ఎన్నిక(ల)లు - అచ్చంగా తెలుగు

ఎన్నిక(ల)లు

Share This

(జ) వరాలి కధలు - 5

ఎన్నిక(ల)లు

 - గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి (సోమసుధ)


విశాఖపట్నం రైల్వేస్టేషను ఆధునిక భారతంలా హడావిడిగా ఉంది. ప్రయాణాల పేరుతో ఊరు వదిలిపోయేవారు కొందరైతే, ఊరిపోయిన కళ్ళతో వారికి వీడ్కోలు చెప్పేవాళ్ళు కొందరు. మరోప్రక్క ఆ ఊరిజనాలను తమ వాగ్దానాలతో ఊరించి, మెళ్ళో దండలతో, వందిమాగధుల జయధ్వానాలతో తమ ఊరికి తరలిపోయే రాజకీయ రసకందాయం. ఈ సందట్లో సడేమియాగా రైల్వేవారి ప్రకటన మరింత హడావిడి చేస్తోంది. "విశాఖపట్నం నుంచి హైదరాబాదు వెళ్ళే గోదావరి ఎక్స్ ప్రెస్ ఒకటో నంబరు ప్లాట్ ఫాం పై. . . . ఉన్నది." "విశాఖపట్నం సే హైదరాబాద్ జానేవాలీ గోదావరి ఎక్స్ ప్రెస్ ఏక్ నంబర్ ప్లాట్ ఫాం పె . . .ఖడీ హై" "ది గోదావరి ఎక్స్ ప్రెస్ గోయింగ్ ఫ్రం విశాఖపట్నం టు హైదరాబాద్ యీజ్ ఆన్ ప్లాట్ ఫాం నంబర్ వన్" దేశ సూత్రాలు పాటిస్తూ రైల్వేవారి మైక్ మూడు భాషల్లోనూ ఘోషిస్తోంది. " చాయ్. . .కాఫీ". . . . ."కూల్ డ్రింక్. . .వాటర్ బాటిల్". . . . . .ఎవడి గోల వాడిది. స్టేషను ముందు ఆటోలోంచి దిగి, దర్జాగా జేబులోనుంచి పర్స్ బయటకు తీశాను. ఆటోలోనుంచి సామాను దింపటానికి సహకరించని నాపై సణుక్కొంటూనే వరాలు ఆటోని ఖాళీ చేసింది. పర్స్ లోనుంచి తీసిన నోట్లను పదిసార్లు లెక్కపెట్టి ఆటోవాడికిచ్చి, బద్ధకంగా ఒళ్ళు విరుచుకొన్నాను. " కూలీ కావాలా సార్ ? " అంటూ ఒక ఎర్రచొక్కా నా ముందుకొచ్చింది. "ఎంతిస్తావ్? " అడిగిన నన్ను అదోలా చూశాడు వాడు. "" నేనివ్వడమేంటి సార్! సామాను ఎక్కువగా ఉంది కదా ! రైలు దాకా తీసుకు రమ్మంటారేమోనని అడిగాను" కోపాన్ని అణుచుకొన్నాడతను. ""వద్దు బాబూ! అదిగో ఆ ఒకటో నంబరు రైలుకే మేము వెళ్ళాలి. మేము తీసుకెళ్ళగలంలే" వరాలు చెప్పగానే, నన్ను తినేశాలా చూసి గొణుక్కొంటూ వెళ్ళిపోయాడు వాడు. " నువ్వే చెప్పు. పదేళ్ళ క్రితం ఊరెళ్ళాలంటే ఆడాళ్ళు సగం యిల్లు సంచుల్లో సర్దేసి, మా మొఖాన పడేసేవారు. మేము కిక్కురుమనకుండా అవి యిక్కడదాక మోసుకొచ్చి, మరి ఓపికలేక కూలీవాళ్ళను పెట్టేవాళ్ళం. ఇప్పుడు యిండియా మొత్తాన్ని యిందులో సర్దేసి యీడ్చుకుపోయే ట్రాలీబేగ్ లొచ్చాక కూలీ అవసరం ఉందంటావా? " సీరియస్ గా చూసే వరాలితో పరిహసించాను. "ఎంత ట్రాలీబేగ్ లున్నా బ్రిడ్జీ ఎక్కి ఏడోనంబరు ప్లాట్ ఫాం కెళ్ళాలంటే యీ కూలీవాడే కావలసి వస్తాడు. మీకేమైందివ్వాళ? కూలీ అక్కర్లేదని చెప్పక వాడితో పరిహాసమాడుతారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ మనిషితో యిలా పరిహాసాలెందుకు?" చిరాకుపడింది. "ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నా! మీరు చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు? మీకేమైందివ్వాళ?" వరాలు నిలదీసింది. " ఈవారం నేనేం చేసినా చెల్లుతుందని ఉదయాన్నే టి.వి.