"టక్కు "టమారం - అచ్చంగా తెలుగు

"టక్కు "టమారం

Share This

(జ)వరాలి కధలు - 4 

"టక్కు "టమారం

 గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి ( సోమసుధ)


మనం నిలబడి భూమికి సమాంతరంగా చాపిన చేతిలో ఏ వస్తువునుంచినా క్రిందపడిపోకుండా నిలచి ఉంటుంది. కారణం అక్కడ అరచేయి భూమిపాత్ర వహించి, ఆ వస్తువుని పతనం కాకుండా ఆపుతుంది. సమాంతరంగా ఉన్న ఆ చేతిని కొంచేం పైకెత్తామనుకోండి. చేతిలోని ఆ వస్తువు జారి క్రింద పడిపోతుంది. అదే సమయంలో అరచేతికున్న వేళ్ళు ఆ వస్తువుని పట్టి ఉంచాయనుకోండి. మీరా అరచేతిని ఎన్ని కోణాలలో నిలిపినా, ఆఖరికి బోర్లించినా అరచేతిలోని వస్తువు క్రింద పడిపోదు. కారణం చేతివేళ్ళు ఆ వస్తువుని సురక్షితంగా కాపు గాయటమే! అరచేతిలోని ఆ వస్తువే నైతికవర్తనమనుకొంటే, పరిస్థితులు స్థిరంగా ఉన్నంత కాలం మానవ మనుగడ పతనమైపోదు. కానీ పరిస్థితులు అస్థిరమైతే మానవజాతికి పతనం తప్పదు. సమాజంలో అహంకారం పెచ్చుమీరి జాతిపతనానికి లోనుజేస్తున్నప్పుడు, ముఖ్యమైన అయిదు కళలు చైతన్యమై తమ విధిని సరిగా నిర్వర్తిస్తే, ఆనైతిక పతనాన్ని నివారించగలం. అరచేతిలో వేళ్ళలా యీ సమాజ పతనావస్థను నివారించగలిగే ఆ అయిదు కళలే సాహిత్యం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, నాట్యం. ప్రతి మనిషిలో అనేక భావనాతరంగాలు రేగుతుంటాయి. అయితే వాటికి అందరూ అక్షరరూపం యివ్వలేకపోవచ్చు. కానీ ఆ భావనాతరంగాలను అక్షరరూపంలోకి మార్చి సమాజ మనుగడకు కావలసిన నీతిచూత్రాలను, ఆర్ధిక సూత్రాలను చాణుక్యుడి లాంటి ఎందరో మహనీయులు వ్రాసి యిచ్చారు. అంటే యిక్కడ సాహిత్యం మానవసమాజానికి సంస్కృతిని, రీతిని, నీతిని నిర్దేశిస్తోంది. మనిషి పుట్టినఫ్ఫటినుంచి చనిపోయేవరకూ జరిగే జీవనయాత్రలో లయబద్ధమైన జోలపాటలు, భావనాగీతాల రూపంలో సంగీతం ఒక భాగమైపోయింది.ఆలయాలలో మ్రోగే జేగంటలనుంచి వచ్చే శబ్దతరంగాలు మనిషికి గగుర్పాటు రూపంలో అతని రక్తనాళాలలో ప్రవహించే రక్త వేగాన్ని పెంచి, ఆ రక్తప్రవాహ మార్గంలో ఉన్న ఆడ్డంకులను నెట్టివేసి సవ్యంగా రక్తప్రవాహం జరిగేలా నియంత్రిస్తాయి. మనలో మానసిక కల్లోలం రేగి మారణహోమం వైపు ఆడుగు వేసే సమయంలో సంగీతం మానసికశాంతిని