ఉత్తరాయణం - అచ్చంగా తెలుగు

ఉత్తరాయణం

Share This

ఉత్తరాయణం

పోలంరాజు శారద 


సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చాడు. సంక్రాంతి పండగ వెళ్ళిం తర్వాత కూడా ఇంకా  చలిగాలులు వీస్తూనే ఉన్నాయి.  బలరామయ్య వసారాలో పడక్కుర్చీలో కూర్చొని గేటువైపే చూస్తున్నాడు.
"తాతయ్యా వంటిగంట అయింది. ఇంకా భోజనానికి లేవలేదే?" అప్పుడే బయటి నుండి వస్తూ అడిగాడు మనుమడు వేణు. బొంబాయిలో ఉద్యోగంలో ఉన్న వేణు నాలుగురోజుల సెలవులకు ఇంటికి వచ్చాడు. తాతయ్య భోజనం అయ్యేదాకా వసారాలో కూర్చొని ఆ తర్వాత లోపల పడుకోవటం అలవాటు. అటువంటిది ఈ రోజు ఇంకా వసారాలోనే ఉండేటప్పటికి అడిగాడు.
"అమ్మాయి దగ్గర నుండి ఉత్తరం వచ్చి చాలా రోజులైందిరా. ఈ రోజైనా వస్తుందేమో! పొద్దుటి టపాలో లేవన్నాడు. ఇదిగో రెండో టపా వచ్చే వేళయింది. ఇప్పుడేమైనా వస్తుందేమోనని చూస్తున్నానురా."
"సుభద్రమ్మమ్మ దగ్గర నుండి  ఉత్తరం ఏమిటి తాతయ్యా......" ఇంకా ఏదో చెప్పబోతుండగానే లోపలి నుండి "అరే బాబూ" అంటూ గబగబ బయటకు వచ్చిన పిన్ని అమ్మ చెరో జబ్బ పట్టుకొని పెరట్లోకి లాక్కెళ్ళారు.
"ఏమయిందమ్మా? ఎందుకు ఇట్లా లాక్కొస్తున్నారు?" ఆశ్చర్యంగా అడిగాడు వేణు.
"ఒరే నాయనా కాస్తలో కొంప ముంచేవాడివి కదరా! తాతయ్యకు సుభద్ర అమ్మమ్మ సంగతి ఇంకా తెలియదు."
"అదేంటమ్మా నెలరోజులు అవుతున్నా తాతయ్యకు తెలియకపోవటమేంటీ?" నమ్మలేనట్టు కొద్దిగా కోపం జోడించిన గొంతుకతో అరిచాడు.
"ఓరినీ, కాస్త గొంతు తగ్గించరా నాయనా. అసలే పెద్ద వయసు. ఈ సంగతి తెలిస్తే తట్టుకోలేడు. మీ నాన్న బాబాయి పెదనాన్నలు అన్ని ముగించుకొని రేపోమాపో ఇళ్ళు చేరుతారుగా, అప్పుడు నెమ్మదిగా చెప్పొచ్చని ఊరుకున్నాము." నచ్చ చెప్పుతున్నట్టు పెద్దమ్మ వివరించిన తరువాత కాస్త శాంతించాడు వేణు.
"తాతగారూ, ఈ రోజు కూడా మీ ఉత్తరం రాలేదండి." అన్న పోస్ట్‌మాన్ మాటలు విన్న బలరామయ్య , "వడ్డించమ్మా కాళ్ళు కడుక్కొని వస్తాను." అంటూ నెమ్మదిగా పడక్కుర్చీలోంచి లేచాడు.
"ఏమిటో అమ్మాయి . ఈ సారి ఉత్తరం వ్రాయటం మరీ ఆలస్యం చెసింది. ఎట్లా ఉన్నదో ఏమిటో?" స్వగతంలా అనుకుంటూ పీట మీద కూర్చున్న మామగారి వైపు కోడళ్ళు  ఒకరి మొహం ఒకరు చూసుకొని వడ్డన ప్రారంభించారు.
గదిలోకి వెళ్ళి కూర్చున్న వేణు ఆలోచనలో పడ్డాడు.
