అల్లుళ్ళు - అచ్చంగా తెలుగు

అల్లుళ్ళు

Share This

అల్లుళ్ళు

- దోమల శోభారాణి.

          
పంకజమ్మ ఆ వార్త వినగానే..  ఉన్న ఫళంగా కుప్పలా కూలి పోయింది.
            పరంధామయ్య వణికి పోతూ గావు కేక పెట్టాడు.
            కళ్యాణి, కరుణాకర్‍లు ఇంట్లో నుండి పరుగెత్తుకుంటూ వచ్చారు.
            కళ్యాణి పంకజమ్మ తలని తన ఒళ్లోకి తీసుకుంది.
            బల్లపై గ్లాసులో వున్న చన్నీళ్ళు కొన్ని పంకజమ్మ మోముపై చిలకరించాడు కరుణాకర్.
            పరంధామయ్య గుండెలు బాదుకోసాగాడు. ‘దాదాపు నలుబది యేండ్ల అనుబంధం తెగిపోతుందా?’ అన్నట్లు రోదించ సాగాడు. కళ్ళు వర్షించ సాగాయి..
            శేఖర్ “సెల్ ఫోన్లో సిగ్నల్ లేదు’’ అనుకుంటూ బయటకు పరుగెత్తాడు.. ఆంబులెన్స్ కోసం ఫోన్ చెయ్య సాగాడు..
            సరిగ్గా ఇదే రోజు దాదాపు ఏడాది క్రితం...
***
            “శేఖర్‍ని అల్లుడు అనే కంటే మన ఇంటి పెద్ద కొడుకు అనడం సబబేమో..! కదా పంకీ..” అన్నాడు పరంధామయ్య. తన అర్థాంగి పంకజమ్మ తెచ్చిన నిమ్మరసం గ్లాసును అందుకుంటూ..
            ‘పంకజా.. !’ అంటూ పిలవగా వినటం ఇక ఈ జన్మలో కుదరదేమో..! అనుకుంది మనసులో పంకజమ్మ. అయినా ఈ పిలుపుకు అలవాటు పడిన పంకజమ్మ ఏమాత్రమూ నొచ్చుకోలేదు.. కాలకృత్యాలు పూర్తి చేసుకోగానే ఒక గ్లాసు నిమ్మ రసం తాగే పరంధామయ్య అలవాటుకు భంగం కలిగించ లేదు.
            “ఇదంతా మన పెద్దమ్మాయి పూర్వ జన్మలో చేసుకున్న పూజాఫలమండీ.. ఎన్ని నోములు నోచితే మాత్రం అంతటి ఉత్తముడు అల్లుడుగా దొరుకుతాడు?” కడ కొంగును  చీర కుచ్చిళ్ళలో దోపుకుంటూ అంది పంకజమ్మ.
            “దొంగ దొరికిందే దోచుకుంటాడట. అల్లుడు  దాచిందైనా దోచుకుంటాడ’ ని అని ఊరికే అన్నారా..! కాని మన శేఖర్ అలా కాదు.. ” అంటూ తల అడ్డంగా ఊపింది.
            నోరు తెరిస్తే చాలు.. సామెతలు ఉన్నా లేకున్నా మరీ పుట్టించి మాట్లాడటం పంకజమ్మ నైపుణ్యం. ఆమె వాక్చాతుర్యానికి ముగ్ధుడవుతూ చిరు నవ్వు నవ్వేడు పరంధామయ్య.
            టీ పాయ్‍పై వున్న ‘ఈనాడు’ న్యూస్ పేపర్ ను  మరో చేతిలోకి తీసుకుంటూ..
            “మరి నేనో..!” అన్నాడు కొంటెగా..
            తనూ తక్కువేమీ కాదు.. మరీ వీలుచిక్కించుకొని పరమేశ్వరమ్మను ఉడికించడంలో దిట్ట. వయసు షష్టి పూర్తికి దగ్గర పడినా వంకర మాటలు పంకజమ్మపై సంధించడంలో తనకుతానే సాటి..
            “అందుకేగా ముగ్గురమ్మాయిలను ప్రసాదించారు..” రెండు చేతులను వయ్యారంగా తిప్పుకుంటూ అంది పంకజమ్మ.. వెంటనే మూతి ముడ్చుకుంది.
            “ఇందులో నాతప్పేముందోయ్.. ప్రసాదిస్తేమాత్రం కని కూర్చోవాలాయేం..!”