లో చెప్పారు" "వాళ్ళేదో జీవనం కోసం తమకు తెలిసిన నాలుగు ముక్కలు వారఫలాలుగా చెబుతారు. అంతమాత్రాన అందరికీ ఒకలాగే జరుగుతుందా? వాళ్ళు చెప్పేది సర్వసాధారణ వివరణ మాత్రమే! దానికి మన యోగాన్ని కూడా అన్వయించుకొని చూసుకోవాలి. మీకీ వారం గౌరవంగా వెళ్ళిపోతుందంటే, ఒకాయనకు స్టేజి మీద సన్మానం జరగొచ్చు. మరొకాయన కదిలే సిటీబస్సులో నిలబడలేక అవస్థ పడుతూంటే ఎవడో విద్యార్ధి లేచి అతనికి సీటివ్వొచ్చు. రెండూ గౌరవానికి సంబంధించిన అంశాలే! ఆ గౌరవాల స్థాయి వారి వారి జాతకాలను బట్టి ఉంటుంది. సర్లెండి. మనమిక్కడ జాతకాల గురించి తర్కించుకొంటూంటే అవతల రైలెళ్ళిపోతుంది" వరాలు తొందర చేసింది. " కంగారేం లేదు. అరగంటవరకూ బండి కదలదు. అందులోను మనం వెళ్ళాల్సింది ఎక్కడికో గాదు, ఎదురుగా కనిపించే రైలుకే! పోనీ కౌంటరు దగ్గర వరసలో నిలబడి, టిక్కెట్టు కొని జనరల్ బోగీలో సీటు వెతుక్కోవాలంటే హడావిడి పడాలి. ఆన్ లైన్లో ఆ పనీ అయిపోయింది. ఆఖరి నిమిషంలో రైలెక్కి, టి.సి. భుజంపై చెయ్యేసి " రిజర్వేషన్ " అంటే చాలు, దండం పెట్టి మరీ మనకు సీటు చూపిస్తాడు" అంటూ తలెగరేశాను. " ఆపుతారా? అదాయన ఉద్యోగధర్మం. కబుర్లాపి కదలండి " పెళ్ళాం చెపితే వినాలా? అలా వింటే దద్దమలా చూడదా? ఇప్పటికే సన్నాయినొక్కులతో తీసి పారేస్తోంది. నాలో అహం హెచ్చరించించింది. " నేను న్యూస్ పేపర్ కొనుక్కొస్తా" అన్నాను. " సరే! మీకు తోచినప్పుడు రండి. వచ్చేటప్పుడు మూడు నీళ్ళసీసాలు పట్రండి. రైల్లో రెండు, మూడు రూపాయిలు ఎక్కువ యివ్వాల్సివస్తుంది" అంటూ ఆర్డరేసి రైలు వైపు తన బేగ్ ని యీడ్చుకుపోయింది. వేసిందిరా పిడి. నేను తన మాట వినకూడదని చాలాసార్లు ప్రయత్నించాను. అబ్బే! కుదరటంలేదు. కొప్పులో పూలు సర్దినంత సులువుగా నన్ను సర్దేస్తూంటుంది. ఇప్పుడు తన మాట వినటం నాకిష్టం లేదని గమనించింది. మరోప్రక్క డబ్బు ఖర్చు చేయటంలో పీనాసిగాణ్ణని తనకు తెలుసు. అందుకే నీళ్ళబాటిల్ తెమ్మని ఆర్డరేస్తూ రైల్లో రేటెక్కువ అని నా పీనాసితనంపై ఒక చెణుకు విసిరింది. తన మాట వినకూడదని పేపరు తీసుకొని కొంతదూరం వచ్చాక, " అనవసరంగా ఆరు రూపాయిలెక్కువ ఎందుకు పెట్టాలి?" అనిపించి వెనక్కి వెళ్ళి నీళ్ళసీసాలు తీసుకొన్నాను. వాటిని, పేపర్ని ట్రాలీబేగ్ లో సర్దేసి, మెల్లిగా దాన్ని యీడ్చుకొంటూ రైలు వైపు బయల్దేరాను. " ఊరెళ్తున్నారా? " అంటూ సినిమాల్లో ఎస్.వీ.ఆర్. లా పన్నెండేళ్ళకుర్రాడు, రిజర్వేషను బోగీవైపెళ్ళే నాకు అడ్డం వచ్చాడు. " లేదు. ఊరికే వెళ్తున్నా! " చిరాగ్గా అన్నాను. " అదే సార్! ఊరికేగా వెళ్ళేది? హైదరాబాదా? ఇంత పెద్ద లగేజీతో సీటు లేకుండా వెళ్ళటం కష్టం సార్!" అన్నాడు వాడు. ఇంకా సమయం ఉంది కదా! వాడితో కాసేపు ఆడుకోవాలనిపించింది. "మరెలాగా?" అన్నట్లు సైగ చేశాను. " మీకు కిటికీ దగ్గర మాంచి సదుపాయమైన సీటు చూపిస్తాను" అని హఠాత్తుగా నా చేతిలోని ట్రాలీబేగ్ లాక్కుని జనరల్ బోగీవైపు పరుగుదీశాడు. ఆ బేగ్ కోసం వాడెనకాల పరిగెత్తాను. " ఇదేబాబూ మీ సీటు" అని జనరల్బోగీలో ఒక కిటికీలోంచి సీట్లోనున్న తువ్వాలు తీశాడు. ఆ సీట్లో ఎవడో కూర్చోబోతుంటే వాడిని కేకలేస్తూ మళ్ళీ తువ్వాలు పడేశాడు. " సీటు సరె, బెర్త్ దొరకదా? " కవ్వింపుగా అడిగాను. " అదిగో ! ఆ పైన తుండు పరిచి ఉందిగా! అదే బెర్త్. కాకపోతే కొంచెం రేటెక్కువ. సీటుకి యాభై, బెర్త్ కి డైబ్భై అయిదు. ఏం కావాలో చెప్పండి" "రేటేం తగ్గదా?" అడిగిన నన్ను యస్వీయాయ్లా ఆరుకోణాల్లో తలత్రిప్పి చూశాడు. " ఇవి ఫిక్సెడ్ రేట్లండీ! నేనే కాదు. ఇక్కడందరూ యిదే రేటుకి అమ్ముతారు" " సర్లే! నాకొద్దు" అంటూ బేగ్ తో నా బోగీవైపెళ్ళబోయాను. వాడు నాకు అడ్డం పడి మరోమాట చెప్పండి సార్! " అని వదలకుం డా విసిగించాడు. వాడి వేధింపుకి తిక్కరేగి " వద్దు" అని గట్టిగా అరిచాను. ప్లాట్ ఫాం ఉలిక్కిపడింది. దగ్గరలో ఉన్న టి.