తాతయ్య ఈ విధంగా పోస్ట్‌మాన్ కోసం ఎదురు చూడటం ఇంట్లో వాళ్ళకు కొత్తేమీ కాదు. ఆ వీధిలోకి వచ్చే ప్రతి పోస్ట్‌మాన్‌కు ఆయనకు  ఉత్తరాల ఉదంతం గురించి బాగా తెలుసు.
అరవై ఏళ్ళ నుండి జరుగుతున్న కథే మరి.
పదేళ్ళ క్రితం జరిగిన సంఘటన వేణు కళ్ళ ముందుకు వచ్చింది.
సెలవులకు  ఇంటికి  వచ్చినప్పుడు తాతయ్య తన రేకు పెట్టె ముందు కూర్చొని పెద్ద బొత్తి కాయితాలు సర్దుకోవటం కనిపించింది.
"ఏమిటి తాతయ్యా! చిత్రగుప్తుడి చిట్టాలాగా కాయితాలు చూసుకుంటున్నావు?" నవ్వుతూ పక్కన చేరాడు.
పక్కనే మంచం మీద కూర్చున్న ఆయన భార్య, "అవన్నీ ఆయన పంచప్రాణాలురా. వారానికొకసారైనా ఆ కాయితాలన్ని ముందేసుకొని చదవకపోతే మీ తాతయ్య ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది." మురిపెంగా భర్తవైపు చూస్తూ అన్నది.
ఆ మాటలేమీ పట్టించుకోకుండా ఆయన దీర్ఘంగా రంగుమారిపోయి ముట్టుకుంటే పొడిపొడి అయిపోతాయేమో అన్నట్టు ఉన్న కాయితాలలో మునిగిపోయాడు.
"అవన్నిగత యాభై ఏళ్ళగా మీ సుభద్రమ్మ అమ్మమ్మ  రాసిన ఉత్తరాలురా. అవి చదువుకొని మురిసిపోతూ ఉంటారు." అని నాయనమ్మ మళ్ళీ చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు వేణు. ఆయనకు చెల్లెలి వద్ద నుండి క్రమం తప్పకుండా ఉత్తరాలు వస్తాయని తెలుసు, చెల్లెలంటే ఎంత అభిమానమో తెలుసు కాని ఆ ఉత్తరాల మీద అంత మమకారం ఉన్నట్టు ఇప్పుడే తెలుస్తోంది. అనుకొని మళ్ళీ ఆ కాగితాల వైపు చూసాడు. ఏదో ఆలోచన వచ్చినట్టు గబగబ బట్టలేసుకొని బయటికి వెళ్ళి అరగంటలో వచ్చాడు.
సాయంత్రం తాతయ్య నాయనమ్మ గుడికి వెళ్ళిన సమయంలో ఆ పెట్టె తెరిచి చూసాడు.  తారీఖులవారిగా ఒక పద్ధతిలో అమర్చి ఉన్న ఉత్తరాలను తీసాడు. తాను తెచ్చిన ప్లాస్టిక్ ఫైల్ ఫోల్డర్‌లు తీసి వాటిని జాగ్రత్తగా వాటిల్లో అమర్చి మళ్ళీ యధాప్రకారం పెట్టెలో పెట్టేసాడు.
మరుసటి రోజు పెట్టె తెరిచిన బలరామయ్య ఫోల్డర్లు చూసి "ఏరా వేణూ ఇది నీ పనేనా?" అంటూ అతని చెవి పట్టుకొని అడిగాడు. "అబ్బా తాతయ్య వదులు. మరి నీ పంచప్రాణాలు అట్లా పాడైపోతుంటే చూడలేక వాటిని భద్రంగా పంజరంలో బంధించాను. బాగుందా?"
"ఒరే నాయనా మంచి పని చేసావురా. ఈ ఉత్తరాలను ఎట్లా భద్రపరచాలా అని ఇన్నాళ్ళూ దిగులు పడుతున్నానురా."  అప్పటి నుండి క్రమం తప్పకుండా తానే వచ్చిన ఉత్తరం వచ్చినట్టు చదవగానే భద్ర పరచసాగాడు.
