మధ్యతరగతి మహనీయులకు వందనములు - అచ్చంగా తెలుగు

మధ్యతరగతి మహనీయులకు వందనములు

Share This

మధ్యతరగతి మహనీయులకు వందనములు

డా. వారణాసి రామబ్రహ్మం 

మధ్య తరగతి వారు మహనీయులు. భారీ ఫీజులు కట్టి చదువు "కొని", పిల్లలని విద్యాలయములలో "చదువుకొనడానికి" పంపిస్తారు. మరీ దారుణంగా ఆ స్కూళ్ళ యాజమాన్యము వారు నియంతల్లా వ్యవహరిస్తారు. జ్ఞానము అబ్బని, ఉద్యోగము గ్యారంటీ అస్సలు లేని ఇంతోటిచదువుకి తల్లిదండ్రులపై, పిల్లలపై ఎన్నో ఆంక్షలు. అజమాయిషీలు. మన పిల్లాడిని, మన పిల్లని మనతో ఊరు తీసికెళ్ళడానికి లీవ్ మంజూరు చేయడానికి సవాలక్ష ప్రశ్నలు. సవాలక్ష అడ్డులు.
ఒకరోజు రెండు రోజులకే చదువు పాడైపోతుందని నస. మనమేదో మహాపాపం చేస్తున్నట్టు పిల్లాడి/పిల్ల చదువు పట్ల మనకెంత మాత్రము శ్రద్ధ లేనట్టు వాళ్ళ భవిష్యత్తుతోమనం ఆటలాడుకుంటున్నట్టు మనని గిల్టీ ఫీల్ అయ్యేలా చెయ్యడం. మన ప్రతి చిన్న చితకా రిక్వెష్టుకి,అవసరానికీ ఇదే వరస. ఇదే పోజు. యాజమాన్యం ముందు మనం తలలు వంచుకుని చేతులు నలుపుకుంటూ నుంచునేలా చేస్తారు. గవర్నమెంటు స్కూళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.శాంతి.
మన పిల్లలని స్కూల్లో చేర్చామో. వెట్టి చాకిరీకి పంపించామో తెలియకుండా చేస్తున్నారు. విద్యాసంస్థలు నడుపుతున్నామంటూ అన్ని రాయితీలు పొందుతున్నారు. చేసేది ఫక్తు వ్యాపారము. పోజు మాత్రం సంఘసేవ చేస్తున్నట్టు. వైద్యమూ ఇలాగే తయారయింది. దాన్ని గురించి తరువాత.
మధ్య తరగతి వారి ప్రభుత్వ సంబంధ పనుల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. వాడు తీసుకునే ఆమ్యామ్యా తీసుకోకుండా ఎలాగూ పని చెయ్యడు. ఈ లోపల చుక్కలు చూపిస్తాడు. రెవెన్యూ, రిజిష్ట్రేషన్, టేక్స్ లాంటి డిపార్టమంట్లయితే ప్రతి పనికి మన ఒప్పుదల,అనుమతి ప్రసక్తులు లేకుండానే ఒక రేటుంటుంది. అన్నీ మూసుకుని ఆ రేట్ మౌనంగా చెల్లిస్తేనే అక్కడ పనులవుతాయి.
అక్కడ దళారులుంటారు. వాళ్ళ ద్వారా మాత్రమే మనం పనులు చేయించుకోవాలి, మనం తిన్నగా వెళితే పని అవదు సరి కదా, త్రిప్పట,ఆయాసము, ఖర్చు భరించాలి కూడా. ఈ మధ్య మనం చెల్లించీ, ప్రభుత్వానికి అందని సేల్స్, కమ్మర్షియల్ వంటి టేక్స్ ల జాబితాకి సర్వీస్ టేక్స్ కూడా చేరింది. మన దగ్గర ముక్కు పండి వసూలు చేస్తారు. ప్రభుత్వానికి కట్టరు. రిసీప్ట్ అడిగితే, "టేక్స్ మేము సంవత్సరం ఆఖరున టోకుగా కడతాము, అప్పుడు రండి" అంటారు. మనమూ మర్చిపోతాము. జ్ఞపకముంచుకొని వెళ్ళినా ఇంకేదో వంకలు చెబుతూ తిప్పుతారు,కాని రిసీప్ట్ ఇవ్వరు. ఎన్.జి.వోలు. ఇతర సామాజికులూ కంప్లైంట్ చేయాలి అని మనకు పౌర విధుల మీద లెక్చెర్లిస్తారు. ఈ గొడవ తప్ప ఫలితం శూన్యం.