            “అంటే..?” తీక్షణంగా చూస్తూ ముడిచిన మూతిని మూడు వంకర్లు తిప్పింది పంకజమ్మ. ముసి ముసి నవ్వులు నవ్వేడు పరంధామయ్య.
            ఇంతలో డోర్ బెల్ మ్రోగింది.
            “సరే.. సరే.. ఎవరో వస్తున్నారు..” ఆంటూ. తన చేతుల్లోని గ్లాసును, న్యూస్ పేపర్‍ను టీ పాయ్ మీద పెట్టి లేచి వెళ్ళి వీధి గుమ్మం తెరిచాడు.
            ఎదురుగా శేఖర్..
            “రా శేఖర్ నీకు నిండా నూరేళ్ళాయుస్సు. యిప్పుడే నీగురించి మీ అత్తమ్మ నేను మాట్లాడుకుంటున్నాం” ఆప్యాయంగా ఆహ్వానించాడు పరంధామయ్య.
            “అంతా కులాసాయేనా బాబూ..” అంటూ కుశలప్రశ్నలు కురిపించింది పంకజమ్మ.
            “అలా ప్రశ్నలు గుప్పించడమేనా.. కాఫీ గట్రా ఏమైనావుందా..” అంటూ పరంధామయ్య అడ్డుకున్నాడు. ‘అల్లునికేమో గాని ముందు ఈయన గారి నాలుక పిడుచకట్టుకు పోతుంది కామోసు..’ అని మనసులో ఉడుక్కుంటూ వంటిట్లోకి వెళ్ళింది పంకజమ్మ.
            కాఫీలు తాక్కుంటూ కబుర్లలో పడ్దారు. పంకజమ్మ కాఫీలు తెస్తూ చేసిన సైగలు గుర్తుకొచ్చాయి పరంధామయ్యకు. మెల్లిగా విషయం కదిలించాడు.
            “బాబూ శేఖర్.. మాయింటికి పెద్ద దిక్కువు.. ఇన్నాళ్ళూ సాయం చేస్తూ వస్తూనే వున్నావు. నీ సాయమే లేకుంటే ఇద్దరమ్మాయిల పెళ్ళిళ్ళు చేయగలిగే వాళ్ళమా?.. ఇక యీ చివరి అమ్మాయి కళ్యాణి పెళ్ళికి కూడా సాయం చేసి పుణ్యం కట్టుకో.. చచ్చి నీ కడుపున పుడుతాం..” అంటుంటే పరంధామయ్య కళ్ళళ్ళో సన్నగా నీళ్ళు తిరిగాయి. పంకజమ్మ తన కుచ్చిళ్ళలో దోపుకున్న కడకొంగును తీసుకుని కళ్ళు ఒత్తుకుంది.
            “ఈమాత్రం సహాయానికే అంతంత పెద్ద మాటలు ఎందుకు మామయ్య. ఆ మాత్రం బాధ్యత నాకు లేదా.. మీరు నిశ్చింతగా వుండండి. ఖర్చులన్నీ నేను చూసుకుంటాను. ఎలాగూ కరుణాకర్ కట్నం తీసుకోవట్లేదు.. పెళ్ళైనా ఘనంగా మన తాహతుకు తగ్గట్టు జరిపిద్దాం. మీరే చూస్తారుగా.. లేకుంటే మీ మిగతా కూతుర్లు ఊరుకుంటారా. నన్ను  ఆడిపోసుకొరూ..!” అంటూ శేఖర్ పరంధామయ్య చేతులు కలిపాడు. పరంధామయ్య కన్నీటి పొరల్లో శ్రీకృష్ణపరమాత్ముడు అభయమిస్తున్నట్లుగా గోచరించాడు తన అల్లుడు.
            పరంధామయ్య రివెన్యూ డిపార్టు మెంటులో గుమస్తాగా రిటైరయ్యారు. వారికి ముగ్గురూ అమ్మాయిలు. పెద్దగా ఆస్తిపాస్తులు యేమీ లేవు.. తన పూర్వీకుల నుండి సంక్రమించిన ఒక ఇల్లు తప్ప. తగిన తాహతు లేక అమ్మాయిలకు పెద్ద పెద్ద సంబంధాలకై పాకులాడ లేదు. ఉన్నంతలో సర్దుకోవాలనుకునే రకం. అయినా ఆడపిల్లల పెళ్ళిళ్ళు అంటే మాటలు కాదు. ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టినా ఉద్యోగ విరమణ తాలూకు డబ్బు పెద్దమ్మాయి పెళ్ళికే సరి పోయింది.