**********************
అమ్మాయి అని ముద్దుగా పిలుచుకొనే సుభద్రకు పదహారో ఏట పెళ్ళయినప్పుడు అన్నబలరామయ్యకు ఇరవై ఏళ్ళ వయసు.  ఇంట్లో తాతగారు ఆయన నలుగురు కొడుకులు వారి సంతానంతో ఎప్పుడూ సందడిగా ఉండేది. ఎవరి పిల్లలు ఎవరో తెలియనంతగా పిల్లలంతా కలిసిమెలిసి ఉండేవారు. ఆడుకొనేటప్పుడు ఆడుకొనేవారు. అంతలో కొట్టుకొని మళ్ళీ కలిసిపోయ్యేవారు. ఆడపిల్లల ఆటలు ఆడపిల్లలవే. మగ పిల్లల ఆటలు మగపిల్లలవే.  భోజనాల దగ్గర గోలగోలగా ఒక్కటయ్యేవారు.
తాతగారి మనువలలో అందరిలోకి పెద్దవాడు బలరామయ్య. అప్పుడే డిగ్రీ చదువు పూర్తి చేసుకొని తండ్రి తాతలకు పొలం పనులలో చేదోడువాదోడుగా ఉండే వాడు. అట్లా ఉన్న ఆ కుటుంబంలో బలరామయ్య బాబాయి కూతురు  సుభద్రకు ఉంటున్న ఊరికి పదిమైళ్ళదూరంలో  కుర్రాడితో సంబంధం నిశ్చయమయింది. పెళ్ళి పనులన్ని భుజాన వేసుకొని పెద్దవాళ్ళతో సమానంగా శ్రమపడ్డ బలరామయ్యను చూసిన వియ్యాలవారు ఎంతో ముచ్చటపడ్డారు. అమ్మాయిని అత్తారింటికి పంపించే సమయం వచ్చింది. అందరూ ఆమెకు వీడ్కోలు పలకటానికి వాకిటి దాకా వచ్చారు. పెద్దలందరికి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్న సుభద్ర కళ్ళు ఇంకా ఎవరి కోసమో  వెతకటం   పెద్దల దృష్టి దాటలేకపోయింది. అంతలో గుర్తొచ్చినట్టు తాతగారు, "అరే పెద్దోడేడిరా. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నవాడు ఇంతలోకే ఎటు మాయమయ్యాడు?" చుట్టూ పరికించి చూసాడు.
"పెళ్ళి పనులన్ని భుజాన వేసుకొని అంతా తానే అయి తిరిగాడుగా! అలిసి పోయి ఎక్కడో పడుకొని ఉంటాడు." ఎవరో చమత్కరించారు.
"తాతయ్యా, ఒక్కసారి నేను వెళ్ళి చూసి వస్తాను." తలదించుకొని బెరుగ్గా అడిగిన సుభద్ర వైపు చూసారు అందరూ.
"ఒకసారి గడప దాటిన తరువాత మళ్ళీ లోపలికి వెళ్ళకూడదురా తల్లీ." పెదనాన్న అన్నాడు
"లోపలికి వెళ్ళను పెదనాన్నా! పెరట్లోకి వెళ్ళి వస్తాను." కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి సుభద్రకు.
అప్పటికే బలరామయ్య మీద అభిమానం పెంచుకున్న పెళ్ళికొడుకు తండ్రి, "ఫరవాలేదులేండి. పోయిరామ్మా." అంటూ కోడలికి అండగా నిలబడ్డారు.
గబగబ వాకిలి పక్కగా పెరట్లోకి వెళ్ళిన సుభద్రకు బాదం చెట్టు కింద దిగాలు పడి నిలుచున్న అన్న కనిపించాడు. "అన్నయ్యా! వెళ్ళొస్తాను." అంటూ కాళ్ళకు నమస్కరిస్తున్న చెల్లెలిని భుజాలు పట్టుకొని లేపి తలనిమురుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న బలరామయ్యను ఆ పాటికి అక్కడకు చేరుకున్న పెద్దలందరూ గమనించారు.
"ఓరి పిచ్చి సన్నాసుల్లారా! ఆ కన్నీళ్ళేమిటిరా? అయినా అమ్మాయి ఎంత దూరం పోతున్నదని ఆ దిగులు? తిప్పితిరగేస్తే పదిమైళ్ళేగా! ఎప్పుడు కావాలంటే అప్పుడే సైకిల్ మీద రివ్వున పోయి చూసిరావచ్చు." తాతయ్య ఇద్దరినీ మందలించారు.
