టెలిపోర్టేషన్
డా.వి.బి.కాశ్యప
"పదార్థాన్ని పరమణువులుగా విభజించి, దానిని కాంతిశక్తిగా మలచి, ఎక్కడ నుంచి ఎక్కడికైనా పంపించగలిగి, అక్కడ మరల ఆ పదార్థాన్ని దాని నిజస్వరూపం కోల్పోకుండా పునరుజ్జీవింప చేయగలిగితే.., అద్భుతాలు సృష్టించవచ్చు... సిల్వియా." మెటల్ డోమ్ ని ఇంటిపై జాగ్రత్తగా అమరుస్తూ చెప్పాను.
"సర్! ఇటువంటి ప్రయోగం చెయ్యాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు?" నాకు కావలిసిన వస్తువులు అందిస్తూ, ఎంతో ఆరాధనా భావంతో అడిగింది సిల్వియా. ఎప్పటినుంచో అడిగుతున్న ప్రశ్నే. నా పనిలో మునిగిపోయి ఈ సారీ, తనకి సమాధానం చెప్పలేదు కానీ, మనసులో... '19వ శతాబ్దం చివరలో మొదలైన, ఈ పరిశోధన మూలాలు 19 వ శతాబ్దం మధ్య నుంచే ఉన్నప్పటికీ, ఎవరికీ అందుబాటులోకి రాని ఒక ప్రయోగం, సుసాధ్యం చేసి చరిత్రలో నిలిచిపోవాలనుకున్న ఒక సామాన్యమైన శాస్త్రవేత్తను నేనని' మౌనంగా అనుకున్నాను.
1899,సెప్టెంబర్ 16
"ఇంకో మూడు రోజులు... సిల్వియా! ట్రాన్సిస్టర్ ను, రిసీవర్ ను సిద్దంచేశాను. సిద్దాంతపరంగా అంతా సరిగ్గానే ఉంది. ఈ కల సాకారం అయితే ప్రపంచ రవాణా వ్యవస్థ, ఖగోళ వ్యవస్థ మొదలైన రంగాల్లో విప్లవాత్మక మార్పుగా మిగిలిపోతుంది." ఉద్వేగంగా చెప్పాను ఉదయం గదిలోపల పరికరాల అమరిక పూర్తి కాగానే.
"ఎలా ఆ పని జరుగుతుంది సర్?" ఆ కళ్ళలో మెరుపు ఎప్పటిలానే. ఆ ఆత్రుత ఎప్పుడూ ఒక చిరునవ్వు తెప్పిస్తుంది నా పెదాల మీద.
"ఇప్పటిదాక ఒక వస్తువుని నేరుగా మాత్రమే ఒక చోటు నుంచి మరో చోటుకి మార్చగలము. అదే కనుక కాంతి వేగంతో కావలసినంత దూరం చేర్చగలిగితే... అద్భుతాలు సృష్టించవచ్చు సిల్వియా. 1877 లో మొదటి సారి ఎడ్వర్డ్ పేజ్ మిషల్ రాసిన ఓ కధ చదివిన రోజు నుంచి ఇది నా కలైంది. అప్పటిదాక అదొక ప్రపంచం ఎరుగని కధ. ఈ ప్రయోగంతో, అద్భుత వాస్తవం చేస్తాను దానిని. సాధారణంగా పరమాణువులని విడదీయడానికి శక్తి కావాలి, విడిపోయాక ఆ పరమాణువులని ఒడిసిపట్టి మరో చోటుకి చేర్చడానికి మరి కొంత శక్తి, తిరిగి అవి రూపం పోసుకోవడానికి ఇంకొంత శక్తి అవసరం అవుతాయి.
శక్తిని అందించడం, దానిని మనకి కావలసిన విధంగా మార్చుకోవడం, వీటన్నిటిని ఒకేసారి కలిపి చెయ్యడంలో ఉన్న సైద్ధాంతిక సూత్రాన్ని ఈ 7 సం||ల కృషితో సాధించాను. ఇక ప్రయోగమే మిగిలింది. మన కంటికి కనపడే విషయాన్ని ఆలానే పునరుజ్జీవింప చేయగలగాలి... చేస్తాను." ధృఢంగా అన్నాను. తను చప్పట్లు కొట్టింది. ప్రతి విషయమూ అతిశయమే తన చిన్ని ప్రపంచానికి.