డబ్బు ఖర్చు పెట్టేదీ మనమే, వీళ్ళందరి ముందూపూర్వకాలపు పాలేళ్ళలా నుంచోవలసందీ మనమే. మన ఆత్మగౌరవాన్ని ప్రతి క్షణం చంపుకుంటూ బ్రతక వలసినదీ మనమే.
మనం ఎంతటి వారమైనా, ఏమి తెలిసినా, ఇంటికి ఏదైనా పనిచేయించుకోవాలంటే, పనిచేసేవాళ్ళ ముందు ఏదీ పనికిరాదు. ఆ మేస్త్రీ చెప్పినట్టు వినాల్సందే. అతను సూచించిన విధముగా సరుకుకొనాల్సందే. వారు ఎలా పనిచేస్తే నోరు మూసుకుని భరిస్తూ అలా పనిచేయించుకోవాల్సిందే. గట్టిగా మాట్లాడితే, "అందుకే ఈ చిన్న పనులక ఒప్పకోం. ఒక్కొక్క దాంటో 40 ఫ్లాట్ లున్న ఆరు బిల్డింగులలో మాకు పని" ఇని వాడి గొప్పతనాన్ని చెబుతూ, మన ఆర్ధిక స్థితిని గేలి చేస్తూ ఒదురు మాట్లాడుతాడు. ఏదో చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటాంగాని అన్నేసిఫ్లాట్లున్న బిల్డింగులు వీళ్ళచేత పని చేయించుకోవడానికి మనం ఎక్కడ కట్టగలం?
మధ్య తరగతి వారు. రాజసము, ఆత్మాభిమానము, హుందా మరచిపోయి చాలా దశాబ్దాలు అయింది.
ఇంక ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవడం కోసం మన పడే పాట్లు పగవాడైనా పడద్దు.ఎంత ఫీజ్ అంటే అంతా సమర్పించికూడా వైద్యునితో సరిగా మాటలాడడానికే కుదరదు. వారికి సమయముండదు. మనలాంటి వారు వెనక క్యూలో వేచియుంటారు. రోజంతా పని చేయడానికై వారి శక్తిని వారు పరిమితంగా ఉపయోగించుకోవడానికా అన్నట్టు మనతో మనకు వినిపించీ వినిపించకుండా మాట్లాడతారు. విషయం తెలుసుకోవడానికి మళ్ళీ మనం కాంపౌడరునో, నర్సునో ఆశ్రయించాలి. తక్కువ జీతాలందుకోవడం వల్లనో పని ఒత్తిడి వల్ల అలిసిపోవడం వల్లో, మనమంటే అలుసువల్లో వాళ్ళ విసుగంతా మనమీద చూపిస్తారు. మం ఓపిక పట్టి, మన ఆభిజాత్యాన్ని పక్కకు నెట్టి విషయాన్ని రాబట్టుకోవాలి. అన్ని టెస్ట్లూ పలుమారు చేయించుకునీ, అవసరమైతే ఆపరేషనూ చేయించుకుని, ఎంతో డబ్బు ఖర్చుపెట్టుకునీ నోరు మెదపకుండా ఏమైనా, నయమైనా, అవకపోయినా, మరణమే సంభవించినా, మన ఖర్మ అని సరిపెట్టుకోవాలి.
(గవర్నమెంటు ఆస్పత్రులలో మధ్యతరగతి వారికి, ప్రవేశము, ప్రాధాన్యతా చాలా తక్కువ. వెల్ఫేర్ ఎకనామిక్స్లో మధ్యతరగతి వారికి ఎటువంటి ప్రాముఖ్యతా లేదు. ప్రాధాన్యతా, ప్రాముఖ్యతా లేనివారికి మాత్రమే. ఏమి లేనివారికో అర్థము కాదు. అలా ఏమీ లేని వారిని ఎందుకు దేశం నెత్తికెక్కించుకోవాలో తెలియదు. అలా లేనివారిని నెత్తినేసుకొని దేశం మొత్తం అలా నెత్తికెక్కించుకోవడం వల్ల కలుగుతున్న అనర్ధాలు, ఛిద్రాలు ఎందుకు భరించాలో ఏ ఆర్ధిక శాస్త్రవేత్తా చెప్పడు. మధ్యతరగతి వారు వారి చావు వారు చావాల్సందే. ఏ ఆర్ధిక శాస్త్రవేత్తా వీరిని గణించడు.(కేపిటలిజమ్, సోషలిజమ్, వెల్ఫేర్ ఎకనామిక్స్ లలో మధ్యతరగతివారికి చోటు లేదు.)
