పుష్యమిత్ర – 3
టేకుమళ్ళ వెంకటప్పయ్య
జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను హిమాలయాలపైన నిర్మించడానికి అనువైన ప్రదేశం కోసం ఇస్రో వారు హెలికాప్టర్ల ద్వారా అన్వేషణ జరుపుతూ ఉండగా గమనించిన పాకిస్థాన్ ప్రభుత్వం, బార్డర్లో జరుగుతున్న హడావిడి ఏమిటొ తెలుసుకోమని, కరిముల్లా అనే అండర్ కవర్ ఏజెంటును నియమిస్తారు. కనిష్కవర్ధన్ దయామీర్ పర్వతం మీద అనువైన ప్రదేశాన్ని సతీష్ చంద్రకు చెప్తాడు. టవర్ నిర్మాణం ఖచ్చితంగా రెండు నెలల్లో అవాలని ఆదేశాలిచ్చి వెళ్ళిపోతాడు చైర్మన్. కరిముల్లా అర్మీ చీఫ్ కు అది వాతావరణానికి సంబంధించిన నిర్మాణమని చెప్తాడు. ఇక చదవండి.
టవర్ నిర్మాణం జరిగే ప్రదేశం "డేంజర్ ఏరియా" గా డిక్లేర్ చేసి, రెడ్ ఫ్లాగ్ లతో మార్కింగ్ చేసారు. చుట్టూ ప్రతి వంద గజాలకూ ఒక ఆర్మీ సైనికుడిని కాపలా వుంచారు. ఇస్రో వాళ్ళనూ, అర్మీ వాళ్ళనూ తప్ప ఎవర్నీ ఆ ప్రదేశంలోనికి పంపడం లేదు. చాలా రహస్యంగా పకడ్బందీ గా సాగుతోంది నిర్మాణం. అక్కడ శ్రీహరికోట లో గ్లోబ్ నిర్మాణమూ అంతే వేగంగా జరుగుతోంది. ఏప్రిల్ నాటికి ఎలాగైనా ప్రారంభం చేయాలని చైర్మన్ మంచి పట్టుదలతో ఉన్నారు. ప్రపంచం లో ఎవ్వరూ చెయ్యలేని, చేయని, రాడార్ రక్షణ కవచాన్ని నిర్మించుకో గలుగుతున్నామన్న సంతోషం టీం ను మరింత ఉత్సాహంగా ఉంచగలుగుతోంది.
* * *
"మిస్టర్! జిలానీ బాషా! చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకో నాకు కరిముల్లా మాటల్లో విశ్వాసం కనిపించడం లేదు. అతని రికార్డ్స్ పరిశీలించాం. అతను ఇండియాలో రాజస్థాన్ లో శ్రీగంగానగర్ లో జన్మించాడు. కానీ ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. కారణాలు తెలీడంలేదు. అతని పుట్టిన తేదీని బట్టి అక్కడి కాలేజీకి వెళ్ళి విషయాలు సేకరించండి. అన్ని వివరాలు ఈ ఫైలు లో ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ మిలిటరీ రికార్డుల్లో అతని పేరు ఉందా అనే విషయం తెలుసుకోండి. అతని వ్యవహారాలపై కాస్తా కన్ను వేసి ఉంచండి. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐ.యెస్.ఐ) ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐ.బీ) కి చెందిన జాయింట్ సీక్రెట్ ఏజెంట్ గా మీకు ఈ బాధ్యతలు ఇమ్మని మన ప్రెసిడెంట్ ఆర్డర్స్. చాలా రహస్యంగా దర్యాప్తు సాగించాలి" పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ ఆదేశాలు విన్న జిలానీ బాషా "ఎస్ సార్" అని సెల్యూట్ చేసి ఫైలు తీసుకుని బయటకు వచ్చాడు.