బలరామయ్య జేబులోనుంచి ఒక పెద్ద కవరు తీసి ,"అమ్మాయీ, ఇవి మన ఇంటి అడ్రెస్ రాసిన కవర్లు. క్షేమ సమాచారం తెలుపుతూ రోజు మార్చి రోజు  ఉత్తరం రాస్తూ ఉండు." అంటూ సుభద్ర చేతిలో పెట్టాడు.
అట్లా మొదలయింది ఆ అన్నాచెల్లెళ్ళ ఉత్తరాల అనుబంధం. మొదట్లో వారానికి రెండు ఉత్తరాలు రాసే సుభద్ర  క్రమేపి రోజులు గడిచిన కొద్దీ వారానికి ఒకటి ఆ తరువాత పదిహేను రోజులకొకసారైనా రాసేది. ఆమె భర్త కూడా ఆమెకు సహకరిస్తూ అవసరమొచ్చినప్పుడల్లా కవర్లు స్టాంపులు తెచ్చి పెడుతూ ఉండేవాడు.
అట్లా చెల్లెలు రాసిన ఉత్తరాలే అవి.
"తాతయ్యా! అమ్మమ్మ ఉత్తరాలలో ఏ విషయాల గురించి రాసేది? నేను చదవ వచ్చా?"
"చదవరా. అందులో రహస్యాలేమీ ఉండవు సుబ్బరంగా చదవవచ్చు."
తాతయ్య మాటలతో ఉషారు వచ్చి ఫోల్డర్‌లు ముందర వేసుకొని చదవటానికి కూర్చున్న వేణు అందులో విశేషాలు చదివి ఆశ్చర్య పోయాడు.
పెళ్ళై వెళ్ళిన సంవత్సరం రాసిన ఉత్తరాలలో.............
"అన్నయ్యా, నాన్న నాతో పంపించిన నల్ల ఆవుకు చిన్న బుజ్జాయి పుట్టింది తెలుసా? ఎంత ముద్దుగా ఉన్నదో........." అంటూ ఒక ఉత్తరం మొత్తం ఆ దూడ వర్ణనే. ఆ తరువాత జున్ను పాలు ఏ విధంగా వండారు, ఎవరెవరికి ఆ జున్ను పంపించారు, దాని రుచి ఎంత బాగుంది వర్ణిస్తూ కొన్ని ఉత్తరాలు.
ఆ ఎపిసోడ్ అయిపోయిన తరువాత ఎర్రమందారం మొక్క నాటటం దగ్గర నుండి ఆ మొక్క చిగురేయటం, మొగ్గ తొడగటం, ఆ మొగ్గ ఎట్లా విచ్చుకున్నది, మొదటి పూవు అమ్మవారి పూజకు ఎట్లా పెట్టిందో వర్ణన తో పది ఉత్తరాలు. అంతే కొన్నిట్లో ప్రకృతి వర్ణనైతే, మరి కొన్నిట్లో పొలాలలో నాట్లు వేసే దృశ్యాల నుండి వడిసెలతో పిట్టలను తరమే వర్ణన.
మరి కొన్ని ఉత్తరాలైతే, పాపం ఆవిడకు టైం దొరికినప్పుడల్లా రాసేదో ఏమో, సీరియల్ లాగా ఉండేది. ఒక తారీఖు రాసి కొంత రాసి,మరి రెండు రోజుల తరువాత ఆ తారీఖుతో మరి కొంత రాస్తూ ఆ విధంగా ఒక పది రోజుల ఎపిసోడ్ తో ఒక ఉత్తరం తయారయ్యేది.
అసలు ఆ పదాల పొందిక ఏమిటి? ఆ భావనలు ఏమిటి? అంత అందంగా అనుభూతులను వ్రాయటం మహామహా కవులకే చెల్లు. పల్లెటూరులో పెరిగి విద్యాగంధం లేని ఒక సాధారణ ఇల్లాలు ఇంత అందంగా ఒక దృశ్య కావ్యంగా వర్ణించటం ఒక అద్భుతం.