అందించి ఆ కల్లోలాన్ని నివారిస్తుంది. ఒకనాడు గుహలలో తలదాచుకొంటూ ఆటవిక జీవనం గడిపిన సమాజం, తనలో రేగిన భావాలకనుగుణంగా నివాసాలను, మానసికశాంతినిలయాలైన ఆలయాలను, బాటల వంటి సౌకర్యాలను సమకూర్చుకోవటానికి, మరొకమాటలో చెప్పాలంటే ప్రణాళికాబద్ధమైన సమాజ రూపకల్పనకు దారి చూపినది శిల్పకళ. ప్రకృతిలో కనిపించే అందాలకు, సామాజిక నిర్మాణానికి నకలును రూపొందించి, దానిని యితర ప్రాంతాలకు, ముందుతరాలకు చేరవేసి, ఆ ప్రాంతవాసుల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చే సమాచార సాధనమే చిత్రలేఖనం. సమాజానికి లయబద్ధమైన ఋజువర్తనను, ఏకాగ్రతను నేర్పేది నాట్యకళ. వేగంగా సాగే నాట్యంలో ఒక్క తప్పటడుగు పడితే నర్తించేవారు కూలబడిపోతారు. అలా కూలబడకుండా ఉండాలంటే ఏకాగ్రత అవసరం. ఆధునికత వైపు పరుగులు తీసే యీ సమాజానికి ఏకాగ్రతను నేర్పేది నాట్యకళ. అధికారలాలసతో యుద్ధభూమిలో రక్తపుటేరులు పారించే రాచరికవ్యవస్థ కూడా యీ అయిదు కళలను ఆదరించి , సామాజిక పతనాన్ని నివారించి సంస్కృతీ పరిరక్షణ చేసుకోగల్గింది. కానీ నేడు యీ అయిదు కళలను స్వార్ధబుద్ధితో ఆయా కళాకారులు పతనం చేస్తున్నారు. సాహిత్యం భట్రాజు పొగడ్తలకు పరిమితమైపోయింది. పిచ్చికేకలే సంగీతమని, కుప్పిగంతులే నాట్యమని, నాలుగు పిచ్చిగీతలే చిత్రలేఖనమని నిర్వచించి తమ జబ్బలు తామే చరుచుకొంటున్నారు. చిరకాలం నిలబడే శిల్ప రూపకల్పనే మృగ్యమైపోయింది. ఇలా విలువలు తరిగిన కళలతో యీ సమాజం పతనమైపోకుండా ఎంతకాలం నిలబడగలదు? వదులుగా పట్టుకొన్న వేళ్ళమధ్యనుంచి వస్తువు జారిపోకుండా ఉంటుందా? బాధ్యతారాహిత్యమైన యీ కళాకారుల వల్ల సమాజం పతనమైపోకుండా ఉంటుందా? ఆలోచించవలసిందే? @ @ @
" మీరీరోజు నిద్రపోయేట్టుగా లేరే?" వరాలి ప్రశ్నతో వ్రాస్తున్న నా చేతిలోని కలం జారిపోయింది. " వంటింట్లో పనైపోయిందా?" పెదాలపై నవ్వు పులుముకొంటూ అడిగాను. నా నవ్వులో నిజాయితి లేదని వరాలు గ్రహించినట్లుంది, "ఆ! నిద్రపోదామనుకొంటున్నా! మీరొచ్చి జోల పాడతారేమోనని చూస్తున్నా! " మంచంపై నడుము వాలుస్తూ అంది. " ఈ రోజు వస్తూంటే దారిలో ఒక గొడవ చూశానోయి! వెంటనే మంచి క్రైంకధ మనసుకు తట్టింది. జోల పాడమని గోలపెట్టక యీ రోజుకి