సి. నా దగ్గరకొచ్చాడు. "ఏమైంది? " "ఏమండీ! ఇది జనరల్ బోగీయా? రిజర్వేషనా? " టి.సి. ని అడిగాను. " జనరలే! " బదులిచ్చాడు. " మరి వీళ్ళిలా తువ్వాళు పరిచి సీట్లమ్ముతుంటే మీరు పట్టించుకోరా?" " మాదేవుందండీ! ప్రజలే వాళ్ళకి డబ్బులిచ్చి, సీట్లు కొనుక్కొంటూంటే మేమేం చేయగలం?" " మీరు వాళ్ళపై చర్య తీసుకోలేరా?" నా ప్రశ్నకు నీళ్ళు నమిలాడతను. " నేనీ బోగీ టి.సి. ని కాదు" అంటూ అరక్షణంలో మాయమయ్యాడు. రైల్వేవాళ్ళకే పట్టనప్పుడు నేనేం చేయగలను? అనుకొంటూ నా బోగీ వైపు వెళ్ళబోతున్న నాకు నలుగురు మనుషులు అద్దొచ్చారు. " ఏమండీ! మావాడినేదో అన్నారట?" వాళ్ళల్లో నాయకుడిలా ఉన్నవాడడిగాదు. సమయం ఉంది కదాని సరదాగా ఆడుకొంటే యిప్పుడు పీకలమీదకొచ్చింది. వీళ్ళతో గొడవపడకుండా యిక్కడినుంచి తప్పుకోవాలి. లేదంటే రైలు, వరాలు వెళ్ళిపోతారు. నేను వీళ్ళతో రైల్వేపోలీసుల ముందు అనవసర పంచాయితీ. . . . " నేనేం అనలేదయ్యా బాబూ! నాదారిన పోతుంటే మీవాడే నాకు అడ్డం పడ్డాడు. నాకు రిజర్వేషనుందయ్యా అని మొత్తుకున్నా, నన్ను వదలకపోతే కేకలేశాను. అంతే!" అసలు నిజం ఆ కుర్రాడికీ, నాకే తెలుసు. అందుకే బుకాయించేశాను. " అదికాదంకుల్! ఆయన బోగీలు వెతుకుతూ వెళ్తూంటే, సీటు కావాలేమోనని అడిగాను. సీటు కాదు బెర్త్ చూపించమన్నాడు. అంతా అడిగి వెళ్ళిపోతుంటే బేరం కుదరక పోతున్నారని వెంటపడ్డాను. అంతే! ఆయన నలుగుర్నీ పిలిచి గొడవ చేస్తూంటే మీదగ్గరకొచ్చాను." అంటూ కుర్రాడు ఏడుపుమొహం పెట్టాడు. " ఏంటి కధ?" రెట్టించాడా నాయకుడు. అతని వెనక ఉన్న నలుగురూ చేయి చేసుకొనేలా కనిపించారు. ఈ లోపున నాకు వత్తాసుగా కొంతమంది రావటంతో నేను రెచ్చిపోయాను. కొంతసేపు వాదన జరిగింది. " అంటే ఆ కుర్రాడి మాటే గానీ నా మాట మీద నమ్మకం లేదా?" రెట్టిస్తున్న నా తరఫున మాట్లాడ్డానికి జనం లోంచి ఒక పెద్దాయన ముందుకొచ్చాడు. " మాస్టారూ! మీ టిక్కెట్టిలా యివ్వండి" అడిగిన పెద్దాయనకి నా జేబులోంచి టిక్కెట్ ప్రింటవుట్ చూపించాను. అది వాళ్ళకి చూపించి వాళ్ళపై కేకలేశాడతను. " నిజాయితీ గల యీ పెద్దమనిషిని ఆ కుర్రాడి మాటలట్టుకొని నిలదీస్తారా? ఈ టిక్కెట్ చూస్తే మీకే తెలుస్తుంది తప్పెవరిదో? " అని నాలుగు దులిపేశాడు. ఆయన ధర్మమా అని వాళ్ళనుంచి బయటపడి నా బోగీవైపెళ్తున్నాను. " సారూ! మీకు రిజర్వేషనుందని మాలాంటి జనరలోళ్ళతో ఆడుకొంటానంటే కుదరదు. రోజులు మారాయి. గుర్తుంచుకోండి" హెచ్చరించాడా నాయకుడు. వాడేమన్నా, ఆ సమయంలో వెనక్కి తిరగటం నా ఆరోగ్యానికి మంచిదికాదు. " మనుషుల్ని చూసి మాట్లాడొద్దురా! అతను ఏ రైల్వేస్క్వాడ్ వాడో అయ్యుంటే మనకెంత యిబ్బందయ్యేది?" అంటూ కుర్రాణ్ణీ కేకలేశాడు. ఆ కుర్రాడి మీద చర్య తీసుకోలేదేమని టి.సి.