట్లతో ఠీవిగా నిలబడి ఉన్నాయి. దూరంగా ద్రాక్ష పందిళ్ళు, కూర గాయల మళ్ళు కనిపిస్తున్నాయి. ఆవులు, గేదెల సవ్వడి కూడా దూరం నుంచి ఒస్తోంది. కారు లోపలికి వెళ్ళి ఒక అందమయిన పొదరిల్లు లాంటి ఇంటి ముందు ఆగింది. ఇంటి ముందు పేడతో అలికి, వెన్నెల పందిరేసినట్టు తెల్లని ముగ్గు, సువాసనలు వెదజల్లుతూ మల్లె, జాజి, మాధవీ లతలు పోర్టకో అంతా పాకి. గూట్లో దీపం వెలుగుతూ మందారాలంకృత మయిన తులసి కోట. చూడగానే ఏదో వేరే ప్రపంచానికొచ్చినట్లు, ప్రశాంతంగా, సేదతీరినట్టు ఉంది వాళ్ళకి. పిల్లలు పుట్టి బుద్దెరిగి ఇలాంటి సస్యశ్యామల మయిన పరిసరాలు చూడలేదు. సెలవలకి గోవా, బాంకాక్ తీసుకెళ్ళారు తప్ప, ఏనాడూ పుట్టి పెరిగిన ఊళ్ళు చూపించి ఎరుగరు ఇద్దరూ. సుశీలా, శ్రీధర్లు చాలా ఆప్యాయంగా ఆహ్వానించారు. ఇంట్లోంచి మంచి ఏపుగా, వర్ఛస్సుతో ఉన్న ఇద్దరు మగ పిల్లలు కూడా బయటకు వచ్చారు. వాళ్ళ కొడుకు పిల్లలని, ఇక్కడ చదువుకి పంపేరని చెప్పేరు. చిత్రంగా వాళ్ళు కూడా విక్కీ, ఆడీ స్కూలే అని తెలిసి వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. కొంచెం పెద్ద పిల్లలు. వినయంగా నమస్కారం చేసి,స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నారు. ఆడీని ఆదిత్య అని విక్కీని వికాస్ అని చక్కగా నోరార పిలుస్తున్నారు. వేడి వేడి ఇడ్లీ, వడ, సాంబార్ , రకరకాల పొళ్ళు, పచ్చళ్ళతో టిఫిన్లు అమర్చింది. విభవ “ ఒద్దొదిన. పిల్లలికి ఇవి అరగవు. వాళ్ళకి సీరియల్ పెట్టి తెచ్చానంది”. ఈ లోపునే పిల్లలు నలుగురూ టేబుల్ దగ్గర చేరి లాగించేస్తున్నారు.” కారం. మీరు తినలేరు. కడుపు మండుతుంది”,అని కసిరింది. “ నో మమ్మీ! ఇంత యమ్మీ ఇడ్లి, వడ నేనెప్పుడూ తినలేదు. నాట్ ఎటాల్ హాట్” అంటూ తల్లి కేసి చూడకుండా తినసాగేరు. సందీప్ పిల్లలు అలా రుచి, శుచిగా తినడం చూసి కళ్ళనీళ్ళు తిరిగాయి. కాసేపు బెట్టు చేసి విభవ కూడా శుభ్రంగా లాగించేసింది. మెల్లగా కాసేపు మాటలయ్యాక ఇద్దరూ ఒచ్చిన పని బయట పెట్టారు. సుశీలా , శ్రీధర్ “ మా కేమీ అభ్యంతరం లేదు. సాయానికి మనుషులున్నారు. కానీ చిన్న పిల్లలు బెంగ పెట్టుకున్నా, ఏ జ్వరాలు తెచ్చుకున్నా, అంత దూరం పరిగెట్టడం కష్టం. మీ రాలోచించుకోండి. పరవాలేదనుకుంటే సరే.”