మాణిక్యమ్మ గారి మనవరాలు(మొదటి భాగం) - అచ్చంగా తెలుగు

మాణిక్యమ్మ గారి మనవరాలు(మొదటి భాగం)

Share This
మా బాపట్ల కధలు – 2
మాణిక్యమ్మ గారి మనవరాలు(మొదటి భాగం)
భావరాజు పద్మిని

సూర్యుడి నులివెచ్చని కిరణాలు పడుకున్న నా ముఖం మీద పడడంతో దుప్పటి ముసుగేసుకున్నాను. ‘హబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా?’ అనుకుంటూ దుప్పటి కొంచెం తీసి, చుట్టూ చూసాను. ఎవరూ లేరు. అంతా లేచి, క్రిందికి దిగి వెళ్ళిపోయి ఉంటారు. ఎండాకాలం సెలవలకు అందరం మా బామ్మ ఇంటికి వచ్చాము. అప్పుడు నా వయసు సుమారు పదేళ్ళు ఉంటుందేమో ! రాత్రి డాబా మీద వరసాక్కి దుప్పట్లు పరచుకుని అందరం పడుకున్నాము. మళ్ళీ బద్ధకంగా పడుకోబోయే సరికి, చెవులకి కమ్మగా సోకింది ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారి అమృత గళం నుంచి, భావన్నారాయణ స్వామి ఆలయ గోపురం పైనున్న స్పీకర్ల లోంచి    వినవస్తున్న ‘శ్రీమన్నారాయణ’ అన్న అన్నమయ్య కీర్తన,. మా ఊరి వాళ్లకు ఆ పాటలే మేలుకొలుపు. నెమ్మదిగా లేచి కూర్చున్నాను.
రెండవ అంతస్తు దాకా పెరిగిన ముద్దగన్నేరు చెట్టు నిండా గులాబీల్ని తలదన్నేలా విరగబూసిన గన్నేరు పూలనుంచి ఏదో వగరు పరిమళం వస్తోంది. వాటిప్రక్కనే ఏపుగా ఎదిగిన యూకలిప్టస్ చెట్టు కొమ్మలు గాలికి లయబద్ధంగా ఊగుతుంటే, ప్రాణానికి కొత్త ఊపిరి పోసే ఔషధ పరిమళం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దాని ప్రక్కనే దేని మాను ఏదో చెప్పలేనంత గాఢంగా పెనవేసుకు పోయిన రావిచెట్టు, వేప చెట్టు కొమ్మల లేలేత ఆకులు ఉషోదయానికి పడుతున్న లేలేత ఎండకు మెరిసిపోతూ, మురిసిపోతున్నాయి. సమయం ఉదయం 6.30 కావస్తుందేమో, కెంజాయ రంగులో సూర్యోదయపు చాయలతో, మనోజ్ఞంగా ఉంది వాతావరణం. చిన్నప్పటి నుంచి ప్రకృతి ప్రేమికురాల్ని కావడంతో అలా చూస్తూ ఉండిపోయాను. ఇంతలో వెనుకనుంచి కిసుక్కున నవ్వులు... హమ్మో, వచ్చేసింది, మా వానర దండు.
ఇంతకీ ఎందుకు నవ్వుతున్నట్టు? ‘హమ్మో, ఈ వాణక్క నిన్న మా సౌజి పడుకుంటే, కాటుకతో మీసాలు పెట్టించింది నాతో, అది తెల్లారి లేచి లబో దిబో మని గోల. అప్పుడు మాత్రం అమాయకంగా మొహం పెట్టేసి, ‘నాకేం తెలీదు బామ్మా, అంతా ఈ సన్నచీమ పద్మిని పనే !’ అని చెప్పేసి, నాకు బామ్మతో అష్టోత్తరం చదివించేసింది. అంటే... ఇవాళ నా వంతు అన్నమాట ! ‘ అనుకుని...
