అమృత గుళికలు – ‘బారసాల’ కధలు
(వి.వి.ఎల్.ఎస్. మూర్తి గారి ‘బారసాల’ కధాసంపుటి పరిచయం )
భావరాజు పద్మిని
మన జీవితంలో కధ ఎక్కడ మొదలవుతుంది? గోరుముద్దలు తినిపిస్తూ, చందమామను చూపిస్తూ అమ్మ చెప్పే పిట్ట కధలతో మొదలవుతుంది. అలా మొదలైన కధ, వింటూ ఊహించుకోవడం, చదువుతూ ఊహించుకోవడం ద్వారా ఊహాలోకంగా మన మనస్సులో రెక్కలు విప్పుకుంటుంది. అనేక నీతి కధలు, సామెతలు, జాతీయాలు, లోకజ్ఞానం మనకు చిన్నప్పుడు ఈ కధల ద్వారా అందేది. అయితే... ప్రవాహినీ జీవనం, అన్నట్లు... నదిలో ఒక సమయంలో ఉన్న నీరు మరొక సమయంలో ఉండనట్లు ,జీవితం అనుక్షణం మారిపోతూనే ఉంటుంది కదా ! అందుకే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కాలం మారింది, జీవనశైలి మారింది, కధా మారింది.
ఇప్పుడంతా “ఇన్స్టంట్” యుగం. అన్నీ “రెడీ టు ఈట్ “ లాగా, వెనువెంటనే కావాలి. త్వరగా వండెయ్యాలి, తినెయ్యాలి, జీర్ణమయిపోవాలి. కాలంతో మనిషి పరుగులు తీస్తున్న ఈ తరుణంలో ఎవరికీ సమయం లేదు. అందుకే చెప్పదల్చుకున్నది టీవీ సీరియల్ లాగా సాగదీసి చెప్పకుండా, అందంగా, క్లుప్తంగా చెప్పాలి. చదువరుల మనసుకు హత్తుకు పోయేలా చెప్పాలి. పది కాలాలు నిలిచిపోయేలా చెప్పాలి. అలా చెప్పేందుకు గొప్ప నైపుణ్యం ఉండాలి. ‘సంక్షిప్త కధలు’ అనే ప్రక్రియలో శ్రీనివాస మూర్తి గారు, తన రచనా పటిమతో ఒక “ట్రెండ్” ను సృష్టించారని, ఈ కధలు చదివిన వారు ఎవరికైనా తెలుస్తుంది.
‘సమాజానికి హితాన్ని కూర్చేదే’ సాహిత్యం. సమాజాన్ని ప్రతిబింబించని, సమాజానికి ఉపయోగపడేలా సందేశం ఇవ్వని సాహిత్యం వృధా అని రావిశాస్త్రి గారి వంటి కవులు తెలిపారు. అందుకే మారుతున్న జీవన స్థితిగతులను తన కధల్లో అద్భుతంగా ఆవిష్కరించారు మూర్తి గారు. సాధారణంగా రచయతలు ఒకే దృష్టికోణం నుంచి పరిశీలిస్తూ రచనలు చేస్తారు. అందుకే అవి మూస పోసినట్లు ఉంటాయి. కాని, ఇందులోని కధలు మనం పరిశీలిస్తే, రచయతకు ఉన్న విశాలమైన దృక్పధం, నిశిత పరిశీలనా శక్తి, కధల్లో వారు చూపిన వైవిధ్యం ద్వారా తెలుస్తుంది.
“ఊరికి మేలు చేసిన వాడే నిజమైన నాయకుడని, ఆ పేరునే అంతా గుండెల్లో పెట్టుకుంటారని, తమ పిల్లలకు పెట్టుకుని, పిల్చుకుని, కలకాలం గుర్తు పెట్టుకుంటారని చాటి చెప్పేలా’ రాసిన కధ “బారసాల” తో ఈ కధలు మొదలవుతాయి. తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ‘సరోగసి’ ద్వారా త్యాగం చేసి, మరొకరికి అమ్మ అయ్యే అవకాశాన్ని కల్పించిన ధీరురాలైన అమ్మాయి కధే, ధరణి. కనీసం చెప్పులు కొనుక్కునే తాహతు లేని తండ్రీకొడుకుల బాధను, ‘ఉపాయం ఉంటే’ అన్న రీతిలో ఆశావహ దృక్పధంతో చూపిన కధ – కొత్త చెప్పులు. ఆ చేదునిజం తెలిసి, భార్య బాధపడకూడదని, అబద్ధంతో ఆమెను మాయచేస్తున్న భర్త హృద్యమైన కధ – మానసవీణ. పుస్తక ప్రియుడైన వ్యక్తి, తప్పనిసరై అవన్నీ ఇచ్చేయ్యాల్సి వస్తే పడే వేదనను ఆవిష్కరించిన కధ – ఆత్మ లేని తనువు. సూపర్ మార్కెట్లు వచ్చి, కిరాణా కొట్లను మింగేస్తే, ఆ చిరు వ్యాపారి పడే ఆవేదనను అక్షరాల్లో చూపిన కధ – ఈ పయనం ఎందాకో. ఇలా చెప్పుకుంటూ పొతే, ప్రతి కధా కళ్ళముందు వాస్తవిక స్థితిగతులను, నిండు జీవితాలను, మనుషుల మనస్తత్వాలను ఆవిష్కరిస్తుంది. తొలి ప్రయత్నమైనా, రచయత చూపించిన వైవిధ్యం, రచనా శైలి నిజంగా ప్రశంసనీయం. చేదు మాత్రలకు తీపి పూత వేసి, చదువరులకు అర్ధంకాని భాషలో కాకుండా, సూటిగా అమృత గుళికల వంటి కధలను అందించడంలో రచయత కృతకృత్యులు అయ్యారు. చక్కటి ఈ కధల సంపుటి వెల కేవలం వంద రూపాయిలు. కొనండి, చదవండి, చదివించండి... పుస్తకాన్ని బ్రతికించండి.
ప్రతులకు సంప్రదించండి...
VVLS Murty – Mob: 08800381864
No comments:
Post a Comment