……అన్నారు. వెంటనే విభవ “ఖర్చు ఆలోచించద్దు. మొత్తం అంతకీ మీకు చెక్ రాసిచ్చేస్తాను” అంది. వాళ్ళ మొహాలు ఎర్రబడ్డాయి. వెంటనే సందీప్ ఆమెని గట్టిగా వారించాడు. సుశీల వెంటనే అందుకుంది.” ఒకటి దీపూ! ఇక్కడ మా మనవళ్ళను ఎలా పెంచుతున్నామో అలాగే చూస్తాము. మీ తిళ్ళు, సీసా నీళ్ళు, పిండి పాలు ………అంటే అవ్వదు. మా మీద భరోసా ఉందంటే ఉంచండి. లేకపోతే మాకు కష్టం” అనేసింది. విభవ ఏదో అనబోయే లోపునే సందీప్ అందుకుని “ లేదక్కా. మీదే బాధ్యత. మేము కల్పించుకోము. పిల్లల్ని ఉంచుకోవడమే పెద్ద వరం”...అంటూ, దూరంగా చెట్ల మధ్య పచ్చికలో కిలకిల నవ్వుతూ , ఆడుకుంటున్న పిల్లల్ని నిండారా చూసుకుంటూ. మధ్యాహ్నం సుశీల స్వహస్తాలతో , కమ్మగా, అమ్మని మరిపిస్తూ తాజా కాయగూరలు, నవకాయ పిండివంటలు,గడ్డ పెరుగుతో భోంచేసి, కాస్సేపు ఫారం అంతా తిరిగి, వారికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి బయలుదేరారు. “ ఇంత మంచి తిండి తిని ఎన్నాళ్ళయింది శాం. నా కెందుకో చాలా ధైర్యంగా ఉంది పిల్లల గురించి”,.అంటున్న విభవ కేసి ఆశ్చర్యంగా చూసాడు సందీప్. మొత్తానికి ఒక వారంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, పిల్లలను సుశీలా దంపతుల దగ్గర ఒదిలారు. కొంచెం బెంగగా ఉన్నా, తల్లితండ్రుల వియోగం వాళ్ళకు అలవాటే కనుక, అల్లరి చేయకుండా జాగ్రత్తగా ఉంటామని మాట ఇచ్చారు. పిల్లల మెడికల్ రిపోర్టులు, రకరకాల ఆహారాల డబ్బాలు చూసి సుశీల భృకుటి ముడి పడింది. విభవ మాత్రం అభావంగా అవన్నీ అప్పచెప్పి ., వెళ్ళిపోయింది. మరో రెండు రోజుల్లో విభవ స్వీడను, సందీప్ అమెరికా వెళ్ళిపోయారు. ఎప్పటి కప్పుడు పిల్లలకు ఫోనులు చేసి కనుక్కుంటున్నారు. మొదట్లో కొంచెం బెంగగా ఉన్నా, అతి త్వరలో పిల్లలు బాగా మాలిమి అయిపోయి, హ్యాపీ గా ఉన్నట్టే అనిపించారు. ఆరు నెలలనుకున్న ప్రాజెక్టులు ఏడాది డేకాయి. ఈ లోపున పిల్లల అకాడమిక్ ఇయర్ అయిపోయి విక్కీ ఆరు, ఆడీ మూడుకీ వచ్చారు. చాలా మంచి రేంకులు తెచ్చుకున్నారు. తెలుగులో చక్కగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు నేర్చుకున్నారో కానీ ఇంచక్కా సంస్కృత శ్లోకాలు, అన్నమాచార్య, రామదాసు కీర్తనలు శ్రావ్యంగా పాడి వినిపిస్తున్నారు. స్కైపులో బంతుల్లా, ఆరోగ్యంతో, ఉత్సాహంతో మిసమిస లాడుతున్న పిల్లల్ని చూసుకుంటుంటే సందీప్ మనసు నిండి పోతోంది. విభవకు మాత్రం పిల్లలు మరీ చాదస్తంగా తయారవుతారేమో అని భయం పట్టుకుంది. కానీ నోరిప్పడానికి ధైర్యం లేదు. ఎట్టకేలకు పిల్లల్ని తీసుకెళ్ళే రోజు ఒచ్చింది. ఒస్తూనే తాళాలు వేసిన ఇంటిని శుభ్రాలు చేయించుకుని, కావలసిన వన్నీ కొనిపెట్టి, సుశీల వాళ్ళింటికెళ్ళారు. పిల్లలు చూస్తూనే అమ్మ, నాన్నఅంటూ చుట్టుకు పోయారు. విభవ” మామ్ ని రా “,.