“ఏమే! రాక్షసుడి కనుబొమలు పెట్టారా? రావణాసురుడి మీసాలు పెట్టారా ? అంతలా నవ్వుతున్నారు, ఉండండి, మీ పని బామ్మతో చెప్తా,” అన్నాను. వాళ్లింకా పగలబడి నవ్వసాగారు. నేను అద్దం కోసం పరుగెత్తాను. చూద్దును కదా, మొహం నిండా, చిక్కటి నలుపు తిలకం పులిమేసి, బుగ్గన పెద్ద గండు చుక్కు, బుర్ర మీసాలు... గజదొంగ గంగులు అవతారం ! హమ్మయ్యోయ్ !  నా మొహం చూస్తే, నేనే జడుసుకు చచ్చేట్టు ఉంది నా వాలకం. “బామ్మా, చూడు...” అంటూ పరుగుతీసాను, పెద్దవాళ్ళంతా నన్ను చూసి, పగలబడి నవ్వసాగారు. మా వానరమూకకు బాగా తిట్లు పడాలన్న సంకల్పంతో, గట్టిగా ఏడవాలని గుడ్ల నిండా నీళ్ళు నింపుకున్న నాకు వాళ్ళ నవ్వులు చూస్తే, నవ్వొచ్చేసింది.
“పోన్లేవే, ఏదో సరదాకి చేసారు. ఆటల్లో అరటిపండు,” అంటూ, బుంగమూతి పెట్టిన నన్ను చూసి, “ఎవత్తే, ఈ వేషాలు వేసింది, ఇంకోసారి ఇలా చేసారో, జాగ్రత్త !” అంటూ ఓ వార్నింగ్ ఇచ్చి, ‘పదవే, మొహం కడుగుతా, మంచి నీళ్ళోచ్చే వేళయ్యింది,” అంటూ నన్ను వెంటబెట్టుకు వెళ్ళింది బామ్మ.
బాపట్లలోని గడియార స్థంభం వద్ద గల ‘శిఖరం వారి వీధి’లో గోపీచందనం రంగు రెండంతస్తుల మేడ మాది. ఇంటి పైన “గోపాలకృష్ణ నిలయం” అని తాటికాయంత అక్షరాలు రాసున్నా, మా ఇంటి నీళ్ళ ట్యాంక్ ను ‘చేప’ రూపంలో కట్టడంతో, మా ఇంటిని కొందరు ‘చేప మేడ’ అనేవారు. అప్పట్లో విజయవాడ కృష్ణానది నుంచి ఒక కాలువ తవ్వి, మా ఊరికి మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు చేసారు. విజయవాడ నుంచి అంత దూరం వచ్చిన కృష్ణమ్మ, మరి ఎందుకనో, ఎన్ని రకాల మోటార్లు పెట్టినా, క్రింది అంతస్తు నుంచి ఒకటో అంతస్థుకు మాత్రం రానని, మొరాయించేది. అందుకని, మా బామ్మ తన మనవరాళ్ళకి, మనవళ్లకి చిన్న చిన్న బిందెలు ఇచ్చి, క్రిందికి పంపేది. ఇక మా ‘మిషన్ గంగాళం’ మొదలు ! అంటే, ఇంట్లో ఉన్న ఆ పెద్ద గంగాళాన్ని, పెద్ద లోటాల వంటి ఇత్తడి పాత్రలను, బకెట్లను నింపాలి. తర్వాత మంచినీళ్ళు పోయేలోగా స్నానాలు ముగించాలి.
పెరట్లో ఉన్న బావి నీళ్ళు, ఉప్పగా ఉండేవి. అప్పట్లో, స్నానాలు కూడా మంచి నీళ్ళతోనే చేసేవాళ్ళం. ఇక వంటకి నీళ్ళు మా బామ్మ ఐదుగురు కోడళ్ళు అయిన మా అమ్మా వాళ్ళంతా పెద్ద బిందెలతో తీసుకుని వెళ్ళేవాళ్ళు.  క్రింద అద్దెకున్న ఓ డజను కుటుంబాల వాళ్ళకీ, పైనున్న మాకూ కలిపి ఇంటి ముందరో మంచినీళ్ళ పంపు, వెనకో పంపు ఉండేవి. ‘మాణిక్యమ్మ గారి మనవరాళ్ళం’ కనుక వాళ్ళని నయానో భయానో బెదిరించి, మా బుల్లి బిందెలు నింపుకుని, మెట్ల మీదుగా తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి పరికిణీలు అడ్డమొచ్చి జారి పడే వాళ్ళం. కాసేపు ఆరున్నొక్క రాగం తీసి, మళ్ళీ బిందెలతో సిద్ధం ! ఇదే కార్యక్రమం ఉదయం, సాయంత్రం కూడా కొనసాగేది.