ఉత్తరాలలోనే ఇంత అద్భుతంగా రాసుకుంటుంటే ఇంక ముఖాముఖి ఎన్ని కబుర్లు చెప్పుకొనేవారో!
అదే విషయం తాతయ్యను అడిగాడు వేణు.
పక్కనే కూర్చొని తాత మనుమల కబుర్లు వింటున్న నాయనమ్మ ఫక్కున నవ్వింది. "ఓరి పిచ్చి నాయనా, అదేరా ఈ అన్నచెల్లెళ్ళ విచిత్రబంధం.................."
పొలంలో కాసిన పండ్లు కూరగాయలు ఇవ్వటానికో, పండక్కు చెల్లెలిని బావగారిని ఆహ్వానించటానికో అడపాతడపా బలరామయ్య చెల్లెలి అత్తారింటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అట్లాగే సుభద్ర పుట్టింటికి వస్తూపోతూ ఉండేది. ఉత్తరాలలో అన్ని విషయాలు రాసుకొనే వారిద్దరి ప్రవర్తన ఎదురెదురుగా కలిసినప్పుడు చాలా వింతగా ఉండేది.
ఇంటికి వచ్చిన అన్నగారికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి అన్ని మర్యాదలు అమర్చి, "ఏం అన్నయ్యా, కులాసానా? ఇంటి వద్ద అందరూ కులాసాగా ఉన్నారా?" అని కుశలప్రశ్నలు వేసిన చెల్లెలు తిరిగి అతను వెళ్ళిపోతుండగా బయటికి వచ్చి, "వెళ్ళొస్తానమ్మాయి." అన్న అన్నగారి మాటలకు తలఊపి ఊరుకునేది.
ఆమె పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా అదే స్థితి.
"ఏమ్మా ఇంటి వద్ద అంతా కులాసానేనా?’ అని అన్నగారి ప్రశ్నకు తలఊపి సమాధానం. తిరుగు ప్రయాణం సమయంలో అన్నగారి కాళ్ళకు నమస్కారం చేసిన చెల్లెలితో, "అందరినీ అడిగానని చెప్పమ్మా." అని ముక్తసరిగా అనేవాడు.
వాళ్ళిద్దరిని చూసిన పెద్దవాళ్ళు నవ్వేవాళ్ళు.
"ఓరినీ పిల్లల్లారా! ఒకరి ఉత్తరం కోసం ఒకరు పరితపిస్తూ ఎదురు చూస్తారు. ఎదురుపడితే ఒక్క మాటకూడా నోట రాదేమర్రా?"
నిజంగానే ఆ అన్నాచెల్లెళ్ళది విచిత్రబంధం.
"అదిరా బాబూ వీళ్ళ వరస. నేను పెళ్ళయి వచ్చిన కొత్తల్లో వీళ్ళ వాలకం వింతగా ఉండేది. రానురాను నాకు కూడా అలవాటయింది. ఇంక వయసు భాధ్యతలు మీదపడుతున్న కొద్ది ఉత్తరాలు అంత తరుచుగా కాకపోయినా నెలకొకటైనా తప్పనిసరిగా వచ్చేవి. కబుర్లు రానురాను పిల్లలు వాళ్ళ చదువుల గురించి ఇప్పుడు మనుమల గురించి ఉంటున్నాయి." బలరామయ్య భార్య వివరంగా చెప్పింది.
తరువాత తరువాత పిల్లలు మనుమలతో సంసారాలు పెరిగి బాధ్యతల బరువుల్లో ఉన్నప్పటికి ఉత్తరాల పరంపర మాత్రం ఆగలేదు.  "తాతయ్యా, ఇంకా ఈరోజుల్లో కవర్లలో ఉత్తరాలు రాసుకోవటం ఏమిటి? చెరొక లాప్‌టాప్ గిఫ్ట్ ఇస్తాము. తాతయ్యా, మీకు టైపింగ్ వచ్చు కదా! హాయిగా లాప్‌టాప్‌లో ఉత్తరం టైప్  చేస్తే మరుక్షణమే సుభద్ర అమ్మమ్మకు అందుతుంది. ఆమెకు కూడా లాప్‌టాప్ వాడటం నేర్పిద్దాము. హాయిగా ఎప్పుడటే అప్పుడే చదువుకోవచ్చు. ఇంక ఈ పోస్ట్‌మాన్ కోసం ఎదురు చూడటం, కాయితాలు చిరిగిపోతాయేమో అన్న భయాలు ఏవీ ఉండవు." అంటూ మనుమలు ఎగతాళి చేయటం కూడా మొదలెట్టారు.
