అతను...
పారనంది శాంత కుమారి
చిత్రాన్ని విగ్రహాన్ని దేవుడన్నావు
మనోనిగ్రహమే దేవుడని అతను గుర్తు చేశాడు.
పుస్తకాన్ని మస్తాకాన్ని దేవుడన్నావు
సమస్తమూ దేవుడే అని అతను గుర్తు చేశాడు.
జ్ఞాపకాన్ని వ్యాపకాన్ని దేవుడన్నావు
వ్యవహారాలన్నీ దేవుడే అని అతడు గుర్తు చేశాడు.
భక్తిని జ్ఞానాన్ని దేవుడన్నావు
విశ్వాసమే దైవమని అతను గుర్తు చేశాడు.
తెలిసిన దాన్ని తెలియని దాన్ని దేవుడన్నావు
జిజ్ఞాసే దైవమని అతను గుర్తు చేశాడు.
భయాన్ని,ఆచారాలను దేవుడన్నావు
నిర్భయం,విచారమే దైవమని అతను గుర్తు చేశాడు.
కాంతిని,శాంతిని దేవుడన్నావు
అతను మౌనంగా తల ఊపాడు.
మౌనాన్ని,ధ్యానాన్ని దేవుడన్నావు
అతను కాదనలేదు.
గుడిని,అమ్మ ఒడిని దేవుడన్నావు
అతడు సంతృప్తిగా నవ్వేడు.
సృష్టిని,చూసే దృష్టిని దేవుడన్నావు
ప్రయత్నించు,ఫలితం లభిస్తుంది అన్నాడు.
నిన్ను నన్ను దేవుడన్నావు.
లోన,బయట దేవుడన్నావు.
అది అంత సులభం కాదని అతను అన్నాడు.
గురువే దైవమని అన్నావు,
అతను వాచకాలతో కాదు
అనుభవంతో తెలుసుకో అని అన్నాడు.
***
No comments:
Post a Comment