పై అరిచిన నేనే నలుగురు మనుషులు రాగానే ప్లేటు ఫిరాయించేశాను. ఇలాంటి ప్రజలుండబట్టే న్ ఆయకులు తమ స్వార్ధం కోసం దేశాన్నే అమ్మేస్తున్నారు. ఈ సంఘాన్ని మార్చలేమా? ఆలోచనలతో ట్రాలీబేగ్ యీడ్చుకుపోతున్న నేను వరాలి కేకతో తేరుకొన్నాను. " ఎక్కడికలా యింజను వైపెళ్ళిపోతున్నారు? మీరింకా రాలేదని రైలు దిగి చూడటం మంచిదైంది. రండి " అంటూ నన్ను మాసీటు వద్దకు తీసుకెళ్ళి, నా బేగ్ సీటుక్రింద సర్దింది. " పేపరు కొని రావటానికి యింత సేపైందేమిటి?" అడిగిన వరాలికి కుర్రాడి ప్రహాసనమంతా చెప్పాను. ఒక్కసారి నన్ను నిలువెల్లా తేరిపార చూసింది. " ఉదయాన్నే వారఫలాల్లో యీ వారం మీరేం చేసినా చెల్లుతుందనగానే ఊరంతా తగవు పెట్టుకొంటారా? మీకు రిజర్వేషనుందని ఆ జనరల్ కేటగిరీతో తగవు పెట్టుకొంటారా?" వరాలి దాడి తప్పించుకోవటానికి ట్రాలీబేగ్ లోని పేపరు తీసి తలదాచుకొన్నాను. నానుంచి స్పందనలేక వరాలు కిటికీలోంచి బయటకు చూడసాగింది. ఎన్నికల సమయమేమో! పేపరునిండా వాగ్దానాలే! అయిదేళ్ళకోసారి వాళ్ళిలా హామీలివ్వటం, ఆ రోజుల్లో ప్రజలు కొన్నాళ్ళు కలలు కనటం, ఆపై హామీలు నెరవేర్చలేదని ప్రజలు నాయకుల్ని తిట్టుకోవటం, ఆ పైన అయిదేళ్ళవరకు ఎవడి గోల వాడిదన్నట్లు బ్రతకటం. . .ఇదీ 1970 దాటాక యీ దేశంలో ఆనవాయితీగా జరుగుతున్న విషయాలు. " సాగుకు, త్రాగటానికి నదుల్లో నీళ్ళు చాలకపోతే, సముద్రపునీటిని మంచినీటిగా మార్చి దేశంలో నీళ్ళ కరువు తీరుస్తాం" అన్న మాటలు వినిపించి చదువుతున్న పేపరు క్రిందకి దించి చూశాను. అరవై ఏళ్ళ ఆసామి ముక్కున జారిపోతున్న కళ్ళజోడు పైకెగదోస్తూ, నా పేపరులో అటువైపున్న వార్త చదువుతున్నాడు. అతని బాధ గమనించి నా పేపరులోని రెండు పేజీలతనికి యిచ్చాను. పావుగంట తరువాత మా పేపరు పారాయణ పూర్తయి, పేపరు ట్రాలీ బేగ్ లోకి వెళ్ళిపోయింది. మౌనంగా కిటికీలోంచి బయటకు చూస్తున్న నాకు ఆధునిక భారతంలా రైలు ముందుకెళ్తోందా? లేక రైలు చేస్తున్న శబ్దకాలుష్యానికి ప్రకృతి వెనక్కి పారిపోతోందా? అర్ధం కాలేదు. నాకొచ్చిన యీ ఆలోచనకి నాలోనే నవుకొన్నాను. " ఆక్సిజెనిచ్చే చెట్లకే జాగా లేకుండా జనాలు యిళ్ళు కట్టేస్తూంటే, శుద్ధి చేసిన సముద్రం నీళ్ళను దాచటానికి దేశంలో జాగా ఎక్కడుంటుందండీ?" అడుగుతున్న ఆయన్ని అదోలా చూశాను. " ఊరుకోండి మాష్టారూ! వాళ్ళేదో ఓట్లు దండుకోవటానికి అలా చెబుతారు. ఎన్నికల సమయం కద! దేశంలో 1970 తరువాత శుష్కవాగ్దానాలు చేయటం వాళ్ళ కలవాటు. కొన్నాళ్ళు ఆ వాగ్దానాలపై కలగని ఆపై మర్చిపోవటం మనకలవాటు అయిపోయాయి. అయినా బంగాళాఖాతాన్ని మనం బక్కెట్లతో తోడిపోసేసుకుంటే, మనవాళ్ళే అయిన అండమానువాళ్ళు ఊరుకొంటారా? అవతల ప్రక్కనున్న మయన్మారు, మలేషియా ప్రజలు ఊరుకొంటారా? ఈ సముద్రాలు అంతర్జాతీయ సరిహద్దులు. అవి అన్ని దేశాలకు ఉమ్మడి ఆస్తులు. చూస్తూ సంతోషించటమే తప్ప తాకటానికి ఎవరికీ హక్కులేదు" రాజకీయాలు, సినిమాలు, ప్రక్కింటి ఆడవాళ్ళ వ్యక్తిగత విషయాలు - మత్తుపదార్ధాల కన్న ఎక్కువ కిక్కిచ్చే విషయాలు. వాటి జోలికెడితే నిద్రను కూడా మరిచిపోతారు. దేశ రాజకీయాలను సమీక్షిస్తున్న మాయిద్దరికీ సమయమే తెలీటం లేదు. మధ్యలో వరాలు నాకు తినటానికి యింత పడేసి, తనూ పని కానిచ్చేసి నిద్రపోవటానికి లేచింది. బోగీలో అంతా ప్రక్కలు సర్దుకోవటం చూసి, మా రాజకీయ చర్చకు మంగళం పాడి మేము కూడా నిద్రకుపక్రమించాం.
