భావజాలము - అచ్చంగా తెలుగు

భావజాలము

టి.యమ్.భ్రమరాంబిక

తెలుగు ఉపన్యాసకురాలు,శాఖాధిపతి,

ఎన్.ఎన్.వి.యమ్.విభాగం.



          భావము అనగా మనసులో కలిగే ఆలోచన లేక ఊహ. భావములు లేక ఊహల సమూహమే భావజాలము. “ వికారోమానసోభావః” క్రోధహర్షాదికృతమైన మనోవికారము భావము అని, “భావయతి కరోతిరసాన్ భావః” రసములను పుట్టించునది భావము అని అమరకోశము. ఈ పదమునకు విస్తారమైన అర్ధం కలదు. భావాలనంతాలుగా ఉంటాయి. భావజాలమను పదమును పరిశీలిస్తే మనకు యెన్నో విషయాలు అవగతమవుతాయి. వానిని క్రింది అంశాలలో పరిశీలిద్దాము.
          సృష్టిలో మానవులకు జంతువులకు సమానమైన ప్రాధాన్యత ఉన్నది. ఇతరజీవుల కంటే మానవుడు యుక్తాయుక్త విచక్షణతో ఉంటాడు కనుక మానవుని బుద్ధిజీవి అంటారు. ఈ విధమైన బుద్దిలో తప్ప “ఆహార నిద్రా భయ మైదునంచ సామాన్య మేతత్ పశుభిర్నరాణాం” అని చెప్పబడుతున్నది.
          మంచి చెడు విచక్షణ జ్ఞానం గల మానవుని మస్తిష్కంలో యెన్నో ఊహలు కదలాడుతూ ఉంటాయి. కొన్ని క్షణమాత్రకాలంలో నశించేవి, కొన్ని జీవితాంతము నిలచిపోయేవి, జీవితాన్ని అందంగా మలచుకోవడానికి, వృద్ధిపొందడానికి, సంతోషంగా జీవించడానికి, ఆత్మానందం అనుభవించడానికి, తాను కోరుకున్నది పొందడానికి, పరులనానందింపచేయడానికి,నవ్వడానికి,నవ్వించడానికి చివరకు ఇతరులను హింసించి బాధపెట్టడానికి కూడా ఊహలే కారణము.
          తానుగా కావాలని కాకపోయినా కూడ మనసు పెట్టే ఒత్తిళ్లకు, కోరికలకు లొంగిపోయి, వ్యసనాలకు బానిసలుగా మారి తప్పు అని తెలిసినా కూడా చెడు పనులు చేసి జీవితం దుఃఖమయం చేసుకోవడానికి కూడా భావములే కారణము.
          మానవులకు కలిగే ఆలోచనలు పూర్వజన్మకర్మఫలములని బుద్ధిఃకర్మానుసారిణీ” అంటారు. గతజన్మలలో పుణ్యములను చేసిన వారు ఆ ఫలితం పొందడం కొరకు మంచి ఆలోచనలు కలిగి వాటిని అమలుపరచుకోవడం కొరకు కఠిన పరిశ్రమ చేసి తద్వారా సుఖ సంతోషాలు,కీర్తి ప్రతిష్ఠలను పొంది జీవితాన్ని పూబాటలుగా మలచుకుంటారు. పాపములు చేసినవారి బుద్ధి వక్రమార్గంలో పయనించి చెడుమాటలు,చెడుపనులు,వ్యతిరేక భావాలు, కఠినత్వమును వ్యక్తపరుస్తూ, సంఘవ్యతిరేక కార్యక్రమాలను చేయడం మొదలైన పనులద్వార యింట,బయట చీత్కారింపబడుతూ, శిక్షలకు గురి అవుతూ, అకాలమరణాలను, మానసిక వేదనను అనుభవిస్తూ గౌరవహీనమైన బ్రతుకుతో సాంఘిక సంబంధాలకు దూరంగా బ్రతుకుతారు. అందువలననే
‘పరోపకారం పుణ్యాయ
పాపాయ పరపీడనమ్”
అంటారు,
