సర్వేశ్వర శతకము - యథావాక్కుల అన్నమయ్య - అచ్చంగా తెలుగు

సర్వేశ్వర శతకము - యథావాక్కుల అన్నమయ్య

Share This

సర్వేశ్వర శతకము - యథావాక్కుల అన్నమయ్య

పరిచయం :దేవరకొండ సుబ్రహ్మణ్యం


కవి పరిచయం:
సర్వేశ్వర శతకకర్త యథావాక్కుల అన్నమయ్య (అన్నమారాధ్యుడు) గోదావరీ తీరనివాసి. రాజమహేంద్రవరమునకు సమీపమున గల పట్టెస అనే గ్రామంలో వెలసిన వీరభద్రేశ్వర స్వామి ఈయనకు ఇలవేలుపు. వీరిది ఆత్రేయసగోత్రము. యజుశ్శాఖాధ్యాయి. ప్రసిధ్హ వీరశైవ కవి. దూదికొండ సోమేశ్వరారాధ్యులవారి శిష్యుడు. ఈ కవి ఇతర రచనలగానీ స్వీయ వివరాలుగానీ మనకు లభించవు.
ఈశతకాన్ని గురించి జనబాహుళ్యంలో ఉన్న ఒక కథ మనకు తెలుస్తున్నది. ఈ కథ ప్రకారం ఈ మహనీయుడు శ్రీశైలయాత్రకు వెళ్ళి మల్లికార్జనుని సేవించుకొని తిరిగివచ్చుచూ, పల్నాడుతాలూకా లోని విశ్వామిత్రాశ్రమము అను సత్రశాల పుణ్యస్థలమున శ్రీమల్లికేశ్వరస్వామిని సేవించుచు కొంతకాలము అక్కడేఉండి ఈశతకరచన సాగించారు. ఒక్కక్క పద్యాన్ని ఒక తాటియాకుపై వ్రాసి ఆ ఆకును కృష్ణలో వేసి అది ప్రవాహమునకు ఎదురీదివచ్చిన దానిని సూత్రమునకు ఎక్కించెద, రాకపోయినయెడల శిరమును ఖండిచుకొనియెద నను నియమముతో శతకరచన సాగించెను. కొంతకాలమున "తరులం బువ్వులు పిందెలై యొదవి" అను 87వ పద్యము మెదురుప్రవాహమున రాకపోవుత చూచి నియముప్రకారము శ్రసు ఖండించుకొనుటకు ఉద్యమించుచుండగా ఒక గొల్లకాపరి నాకొకతాటియాకు దొరకినదని చూడుమని యిచ్చి అదృశ్యుడాయ్యెను. ఆ ఆకును చూడగా దానిపై దాను వ్రాసిన పద్యమునకు బదులుగా వేరొక పద్యము ఉండుటచే దానిని సర్వేశ్వర కృతముగా భావించి ఆపద్యమును సూత్రమునకు ఎక్కించి శతకరచనను పూర్తి చేసెను. తరువాత కొంత కాలానికి అదే ఆశ్రమమున సిద్ధిపొందినారు. తనకాలమును తానే చెప్పుకొనిన శతకకవులలో ఈతనే ప్రధముడు.
ఈశతకమును అన్నమయ్య శా.శ. 1164 కు సరియగు క్రీ.శ. 1242 శుభకృత్సంవత్సరమున రచించినటుల శతకములోని 130, 133, 142 పద్యములబట్టి తెలియుచున్నది. కాబట్టి ఈకవి తిక్కన సమకాలికునిగా భావించవచ్చును.
ఈ కవివంశాను క్రమమును గురించి సోమరాజు వేంకటశివుడు వాసినారు. అన్నమారాధ్యుని కుమారుడు వీరంరాజు, వీరంరాజు కుమారుడు నాగరాజు, నాగరాజు తనయుడు చిట్టెమరాజు. ఈ చిట్టెమరాజు పల్నాటిసీమకు వచ్చి యచ్చట ఆరుగ్రామములకు కరణికము సంపాదించుకొని అచ్చటనే స్థిరనివాసుడైనాడు. చిట్టెమరాజు కొడుకు గోపరాజు. గోపరాజు కుమారుడు సోమరాజు. ఈతనికాలముననే అన్నమయ్యా ఇంటిపేరు యథావాక్కులనుండి మారి సోమరాజు వారని మారినది. ఇప్పటికి ఇదియే వాడుకలో నున్నది.
శతకపరిచయం:
"సర్వేశ్వరా" అనే మకుటంతో శార్ధూల మత్తేభ వృత్తాలతో రచించిన ఈశతకంలో 142 పద్యాలున్నాయి. ఈశతకము వీరశైవసంప్రదాయానుసారము. భక్తిరసప్రధానము. శైలి హృద్యము. ధార యనర్గళము. శైలికి, భక్తికి మంచిభావములకు తరువాతి శతకములకు భిక్షపెట్టిన శతకముగా ఈ రచనను అభివర్ణించవచ్చును. పోతన నారాయణ శతకము నందు, దూర్జటి కాళహస్తీశ్వర శతకమునందు కొన్నిపద్యములలో ఈ శతకపద్యానుకరణ కనిపిస్తుంది. అదేవిధంగా ఈకవి పూర్వకవులను అనుసరిస్తు (ముఖ్యంగా శివతత్వసారము నుండి) కొన్ని పద్యాలను వ్రాయటం మనం గమనించవచ్చును.
మచ్చుకి కొన్ని పద్యాలను చూపి ఈ వ్యాసం ముగిస్తాను.
మ. సతివేడ్కం దనప్రాణవల్లభునితో సంయోగమర్థించుఁగా
కతనిం బ్రార్థనసేసి సొమ్ముగొనిపో నఱ్ఱాడునే భక్తుఁడీ
క్షితి నీభక్తియ వేఁడుఁగాక మఱి నీశ్రీపాదము ల్గొల్చి కు
త్సితకామ్యార్థములొండు వేఁడుకొనునే చింతింప సర్వేశ్వరా
మ. భ్రమరధ్యానముదాల్చి కీటకము సద్భావాదిసంయుక్తిఁ దా
భ్రమరంబై ఖగవీధి నాడునని నంబాటించి నిన్నాత్మ నె
య్యముతో ధ్యానముసేయుమర్త్యుఁడును నీయట్లే పరవ్యోమత
త్త్వమునం దవ్యయలీల నుండు టరుదే భావింప సర్వేశ్వరా
ఈ పైపద్యాన్నే ధాశరథీ శతకకారుడు తన 100 వ పద్యంగా అనుకరించటం గమనించవచ్చును
శా. ఎచ్చో నీపద భక్తుఁడుండు మది నింపెక్కం బ్రయత్నంబుతో
నచ్చో నీ వనిశంబునుండుదు త్వదీయధ్యాన చిన్మూర్తులై
యచ్చో సన్మునులెల్ల నుండుదురు మంత్రాంగక్షరాయుక్తులై
యచ్చో తీర్థములెల్ల నుండునిదె వేదార్థంబు విశ్వేశ్వరా.
శా. ఏదేశంబున నేదిశాముకహమునం దేయూర నెవాడ మీ
పదాభ్యర్చనసేయునిర్మలుఁడు సద్భక్తుం డొకండుండెనా
యాదేశంబును నాదిశాముఖమును న్నాయూరు నావాడ గం
గాదిస్నాననదీప్రవాహఫలదంబై యుండు సర్వేశ్వరా
పైరెండు పద్యములు శివతత్వసారము నందలి 207వ పద్యమునకు అనుకరణలు గా కనిపిస్తాయి
మ. అతివాగ్జాలమునై యజాండనిలయంబై యాదిమధ్యాంత వ
ర్జిత రూపాధిక నిష్కలంకపదమై సిద్ధాంతమధ్యాత్మ సం
యుతమై కోటిరవిప్రకాశయ్తమై యోకారమంత్రాది సం
స్తుతమై యేచి యచింత్యమై నెగడు నీ సూక్షంబు విశ్వేశ్వరా
పై పద్యాన్నే పోతన నారాయణ శతకమున "ధర సింహాసనమై" అనే పద్యంలో అనుకరించెనా అనే అనిపిస్తుంది.
మరిన్ని పద్యాలు చూద్దాము.
మ. ప్రకటింఅగ సమస్తపాతకములం బాపగ నీపూజయం
దొకపుష్పాశము చాలునన్న మహిలో నూహింపఁగా నీపదా
ర్చకు లేమార్గమునందు శుద్ధులు మదిం జర్చింపఁ దుద్దుర్గుణ
ప్రకరంబె న్నెడివాఁడు లోకములలోఁబాపిష్ఠి సర్వేశ్వరా
మ. పవనుండై హిమధాముఁడై యనలుఁడై పానీయమై యాత్మయై
రవియై యంబరమై మహివలయ మై రమ్యాష్టమూర్తిక్రియన్
భువనాండంబులు లక్షణాంగములుగాఁ బుట్టించు నత్యద్భుతో
త్సవలీలావిభవంబుతోడ భవదాజ్ఞాశక్తి విశ్వేశ్వరా
ఇలాచెప్పుకుంటే పోతే ఈ శతకంలోని ప్రతిపద్యంలో విశ్వేశ్వరుపై భక్తి భావం పొంగిపొర్లుతుంటుంది. ఈ శతకం అప్పటికాలంలో శివభక్తులచే కాకుండా సర్వజనులకూ అందుబాటులో ఉండేది. తరువాతితరాలలో కవులకు మర్గనిర్దేశం చేసిన ఈ శతకం అందరు చదివి ఆస్వాదించవలసిందే. మీరూచదవండి. అందరిచేతా చదివించండి

No comments:

Post a Comment

Pages