ఆ సాయంత్రం ఇంటి బయట పచ్చికలో కూర్చుని వాతావరణం అంచనాలు సరిచూసుకుంటున్న నా వద్దకు వచ్చి,
"సర్, ఈ రోజు నేను మా ఊరికి వెళ్లి వస్తాను సర్!" అలసిన ఆ నీలిరంగు కళ్ళలో అభ్యర్ధన. ఔను, దాదాపు సంవత్సరమౌతున్నది తను ఈ ప్రదేశం విడిచి. ఉదయం తెల్లవారకముందే నా ప్రపంచంలోకి వెళ్లే నన్ను నా కన్నా ముందే ఎదురొచ్చి పలకరించడం దగ్గర మొదలై, నడిరాత్రి దాటాక ఎక్కడ పడుకున్నానో వెతుక్కుని, అక్కడే నా నిద్రకు ఏర్పాట్లు చేసేదాకా ప్రతిక్షణం సహాయం అందిస్తూనే ఉంటుంది.
ఈ ప్రపంచంలో పరిశోధన తర్వాత నాకు అంత ఇష్టమైనవి ఆ రెండు కళ్లే. ప్రతి మనిషి కీర్తిని కోరుకుంటాడు. ఒక శాస్త్రవేత్తకి మాత్రం విజయం సాధించేదాక అది అందదు. కానీ, ఆ విజయం వరించేదాక అతనని నడిపే శక్తి ఉండాలి. నా విషయంలో అది తనే. మొదటి సారి సం. క్రితం నాకు సహాయకురాలిగా వచ్చినపుడు ‘భౌతికశాస్త్రమ’న్న పదానికి అర్ధంకూడా తెలియదు తనకి. అప్పటికే 4 సం.ల నుంచి చేస్తున్న వ్యర్ధ ప్రయత్నాలతో విసిగిన నాకు అడ్డంకాకుండా ఉండడానికి రాత్రి, పగలు కష్టపడింది. నెల తిరక్కుండానే నేనడిగిన ప్రతి వస్తువు తూ.చ. తప్పకుండా అందించగల నేర్పరి ఐపోయింది. అంతే కాకుండా, తనకి ఏమాత్రం అవగాహన లేకున్నా, నేను నిరుత్సాహపడ్డ ప్రతిసారి ప్రోత్సాహం అందించేది. అలాంటి తను లేకుండా ఈ ప్రయోగం చెయ్యడమా? ఈ చివరి నెల రోజులుగా తనెంత అలసిపొయిందో ఆ కళ్ళలోనే తెలుస్తున్నది. అయినా సరే…
"మూడురోజుల్లో అంతా అయిపోతుంది. అప్పటివరకూ ఏమి అడక్కు సిల్వియా!" కొంచెం కాఠిన్యం, నా గొంతులో... అప్పు తెచ్చుకున్నాను మరి. తన ముఖంలో నిరాశ... అయినా కొంతసేపే. నా కోసం మరింత ఉత్సాహం కొనితెచ్చుకుంది, తన చిరునవ్వును బహుమతిగా ఇచ్చింది కూడా. ఆ కొండ మీద ఊరికి దూరంగా పరిశోధన చేస్తున్న నాకు తోడు ఈ సిల్వియానే. అంతకన్నా ఎక్కువేనేమో.
ఈ రాత్రి నాకు ఏంతో ముఖ్యమైనది. 'జీవం లేని వస్తువులా, జీవం ఉన్న పదార్ధాన్ని కూడా టెలిపోర్ట్ చేయగలిగితే?' నా ఈ కల ఎవరికీ తెలియదు. చివరకు సిల్వియాకి కూడా. తనని ఆశ్చర్యపరచాలి. ఒక్కక్షణం నా ముఖంలో చిరునవ్వు. తిరిగి నా పనిలోకి వచ్చాను. ఇప్పుడు నా దృష్టి అంతా రేపటి నా సృష్టి మీదే.