ఇక పగలంతా ఏవిటి కాలక్షేపం? ఊరంతా ఇళ్ళ పెరళ్ళలోనో, చెట్ల మీదో, గోడల మీదో ఎక్కి ఆడడం. లేకపోతే మా చేప మేడ మీద చేప(నీళ్ళ ట్యాంక్) చుట్టూ చాపలు చుట్టేసి, నీళ్ళు జల్లేసి, ఆ చేప పొట్ట కింద కూర్చుని ఆడెయ్యడం ! లేకపోతే, మా భావన్నారాయణ స్వామి గుడికి, రోడ్డు ఎదురుగా ఆయనకి అభిముఖంగా ఉన్న మా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి, తీవ్రంగా గుంజీలు, ప్రదక్షిణాలు చెయ్యడం. మా వాణక్క,  మా అందరిలోకి పెద్దది. దాని ఆధ్వర్యంలో రోజుకో ‘అల్లరి పధకం’ వేసి, అమలు పరిచేసేవాళ్ళం. ఓ రోజు అది కొత్త ప్లాన్ కనిపెట్టింది. ‘ఇదిగో, ఆ మాయాబజార్లో సుబ్బమ్మ గారింట్లో మల్లెపూలు, సన్నజాజులు, సంపెంగలు ఉన్నాయి, ఇంట్లో పూజుంది, మా బామ్మ తెమ్మంది, అని చెప్పి, పూలన్నీ దులిపేద్దాం ! పన్లో పని నాలుగు మావిడి పిందెలు కూడా కోసేద్దాం!’ అంది. మేము అలాగేనని వెళ్లి కోసేస్తుంటే, సుబ్బమ్మ గారు మా బామ్మ దగ్గరికి చక్కా పోయి, ‘ఏవిటీ, ఇంట్లో పూజట, మీ మనవరాళ్ళు వచ్చారు,’ అంటూ చల్లగా చెప్పేసింది. ఇంకేముంది, రాగానే మా అందరికీ నెత్తిన వేడివేడిగా వడగళ్ళు పడ్డాయి.
అప్పుడో ఇప్పుడో బామ్మకో తాతకో మస్కా కొట్టేసి, ‘సినిమాకు వెళ్తాం, డబ్బులు ఇవ్వండి,’ అని అడిగితే, ‘డబ్బులెందుకే, నా పేరు చెప్పండి,’ అనేవారు మా కృష్ణమూర్తి తాత. ‘ఓసోస్, ఆయన పేరు చెప్తే, ఈగకి కూడా తెలీదు, మాణిక్యమ్మ, అని నా పేరు చెప్పండే ‘ అనేది మా బామ్మ. ‘నిన్న చెప్పాం బామ్మా, అయినా ఆ కొట్టు వాడు పట్టించుకోలేదు,’ అనేది మా దండు నాయకురాలు. మా తాత కిసుక్కున నవ్వితే, మా బామ్మ ఉడుక్కుని,’ ఎవడే వాడు, పేరు కనుక్కురా, వాడి సంగతి చెప్తా, ఈ మాణిక్యమ్మే తెలీదు అంటాడా?’ అనేది. తాత ఈ తంతుకు ప్రసన్నులై, ‘బెంచీకి వెళ్ళండి’ అంటూ ఓ రెండు రూపాయలు చేతిలో పెట్టేవారు. అప్పట్లో బెంచీ రేటు పది పైసలు మాత్రమే. పది పైసలు, పావలా, అర్ధరూపాయి, మహా అయితే రూపాయి.. వీటితోనే జీళ్ళు, మరమరాల ఉండలు, పాలకోవాలు, చిన్న జంతికలు... ఇలా బోలెడు వచ్చేవి ఆ రోజుల్లో.