ఈ పై అన్నిచోట్లా ఎంతెంతో డబ్బు ఖర్చయ్యేదీ మనకే, అన్నీ మౌనంగా భరించి, పనులు అయ్యేలా చూచుకోవలసినదీ మనమే.
ఇంక రాజకీయనాయకుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత ప్రశాంతత. మన దగ్గర వాళ్ళు గెలవడానికి సరిపడ ఓట్లు లేవు కాబట్టి మనం చచ్చినా బ్రతికినా వాళ్ళకనవసరం. వాళ్ళ దృష్టి అంతా ఓట్లు భారీగాఉన్న పౌరుల మీద. వారిని రకరకాలుగా ప్రలోభపెట్టి, వారి ఓట్లు రాబట్టి ఎన్నికై పదవి, అధికారం పొంది అవినీతిపరులై దేశాన్ని దోచుకు తివడం రాజకీయనాయకుల political economics.
డబ్బులు నీళ్ళలా ఖరిచయ్యేది మధ్యతరగతి వారికే. ఎవరూ గౌరవము, ప్రాధాన్యతా ఈయని బ్రతుకులూమధ్య తరగతి వారివే. ఏ కులానికి,ప్రాంతానికి, మతానికి, మైనారిటీ వర్గానికీ చెందినా, నాస్తికులైనా, నిష్ఠాగరిష్ఠులైనా, మేధావులైనా, రేషనలిష్టులైనా ఇదే తీరు. వేదన. వ్యథ. అమర్యాద, అలుసు. మధ్యతరగతి వారి కష్టములు, నష్టములు అందరు భారతీయులకు ఒకటే. అదే బాధల, వ్యథల వర్తమానము. ఆందోళన కలిగించే, భయపెట్టే అంధకార భవిష్యత్తు..
 దీనికి తోడు ఉద్యోగాల్లేని, ఏ గర్ల్ ఫ్రెండూ పట్టించుకోని, కొడుకులు; పెళ్ళి అక్కర్లేదని ఉద్యోగం చేసుకుంటామని, స్వంత కాళ్ళపై నిలబడతామని, - ఉద్యోగాలు ఎవరికీ లేని ఈ గడ్డు రోజుల్లో - గారాలు పోయే కూతుళ్ళు. సినీహీరోల మత్తులో, ఫేషన్ జీవితాల మోజులో కలల బేహారులువారు. వారికి బాయ్ ఫ్రెండ్స్కి కొదవ మాత్రం లేదు. ప్రేమ వ్యవహారములూ యథాశక్తి నడుపుతూండే మన చిట్టి తల్లులను ఎలా మృగాలనుంచి కాపాడడం. మధ్యతరగతి వారి ఇడుములలో ఇది ఒక తీవ్ర సమస్య. ఇంక అమ్మాయి పెళ్ళి చెయ్యాలన్నా, ఓ గూడు అమర్చుకోవాలన్నా వారు పడే పాట్లు వర్ణనాతీతము.
ఇంక బాధ్యతారాహిత్ంగా ఉండి విచ్చల విడిగా తిరుగుతూ డబ్బు నీళ్ళలా ఖర్చు చేయడానికి డబ్బు కోసం సతాయించే కొడుకో, కూతురో ఉంటే అంతే. వయసు వేడిలో "ఇది వెన్నెల వేళ యని, ఇది మల్లెల మాసమనీ" తెలియని కూతుళ్ళు ముందే కూస్తే ఆ నరకం వేరే.
స్వంత పసికూనల ఆలనా పాలనా చూసుకోలేని యువతులైన తల్లులు; ముసలాళ్ళను సాకలేని, వారి సంరక్షణ చూడలేని కన్న బిడ్డలు.
ఇంతటి అస్తవ్యస్తాన్ని భరించలేక భరించే మధ్యతరగతి మహనీయులకు వందనములు. వీరి మీద, వీరి బాధల మీద బ్రతుకుతున్న,బ్రతుదామనుకుంటున్న నకిలీ స్వాములు, బాబాలు, అమ్మలు, ఇతర ఆకర్షకులు ఎంత దరిద్రులో కదా!!!???
ఇటువంటి సెకండరీ సిటిజన్ స్టేటస్ లో జీవిస్తూ, ఆత్మాభిమానము, ఆభిజాత్యము మరిచి ఏదో బ్రతుకును ఈడుస్తున్న మధ్యతరగతిమహనీయులకు వందనములు.

No comments:

Post a Comment

Pages