          ప్రపంచంలో గల ప్రాణికోటి కంతటికీ భావములుంటాయి. మన కంటికి కనపడేవి, కనపడనివి అయిన జీవులన్నీ కూడా భగవంతుడు వాటికి ఏర్పాటు చేసిన సంజ్ఞల ద్వారా భావవ్యక్తీకరణము చేస్తాయి. మనపై వ్రాలిన దోమ మనం దానిని చంపుతామనుకున్నప్పుడు ఎగిరిపోయి తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. తేనెటీగలు తమ ఆహారం ఉన్నదిశగా 8 ఆకారంలో(∞)తిరుగుతూ యితరమైన తేనెటీగలకు మార్గనిర్దేశం చేస్తాయి. గ్రద్దలు, కాకులు,పిచ్చుకలు, పావురములాదిగా గల పక్షులు వాటి వాటి సంజ్ఞలననుసరించి ఆహారమున్న ప్రదేశాలను గుర్తించి సహజీవనం సాగిస్తాయి. ఐక్యతకు మారుపేరైన చీమలు వాటి ఆహారప్రదేశాన్ని తెలియచేయడానికై ప్రతిచీమ తనకెదురు వచ్చే చీమతో తన సంజ్ఞను తలూపుతూ ప్రయాణిస్తుంది. ఇది అంతా కూడా భావవ్యక్తీకరణమే కదా! పిల్లులు, ఆవులు, పులులు మొదలైన జీవులు బిడ్డకు జన్మనిచ్చిన అనంతరము ఆ బిడ్డ దరిదాపులకు ఎవరినీ రానీయవు. తమ బిడ్డకు అపకారం చేస్తారేమో అనే భావన, వాటి కడుపు తీపి వ్యక్తమౌతున్నది. ఇంతవరకు మనము గమనించినవి కొన్ని మాత్రమే. ఇలా పరిశీలించుకుంటూపోతే వ్యాసమే అనంతమైపోతుంది.
          ఏ జీవికైనా బాధ సంతోషం కలిగినప్పుడు అది వ్యక్తం చేసే ద్వనిలో మార్పు వుంటుంది. ఉదాహరణకు ఒక కాకి మరణిస్తే దాని చుట్టూ చేరిన కాకుల అరుపులలో బాధ వ్యక్తమౌతుంది. కుక్కపిల్ల తన యజమానిని చూడగానే లేచి సంతోషంతో తోక ఆడిస్తూ కుయ్,కుయ్ మని మొరుగుతూ తన ముందు రెండు కాళ్ళు పైకెత్తి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది కుక్కకు తన యజమానిపై గల ప్రేమ భావానికి నిదర్శనము.
          భాషరాని మూగజీవులే తమ భావాలను వ్యక్తీకరించి తమ అవసరాలు తీర్చుకుంటూ జీవిస్తున్నప్పుడు వీటికంటే అధికమైన మేధాసంపత్తి గల మానవునికి యెన్ని ఊహలుంటాయో ఊహకందని విషయం కదా! అందుకే తెలివిగల వ్యక్తిని గురించి, వారి తెలివితేటలను గురించి చెపుతూ అమ్మో వాడు (ఆమె) చాల తెలివైనవాడు. వాడి మనసు లోతు కనుక్కోలేము, సముద్రగంభీరుడు అంటారు.
          ఇక భావనాశక్తిని గురించి ఆలోచిస్తే మనిషిగా జన్మించినదగ్గర నుండి (బాల్యవస్థ నుండి) ప్రారంభమైన ఊహలు ఆజన్మాంతము ఉంటాయని చెప్పుకున్నాము. ఒక్కక్షణంలో యెన్నో ఊహలు వస్తాయి. మనసును ఉయ్యాల లూపుతాయి. ఊహలలో తాను కూర్చున్నచోటునుండే చంద్రుని దగ్గ్గరకు, సూర్యుని దగ్గరకు, వెళ్ళిరావచ్చును. నక్షత్రమండలానికి వెళ్ళి తారలతో ముచ్చట్లాడిరావచ్చును. తన ప్రియురాలితో లేక ప్రియునితో సంభాషణ చేయవచ్చును, సముద్రంపై నడవవచ్చును. పైసా ఖర్చులేకుండా,పాస్ పోర్ట్ , వీసాలు లేకుండ విదేశగమనము చేయవచ్చును. ఊహాలోకంలో చేయలేనిదేమీ లేదు. అదొక అందమైన ప్రపంచం. అందుకే కృష్ణశాస్త్రిగారు నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు, నాయిచ్చయే గాక నాకేటి వెరపు” అంటూ స్నేహగీతంలో తన భావములను తెలియచేశారు.