************************
ఆ ఉత్తరం కోసమే ఆ వృద్ధాప్యంలో కూడా ఆయన అంతగా ఎదురు చూస్తూ ఉన్నాడు.
వేణు కళ్ళముందు ఆ నాటి సంభాషణ గుర్తుకు వచ్చింది. తిరిగి నాలుగు సంవత్సరాల క్రితం వేణు సెలవలకు వచ్చినప్పుడు.........
"బాబూ ఈ ఉత్తరం పోస్ట్‌లో వేయరా." తాతయ్య ఇచ్చిన ఇన్‌లాండ్ కవర్ చూసి, "తాతయ్యా ఈ కవర్ మీద అడ్రెస్ రాయటం మరిచిపోయినట్టున్నావు." అన్న వేణు మాటలకు, "అరే సరిగ్గా చూడరా. రాసే ఇచ్చాను." అని సమాధానం ఇచ్చాడు బలరామయ్య. అనుమానం వచ్చి కవర్ తెరిచి చూసాడు వేణు. లోపల అంతా ఖాళీ.
పొద్దున్న నాయనమ్మ కొడుకుల సంభాషణ గుర్తుకొచ్చింది. "నాన్నకు కళ్ళు బొత్తిగా కనిపించటల్లేదు. కాటరాక్ట్ ఆపరేషన్ చేయించమంటున్నాడమ్మా. ఈ వయసులో ఆపరేషన్ చేయటమంటే రిస్కేమో. నువ్వేమంటావు?"
"నిజమే నాయనా. నాన్నకు షుగర్ కూడా ఉంది. ఆయన అట్లాగే అంటాడులే. పట్టించుకోబాకండి. అయినా ఇప్పుడు ఆపరేషన్ అంటే మాటలా?"
అందుకే కాబోలు పాపం తాతయ్య పొద్దున్నే కాస్సేపు న్యూస్ పేపర్ చదివేవాడు. మానేసాడు. సాయంత్రం పూట వాకింగ్ కని వెళ్ళేవాడు. అది కూడా మానేసి ఇంటి పట్టునే కూర్చొని శూన్యంలోకి చూస్తూ వుండిపోతే ఎందుకా అనుకున్నాడు. బొత్తిగా చూపు పోయినట్టుంది. చెల్లెలి దగ్గర నుండి వచ్చిన ఉత్తరాలు కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చదవటానికి ఆయన చేసే ప్రయత్నం చూస్తే చాలా జాలి కలిగించే లాగా ఉంది.
వేణు తన స్నేహితుడు ఒకడు కళ్ళ డాక్టర్ వద్దకు వెళ్ళి తాతయ్య కేస్ వివరించి, "ఈ రోజుల్లో ఆపరేషన్ చాలా సులభ్ంగా చేస్తున్నారు. ఒక్క రోజులోనే అయిపోయి ఇంటికి తెచ్చేయవచ్చు." అని ఇంటి వద్ద తండ్రి బాబాయిలను ఒప్పించి కళ్ళకు ఆపరేషన్ చేయించాడు. దానితో ఆయన పూర్వపు బలరామయ్యలా మారి తన కార్యక్రమాలను కొనసాగించాడు.
*****************
సుభద్రమ్మ అస్తికలు త్రివేణి సంగమంలో కలపటానికి ఆమె కొడుకులకు తోడుగా బలరామయ్య ముగ్గురు కొడుకులు వెళ్ళారు. ఇంకో వారానికి ఆమె మొదటి మాసికం కూడా రాబోతోంది. ఇప్పటిదాకా అన్నగారికి చెల్లెలి మరణవార్త తెలియక పోవటం, ఇంక ఎప్పటికీ ఆమె వద్ద నుండి ఎటువంటి ఉత్తరమూ రాదని తెలియని ఆ వృద్ధుని ఎదురుచూపులు చూసిన వేణుకు మనసు కలత చెందసాగింది. ఆయన ఆవేదనకు ఏదైనా పరిష్కారం చూడాలని ఆలోచనలో పడ్డాడు.