* * *
దయామీర్ (నగ్న పర్వతం) మీద టవర్ నిర్మాణం జరుగుతోంది. సముద్ర మట్టానికి 26,660 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం. ప్రపంచలోని 9వ ఎత్తైన శిఖరం. భారత్, పాకిస్తాన్ ఉమ్మడి సరిహద్దుల్లో ఉన్న కొండ. ఎముకలు కొరికే చలి. ఓ రోజు మధ్యాన్నం లంచ్ టైము లో గదిలోని రూం-హీటర్ వేడిమిలో సేద దీరుతూ, కనిష్క అర్మీ వాళ్ళలొ ఒకతన్ని పిలిచి ఇంగ్లీషు తెలిసిన వారు ఎవరైనా ఈ హిమాలయాల విశిష్టత, వింతలు విశేషాలు ఏమైనా ఉంటే చెప్పమని అడగ్గా.. “సర్! నేను షెర్పాకు చెందిన వాడిని. నాకు బాగా తెలుసు చెప్తా వినండి”. అని ఆరంభించాడు. టిబెట్ బాషలో "షెర్" అంటే ఉత్తరం.. "పా" అంటే ప్రజలు అని. మేము ఉత్తర దేశానికి చెందిన వాళ్ళం. తరతరాలు ఇక్కడే ఈ హిమాలయాలే మా నివాసం. హిమాలయాలలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు హిమాలయాల్లోకి ఈ ప్రపంచం లోని ఏ వ్యక్తి కూడా పూర్తిగా ప్రవేశించలేక పోయారన్నది నమ్మదగ్గ వాస్తవం. హిందూ పురాణాలు తెలియచేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాలలో "యతి" రూపంలో ఉన్నట్టు పెద్దలు చెబుతారు. ఇక్కడ హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేను మీకు తెలిసిన అమర్నాధ్, కైలాస్ నాధ్, కేదార్నాధ్ గురించి చెప్పబోవడం లేదు. మీకు తెలియని ఓ అధ్భుత విషయాన్ని తెలియజేస్తున్నాను. అన్న షెర్పా మాటలకు అప్పటిదాకా పరధ్యాన్నంగా ఉన్న అధికారులు ఉలిక్కిపడి తలలెత్తి చూసారు. కొన్ని పరిశోధనలు, మరికొన్నిభారతీయ బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాలలో ఉందని తెలుస్తుంది. దాని పేరే "శంబాలా". దీనినే పాశ్చాత్యులు " హిడెన్ సిటీ" అంటారు. వేల మైళ్ళ విస్తీర్ణం లో ఉన్న హిమాలయాలలొ మనుషులు చేరుకోలేని ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అలాంటి వాటిలో ఈ శంబాలా ఒకటి. అది అందరికి కనిపించదు, అది కనిపించాలన్నా, చేరుకోవాలి అన్నా మనం మానసికంగా శారీరకంగా ఎంతో కష్టపడాలి. ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశం. అంటూ ఓ నిట్టూర్పు విడిచి మళ్ళీ ఆరంభించాడు. అక్కడ దేవతలు సంచరిస్తారు. ఆ ప్రదేశం అంతా అధ్బుతమైన సువాసన అలుముకొని ఉంటుంది. లోకంలో పాపం పెరిగిపొయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్య పురుషులు లోకాన్నితమ చేతుల్లో తీసుకుంటారు. అన్ని దేశాలకు మనదేశం కేంద్ర స్థానం అవుతుంది. మన హిందూ సనాతన ధర్మమే అన్ని దేశాల వాళ్ళూ అవలంబిస్తారు. అప్పటి నుంచి ఈ పుడమి పైన కొత్త శకం ప్రారంభం అవుతుంది. ఆ కాలం 2424 సం. లో ప్రారంభమౌతుందని మా తాత గారు చెప్పారు. మీరు నమ్మినా నమ్మకపొయినా మేము దాన్ని విశ్వసిస్తాము. ఆసక్తికరంగా వింటున్నారా లేదా అన్నది గమనించి మళ్ళీ చెప్పసాగాడు. అప్పటికే అందరూ టెన్షన్ గా వింటున్నారు.
