శ్రీబాలగోపాల శతకము - పుసులూరి సోమరాజకవి - అచ్చంగా తెలుగు

శ్రీబాలగోపాల శతకము - పుసులూరి సోమరాజకవి

Share This

శ్రీబాలగోపాల శతకము - పుసులూరి సోమరాజకవి

పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవిపరిచయం:
బాలగోపాల శతకకర్త పుసులూరి సోమరాజకవి క్రీ.శ. 1500 నుండి 1700 మధ్యకాలమునాటి కవి. ఇతడు ఆర్వేలనియోగి బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడు, ఆత్రేయగోత్రజుడు. తణుకుతాలూకా "ఇలిందలపఱ్ఱు" గ్రామవాస్తవ్యుడు. బాలగోపాల భక్తుడు. ఈతని తల్లి ఉమాపతి. వీరిపూర్వీకులు మొదట పుసులూరి గ్రామవాస్తవ్యులని, తరువాత ఇల్లిందలపఱ్ఱు కి వలస వచ్చి అచ్చట స్థిర నివాసం ఏర్పర్చుకున్నారని తెలుస్తున్నది. అయితే ఇల్లిందలపఱ్ఱు గ్రామానికి వచ్చిన తరువాత ఈతను కొంతకాలం  దారిద్ర్యదుఖః మనుభవించినట్లు తెలుస్తున్నది. తండ్రి పాపమాంబ. ఇతనికి బాలగోపాల భక్తుడగుటచే "బాలకృష్ణదాసు" అనే వాడుకనామం కూడా కలదు.
ఈకవి రచించిన మూడు శతకములు ప్రస్తుతం దొరుకుతున్నవి:
1. ఇందుశతకము లేక చంద్రదూత. "ఇందో నందునిమంద నుండికద నీ వేతెంచుటల్" అనే మకుటంతో 116 ఏకప్రాస పద్యములు గల శతకము.
2. బాలగోపాల శతకము
3. నందనందన శతకము- "నందనందనా" అనే మకుటంతో వ్రాసిన ఏకప్రాస ఊత్పలమాలికల శతకము. దాదాపు 80 పద్యములు మాత్రమే దొరుకుతున్నవి. అత్యంత మనోహరమైన  శతకంగా పేర్కొనబడినది.
4. అప్పలేశ శతకము
5. బాలకృష్ణ శతకము
6. కృష్ణలీలామృతము
ఈ కవి శైలి ప్రవాహము, భావములు చదువరిని విడువవు.
ఈకవి గొప్ప అన్నదాతగా దూరదేశాలకు ప్రసిద్ధి చెందాడు. ఈతని కీర్తి విన్న నూజివీడు సంస్థాన ప్రభువు రాజా నారానరసింహప్పారావు బహద్దుర్ ఆదరించినాడు. ఈకవి నిరతాన్నదానము చేయుటకై ఈ రాజు ఇతనికి 40 పుట్ల మాన్యమును, ఉప్పులూరు, యండగండి, ఆరేడు గ్రామములను ఈచ్చి ఆదరించిరి. ఇల్లిందలపఱ్ఱునందు స్థిరనివాసం చేసుకున్నందుకు ఈ గ్రామాన్ని సోమరాజు ఇల్లిందలపఱ్ఱు అనే పేరు వాడుకలోకి వచ్చింది.
శతక పరిచయం:
బాలగోపాల శతకం "బాలగోపాల! కరుణాలవాల! నీలశైలపాలావనీపాల! చారులీల!" అనే మకుటంతో 108 సీసపద్యాల తో నిండిన భక్తిరస శతకం. నీలశైలపాలుడగు గోపబాలుని ఉద్దేశించి వ్రాయబడినది. నీలశైలమని శ్రీజగన్నాథమునకు మరియొక పేరు. శ్రీజగన్నాథక్షేత్ర సందర్శన సమయంలో ఈ కవి అక్కడ ఆశువుగా రచించినాడని ఒక కథనం. ఇందలి పద్యములు లీలాశుకకవి కృష్ణకర్ణామృతానుకరణలుగా కనిపిస్తాయి. నిందాస్తుతి, స్తుతి నింద మొద్లగు విశేషములు ఈ శతకమునందు అనేకము గలవు. కొన్ని పద్యాలను చూద్దాం.