నన్నొదిలేయి " అన్నాను. " మీకు కధ వ్రాయటానికి యింతకన్నా మంచి ముహూర్తం దొరకలేదా? అర్ధరాత్రి మద్దెలదరువేంటండి బాబూ?" వరాలు తలకొట్టుకొంది. " మద్దెలశబ్దం విన్నవాళ్ళకి చిరాకు పుట్టించొచ్చు గానీ మద్దెల వాయించే వాడికి పగలా, రాత్రా తెలియదు వేళ్ళలో తీట పుట్టితే మద్దెల వాయించేయాల్సిందే! కళాకారుడిలో ఊపు వచ్చిందంటే ఆపకూడదు. ఆరోగ్యం పాడైపోతుంది " అన్నాను. " సరే! మీరిలా గదిలో పెద్దలైటు వేసి వ్రాస్తూంటే, నాకు నిద్ర పట్టదు. టేబిల్ లైట్ ఏమైంది?" చిరాగ్గా అడిగింది. " బల్బు మాడిపోయింది" " పోయిందీ! మీ దెబ్బకి జడిసిపోయుంటుంది. ఆఫీసునుంచి వచ్చేటప్పుడు బజారునుంచి బల్బు తెచ్చుకోవచ్చు కద! " " మర్చిపోయాను " " మీ మగాళ్ళంతా యింతే! పెళ్ళి కానప్పుడెలా ఉంటారో తెలీదు గాని పెళ్ళయితే మాత్రం, మరచెంబులో మంచినీళ్ళ దగ్గరనుంచి అన్నింటినీ అర్ధాంగే అమర్చిపెట్టాలంటారు. సర్లెండి! రేపు ఉదయాన్నే యింటి ఎదురుగా ఉన్న షాపునుంచి నేనే బల్బు తెచ్చిపారేస్తాగానీ, యీ వ్రాతకోతలేవో రేపు చూసుకోవచ్చుగా! " అంటున్న వరాల్ని గంభీరంగా చూశాను. " అల్ల సాని అదే వరూధిని అని దేవలోకపు వేశ్య కధ వ్రాసిన అల్లసాని వారికి ప్రశాంతమైన ప్రదేశంలో అందమైన ప్రేయసి నోటికి కర్పూర తాంబూలం అందిస్తే గాని కధ వ్రాయలేనన్నాడట! పాతాళభైరవి, మాయాబజార్ లాంటి చిత్రాల మాటల మాంత్రికుడు పింగళి వారు అర్ధరాత్రి రెండు గంటలవరకూ పెన్ను వదిలేవాడు కాదట! నాకూ అల్లసానివారిలా ఆశలేం లేవు. ఇలా వ్రాయాలనిపించినప్పుడు టేబులు, పుస్తకం, నిశ్శబ్దవాతావరణం ఉంటే చాలు. నేనేం ఆ కాలం వాళ్ళలా ఆశుకవిని గాదు. అందువల్ల యీ రోజు తన్నుకొచ్చిన ఊహలు రేపు రావు. అవి వచ్చినప్పుడే పని ప్రారంభించాలి. నువ్వు నన్ను వదిలేస్తే నేనా పనిలో పడతాను" తప్పదన్నట్లు వరాలి వైపు చూశాను. వెంటనే కోపంగా దుప్పటి తీసి నిండా ముసుగేసుకొని పడుకొంది. " అదీ మంచి పిల్ల లక్షణం " గొణుగుతున్నట్లుగా అన్నాను. వెంటనే దుప్పటిని ప్రక్కకి తోసి మంచంపై లేచి కూర్చుంది. " మీరన్న పింగళి వారు పెళ్ళి మానేసి జీవితాంతం కావ్యకాంతకే అంకితమైపోయారు. కానీ మీరలా కాదే! మీరు కధలు వ్రాస్తారని తొలిరాత్రి చెబితే పిచ్చిదానిలా సంబరపడిపోయాను. ఇలా అర్ధరాత్రి కూర్చుని కధలు వ్రాస్తారని పెళ్ళిచూపులనాడే తెలిసుంటే ఆలోచించేదాన్ని"