మా తాత ఆలూరి కృష్ణమూర్తి గారు ఊర్లో పేరొందిన క్రిమినల్ లాయర్. మరి మగడికి దీటుగా ‘నా పేరు చెప్పండే’ అని ఆ రోజుల్లో ఓ ఇల్లాలు అంది అంటే, వెనకేదో పెద్ద విషయం ఉందనే అర్ధం కదా ! ఐదడుగుల నిండైన చక్కటి విగ్రహం, నుదుట పావలా కాసంత కుంకుమ బొట్టు, నిఖార్సైన పెద్దంచు కంచిపట్టు చీర, నడుముకు వడ్డాణం, చేతికి వంకీలు, మెళ్ళో కాసులపేరు, పలకసర్లు, వంటి ఆభరణాలు, చేతినిండా గాజులు, కాళ్ళకు పెద్దపెద్ద జాలరి పట్టీలు, అన్నింటినీ మించి, ఎవరి కష్టాలు వినైనా తేలిగ్గా కరిగిపోయి, సాయపడే చల్లటి మనసు, కలిపితే మా బామ్మ. రోజూ నగలన్నీ పెట్టుకునేది, పట్టుచీరలే కట్టుకునేది. ఆరోజుల్లో భయాలు ఉండేవి కాదు. రాత్రిపూట అవన్నీ తీసి, రోజ్ వుడ్ తో ప్రత్యేకంగా తయారు చేయించిన తన బీరువాలో, ఏవేవో రహస్యపు అరల్లో పెట్టేది.
మా బామ్మ ఊళ్ళో అందరికీ తల్లో నాలుకలా ఉండేది. ఎటువంటి మాధ్యమాలు లేని ఆ రోజుల్లో సుమారు 500 పెళ్ళిళ్ళు చేసింది. చావులకి, వేడుకలకి కులమతాలకు అతీతంగా వెళ్లి నిలబడి, సమభావనతో సహాయపడేది. పొలాలు, తోటల లెక్కలు చూసుకునేది. బ్యాంకు పనులు చేసుకునేది. ఒంటరిగా ప్రయాణాలు చేసేది. ఎక్కడైనా మహిమగల సత్పురుషులు ఉన్నారంటే, అద్దెకుండే వారు కొందరిని వెంటేసుకుని, ఓ కార్ మాట్లాడుకుని, వెళ్ళిపోయేది. ఆవిడ భయం అన్నది ఎరుగదు. దైవం పట్ల అంత గురి ఆమెకు. చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అప్పట్లో సత్యసాయిబాబా భజనలు, అవీ తెలీదు. మా బామ్మ బాబాగారి వద్ద పుట్టపర్తిలో 14 సం.రాలు ఉందట. మా ఇంటి వసారాలో మా తాత కోర్ట్ పుస్తకాల బీరువాలు, వచ్చినవారు కూర్చునేందుకు బల్లలు, మా తాత టేబుల్, వీటితో పాటు బాబాగారు కూర్చున్న కుర్చీ, ఆయన పాదుకలు ఉండేది. గురువారం బాబా భజన సంప్రదాయం ఆ చుట్టుప్రక్కల ఊళ్లలో ఆవిడే మొదలుపెట్టించింది.
కంచు కంఠం ఆవిడది. ఎవరైనా క్రింది వాటాల్లోని వాళ్ళు అద్దె కట్టకపోతే, పైనుంచి చక్కటి శ్రావ్యమైన తిట్లతో కూడిన ఒక్క అరుపు అరిచేది అంతే, హడిలిపోయి, ఎంతటి వాడైనా “అమ్మగారు” అంటూ ఇంటి బైటికొచ్చి సంజాయిషీ ఇవ్వాల్సిందే ! సుమారు ఎకరం వైశాల్యం ఉన్న మా భవంతి పెరట్లో, పెంకుటింటి మూలో, ఆవుల కొట్టం క్రిందో, ఎక్కడో ఓ మూల మేమంతా ఆడుకుంటుంటే, ‘అన్నానికి రండే !’అంటూ ఓ కేక పెట్టేది. అంతే, మరునిముషంలో మేమంతా మా బామ్మ ముందు హాజరు. మేమే కాదు, ఊరు ఊరంతా ఆవిడంటే ఒక భక్తి గౌరవం. ఇంటి వసారాలో మా తాత కోర్ట్ గొడవలు చేస్తుంటే, ఈవిడ లోని గదిలో ఊళ్ళో తగువులు, ఆలూమగల మనస్పర్ధలు అన్నీ మాట్లాడి తీర్చేది. “నాకంటే, నీ క్లైంట్ లే ఎక్కువే,” అనేవారు నవ్వుతూ మా తాత.
