అనుగ్రహం లేదని ఎలా అనుకుంటారు?
- వేదవ్యాస్ చింతలపాటి
నిత్యజీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. కొన్నిసార్లైతే అసలు పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా మారిపోయినట్టు అనిపిస్తుంది, ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది. పనులు ముందుకు జరగవు. ఏం జరుగుతోందో అర్దం కాదు. నాస్తికుల సంగతేమోగానీ, ఆస్తికులు మాత్రం దీన్ని భగవంతునిపైకి నెట్టేస్తారు. దైవానుగ్రహం లేదని, ఎన్ని చేసినా దైవం కరుణించడంలేదని నింద చేస్తారు. ఇటువంటి పరిస్థితిని అర్దం చేసుకునేందుకు భగవాన్ రమణులు చక్కని కధ చెప్పారు.
ఈ సంఘటన ఛాగన్‌లాల్ వి.యోగి గారు భగవాన్ సన్నిధిలో చూసి పొందుపరిచారు.
రోజులో చాలా సమయం రమణులు కీటికి ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చుండేవారు. మధ్యమధ్యలో ఉడతలు వచ్చి ఆయన చుట్టూ పరిగెడుతూ ఉండేవి. భగవాన్ కూడా వాటిని తమ చేతుల్లోకి ప్రేమగా తీసుకుని జీడిపప్పులు, ఇతర తినుబంఢరాలు పెడుతుండేవారు.
ఒకరోజు రమణులు ఉడతలకు ఆహారం పెట్టడం చూసిన ముస్లిం భక్తుడు, వారికి ఒక కాగితం మీద ఇలా రాసిచ్చాడు. ' ఆ ఉడతలు ఎంతో అదృష్టం కలిగినవి ఎందుకంటే మీ చేతులతో వాటిని తినిపిస్తున్నారు. వాటిపై మీ అనుగ్రహం ఎంతగానో ఉంది. మేము వాటిని చూసి ఈర్ష్య చెందడమే కాక, మేమెందుకు ఉడతలుగా పుట్టలేదా అని బాధపడుతున్నాము. అలా పుట్టి ఉంటే మాకు ఎంతో మేలు కలిగేది కదా'.
ఇది చదవగానే భగవాన్ నవ్వాపుకోలేకపోయారు. నీ యందు అనుగ్రహం లేదని నీవెట్లా అనుకుంటున్నావు అని భక్తున్ని అడిగి, ఒక కధ చెప్పారు.
'ఒక దొంగ తాను ఆనాటి రాత్రి చేసి దోపిడి సఫలమవ్వాలని ఒకానొక ముని దర్శనానికి వెళ్ళి ఆశీర్వాదం పొందాడు. కానీ ఆ దోపిడి విఫలమైంది. దాంతో కోపానికి లోనై ఆ ముని కపట ఆశీర్వాదాలిచ్చాడని ఆయన వద్దకు వెళ్ళాడు. అప్పుడా ముని 'చెడ్డపనిలో విఫలమవడమంటే ఆశీస్సులు ఫలించినట్లే. కడుపు నింపుకొనుటకు అనేక ధర్మమార్గాలున్నాయి. వాటిలో ఏదో ఒకదాన్ని నువ్వు ఎంచుకో. ఈ ధర్మమార్గం నువ్వెంచుకోవాలంటే చోరవృత్తిలో అపజయం పొందడం అత్యవసరం' అని ఉపదేశం చేస్తారు. ఆ దొంగ విషయాన్ని గ్రహించి, తప్పు ఎరిగి నిజాయతీగా, ధార్మికునిగా మారుతాడు'.
ఇది చెప్పిన భగవాన్ ఆ భక్తున్ని, 'అన్నీ నీవు అనుకన్నట్లు జరిగితేనే, మునీశ్వరుని యొక్క అనుగ్రహం లభించిందని భావిస్తున్నావా?' అని అడిగారు.
నాకు అర్దం కాలేదని జవాబిచ్చాడు భక్తుడు.
అప్పుడు భగవాన్ సవివరంగా 'గురువు అనుగ్రహం జీవితంలో మాలిన్యాలను తొలగించి శుద్ధి చేస్తుంది. ఆశీర్వాదం మాలిన్యాలను, కల్మషాలను పెంచదు. పరిమితమైన అవగాహన ఉన్నవాడు తన కోరికలు నెరవేర్చుకొనుటకు ఆశీర్వాదాలు అడుగుతాడు. కానీ ఒకవేళ ఆ కోరికలు నెరవేరడం వలన సాధకుడు శుద్ధుడవ్వక, మరింత దిగజారిపోతాడనుకుంటే, గురువుల అనుగ్రహం అతడి కోరికలు నెరవేరకుండా అడ్డుపడుతుంది. ఈ విధంగా సాధకుడు మరింత దిగజారకుండా రక్షింపబడతాడు. మరి ఈ సందర్భంలో సాధువుల ఆశీస్సులు కరుణాపూర్ణ వరాలు కావా?' అని భోధ చేస్తారు.
అది అర్దం చేసుకుని సంతృప్తి చెందాడా ముస్లిం భక్తుడు.
నిజానికి రమణులు వంటి మహాపురుషులు, గురువుల గురించి వినడం, వారి దర్శనాన్ని పొందడం, వారి చెంత కూర్చోవడం, వారి దృష్టి తమపై ప్రసరించడం, వారితో మాట్లాడటం, సనాతనధర్మంలో, భారతదేశంలో పుట్టడం అనుగ్రహం కాకపోతే ఇంకేంటి?
ఈ కధ నిత్య జీవితంలో ఎంతో స్వాంతనను ఇస్తుంది. మీరునుకున్నది జరగడం లేదంటే ఈశ్వర సంకల్పం నేరవేరుతోందని అర్దం. మలినమైన బుద్ధి కల మన మనసుకు ఏది మంచో, ఏది చెడో తెలియదు. అటువంటిది అహంకారానికి పోయి, నేనుకున్నది జరగలేదు కాబట్టి ఈశ్వరుడు కఠినాత్ముడు, కౄరుడు అనుకోవడం కంటే గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఫలితాల మీద ఆసక్తి లేకుండా మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం మానకూడదు. ప్రయత్నాలు విఫలమవడానికి అనేక కారణాలుండవచ్చు. అందులో ప్రారబ్దం కూడా ఒక కారణం కావచ్చు. ఏది ప్రారబ్దమో, ఏదీ పురుషార్ధమో గ్రహించడం అంత సులువు కాదు.
కనుక ఓటములు ఎదురైనా నిరుత్సాహపడక, ఎవరి ప్రయత్నాలను వారు అహంకార రహితంగా సాగిస్తూనే ఉండాలి. 'అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంది. కావల్సిందల్లా దానికి శరణాగతి చేయడమే' అన్న రమణుల వచనాన్ని సదా గుర్తుంచుకోవాలి.
చైత్ర బహుళ త్రయోదశి భగవాన్ రమణ మహర్షి అరుణాచలేశ్వరునిలో ఐక్యమైన రోజు.
***
No comments:
Post a Comment