" చెంబులో చేయి యిరుక్కున్నాక , ' దానిలో చేయి పెట్టక పోతే బాగుండేద ' ని అనుకొంటే లాభమేంటి చెప్పు. వెలుతురు కళ్ళలో పడి నిద్రపట్టకపోతే యిందాకట్లా దుప్పటి నిండా కప్పుకో! పడుకోమ్మా! " వరాల్ని బుజ్జగించాను. ఎంత ప్రయత్నించినా నేను పుస్తకం వదలనని గ్రహించి తిరిగి మంచంపై ఒరిగిపోయింది. అయిదు నిమిషాల్లో ఆమెనుంచి ఏ స్పందనా రాకపోయేసరికి తిరిగి నా రచనావ్యాసంగంలో పడ్డాను. @ @ @
అర్ధరాత్రిపూటే నేను వ్రాస్తున్న కధ మొదలవుతుంది. అర్ధరాత్రి వాతావరణాన్ని వర్ణిస్తున్న నేను వరాలు పడుకొన్న మంచం కిర్రుమనటంతో త్రుళ్ళిపడ్డాను. వరాలు నిద్రలో యిటుప్రక్కనుంచి అటుప్రక్కకు ఒత్తిగిల్లటాన మంచం కిర్రుమన్నదని గ్రహించి, నాలో నేనే నవ్వుకొన్నాను. అంటే కధారచనలో నేనంతగా లీనమైపోయానన్న మాట. తిరిగి నా రచనావ్యాసంగాన్ని కొనసాగించాను.
" సూర్యుణ్ణి హత్య చేసిన చీకటి దేశంలో అరాచకంలా తీవ్రమైంది. కళ్ళు కూరుకుపోయిన ఊరు కునుకుదీస్తోంది. క్రొత్తకోడలి సణుగుళ్ళా సన్నగా వినిపించే గాలిమోత. ఎవరో దిష్టి తీసి విసిరేసిన ఉప్పురాళ్ళలా ఆకసంలో అక్కడక్కడ మినికే తారలు. పదేళ్ళ కుర్రాడు పారేసుకొన్న తెల్లగోళీలాంటి చంద్రుడు. గోళీ పోగొట్టుకొన్న కుర్రాడి గోలలా కీచురాళ్ళ శబ్దం."
టక్. . . . . టక్ . . . . టక్. . . . చెవికి శబ్దం సోకి నా ఆలోచనలు తెగిపోయాయి. తలత్రిప్పి వరాలివైపు చూశాను. మూడో అంకెలా ముడుచుకు పడుక్కొంది. గోడగడియారాన్ని చూస్తే, అది తొమ్మిదిగంటలకే ఆగిపోయింది. మరల నిశ్శబ్దం ఆవరించటంతో కధారచనను కొనసాగించాను.
" జనసంచారం లేని రోడ్డుమీద అతని పాదాలు పయనిస్తున్నాయి. అతని ముందున్న రోడ్డు త్రాచుపాములా మెలికలు తిరుగుతూ సాగిపోతోంది. రోడ్డు ప్రక్క నీడల్నీ, నిదురించే వాడల్ని గమనించకుండా దాటిపోతున్నాడు "
టక్. . . . . టక్ . . . . టక్. . . .
అసంకల్పితంగానే కాళ్ళు కుర్చీమీదకి లాక్కున్నాను. కుర్చీలో మోకాళ్ళపై కూర్చుని క్రిందకు చూశాను. తాచుపాము కాదుకదా తాడుముక్క కూడా లేదక్కడ. నా భయానికి నాలోనే నవ్వుకొంటూ కాళ్ళు క్రిందకి దించి వ్రాయటం మొదలెట్టాను.