అంటే ఆదిత్య, “ లేదు. నేను నిన్ను”అమ్మ” అనే పిలుస్తా”, అని స్పష్టంగా చెప్పాడు. విభవ మొహం మాడి పోయింది. సుశీల కుటుంబానికి రకరకాల బహుమతులు తెచ్చి ఇచ్చారు. ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నా వినకుండా సందీప్, “ ఏమిచ్చిమీ ఋణం తీర్చుకోగలను అక్కా!.పిల్లలు ఎంత బాగా తయారయ్యారో. మేమెప్పటికీ నీలా పెంచలేము.”అన్నాడు. చురుగ్గా చూసింది విభవ. భోజనాలు చేసి బయలు దేరారు. పిల్లలిద్దరూ చక్కగా వాళ్ళ బట్టలు మడతలతో సర్దుకుని పెట్టెల్లో పెట్టుకున్నారు. పుస్తకాల బేగ్లు తెచ్చుకున్నారు. విక్కీ వయొలిన్ నేర్చుకుంటున్నాడుట. ఇవన్నీ ఒక ఏడాదిలో సాధ్యమా?.సాధ్యమే అని నిరూపించింది సుశీల. సందీప్ కి పిల్లల్ని తిరిగి పాత జీవితానికి తీసుకెళ్ళాలంటే భయం వేసింది. ఇవన్నీ తాము చెయ్యలేరు.మళ్ళీ అనారోగ్యపు, అల్లరి పిల్లలయి పోతారు. విభవకి మాత్రం ఎప్పుడెప్పుడు తమ ఇంటి కెళ్ళి తమ జీవన శైలిలో పడదామా అని ఉంది. సాయంత్రం బయట భోంచేసారు, పిల్లల కబుర్లు మురిపెంగా వింటూ. ఆ మర్నాడు తెల్లవారే చిత్రమయిన శబ్దానికి భార్యాభర్త లిద్దరికీ మెలుకువ ఒచ్చింది. లేచి చూసే సరికి బాల్కనీలో పిల్లలిద్దరూ, యోగా చాపలు వేసుకుని ఓంకారం పెద్దగొంతుతో జపిస్తున్నారు పద్మాసనం వేసుకుని. లేచొచ్చి తల్లీ, తండ్రినీ కూర్చో పెట్టారు. పెద్దాడు ప్రాణాయామం ఎలా చెయ్యాలో తల్లికి చెప్తున్నాడు. సందీప్ కి తననెంతో పద్ధతిగా పెంచిన తండ్రి గుర్తొచ్చాడు. పిల్లల్ని నిరుత్సాహ పరచడం ఇష్టం లేక ఇద్దరూ కూర్చుని యోగా చేసారు. చాలా రోజుల తరవాత విభవ రిలాక్స్ డు గా ఫీల్ అయ్యింది. పిల్లలిద్దరూ చక్కగా స్నానం చేసి, దేవుడి దగ్గర ఒక అగరబత్తి వెలిగించి శ్లోకాలు చదివారు. విభవకింక పడుకోబుద్ధి.కాలేదు. పాలు తాగేక పిల్లలిద్దరూ ఎవరి కోసమో ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇంతలో కాలింగ్ బెల్లు మోగింది,. పరుగెత్తుకెళ్ళి తలుపు తీసారు. గుమ్మంలో పాత డ్రైవరు యాదగిరి, ఇంకో నడి వయసు స్త్రీ . యాదగిరి రకరకాల.