          బాహ్యంగా పొందలేని ఆనందమును భావనా ప్రపంచంలో పొందవచ్చును. దీనికి సంబంధించినదే పేద బ్రాహ్మణుని కథ ఉన్నది. ఒక గ్రామంలో పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతండు ఒకప్పుడు సంక్రాంతి సమయంలో ప్రక్క గ్రామానికి వెళ్ళగా అతనికి తైల భాండమును దానం చేశారు. అది తీసుకుని అతడు తన గ్రామం వస్తూ మార్గమధ్యమున శ్రామాపనోదనకై ఒక చెట్టు నీడన విశ్రమించాలని అనుకుని కుండను తన కాళ్ళ దగ్గర పెట్టుకుని పడుకున్నాడు. అతని ఆలోచనలు ఎంతదూరం పయనించాయో చూడండి. నేను ఈ నూనె కుండను అమ్మితే మూడు రూపాయలు వస్తాయి. వాటితో ఒక మేక కొంటాను. కొంతకాలానికి మేకల గుంపు తయారవుతుంది. ఆ మేకల గుంపును అమ్మి వచ్చిన ధనముతో ఆవును కొంటాను. అది కొంతకాలానికి దూడలను పెట్టగా ఆవుల మంద అవుతుంది. వానిలో కొన్నింటిని అమ్మి పొలం కొని వ్యవసాయం చేస్తూ ధనం చాల సంపాదిస్తాను. ఆ ధనంతో ఏడు అంతస్తుల భవనం కట్టుకుని అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటాను. ఒక పూర్ణిమ నాటి రాత్రి ఏడంతస్తుల మేడ మీద హంసతూలికా తల్పంపై తెల్లని దుప్పటి వేసుకుని పడుకుని నా భార్యను తాంబూలం తెమ్మంటాను. అప్పుడామె నేను తీసుకు రానంటుంది. నా మాట కెదురు చెపుతావా అని ఇలా ఒక్క తన్ను తన్నుతాను అంటూ కాలు ఝాడించి తన్నాడు. సమీపంలో గల నూనె కుండ కాస్తా బద్దలైపోయినది. చూశారా! పేద బ్రాహ్మణుడు. ఊహాలోకంలో విహరించి యెంత ఆనందించాడో!
          భావాలు శిశువులో కూడా ఉంటాయి. ఉదాహరణకు మూడునెలల వయస్సుగల శిశువు తమ సమీపానికి వచ్చిన వారిని కళ్ళు తిప్పి తిప్పి వారు నడుస్తున్న వైపే చూస్తూ వారిని గమనిస్తారు. అల్లాగే సంవత్సరం, సంవత్సరన్నర వయసు గల పిల్లలు వారికి నడకరానప్పుడు తల్లివారిని ఒక ప్రక్కన కూర్చోపెట్టి యింటిపనులు చేసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో తల్లి పని నిమిత్తమై బిడ్డ ఉన్నవైపు వస్తూ ఉండడము గమనించిన బిడ్డ తల్లి తన దగ్గరకు వచ్చి తన్ను ఎత్తుకుంటుందేమోననే భావనతో కళ్ళనిండుగా సంతోషం నింపుకొని చేతులు, కాళ్ళు ఆడిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. తల్లి తన్ను ఎత్తుకోకుండా వెళ్ళిపోతే బిక్కముఖం పెట్టుకుని తల్లి వెళ్ళిన వైపే చూస్తాడు. ఇది పసిపిల్లల భావవ్యక్తీకరణం కాదనగలమా!
          మనకు కోపం, ప్రేమ,అనురాగం,జాలి,ద్వేషం,అసహ్యం,సంతోషం, వెక్కిరింపు మొదలైన భావాలు సందర్భాను సారంగా కలుగుతాయి. ఈ భావాలను చూపులు, ముఖకవళికలలో మార్పులు, భాష, భాష యందు ధ్వని తీవ్రతను బట్టి గ్రహించవచ్చును. ఒక వ్యక్తి మాట్లాడిన మాటననుసరించి అతని మనస్సు అంచనా వేయవచ్చును.
          ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనికి సంబంధించి ఆలోచనే భావము. ఆ పని యెలా చేయాలనే ఊహల సమ్మేళనమే భావజాలమని యింతకు పూర్వమే చెప్పుకున్నాము. ఉదాహరణకు ఒక సినిమాకు వెళ్ళాలనే భావ సంకల్పం చేసుకున్నట్లయితే ఆ సినిమా ఏ హాలులో ఉన్నది? ఏ ప్రదర్శనకు వెళ్ళడానికి వీలవుతుంది? టికెట్లు కొనడం దగ్గరి నుండి పిల్లలకు ఆహారపదార్ధాలు, మంచినీరు తీసుకెళ్లడం దగ్గరనుండి సినిమాకెళ్ళివచ్చేవరకు వచ్చే ఊహలన్నీ భావజాలమే, భావ సమూహమే.