            ‘‘ఉన్న డబ్బు ఒక్క అమ్మాయి పెళ్ళికే ఊడ్చుకు పోతే ఎలాగండీ’’ అంటూ నెత్తీ నోరు మొత్తుకుంది పంకజమ్మ.
            ‘‘నా రెక్కలు యింకా ఉడిగి పోలేదోయ్..! అదృష్టం కలిసి రావాలే గాని  మిగిలిన ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు చేయకపోను’’ అనే వాడు పరంధామయ్య.
            అన్నట్లుగానే అదృష్టం తలుపు తట్టింది..
            పరంధామయ్య బట్టల కొట్టులో గుమస్తాగా చేరే అవకాశం కల్గింది. అంతకు మించి పెద్దమ్మాయి భర్త శేఖర్ అన్నింటికీ తానై ఇంటికి పెద్ద కొడుకులా వారి కష్ట సుఖాలలో పాలు పంచుకోవడం తమ భాగ్యంగా తలుస్తున్నారు.
            శేఖర్ తనింట్లో ఒక్కగానొక్క సంతానం. తన తండ్రి గారి నుండి అపాదించిన వ్యాపారంతో రెండు కుటుంబాలకు చేదోడు వాదోడుగా వుంటున్నాడు.
            రెండవ అల్లుడు సునిల్..
అది శేఖర్ చూసిన సంబంధమే..
            పరంధామయ్య రిటైరైన డిపార్టుమెంటును దృష్టిలో పెట్టుకుని కట్నంపై కన్నేసాడు సునిల్.  తాహతుకు మించి అడుగుతున్నారని సంబంధం వదులు కుందామనుకున్నాడు పరంధామయ్య.
            సునిల్ ఎడ్యుకేషన్ డిపార్టు మెంటులో జూనియర్ అసిస్టెంట్. పైగా ప్రభుత్వ ఉద్యోగి.. సంబంధం వదులుకోవద్దని పంకజమ్మ కన్నీరు పెట్టుకుంది.
            ‘‘నన్నైనా సుఖంగా బతుక నివ్వండి నాన్నా.. ’’ అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది రెండవ కూతురు.
            ‘‘తాకట్టే కదా మామయ్యా.. అమ్మటం లేదుగా.. మీరేమీ విచారించొద్దు. త్వరలో తాకట్టు నుండీ విడిపిస్తా’’ నంటూ అభయమిచ్చాడు శేఖర్..
             పరంధామయ్యకు తన రెండవ కూతురు పెళ్ళి కోసం యింటిని తాకట్టు పెట్టక తప్పలేదు.
            ఆ ఇంటిపై అధిక మొత్తం రుణం వచ్చేలా ప్రయత్నించాడు శేఖర్. రెండవ అమ్మాయి పెళ్ళి ఖర్చులన్నీ శేఖర్ ముందుండి చూసు కున్నాడు.
            పెళ్లయ్యాక గాని సునిల్ గుణం బయట పడలేదు. అతడు పూర్తిగా లెక్కల మనిషి. ‘ముట్టుకుంటే మీద పడుతుంది.. అంటుకుంటే అతుక్కు పోతుంది’ అని అనుకునే రకం. ఎదుటి వ్యక్తితో మనకెంత లాభం? అనే గణాంక వివరాలు సేకరించేదాకా చేయి విదిలించని గుణ కోవిదుడు. అయినా ఒక మనిషి పై మెరుగులు కనబడతాయే తప్ప మనసు లోతును అంచనా వేయటం ఎవరి తరమూ కాదని సరి పెట్టుకున్నాడు పరంధామయ్య.
            దాంతో అన్నింటికీ ముందు పడి నడిచే శేఖర్ అంటే వల్ల మానిన అభిమానం ఏర్పడింది పరంధామయ్య కుటుంబానికి.
            “మీరేమీ అనుకోనంటే చిన్న మాట మామయ్య..” శేఖర్ సందేహిస్తూ అన్నాడు.
