అన్నమయ్య పదం- పరమార్థం
దివ్వెలెత్తు పొద్దు
డా.తాడేపల్లి పతంజలి
సాయం సంధ్యా సమయానికి అన్నమయ్య పెట్టిన పేరు “దివ్వెలెత్తు పొద్దు.”దీపాలు పెట్టే సమయమని అర్థం . అలపొద్దు, దీపాలవేళ, సందెకాడ [కళింగ మాండలికం]పొద్దుమీకి, సందాల [తెలంగాణ మాండలికం]అన్బకార, ఎసుర్లయాల, పొద్దు, పొద్దూకు, పైటేల, మూసిడింతల, సందెకాడ, సాయంకాలం [రాయలసీమ మాండలికం] అను ప్రయోగాలు సంధ్యా కాలనికి సంబంధించి ఇదివరకటి రోజుల్లో ప్రజల నాలుకల మీదుండేవి.
విద్యుచ్ఛక్తి దీపాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో కార్తిక మాసం, దీపావళి – ఇలాంటి సందర్భాల్లోనే సంప్రదాయజ్ఞుల ఇళ్లలో సంధ్యా దీపాలు వెలుగుతున్నాయి. కొంతమంది నేటికీ విద్యుచ్చక్తితో సంబంధంలేకుండా దీపాలు వెలిగించే వారు లేకపోలేదు కాని తక్కువ.అన్నమయ్య దివ్వెలెత్తు పొద్దులోని కాంతులను తన కీర్తనలో చదివి పరవశిద్దాం.
పల్లవి: వచ్చినవారమిదివో వాకిటనె వున్నారము
నెచ్చెలి యెదురుచూచీ నీచిత్తమిఁకను
చ.1: నవ్వుల పండుగలాయ ననుపులెండుగలాయ
యివ్వల చెలితో పొందులిఁకనెన్నఁడు
రవ్వలాయ నీచేఁతలు రాజసమే నెరపఁగా
దివ్వెలెత్తుఁబొద్దులకు తిరమాయఁ బనులు
చ.2: మాటలివే విందులాయ మంతనాలే సందులాయ
యీటున కాంతతో మేలమిఁకనెన్నఁడు
మూటలాయ నేర్పులు మోచుకవున్నారమిదే
మేటిశింగారాల వేగీ మిగిలె చీఁకట్లు
చ.3: వీడెములే వొడినిండె వేడుకలు పంటవండె
యీడ వచ్చున్నది చెలియ యిఁకనెన్నఁడు
పాడితో శ్రీ వెంకటేశ పడఁతిఁ గూడితివిట్టె
యేడుమద్యాన్నములెక్కె యెట్టి రహస్యములో (రేకు: 0197-3సంపుటం: 07-575)
అర్థం
అన్నమయ్య ఒక చెలికత్తెగా మారి, వేంకటేశునితో మాట్లాడుతున్నాడు.
పల్లవి: అయ్యా ! వేంకటేశా !
నీకోసం వచ్చిన వాళ్లం ...వాకిటలో నీకోసం ఎదురుచూస్తున్నాం.
మాతో బాటు నీస్నేహితురాలు కూడా ఎదురుచూస్తోంది.
నీ చిత్తం.. ఎప్పుడు అవిడని కలుస్తావో !
చ.1: మీ మధ్య నవ్వుల పండుగలు అయిపోయాయి.ఎదురు చూసి చూసి అనురాగాలు (ననుపులు)ధాన్యాదులు ఎండబెట్టినట్లుగా ఎండిపోయాయి.(ఎండుగలాయ)
ఈ వైపుగా నాతో ఉన్న చెలితో నీపొందులు ఇక ఎప్పుడు?
రజోగుణము వల్ల పుట్టిన గర్వంతో నువ్వు చేసే చేష్టలు అల్లరవుతున్నాయి. అపకీర్తి పాలవుతున్నాయి.(రవ్వలాయ) . నువ్వది గమనిస్తున్నావా?
సంధ్యాకాలానికి “వ్యవహారాలు” చక్కబెడతావా? లేదా?
చ.2: వేంకటేశా ! ఇదివరలో నీ మాటలు విందులయ్యాయి. ఆనాటి రహస్య చర్చలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి.
కాంతతో వేళాకోల హాస్యాలు ఇక ఎంతకాలం? !
నీ నేర్పుల జ్ఞాపకాలు మూటలుగా మోచుకొని ఉన్నాం.
గొప్పవైన సింగారాలలో తపించి , మా జ్ఞాపకాల చీకట్లు మిగిలిపోయాయి.
చ.3: తాంబూలాలు ఒడిలో నిండిపోయాయి. .( పెళ్లి నిశ్చయమయిందని భావం) వేడుకలు సమృద్ధమయ్యాయి(పంటవండె)
నీ చెలి ఇక్కడకు వచ్చి ఉన్నది.
నీ సహజ స్వభావంతో (పాడితో) పడతితో కలిసావు.
ఏడు పట్టపగళ్లు గడిచిపోయాయి. తెమలని ఆ రహస్యాలేమిటయ్యా !
పరమార్థం
అన్నమయ్య నిరీక్షణతో, బాధతో కీర్తనని పూర్తి చేయడు.
రెండు చరణాలలో నిరీక్షణ గురించి కమ్మగా చెప్పాడు.
మూడో చరణంలో నాయిక నాయకుల కలయికను వర్ణించాడు.
తెమలని రహస్యాలేమిటని, దివ్వెలెత్తు పొద్దు దీపాల కాంతులు అక్షరాలలో చూపించాడు.. స్వస్తి.
No comments:
Post a Comment