@ @ @ @
సికింద్రాబాద్ స్టేషను నుంచి బయటకు రాగానే అపరిచితవ్యక్తి నా చేతిలోని ట్రాలీబేగ్ లాక్కున్నాడు. దూకుడుగా అతన్ని పట్టుకోబోతున్న నాకు దూరంగా ఉన్న వ్యక్తిని చూపించాడు. ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్లుందే! వాడు నా ప్రాణమిత్రుడు ఏవర్మూర్తిలాగున్నాడే! . . .ఉన్నాడే కాదు వాడే! నన్ను చూడగానే మూర్తి పరుగులాంటి నడకతో వచ్చి చుట్టేశాడు. " ఏంట్రా అలా చూస్తున్నావ్? గుర్తుపట్టావా? " "నువ్వెక్కడో బాంకులో చేస్తున్నావని విన్నాను. హఠాత్తుగా యిక్కడ దిగడ్డావేంటి? " ఆత్మీయంగా వాడి భుజం నొక్కాను. " విషయం చెప్తాగాని. . .చెల్లాయి రాలేదా?" వాడడిగాకనే వరాలు గుర్తొచ్చింది. " నాతోనే ఉండాలిరా" అంటూ చుట్టూ చూశాను. తన బేగ్ తో ముందుకెళ్ళిపోయి నాకోసం వెతుక్కొంటున్న వరాలు కనిపించగానే, ఆమెను పిలిచాను. మా యిద్దరినీ చూడగానే వెనక్కి వచ్చిందామె. " ఏమ్మా! బాగున్నావా?" అడిగిన మూర్తికి చిరునవ్వుతోనే బదులిచ్చిందామె. " ఇంతకీ నన్ను ఉన్నపాటున ఎందుకు రమ్మన్నావో చెప్పలేదు" అడిగిన నావైపు అదోలా చూశాడు. " నీకన్నింటికీ తొందరేరా? పాపం చెల్లాయి నీతో ఎలా వేగుతోందో? . . . .రోడ్డు మీద చెప్పే విషయం కాదు గానీయింటికెళ్ళాక చెబుతాను. పదమ్మా! యాదగిరీ! అమ్మ దగ్గర బేగ్ తీసుకో" అంటూ మా దంపతులిద్దరినీ కారు దగ్గరకు తీసుకెళ్ళాడు. ఇల్లు చేరాక ఆడవాళ్ళిద్దరూ ఒక్కటైపోయి వంటింట్లో దూరారు. మూర్తి నన్ను తన గదిలో కూర్చోబెట్టి విషయం చెప్పాడు. వాడు చెప్పింది విన్న నా ఆనందానికి అవధులే లేవు. ఈ వారం నాకంతా కలిసివస్తుందన్న వారఫలాలు చెప్పినాయనకు మనసులోనే నమస్సులు పడేశాను. " అదిరా సంగతీ! మన కొత్త ముఖ్యంత్రిగారు తన తోటి ఎమ్మెల్యేలకు మిగిలిన మంత్రిపదవులిచ్చారు. కానీ కొత్తగా ఏర్పడిన యీ రాష్ట్రంలో విద్యాశాఖకు మాత్రం ఒక సమర్ధుడైన సాహితీవేత్తను విద్యాశాఖామంత్రిని చేయాలని ఆయన కోరిక. ఈ రాష్ట్రంలో విద్యావంతుల శాతం పెరిగి మనం దేశానికే తలమానికం కావాలని ఆయన కోరిక. ఆనాడు కొండవీటి రాజు మహాకవి శ్రీనాధుణ్ణి విద్యాశాఖామంత్రిని చేయలేదా? అలాగన్నమాట! నేను సి.యం. పేషీలో ముఖ్య సలహాదారుణ్ణి. ఆయనకి నేనెంత చెబితే అంత! ఆయన తన మనసులో మాట చెప్పగానే నీ పేరు చెప్పాను. పిలిపించమనగానే నీకు ఉత్తరం వ్రాశాను" మూర్తి మాటలకు నా మనసు ఉద్వేగంతో ఊగిపోయింది. భ్రష్టుపట్టిపోతున్న మన రాష్ట్ర విద్యావ్యవస్థను బాగు చేసే అవకాశం నాకొచ్చింది. అణగారిన వర్గాల్లోని బాలబాలికలను విద్యావంతులను చేసే మంచి ప్రణాళికలు తయారుచేస్తాను. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నూరుశాతం అక్షరాస్యరాష్ట్రంగా మారుస్తాను. కానీ. . . " ఎమ్మెల్యేలను లేదంటే ఎమ్మెల్సీలను మంత్రులను చేస్తారు. ఇలా బయటవాళ్ళను కూడా మంత్రులను చేయవచ్చా?" నా సందేహానికి నవ్వాడు వాడు. " అది సి.యం..గారి యిష్టం. చట్టప్రకారం ఎన్నిక కాబడ్డ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకొంటారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో డిల్లీ పెద్దలు చెప్పిన వాళ్ళే సి.యం.