దాహం దాహం (కామెడి కథ)
మోహన రావు దురికి
అది 2065, జనవరి మొదటి వారం. సాగర్ తనింటి బాత్రూమ్లోకి తొంగి చూసి చావు కేక వేసి, "567 నీటి చుక్కలతో స్నానం చేసిన అడ్డగాడిదఎవడురా?" చాలా గట్టిగా అరిచాడు.
సాగర్ పెద్దకొడుకు వరదరాజు పరదలా పరుగెత్తుకుంటూ వచ్చి వనయంతో, "బకెట్ నీళ్లతో స్నానం చేసేందుకు మనం 2015 నివసిస్తున్నామా నాన్న? నీటి కరువు గురించి నాకు తెలీదా? పక్కింటి వాళు మొన్న బోర్ వెల్ వేస్తే భూమికి అవతలవేపు అమెరికాలోని ఓ ఇంట్లో బొక్క పడిందే కాని ఇక్కడ నీటిచుక్క పడలేదు. నేను ఇంతకు ముందే 356 చుక్కలతో స్నానం చేసాను. అంటే ఆ చుక్కలను గుడ్డమీద చల్లుకుని ఒంటిని శుభ్రంగా తుడుచుకున్నానన్నమాట " ఎంతో తృప్తిగా అన్నాడు.
"మరి 211 నీటి చుక్కలు ఏమయినట్లు?" సాగర్ కౄరాతి కౄరంగా నిలదీసాడు. ఈలోగా మరో కొడుకు బురదరాజు బురదలా జిడ్డు ముఖంతో వచ్చీ, "సారీ నాన్నా పక్కింటి బామ్మ చావు బతుకుల్లో వుంటే ఆ గుక్కెడు నీళ్లలో తులసి కలిపి గొంతులో పోస్తే కానీ ఆమె ప్రాణం పోలేదు," ఆ వాక్యం పుర్తి కాకుండానే పళ్లు రాలగొట్టాడు సాగర్
వెంటనే తిడుతూ, "రేషన్ షాపులో తెల్ల కార్డ్ వాళ్లకి మనిషికి నెలకు లీటర్ నీళ్లు గవర్నమెంట్ ఇస్తోందని నీకు తెలీదా? మనం ముగ్గురం మూడు లీటర్లతో నే నెలంతా బతకాలని నీకు తెలీదా? ఆ గుక్కెడు నీళ్లు నేను పోయనందుకేరా మీ నాన్నమ్మా దాహంతో చనిపోయింది? మీ అమ్మ చెంబెడు నీళ్ల కోసం వాటర్ ట్యాంక్ పెనుగులాటలో ప్రాణం వదిలిన వీర వనిత. రాస్కెల్! మీరు నా ఆస్తి పాస్తులు దానం చేయండి. క్షమిస్తాను. కాని మంచి నీళ్లుదానం చేస్తే దాహంతో మిమ్మల్ని చంపుతా. పైగా దాహంతో చంపే వారిపై కేసులు లేవని సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది" అని చమటలు కక్కాడు. కక్కిన ఆ చమటను తనకుతానే లపక్కున కుక్కలా నాకి నాలుక తడిచేసుకున్నాడు.
అలా కొడుకులను తిట్టినందుకు సాగర్ గుండె చెరువయ్యింది. కాని కంట్లోంచి కన్నీటి బొట్టు రాలితేఒట్టు. నీళ్లకే కాదు, కన్నీళకూ కరువొచ్చింది. కాసేపటి తరువాత ఆ ఇద్దర్ని గుండెకు హత్తుకుని, “సారీరా! నాలాగే మీరు కూడా 2015లో పుట్టి వుంటే ఎంచక్కా కొలనులు, వాగులు, వంకలూ చూసి వుండేవారు. అందులో ఆడి-పాడి ఈదే వారు. కానీ మీకా అదృష్టం లేదురా. అన్ని చెరువులు ఎండిపోగా అందులో కాలనీలు కట్టారు. కనీసం నీటి అలలు ఎలా వుంటాయో మీకు చూపించాలంటే ట్యాంక్ బండ్ లో 299 చుక్కల నీళ్లేవున్నాయి. వాటిని కాపలా కాసేందుకు 300 మంది పోలీసులు వున్నారు" డ్రమ్ముల కొద్ది బాధ పడ్డాడు.