            ధ్యాతవ్యములో పడ్డ పరంధామయ్య శేఖర్ మాటలతో తెప్పరిల్లాడు. చెప్పుమన్నట్లుగా తలాడించాడు. పంకజమ్మ మదిలో అలజడి ఆరంభమయ్యింది.
            “ఏం లేదు మామయ్యా.. ఇల్లు మీ పేరన వుంది.. ఇప్పటికే అది కాస్త అప్పు మింగి కూర్చుంది. అప్పుల వాళ్ళు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నట్లు మీ పెద్దకూతురు నా చెవిలో కోడై కూస్తోంది. చిన్నమ్మాయి పెళ్ళి పెట్టుకున్నామని తెలిస్తే అప్పుల వాళ్ళు మీ మీద పడక మానరు. మీ ఇంటిని  కొట్టేయడానికి ఇదే మంచి సమయమని ఒత్తిడి తెస్తారు. ఆ బెడద నుండి తప్పుకునే ఉపాయం చెబుతాను...” అంటూ మిగిలిన కాఫీని ఒక్క బుక్కలో పట్టించి ఖాళీ కప్పును టీ పాయ్‌మీద పెట్టాడు.
            పరంధామయ్య దంపతుల మనసుల్లో ఆందోళన ఆరంభమయ్యింది. అప్పుల వాళ్ళ బెడద కంటే ముందే  తమకున్న యీ ఒక్క నీడను అమ్మేద్దామని సలహా యిస్తాడేమోనని బిక్కు బిక్కు మంటూ శేఖర్‍వంక చూడసాగారు.
            ఆ ఇల్లంటే వారికి పంచప్రాణాలు. అది తమ పెళ్ళిని ఆశీర్వదించింది. అందులో తమ ముగ్గురు పిల్లలు జీవం పోసుకున్నారు. వారి చివరి క్షణాలు అందులోనే గడపాలని కలలుగంటున్నారు.
            “మీ ఆందోళనను అర్థం చేసుకోగలను మామయ్యా.. అందుకే ఈ సలహా ఇస్తున్నాను మీకు అంగీకారమైతేనే. నిర్ణయం మీ చేతుల్లో వుంది. అయినా నా నుండి  నా చేతనైనంత సహాయం మీకెల్లప్పుడూ వుండనే వుంటుంది.. ”
            శేఖర్ సాంత్వనపు మాట్లతో వారి హృదయాలు కరిగి పొయాయి. సలహా ఏమిటో చెప్పమన్నట్లు శేఖర్ వంక దీనంగా చూసారు.
            “మరేమీ లేదు మామయ్యా.. పెద్ద సమస్యా కాదు. నేను ఇంటిపై వున్న రుణాన్ని కట్టి తాకట్టు నుండి విడిపిస్తాను. తరువాత మీరు ఇంటిపై నాకు సర్వముక్త్యారునామా (జి.పి.ఏ.) ఇవ్వండి. దాంతో అప్పుల వాళ్ళు తేలు కుట్టినట్లు మిన్నకుంటారు. మిగతా వ్యవహారమంతా నేను చూసుకుంటాను. కళ్యాణి పెళ్ళి విషయంలో మీరు నిశ్చింతగా వుండొచ్చు.. పెద్ద మరదలి పెళ్ళికంటే ఘనంగా జరిపిస్తాను.. ” అంటూ చిరునవ్వు నవ్వేడు.
            పరంధామయ్య దంపతుల హృదయాలు తేలిక పడ్డాయి. తమ ఇల్లు రుణ విముక్తి కావడమే గాకుండా అమ్మే ప్రసక్తే రాకపోవటం ఎంతగానో సంతోషించారు. స్వంత కొడుకు సైతం చేయలేని పని అల్లుడు చేస్తూ వరాల ఝల్లులు కురిపిస్తుంటే వారి రెండు చేతులు అప్రయత్నంగా చేరువయ్యా్యి. హృదయ పూర్వకంగా నమస్కరిం చారు.
            అల్లుని రెండు చేతులను తీసుకుని తన కళ్ళకు అద్దుకున్నాడు పరంధామయ్య. పంకజమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు దొర్లాయి.
            అనుకున్నట్లుగానే కళ్యాణి కళ్యాణం ఊహించని రీతిలో వైభవంగా జరిగింది.
            చూస్తూండగానే ఏడాది గడిచి పోయింది..
***
            పరంధామయ్య దంపతులు  తమ చిన్న కూతురు కల్యాణి  వివాహ వేడుకల ఊహల్లో  యింకా తేలిపోతూనే వున్నారు..