1899,సెప్టెంబర్ 18
అంతా సిద్దంగా ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. నా గదిలో ట్రాన్స్మీటర్ తో నేను సిద్దంగా ఉన్నాను. ఆ గది కిటికీ నుంచి కనిపిస్తున్న మరో చిన్న గది, ఈ గదికి 40 అడుగుల దూరంలో... రిసీవర్ దగ్గర సిల్వియా సిద్దంగా ఉంది. సముద్రమట్టానికి 1800 అడుగులఎత్తు. స్వచ్చంగా వినీలాకాశం. ప్రపంచంలో మరెవరు కనపడని ఏకాంతం.
మళ్లీ కిటికీలో నుంచి ఆకాశాన్ని పరికించి చూశాను. ఏ విపరీత పరిణామమైనా నా ప్రయోగాన్ని అడ్డుకుంటుందేమోనని చిన్న భయం. యాంటెన్నాలు సరిచూశాక, ట్రాన్స్పోర్టర్ ఎదురుగా ఒక వస్తువును ఉంచాను. ఆ వస్తువుని రాత్రి ఎంతో జాగ్రత్తగా, రహస్యంగా తయారుచేశాను. నా మీద ఎంత నమ్మకం ఉన్నా, నా పరిశోధన విజయవంతం అవుతుందని నమ్మడం లేదేమో సిల్వియా, అని నా అనుమానం. దానికి కారణం లేకపోలేదు. ఆ పరిశోధన, మానవజాతికే నూతనం మరి. అందుకే తననే మొదట ఆశ్చర్యపరచాలనిపించింది. నా కోసం కనిపించని దేవుడిని ప్రార్దిస్తుంటుంది ఎప్పుడూ. ఇప్పుడు అతని సృష్టికి ప్రతి సృష్టి చేశాక ఏమంటుందో, చిన్నగా నవ్వుతూ, స్విచ్ ఆన్ చేశాను. రెండు రంగుల కాంతి కిరణం ఆ వస్తువుపై పడింది.
అందులో ఒక కిరణం ఇస్తున్న శక్తిని క్రమంగా పదార్దంలోని పరమాణువులు సేకరించి మెల్లగా అదృశ్యం అవుతున్నాయి. మరొక కిరణం, ఆ శూన్యంలోని శక్తిని అదుపుచేస్తూ, సంగ్రహిస్తున్నాయి. కొంచెం కొంచెంగా, ఆ పదార్ధం పూర్తిగా అదృశ్యమయ్యాక, ఒక్కుదుటన తలుపు తోసుకొని, అవతలి గది వైపు పరుగు నారంభించాను. పైనున్న యాంటెన్నాలు స్వల్పంగా కంపిస్తున్నాయి. పదార్ధం ప్రవాహానికి గుర్తు అది. ఇంతలో అవతలి గది కిటికీలో గొప్ప కాంతి. నా పరుగు కన్నా వేల రెట్ల వేగం.., నాకు కావలసింది ఆదే. నేను వెళ్లి ఆ గది తలుపు తోసుకుని నిలుచున్నాను.