" ఆ నిర్జన నిశీధిలో అతను ఒంటరి . జీవితంలో తాను పొందిన అపజయాలను, అవమానాలను తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకోవాలని నదీతీరానికి పోతున్నాడు. చావుకే తెగించినవాడికి యీ చిన్నచిన్న శబ్దాలొక లెక్కా? "
టక్. . . . . టక్ . . . . టక్. . . . ఒక్కక్షణం గుండె ఆగినట్లయింది. భయంతో రక్తం నీరై ఒళ్ళంతా చెమట పట్టింది. అర్ధరాత్రి వేళ. . .ఎక్కడిదీ శబ్దం?. . .నా దృష్టంతా కధ మీదనుంచి యీ శబ్దం మీదకు మళ్ళింది. పదేళ్ళ క్రితం యీ యిల్లొక హాస్పిటలని విన్నాను. బహుశా యిది శవాలగది ( మార్చురీ) అయి ఉంటుంది. ఈ ఆసుపత్రి డాక్టరు నిర్లక్ష్యం వల్ల శస్త్రచికిత్స(ఆపరేషను) మధ్యలో కన్నుమూసిన " ఆశాజీవి " ఆత్మ దయ్యమై ఉండొచ్చు. అప్పుడా డాక్టర్ని దయ్యం రూపంలో హడలెత్తించి ఆసుపత్రి మూసేయించి ఉండవచ్చు. పోనీ పనైపోయాక తను వెళ్ళిపోక యీ రాత్రిపూట నన్ను చంపటమెందుకు? అన్యాయంగా నా కధలో " అతన్ని " ఆత్మహత్యకు పురికొల్పుతున్నందుకా?
టక్. . . . . టక్ . . . . టక్. . . .
ఈసారి శబ్దవేగం పెరిగింది. ఈ గోలలో గుండెదడ పెంచుకొని భయపడి చావటమెందుకు? కధ సంగతి రేపు చూసుకోవచ్చుననుకొంటూ వ్రాస్తున్న పుస్తకం మూసేసి వరాలి ప్రక్కన మంచంపై వాలాను.
టక్. . . . . టక్ . . . . టక్. . . .
గదిలో లైటార్పి పడుకొన్నానేమో! ఆ చీకట్లో నీడలాంటి రూపమేదో మంచంపై నా ప్రక్కనే కూర్చున్నట్లు అనిపించి, కాళ్ళదగ్గర పడున్న దుప్పటిని నిండా కప్పుకొన్నాను. ఎవరో దుప్పటిని పట్టిలాగుతున్నట్లు అనిపించి త్రుళ్ళి పడ్డాను. పైన తిరిగే ఫానుగాలికి దుప్పటి కదిలిందా? నా ప్రక్కనే కూర్చున్న రూపం లాగిందా? అంతు చిక్కటం లేదు. తొలగిపోతున్న దుప్పటి అన్ని కొసల్ని నా శరీరభాగాలతో గట్టిగా నొక్కిపెట్టాను. నాలో గుండెదడ పెరుగుతోంది. అప్పుడే చిన్నప్పుడు మా అమ్మమ్మ " హనుమంతుణ్ణి చూస్తే దయ్యాలకి భయమని, అందుకే హనుమాన్ చాలీసా చదివితే దయ్యాలు పారిపోతాయని "" చెప్పిన విషయం గుర్తొచ్చింది. పళ్ళ బిగువున హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభించాను.
"కంచనవరణ విరాజ సువేశా - కాననకుండల కుంచిత కేశా. . . ."
పది నిమిషాల్లో పారాయణ పూర్తి చేయగానే శబ్దం పూర్తిగా ఆగిపోయింది. కొద్ది క్షణాలు శబ్దం రాకపోయేసరికి దుప్పటి ముసుగు తీశాను. నా ప్రక్కన కూడా ఏ రూపం లేదు. మెల్లిగా గదిలో లైటు వేసి, టేబిల్ పైనున్న పుస్తకాన్ని తెరిచాను.