            వారి ఊహలకు కళ్ళెం వేస్తూ వీధి గుమ్మం తెరుచుకుంది.
            ఎదురుగా కళ్యాణి..  నిర్ఘాంతపోయింది పంకజమ్మ. ఆమె గుండె గుభేలు మంది. ఇలా కళ్యాణి చెప్పాపెట్టకుండా పెట్టె పట్టుకుని  రావటం విస్తు పోయింది. వెనకాలే చిన్న అల్లుడు కరుణాకర్.. అతడిని చూడగానే పంకజమ్మ మనసు కాస్తా కుదుట పడింది.. కాని పరంధామయ్య ఇంకా పరధ్యానంలోనే వున్నాడు. మరో ప్రక్క శంకతో మనసు పీకుతోంది..
            వారి ముఖ కవళికలు చదువుతున్న కళ్యాణి, కరుణాకర్‍ల ముఖాలలో ముసి, ముసి నవ్వులు పూసాయి. పరంధామయ్య, పంకజంలు మరింత ఆందోళనకు గురయ్యారు.
            “గుడ్ న్యూస్.. అమ్మా.. నువ్వు మరోసారి అమ్మమ్మవు కాబోతున్నావు..” అంటూ కిల, కిలా నవ్వింది కళ్యాణి.
            “మిమ్మల్ని సర్ ప్రైజ్ చేద్దామంది కళ్యాణి.. ” అన్నాడు కరుణాకర్.
            “నా తల్లే..!” అంటూ కళ్యాణి తల నిమిరి మెటికలు విరిచింది. “పెంకి ఘటం.. ఇంకా చిన్న పిల్ల చేష్టలు పోలేదు..” పంకజమ్మ కళ్యాణి నవ్వులో శృతి కలిపుతూ తన హృదయానికి హత్తు కుంది. పరంధామయ్య కరుణాకర్ భుజం తట్టాడు.. తనను తాతయ్య డిగ్రీలలో మరో డిగ్రీ చేరుతున్నందుకు కృతజ్ఞతాభినందనలతో..
            వాతావరణం కానరాని పుష్పాల సుగంధాలు విస్తరించి ఆహ్లాదకరమయ్యింది.
            కళ్యాణిని, కరుణాకరాన్ని “స్నానాలు చేద్దురు గాని రండి” అంటూ యిట్లోకి దారి తీసింది పంకజమ్మ.
            ఇంతలో పెద్ద అల్లుడు శేఖర్ కూడా రావటం పరంధామయ్య మనసు మరింత విచ్చుకుంది.
            “రా.. బాబూ..” అంటూ శేఖర్‍ను ఆత్మీయంగా అహ్వానించాడు.
            ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.
            “చాలా మంచి సమయంలో వచ్చావు శేఖర్. మన కళ్యాణి. కరుణాకర్‍లు ఇప్పుడే వచ్చారు. నేను మళ్ళీ తాతను కాబోతున్నాను.  నా ఇద్దరు పిల్లలు ఈ ఇంట్లోనే పురుడు పోసుకున్నారు. ఇప్పుడు కళ్యాణి కూడా.. నాకు చాలా సంతోషంగా వుంది. నా కంటే ఎక్కువ మీ అత్తయ్య సంతోషిస్తుంది.. ” అంటూ పంకజమ్మను పిలిచాడు కాఫీ తెమ్మంటూ.
            ‘వినవచ్చిందో..! లేదో..!!’ అని మనసులో అనుకుంటూ లేవబోయాడు.
            “కూర్చోండి మామయ్యా.. మీతో కాస్తా మాట్లాడాలి” అన్నాడు శేఖర్.
            పరంధామయ్య తిరిగి సర్దుకుని కూర్చుంటూ “నేనే ముందుగా నీతో ఒక మాట చెబుదామనుకుంటున్నా శేఖర్.. మన సంప్రదాయం ప్రకారం మొదటి పురుడు ఖర్చు పుట్టింటి వారు పెట్టుకోవాల్సిందే.. నీకు తెలియంది కాదు. దానికి యింకా సమయమున్నా ముందు చెబితే నీకు కూడా కాస్తా వెసులు బాటుగా వుంటుందని..” అంటుండగా మాట మధ్యలోనే కట్ చేసాడు శేఖర్.