సిల్వియా నా వైపు తిరిగింది. తన చేతుల్లో... నేను పంపిన రోజా పువ్వు. తన కళ్ళలో... ఆనందభాష్పాలు. తనవేళ్ళు... ఆ పువ్వు రేకపై రాసిన 'నా సిల్వియా కోసం' అనే అక్షరాలపై. తననలా చూస్తున్న నా ఆనందం వర్ణనాతీతం. సిల్వియాకు నోట మాట రావడంలేదు. పరిగెత్తుతూ వచ్చి, నన్ను హత్తుకుంది. ఒక్కక్షణం, నన్ను నేను మర్చిపోయాను. నా కల నిజమైంది.., ఎన్నో విధాలుగా.., ఒకేసారిగా. సిల్వియా నన్ను వదిలి, ఏదేదో మాట్లాడుతున్నది. "సర్! మీరు సాధించిన ఈ అధ్భుతం, మీ కన్నా ముందు నాకు చూపించారు. నేను ఎంత అదృష్టవంతురాలిని. శూన్యంలో నుంచి ఒక వెలుగు, ఆ వెలుగు నుంచి పదార్ధం మెల్లగా రూపు సంతరించుకోవడం. ఇది నిజంగా మరువలేని రోజు. ఈ ప్రపంచం అంతా ఈ విషయం తెలుసుకోవాలి. మిమ్మల్ని గుర్తించాలి..." ఇంకా ఏదేదో మాట్లాడబోతున్న తన భుజం పట్టి ఆపేశాను.
"నా కల ఇంకా పూర్తి కాలేదు సిల్వియా... అది పూర్తయ్యాక, ఇక అంతా నువ్వే. నువ్వు చెప్పినట్లె చేస్తాను." అన్నాను నవ్వుతూ. అప్పటిదాక మర్చిపోయినదేదో గుర్తొచ్చినట్లు సిగ్గుల మొగ్గయింది. అది చూస్తూ, చేసిన శ్రమంతా మర్చిపోయాను.ఈ రోజంతా అలానే గడిచిపోయింది. ఎన్నో వస్తువులు స్థలం మారిపోయాయి. నా పెద్ద ఇంటిలో నుంచి, ఆ చిన్న గదిలోకి. ఆ సాయంకాలం అంతా సిల్వియాతోనే గడిపాను. తను మాట్లాడుతూనే ఉంది రోజంతా. ఈ మరో సిల్వియా ఇంకా అందంగా ఉంది. తన మాటలు వినడానికి ఏనాడు ఇంత సమయం కేటాయించనందుకు బాధపడ్డానోనిమిషం. ఏం చేస్తున్నా, తన చేతిలో ఆ పువ్వుని మాత్రం వదల్లేదు. నాకు ప్రశాంతత, ఎన్నో సంవత్సరాల తర్వాత. ఈ జీవితం, ఈ క్షణం దగ్గరే ఆగిపొతే ఎంత బాగుణ్ణు.
రాత్రి సిల్వియా తన గదిలో ప్రశాంతంగా నిద్రపోయినా, నా గదిలో నేను నిద్రపోలేకపోయాను. వద్దన్న గతమంతా నాకు గుర్తువచ్చిం ది.
చిన్నప్పటి నుంచి గొప్ప వైద్యుడైన నా తండ్రి నన్ను కూడ వైద్యుడిలానే తయారుచేయాలనుకున్నారు. కానీ నాకు భౌతికశాస్త్రంపై మక్కువ ఉండడంతో, నన్ను కోప్పడేవారు. నన్నలా పెంచినందుకు అమ్మమీద కూడా కోప్పడేవారు. కొంతకాలానికి ఆయనతో విడిపోయి మరో పెళ్లి చేస్కున్న అమ్మ, నన్ను మాత్రం దూరంగా, మా చిన్నాన్న దగ్గరకు పంపింది. అక్కడే భౌతికశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించాను. అనుకోని ప్రమాదంలో పెంచిన చిన్నాన్న కుటుంబం నాకు దూరం అయింది. తిరిగి నా కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను.
మొదట నాన్న ఒక భౌతికశాస్త్రవేత్తగా నన్ను చూసి విసుక్కున్నారు. ఆ తర్వాత అమ్మ. తన ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలతో తీరిక లేకుండా ఉంది. నా సవతి తండ్రిపై నాకు పెద్దగా ప్రేమ కలుగలేదు. అతనికి నాపై కూడా... నన్ను ప్రేమగా పలుకరించింది అమ్మ కానీ, ప్రశాంతంగా మట్లాడటం కుదరలేదు. అన్ని బంధాలు తెగినట్లుగా అనిపించింది. తెగిన గాలిపటంలా ఈ ఊరికి కొట్టుకుని వచ్చి, నా జీవితంలో శూన్యాన్ని పరిశోధనతో భర్తీచేసుకున్నాను. నా పరిశోధనా పత్రాల వల్ల వచ్చిన డబ్బుతో ఈ మారుమూల గ్రామంలోని ఒక కొండపై, ఈ చిన్న పరిశోధనశాల ఏర్పాటు చేస్కున్నాను.