లవుతున్నారు. ఆఖరికి సనాతన సంప్రదాయాలతో నడిచే గుళ్ళపై పెత్తనం చేసే న్యాయవ్యవస్థ కూడా చట్టసభలలో జరిగే ఏ పనినీ వేలెత్తి చూపించలేదు. ఇది ప్రజాస్వామ్యదేశం. అందుచేత నువ్వేం భయపడవద్దు. కాకపోతే ఆరునెలల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి. అది జరిగితే అయిదేళ్ళవరకూ నీకు తిరుగేలేదు. అదంతా పెద్దాయన చూసుకొంటాడులే! " మూర్తిగాడి భరోసాతో ముందుకెళ్ళటానికే నిశ్చయించుకొన్నాను. పదిహేను రోజుల్లో నా నివాసం విశాఖనుంచి విద్యాశాఖమంత్రి క్వార్టర్స్ కి మారిపోయింది. ఇది జరిగిన నెలరోజులకి ఉదయాన్నే మూర్తి మా యింటికొచ్చాడు. " వచ్చే ఆదివారం రవీంద్రభారతిలో లిల్లీఫ్లవర్స్ కాలేజీ యాజమాన్యం నీకు సన్మానం చేస్తామంటున్నార్రా!" మూర్తి మాటలకు నా మనసు ఉప్పొంగింది. జన్మలో రవీంద్రభారతి చూడగలనా? అనుకొన్న నాకు అక్కడే సన్మానమంటే మనసు పొంగదా? " ఎందుకన్నయ్యా యీ సన్మానాలు అవీను? ఏదో అర్ధరాత్రి టేబిల్ లాంపు వెలుతురులో నాలుగు కధలు వ్రాసుకొనేవారు. ఇప్పుడు ఆ విద్యాశాఖ ఫైల్స్ చూడలేక తల్లక్రిందులైపోతున్నారు" వరాలు నా కష్టం చెప్పింది. " ఫైళ్ళను యింటికి తెప్పించుకోవలసిన అవసరమేముంది? పెట్టిన వెంటనే సంతకాలు పెట్టాల్సినదేముంది? అయినప్పుడు క్లియర్ అవుతాయి. ఇంతకు ముందు వాళ్ళెలా చేశారో మనం అలా నెట్టుకుపోవటమే! అయినా పనికి, సన్మానాలకి సంబంధమేముంది?" " ఇలా సన్మానాలకు ప్రలోభపడితే ఆ తరువాత ఆ కాలేజీ వాళ్ళకు కాదనకుండా సాయం చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖలో ఉద్యోగులు ఏమైనా కానుకలు అంగీకరిస్తే లంచం అని జైల్లో పెడతారు. మరి మంత్రులకు జరిగే సన్మానాలు కూడా లంచం క్రిందకు రావా? వరాలి ప్రశ్నకు కొంతసేపు మూర్తి మాట్లాడలేదు. అయినా వాడు అమాయకుడు కాదని నాకు తెలుసు. " చూడమ్మా! అధికారులను, పాలకులను ఒకే గాటిని కట్టేస్తానంటే ఎలా? చట్టసభలవారికి సమయ పరిమితి లేకుండా జీతాలు అయిదారు రెట్లు పెంచాలంటే ఒక్క మూజువాణీ వోటుతో అయిదు నిమిషాల్లో అయిపోతుంది. అదే ప్రభుత్వోద్యోగుల జీతాలు పదేళ్ళకోసారి పెంచాలంటే కమీషనంటూ ఒక రెండేళ్ళు నడిపిస్తారు. ఈ మధ్యలో వీళ్ళకి జీతాలు పెంచొచ్చా అని దేశంలోని అన్ని వర్గాలవారినీ అడుగుతారు. ప్రజల పన్నులతో వచ్చిన దాన్ని ప్రభుత్వోద్యోగులకు యివ్వటానికి లేదని దేశమంతా ఘోష పెడుతుంది. ప్రజల్లో ఎక్కువమంది కట్టేది పరోక్ష పన్నులు మాత్రమే! ఆదాయపన్ను కడుతున్నారా? ప్రభుత్వోద్యోగుల్లో ఎనభైశాతం మంది ఆదాయపన్ను, వాళ్ళ ఆదాయంలో యిరవై, ముప్ఫై శాతం కడుతున్నారు. ఇప్పుడు జీతాలు పెంచినా తిరిగి అందులో ఆదాయపన్నుగా ప్రభుత్వానికి కొంత సొమ్ము వచ్చేస్తుంది. వాడు మరో పని చేయకూడదు. మన పాలకులు వ్యాపారం చేసినా తప్పులేదు. ప్రభుత్వోద్యోగి ఊరు వదిలి వెళ్ళాలంటే పై అధికారి అనుమతి కావాలి. చట్టసభల్లో ఎక్కడికెళ్ళారో కూడా తెలియకుండా విదేశాలకెళ్ళినా అడగకూడదు. ఎక్కడో ఆదాయవనరులున్న శాఖల్లోనే లంచగొండితనానికి అవకాశముంది తప్ప ప్రతి ప్రభుత్వోద్యోగీ లంచగొండి కాదు. అదీ యీ పాలకులు వీళ్ళని ముందు చూపెట్టి వెనకాల వాళ్ళు దేశాన్ని దోచేస్తారు. చెప్పాలంటే యింకా చాలా ఉన్నాయి గానీ ప్రభుత్వోద్యోగికి ఉన్న నిబంధనలేవి పాలకుడికి లేవమ్మా! వాణ్ణి అడిగే హక్కు ఎవరికీ లేదు. ఏమైనా ఉంటే పుస్తకాల్లోనే! ఇంక సన్మానం చేసిన ప్రతివాడికి సాయం చేయాలని లేదు. ఈ లిల్లీఫ్లవర్స్ ఎవరు? ప్రజల్లో భాగమే కద! పాలకులు యీ ప్రజలకు దూరంగా ఉంటామంటే ఎలా?" వాడి జవాబు నాకు సవ్యమేననిపించింది. అందుకే నా అర్ధాంగి, మనసుల నోరు నొక్కేసి నాలుగు నెలలు సన్మానాల వెంటపడ్డాను. అయాచితంగా వచ్చిన అధికారం, అప్పనంగా వచ్చిన కానుకలు నాలో అధికార దాహాన్ని పెంచేశాయి. ఈ సన్మానాల గోలలో నా తొలిరోజు విద్యా ప్రణాళికలన్నీ అటకెక్కేశాయి. సి.యం. గారి ఆదేశంతో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయగానే నాకు ఒళ్ళు వేడెక్కింది. రోజులు గడిచే కొద్దీ నాకు అధికారాన్ని వదులుకోకూడదనే ఆరాటం పెరిగింది. మంత్రిగారి భార్యగా మహిళామండళ్ళకు అధ్యక్షురాలిగా ఎన్నికయిన వరాలు నాకు క్రమేపీ శత్రువుగా మారింది. విద్యాశాఖామంత్రిగా నేను చేస్తున్న అరాచకాలను ఆమె ప్రజల్లో ఎండకడుతోంది. మా మధ్య గొడవలు చూసి అండగా ఉంటానన్న మూర్తి మొహం చాటేశాడు. నామినేషను ఘట్టం ముగిసి ప్రచారాల పర్వం మొదలైంది. మీడియా నాకు శత్రువైన వరాలి వెంట పడ్డారు. సన్మానాలను శాశ్వతం చేసుకోవటానికి నాలో ఆరాటం మొదలైంది. సి.