మరుసటి రోజు పొద్దున పదకొండు గంటల టపా వేళ్టికి వసారాలో కూర్చున్న బలరామయ్య వద్దకు తపాలా వీరన్న వచ్చాడు.
"తాతగారూ, ఇన్నాళ్ళ బట్టి రోజు అడుగుతున్న మీ ఉత్తరం వచ్చింది. మరి నాకు ఈనాం ఇవ్వాలి." అని నవ్వుతూ కవరు చేతిలో పెట్టాడు.
బలరామయ్య గారి వికసించిన మొహం చేతిలో ఉత్తరం చూసిన కోడళ్ళు విస్తుపోతూ ఒకరి ముఖం ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు.
కవరు విప్పి ఉత్తరం చదువుకున్న ఆయన ఒక విధమైన నిరాశతో మడిచి పక్కన పెట్టుకున్నాడు. ఉత్తరం వచ్చిన ప్రతిసారి ఉండే ఉత్సాహం కనిపించటం లేదు.
"ఏం తాతయ్యా! నీ ముద్దుల చ్ల్లెలి ఉత్తరం వచ్చిందిగా? ఇంక సంబరమేనా?" నవ్వుతూ పక్కన చేరిన మనుమడితో, "ఏంటోరా,అమ్మాయి ఉత్తరం చూసినా ఏమిటో బెంగబెంగగా ఉంది. ఎప్పటిలాగా అనిపించటం లేదు. అయినా ఒకసారి ఓపిక చేసుకొని వెళ్ళి చూసి రావాలని అనిపిస్తోంది."
ఆ మాటలకు అందరూ ఖంగు తిన్నారు. భోజనం ముగించుకొని ఆయన గదిలోకి వెళ్ళి పడుకున్న తరువాత తోడికోడళ్ళు వేణును నిలేసారు.
"అవునమ్మా ఆ ఉత్తరం అచ్చంగా సుభద్రమ్మమ్మ రాసినట్టే  రాసి నేనే పోస్ట్ చేసాను. పాపం రోజూ ఆయన పడే వేదన చూడలేకపోతున్నాను. అందుకే ఆయన తృప్తి కోసం ఆ పని చేసాను తప్పా?"
కార్యక్రమాలు ముగించుకున్న కొడుకులు తిరిగి వచ్చారు. అందరూ కాలకృత్యాలు తీర్చుకొని గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోస్ట్‌మాన్ గొంతు వినిపించింది.
"ఏం తాతగారూ! మీ చెల్లెమ్మకు  అన్నగారు బాగా గుర్తుకు వస్తున్నట్టున్నారు. మొన్ననే ఒక ఉత్తరం వచ్చింది. రెండు రోజులు కాకుండానే మళ్ళీ మరో ఉత్తరం. ఇంక మీకు సంతోషంతో పండగే పండగ."
గదుల్లో ఉన్న అన్నదమ్ములు, వంట గదిలో ఉన్న తోడికోడళ్ళు, హల్లొ ఉన్న వేణు ఒక్కసారిగా బయట వసారాలోకి వచ్చారు.
"మళ్ళీ ఇది నీ పనేనా?" ఎవరికి వినపడకుండా అడిగిన తల్లికి, "అబ్బే నాకేమీ తెలియదమ్మా." ఆశ్చర్యంగా సమాధానం చెప్పాడు వేణు.
నెమ్మదిగా కవరు చింపి ఉత్తరం చదువుకున్న బలరామయ మొహం వికసించింది. పరమానందంగా ఉత్తరం చదువుకొని, "అమ్మయ్య. ఈ ఉత్తరం చదివిన తరువాత చెల్లెమ్మనా ఎదుట నిలచినట్టుందిరా అబ్బాయి." అంటూ నిజంగానే సంబర పడిపోయినాడు.
ఆయనను ఆ మధుర స్మృతులలో వదిలేసి అంతా ఇంటి లోపలికి వెళ్ళారు. ముందు రోజు వేణు చేసిన పని వివరించి, "మొన్నంటే వేణు ఆయన తృప్తి కోసం రాసాడు. మరి ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో?"