ఇంకా మిగిలి ఉన్న వెలితి, ఒక రోజు సిల్వియా నా జీవితంలోకి రావడంతో తీరిపోయింది.
1899,సెప్టెంబర్ 19
ఈ రోజు ఇప్పటి దాకా ఉన్న మరో పరిమితిని దాటడానికి కావలిసిన పనులు చేయడంలో మునిగిపోయాను. ఇప్పటి వరకు ఒక ఘనపు మీటర్ పరిమాణాన్ని మాత్రం టెలిపోర్ట్ చేయగలుగుతున్నాను. ఆ పరిమితిని వంద ఘనపు మీటర్లకు పెంచాను. ఇందుకోసం పరికరాల పరిమాణం పెంచకుండా, కిరణాల తరంగదైర్ఘ్యం, పౌన:పున్యం మాత్రం పెంచాను. దాని ద్వారా ఒకేసారి మొత్తంగా వస్తువుని టెలిపోర్ట్ చెయ్యగలుగుతున్నాను.
ఈ రోజంతా సిల్వియా, నా ప్రయోగం గురించి అడుగుతూనే ఉంది. ఇన్నాళ్లూ తెలుసుకోని ఇతర విషయాలు అడుగుతున్నది. నాకింకా ఎక్కువ సహాయం చెయ్యడానికే అని నాకు తెలుసు అది. నేను నవ్వుతూనే పని చేసుకుంటున్నా, జాగ్రత్తగా తన ప్రశ్నలకి సమాధానమిస్తూ. తనని ఇంకా కష్టపెట్టడం ఇష్టంలేదు నాకు.
ఇంతలో, నేను ఊహించని మరో అద్భుతం. తీవ్రంగా పనిలో ఉండగా, నా నుదిటిపై చెమటను తన చేతితో తుడిచి, నా దగ్గరగా వచ్చి, నా బుగ్గపై ముద్దుచ్చింది నా సిల్వియా. కాలం ఆగిపోయిందా..!
1899, సెప్టెంబర్ 20
ఈ రోజు నేను అనుకున్న చివరి ఘట్టానికి శ్రీకారం చుట్టాను. మనిషిని టెలిపోర్ట్ చేసి, భౌతికశాస్త్రంలో నూతన శకం ఆరంభించబోతున్నాను. ఆ ఆశ్చర్యాన్ని కూడా సిల్వియాకే ముందు పరిచయం చెయ్యబోతున్నాను. తనకి అనుమానం రాకుండా, తనకీ.., నాకూ... ఎంతో ఇష్టమైన పియానోని తన ప్రక్కన ఉంచి, తనని కదలకుండా ఉండమని.., పియానోని ఇప్పుడు టెలిపోర్ట్ చేయబోతున్నా అని చెప్పాను.
నేను ఆ చిన్న గదికి వెళ్ళాక, కిటికీలో నుండి బ్రొటనవ్రేలు చూపించాను సిల్వియాకు. తాను, చెప్పిన స్థలంలోకి వెళ్ళి, ట్రాన్స్‌పోర్టర్ ని ఆన్చేసింది. ఆ గదివైపు చూస్తున్ననాకు, కిటికీలో నుంచి పెద్ద కాంతి కనిపించింది. ఆ తర్వాత ఆ ఇంటి యాంటెన్నా కంపించసాగింది. నేను రిసీవర్ దగ్గరకువెళ్ళి, మోకాళ్ళ పై కూర్చుని, తల వంచి, చివరిసారి తన దగ్గరకు వెళ్ళినప్పుడు అమ్మ ఇచ్చిన వజ్రపు ఉంగరం పట్టుకుని సిద్దంగా ఉన్నాను. ఈ రోజు తన అంగీకారం సాధించవలసిందే.
