నేను చెయ్యగలను
(I CAN DO)
బి.వి.సత్య నాగేష్ , ప్రముఖ మానసిక నిపుణులు
లక్ష్యసాధనకు ధృడ సంకల్పం చాలా అవసరం ధృడసంకల్పం అనేది పెంపొందించుకున్న మానసిక ఉద్వేగం. ‘నేను చెయ్యగలను’ అనే మానసిక దృక్పథం తో ధృఢసంకల్పాన్ని ఎంతో దృఢపరచుకోవచ్చు. ‘I CAN DO’ అనే మూడు చిన్న పదాలలో ఉండే ప్రతీ అక్షరం చాలా విలువైనది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కో అర్ధముంది. అదేంటో చూద్దాం.
I: INTROSPECTION (ఆత్మపరిశోధన): సగటు మనిషి తన గురించి తాను ప్రశ్నించుకుంటాడా? అనేది ఒక చర్చనీయాంశం. మనం ఆలోచించుకుంటూ, విశ్లేషించుకుకోవలసిన అంశాలు కొన్ని వున్నాయి. వాటిల్లో స్వాట్ (SWOT) ఎనాలిసిస్ ఒకటి. ఈ నాలుగు అక్షరాలకు ప్రత్యేకత వుంది. SWOT ఎనాలిసిస్ మానసిక విశ్లేషణకు ఎంతో ఉపకరిస్తుంది.
S= STRENGTHS – నా సామర్ధ్యాలు ఏంటి?
W= WEAKNESSES – నా బలహీనతలేంటి?
O= OPPORTUNITIES – నాకున్న అవకాశాలేంటి?
T= THREATS – నా కున్న ఆటంకాలేంటి?
మనకున్న సామర్ధ్యాలను పటిష్ట పరచుకుంటూ, బలహీనతలను బలహీనపరచుకుంటూ, అవకాశాలను చేజిక్కించుకుంటూ, ఆటంకాలను చేధించుకుంటూ ప్రగతిని సాధించటమే ‘ SWOT ’ ఎనాలిసిస్. ఈ విశ్లేషణ వల్ల “నేను చెయ్యగలను” అనే దృక్పథం మెరుగవుతుంది.
C = CONFIDENCE: (విశ్వాసం): ఆత్మపరిశోధన ద్వారా వచ్చిన మంచి ఫలితాల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక విషయంలో ఆత్మవిశ్వాసం వుండినప్పటికీ మరొక విషయంలో అదే స్థాయిలో ఆత్మవిశ్వాసం లేకపోవచ్చు. కనుక ఏ విషయంలో ఆత్మవిశ్వాసం లేదు అనే విషయం పై దృష్టి పెట్టాలి. శరీరం ధృడంగా కావాలంటే శారీరక వ్యాయామం చేసినట్లు ఆత్మవిశ్వాసం కొరకు మానసిక వ్యాయామం చెయ్యాలి. పరిస్థితులను ఎదుర్కోవటం ద్వారా అనుభవం కలిగి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదొక మానసిక వ్యాయామం లాగ చెయ్యాలి. ‘నేను చెయ్యగలను’ అనే దృక్పథం గట్టి పడుతుంది.
A= ACCEPT CHALLENGES (సవాళ్ళను స్వీకరించాలి): “హార్బర్ లో వున్న ఓడ క్షేమంగానే వుంటుంది, కాని ఓడను నిర్మించింది. హార్బర్ లో ఉంచడానికి కాదు” అని ఒక నీతివాక్యం వుంది. “ ఎంత చేసినోడికి అంతంత మహాదేవ” అన్న సామెతలా సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో స్వీకరించి పనిచేస్తే “నేను చెయ్యగలను” అనే మానసిక దృక్పథం పటిష్ఠపడుతుంది.
N = NEVER QUIT (ఎప్పటికీ విరమించవద్దు): సవాలుగా తీసుకున్న తరువాత వెనక్కి తిరిగేది లేదనే ఆలోచన పెంచుకుంటే “నేను చెయ్యగలను” అనే మానసికదృక్పథం రోజురోజుకి గట్టి పడుతుంది. ఈ విషయంలో మరొక మంచి లోకోక్తి వుంది. అదేంటో చూద్దాం!
“గెలుపొందే తత్వం వునవారు పోటీ నుంచి తప్పుకోరు.
తప్పుకునే తత్వం వున్నవారు పోటీలో గెలుపుపొందరు”
కనుక నిర్దేశించుకున్న పనిని వదిలిపెట్టకుండా చేసి తీరాలనే పట్టుదలను పెంచుకుంటే “నేను చెయ్యగలను” అనే మానసిక దృక్పథంగట్టి పడుతుంది.
D = DO IT NOW (ఇప్పుడే చెయ్యాలి): అనుకున్న పనిని ఆలశ్యం చేయకుండా, వాయిదా వేయకుండా తక్షణం చెయ్యాలనే మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి. అపుడే ‘I CAN DO’ మనోవైఖరి అలవడుతుంది.
O = ORGANISE THOUGHTS (ఆలోచనా ప్రక్రియను సరియైన పద్ధతిలో నిర్వహించుకోవాలి): ఆలోచనలు ఎక్కడనుంచో రావు మనమే ఆలోచించి “ఆలోచనలు” అనే వాటిని సృష్టిస్తాము. “మంచి ఐడియా” వచ్చింది అంటాము. మనం ఆలోచిస్తేనే కదా మంచి ఐడియా వచ్చేది. కనుక మన ఆలోచనా విధానం మనకు కావలసినట్లుగా చేసుకోవచ్చు. ఆలోచనలనేవి “ఫైనల్ ప్రోడక్టు” లా ఎక్కడ నుంచో రావు మనం ఒక విషయం గురించి శ్రద్ధ పెట్టి ఆలోచించడం వల్లనే సృష్టిస్తాం.
ఇక్కడొక చిన్నవిషయం మరొక లోకోక్తి గురించి చూద్దాం.
“ఎనిమిది గంటలు కట్టెలు కొట్టేపనిని నాకిస్తే, అందులో
మూడు గంటల సమయాన్ని గొడ్డలిని సానపెట్టడానికి ఖర్చుపెడతాను”
దీనినే “SHARPEN THE AXE” అంటారు. మన ఆలోచనా విధానాన్ని సానపెడుతూ వుండాలి. సృజనాత్మకతతో అలోచించి చక్కటి సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి.
పైన పేర్కొన్న INTROSPECTION, CONFIDENCE, ACCEPT, CHALLENGES, NEVER QUIT, DO IT NOW అనే విషయాలలో ఆలోచనలను సమాయుత్తం చేయడం ఒక వ్యాయామం అనుకుని మొదలుపెట్టండి. ఇదొక ‘ఫార్ములా’ అని నమ్మి ప్రయత్నించండి. మీ మానసిక దృక్పథంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. “ I CAN DO” అనే మానసికవైఖరిని మీరే చూస్తారు. ఈ వైఖరి వల్ల దృఢ సంకల్పంతో లక్ష్యాలను చేరగలరు. ఆలస్యమెందుకు? DO IT NOW మొదలుపెట్టండి మరి!
***
No comments:
Post a Comment