అక్షరసుమాంజలులు.. - అచ్చంగా తెలుగు

అక్షరసుమాంజలులు..

Share This

అక్షరసుమాంజలులు..

తిమ్మన సుజాత 


రాధ తన మానస చోరునితో..
గడిపిన ఆ రసరమ్య క్షణాలు ...
మైమరపులలో గోపెమ్మలు
తమ ఉనికిని మరచిన ఆ మధుర సమయాలు..
మృదువైన..మైమరపుల  మురళీగానములో ...
ఓలలాడుతూ ఉన్నప్పటి సమస్త జీవరాసులు..
అన్నిటిని....ఆనాటి నుండి తన తరగల అడుగున
గుంబనంగా దాచుకొని...
అలవోకగా సాగిపోతున్నది  ఆ యమునా నది ...
హే కృష్ణా...! ప్రభు...గిరిధర..!!
ఈ ఏటి నీటిని సృసించిన చాలు కదా!
బ్రతుకు ధన్యము కాదా..నందనందన...!!
చిన్న తనంలోనే..అమ్మ నా చేతిలో..
మనోహరమైన నీ మూర్తిని పెడుతూ...
' నా చిట్టి తల్లి రాకుమారుడు ఇతడే...'
అంటూ...బుగ్గన ముద్దులు పెట్టికొనె కదా..గోపాలా!
పసి హృదయం పరవశించి ..
నిన్ను ఆపాదమస్తకము ఆర్తిగా తడుముతూ ఉంటె....
తన్మయి నయ్యాను కదయ్యా..నంద కిషోర..గోపాలా..!!
తలపులలోనే కాదు...వేలుపు నీవేనని
మది పొరలలో...మందస్మిత  బావనల నీ స్మరణమే..
శ్వాస నిశ్వాసల లయ కారణాలయినవే ....మురళీ లోలా..గోపాలా !!
కట్టు బాట్ల సంఖెలలకు తప్పనిసరిగా  తాళికి తలవంచినా...
నీ ఆరాధనలను మరువలేని మానిని ని..
నీ చరణధూళి కై..రేయి పగలు వేచే విరహినినే నయ్యా...దేవకి నందన !!
నా ప్రవర్తనలు నచ్చని అత్తా.. ఆడబిడ్డలు..
విషము పాలు ఇచ్చిరని తెలిసినా
అందు నీ మోహన రూపు చూస్తూ సేవించితినే యధు వంశకిశోరా..!!
నీ ఆలాపనల ఇహము మరచి ఉన్ననన్ను గాంచి
ఇదేమి చోద్యమను కొన్నారట వారందరూ..
నీ లీలలు అనుభవాల నిజాలు కదయ్యా...యశోదా నందనా...!!
ఆగ్రహించే పతికి ఐహికములన్ని అప్పజెప్పి..
అడుగడుగునా గాలించా....నీవెక్కడ ఉన్నావోనని..
ప్రతి కొమ్మను రెమ్మను అడుగుతూ...మథుర చేరితినే..బృందావిహారా..!!
దీపాల వెలుగులలో...నీ దివ్య రూపం
ఎదలోని వ్యథలను పారద్రోలాగా..నీ చిరునవ్వుల
మోహనములో..కర్పూరమునై...వెలిగితినే..హరతిగా..రాధా మనోహరా..!!
మీరాగానచరితము....నీ కథలో ఓ భాగము కాగా...
యుగాలు గడిచినా...జగాలు మారినా...
ప్రతి గాలి తరగలో...నీ నామ స్మరణ వినిపిస్తూనే ఉంటుంది ప్రభూ..!!
ఆత్మ నివేదనలతో...నీకివే...అక్షర సుమాంజలులు...
కృష్ణా..ముకుందా..మురారి..!!
గోవర్దనగిరిధారి..మురళీగాన విహారీ....
గోకుల కృష్ణా....గోపాలా కృష్ణా...రాధాకృష్ణ...రమణీయ రమణా!!
**********     **********        **********

No comments:

Post a Comment

Pages