నా ముందు కాంతి... భరించ లేక కళ్ళు మూసుకున్నాను. కాంతి తగ్గాక కళ్ళు తెరిస్తే, దేవతలా నా సిల్వియా. తన తెల్లని పాదాలే చూస్తూ, "నన్ను అంగీకరించ ... " మాట పూర్తి కాకుండానే ఒరిగిపోతున్నట్టు అనిపించింది. ఉంగరం వదిలి, తనని ఒడిసి పట్టుకున్నా. నా ఒడిలో సిల్వియా..!
ఆ నీలిరంగు కళ్ళు... నన్ను తన్మయత్వంలో ముంచిన ఆ కనులు.., ఇప్పుడు నిర్జీవంగా, తన శరీరం కాంతిగా మారుతున్న బాధకి చిహ్నంగా, టెలిపోర్టర్ టెలిపోర్ట్ చేసిన ఆమె కన్నీళ్ళ సాక్షిగా, ‘ఎందుకిలా చేశారు. సర్?’ అని మౌనంగా నిలదీస్తుంటే, మెల్లగా మసకబారుతున్నది ఆ రూపం. నా కళ్ళు వర్షిస్తున్నాయి, ధారాపాతంగా. ఎన్నో సంవత్సరాల కృషి... కళ్ళెదురుగానే బూడిదయింది. నేను ఓడిపోయాను... అన్నిరకాలుగా. ప్రకృతి పరిహసిస్తుంటే నా జ్ఞానాన్ని... జీవశ్చవం లా నిలిచిపోయాను.
✹✹✹✹✹✹✹✹✹
పుస్తకం మూసేశాడు కెవిన్. "తాతయ్యా! ఈ డైరీలో ఇంతే ఉంది. తర్వాత ఏమైంది?" ఎంతో ఆసక్తిగా అడిగాడా 20 సం||ల యువ శాస్త్రవేత్త. మొదటిసారి ఆ ఇంటికి వచ్చాక, రాత్రి అటకమీద పాతవస్తువుల మధ్య దొరికిన సగం కాలిన డైరి కెవిన్ లో కుతూహలం పెంచింది. అతని తాత ముల్లర్, చిన్నగా గొంతు సవరించుకుని, "మీ ముత్తాత, అంటే మా నాన్న గ్జేవియర్. ఆ శాస్త్రవేత్త మంచి చెడ్డలు ఈ ఊరికి వచ్చినప్పటినుంచి చూసుకునేవాడు. అతనే సిల్వియాను పనికి చేర్చింది. ప్రతి మూడు రోజులకొకసారి కొండ మీదకు వెళ్ళి వారికి కావలసినవి సమకూర్చేవాడు. ఆ రోజు కూడా అలానే వెళ్లాడు. సిల్వియాను పిలుస్తూ ఇంటిలోకి వెళ్లి, ఎక్కడా కనిపించకపొయేసరికి. ఇంటి వెనక్కు చేరుకున్నాడు.
ఆ తలుపు తెరచి ఉన్న చిన్న గదిని చూసి, అక్కడకు వెళ్లాడు. స్థాణువైపోయాడు. శూన్యం నిండిన కళ్ళతో, ఒడిలోని సిల్వియానే చూస్తూ ఏడవడం కూడా మరచిపోయిన స్థితిలో ఉన్నారా శాస్త్రవేత్త. మొదట నాన్న భయపడ్డారు, శాస్త్రవేత్తే సిల్వియాను అంతం చేశారేమోనని. కానీ మెల్లగా ప్రస్తుతంలోకి వచ్చి, ఆయనను కదిపాడు. ఎంతోసేపటి తర్వాత, మెల్లగా మాట్లాడారట ఆయన. "గ్జేవియర్..! మనిషి శరీరం ఒక పంజరం అని తెలుసుకోలేని నేను... దానిని విప్పి... మళ్ళీ కూర్చాలని ప్రయత్నించాను. విధిని పరిహసించబోయిన నన్ను పరిహసిస్తూ, నా సిల్వియా ఎగిరిపోయింది. తన కన్నీళ్ళ సాక్షిగా, తనని బాధించినందుకు, నాపై అలిగి... అందకుండా వెళ్ళిపోయింది... కరిగిపోయిన కలయింది గ్జేవియర్. నా జీవితం వ్యర్ధమయింది. ఈ నష్టం పూడ్చలేనిది." వేయిజన్మల బాధ ధ్వనించిందా గొంతులో అనేవారాయన.