          కవులు, కళాకారులు కూడా భావ ప్రపంచంలోనే జీవిస్తూ వానిని తమ కవిత్వ, కళారూపాలలో పొందుపరుస్తారు. ఉదాహరణకు కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలమ్ ‘ నాటకంలో కన్వాశ్రమాన్ని వర్ణిస్తూ
శా.      నీవారాష్ముకగర్భకోటరముఖభ్రష్టాస్తరూణామదః
          ప్రస్నిగ్ధాఃక్వచిదింగుదీఫలభిదః సూచ్యన్త ఏవోపలః !
          విశ్వాసోపగమాదభిన్నగతయః శబ్దంసహన్తే మృగా
          స్తోయాధారపథాశ్చవల్కల శిగానిష్యందరే గాంకితాః!!
          అడవిలో వేటాడడానికి వచ్చిన దుష్యంతునికి పై శ్లోకంలో చెప్పబడినట్లుగా ఉన్న కన్వాశ్రమం కనిపించింది. నివ్వరధాన్యమును ముక్కునిండ నింపుకుని సమీపమందలి చెట్లకొమ్మలపై వ్రాలి తింటున్న చిలుకల ముక్కుల నుండి నేల మీదికి రాలిపడిన ధాన్యం గింజలు ఉన్నాయి. ఇంగుదీఫలములను రాళ్ళపై కొట్టగా రసముచేత తడిసిన రాళ్ళు (ఇంగుదీఫలముల పిండితో ఒళ్ళు రుద్దుకుని స్నానం చేస్తారు) , ప్రాణ భయం లేకుండా తిరిగే లేళ్ళు, సమీపంలో గల నీటిలో స్నానం చేసిరావడం చేత నీటిచారల చేత నిండిన నేల వున్నది. దీనిని బట్టి అడవిలో ధాన్యము ఉండదు, ఇంగుదీ ఫలముల అవసరము లేదు. లేళ్ళు కూడా నిర్భయంగా ఉన్నాయి. పైగా నేల నీటిచారికలతో ఉన్నది కనుక ఇక్కడ మానవులున్నారనే భావాన దుష్యంతునికి కలిగింది. కాళిదాసు ఆశ్రమాలను చూశాడా? ఇది అంతా కూడా అతని భావనయే కదా!
          ప్రముఖ చిత్రకారుడైన రవివర్మ చిత్రాలలో జీవకళ ఉట్టిపడడానికి అతని అందమైన ఊహాశక్తియే కారణము. చేతిలో దీపం పట్టుకుని నిలబడిన స్త్రీ చిత్రంలోను, మేడ మీద నిలబడి ఆకాశంలో పక్షులను తన్మయత్వంతో చూస్తున్న స్త్రీ చిత్రం లోను సౌందర్యం లేదని ఎవరంటారు? సౌందర్యము వస్తువులలో కంటే చూసే కంట్లోనే ఉంటుందని అంటారు. కంటికి అందంగా కనిపించిందంటే మనసు కూడా అందంగా ఉందని అర్ధము.