" నదీతీరంలో యిసుక ఆత్మహత్య చేసుకోవద్దని పాదాలను పట్టి బ్రతిమాలుతోంది. పసిపిల్లాడు ప్రక్కవాడి బలపం లాక్కున్నట్లు, యిసుకలో కూరుకుపోయే కాళ్ళను అతను బలవంతంగా లాక్కొంటున్నాడు. తన గుడి కడతానని జనాల నుంచి పోగోసిన చందాడబ్బును తినేసిన మోసగాళ్ళను చూసి తెల్లబోయిన దేవుళ్ళా, చంద్రుడు వెల్లమొహం వేశాడు. ప్రక్కింటి అమ్మాయిని పడేయాలని బాత్రూంలో కచేరీ చేసే కుర్రాళ్ళా, దూరంగా శ్మశానంలో నక్క ఊళ వేస్తోంది.
టక్. . . . . టక్ . . . . టక్. .
శబ్దతీవ్రత హెచ్చింది. మరొకసారి హనుమాన్ చాలీసా చదివినా శబ్దం వస్తూండటంతో, అది దయ్యాల పని కాదని నిర్ధారించుకొన్నాను. మరి యిందాక మంచంపై నా ప్రక్కన కూర్చున్న రూపమేంటి? భయంతో బుర్ర కూడా పని చేయటంలేదు. గదిలో లైటు తీసేయగానే కళ్ళు చీకటికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకొంటుంది. ఆ సమయంలో చీకట్లో చూస్తే ఏదో రూపం ఎదురుగా ఉన్నట్లు భ్రమ కలగటం సర్వసాధారణం. ఆ చీకటికి కళ్ళు అలవాటు పడ్డాక ఆ భ్రమకల్పించే రూపాలు మాయమవుతాయి. ఈ నిజం గ్రహించాక నాలో భయం కొంత తగ్గింది . టక్. . . . . టక్ . . . . టక్. .
అది దయ్యాలపని కాపోతే యీ శబ్దం ఎక్కడిది? బస్తీల్లో గస్తీ తిరిగే గూర్ఖా చేతిలోని లాఠీతో ప్రతీ గుమ్మం ముందు కొడతాడు. ఆ శబ్దం కాదు కదా! అదే అయితే ముందు దూరంగా వినిపించి క్రమేపీ దగ్గరై మళ్ళీ దూరం కావాలి. కానీ యిక్కడ శబ్దంస్థాయి స్థిరంగా ఉంది. కొంపదీసి దొంగలెవరైనా గోడ తవ్వుతున్నారా? ఆలోచన రాగానే అదిరిపడ్డాను. అసలే అద్దె తక్కువని పాతకొంప అద్దెకి తీసుకొన్నాను. వాళ్ళు గోడ బద్దలు గొడితే యిల్లు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. నిద్రపోతున్న వరాలి దగ్గరకెళ్ళి వణుకుతున్న చేతితో పట్టి కుదిపాను.
" అబ్బా! ఏంటండీ అర్ధరాత్రి అంకమ్మ శివాలు? " బద్ధకంగా గొణుగుతూ తొలగిపోయిన దుప్పటిని మళ్ళీ మీదకు లాక్కుంది. " శివాలు కాదు. . .శవాలు. . . శబ్దాలు . . . .దొంగలు " నా కంగారుకి త్రుళ్ళిపడి లేచింది.
" శవాలేమిటి? దొంగలేమిటి? మీరు వ్రాసిన క్రైం కధ నిద్ర లేపి మరీ వినిపించాలా? " అని ఆవులించింది. " కధాలేదూ, కాకరకాయ లేదు. అరగంటనుంచి ఏదో శబ్దం వినిపిస్తోంది " చెప్పాను.
టక్. . . . . టక్ . . . . టక్. .
" అదే. . .అదే ముందు దయ్యాలనుకున్నాను " నా మాట పూర్తి కానేలేదు.
" మనం కల్పించుకొన్న భయాలే గానీ దయ్యాలే లేవండీ! "
వరాలికెంత ధైర్యం? అసలు దయ్యాలే లేవంటోంది. సరే! దయ్యాలున్నాయా? లేదా? తర్వాత తేల్చుకోవచ్చు.
" మరి ఆ శబ్దం ఎక్కడిది? పహరా కాసే గూర్ఖావాడి కర్ర చప్పుడా?"