శంబాలా లో ఉన్న వారి ఆయువు మామూలు ప్రజలు కంటె రెట్టింపు ఉంటుంది, వారు మహిమాన్వితులు. మీకు ఈ శంబాలా మీద జరిగిన పరిశొధనలు కూడా చెప్పాలి. రష్యా 1920 లొ శంబాలా రహస్యాన్ని తెలుసుకొవడానికి తన మిలటరి ఫోర్సుని పంపి పరిశొధనలు చేయించింది. అప్పుడు శంబాలా కి చేరుకున్న రష్యా మిలటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ వుండే యోగులు వారికి దాని పవిత్రత గురించి తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930 లొ శంబాలా గురించి తెలుసుకొవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని నాజినేత హిట్లర్ కి చెప్పాడు. అంతే కాక హేన్రిచ్ హిమ్లర్ శంబాలాలో మరెన్నో వింతలు, విశేషాలు మానవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడు. దలైలామాలకు సంభందించిన కాలచక్ర లో కూడా... “గోభి” ఎడారికి దగ్గరిలోని ఉన్న శంబాలానే రాబోయే రొజులలొ ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు రాసాడని చెప్పారు. శంబాలా గురించి ఫ్రాన్స్ కు సంబందించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మిక వేత్త, బౌద్ద మత అభిమాని, రచయత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ కొన్నిగ్రంథాలు రచించింది. ఆమె తన 56 ఏళ్ళ వయస్సులొ ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబాలా గురించి తెలుసుకుని అక్కడకి వెళ్లి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకొవడం వల్లనే ఆమె ఏకంగా 101 ఏళ్లు బ్రతికింది. ఆమె అక్టోబర్ 24, 1868 లొ జన్మించి సెప్టెంబర్ 8,1969 లో మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లొ కాలుమోపిన తొలి యూరప్ వనిత ఆమె. అలాగే షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కుడా శంబాలా పై చాలా పరిశోధన చేసాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొన్నాడు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు “టెలీపతి” తో ప్రపంచం లొని ఎక్కడి వారితొ నైనా సంభాషించగలరు. భూమి మీద నే కాదు ఏ గెలాక్సీ లో ఎక్కడ జరుగుతున్న విషయం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది. శంబాలా ఎనిమిది రేకుల భారీ కలువ పువ్వు ఆకారం లో ఆ నగరం ఉంటుందని తెలిపాడు. హిట్లర్ తన ఆర్మీ ని అక్కడకు పంపి చాలా విషయాలు సేకరించాడు. అతనికి అద్బుతాలు అంటే చాలా ఇష్టం. అందుకే అతను వియన్నాలొ మంత్ర, యోగ విద్యలు నేర్చుకున్నాడు. ఆ ఆసక్తి తోనే అతను కొంత సంస్కృతo కూడా నేర్చుకున్నాడు. శంబాలా గురించి పెక్కు సంఖ్యలో రాయబడిన సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయడానికి కుడా అతను సంస్కృతం నేర్చుకున్నాడు. ఆ కారణం గానే అతను తరువాత సైనికులకు గుర్తుగా “స్వస్తిక్” ముద్రను వాడేవాడు. ఈ విషయం చాలా మందికి తెలీదు ఇప్పటివరకూ.. మా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం శంబాలా వయస్సు ఆరు మిలియన్ సంవత్పరాలు. ఇక్కడ ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారు. విష్ణువు తన పదో అవతారం అయిన కల్కి శంబాలా నుంచే వస్తాడని మా పూర్వీకులు చెప్పగా మా తాతగారు నాకు చెప్పారు. మాములుగా కనిపించని శంబాలాకి చేరుకోవడానికి బౌద్ద గ్రంథాలలో కొన్ని ఆధారాలు ఇవ్వబడ్డాయి. దాని ప్రకారం హిమలయాలలో ఎక్కడ ఉందో తెలియని శంబాలా నగరం చేరుకొవడానికి చాలా ప్రయాసపడాలి. అలా ప్రయాణం సాగిస్తుండగా తొలుత ఎడారి వస్తుంది. అదే గోభి ఎడారి. దాన్నిదాటిన తరువాత పర్వతాలు ఎదురు అవుతాయి. వాటిని కుడా దాటి హిమాలయాల నడిబోడ్డుకి రావాలి. అప్పుడూ శంబాలాకనిపిస్తుంది అని చెప్పలేము. ఎందుకంటే అధ్యాత్మిక ధోరణి లేని వారు, పాప కర్మల ఫలం అనుభవిస్తున్న వారికి హిమసమూహాల నడుమ కేవలం మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు మాత్రమే కనిపిస్తాయి. అక్కడి ఆసాధారణమైన వాతావరణం వలన శంబాలా సంగతి అటుంచి మృత్యువు సంభవిస్తుందని బౌద్ద గ్రంథాలు తెలుపుతున్నాయి. మరి కొంతమంది పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం మేరకు శంబాలాటిబెట్ హిమాలయాలలోని కున్లున్ పర్వత సమూహం తో కలిసి ఉండొచ్చని అంటారు. పాశ్చాత్యులు ఈ ప్రదేశాన్ని "ప్లానెట్ప్ ఆఫ్ హెడ్ సెంటర్”, "ది ఫర్బిడెన్ ల్యాండ్", "ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్" అని అంటారు. శంభాలాకు శ్వేత దీపం, ద్రువ లోకం అలా చాలా పేర్లున్నాయంటారు. ఏసు క్రీస్తు హిమాలయాలలో కొంత కాలం నివసించాడని కొన్ని యోగ, మంత్ర, తంత్ర విద్యలను నేర్చుకున్నాడనీ చెప్పడానికి కొన్ని ఖచ్చితమైన ఆధారాలున్నాయి. ఇంతటి మహిమాన్వితమైన పర్వతాల మీద మనం ఉన్నాం. మరో ముఖ్య విషయం సార్! ఈ హిమాలయాల గుహలలో "బాబాజీ" అనే వ్యక్తి ఉన్నారు. ఆయన ఎంతోమంది సాధు పుంగవులకు దర్శనం ఇచ్చారు చాలాసార్లు. ఆయన కొన్ని వేల సంవత్సరాలనుండి మరణమే లేని పురుషుడు అంటారు. "ఒక యోగి ఆత్మ కధ" పుస్తకం రాసిన “యోగానంద” కు, ఆయన గురువులకు దర్శనం ఇచ్చారని అంటారు అంటూ ముగించాడు షెర్పా. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు కనిష్క. ఎంత గొప్ప మహిమాన్వితమైన దేశం మనది. అనాదిగా భరత ఖండం ఓ ఆధ్యాత్మిక క్షేత్రం. తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తోంది. అయినా ఇంక కొద్ది రోజుల్లో టవర్ నిర్మాణం, మెగా యాంటెన్నా నిర్మాణం అవగానే తమ పాత్ర అయిపోతుంది. వేరే శాఖల వాళ్ళు వచ్చి వారి వారి పనులు పూర్తిచేస్తారు.