"ఆ తర్వాత ఏమైంది తాతయ్యా!" కెవిన్ ఆత్రుత ఇంకో మెట్టు పెరిగింది.
"ఎంతోసేపటికి సిల్వియాని వదిలి ఇవతలకు వచ్చిన అతను, తన యంత్రాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. ఆ గది ముందే సిల్వియాని పూడ్చివేశారు. ఆ రాత్రి దాకా మా నాన్న అక్కడే ఉండి ఇంటికొచ్చారు. అర్ధరాత్రి పెద్ద వాన పడింది. అకాల వర్షానికి కారణం ఏమిటో అంతుపట్టలేదు. మరుసటి రోజు కొండ మీదకు వెళ్ళిన నాన్నకు దాదాపు పూర్తిగా కాలిపోయిన ఆ గది కనిపించింది. ఆ గది ఎదురుగా సిల్వియాను సమాధి చేసిన స్థలం ఖాళీగా ఉంది. ఆ కాలిన గదిలో, మధ్యలో పడిన వాన వల్ల బూడిదలా మారకుండా నల్లని కట్టెల్లా ఉండిపోయారు ఆ శాస్త్రవేత్త, అతని ఒడిలో సిల్వియా. ఆ గదిలో అంతా తగులపడిపోయింది. ఆ యంత్రాన్ని తయారు చేయడానికి నమూనా పత్రాలన్నీ కాలిపోయాయి. ఈ ఒక్క్డ డైరీ మిగిలింది." అని చెప్పడం ఆపాడు ముల్లర్. అతనికి మనసంతా ఇబ్బందిగా ఉంది.
సిల్వియా గుర్తొస్తుంది. ఆ అందాన్ని మూగగా ఆరాధించిన ముల్లర్, తనని తల్చుకొని రోజులేదు. 5 సం.ల వయస్సులో, యుద్ధంలో తల్లిదండ్రులను కోల్పోయిన సిల్వియాను, దూరంనుంచే ప్రేమించినా, ఆ మాట తనకి ఎప్పుడూ చెప్పలేకపోయాడు. అతని పిరికితనం, అతడికి దూరంగా సిల్వియాను తీసుకెళ్తున్నప్పుడూ నోరునొక్కేసింది. తన అంతరంగం తెలుసుకోకుండా దూరంగా తీస్కెళ్లిన నాన్నపై ఎప్పుడూ కోపమే అతనికి.
‘సిల్వియా ముందు అతని ప్రేమ బయటపెట్టలేక తప్పు చేసానేమో’ అని ఎప్పుడూ బాధపడుతుంటాడు ముల్లర్. మనవడు ఇన్ని సంవత్సరాల తర్వాత కదిలించిన ఆ పాతజ్ఞాపకాలు, ఈ వయసులో ఎక్కువుగా బాధిస్తున్నాయి. ‘సిల్వియా…!’ మరొక్కసారి మూగగా రోదించిన అతని హృదయం ఆగిపోయింది.
"ఇంతకీ ఆ శాస్త్రవేత్త పేరు చెప్పలేదు తాతయ్యా..." అని ఊహల్లోనుంచి బయటకొచ్చిన కెవిన్, ప్రక్కకి ఒరిగిపోయిన ముల్లర్నిచూసి, "తాతయ్యా ...!" అంటూ అరిచాడు.
✹✹✹✹✹✹✹✹✹✹
No comments:
Post a Comment