"అయినా ఇంకా ఆయన దగ్గర దాచి ఉంచటం భావ్యం కాదు. వీలు చూసుకొని వాస్తవం చెప్పేసేయండి." అంటూ మగవాళ్ళను పట్టుకున్నారు.
"రేపు నెమ్మదిగా సమయం చూసుకొని నాన్నకు విషయం వివరిద్దాములే. అయినా ఈ ఉత్తరం ఎక్కడి నుండి వచ్చిందో?"
"వార్నీ. అన్నయ్య ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఇదంతా ఆ మల్లిగాడి పని. చూసావా అన్నయ్యా. ఆ పాలేరు మరీ మతిమరుపు వెధవ అయిపోయినాడని మొన్న బావ మొత్తుకున్నాడు. అత్తయ్య పెద్దకర్మ అని అచ్చేయించిన కార్డ్లు పోస్ట్ చేయమని ఇస్తే వాడు మొన్న మనం వెళ్ళిన రోజు అంటే పదిహేను రోజుల తరువాత గుర్తుకు వచ్చి డబ్బాలో వేసాడట. అదృష్ట వశాత్తు అందరికి ఫోన్లలో చెప్ప బట్టి సమయానికి రాగలిగారు. ఎవరికి కూడా కార్డు అందలేదట.  ఈ ఉత్తరం కూడా అత్తయ్య పోయే నాలుగు రోజుల ముందర వాడికి ఇచ్చి డబ్బాలో వేయమని చెప్పిందట. ఇదిగో ఇదీ వీడు చేసిన ఘనకార్యం. ఆ కార్డులతో పాటుగా ఈ ఉత్తరం కూడా పోస్ట్‌‌డబ్బాలో పడేసినట్టున్నాడు.  ఈ విషయం బావతో చెప్పితే వాడిని ముక్క చివాట్లు పెట్టాడు కూడా."
భోజనాల సమయంలో బలరామయ్య ఎంతో హుషారుగా చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా భోం చేసి గదిలో కాకుండా మళ్ళీ వసారాలో పడక్కుర్చీలో వాలి ఉత్తరం పదేపదే చదువుకో సాగాడు.
*************************
సాయంత్రం నాలుగు అవుతుండగా "ఒరే వేణూ, తాతయ్య ఇంకా నిద్ర పోతూ ఉన్నట్టున్నాడు. కాఫీ వేళ అయింది లేపు."
చిన్నపిల్లవాడు ప్రియమైన వస్తువు ఎవరైనా లాక్కుంటారేమో అన్న భయంతో గట్టిగా పట్టుకున్నట్టు ఆయన ఆ ఉత్తరం గుండెల మీద పెట్టుకొని రెండు చేతులు ఆనించి పడక్కుర్చీలో పడుకొని ఉన్నాడు. "తాతయ్యా! సాయంత్రం అవుతున్నది. లేచి మొహం కడుక్కుంటే అమ్మ కాఫీ తెస్తోంది." అని భుజం మీద చేయి వేసిన వేణుకు ఒక్కసారి షాక్ తగిలినట్టు అయింది.
*****************
"అన్నాచెల్లెలు పుణ్యాత్ములు. ఉత్తరాయణ పుణ్య కాలం కోసం భీష్ముడు ఎదురు చూసినట్టు ఇంతకాలం ఆరోగ్యంగా ఉన్న చెల్లెలు పండగ వెళ్ళగానే హఠాత్తుగా పోవటం, నెల తిరక్కుండా ఈయన పోవటం. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో!"
చూడటానికి వచ్చిన వారి మాటలు విన్న వేణు మనసులో అనుకున్నాడు. "నిజమే అన్నాచెల్లెళ్ళకు ఇది "ఉత్తర" అయన పుణ్యకాలమే. తాను సృష్టించిన దొంగ ఉత్తరానికి ఏ మాత్రమూ స్పందించని తాతయ్య సుభద్రమ్మమ్మ ఉత్తరం చదువుకొని ఎంత మురిసి పోయాడో? మనిషికి మాయ ముసుగు వేయ వచ్చునేమో కాని మనసుకు ఎటువంటి ముసుగు వేయలేము"
**********************

No comments:

Post a Comment

Pages