" వాడు విజిల్ కూడా వేస్తాడుగా!"
అదీ నిజమే! భయంతో జనరల్ నాలెడ్జి కూడా లేకుండా పోతోంది.
" ఏ దొంగయినా గోడలు తవ్వుతున్నాడా? "
" చూసొస్తా! " అంటూ మంచం దిగింది.
" ఎక్కడికీ? మతిగాని పోయిందా? దొంగల్ని తలుపు తీసి మరీ ఆహ్వానిస్తానంటావేంటి?" కేకలేశాను.
" ఆహ్వానిస్తే మాత్రం వాళ్ళు పట్టుకెళ్ళటానికి ఏముంది? నగా? నట్రా? సహజసౌందర్యం పేరు చెప్పి మీరు నగలు చేయించనూ లేదు, ఆదర్శం పేరుతో మావాళ్ళనుంచి తీసుకోనీయనూ లేదు "
సమయం వచ్చింది కదాని దెప్పిపొడుస్తోందిరా బాబూ!
" సరి! సరి! ఆ కధ వ్రాయటం కట్టేసి పడుకోండి. తెల్లారాక చూడొచ్చు "
ఆమె మాటలకు కోపం వచ్చింది.
" తెలివి తెల్లారినట్లే ఉంది. వచ్చిన దొంగ వెలుతురు వస్తే వెళ్ళిపోక తెల్లవార్లు చప్పుడు చేస్తూ కూర్చుంటాడా? "
" రామచంద్రా !" నా మాటలకు తల కొట్టుకొందామె. " వెళ్ళి చూస్తానంటే వద్దంటారు. ఏదేదో ఊహించుకొని భయపడతారు. అంత ధైర్యం లేనివాళ్ళు అర్ధరాత్రి క్రైం కధలేం వ్రాస్తారండీ బాబూ? . . . .వ్రాసింది చాలు గానీ పడుకోండి " అంటూ వెళ్ళబోయింది.
" ఎక్కడికీ? " కంగారుగా అడిగాను.
" వీధిలోకి కాదయ్యా స్వామీ! వంటింట్లోకి. . . .మీతో వాదించి గొంతెండిపోయింది. మంచినీళ్ళు త్రాగి వస్తా" చిరాకు పడే నాకు చిరునవ్వుతో బదులిచ్చి వంటింటి వైపెళ్ళింది.
టక్. . . . . టక్ . . . . టక్. .
" ఏమండోయి! ఒకసారిలా రండి " వరాలి కేకతో నా గుండె జారిపోయింది. దొంగవెధవెవడో వంటింటి గోడ తవ్వేసి సామానంతా బయటికి చేరేయలేదుకదా! అంత సామాను కొనాలంటే చాలా ఖర్చు.
" వస్తున్నారా? " వరాలి కేకకు యిహంలో పడ్డాను. వంటింట్లో యింకా ఆ దొంగవెధవ ఉంటే వరాలికి హాని చేస్తాడుగా! ఆ ఆలోచన రాగానే వంటింటివైపు ఉరికాను.
వంటింటి గుమ్మంపై చేయి ఆనించి , కంగారుగా వస్తున్న నన్ను చూసి చిరునవ్వుతో చూసింది.
" చూశారా? అరగంటనుంచి మీతో ఆడుకొన్న మీ దయ్యం. . . మీ దొంగ. . . . అదే ." అంటూ గాస్ స్టవ్ ప్రక్కన గూట్లో కూరల సజ్జవైపు చూపించింది.
టక్. . . . . టక్ . . . . టక్. .
అదే శబ్దం. అంతవరకూ హడిలి చచ్చిన నా భయానికి సిగ్గుపడ్డాను..