            “నాకు ముందుగానే తెలుసు మామయ్యా. కళ్యాణి, కరుణాకర్ నాకు బస్ స్టేషన్ లోనే కలిసారు. విషయం తెలిసింది. ఇదే తగిన సమయమని డబ్బు పట్టుకొని మీ వద్దకు బయలు దేరాను” అంటూ చిరునవ్వు నవ్వేడు. పంకజమ్మ కాఫీ తెచ్చి శేఖర్‍కిచ్చింది. శేఖర్ ఏదో చెప్ప బోతున్నాడని గ్రహించి ఆగి పోయింది.
            ‘మా మనసెరిగిన అల్లుడు. కన్నీళ్ళతో కాళ్ళుకడిగినా రుణం తీరదు..’ అని మనసులో కృతజ్ఞతలు తెలుపుకో సాగాడు పరంధామయ్య.
            “మామయ్యా.. మీ ఇంటి అప్పు దాని వడ్డీ.. పెళ్ళిళ్ళు తదితర ఖర్చులు.. లెక్కా డొక్కా.. నయా పైసలతో సహా ఈ డైరీలో రాసాను. తేదీలు గుర్తుంటాయో! లేదో ! అని..  సమయం సందర్భాలు కూడా రిమార్క్స్ కాలంలో మెన్షన్ చేసాను. మొత్తం ఖర్చులన్నీ పోను మిగతా డబ్బు.. ముప్పది వేల మూడు వందలు” అంటూ డబ్బు, డైరీ టీపాయ్‍మీద పెట్టాడు.
            విషయం అర్థం గాక పంకజమ్మ వైపు చూసాడు పరంధామయ్య.
            నాకు మాత్రం ఏం తెలుసు? అన్నట్లుగా ముఖం పెట్టింది పంకజమ్మ.
            శేఖర్ అర్థం చేసుకున్నాడు. విషయం విశదీకరిస్తే మంచిదన్నట్లు మళ్ళీ చెప్పసాగాడు.
            “మామయ్యా.. ఈ శుభసందర్భంలో చెప్పాలా వద్దా? అనుకున్నాను కాని సమయాభావంతో చెప్పక తప్పటం లేదు..  అవతల కొన్న పార్టీ వాళ్ళు మూణ్ణెల్ల మించి సమయమివ్వ లేదు. ఇంతలో మీరు మరో ఇల్లు కిరాయి కోసం వెదుక్కోవాలి కదా..” అంటూ కాఫీ తాగడం పూర్తి చేసాడు. పరంధామయ్యకు  గుండె ఆగిపోయినంత పనైంది. పంకజమ్మ బెంబేలు పడిపోయింది. శేఖర్ చెప్పుకుంటూ వెళ్తు్న్నాడు..
            “నేను మాత్రం ఎంత కాలమని ఆగను మామయ్యా.. నేనూ ఒక అయ్య వద్ద అప్పు తెచ్చి మీ ఇంటి అప్పు తీర్చాను. పెళ్ళిళ్ళ ఖర్చులు సర్దుకుంటూ వస్తున్నాను. అప్పుల వాల్లు నాముఖం చూసి ఇంత కాలం ఆగుతూ వచ్చారు. గత మాసం నుండి నాకూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అందుకే మీ ఇంటిని అమ్మేసాను. అసలు వడ్డీలు పోను ముప్పై వేల మూడు వందలు మిగిలాయి. అవి మీకు ఎంత త్వరగా యిస్తే అంత మంచిదని మీ పెద్ద కూతురు నన్ను నిద్ర పోనివ్వటం లేదు”
            ఆ మాట ఇలా చెవులకు సోకిందో లేదో..
అలా కుప్పలా కూలి పోయింది పంకజమ్మ..
            పరంధామయ్యశ్వాస ఆగి పోయిందనిపిస్తోంది..
***
            “అమ్మా.. మన ఇల్లు ఎక్కడకూ పోలేదు..” అంటూ గట్టిగా అరిచింది కళ్యాణి పంకజమ్మ చెవిలో. ఆ శబ్దం పంకజమ్మ నవ నాడుల్లో ప్రవేశించింది. గుండెను దిటవు పర్చింది.
            “మామయ్యా.. మీ యిల్లు భద్రంగానే వుంది.. ” అంటూ కరుణాకర్ కళ్యాణి మాటలకు భరోసా పలికాడు.