ఆ టాపిక్ని మార్చాలని బురదరాజు, " భోంచేద్దాం రండి. మంచి నీళ్ల బాటిల్ కంటే బీర్ బాటిల్ ధర తక్కువని మూడు బీర్ బాటిళ్లురేషన్ షాపులో కొనుక్కొచ్చాను" అనగానే ముగ్గురు భోజనం మొదలు పెట్టారు.
సాగర్ ఫ్రై చేసిన కూర తింటూ, "మీ స్నేహితుడికి ఆక్సిడెంట్ జరిగితే హాస్పటల్లో చేరించారు కదా? ఇప్పుడెలా వున్నాడు?" అడిగాడు.
“చావు బతుకుతో పోరాడు తున్నాడు. సెలాయిన్ బాటిల్స్ బదులు 5 వాటర్ బాటిల్స్ ఎక్కించారు. మరో రెండు బాటర్ బాటిల్స్ ఎక్కిస్తేనే కాని పరిస్థితి చెప్పలేమని డాక్టర్ చెప్పారు " చాలా దిగులుగా బురదరాజు చెప్పాడు.
"పది లీటర్ల మురికి కాలువ నీళ్లను 'రిఫెండరి ఫ్యాక్టరి'కి ఇస్తే ఓ ఇంజక్ష మంచి సీళు ఇవ్వలేదా?" సాగర్ భయంగా అడిగాడు.
"పది ఇంజక్షన్ల మంచి నీళ్లు అతని బాడిలోకి ఎక్కించారు కాబట్టె వాడి ప్రాణం ఇంకా రెపరెపలాడుతోంది. దాతలు ఎవరయినా రక్తానికి బదులు లీటర్మినరల్ వాటర్ దానం చేయాలని టీవిలో ప్ర్కోలింగ్ వేసారు" దిగులుగాచెప్పాడు.
"రక్తమో, కిడ్నిలో, కాలెయమో దానం చేయమంటే పుణ్యాత్ములు ఎవరో ఒకరు ముందుకు వస్తారు కాని చూస్తూ చూస్తూ మంచి నీళ్లు దానం చేయమంటే మాత్రం ఏ మానవ మాత్రుడూ ముందుకు రాడు. ఇక ఆ అబ్బాయి గురించి మరిచిపో" బాధతో నిటూర్చాడు.
ఈలోగా వీధిలో పెద్ద అలజడి రేగింది."తూఫానేమైనా వస్తుందా?" వరదరాజు చాలా సంతోషంగా అడిగాడు. నీటి వరద ఎలా వుందో చూడాలన్నది వరదరాజు చివరి కోరిక. అసలు బురద ఎలా వుందోచూడాలన్నది బురదరాజుమొదటి కోరిక.
సాగర్ చాలా నిరాశతో, "మీ జనరేషన్ వాళ్లకు అంత అదృష్టం కూడానా? పుష్కరాల్లాగా పన్నెండు సంవత్సరాలతరువాత ఈ ఏడాది పావు సెంటి మీటర్ వర్షపాతం వుండవచ్చని వాతావర్ణ శాఖవాళ్లు జ్యోస్యం చెప్పారు కదా? బహుశ ఆ వర్షం కాబోలు. పదండి" ముగ్గురూ భోజనం వదిలి ప్లాస్టిక్ బెడ్ షీటు పట్టుకు ని రోడ్డు మీదికి కొంపలు మునిగి నట్లు పరుగు తీసారు.
అప్పటికే జనం ప్లాస్టిక్ బెడ్ షీటు రోడ్ల మీద, ఇంటి కప్పల మీద పరిచి, గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. సాగర్ తన కొడుకులతో రోడ్డు మీదికి వచ్చి అదే పనిచేసాడు. ఈలోగా నీటి తుంపర్లలాగా వర్షం కురువగా జనం ఆనందంతో ఆహాకారాలు చేసారు. ఆ వర్షంలో చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ నోళ్లుతెరిచి నాలుకలు తడుపుకోగా, మరి కొందరు ఆడామగా అనే తేడాలేకుండా బట్టలిప్పి మరీ స్నానం చేసారు.