" నాలుగురోజులనుంచి కూరగాయలు కొట్టేస్తోందని ఆ సజ్జ ప్రక్కనే ఎలుకలబోను పెట్టాను. బోనులో పడ్డ ఎలుక బయటకు పోవాలని శబ్దం చేస్తుంటే మీరేదేదో ఊహించుకొని కంగారు పడిపోయారు. అంతేగాని ఆ శబ్దం ఎక్కడినుంచి వస్తోందో లేచి చూశారా? ఆధునిక రచయితలు కద! ఏ.సి. రూముల్లో కూర్చుని బీరు తాగుతూ బీదప్రజల గాధలు వ్రాస్తూ సన్మానాలు కొట్టేస్తూంటారు, సంఘసంస్కర్తలా పోజిస్తారు. సంపాదనే ధ్యేయంగా మసాలా పేరుతో అసహజత్వాన్ని కధల్లో చొప్పించి వ్రాయటమే తప్ప, అసలిది యిలా సాధ్యమేనా? అని ఒక్క క్షణం ఆలోచించరు కదా! ఆ రోజుల్లో విధవా వివాహాన్ని ప్రోత్సహించిన కందుకూరి వారు స్వయంగా ఒక విధవను వివాహం చేసుకొన్నారు. ఆ సంస్కారం యీ కాలపు రచయితల్లో ఉందా? సమాజానికి పనికి రాని, సంస్కరించలేని టక్కుటమారాల సాహిత్యాన్ని యీ సమాజంపై పడేసి మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు కదండీ! నేను మిమ్మల్ని ఒక్కళ్ళనే అనటం లేదు. మీ గురించి కాదు. గానీ రచయితలందరినీ అంటున్నాను. ఎదుటివారికి నడవడిక గూర్చి చెప్పే ముందు , రచయిత ముందు తనకు సంస్కారం ఉందో, లేదోచూసుకొంటే మంచిది " పాఠం పూర్తి కాగానే పరుగులాంటి నడకతో వచ్చి మంచంపై ముసుగేసింది. నిద్రపోయేముందు తనకు జోలపాడనందుకే ఆమె ఈ అవకాశాన్ని వాడుకొందని గ్రహించాను. మెల్లిగా వచ్చి టేబులుపై పుస్తకాన్ని మూసేసి వరాలి ప్రక్కన చేరాను. " ఈ నెల జీతం రాగానే ఫ్రిజ్ కొంటానోయి" అన్నాను. " ఎందుకులెండి? యీ ఫ్రిజ్ వల్ల ఆరోగ్యాలు పాడవుతాయని కొనటం లేదని మీరే చెప్పారుగా! " అందామె. " అది నిజమే! కానీ ఫ్రిజ్ లో కాయగూరలు దాచుకొంటే యిలా కూరలసజ్జ ప్రక్కన ఎలుకలబోనులు పెట్టడం, అందులో పడ్డ ఎలుకలు అర్ధరాత్రి నన్ను కధలు వ్రాసుకోనీకుండా యిబ్బంది పెట్టడం నివారించవచ్చు కద! "
" అంతేగానీ అర్ధరాత్రీ కధలు వ్రాయటం మానుకోలేనంటారా?. మిమ్మల్ని. . ." అంటూ తన తలగడ తీసి సున్నితంగా నాపై విసిరింది.
టక్. . . . . టక్ . . . . టక్. .
" థాంక్యూ! " అంది వరాలు.
" నో మెన్షన్ " అన్నాను బదులుగా.
" థాంక్స్ చెప్పింది మీకు గాదు. ఎలుకకి "
" దేనికి? "
" నేను పిలిస్తే కధ వ్రాసుకోవాలి అన్నారు. ఏం చేయలేకపోయాను. అది తన టక్కుటమారంతో మీలో కధ వ్రాసే కోరిక చంపేసి యిలా ప్రక్క మీద చేర్చింది " అంటూ వెళ్ళి లైటు ఆర్పేసి వచ్చింది. గదిలో చీకటి నిండినా మా మదిలో వెలుతురు నిండింది.
@ @ @

No comments:

Post a Comment

Pages