            పరంధామయ్య గుండె మేల్కొంది.  పంకజమ్మ నెమ్మదిగా తేరుకుంటూ కరుణాకర్ వంక దిగాలుగా చూడ సాగింది..
            “అవును అత్తయ్యా.. మీ ఇల్లు ఎక్కడికీ పోలేదు..” రెండు చేతులను అర్థవంతంగా తిప్పుతూ అన్నాడు  కరుణాకర్.
            పరంధామయ్యకు నమ్మశక్యంగాలేదు. నోట మాట రావటం లేదు. చిన్న అల్లుని వంక బిక్కముగంతో  చూడ సాగాడు.
            పరంధామయ్య మది నెమ్మదించేలా.. “నిజమే మామయ్య.. మీలాంటి ఉత్తముడి ఇల్లు అమ్ముతుంటే చూస్తూ ఊరకుంటానా?.. ‘’ అన్నాడు కరుణాకర్. “ మీరు రివెన్యూ డిపార్టుమెంటులో పని చేసినప్పటికీ అవినీతికి ఆమడ దూరంలో వున్నారు. అదే మీ స్థానంలో మరెవరైనా వుంటే ఈ ఇంటికి బంగారు పూతలు పూసేవారు.  మీరు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసారు. మీకు ఎంత మంచి పేరుందో తెలియంది కాదు.. అది ఈ ఇంటి మహత్తు. ఇలాంటి ఇంట్లో నుండి నాకు కళ్యాణి భార్యగా లభించడం నా అదృష్టం” అంటూ పరంధామయ్యకు కృతజ్ఞతాంజలి ఘటించాడు. శూన్యం లోనికి చూస్తూ పరంధామయ్య ప్రతి నమస్కారం చేసాడు.
            “నేను మీ ఇంటి పరిస్థితులు గమనిస్తూనే వున్నాను. మా పెళ్ళికి వృధా ఖర్చులు పెట్టొద్దని కళ్యాణికి ఎంతగానో చెప్పి చూసాను. ‘ఎలాగూ కట్నం కానుకలు తీసుకోవట్లేదు.. పెళ్ళైనా ఘనంగా జరిపిద్దామంటున్నాడు నాన్న’ అంది. నాకు అలా పెళ్ళిళ్ళకు ఖర్చు చేయటం నాకిష్టముండదు.. నామాటలు మీరెవరూ వినిపించుకోలేదు. ఇంట్లో చివరి పెళ్ళి కదా..! అని సరిపెట్టుకున్నారు.
            శేఖరన్నయ్య ఎంతైనా బ్యుజినెస్ మన్...  అతడిపై మీరు వుంచిన నమ్మకాన్ని సొమ్ము చేసుకున్నాడు. అతడి వడ్డీ వ్యాపార బుద్ధి మీపై రుద్దాడు. యీ ప్రాంతంలో సెంటు స్థలం దొరకడం ఎంత కష్టమో తెలియంది కాదు. అలాంటిది ఒక యిల్లు నామ మాత్రపు ధరలో విక్రయించి అన్నయ్య స్వాధీనం చేసుకోవాలను కున్నాడు. అతడి కదలికలన్నీ నేనొక కంట కనిబెడ్తూనే వున్నాను. నా అనుమానం నిజమయ్యింది..
            అతడి పథకం ప్రకారం సునిల్‍తో అధిక కట్నం అడిగించి ఈ ఇంటిని తాకట్టు పెట్టుకునే పరిస్థితికి తీసుకు వచ్చిందీ.. అధిక రుణ మొత్తం ఇచ్చిందీ తనే. అధిక మొత్తమైతే మీరు తిరిగి చెల్లించలేరని అన్నయ్య ధీమా. ఇదంతా బినామీ పేర వ్యవహారం నడిపించాడు. మీకు తెలియకుండా అదే బినామీ పేర మీ ఇంటిని  బేరం పెట్టాడు.
            నేనూ, కళ్యాణి ఎత్తుకు పై ఎత్తు వేసాం.  అన్నయ్యకు తెలియ కుండా అదే బినామీతో నాటకమాడించి ఈ ఇల్లు అత్తమ్మ పేరున కొన్నాం..” అంటూ కరుణాకర్ చెబ్తుంటే..
            ‘నిజమే’ అన్నట్లు కళ్యాణి కన్నులు మాట్లాడసాగాయి.
***

No comments:

Post a Comment

Pages