కూరలు, పళ్ళ సంచీలు, రెండు కుండలు, ఇంకా మొక్కజొన్న పొత్తులు, రెండు కేన్లతో పాలు తెచ్చి లోపల పెట్టాడు. వీళ్ళకేమీ అర్ధం అవ్వలేదు. పిల్లలిద్దరూ మాత్రం చేటంత మొహం చేసుకుని ఆమెను “రత్నాంటీ”.అని పలకరించి కూర్చోపెట్టారు. “నాన్నా! అమ్మా! మేము మీతో మాట్లాడాలి. ఒకసారి మీ రూంలోకి ఒస్తారా?”,.పెద్ద ఆరిందాలా అడిగాడు పెద్దాడు. మొహాలు చూసుకుంటూ ఇద్దరూ వారిననుసరించారు. “ అమ్మా! మీకు కోపం ఒచ్చినా సరే, మా కోసం మీరు ఇవి చేసి తీరాలి. రత్నాంటికి ఎవరూ లేరు. చాలా బాగా వంట చేస్తారు. సుశీలత్త దగ్గర పనిచేసారు. మా కోసం అత్త పంపింది. ఇంక మనం అస్తమానూ ఆ హోటళ్ళలో పడి తినక్కర్లేదు. వారానికొకసారి యాదగిరి అంకుల్ మనకి కావలసిన ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటబుల్స్, మిల్కు అత్తా వాళ్ళ ఫాం నుండి కొని మనకి తెచ్చిస్తారు. మీరిద్దరూ మా ఫీడింగ్ గురించి ఎంత టెన్షన్ పడేవారో కదా. ఇంక ఆ అవసరం లేదు. మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. మేమిద్దరం మన సెవెంత్ ఫ్లోర్లో స్వామినాధన్ వాళ్ళ అమ్మ దగ్గర సంగీతం నేర్చుకుంటాము. స్కైప్ లో మామయ్య తెలుగు నేర్పిస్తారు. ప్రతీ సండే , ఫ్రైడే టెన్నిస్ నేర్చుకుంటాము. శనివారం స్విమ్మింగుకి వెళ్తాము. ఇంక మనం ఆ ప్లాస్టిక్ నీళ్ళు తాగద్దు. కుండలో ఫిల్టర్ వాటర్ తాగుదాము. మీ రిద్దరూ మా కోసం.ఎంతో కష్ట పడుతున్నారు. మేము ఏమీ కొనమని అడగం. కానీ ఇప్పుడు చెప్పినవన్నీ మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ నాన్నా. మీరిద్దరూ కూడా యోగా నేర్చుకుని చెయ్యాలి నాన్నా. మనం ఎంత హాపీగా, హెల్దీగా ఉంటామో తెలుసా!.”.,చిన్నవాడు అందుకున్నాడు. ఎందుకో విభవకి కొడుకులిద్దరూ ఎంతో ముద్దొచ్చేసారు. అమాంతం ముద్దు పెట్టేసుకుంది. ఏం గోల చేసేస్తుందా అని భయపడ్డ సందీప్ కి ఈ దృశ్యం నమ్మశక్యం కాలేదు. బహుశా తనలాగే పిల్లల గురించి తనకీ బెంగ ఉన్నట్టుంది. పిల్లలు ఆరిందాలా పాఠాలు చెప్తుంటే , ఆమెలోని , నిత్య విద్యార్ధి గ్రహించేసింది. పైగా అమ్మ. ఫోన్ తీసింది విభవ. “ సుశీల ఒదినా!”……మీకు బి………గ్ తేంక్స్. ఇంత కన్నా ఇప్పుడేమీ చెప్పలేను. ఇది మనస్ఫూర్తిగా., అహంకారం ఒదలి చెప్తున్న ధన్యవాదాలు మీకు, అన్నయ్యకు……”. చక్కటి నవ్వు మొహాన చిగురించగా బయటకు నడిచింది రత్న, యాదగిరితో మాట్లాడడానికి.
No comments:
Post a Comment