యం. నుంచి ఒకటి, రెండు వార్నింగు, చీవాట్లు కూడా వచ్చాయి. రాత్రిళ్ళు నిద్రపట్టటం లేదు. ఎన్నికల ప్రచారానికి గాను మానిఫెస్టో తయారుచేశాను. పాత పాలకుల ప్రణాళికలు తిరగేశాను. "ఒకప్పుడు ప్రతి సంవత్సరం పరీక్షలు, ఉత్తీర్ణత అంటూ ఉండేది. అక్షరాస్యతను పెంచటానికి అన్ని పరీక్షలు రద్దుచేసి, ఏడు, పదవ తరగతులకు మాత్రమే పరీక్షలన్నారు. రాష్ట్రంలో ప్రయివేటు కాలేజీలను అనుమతించి నూటికి తొంభైతొమ్మిది శాతం వరకూ ఉదారంగా మార్కులిచ్చేస్తున్నారు. తరువాత యీ మార్కుల స్థానంలో గ్రేడులను పెట్టారు. అయినా సరే పిల్లల మార్కుల, గ్రేడులను ప్రక్కన పెట్టి ఎంసెట్ అని, గేట్ అని రకరకాల పేర్లతో మళ్ళీ పరీక్షలు వ్రాయిస్తున్నారు. అసలు విద్యార్ధులు యిన్నిసార్లు పరీక్షలెందుకు వ్రాయాలి? విద్యార్ధులు విజ్ఞానవంతులు కావాలంటే కాలేజీలు బాగుండాలి. ..కాలేజీలు బాగా ఉండాలి. అవి బాగుండాలంటే వాటి సామర్ధ్యాన్ని పరీక్షించాలి తప్ప విద్యార్ధులను కాదు. వాళ్ళెలాగు ప్రవేశ పరీక్షలు వ్రాసి ప్రయివేటు కాలేజీల్లో జేరుతున్నారు. గనుక ఆ కాలేజీల్లో లెక్చరర్లకి ప్రతీ ఏడాది పరీక్షలు పెట్టాలి. వాళ్ళల్లో సత్తా ఉంటేనే కదా విద్యార్ధులకు నేర్పేది. అందుకే ప్రతీ ఏడు కాలేజీ లెక్చరర్లకు పరీక్షలు పెట్టి ఉత్తీర్ణత శాతం అధికమున్న కాలేజీలకు మరిన్ని కాలేజీ శాఖలు పెంచుకొనే అవకాశం యివ్వాలి. ఉత్తీర్ణత బాగులేని కాలేజీలను మూసెయ్యాలి. ఇలా చేస్తే తనకు ప్రయివేటు కాలేజీల యాజమాన్యం నుండి, విద్యార్ధుల తల్లిదండ్రులనుంచి మంచి సపోర్ట్ దొరికి ఎన్నికలో సులభంగా నెగ్గవచ్చు." నా ఎన్నికల ప్రణాళికకు ప్రజలనుంచి, పాలకుల నుంచి మంచి మద్దతు లభించింది. ప్రచారం ముమ్మరంగా సాగిపోతోంటే , ఒకరోజు వరాలు యింట్లో నాతో తగవు పడింది. "మీ ఎన్నికల ప్రణాళికలో పెట్టిందేమిటి? విద్యార్ధుల బదులు ఉపాధ్యాయులే పరీక్ష వ్రాయాలా? వారి ఉత్తీర్ణతను బట్టి ఆ కాలేజీలకు గ్రేడులను నిర్ణయించి , వాళ్ళు మరిన్ని కాలేజీలు పెంచుకొనే అవకాశమిస్తారా? కాలేజీల సంఖ్య పెంచినంత మాత్రాన రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగినట్లు కాదండీ! విద్యార్ధుల విషయ పరిజ్ఞానం పెంచేలా ప్రణాళికలు ఉండాలి గానీ ఎవరో కొంతమంది తమ విద్యావ్యాపారాన్ని పెంచుకొనేలా కాదు. దీనివల్ల విద్యార్ధులకు ఒరిగేదేమిటి? ఏ సర్టిఫికెట్ల కొలమానం లేని మన విద్యార్ధులకు విదేశాల్లో గుర్తింపు ఉంటుందా?" వరాలు ఆవేశంతో వణికి పోతోంది. " విద్యార్ధులే కాదు. . .ఉపాధ్యాయులు తమ విజ్ఞానాన్ని అప్ డేట్ చేసుకొందుకే యీ పరీక్షలు. లేదంటే పాడిందే పాడరా అన్నట్లుంటుంది" బదులిచ్చాను. " దానికి వేరే ప్రణాళిక పెట్టుకోండి. అంతేగానీ పిల్లలకు పరీక్షలు లేకుండా చేస్తానంటే ఎలా? మీరు నాకేం చెప్పినా మీకు సన్మానం చేసిన కొన్ని బడా కాలేజీల వ్యాపారం పెంచటానికే యీ ప్రణాళిక? ఇలా చేస్తే విద్యారంగం కొంతమంది బడావ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదముంది" ' ఎన్నికల్లో నెగ్గటమే నాకు ముఖ్యం. అందుకోసం నేనేమన్నా చేస్తాను " కోపంగా అన్నాను. " బాగుందండీ! ఒకప్పుడేమన్నారు? ఈ దేశం కొందరు స్వార్ధపరుల చేతిలో చిక్కి నాశనమైపోతోంది అన్నారు, ఇప్పుడు చక్కదిద్దే అవకాశం మీ చేతికొచ్చింది. ఈ సీట్ల అమ్మకాన్ని ఆపలేవా అని రైల్వే టి.సి.