ఈలోగా పోలీసులు వ్యాన్స్ లో వచ్చి మైక్ లో హెచ్చరికలు జారీచేస్తూ, "ట్యాబ్ వాటర్ పట్టినట్లు మీరిలా వర్షం నీళ్లను పట్టుకోవడంవల్లే నీళ్లుభూమిలోకి ఇంకడం లేవు. భూగర్భ జలాలు నిండితేనే అందరికీ నీళ్లు అందుతాయి . మీరు ఇళ్లలోకి వెళ్లక పోతే "సేవ్ వాటర్ ఆక్స్ ప్రకారం మిమ్మల్ని పిట్టలా షూట్ చేయాల్సివుంటుంది" అని గాలిలోకి కాల్పులు జరిపినా జనం ఏ మాత్రం భయపడలేదు.
" నీళ్లు లేక రోజూ చావడం కంటే ఇలా ఒక్క సారి చచ్చింది మంచిది. చంపహే" సాగర్ కోపంగా అనగానే ఓ వంద మంది యువకులు సర్దార్ వల్లభాయ్ పటేల్లా గుండె చూపుతూ ముందుకొచ్చారు. నీటి కరువు తీర్చడానికి జనాన్ని చంపడం ఒక్కటే పరిష్కారమని భావించిన పోలీసులు సాగర్ తో పాటు మరో పాతి క మందిని వీరమరణం పాలు చేసారు.
ఈలోగ వర్షం ఆగి పోవడంతో అక్కడ విషాదచాయలు అలుముకున్నాయి, మనుషులు పోయింనందుకు కాదు. వాన ఆగిపోయినందుకు. జనం రోడ్ల మీద పరిచిన ప్లాస్టిక్ బెడ్ షీట్లలో పడిన నాలుగు, అయిదు మంచి నీటి చుక్కలను ఎంతో మురిపంతో తీసుకుని పరుగులు తీసారు. ఆ నీటి చుక్కలను కూడా దోచుకోడానికీ మాఫియా వాళ్లురావడం పరిపాటి. డ్రక్స్ కి బదులు మంచి నీళ్లుబ్లాక్లో అమ్ముకుంటున్నారు.
సాగర్ కొనవపిరి వదులుతూ సంతోషంతో, "నేను చినిపోయిన విషయం రేషన్ షాప్ లో చెప్పకుండా నా పేరిట వచ్చే లీటర్ వాటర్ తెచ్చుకుని మీరు తృప్తిగా తాగి బతికి చావండ్రా. నా చివరి కోరిక ఏమిటో మీకు తెలుసు. ఎంత డబ్బు ఖర్చయినా సరే, కుండ నిండా నీళ్లు నింపి నా చితి చుట్టూ మూడు సార్లు తిరిగాకే నా చితికి నిప్ప పెట్టండి. ఇప్పటిలాగా చెంచలో నీళ్లునింపి నా చితి చుట్టూ తిరగకండిరా. నా ఆత్మ శాంతించదురా." చేతులు జోడించి వెక్కి వెక్కి ఏడ్చాడు. అయినా కంట్లోంచి కన్నీటి బొట్టు రాలలేదు.
వరదరాజు ఎంతో ప్రేమతో, "ఇల్లీగలని తెలిసినా, మీ చివరికోరిక" తీర్చేందుకు లీటర్ వాటర్ బాటిల్ని బ్యాంక్ లాకర్లో దాచాను నాన్నా ఇల్లు అమ్మయినా మీ ఆత్మకు శాంతి కలిగిస్తాను" ఉద్వేగంతో చెవిలో చెప్పాడు. సాగర్ పెదాల మీద చిరు నవ్వు శాశ్వతంగా ఆగింది.
పెద్ద కర్మ జరిపాక సాగర్ అస్తికలను కలిపేందుకు ఏ సాగర్ కనిపించలేదు. అందుకే అందరిలాగే ఆ అస్తికలను డ్రైనేజీలో కలిపారు. ఆ రోజు వరదరాజు ఉద్యోగానికి వెళ్లలేదు. ఆ రోజే ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసాడు. ఎందుకంటే, ప్రతిపక్షాలు తీసిన సీక్రేట్ కెమెరాలో ముఖ్య మంత్రి మరుగు దొడ్డిలో టిష్యు పేపర్కి బదులు నాలుగు చెంచల నీళ్లు వాడిన పాపానికి.
---
No comments:
Post a Comment