          శిల్పం అందంగా ఉన్నదంటే శిల్పి మనస్సు అటువంటిదని తెలుస్తున్నది. శిల్పము లందలి శృంగార,వీర, హాస్య భావములాదిగా గల రసములన్ని శిల్పి మనోభావములే. తమిళనాడు నందలి మధురై మీనాక్షి ఆలయమందలి శిల్ప మండపము నందలి శిల్పములలో ఒకటి చాల మృదుస్వభావమును తెలుపుతున్నది. ఒక బలవంతుడైన పురుషుడు తన భార్య లేక ప్రియురాలిని భుజముపై ఎక్కించుకుని ఆమె పాదమును చేతితో పట్టుకుని ముందుకు అడుగువేయడానికి ప్రయత్నిస్తున్నాడు. భుజముపై కూర్చున్న ఆమె మురిపెముతో అతని ముఖమును వీక్షిస్తున్నది. ఈ శిల్పంలో శిల్పి మనోభావాలను గమనిస్తే ప్రకృతి సిద్ధంగా పురుషుడు బలవంతుడు, స్త్రీ అబల,తాను నడిచి వెళ్ళవలసిన దూరం చాల ఉన్నది. పైగా ఆమె ఆ పురుషునికి అత్యంత ప్రియమైనది, అనురాగావతి. ఆమె కష్టపడి నడవడము అతనికి యిష్టం లేదు. అందుకే తాను కష్టపడినా కూడా, ఆమె కష్టపడకూడదని ఆమెను భుజంపై కూర్చోపెట్టుకుని నడుస్తూ ఆ కష్టమేదో అతడే పడుతున్న భావన కనిపిస్తోంది. అల్లాగే తన్ను అంత ప్రేమగా చూస్తున్న ప్రియుని ముద్దుగా సున్నితమైన మనసుతో ఆ స్త్రీ చూస్తున్న భావన కనిపిస్తోంది. స్త్రీ పురుషు లిరువురూ ఒకరినొకరు అర్ధం చేసుకుని ఆనందంగా జీవించాలనే సున్నిత మనస్తత్వ ఈ శిల్పంలో కనిపిస్తోంది. ఇటువంటి వానినెన్నిటినో ఉదాహరణలుగా చెప్పవచ్చును.
          ఒక వస్తువు తయారు చేయాలనుకుంటే ఆ వస్తువుకు సంబంధించిన ఊహ మనసులో మొదలాలి. ఆ ఊహలకు క్రియారూపం కల్పిస్తే వస్తువు తయారవుతుంది. ఏ వస్తువు గురించి అయినా భావం, భాష ఉంటే చాలదు. ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి. ఉదాహరణకు ‘అన్నం’ అనే పదాన్ని తీసుకుంటే ఆకలిని తీర్చే పదార్ధము అని పదార్ధ జ్ఞానం ఉన్నది. ఆ వస్తువును చూడలేదు. అటువంటప్పుడు ఆకలితో మాడిపోతూ ఎదురుగా అన్నం ఉన్నా అది అన్నమని తెలియనప్పుడు ‘అన్నం అన్నం’ అని బాధపడతాడే గానీ, ఎదురుగా ఉన్న అన్నమును తినలేదు.
          శాస్త్రవిజ్ఞానం వస్తురూపం దాల్చడానికి కూడా భావజాలము అవసరం. దీనినే ఫార్ములా అంటున్నారు. చక్కని పరిపాలన అందించడానికి, విద్య, విజ్ఞానార్జనలకు, ఆధ్యాత్మకత ,ఆనకట్ట నిర్మాణానికి కూడా భావజాలము అవసరం. అభిప్రాయ వ్యక్తీకరణకు భావజాలము అత్యంత ముఖ్యమైనది. కొన్ని కొన్ని సందర్భాలలో భావవ్యక్తీకరణ ముఖము, చేతులు, పెదవుల కదలికల ద్వారా చేస్తారు. ఒక్కొక్కప్పుడు అతి చిన్న విషయాలే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మీయుల పలకరింపు,రాక, ఆదరణతో కూడిన మాటలు ఆనందాన్ని కలిగిస్తాయి.
          వివేకానందుని భావజాలమే ఈనాటికీ యువతిని మంచి మార్గంలో నడిపిస్తున్నది. మూడువందల సంవత్సరాలు బ్రిటీషు పాలనలో మ్రగ్గిన భారతీయులకు, భరతమాతకు బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేసినది గాంధీమహాత్ముని భావనాబలమే. అలాగే దీనులకు సేవలందించాలని, దీనులైన వ్యాధిగ్రస్తులకు సేవ చేసినది మదర్ థెరిస్సా భావజాలమే కదా! కనుక మనస్సు ననసరించి, పుట్టుకననుసరించి, పెరిగిన వాతావరణ పరిస్థుతులననుసరించి వారికి కలిగే భావాలు వ్యక్తీకరింపబడతాయి. కావ్యానికి నిర్వచనం చెపుతూ “ఉప్పెంగే భావప్రవాహానికి పరీవాహము “ కవిత్వమంటారు. ఈ ప్రకారం చెప్పుకుంటూపోతే అంతులేని అనంతమైన భావాలు ఉదయిస్తాయి. అందుకే భావములను చక్కగా అనుకూలంగా ఉంచుకుంటే సమాజము, దేశము,ప్రపంచము అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుందనడము నిస్సందేహము.
సర్వేజనా సుఖినోభవంతు

No comments:

Post a Comment

Pages