సీ. నీనామసంభూతనిర్మలసుధఁ గొన్న, నాకిహ్వ కితర మనాదరమ్ము
నీకథాసల్లాపనిత్యోత్సవముఁ గొన్న, నాచెవి కితర మనాదరమ్ము
నీసుందరాకృతి నిరతమ్ముఁ గనుఁగొన్న, నాదృష్టి కితర మనాదరమ్ము
నీదాసజనసంగనిర్వృత్తిఁ గైకొన్న, నామది కితర మనాదరమ్ము
గాన సర్వేశ! దుష్కరకర్మ మాఁపి
దాశ్యసుఖ,ఇచ్చి యేలుమీ దయ దలిర్ప, (బాలగోపాల)
సీ. "మాధవా!" యనుసూక్తి మధురసుధారసా, స్వాదన రుచిఁ గొనె నాదుజిహ్వ
హరికథామృతసరోవరపురాణశృతి, మోదము రుచిఁ గొనె నాదువీను
లబ్జాక్షుకరుణాకటాక్షవీక్షణసుప్ర, సాదము రుచిఁ గొనె నాదు మనసు
నందసూనుపదారవిందసందర్శనా, పాదన రుచిఁ గొనె నాదుకోర్కె
అహహ! యింతయు నీయనుగ్రహము కాదె
కానఁ గలనైన నిన్ను నే మానఁజాల, (బాలగోపాల)
ఈ క్రింది నిందాస్తుతి పద్యాలు ఎంత  బాగున్నాయో గమనించండి.
సీ. కపటమాయోపాయఘనుఁడ వీ వంటివా, కపటమాయోపాయఘనుఁడ వీవు
జారచోరత్వసంచారి వీ వంటివా, జారచోరత్వసంచారి వీవు
పుణ్యజనాప్రియబుద్ధి వీ వంతివా, పుణ్యజనాప్రియబుద్ధి వీవు
పతితమానవపక్షపాతి వీ వంతివా, పతితమానవపక్షపాతి వీవు
అరయ స్వామివి సేవకుండనెడు సూక్తి
కల్లయగుటెట్లు సత్యమై చెల్లుఁగాక (బాలగోపాల)
సీ. రోటఁ గట్టితినా? విరోధులతో నిన్నుఁ, బోట్లాడు మంటినా? పొంది మాకుఁ
బనులు సేయమటంచుఁ బనిచితినా? (లేక), కోపించి నీపయిఁ గొండియములు
చెప్పితినా? (నిన్నుఁ జిన్నబుచ్చఁగ నెంచి), వెన్నదొంగ వటంచు విబుధసభలఁ
బాడితినా? గొల్లభామలఁ గూడితి, వంటినా? యేమైనఁ గంటకించి
ప్రాణప్రద మైన దొర వని ప్రస్తితింతు
మోముఁ జూపవు యెంతనిర్మోహి వయ్య (బాలగోపాల)
సీ. సచ్చిదానందవిశ్వాససారముకంటె, సౌఖ్యమా నీకు శైశవసుఖంబు
సకలాత్మసదనసంచారంబుకంటెను, విశదమా గోకులవిహరణంబు
బ్రహ్మాదిసురపరివారంబుకంటెను, ప్రాభవమా గోపపరిజనంబు
లక్ష్మీకటాక్షవిలాసంబుకంటె న, స్తోకమా గోపికాలోకనంబు
పరమభక్తజనప్రేమ దొఱఁగ కాత్మ
దివ్యమహిమానుభావంబు తెలియనీదు (బాలగోపాల)
ఈ కవి దర్శించిన బాలగోపాలుడు ఎలా ఉన్నాడో చూడండి.
ఒక చేత పెరుగు వంటక మూని వేఱొక్క, చేతిలో నుంచి భక్షించువాని
నూరగాయలు వేళ్ల నొయ్యన నిఱికించి, మునుమున్న వాచవిఁ గొనెడువానిఁ
దనచుట్టుఁ గూర్చున్నతనచెలికాండ్రకు, సరసభాషల ప్రొద్దు జరుపువాని
దవ్వేగియున్నగోతతిమళ్లిరా వేణు, కలనిస్వనంబునఁ బిలచువానిఁ
దలను మొలను (దాల్చు) పలుపుద్రాళ్లవాని
నిన్నుఁ గన్గొనుకోర్కెలోయన్న మాకు (గోపాల)
కొన్నిపద్యములు అనుకరణలుగా కనిపిస్తాయి.
సీ. "కృష్ణా" యనినమాత్ర కేవలపీయూష, మనుభవించిన మోదమగుచువచ్చె
"హరిహరి" యనుమాత్ర నానందజలధిలో, నోలలాడినభంగి నుండఁజొచ్చె
"దామోదరా" యని తలఁచినమాత్రాన, పులకించి నెమ్మోము పొంగఁజొచ్చె
"బాలకృష్ణా" యని పలికినమాత్రాన, గొబ్బున బాష్పముల్ గురియజొచ్చె
తలఁచినప్పుడె యీలాగు దర్శనంబు
గలిగినప్పటిసౌఖ్యంబుఁ దెలుపనగునె, (బాలగోపాల)
అనేపద్యం లో పాల్కూరికి సోమనాథ కవి పోకడలు కనిపిస్తాయి.
సీ.నినుఁ జెప్పుచదువులే నిగమంతసారముల్, నీనామములె మంత్రనిగదితములు
నీపదధ్యానమే నిశ్చలయోగంబు, నీపూజనమె కర్మనిచయఫలము
నీగుణచింతన నిరుపమమననంబు, నీభక్తినిష్ఠయె నియతతపము
నీక్స్థాలాపముల్ నిఖిలవేదార్థముల్, నీకథాగోష్ఠియే నిజముసుఖము
నిన్నుఁ జెప్పనిచదువులు, నీకుఁగాని
యర్థములు నెంచిచూడ నిరర్థకములు, (బాలగోపాల)
అన్న పద్యంలో పోతనామాత్య పద్యశైలి కనిపిస్తుంది.
శతకాంతపద్యాలలో కవి తనగురించి ఇలాగు చెప్పినాడు.
సీ. పుసులూరివంశజభూషణం బగునుమా, పతికిని బాపమాంబకు సుతుండ
శ్రీమదాత్రేయసుస్థిరగోత్రజుఁడ సోమ, నామాత్యుఁ డనుసమాహ్వయమువాఁడ
నమృతోప(మం బౌనుపాభిధానము) బాల, కృష్ణదాసాఖ్య(చేఁ గెరలువాఁడ)
సమ్యగష్టోత్తరశతపద్య (యుతముగ), సద్భక్తిమకరంద (సంస్తుతమిది)
యనఁగఁ గృతిఁ గూర్చి యిచ్చితి నవధరింపు
(మధికకరుణాకటాక్షవిన్యాస మొప్ప), (బాలగోపాల)
ఇంతచక్కని శతకాన్ని మీరుకూడా చదువుతారు కదూ
మీరు చదవండి. ఇతరులచే చదివించండి.
***

No comments:

Post a Comment

Pages