* * *
జిలానీ బాషా మారు పేరుతో పాస్ పోర్ట్ సంపాదించి పాకిస్థాన్ నుండి దిల్లీ చేరుకోగానే వారికి చెందిన వ్యక్తులు ఎయిర్ పోర్ట్ చేరుకుని తీసుకుని వెళ్ళడం గమనించిన భారతీయ మిలిటరీ అధికారి సుమంత్, వెంటనే విషయం హెడ్ క్వార్టర్సు కు తెలియ జేసి బాషా ను మారు వేషం లో ఫాలో అయ్యాడు. వాళ్ళు బాషాను రాజస్థాన్ ట్రెయిన్ ఎక్కించి వెళ్ళిపోయారు. సుమంత్ కూడా రాజస్థానీ వేషం ధరించి బాషా ఎక్కిన కంపార్ట్మెంట్ ఎక్కి పక్కన కూర్చున్నాడు. చేతిలో ఫైల్ ఏమిటో అర్ధం కావడం లేదు. కాసేపటికి బాషా ఫైల్ తెరిచి ముఖ్యమైన విషయాలు అంటే కరిముల్లా ఏ స్కూల్, ఏ కాలేజ్ చదివాడు నోట్ చేసుకోవడం తో విషయం అర్ధమయింది సుమంత్ కు. కూపీ లాగడానికి వచ్చాడని. వెంటనే అర్మీ హెడ్ క్వార్టర్స్ కు మెసేజ్ పంపి పర్మిషన్ తీసుకున్నాడు. తనను కరిముల్లా చదివిన కాలేజీలో పనిచేసిన లెక్చరర్ గా పరిచయం చేసుకున్నాడు. బుట్టలో పడ్డ బాషా కావలసిన వివరాలు ఇస్తే డబ్బు ఇస్తానని విషయం మొత్తం చెప్పేసాడు. ట్రెయిన్ గంగా నగర్ చేరుకునే సరికి ఉదయం 5 గంటలు అయింది. బాషాకు హోటెల్ చూపి సరిగ్గా 10 గంటలకు వచ్చి పిక్-అప్ చేసుకుంటానని చెప్పి బయటకు వెళ్ళి వేషం మార్చి లోకల్ పోలీసులతో వచ్చి అరెస్టు చేసి ఫ్లయిట్ లో దిల్లీ కి తీసుకు వెళ్ళాడు. కరిముల్లా కధ అంతటితో సుఖాంతం కాలేదు మరి.
* * *
టవర్ నిర్మాణం దాదాపు పూర్తి అయింది. ఒక చోట సెంటర్ పోల్ 50 అడుగుల లోతుకు దింపాలంటే సాధ్యపడలేదు. ఆ ప్రదేశం లో మంచు వంద అడుగుల మేర పేరుకుని వుంది. దాన్ని తొలగిస్తే కానీ నిర్మాణం సాధ్యం కాదు. దిల్లీ లోని డ్రిల్ రాక్ ఇంజినీరింగ్ కంపెనీ వాళ్ళను అత్యవసరం గా పంపాల్సిందిగా ఫోన్ చేసి చెప్పాడు కనిష్క. ఆ మంచును తొలగిస్తే జరుగబోయే విపరీత పరిణామాలు వారికి ఆ సమయం లో తెలియవు కదా మరి. (సశేషం)
* * *
No comments:
Post a Comment