ఇక మా ఇల్లు ఒక నిత్యాన్నదాన సత్రంలా ఉండేది. పొలం కూలీలు, ఊళ్ళ నుంచి బామ్మ కోసం వచ్చేవారు, బంధుమిత్రులు, పరిచయస్తులు, నిత్యం ఇంట్లో యాభై మంది తక్కువ భోజనం చేసేవారు కాదు. ఇంతపనితో కోడళ్ళు సతమతమవుతూ, పిల్లలు అన్నాలు తినలేదని బెంగెట్టుకుంటారని, ఆవిడో పధ్ధతి కనిపెట్టింది. ఉదయం నీరెండ నుంచి రాత్రి వెన్నెల స్నానాల దాకా ఇదే పధ్ధతి అమల్లో ఉండేది. అదేంటో చెప్పేముందు మీకు మా డాబాఇల్లు ఎలా ఉండేదో చెప్పాలి. ముందు వైపు నుంచి, వెనుక వైపు నుంచి కూడా మెట్లున్న మా డాబా రెండు భాగాలుగా ఉండేది. వరండా, హాల్, పడగ్గది, పూజగది, దాన్ని అనుకున్న రేకుల షెడ్ ఒకప్రక్క, వంటిల్లు, బాత్రూం, పైన చేప ట్యాంక్ మరో ప్రక్క ఉండేవి. రెండు డాబాల స్లాబ్ లు వేరే. ఈ రెండిటి మధ్య, ఖాళీ జాగా !రెండు డాబాలు ఎక్కేందుకు మెట్లు, గిన్నెలు తోమి, బట్టలు ఉతికేందుకు రెండు పంపులు అమర్చిన ప్రాంతం. ఈ డాబాల మధ్య ఖాళీ జాగాలోనే పెద్ద తులసి కోట, పెద్ద కుండీ నుంచి రేకుల షెడ్ పైకి పాకిన పెద్ద మల్లెతీగ ఉండేవి. ఒక్కో మల్లె పువ్వూ, నందివర్ధనం పువ్వంత పూసేది. ఆ నేలలో బలం అలాంటిది.
మేము ఎక్కువ ఇడ్లీలు, దోశలు ఎరగము. ఉదయాన్నే ముక్కాలిపీట మీద కూర్చుని, పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టుకుని, ఒక పెద్ద బెసన్లో చద్దన్నం వేసి, బెల్లపావకాయ కలుపుతూ, గిన్నెడు నెయ్యి గుమ్మరించి కలిపేది. ఆ తర్వాత పిల్లలు, పనివాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అందరినీ పిలిచి, ఒంటి చేత్తో దబ్బకాయంత ముద్దలు చేసి, అందరికీ పెట్టేది. ఒంటి చేత్తో అంతంత ముద్దలు ఎలా చేసేదో అర్ధం కాక, విచిత్రంగా చూసేవాళ్ళం. ఒక్కోసారి చద్దన్నం తక్కువ ఉంటే, వేడన్నం వండించి కలిపి పెట్టేది. అంతంత పెద్ద ముద్దలు మా బుజ్జి చేతులు పట్టేవి కావు. ముఖ్యంగా ఆవిడ దృష్టి నామీదే ఉండేది.”ఒసేయ్, ఒంటూపిరి పీనుగా ! ఇంద, నీకోసం చిన్న ముద్ద చేసాను, గబగబా తిను,” అనేది. అందరి కడుపులూ నిండేదాకా కొసరి కొసరి పెట్టడం ఆవిడ ప్రత్యేకత. మధ్యాహ్నం కూరలు, పప్పు, పులుసూ, పెరుగూ కలిపి పెట్టేది. రాత్రి వెన్నెల్లో మళ్ళీ ఇవే అక్ష్యయ వెన్నల ముద్దలు. కలిపే చేతిలో రుచుందో, పెట్టే ప్రేమలో రుచుందో కాని, ఆ రుచి మళ్ళీ జన్మలో ఎరుగను.
(మా బామ్మ కబుర్లు మరిన్ని... వచ్చే నెలలో )

No comments:

Post a Comment

Pages