ని నిలదీసిన మీరే పాలకుడు కాగానే దేశాన్ని ఉద్ధరించే పనులు చేయక, మీకు సన్మానం చేసిన కాలీజీ యాజమాన్యాలు తమ బ్రాంచీలు పెంచుకొనే విధంగా ప్రణాళికలు వేయటం, ఎన్నికల్లో నెగ్గటానికి ఏమన్నా చేస్తాననడం. . . .బాగుందండీ! అసలు నాయకుడంటే ఎవరు? తన దేశంలో తొంభైశాతం ప్రజలు కట్టడానికి బట్టలు లేకుండా ఉన్నారని, తన వంటిపై చొక్కా తీసేసి, ఎముకలు కొరికే చలిదినాల్లో కూడా అర్ధనగ్నంగా జీవితాంతం తిరిగాడే ఆయనండీ నాయకుడంటే! తన కారణంగా దేశానికి స్వాతంత్రం వస్తున్న సమయంలో అందరితో పాటు ముస్తాబై, డిల్లీలో హడావిడి చేయక, మతఘర్షణల్లో అల్లాడిపోతున్న కలకత్తా ప్రజల ప్రక్కన కంటిమీద నిద్ర లేకుండా వాళ్ళను ఓదార్చాడే అతడండీ నాయకుడంటే! బీహార్ లో ఒక గాంగ్ మేన్ పొరపాటు వల్ల జరిగిన ఘోరరైలుప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా యిచ్చాడే! ఆయనండీ నాయకుడంటే! తన రాజీనామాను ప్రధానమంత్రి తిరస్కరించినా పార్లమెంటునుంచి బయటకొచ్చి యింటిదగ్గర విడిచిపెడతానన్న కారు డ్రైవరుతో "నేనిప్పుడు మంత్రిని కాదు, సాధారణ పౌరుణ్ణని" కాలి నడకన యింటికెళ్ళాడే ఆయనండీ నాయకుడంటే! " ఆమె మాటలకు నాలో ఆవేశం కట్టలు తెంచుకొంది. " ఆపు. ఎన్నికల్లో నెగ్గటానికి నేనేమన్నా చేస్తానే! నా పదవికి అడ్డుపడే నిన్ను విడిచిపెట్టేది లేదు" అని ఆమె జూట్టు పట్టుకొని వంగదీసి పిడికిలితో ఆమె వీపుపై బలంగా గుద్దాను. ఆ దెబ్బకు తట్టుకోలేక వరాలు అరిచిన కేకతో త్రుళ్ళిపడ్డాను. నేను కళ్ళు తెరిచేసరికి రైల్లో సీటుపై కూర్చుని ఉన్నాను. నాముందు వరాలు నేలపై పడి ఉంది. ఆమె జుట్టు నా ఎడమచేతి గుప్పిట్లో ఉంది. నిద్రనుంచి తేరుకొన్న నాకు నా పిడికిలి దెబ్బకు విలవిలలాడుతున్న వరాలు కనిపించింది. " ఏమైంది?" " ఏమో! నాకేం తెలుసు? నిద్దట్లో అరుస్తూంటే దగ్గరకొచ్చి భుజం కుదిపి లేపబోయాను. మీరు వెంటనే లేచి కూర్చొని " ఆపు. ఎన్నికల్లో నెగ్గటానికి నేనేమన్నా చేస్తానే! నా పదవికి అడ్డుపడే నిన్ను విడిచిపెట్టేది లేదు" అని నాజుట్టు పట్టి గుంజేస్తూ వీపుమీద పిడికిలితో బాదేశారు." " సారీరా! కావాలని. . . ." నా మాట పూర్తి కాలేదు. " మీరేందుకు చేసినా జరగాల్సింది జరిగిపోయింది కదా! మర్చిపోండి. నిద్దట్లో మీరు మంత్రయి ఉంటారు. పదవి నిలుపుకోవటానికి మీరు ఎన్నికలకెళ్ళి ఏదో అపసవ్యంగా మాట్లాడుతుంటే నేను అడ్డుపడి ఉంటాను. కలలో నాపై కేకలేస్తూ వీపు మీద మాత్రం నిజంగానే విమానం మోత మోగించేశారు. కావాలని నన్ను చావగొట్టినా మీరే నా దేవుడనుకొనే భారతీయ మహిళను. ఎప్పుడైనా నాకు నచ్చకపోతే సరదాగా నాలుగు చెణుకులేస్తాను, మీకు ఆకలేస్తే పుణుకులేస్తాను అంతేగానీ!. . . . దేశమంతా ఎన్నికల వేడిలో ఉంది కదా! అందుకే కవిగా మీరూ ఒక కలగన్నారు. అంతేగా !చుట్టుప్రక్కల జనాలు దిగిపోయారు గనుక పరువు దక్కింది." అని తన సీటు వైపు వెళ్ళబోతున్న ఆమెను వెనక్కి లాగాను. " నాకు దెబ్బ తగిలిందనే కదా బాధపడుతున్నారు! దానికి మందు యింటికెళ్ళాక యిద్దురు గానీ! మీ సంగతి నాకు తెలీదా? ఇది రైలు" అని నా తల నిమిరి తన సీటు దగ్గరకెళ్ళి పడుకొంది. తన శరీరంపై జరిగిన దాడిని కూడా ఎంత తేలిగ్గా తీసుకొంది. అదే భారతీయ మహిళ గొప్పదనం! ఎందుకిలా జరిగింది? ఆ కుర్రాడి సీటు వ్యాపారం మనసులో ముద్రపడింది. వెంటనే జరిగిన రాజకీయచర్చ. ఏదైనా కారణం కావచ్చు. " ఏమండోయి! రేపు మనం హైదరాబాదెళ్ళేది మా పిన్ని కూతురి పెళ్ళికి. అంతే గానీ ఏ మంత్రిగానో చేరటానికి కాదు. గుర్తుంచుకోండి" అంటూ అటు తిరిగి పడుకొంది. రైలు పరిస్థితి చేద్దామని విండో షట్టర్స్ ఎత్తి చూశాను. --లోకమింకా చీకట్లోనే ఉంది. రైలు ముందుకే పరిగెడుతోంది--
@ @ @ @

No comments:

Post a Comment

Pages